ఆ రెక్కలూడిన రాత్రినీ
ఆ నల్ల రంగు పక్షినీ యింకా యెన్ని రోజులు ప్రేమించాలో
ప్రతిరోజూ తను రావడం
వుదయాన్నే వెళ్ళిపోవడం
యీ గతుకుల సమయాల్లో యింతకన్నా ఏం కావాలి
కంచంలో పోసుకున్న జావ నోట్లోకి తను అందించడం సిగ్గేం కాదు
సముద్రానికి నిశ్శబ్దానందించిన శూన్యంకంటే
గీరగా సాగుతున్న గీతమొకటి మా మధ్యన తలుపు తీసుకొస్తూ
వుందా కన్నీళ్ళకు అర్థం
యిన్నాళ్ళుగా వ్యర్థం…
ఆడే కూకోకపోతే ఆ మొక్కలేసిన నేల సదున్చేయొచ్చుగా
హా…
వో వర్షానంతర రోజు వేసిన కనకాంబరం తనకోసం
యెర్రగా మెరుస్తున్న నక్షత్రం
వెలసిన యీ చేతుల్లో వాడని తాపత్రయం యిప్పుడు
పొడిపొడిగా పేర్వాలని ఆ సమాధి దగ్గర
అలా వెలుతురు కాసేపు మసలి పోయాక
వొక నీడను వెతుక్కుంటాము నువ్వు నేను
తడిబట్టలను ఆరేస్తున్న నీ చేతులవంక
నేనలా చూడ్డం యిది నూటముప్పైయొకటోసారనుకుంటా
నువ్వు కళ్ళను ఆకాశానికెగరేయడం
నేను నా చూపులను భూమిలోకి పారబోయడం యెన్నిసార్లు జరగలేదూ
వొక్క మాట సగంసగంగా
వొక్కో భావం భృకుటి నిండుగా మరలించడం
గొప్ప అనుభవం
యిప్పుడీ తపస్మండలిలో యధేచ్ఛగా కప్పుకున్న నీ కన్రెప్పలు యేమని మాట్లాడగలవు
అసమాపక క్రియ ముగిసిన నీ తనువు చప్పుళ్ళు యిప్పటికీ నా తనువులో కూడా పాళ్ళయ్యాయి
యిట్లు
నీతో కొన్నా(న్నే)ళ్ళు
Add comment