నిన్నా నేడుల కలియని రంగుల కూడిక – లండన్!!

సారి   జయప్రభ కవిత గురించి పరిచయం:
అప్పుడెప్పుడో అశ్వశకటాల కోసం అమరిన
రహదారుల మీద
ఇప్పుడు బస్సులూ మోటార్లూ ఇరుగ్గా తిరుగుతున్నట్టు
అసంబద్ధమైన ఆధునికతని
ముఖం మీద అరువుగా అద్దుకుని
ఘనీభవించిన ప్రాచీనత్వంతో
తన అనాది రూపాన్ని నిలుపుకునుంటుంది లండన్!!
పాత వంతెనల కిందుగా
రవాణా పడవలు జార్చిన
చమురు తెట్టు తేలుతూ
థేమ్సు నదీజలాలు –
పురాతన నగరాన్ని తళతళా ప్రతిబింబిస్తూంటాయి
పగలూ రాత్రీ!!
పాతదనం మీదా రాచరికం మీదా
మోజు వదులుకోలేని ఇంగిలీషు సమాజం
తన రెండడుగుల్లోనూ ఒక అడుగుని
వెయ్యేళ్ళ వెనకే వుంచుకునీ
ఒంటికాలి నడకతోనే
నలుగురి కన్నా తాను ముందున్నట్టనుకుంటుంది!
సంప్రదాయానికి నిత్య నైవేద్యం పెడుతూ
వరుసతీరి భక్తితో నుంచునుంటాయి
నగరం నిండా పాత పాత కట్టడాలు!
పెంకులద్దిన ఇంటికప్పులు పైనించి చూస్తే
పగడపు ధూళి పైకి లేచి
పట్టణాన్ని ముట్టడించినట్టు!!
పాత రాతిభవనాల మీదా పావురాళ్ళ మీదా
తెల్లవాళ్ళకంత మక్కువెందుకో!!
ట్రఫాల్గర్ స్క్వేర్ లో
సోమరిగా కూచుంటాయి నల్ల రాతి సింహాలు!
ఎగరలేనంతగా బరువు పెరిగి వుంటాయ్
నీలి పావురాలు!!
బహుశా అవి
హాహా హూహూ కి అంతరంగ నేస్తాలో
హింసాహింసలకి అనుభావాలో
సార్వభౌమ్యానికీ సామ్యవాదానికీ అనుసంధానాలో ?!
లండన్ టవరూ, దాని వెనక పాత రాతి కోటా,
టవరు  బ్రిడ్జి కింద థేమ్సూ –
ప్రభుత్వ పతనాలనీ, ప్రతిదారణలలో చిందిన రక్తాలనీ
తమలో ఇప్పటికీ ప్రతిఫలిస్తూంటాయి!
కాలిన కాలం కమురు కంపు
గాలిలో చెలరేగి వీస్తున్నా
తాలిమితో తలెత్తి నుంచునుంటాయి!
లండన్ టవరూ, వెనక పాతరాతి కోటా,
టవరు బ్రిడ్జి కింద మురిగిన థేమ్సూ
ఏ మౌని పుంగవుడికీ దారిచూప సాధ్యం కాక
ఉపసంహారం లేని శాశ్వత శాపంలా ఉంటాయి!
లండన్ నగరపు నడిబొడ్డులో
చిరిగిన బొంతల మీద
విరిగిన మనసులతో
నిర్లక్ష్యంగా నిద్రపోతుంటారు
అత్యాధునాతన యువతీ యువకులు!
ఆ నగరపు గత వైభవాల మీద
ఏమీ శ్రద్ధ లేనట్టూ!
దాని భావి మీద వారికేమంత ఆశ లేనట్టూ!
అన్నీ పోగొట్టుకున్నట్టున్న వర్తమానం మీద
అసలే ఇష్టం లేనట్టూ!!
పరుగులు పెడుతూ నిర్విరామంగా
లండన్ నగరం నిద్రనెరగదు!
దొమ్మీలతో ఖూనీలతో రాత్రిలో కూడా
దాన్నిండా… అంతా కలకలమే!
నిత్య నైమిత్తికాల దాని జీవితం నిండారి అల్లకల్లోలమే!
మళ్ళీ…
నగరపు అంతరంగం నిండా తెలియని ఒకానొక ఒంటరితనమే
చరిత్రకి దానితో విడలేని ఒక అనుబంధముంది!
ఆధునికత దానిని వదలలేని ఒక వ్యసనమైంది!
యంత్ర నాగరికత వల్ల ఆవహించిన
ఈ రెండు నీడల మధ్యా …
లండన్ భయసంశయంగా వుంది!!
లండన్ నగర దృశ్యాలు –
ఒకసారి శీతల వివర్ణ చిత్రాలు!
ఒకసారి వాసంత వ్యాఖ్యానాలు !
మరొకసారి శిశిర సంచలనాలు !!
ఎప్పుఢూ చిత్రకారులనీ కవులనీ ఆకట్టుకునే
మాంత్రిక దండం లండన్ !
నిన్నా నేడుల కలియని రంగుల కూడిక లండన్!
శృతి జారిన విపంచికలా లండన్!
మిల్టన్ కవితా సంచికలా లండన్!!
బ్రిటిషు మ్యూజియమైనా
బ్రిటిషు పుస్తక భాండాగారమైనా
ఇంగ్లీషు హృదయానికి అనర్ఘదర్పణంలా కన్పిస్తాయి
శ్వేత నాగరికతకి దీప ప్రతిబింబంలా నిలుస్తాయి!
లండన్ నగరం – నిన్నటి జనపదం
లండన్ నగరం – నాటకశాలలకి ప్రాకటం
లండన్ నగరం – పలుజాతుల పచ్చల నాగరం
అది, అతిసంక్లిష్ట మానవ మానస సాగరం!
లండన్ నగరపు నాడుల్లో – అంతటా
ఒక వర్ణనాతీతమైన అసహనం!
నగరపు శిఖపై వ్యాపించిన నీల నీరంధ్రగానం!
లండన్ నగర విశేషమే దాని ప్రాక్తనం!!
17.11.2001
( జయప్రభగారి ” ది పబ్ ఆఫ్ వైజాగ పట్నం ”    కవితా సంపుటి నుంచి)
వులు, రచయితలు యాత్రలు చేసినపుడు తమ యాత్రానుభవాలను వ్యాసాలుగా, కథలుగా, కవితలుగా రాయడం మనకు తెలుసు. ఈ అన్ని ప్రక్రియల్లోనూ వచ్చిన రచనలన్నిటినీ కలిపి స్థూలంగా యాత్రాసాహిత్యం అంటున్నాం. ఈ యాత్రా సాహిత్యంలో యాత్రా కవితలు ( travel poems) ఒక ముఖ్యమైన భాగం.
ఈ కవితను యాత్రాకవితగా భావించవచ్చు. తాము చూసిన లండన్ నగరాన్ని దృశ్యాలు దృశ్యాలుగా రూపుకట్టి మన కళ్ళముందు పరిచారు కవయిత్రి. కవితాత్మక వ్యాఖ్యలూ చేశారు.
” పాత వంతెనల కిందుగా
రవాణా పడవలు జార్చిన
చమురు తెట్టు తేలుతూ
థేమ్సు నదీజలాలు –
పురాతన నగరాన్ని తళతళా
ప్రతిబింబిస్తుంటాయి
పగలూ రాత్రీ! “
“సంప్రదాయానికి నిత్య నైవేద్యం పెడుతూ
వరుసతీరి భక్తితో నుంచు నుంటాయి
నగరం నిండా పాత పాత కట్టడాలు!
పెంకులద్దిన ఇంటికప్పులు పైనుంచి చూస్తే
పగడపు ధూళి పైకి లేచి
పట్టణాన్ని ముట్టడించినట్టు!”
లండన్ నగరం మీదే కాక, మొత్తం ఇంగ్లీషు సమాజం మీదా పరిశీలనాత్మక వ్యాఖ్యలు చేశారు.
” పాతదనం మీదా… రాచరికం మీదా…
మోజును వదులుకోలేని ఇంగిలీషు సమాజం
తన రెండడుగుల్లోనూ ఒక అడుగుని
వెయ్యేళ్ళ వెనకే వుంచుకుని
ఒంటికాలి నడకతోనే …
నలుగురి కన్నా తాను ముందున్నట్టనుకుంటుంది!”
**
లండన్ నగరంలో “ప్రాచీనత్వం ఘనీభవించి ఉందని”, ఈ నగరం “అసంబద్ధమైన ఆధునికతను ముఖంమీద అరువుగా అద్దుకుని ఉందని ” ఈ కవయిత్రి అభిప్రాయం.
ఇంకా, ఈ నగరంలో ఒకదానికొకటి పొసగనితనాన్ని గుర్తించారు. ఈ కవిత శీర్షిక: “నిన్నానేడుల కలియని రంగుల కూడిక – లండన్” కూడా ఈ విషయాన్నే బలంగా చెబుతున్నది. ఏమిటా పొసగనితనం? ప్రధానంగా అక్కడి ప్రాచీనతకు, ఆధునికతకు పొసగకపోవడం అనిపిస్తుంది.
మరిన్ని అంశాలను చెప్పడానికి ట్రఫాల్గర్ స్క్వేర్ ను ఒక దృష్టాంతంగా తీసుకున్నారు కవయిత్రి.
“పాత రాతి భవనాల మీదా… పావురాళ్ళ మీదా
తెల్లవాళ్ళకంత మక్కువెందుకో!!
ట్రఫాల్గర్ స్క్వేర్ లో
సోమరిగా కూచుంటాయి నల్లరాతి సింహాలు!
ఎగరలేనంతగా బరువు పెరిగి వుంటాయ్
నీలి పావురాలు !!
బహుశా అవి
హాహా హూహూ కి అంతరంగనేస్తాలో
హింసాహింసలకి అనుభావాలో
సార్వభౌమ్యానికి సామ్యవాదానికి అనుసంధానాలో ?! “
ఇక్కడ నల్ల రాతి సింహాలకు, నీలి పావురాలకూ మధ్య సామ్యమూ, పొసగనితనమూ రెండూ కనిపించాయి కవయిత్రికి. సోమరిగా ఉండడం, ఎగరలేనంతగా బరువు పెరిగి ఉండడం – సామ్యాన్ని సూచిస్తున్నాయి. అంతేకాదు , అవి  ” హాహా హూహూ కి అంతరంగ నేస్తాలు ” గా కూడా కనిపించాయి కవయిత్రికి.
” హాహా హుహూ” అనేది విశ్వనాథ సత్యనారాయణగారి నవల పేరు. నవల అంతా లండన్ కేంద్రంగా సాగుతుంది. ఈ నవలలో “హాహా హూహూ “- ఒక గంధర్వుని పేరు. అతనికి గుర్రం తల, మనిషి శరీరం, పక్షి రెక్కలు ఉంటాయి. వింత ఆకృతితో ఉంటాడు. సోమరిగానూ, ఎగరలేని పరిస్థితిలోనూ ఉంటాడు. అధిక్షేపంతో కూడిన మాటలు మాట్లాడతాడు. “హాహా హూహూ” అంతరంగాన్ని  అక్కడి సింహంలో, పావురాళ్ళలో గుర్తించారు కవయిత్రి!! అందుకే వీటిని హాహా హూహూ కి “అంతరంగ నేస్తాలో ” అన్నారు. ఇక్కడ కూడా ఒక సామ్యం ఉంది.
ఇంకా ఈ సింహం, పావురం – హింస అహింసా భావాలను తెలిపే ముఖచిహ్నాలుగానూ; సార్వభౌమ్యానికి, సామ్యవాదానికి అనుసంధానాలుగా కూడా కనిపించాయి కవయిత్రికి. ఇక్కడ పొసగనితనం ఉంది.
ఏ కవి అయినా తాము చూసిన దృశ్యాల  ఆధారంగానో, గమనించిన విషయాల ఆధారంగానో ; లేదా ఆ నగరం గురించి చేసిన అధ్యయనం ద్వారా ఏర్పడి ఉన్న అభిప్రాయాల  ఆధారంగానో వ్యాఖ్యలు చేస్తారనుకుంటాను. అయితే ఇవే అంతిమం కావని మనకు తెలుసు…. ఏ యాత్రా కవితకైనా ఈ పరిమితులు తప్పవు.
**
” బ్రిటిష్ మ్యూజియమైనా
బ్రిటిష్ పుస్తక భాండాగారమైనా
ఇంగ్లీషు హృదయానికి అనర్ఘ దర్పణంలా కన్పిస్తాయి
శ్వేత నాగరికతకు దీప ప్రతిబింబంలా నిలుస్తాయి!”
బ్రిటిష్ మ్యూజియం, బ్రిటిష్ లైబ్రరీ శ్వేతజాతి హృదయాన్ని, ఆత్మను పట్టిస్తాయి అంటున్నారు. ఏదైనా పరదేశానికి వెళ్ళినపుడు – అక్కడి మ్యూజియంలను, లైబ్రరీలను ఎందుకు సందర్శించాలో ఈ వాక్యాలు చెప్పక చెబుతున్నాయి. లండన్ జనజీవనంలోని భయసంశయాలను, అసహనాన్ని కూడా గుర్తించారు కవయిత్రి. అయితే వీటిని కవయిత్రి, లండన్ లో పర్యటించిన కాలం నాటి పరిస్థితులుగా మాత్రమే చూడడం సబబనిపిస్తుంది. చివరగా లండన్ నగరాన్ని  “అతి సంక్లిష్ట మానవ మానస సాగరం ” అన్నారు కవయిత్రి.
అతి సంక్లిష్టమైన మానవుని మనస్సు అనెడి సముద్రంతో లండన్ నగరాన్ని పోల్చారు. ఇది అత్యంత కవితాత్మకమైన అభివ్యక్తి అని వేరే చెప్పాలా?
*

మంత్రి కృష్ణ మోహన్

3 comments

Leave a Reply to Dr PBDVPRASAD Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఈ కవితను సమీక్షించాలంటే సమీక్షకుడికి చాలా సమాచారం తెలిసి ఉండాలి అనేది కృష్ణమోహన్ తేట తెల్లం చేశారు. మంచి కవిత చక్కని సమీక్ష

  • మంచి కవిత మాత్రమే కాక సమీక్ష అవసరమైనది కూడ. చారిత్రిక నేపథ్యం హాహా హూహు వీటిగురించి కృష్ణమోహన్ మంచి వివరణ ఇచ్చారు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు