నిన్ను బతిమాలే ఒకరు

చీకటి నాజూగ్గా
చందమామని నుదుటిపై బొట్టులా పెట్టుకుంది.
పల్చటి వెన్నెలచీర కట్టుకుని
నేలపై ఉజ్వలంగా మండుతున్న జ్వాలల్ని చూస్తుంది
కాంప్ ఫైర్:
చుట్టూ కొందరం మనుషులం
రెండు ప్రేమ జంటలు:
చకోరాల్లా కూర్చుని వెన్నెలని తింటూ వున్నాయి
సమీరం- అనలంతో కలిసి
చలి నుంచి వేడిగా రూపాంతరం చెందుతూ
దేహాన్ని పులకింపజేస్తుంది ‌
నేను ఒక్కడినే;
నాతో నేను అల్లరి పెట్టే ఒక స్నేహితురాలు
‘నీ జుట్టేం బాలేదురా
 హేయిరాయిల్ పెడతావా నువ్వసలు?
 చూడు! రింగు రింగులు తిరిగి
 నీ తలపై చీకటి మొలిచినట్టుంది.
 నీకు లవర్ లేదు కదా
 అటు చూడు వాళ్ళెలెలాగ అతుక్కుపోయారో
 నువ్వు ఎవరినైనా set చేసుకో కదా
బ్రేకప్ అయ్యిన పిచ్చోడిలా
ఎలా పెంచుతున్నాడో ఈ గడ్డాన్ని
ఎందు…’
విసిగిస్తూ ఉన్న ఆ అమ్మాయిని
పక్కకి తోస్తూ
‘పిచ్చేమైనా నీకు పట్టిందా?’
చంపుకుతింటున్నావ్’ అని బిగ్గరగా అరిస్తే
ఇక అలిగి
మా అందరికీ దూరంగా జరిగి
రెండు కాళ్ళని ముడుచుకుని
ముఖాన్ని వొంచుకుంటూ:
‘నీతో అస్సలు మాట్లాడను పో’
అని ముఖంలో కాంతి కోల్పోయి వుంటుంది తను.
నేనేం బ్రతిమాలడానికి వెళ్ళను
చుట్టూరా
నిశ్శబ్దం ముసురుకుంటుంది.
కాసేపాగి
వెనుకగా
‘ఓయ్! నిన్నేమన్నా అనుంటే Sorry రా!
ఇంకెప్పుడూ ఇది Repeat చేయను’
అని గుబురుగా పెరిగిన నా గడ్డం వెంట్రుకలని పట్టుకుని బతిమాలుతూ
నా కళ్ళలోకి చూస్తుంది తను.
కరగని రాతిలా కూర్చుండిపోతాను నేను
ఎవరో శపించిన శిలలా.
‘అరేయ్ అరేయ్ ప్లీజ్ రా
నాతో మాట్లాడరా’
నా చుట్టూరా తిరుగుతుంది: అన్నం తిననంటే బతిమాలే అమ్మలాగ.
ఎందుకో కరిగిపోయి
ముద్దొచ్చే ఓ పాపాయిని చూస్తే వచ్చిన నవ్వుతో నేను.
ఆమె: మెరిసే కళ్ళతో
ఓ అందమైన నవ్వుతో.
@ ఎలిఫెంట్ రాక్స్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్

లిఖిత్ కుమార్ గోదా

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఆ ఒక్కరే కావాలి మనుగడ కోసం. బావుంది

  • క్యాంపస్ లో క్యాంప్ ఫైర్ పెట్టి అర్థరాత్రి వరకు అక్కడే చలితో పాటు ఏకాంతాన్ని పారద్రోలడానికి మిత్రులతో గడిపిన క్షణాలు గుర్తొచ్చాయి.
    కవిత బాగుంది లిఖిత్. క్యాంపస్ లో ప్రతి విద్యార్థి అనుభవించే క్షణాలు అవి. వెన్నెల కురుస్తున్న వేళ , క్యాంప్ ఫైర్ ని వెలిగించి మిత్రురాలితో సరదాగా గొడవపడటము,అలగటం, ఆ తర్వాత తను అమ్మలాగా బ్రతిమిలాడటం, దానికి కరిగి నువ్వు పాపాయిలాగా నవ్వి ఆమె ముఖంలో నవ్వును ప్రసరింపజేయడంలో సహజత్వంతో కూడిన పవిత్రమైన మైత్రీ తారసపడింది నాకు. 💐❤️

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు