ముడుచుకున్న గొంగళిపురుగులా చలిని ధిక్కరిస్తుంది
కురుస్తున్న మంచువానలో మల్లెతీగ వణుకుతూ పాకుతోంది
అదేపనిగా కదుపుతున్న నిద్ర
కనుపాపలపై కమనీయ ద్రుశ్య కావ్యమయింది
కల కలవరిస్తూ కట్లపాములా వొంకర్లు తిరుగుతోంది
పగలు రాత్రి తెలియని వీధిదీపాల వెలుతురు
వీధులనిండా పాదరసం పరిచింది
జీవవైవిధ్యానికి కంటి మీద కునుకులేకుండా చేసింది
మునగదీసుకుని కారు కింద కునుకుతున్న కుక్కొకటి
విరామం లేకుండా మూల్లుతూనే వుంది
నుసిలా రాలుతున్న చీకటిలో
చూపుడు వేలు ముంచి
కంటిరెప్పలకు రాసుకున్న కాటుక కన్నులు
బెదిరి బెదిరి ఎదిరి ఎదిరిచూస్తున్నాయి
ఉల్కల్లా రాలుతున్న మెరుపుల చుక్కలను
దోసిడినిండా వొడిసిపట్టి తలలో తురుముకుంటున్న
తనువొకటి పడకమంచంపై పలవరిస్తుంది
హార్మోనియం మెట్లమీంచి జారిపడ్డ సరిగమలు
ఆకాశానికి వేలాడుతున్న విహాంగం
విసిరి విసిరికొడ్తున్న గాలివాన
గమనం తప్పిన గతితార్కిక సూత్రం
సూదిమొన మీద నిలిచిన వొప్పందాలు
వొరిగిపోయి కరిగిపోతున్న ఆలోచనలు
మెదడు నిచ్చెనెక్కలేక చతికిలాపడ్డాయి
గాలిలో ఆకులు రాలినట్లు
ఊహలో స్మ్రుతులు సాగిపోతున్నాయి
సరిగమలను పేనిన సప్తస్వరాలు
గమ్యం చేరుకున్న విహాంగం
కురిసి వెలసిన వాన
గతితార్కిక సూత్రానికి పేనిన జీవబంధం
కనురెప్పలను సూదుల్లా పొడుస్తుంటే
పగిలిన గాజుముక్కలవలె
స్వప్నాలు చెదిరిపోతున్నాయి
చలనం కలిగిన చేతివేళ్ల స్పర్శ
ఆత్మీయతతో అలాయి బలాయి తీసుకుంది
అనుభూతికి అందని అంతరంగం ఆలింగనం చేసుకుంది
గడియారం కొట్టిన అర్థరాత్రి గంటలకు
గస్తీ తిరుగుతున్న విజిల్ శబ్దంతో
విచ్చుకున్న కనురెప్పలు తడుముతున్నాయి
పెరటితోటలో పూచిన మందారం
అరచేతులను నిమురుతూ
అద్దంలో కొండను చూపించింది
నిఖార్సయిన నిండుదనంతో చెంపలను నిమిరి
పెదవులపై ఎర్రటి ముద్దులను పూయించింది
నుదుటిపై సూర్యుడ్ని నిలిపి
చూపు ముందు వెలుగుల రహదారిని పరిచింది
ముడుచుకున్న ఆత్మలు విచ్చుకుని
వెలుగు కిరణాలను వెతికి వెతికి పట్టుకున్నాయి
*
పెయింటింగ్: సత్యా బిరుదరాజు
Add comment