నిలవనీడ కోసం ఆర్తనాదం!

స్కైబాబ సంకలనం చేసిన “నేల లేని దేశం” ఆవిష్కరణ సందర్భంగా–

‘ఆ నెత్తుటి మడుగులో

పాల కోసం ఏడ్చే పిల్లాడికి తల్లిని చూపించు

మృతదేహమైనా సరే ఆ మాతృమూర్తి

చనుమొనల్లో కాసింత పాలను ప్రసాదించు… ప్రభూ..

 

యా అల్లాహ్…

సర్వాంతర్యామీ…

ఒక మిస్సైల్ దాడికి

ఆ సమూహాన్ని సర్వనాశనం చేసినట్టే

ఏడ్చి ఏడ్చి గడ్డకట్టిన మా కళ్లని

పీకెయ్…’

(‘సర్వాంతర్యామీ ’ – నబి కరీం ఖాన్)

 

ఒక ‘నేల లేని దేశం’ పక్షాన వెలువడిన తెలుగు కవుల ఆక్రోశ స్వరాల్లో ఒకటి ఈ పద్యం. ‘నేల లేని దేశం’ పేరిట వెలువడిన ఈ పుస్తకంలో వున్నవి యుద్ధ ప్రకటనలు కాదు. సకల దిక్కులను ప్రశ్నంచే ఆక్రోశాలు, ఆర్తనాదాలు. ఇప్పుడు

క్కడ…

ఏ అజాల చప్పుడులుండవు

ఏ ప్రార్థన కోలాహలాలుండవు

నింగీ నేలల్ని ఏకం చేసే ఆర్తనాదాలు తప్ప’

(‘బీభత్స రక్త వాకిలి’. -దిలీప్. వి)

ఈ రకం విచిత్ర దుస్థితి ప్రపంచ చరిత్రలో మరొకటి కనిపించదు. ఆ నేల వాళ్లది. కొంచెం కాదు. ఆ నేలంతా వాళ్లదే. మునుపటి వలసవాదులు మరెవరినో వాళ్ల మధ్యకు తెచ్చి వదిలారు. సమర్థనగా పుక్కిటి పురాణాల కథలు చెప్పారు. ఆ నేల ఎవరిదో ఆ మనుషులు కొత్తగా వొచ్చిన వాళ్లను ఆదరించారు. ఆగంతకులు క్రమంగా ఆ నేలనే ఆక్రమించుకున్నారు. అక్కడి వాళ్లను తమదైన-నేల-లేని మనుషులుగా మార్చారు.

దేశమంటే మట్టి కాదు, మనుషులు అన్నాడు మహా కవి, గురజాడ. దేశమంటే మట్టి కూడా. ఈ మట్టి మాది అంటున్న వాళ్ల దయనీయ వేదనకు అద్దం పట్టిన కవితలివి.

‘ఆశల సౌధాల శిధిలం

సముద్రమంత శోకం

కన్నీళ్లు ఇంకిన ఎడారి

విశాలమైన శ్మశానం

విషాద మౌనం

ప్రార్థించని పెదాలు లేవు

జోడించని చేతులు లేవు

మోకరిల్లినా మోక్షం లేదు

దైన్యం తప్ప.’

(‘గాజా’. – అబ్బాస్)

ఇది, గాజా అనే చారెడు నేలలో తమ అస్తిత్వం కోసం పోరాడుతున్న ఒక దీన సమూహం ఆవేదన. ‘పాలస్తీనా అథారిటీ’ పేరుతో పనిచేసే ప్రభుత్వం కింద మరి కొంత భూమిలో మరి కొందరు జీవిస్తున్నారు. ‘గాజా’ ప్రాతంలో నివసించే పాలస్తీనియన్లకు నాయకత్వం వహిస్తున్న సంస్థ ‘హమాస్’.

గత అక్టోబరు 7 న ఇజ్రాయిల్ మీద హమాస్ జరిపిన మెరుపు దాడి, ఆ తరువాత ఇజ్రాయిల్ లోపలికి చొచ్చుకు వచ్చిన హమాస్ తీవ్రవాదులు సామాన్య పౌరుల మీద సాగించిన బీభత్సం… చాల దుర్మార్గమని, మూర్ఖమని రాజకీయ పండితులందరి ముక్త కంఠం. ఆ చర్య ఉగ్రవాద చర్యయే. కాదని అనలేం. ఆ అభిప్రాయంతో ఏకీభవించకుండా ఉండలేం. ఇటీవలి పరిణామాలకు తక్షణ ప్రేరణ అదే.

కాని అది తక్షణ ప్రేరణ మాత్రమే. ఈ చారిత్రక క్రమం 1940 లలో సకల దేశ బహిష్కృత యూదుల చిటిపొటి వలసలుగా మొదలైంది. చాల కొద్ది కాలంలోనే, ఆ చిరు వలసలే పాలస్తీనియన్ల పై ‘యూదు ఉగ్రవాదం’గా మారింది. ఆపైన కుట్రమనస్కులైన అగ్ర రాజుల అండదండలతో వారి లీగల్ ప్రభుత్వంఏర్పడింది. అ తరువాత ప్రభుత్వ టెర్రరిజంగా వర్ధిల్లుతున్న ఒక వర్తమాన ఘోరకలిలో, ఆ ఘోరం మీద పాలస్తీనియన్ల ప్రతిఘటనలో… అక్టోబరు 7 అనేది ఒక తాజా తేదీ మాత్రమే. ఇది మొదలూ కాదు, తుదీ కాదు, బహుశా. పెద్ద దండలో ఒక పూస మాత్రమే.

ఆ పూసను చూపించి, మధ్య ప్రాచ్యంలో మాజీ, తాజా వలస వాదుల మద్దతుతో సాగుతున్న పాలస్తీనా జాతి నిర్మూలన హైన్యాన్ని మనం తక్కువ చేసి చూస్తున్నామా?

రాజకీయ పండితులకు ఈ ప్రశ్న వేయకుండా… మనకు మనం కూడా ఈ ప్రశ్న వేసుకోకుండా ఉండలేం.

పాలస్తీనియన్ ప్రజలలోంచి హమాస్ వంటి ఉగ్ర వాద సంస్థ పుట్టుకు రాకుండా ఉండడం సాధ్యమేనా? అది పుట్టుకు రావడానికి కారణమైన ఒక అమానుషాన్ని ఆపకుండా ఉగ్రవాదం అనే సమస్యను పరిష్కరించడం సాధ్యమేనా?

హమాస్ వంటి ‘ఉగ్ర మూర్ఖ’ సంస్థా, దాని ఉగ్ర చర్య(లు) లేకపోతే… అది కూడా లేకపోతే…  ఇక మిగిలేది ఏమిటి? ఎలాంటి ప్రతిఘటన లేకుండా యూదు జాత్యహంకారుల ధాష్ఠీకం కింద పాలస్తీనయన్ లు జాతికి జాతి మొత్తం అంతరించిపోవడమేనా? పాలస్తీనా అథారిటీ పేరిట ఉన్న బలహీనమైన ఏర్పాటు ఆ పరిణామాన్ని ఆపగలుతుందా?  అంతకు మించి, మధ్య ప్రాచ్యంలో యూదులు మొదలెట్టిన దుర్మార్గ రాజకీయానికి ముగింపు అనేది ఉన్నదా? అరబ్బులకు, యూదులకు మధ్య పంచాయితీ తెంచి శాంతిని నిలబెట్టాల్సిన ఐక్య రాజ్య సమితి ఆ పని చేయలేదు. చేయలేదు అని ఇటీవల సమితి, సెక్యూరిటీ కౌన్సిల్ లో ముందుకు వచ్చిన తీర్మానానికి పట్టిన నిర్దాక్షిణ్య దుర్గతి యే తార్కాణం.

ఆ తీర్మానం కనీసంగా, అసలు సమస్య జోలికి పోలేదు. ఇప్పటివరకు జరిగిన పరిణామాలలో తప్పెవరిదో, సమస్యకు శాశ్వత పరిష్కారమేమిటో ఆ తీర్మానం కనీసంగా కూడా చెప్పలేదు. ఇరు పక్షాలు తక్షణం మానవత్వ పూర్వక కాల్పుల విరమణ (హ్యుమానిటేరియన్ సీజ్ ఫైర్) కు అంగీకరించాలని, ఆ అంగీకారాన్ని సమితి స్వయంగా పర్యవేక్షించాలని మాత్రమే తీర్మానం పేర్కొంది. ఇక కాల్పులు ఆగిపోతాయి, మరింత మంది పిల్లలు, స్త్రీలు నిస్సహాయంగా బలయ్యే ఘోరకలిని మనం కళ్లప్పగించి చూడక్కర్లేదని అందరం అనుకున్నాం. తీర్మానం… శాంతి కాముక ప్రపంచానికి కాస్త ఆశలు కలిగించీ కలిగించక ముందే యూదు జాత్యహంకారం దానికి ససేమిరా కాదంది. దానికి వెన్నదన్నుగా నిలిచిన అమెరికా వీటో వేటుకు తీర్మానం బలయిపోయింది.

ఇది రాస్తున్నప్పటికి అదే ఘోరం కొనసాగుతూ వుంది. అదే తీర్మానాన్ని మరోసారి ప్రవేశపెట్టడానికి అరబ్బు దేశాలు ప్రయత్నిస్తున్నాయి.

ఫ్రెంచి అధ్యక్షుడనుకుంటా ఒక మాట అన్నాడు. హమాస్ పూర్తి నిర్మూలన కోసం ‘ఇజ్రాయిల్ అనుసరిస్తున్న ఈ వ్యూహం సరైంది కాదు. ఈ విధంగా హమాస్ సంస్థను తుడిచిపెట్టడం సాధ్యం కాదు’ అన్నాడతడు. ఇప్పటి ఇజ్రాయిలీ హింస వల్ల హమాస్ మరింత బలపడుతుందని అన్నాడు. అతడి మాటలు న్యాయాన్యాయాలకు, మంచి చెడులకు సంబంధించినవి కావు. హమాస్ పేరిట ‘గాజా’లో పాలస్తీనియన్లను తుడిచిపెట్టే ఇజ్రాయిల్ వ్యూహం ఏదుందో అది తప్పు అని అతడు ఖండించడం లేదు. ఆ యుద్ధ ‘వ్యూహం’ ఈ ‘ఎత్తుగడ’తో నెరవేరదు అని మిలిటరీ చర్చ చేస్తున్నాడంతే. యుద్ధాన్ని తన వాళ్లకు (ఇజ్రాయిలీలకు) అనుకూలంగా ఎలా కొనసాగించాలనే దానిలో భాగంగా మాట్లాడుతున్నాడంతే. ఈ యుద్ధంలో ఇజ్రాయిలీలు పూర్తిగా గెలవడమంటే ఏమిటి? ఇజ్రాయిల్ పూర్తి గెలుపంటే… పాలస్తీనియన్ నేలలో పాలస్తీనియన్లను పూర్తిగా తుడిచిపెట్టడమే!

మన రాజకీయ పండితులూ, మనం కోరుకుంటున్నది అది కాదు. కోరుకోదగినదీ అది కాదు. అలా దొరికేది ఒక దుర్మార్గాన్ని సంతృప్తి పరిచి సాధించే శాంతి మాత్రమే. అలాంటి శాంతి నిలబడేది కాదు.

కనీసం 1967 నాటి సరిహద్దులతో ఇజ్రాయిల్, పాలస్తీనా అనే సార్వభౌమ దేశాలు రూపొందేంత వరకు ఈ సమస్యకు పరికష్కారం లేదు. అసలు ఇజ్రాయిల్ దేశమే కుదరదు అని హమాస్ వాదిస్తే, ఆ వాదానికి ప్రపంచం… ఇవాళ అరబ్బు ప్రపంచం కూడా అంగీకరించదు. ప్రపంచ వత్తిడి కింద హమాస్ రెండు సార్వభౌమ దేశాల సహజీవనానికి తల వూపక తప్పదు. కాని, ఈ పరిష్కారానికి ‘బలవంతుడ నాకేమని’ విర్రవీగుతున్న ఇజ్రాయిల్ ప్రభుత్వం అస్సలు అంగీకరించదు. అంగీకరంచేట్టయితే చాల మంది సాధారణ యూదులను బలి తీసుకున్న అక్టోబరు 7 ఘటనకు, ఆ తరువాత ఇజ్రాయిల్ ప్రభుత్వం బలి తీసుకున్న అమాయక పాలస్తీనినయన్ మరణాలకు ఆస్కారం ఉండేది కాదు.

1967 నాటి సరిహద్దులతో రెండు దేశాల ఏర్పాటుకు ఇజ్రాయిల్ ఒప్పుకుంటే… ఇక, హమాస్ ఉగ్రవాదానికి జనాదరణ వుండదు. జనాదరణ లేకపోతే హమాస్ అనే సంస్థే ఉండదు. హమాస్ ఉండొద్దనుకుంటే అదొక్కటే మార్గం.

ఇజ్రాయిల్ కు, దాని నీతిమాలిన వకాల్తాదారులకు ఆ మంచి పరిణామం ఇష్టం లేదు. ఈ రాజకీయ మూర్ఖత్వమే హమాస్ అనే ఉగ్ర మూర్ఖత్వానికి నారు పోసింది. ఇప్పటికీ పోస్తున్నది. సకల ప్రపంచం ఆకాంక్ష అనదగిన ‘ఐరాస’ కాల్పుల విరమణ తీర్మానంపై ఆమెరికా వీటో ఆ విషం మొక్కకు పోసిన తాజా నీరు మాత్రమే.

ఈ విషపు మొక్క సేద్యం ఇప్పుడు మొదలయినది కాదు. అక్టోబరు 7న హమాస్ మెరుపు దాడితో మొదలైనది కూడా కాదు. అదంతా ఎలా జరిగిందో ఆ చరిత్రను వివరిస్తూ ‘నేల లేని దేశం’ పేరిట వెలువడిన ఈ చిన్న కవితా సంపుటి మొదట్లో మూడు వివరమైన వ్యాసాలున్నాయి.

ఇజ్రాయిలీ జాత్యహంకారం పాలస్తీనియన్ జాతిని పూర్తిగా తుదముట్టించే వరకు చూస్తూ ఊరుకోడం మినహా ప్రపంచం చేసింది, చేస్తున్నది, చేయగలిగింది ఏమీ లేదని ఇప్పటి వరకు ఘటనలు నిరూపించాయి.

కింది పటాలు చూడండి.

1947 కు ముందే… ప్రపంచంలో వేర్వేరు చోట్ల నుంచి… పాలస్తీనా భూముల్లోకి యూదుల వలసలు మొదలయ్యాయి. దానికి ముందు ఈ ప్రాంతమంతా ఒకే ‘పాలస్తీనా’ యే. అప్పటి వరకు ఇక్కడ ప్రజలందరూ పాలస్తీనియన్లే. ఆ తరువాత… గుడారంలో కాల్మోపిన ఒంటె అరబ్బును కాస్త కాస్త బయటికి జరుపుతూ పోయింది. 2020 నాటికి పాలస్తీనియన్లు… పాలస్తీనా భూమిలో కేవలం 15 శాతానికి పరిమితమయ్యారు. మిగిలిన ప్రాంతమంతటిలో యూదులే ‘సెటిల్’ అయుపోయారు. ప్రభుత్వం వాళ్లదే అయ్యింది.

ఇప్పుడు ఆ 15 శాతం భూమిని కూడా తామే ఆక్రమించుకోవాలని ఇజ్రాయిల్ చూస్తున్నదనడంలో సందేహం లేదు. ఆ పనిలో భాగంగ, గాజా ప్రాంతం నుంచి (అక్కడ ఇరుకిరుకుగా జీవిస్తున్న) పాలస్తీనియన్లను వెళ్ల గొట్టడమే ఇప్పుడు జరుగుతున్న మారణహోమం సారాంశం.

ఈ చారిత్రక క్రమాన్ని దృష్టిలో ఉంచుకుని ఆలోచించాలి. అప్పుడే, అక్టోబరు 7 మెరుపు దాడులు అనే ‘మూర్ఖ’ చర్యకు హమాస్ ఎందుకు పాల్పడిందో, దానికి వాళ్లను ప్రోత్సహించిన చీకటి శక్తులు ఏవేవో అర్థమవుతుంది.

సద్దాం హుస్సేన్ ఉరితీత దాకా సాగిన గల్ఫ్ యుద్ద ఘటనలకు … ఇరాక్ లో జీవాయుధలు అనే అబద్ధం ఒక సాకు మాత్రమే నని ఇప్పుడు అందరికీ తెలుసు. దాని కంటె ముందు కువైట్ మీద ఇరాక్ దాడి, ఆ దాడికి వ్యతిరేకంగా అమెరికా ప్రపంచ ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడం… ఇవి ఇరాక్ మీద అమెరికన్ దురాక్రమణ దాడులు, చివరాఖరికి సద్ధాం రూపంలో ఇరాక్ స్వాతంత్ర్యానికి ఉరి… అన్నీ ఒక యుక్తి క్రమంలో భాగమని కూడా ఇప్పుడు అందరికీ తెలుసు.

అక్టోబరు 7 హమాస్ మెరుపు దాడి కూడా అలాంటి ఒక యుక్తి క్రమంలో బాగమేనని చెప్పవచ్చు. ఆ మెరుపు దాడి సాధారణ పాలస్తీనా ప్రజలపై మారణ హోమానికి తక్షణ నెపం అయింది. 1947 ప్రాంతాల్లో మొదలైన ఒక చారిత్రక క్రమం జర్మనీలో హిట్లరైట్లు సాగించిన దారుణాలలకు ఏమాత్రం ఏమాత్రం తీసిపోదు. వాస్తవాన్ని వాస్తవంగా గుర్తించాలి. అలాగని, జరిగిపోయిన చరిత్రనంతా తిరుగదోడలేం. వర్తమానాన్ని ప్రజానుకూలంగా సరిదిద్దుకోవడమే చేయగలిగింది. సాధారణ యూదులపై హింస కూడా ఆగిపోవాలి. ఉగ్రవాదం పాలస్తీనియన్ ‘హమాస్’ దైనా, పాలస్తీనాలో యూదుల సెటిల్మెట్లకు ప్రోది చేసిన జియోనిస్టులదైనా… తక్షణం ఆగిపోవాలి. దానికి, బహుశా, ప్రపంచమంతా ఆమోదించే పరిష్కారం: 1967 నాటి సరిహద్దుల్లో, జెరూసలేం నగరం వుమ్మడి రాజధానిగా ఇజ్రాయిల్, పాలస్తీనా దేశాలు ఏర్పడి సాధారణ ప్రజలు జాతి వైషమ్యాలు మరిచి సహజీవనం సాగించడమే.

అగ్ర రాజ్యాలు దానికి అంగీకరిస్తాయా? సొంత లాభం కొంత కూడా మానుకోలేని అగ్ర రజ్యాలు ఆ పరిణామానికి ఒప్పుకుంటాయా?

వాడు పాలస్తీనాను తుడిచిపెట్టడానికే

డాలర్లు పంపుతాడు వీడు ఆయుధాలను పదును పెడతాడు

ఎవడికి తెలియని రహస్యమిది?

 

ఐక్యరాజ్య సమితి ఐక్యత ఉత్త కాగిత చాతుర్యం

ఐదు దేశాల పెత్తనం కింద బానిసత్వం నెరుపుతూ

వెన్నెముక లేని మూడవ ప్రపంచం సాగిలపడడం

ఎవడికి తెలియని ఆర్థిక సూత్రం?’

(‘పాలస్తీనా లడ్ రహా రహా హై’. – మహమూద్)

అందరికీ తెలిసిన ఈ ఆర్థిక సూత్రాన్ని ఇకనైనా తెంపేయకపోతే ఒక చోట కాకపోతే మరో చోట అమాయకుల నెత్తుటేళ్లతో నేల నానుతూనే ఉంటుంది. ఈ పుస్తకంలో మాదిరు కవి వాక్కు భూమిని నిద్రపోనివ్వని ఆర్తనాదం, ఆక్రందన అవుతూనే ఉంటుంది. ☹

*

హెచ్చార్కె

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • బాగా రాశారు సర్! వెంటనే మీరు సమీక్షించడం గ్రేట్ 💙

  • చాలా మంచి విశ్లేషణ సర్. ఇలాంటి ఒక సంకలనాన్ని ఇంత త్వందరగా వేయడం చిన్న విషయం కాదు. స్కైబాబా కి అభినందనలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు