నిరుద్యోగ పర్వంలో మరొక మంచి తమాషా

వంగూరి జీవిత కాలమ్-71

నిరుద్యోగ పర్వం

1975 ఏప్రిల్ మొదటి వారంలో హ్యూస్టన్ రాగానే అనుకోని విధంగా రోడ్డు మీద కనపడి, మా గోడు విని జాలిపడి తన ఏపార్ట్ మెంట్ లో తలదాచుకోనిచ్చిన అతి మంచి పాకిస్తానీ ఇంట్లో అంతా సౌకర్యంగానే ఉంది కానీ మొదట రెండు, మూడు రోజులు ఊహించని ఇబ్బంది పడ్డాం.  అవి మతపరమైన ఇబ్బందులు కాదు కానీ వస్తాయి ‘చిన్న చిన్న ‘చికెన్ ఇబ్బందులు” వచ్చాయి. అంటే అతని రిఫ్రిజిరేటర్ లో చికెన్ ముక్కలు కనపడడం లాంటివనమాట.  రెండు మూడు రోజుల తర్వాత మేము వేపుడు కూరలు చేసుకుని అతనికి ఉన్న నాలుగైదు గిన్నెల్లోనే అన్నం వండుకుని అప్పుడప్పుడు పులుసు కూడా చేసుకుని తింటుంటే అతను కూడా కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుంటూ తినేవాడు.

మన ఆంధ్రా కారం పైషావర్ పాకిస్థానీ వాడికి పెట్టి, అలా వాళ్ళ మీద “ భలే కక్ష తీర్చుకున్నాం” అని ముగ్గురం రహస్యంగా హాస్యం ఆడుకున్నా, అతడి అవస్థా చూస్తే జాలి వేసేది. నయీమ్ నిజంగానే చాలా సాత్వికుడు. పొద్దున్నే లేచి తయారు అయి నడుచుకుంటూ ఆఫీసుకు వెళ్లడం సాయంత్రం రావడం తినేసి పడుకోవడం మధ్యలో కాసేపు టీవీ చూడడం అదే అతని మతం.

అతనికున్న ఒక సుగుణం మా పాలిటి ప్రాణవాయువు అయింది ఆ రోజుల్లో  హ్యూస్టన్ లో హ్యూస్ట్న క్రానికల్, హ్యూస్టన్ పోస్ట్ అని రెండు పేపర్లు ఉండేవి. అతను ఈ రెండు పేపర్లూ తెప్పించుకుని పొద్దున్నే కాఫీ తాగుతూ అవి చదవడం అతని అలవాటు. మాకు అవి వర ప్రసాదం.  పొద్దున ఆరు గంటలకు పేపర్ బాయ్ అవి మా బాల్కనీ లోకి విసిరెయ్ గానే, లోపలికి తెచ్చి పెట్టుకుని అందులో ఎంప్లాయిమెంట్ సెక్షన్ తీసేసి మిగతా పేపర్ పెట్టి మళ్లీ అతనికి ఇచ్చేసే వాళ్ళం.  పాపం  అతను ఏమీ అనేవాడు కాదు.

రోజూ పొద్దున్నే పేపర్లు రాగానే మరొకరకమైన ఉబ్బంది వచ్చేది.  నేను,  శాస్త్రి, రఘు ముగ్గురం మెకానికల్ ఇంజనీర్స్ ఇంజనీర్లను కాబట్టి ముందు ఆ ఉద్యోగాల కోసమే అందులో వెతికే వాళ్ళం.  హెల్ప్ వాంటెడ్ అని చిన్నవీ, పెద్ద కంపెనీలవి పెద్ద ప్రకటనలూ కనబడేవి.  మాలో మేము ఏ ప్రకటనకి ఎవరు అప్లై చేయాలి అని మొదట్లో  గింజుకున్నా ఆ తర్వాత ఎవరికి ఏ ఉద్యోగం వచ్చినా అందరికీ మంచిదే కదా అని అన్నింటికీ ముగ్గురం అప్లికేషన్ పెట్టేవాళ్ళం. ఇంజనీరింగ్ ఉద్యోగమే కాదు.  మేము చేయగలిగిన ఎటువంటి చిన్న ఉద్యోగం అయినా సరే దానికోసం  ముగ్గురి దగ్గర మూడు నాలుగు రకాల బయో డేటాలు ఉండేవి.   నా రెజుమేలలో  డాక్టరేట్ ఉన్నవి కొన్ని,   ఇంజనీరింగ్ డిగ్రీ మాత్రమే ఉన్నవి కొన్ని హై స్కూల్ పాస్ అయినట్టు మాత్రమే ఉన్నవి మరికొన్ని ఇలా తయారు చేసుకున్నాను.

నయీమ్ ఇంట్లో  ఒక చిన్న టైప్ రైటర్ ఉండడంతో సరదాగా నవ్వుకుంటూ రోజుకి రకరకాల కవర్ లెటర్లూ, బయో డేటాలు ఆ ఉద్యోగాన్ని బట్టి “మేనుఫేక్చరింగ్” చేసేసే వాళ్ళం.

ఒకసారి ఒక తమాషా జరిగింది.  మేము అప్లై చేసిన ఒక ఉద్యోగానికి మా లోపు ఒకరికి ఫోన్ వచ్చి ఇంటర్వ్యూ కి రమ్మన్నారు.  మాకు ఉన్నది ఒకటే కారు.  ఎలా ఉంటుందో చూద్దాం అని టై కట్టుకుని,  సూటు బూటు వేసుకొని ముగ్గురం ఆ కంపెనీకి వెళ్ళిపోయాం.  అక్కడికి వెళ్లి మిగిలిన ఇద్దరం  అదే ఉద్యోగానికి అక్కడ  అప్లికేషన్స్  పూర్తిచేసి ఇచ్చాం.  ఆ రోజుల్లో చాలా ఉద్యోగాలకి మనం ఏ కంపెనీకి అయినా సరే  వెళ్ళీ పోయి రిసెప్షన్ లో అందమైన అమ్మాయిని అక్కడ ఏ ఉద్యోగాలు ఉన్నాయో కనుక్కొని అప్లికేషన్ అడిగి తీసుకుని అది పూర్తిచేసి ఇచ్చే సదుపాయం ఉండేది.  ఆరోజు  మా ముగ్గురిలో  ఎవరికీ నా ఉద్యోగం రాలేదు.  నీ మూలాన నాకు రాలేదు,  నా మూలాన నీకు రాలేదు అని ముగ్గురం సరదాగా దెబ్బలాడే కున్నాం.

మొత్తానికి నయీమ్ ఇంట్లో మేము దిగిన వారం రోజులకి శాస్త్రికి కాలిఫోర్నియాలోనూ,  రఘుకి ఒహాయో రాష్ట్రంలోనూ వాళ్లు ఇదివరకే అప్లై చేసిన  ఉద్యోగాలు రావడంతో ఇద్దరూ వెళ్లిపోయారు.   నయీమ్ ఇంట్లో హ్యూస్టన్ లో  నేను ఏకాకిగా  మిగిలిపోయాను.  అలా మిగిలిన వాడిని  ఇప్పటిదాకా… అంటే  సుమారు 48 సంవత్సరాలు హ్యూస్టన్ లోనే ఉండిపోయాను. ఆశ్చర్యం ఏమిటంటే  ఈ 48 సంవత్సరాలలోనూ స్త్రినీ,  రఘునీ  విడివిడిగా  ఒకేసారి  కాసేపు  మాత్రమే కలుసుకో గలిగాను.  నా జీవితంలో భవిష్యత్తు ఎలా ఉంటుందో  అసలు ఊహించలేని పరిస్థితిలో ఏకాకితనం అనుభవించడం అదే మొదటిసారి ఆఖరి సారి.  ఆ పరిస్థితి సుమారు రెండు నెలల పాటు  భరించాను. నాకూ, నయీమ్ కీ కారు లేకపోవడంతో ఎక్కడికి వెళ్లే వీలు లేదు.  ప్రతి రోజూ రెండు పేపర్లలో  ఉద్యోగాల ప్రకటనలు చూడడం, కనీసం అప్ది అప్లికేషన్లు పడెయ్యడం నా ప్రధాన వ్యాపకం. వారం రోజుల్లో నేను చికాకూ నుంచి తెచ్చుకున్న స్టాంపులు, కవర్లు, తెల్ల కాగితాలు అయిపోవడంతో పాపం నయీమ్ తెచ్చి పెట్టాడు. అప్పటికి  ఇద్దరం “భయ్యా” అనీ, “సాబ్” అనీ పిలుచు కోవడం, కలిసి నడిచి గ్రోసరీ షాపింగ్ కి వెళ్ళడం అలవాటు అయింది. ఆశ్చర్యం ఏమిటంటే, మేము మాట్లాడుకున్నది తక్కువే అయినా, అది మహా అయితే ఆ రోజు టీవీలో చూసిన స్థానిక విషయాలు, జరుగుతున్న వియత్నాం యుద్ధం, అమెరికా-రష్యా-చైనా రాజకీయాలని దాటి ఏ నాడూ ఇండియా -పాకిస్తాన్ ల గురించి ఒక్క మాట కూడా మాట్లాడుకోక పోవడం బహుశా మంచిదే అయింది నా ప్రాణాలకి. ఇక పేపర్ లో ప్రకటనలు కాక, యెల్లో పేజెస్  అనే  టెలిఫోన్ డైరెక్టరీలో  రకరకాల  కంపెనీలకి ఫోన్ చేసి “ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయా?”  అని అడగడం ఉద్యోగాల వేటలో మరొక వ్యాపకం. నయీమ్ కాక ఉన్న ముగ్గురు నలుగురు పరిచయస్తులూ  రైస్  యూనివర్సిటీ లో  డాక్టరేట్  విద్యార్థులు కాబట్టి  రోజూ కలుసుకునే అవకాశం లేనేలేదు. కానీ వారాంతంలో కలుసుకునే వాళ్ళం. అది కూడా వాళ్ళలో మహంతి ఒక్కడికే రెండే రెండు సీట్లు ఉండే ;జాగ్వార్” అనే బాగా పాత కారులో వచ్చి నన్ను వాళ్ళ ఎపార్ట్ మెంట్ కి శనివారం పొద్దున్న వచ్చి తీసుకెళ్ళేవాడు. వారాంతం అంతా వాళ్ళ తోనే గడిపే వాడిని.

హ్యూస్టన్ లో అడుగుపెట్టిన మూడు, నాలుగు వారాల తర్వాత, ఒక రోజు మహంతి నన్ను కారులో తీసుకెడుతూ ఉండగా యూనివర్శిటీ ని ఆనుకుని ఉన్న మైన్ రోడ్ మీద ఒక రెస్టారెంట్ ముందు పెద్ద అక్షరాలతో “నౌ హైరింగ్” అనే బోర్డు కనపడింది. వెంటనే  కారు ఆపించి, నేను లోపలికి వెళ్ళి ఎలాంటి ఉద్యోగమూ వివరాలు అడిగాను. అదొక చైనీస్ రెస్టారెంట్. వాడు ఇచ్చిన అప్లికేషన్ లో చదువు తప్ప మిగతావి పూర్తి చేసి ఇచ్చేసి ఇంటికి వెళ్ళగానే “నీకు అదేదో కింగ్ కాంగ్ ఫాన్ “ లాంటి చీటు నుంచి ఫోన్ వచ్చింది అని చెప్పగానే నాకు ముందు అర్ధం కాలేదు కానీ, ఆ నెంబర్ కి పిలవగానే అవతల చైనా వాడు నాకు సగం సగం ఇంగ్లీషులో గంటకి రెండున్నర డాలర్ల జీతం, రోజూ సాయంత్రం 5 నుంచి అర్ధ రాత్రి దాకా పనీ కిచెన్ లో ఉద్యోగం, ఎప్పటి నుంచి రాగలవు అని అడిగాడు. నాకు సగం అర్ధం, అయీ, సగం అర్ధం అవకా ఏం చెప్పాలో అంతకన్నా అర్ధం అవకా “రేపు చెప్తాను” అని ఫోన్ పెట్టేశాను. ఇది మా తమ్ముడికి చెప్పాలో, వద్దో తెలీదు. చేతిలో పైసా లేదు. అదేదో గిన్నెలు కడిగే ఉద్యోగం అని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అసలు సమస్య రోజూ అక్కడికి వెళ్ళడం ఎలాగా, సాయంత్రం కాబట్టి ఏదో రెండు బస్సులు మారి వేళ్ళ వచ్చును కానీ అర్ధ రాత్రి బస్సులు లేని సమయం లో ఇంటికి రావడం ఎలాగ? అమెరికా లో నాలుగవ అతి పెద్ద నగరం అయిన హ్యూస్టన్ లో పబ్లిక్ బస్సులు నామకహా అని నాకు అప్పటికే అర్ధం అయింది. ఈ బస్సు అయినా సరే డౌన్ టౌన్ మాత్రమే వేడుతుంది. అన్నీ గంటకి ఒకటి. ఆఖరి బస్సు రాత్రి ఎనిమిది.  ఈ ఉద్యోగం ఎంత అవసరం అయినా మన వల్ల కాదు అనిపించింది. అదేమీ విచిత్రమో, ఆ మర్నాడు, ఆ చైనీయుడు మళ్ళీ పిలిచి “ఇవాళ సాయంత్రం నుంచీ రాగలవా?” అని అడగ్గానే నేను నాకు వచ్చిన ఇబ్బంది చెప్పాను. “అలా అయితే మధ్యాహ్నం షిఫ్ట్ కి రా. మధ్యాహ్నం వాడిని రాత్రికి మారుద్దాం” అనగానే నాకు ఏం చెప్పాలో అర్ధం కాక ఒప్పేసుకున్నాను.

అలా బొంబాయి ఐ ఐ టి లో డాక్టరేట్ చేసి, అక్కడే లెక్చరర్ గా పనిచేసిన నేను ఒకానొక చైనా రెస్టారెంట్ లో గిన్నెలు కడిగే ఉద్యోగం చేస్తూ నెల్లాళ్ళకి పైగా జీవనోపాధి సంపాదించుకున్నాను. ఇది ఒక్క అమెరికాలోనే సాధ్యం!. ఓన్లీ ఇన్ అమెరికా! కదా! చైనా వాళ్ళు కప్పలూ, పాములూ తింటారు అని వినడం తప్ప అప్పటి వరకూ నా జన్మలో మొట్టమొదటి సారిగా తినిపారేసిన చైనా పదార్ధాలు చూడడం, ఏవగించుకుంటూనే ఆ ప్లేట్లు కడిగి డిష్ వాషర్లలో పెట్టడం ఒక ఎత్తు అయితే నా తోటి పనివాళ్లు, వంట వాళ్ళు అందరూ ఒకే భాష మాట్లాడే వాళ్ళ మధ్య ఒక్క అక్షరం ముక్క అర్ధం కాకుండా, కేవలం చేతులు, కళ్ళ సైగలతో, అస్సలు అలవాటు లేని ఆ వాసన భరించ లేక పని చెయ్యడం మరొక ఎత్తు. రోజుకి పది డాలర్ల పైనే సంపాదన అసలైన కొస మెరుపు. ఈ ఉద్యోగం సోమ వారం నుంచి శుక్రవారం వరకే మధ్యాహ్నం షిఫ్ట్ కాబట్టి ఒక్క నయీమ్ ఒక్కడికీ తప్ప రైస్ యూనివర్శిటీ స్నేహితులకీ, మా తమ్ముడికీ చెప్ప లేదు. కానీ రెండు వారాల తర్వాత ఆ చైనా వాడికి తన భాష మాట్లాడే వాడే దొరకడంతో నాకు ఉద్వాసన చెప్పేశాడు. వాడి భాష బొత్తిగా రాని నాకు బొత్తిగా ఆ ఉద్యోగం అసలు నాకు ఎందుకు ఇచ్చాడో, నేను ఎందుకు ఒప్పుకున్నానో నాకు ఇప్పటికీ  తెలియదు.

ఈ తతంగం అయ్యాక, నేను మళ్ళీ నిరుద్యోగ పర్వం లో పడ్డాక మరొక మంచి తమాషా జరిగింది.

అప్పటికి నేను వారాంతంలో రైస్ యూనివర్శిటీ కుర్ర కారుతో టెన్నిస్ ఆడుకోడం, కబుర్లు చెప్పుకోవడం బాగా అలవాటు అయింది. ఒక శనివారం మహంతి. మూర్తి, మరి కొందరూ కలిసి “ఇవాళ లంచ్ కి దోస తిందాం” అన్నారు. ఆ యూనివర్శిటీ ఉండే ప్రాంతాన్ని రైస్ విలేజ్ అంటారు. వీళ్ళు అందరూ ఉండేది అక్కడే. అక్కడే 2514 టైమ్స్ బులవార్డ్ అనే “చరిత్రాత్మక ప్రదేశం” లో ‘మహారాజా” అనే మన ఇండియన్ రెస్టారెంట్ ఉంది. అందరం కలిసి నడిచి అక్కడికి వెళ్ళాం. అది “చరిత్రాత్మక ప్రదేశం” అనడానికి కారణాలు ఉన్నాయి. నమ్మండి, నమ్మక పొండి. 1975 ప్రాంతాలలో యావత్ టెక్సస్ రాష్ట్రంలో అదొక్కటంటే ఒక్కటే ఇండియన్ రెస్టారెంట్. మరొక కారణం వ్యక్తిగతం. మేము నలుగురం నాలుగు మెట్లు ఎక్కి ఆ రెస్టారెంట్ లో అడుగుపెట్టగానే అంతా ఖాళీగా ఉంది. మేము లోపలికి అడుగు పెట్టిన చప్పుడు విని, లోపల నుంచి మా ఈడువాడే ఒక యువకుడు వచ్చి “గుడ్ మార్నింగ్” ప్లీజ్ కమ్ ఇన్, హేవ్ ఏ సీట్” అని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటే నేను అతడిని “ఎక్కడో చూసినట్టుందే. మొహం చాలా తెలిసినట్టుగా ఉంది” అనుకోవడం, అతను కూడా నన్ను చూసి ఎగా, దిగా చూడడం, అప్పుడు హఠాత్తుగా అతడిని నేను మా కాకినాడ ఇంజనీరింగ్ కాలేజ్ లో చూసినట్టుగా గుర్తు పట్టడం జరిగిపోయాయి. అతను నాకు కాకినాడ లో ఒక ఏడాది సీనియర్. మా కాలేజ్ ప్రోగ్రాములలో ఎకార్డియన్ వాయించే ఒక కాష్మీరీ కుర్రాడికి ఇతను పక్క వాద్యంగా డ్రమ్స్, బాంగో అవీ వాయించే వాడు. మేము తప్పట్లు కొట్టి దింపేసే వాళ్ళం.

అప్పుడూ పేరు తెలీదు కానీ, ఇప్పుడు “ఆ యామ్ అనిల్ కుమార్” అని పరిచయం చేసుకుని నన్ను గుర్తుపట్టాడు. “నువ్వు ఇక్కడ ఉన్నావేమిటి గురూ” అనేదే ఇంచు మించు మా ఇద్దరిదీ ఒకటే డైలాగ్ ఆ రోజు. అతనే ఈ రెస్టారెంట్ యజమాని, వంట వాడు, సర్వర్, అన్నీనూ. అంటే “ఏక వ్యక్తి “ రెస్టారెంట్ అనమాట. అది తెలియగానే నా మొదటి ప్రశ్న “ఇక్కడేమైనా డిష్ వాషింగ్” ఉద్యోగం ఉందా గురూ?” అని అడిగేశాను. “హారినీ, అప్పుడే నా ఉద్యోగానికి ఎసరు పెట్టేశావా?” అని నవ్వేశాడు అనిల్. అప్పటి నుంచి ..అంటే 1975 ఏప్రిల్/మే నుంచి అతను 2015 లో పరమ పదించిన ఆఖరి రోజుల దాకా అలా జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూనే 40 ఏళ్ళు గడిపేశాం!. “నీలాటి వాళ్ళు నాలుగు రోజులు పని చేసి అసలు ఇంజనీరింగ్ ఉద్యోగం రాగానే హుష్ కాకీ…మళ్ళీ ఆ డ్యూటీ కూడా నాదే. అందుకే నేను తప్ప ఈ రెస్టారెంట్ లో ఇంకెవరికీ ఉద్యోగసద్యోగాలు లేవు”. అదీ అనిల్ కుమార్ నవ్వుతూ ఇచ్చిన సంజాయిషీ. నా చైనా రెస్టారెంట్ లో ఉద్యోగం గురించి అప్పుడు బయట పెట్టగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పటికీ అక్కడ ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది. నాకు అది చరిత్రాత్మక ప్రదేశం కాబట్టి మా కుటుంబంతో అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి ఆ నాటి “అనిల్ దోసలు” గుర్తు చేసుకుంటూ ఉంటాను. నిజానికి అనిల్ వాటిని అమెరికనైజ్ చేసి అటూ, ఇటూ కాకుండా చేసేవాడు. ఉదాహరణకి “బీఫ్ దోస” అని అతను కనిపెట్టిన దోస లాంటివి ఇటు ఇండియన్స్ కానీ అటు అమెరికన్స్ కానీ తినలేక పోవడంతో మహారాజా మనుగడ ఎక్కువ కాలం లేదు.

ఇంతకీ ఇతని పూర్తి పేరు జనమంచి అనిల్ కుమార్. ఆ రోజు అతని పరిచయం నా  జీవిత చరిత్రలో కొత్త మలుపు. ఆకాశవాణి రేడియో మద్రాసు కేంద్రం డైరెక్టర్, ప్రముఖ రచయిత జనమంచి రామకృష్ణ గారి ఏకైక కుమారుడు. ఆయనే ఘంటసాల, సుశీల, బాల మురళి లాంటి హేమాహేమీలని రేడియో ద్వారా దేశానికి పరిచయం చేసిన  గొప్ప వ్యక్తి. అనిల్ కి అప్పుడే పెళ్ళి అయింది కానీ అతని భార్య ఇంకా G

నుంచి రాలేదు. తన “అంజలి సెంటర్”, ‘సంస్కృతి ఫౌండేషన్” ల ద్వారా “అమెరికాలో కొన్ని వేల మందికి “కూచిపూడి నాట్య దానం” చేసిన ప్రముఖ నర్తకి రత్న పాప. రత్నపాప మరెవరో కాదు. సుప్రసిద్ధ జానపద గాయనీమణులు, దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి మేనగోడళ్ళు అయిన సీత-అనసూయ” లలో “కళా ప్రపూర్ణ” అవసరాల (వింజమూరి) అనసూయా దేవి గారి పెద్ద kumaపెద్దమ్మాయి. వీళ్ళందరూ కాకినాడ వారే అవడంతో నాకు 75 లో అనిల్ కుమార్ ని కలిసే నాటికి పరోక్షంగా బాగా తెలుసును. ఆ తర్వాత ప్రత్యక్షంగా తెలియడమే కాక  నేను వారి కుటుంబ సభ్యుడిని అయిపోయాను.

ఒక ఆప్త మిత్రుడిగా, సాటి కళాకారుడిగా, నా కథలకి వీరాభిమానిగా నా అమెరికా జీవితంలో అనిల్ కుమార్ పాత్ర గురించి ముందు ముందు ప్రస్తావిస్తూనే ఉంటాను… కానీ నా నిరుద్యోగ పర్వంలో అతని సహాయం గురించి త్వరలోనే….

*

 

వంగూరి చిట్టెన్ రాజు

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మేమొచ్చినపుడు మినిమం వేజ్ $4.25. మీరొచ్చిన నలభై ఏళ్ళ కి ఇంకా అది గొర్రె తోకలాగా $7.25 దగ్గిరే వుంది. ఇంతకీ పాములూ కప్పల కంచాలు కడిగి ఇంటికెళ్ళాక జంధ్యం మార్చేవారా? 😃😃😃 సర్దాకి అడుగుతున్నాను.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు