నిద్ర లో కలవరింత లాంటి జీవితం!

70లలో వొక నవల “జీవితం ఏమిటి”, కకుభ వ్రాసినది బాగా పాప్యులర్. అది చదివాను కూడా. కానీ ఇప్పుడు ఏమీ గుర్తు లేదు. జీవితమంటే ఏమిటో అప్పుడు అర్థమైనట్టూ లేదు. అప్పుడు కాదుగాని ఇప్పుడు తలచుకుంటే బలహీనమైన నవ్వు వస్తున్నది.

చార్లీ చాప్లిన్ తన చిత్రాలలో వో కంటితో మనల్ని నవ్విస్తూనే మరో కంటితో ఏడిపిస్తాడు. బహుశా ఈ మాట శ్రీశ్రీ చెప్పాడనుకుంటా. ఈ కరోనా కల్లోల కాలంలో చాప్లిన్ బాగా గుర్తుకొస్తున్నాడు. అన్నీ కూడేసి, భయం-బాధలను రద్దుచేసుకున్నాననుకుంటూ, భద్రతావలయం మధ్య బతుకుతున్నాననుకుంటున్న మనిషికి ఇప్పుడు ఆ వలయం మాయమై వో అగ్ని శిఖ చుట్టూతా మండుతూ కనిపిస్తోంది. కరచాలనాలు, ఆలింగనాలు రద్దయ్యాయి, కాలేదు కూడా. కరోనా మీద జోకులకీ, కార్టూన్లకీ నవ్వుకుంటూనే, ఆ వార్తలకి అంతే భయపడుతున్నాడు మనిషి. బాధ కలిగించే విషయం ఏమిటంటే కరోనా కంటే తర్వాతి కూడు గురించి, నీడ గురించి బెంగటిల్లుతున్న సంచారి పిల్లని చంకనెత్తుకుని, మూట నెత్తిన బెట్టుకుని సహచరితో మైళ్ళ కొద్దీ నడుస్తూ వున్నాడు. కాస్త చూపుని మరో పక్క సారిస్తే మనుషులు ముసుగుల్లో ఎడం ఎడంగా వొకరి మీద మరొకరు నమ్మకం లేనట్టుగా మసలుతూ కనిపిస్తున్నారు. అంతా వో సుర్రియలిస్టిక్ చిత్రం లా వుంది.

జీవితం లో ఏ అడుగుకా అడుగున అంతా తెలిసిపోయింది అనిపిస్తూ వుంటుంది. మరో అడుగు ముందుకెయ్యగానే ఆ తెలిసినది తప్పయిపోతుంది. మనిషికి మనిషి అర్థం అయినట్టే వుంటాడు. మరుక్షణం తనకు తానే పరాయిగా కనిపిస్తాడు. తన ముందో వెనకో పడుతున్న నీడ కూడా చీకటి రాత్రుళ్ళలో దోవ తప్పిస్తుంది. చివరకు మిగిలేది చదివినా చివరికి మిగిలేది ఏమిటో అంతు బట్టదు. ఎందుకంటే మనిషి ఆ పాత్ర జీవితాన్ని vicariously జీవిస్తాడు. సొంత అనుభవం కానిదేదీ నిలుస్తుందని నమ్మకం లేదు. అలాగనీ సొంత అనుభవం కూడా మనకు దారి దీపం అవుతుందని కూడా లేదు. కళ్ళు మూసుకుని మఠం వేసుకుని కూర్చుని, లోపలి ఆరు శత్రువులనీ ఆరు బుడగలుగా చేసి మానసికాశంలో ఎగరేసినా, ఏ పూట కా పూట పరగడుపే. అయిపోయింది అనుకోవడానికి లేదు. మనిషి బుధ్ధుడయ్యే దాకా వెతుకులాట తప్పదు.

ఈ తడుములాటలో కొందరు చిటికెన వేలు అందిస్తారు పట్టుకొమ్మని. రమణ మహర్షి వేలు పట్టుకుని నడుస్తూ వుంటే సంభాషణంతా ఆయన అడిగేది ఒక్కటే : నువ్వెవరు? నడిచి నడిచి అలసిపోవడమే తప్ప ఏదీ అందిందని రూఢీగా చెప్పలేము. రైలు ప్రయాణంలో గమ్యం వచ్చాక దిగినట్లు. అంతే. అక్కడి నుంచి రైలు తిరుగు ప్రయాణం. అది మజిలీ కాదు. ఆదీ కాదు. అంతమూ కాదు. పరీక్షా పత్రంలో వో ప్రశ్న ఎదురవుతుంది. జవాబు తెలిసినదే. నాలుక చివరనే వుంది. చప్పున అక్షరాలు తొడుక్కుని ముందుకు రాదు. ఎవరన్నా చిన్న సూచన అందించినా గట్టెక్కవచ్చు. అబ్బే.

నేను వున్నాయనుకున్న వలయాలు అదృశ్యమయ్యాయి. ఇప్పుడు నేనే వో వలయాన్ని గీసుకుని దాని లోపలే తిరుగాడుతున్నాను. తిండి, నిద్రా, మైథునాలు. చిన్న చిన్న సంతోషాలు. చిన్న చిన్న భయాలు. ఎంతో విశాలం అనుకున్న ప్రపంచం ఏమిటి ఇంత కుదించుకు పోయింది?

అంతా అర్థం అయినట్టే వుంటుంది. అంతా అయోమయంగానే వుంటుంది. ఎలా అంటే చిన్నప్పుడు చూసిన చిత్రం “జ్యూవల్ తీఫ్” లాగా. ఆ పట్నంలో విలువైన ఆభరణాలు దొంగతనం అవుతుంటాయి. పోలీసులు నేరస్తుడిని పట్టుకోలేకపోతున్నారు. అతన్ని వెతికి పట్టుకునే పని వినయ్ పాత్రలో దేవ్ ఆనంద్ మీద పడుతుంది. దారిలో ఎదురవుతుంది వైజయంతి మాల, కన్నీటి సంద్రంలో విడిచి పెట్టి వెళ్ళిపోయింది తన కల అని పాడుతో. నీటి మీద నావలో, వెన్నెట్లో ఒక్కతే పాడుకుంటూ వెళ్తున్న ఆమె వో మార్మిక గాథలా తోస్తుంది. వెంట పడకా తప్పదు, ప్రేమలో పడకా తప్పదు. ఆ మోహం, ఆ మర్మం అలాంటివి. వొక పార్టీలో ఒక పాత్ర వినయ్ పాత్రలో వున్న దేవ్ ఆనంద్ ని అమర్ గా పొరబడుతుంది. అక్కడినుంచి ఆ అమర్ ఎవరో తెలుసుకోవాలని, అతన్ని పట్టుకుంటే నేరస్తుడు దొరికినట్టేననుకుంటాడు వినయ్. ఈ కథ నడుస్తూ వుంటే అర్థం అయ్యేది ఏమిటంటే తనలాంటి మనిషే ఎవరో అమర్ అని వున్నాడు, చాలా తెలివిగా దొంగతనాలు చేస్తున్నాడు; అతని కారణంగానే ఇప్పుడు పోలీసులు కూడా తనని అనుమానంగా చూస్తున్నారు. అతన్ని ఎంతొ తొందరగా పట్టుకుంటే అంత తొందరగా రహస్యం చేదించబడుతుంది. ఆ పాత్రలో ఉత్కంఠ, చూసే వాడిలోనూ ఉత్కంఠ. రహస్యానికి చాలా దగ్గరగా వెళ్ళాననుకుంటున్న సమయంలో వినయ్ అడుగుతాడు వైజయంతి మాలని, “మరి ఆ అమర్ సంగతో?”

ఆమె అతన్ని విస్మయంగా చూస్తుంది. “ఇంకా తెలీదా?” అడుగుతుంది.

భృకుటి ముడివేసి అడుగుతాడు ఏమిటని.

ఒక్క క్షణం మౌనం తర్వాత అంటుందామె, ఇదంతా నాటకం, నిన్ను ఉచ్చులో బిగించాలని పన్నిన వల, అమర్ అంటూ అసలెవరూ లేరు”.

అదే కథ లో సస్పెన్స్.

చూసి ఇన్ని దశాబ్దాలైనా ఆ సన్నివేశం వచ్చే క్షణం నా కళ్ళముందు నిలిచిపోయింది. అప్పటి నా విస్మయం కూడా బలంగా ముద్ర పడిపోయింది. చిత్రాన్ని రెండో సారి చూసినా, మొత్తం వో సారి గుర్తు చేసుకున్నా ఎలాంటి వలో అర్థమవుతుంది.

సరిగ్గ ఇప్పటి లాగే. “తెలీదా?”

సరిగ్గా ఎప్పటి లాగే. “ఎలీదా?”

నదిలో దిగి నీటిని దోసిట్లో పట్టుకుని ఇదేనా అనుకుంటాను. వేళ్ళ సందుల్లోంచి జారిపోయి ఏదీ అనుకుంటాను. నదిలో మాత్రం మార్పు వుండదు.

ఇప్పటికీ సందేహమే.

నిద్దట్లో కలవరింతా?

డెమెన్షియా లో ప్రేలాపనా?

ఇది మాత్రం ఎప్పటికీ అంతుపట్టదు.

    *

పరేశ్ దోశి

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • The seemingly unseen is the enchantment of human mind.But the eternal Truth shall shine high upon the universe.Truth-Love. We may name it Gid,call it Guru,feel it as Parents love or give it to our children as affection.yet all is one.One is All.
    This essay showed me this sir. The unflinching light at the end of the lamp.thankyou for showing me myself.yes Jewel thief I understand now as the other self we search for which is infact our counter part. Thankyou.

  • A very thought provoking article which makes the reader gripe into the dark secrets of ones own and arrive at the opposite of ones own.thankyou

  • ఇది ఇంచుమించు అందరం అనుభవిస్తున్న క్షణాలు .ఒంటరి జీవితం ఖాయం అని స్థిరపడినవారికి పెద్ద మార్పులు ఉండవు . సంఘజీవులకు యాతన తప్పదు .ఆదీ కాదు ,అంత్యమూ కాదు ,మజిలీ మాత్రమే .చాలా బాగా చెప్పారు .Jewel Thief సినిమాలో పాటలు తప్ప మరేం గుర్తులేవు .మీరు కనెక్ట్ చేసిన తీరు బాగుంది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు