నిజానికి దేశ ఐక్యతకి హిందీనే కావాలా? 

సాధారణంగా భాష లక్ష్యం ఎప్పుడూ మనిషి నుండి మనిషికి, ఒక సమూహం నుండి మరొక సమూహానికి వివిధ స్థాయిలలో ఒక వర్తమాన సాధనంగా పనిచేయటమే.  అయితే ఈ వర్తమానం (కమ్యూనికేషన్) రెండు వైపులా సమాన స్థాయిలో జరగటమే న్యాయం.  ఒకరికి అదనపు ప్రయోజనం కలిగించేలా, మరొకరికి ఇబ్బంది కలిగించేలా స్టేట్ పాలసీ వుండకూడదు.  మరీ ముఖ్యంగా తన రోజువారీ భాష కంటే మరో భాష ఆధిపత్యం చెలాయించేలా వ్యవహరిస్తున్నప్పుడు అది ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం కూడా అవుతుంది.

****

మొన్నామధ్య “హిందీ దివస్” సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షా “ఒకే దేశం ఒకే భాష” అనే నినాదం ఇచ్చినప్పుడు హిందియేతర ప్రాంతాలన్నీ ఉలిక్కిపడ్డాయి.   దేశంలో కేవలం 43.5% మంది మాట్లాడే హిందీని జాతీయ భాషగా గుర్తిస్తే కోట్లాదిమంది మాట్లాడే ప్రతి హిందీయేతర భాష తమ స్వంత రాష్ట్రాల్లోనే ఒక ద్వితీయ శ్రేణి భాషగా చూడబడుతాయనేది ఒక వాస్తవిక భయం.   అసలు భారతదేశం వంటి వైవిధ్యపూరిత సాంస్కృతిక రూపురేఖలున్న దేశానికి ఒక జాతీయభాష అవసరమా అనేది ఒక మౌలికమైన ప్రశ్న.  చరిత్ర ఒత్తిడులకి, ఘర్షణలకి తట్టుకోగలిగిన ఒక సంస్కృతి భాష ద్వారానే తన చరిత్రని, జీవనాన్ని సాహిత్య రూపంలో, పరిశోధనాత్మక గ్రంధాల రూపంలో రికార్డ్ చేసుకుంటుంది.  నిక్షిప్తం చేస్తుంది.  మరి ఒకే భాష వుంటే అన్ని భాషల సరస్వతానికి సమాన విలువ ఎలా దక్కుతుంది?

భారతదేశమే భౌగోళికంగా, సాంస్కృతికంగా, జాతుల పరంగా, భాషల పరంగా ఒక చిత్రమైన దేశం.  దీనినే మనం “భిన్నత్వంలో ఏకత్వం” అని వర్ణిస్తాం.   ఈ దేశంలో నివశించే అన్ని ప్రాంతాల, జాతుల ప్రజలు నిజంగానే ఆనందంగా, స్వచ్చందంగా కలిసి వుంటున్నారా అనేది పక్కన పెడితే ఈ కలయిక లేదా సహజీవనం అతి సున్నితమూ, సంక్లిష్టమూ అని గ్రహించాల్సిన అవసరం వుంది. ఎందుకంటే  జాతి, సంస్కృతి, భాష…ఇవన్నీ మనిషి సామాజిక జీవితంలో ఆత్మగౌరవంతో కూడిన సంకుచితత్వం లేని అస్తిత్వ ప్రకటనలు.   ఈ విషయం గుర్తించకుండా ఈ మూడు అంశాలకి ఎసరు పెట్టాలని చూస్తే కేవలం దేశం అనే భౌగోళిక సెంటిమెంట్ ఒక్కటే దేశ ప్రజల్ని ఐక్యంగా వుంచలేదు. మనిషిలో సహజంగానే కబళించే స్వార్ధం ఎంతుంటుందో తనని తొక్కిపెట్టే శక్తులపై ధిక్కారంతో తిరగబడే తత్వం అంతకంటే ఎక్కువే ఉంటుంది.  ప్రతి స్వాతంత్ర్య పోరాటానికి బానిసత్వాన్ని భరించలేని మానవీయ ఆత్మగౌరవమే ముఖ్య కారణం.  ప్రజల అంగీకారం, సహకారం లేకుండా దేశం పేరుతో ఏ అంశాన్ని ముందుకు తెచ్చినా పరాభవం తప్పదు.

****

1960వ దశకంలోనే ఒక మొరటైన పద్ధతిలో ఏకైక అధికార భాష అనే పేరుతో హిందీ ఆధిపత్యం కోసం ప్రయత్నించినప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో పెద్ద అలజడి రేగింది.  తమిళనాడైతే భగ్గుమన్నది.  ఆ దెబ్బకి కొంత వెనుకంజ వేసారు.  రాజ్యాంగం ఇంగ్లీష్ తో పాటు హిందీ ని కూడా అధికారిక భాషగా గుర్తించినందున ఆ ముసుగులో హిందీ ఆధిపత్య ప్రయత్నాలైతే ఆగలేదు.  అప్పటివరకు అనేక సంస్థానాలుగా, ముక్కలు ముక్కలుగా వున్న దేశానికి స్వాతంత్ర్యం వచ్చినె తరువాత అందరూ ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతంకి వలసలు వెళ్లి ఆర్ధికంగా వెసులుబాటు కల్పించుకోవాలంటే ఒక లింక్ లాంగ్వేజ్ అవసరం అని అప్పటి నెహ్రు ప్రభుత్వం భావించింది.    ఇంగ్లీష్ తో పాటు హిందీని కూడా అధికార భాషగా గుర్తిస్తూ రాజ్యాంగ సవరణలు చేసింది.  ఇంగ్లీష్ ని కూడా అధికార భాషగా గుర్తించటాన్ని ఇప్పటి బీజేపీ పూర్వ రూపమైన జనసంఘ్ పార్టీ అధ్యక్షుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ తీవ్రంగా తప్పు పట్టాడు.  అప్పట్లో ఇంగ్లీష్ ని హిందీ ఒక పదిహేనేళ్ల కాలంలో అధికార వ్యవహారాల్లో రీప్లేస్ చేయగలదని నెహ్రూ ప్రభుత్వం భావించినప్పటికీ అది సాధ్యం కాలేదు.  ప్రజల మధ్య సాంస్కృతిక ఏకత్వం లేనప్పుడు ఎలా కాగలదు?  భిన్నత్వం అని మనమే ఢంకా భజాయించి చెప్పుకుంటున్నాం కదా మరి!

****

హిందీ!  ఇప్పుడు హిందీ తెలుగు తమిళం, మళయాళం, కన్నడ వంటి మరో భాష కాదు. హిందీ భాషగా కంటే ఒక సంస్కృతిగా దూసుకొస్తున్నది.  హిందీని దేశ వ్యాపితం చేయటం కోసం జాతి ఐక్యత వంటి భారీ ఎమోషనల్ డైలాగులు వాడటంతో పాటు, భిన్న ప్రాంతాల, సంస్కృతులకు చెందిన ప్రజల మధ్య ఒక వారధిగా ప్రచారం చేయటం జరుగుతున్నది.   కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అందరూ హిందీనే మాట్లాడాలన్న తమ పురాతన లక్ష్యం నెరవేర్చుకోవటం కోసం రాజ్యాంగానికి సవరణలు చేసే ఆలోచనలు కూడా చేస్తున్నారు.   హిందీ భాష ద్వారా ప్రజల మధ్య ఐక్యత సాధించటం గురించి మాట్లాడితే అయితే అది ఏ రకమైన ఐక్యత?  భాష ద్వారా ద్వితీయ శ్రేణి పౌరులుగా బతకటానికి సిద్ధపడి స్వీయ అస్తిత్వానికి ముప్పు తెచ్చిపెట్టుకునే ఐక్యతా?  !

హిందీయేతర ప్రాంతాలపై హిందీ మాట్లాడే ప్రాంతాల సాంస్కృతిక ఆధిపత్యం నిజానికి కొత్తది కాదు.  భారతదేశ చరిత్ర అంటే హిందీ ప్రాంతాల చరిత్రే అన్నట్లుగా వుంది.  భారతదేశ సంస్కృతి అంటే హిందీ ప్రాంతాల సంస్కృతే.  సాహిత్యమంతా వారిదే.  మహా అయితే వంగ వాసులు గట్టివారు కనుక వారి నుండి తప్పనిసరిగా టాగోర్ వంటి వారిని గుర్తిస్తారు.  ఇంక దక్షిణాది నుండి అయితే హిందీ ప్రాంత ప్రజలకి తెలిసిన సాహితీవేత్తలు ఒక్కరూ లేరు.  అసలు మన స్వాతంత్ర వీరుల గురించి కూడా హిందీ ప్రాంత ప్రజలకి ఏమీ తెలియదు. ఒక్క పేరు తెలియదు.  మన సినిమా నటులు కూడా తెలియదు.  ఇంక మన గొప్ప సంగీత కళాకారులు, పెయింటర్స్, సాహితీవేత్తలూ బొత్తిగా తెలియదు.  నేను ఎన్నో సార్లు హిందీ ప్రాంతాల్లోని ప్రజలతో సంభాషించాను.  వాళ్లను నేను అడుగుతుంటాను.  “మీకు అల్లూరి సీతారామరాజు తెలుసా? శ్రీశ్రీ తెలుసా? అక్కినేని తెలుసా? ఎస్. జానకి తెలుసా? ఘంటసాల తెలుసా? (ఒక్క బాలు, జేసుదాస్ మాత్రం తెలుసు.  హిందీ పాటలు పాడారు కాబట్టి) వాళ్లకి ఒక్కరు కూడా తెలియదు.  వాళ్లకు అసలు ఇవన్నీ ఏవీ తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు.  వాళ్లకి భగత్ సింగ్ తెలిస్తే చాలు.  అల్లూరి తెలియాల్సిన అవసరం లేదు.  వాళ్లకి ప్రేం చంద్ తెలిస్తే చాలు.  కొ.కు. తెలియాల్సిన అవసరం లేదు.  మనం అందరం ఏదో మదరాసీలం. అంతే వాళ్లకి.  అంతకు మించి మన ప్రత్యేకతలేమీ లేవు వాళ్లు తెలుసుకోవటానికి.  నా పాయింట్ ఏమిటంటే నా కొ.కు.ని నువ్వు చదవాల్సిన అవసరం లేనప్పుడు, కనీసం పేరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం లేనప్పుడు – నీ ప్రేంచంద్ మాత్రం నాకెందుకు?  విస్తారమైన, అపరూపమైన, అద్భుతమైన సాహిత్యం కోట్లాదిమంది ప్రజలు మాట్లాడే అన్ని హిందీయేతర భాషల్లోనూ వచ్చింది.  మీకు అంతగా గొప్ప సాహిత్యం అందరికీ చేరాలనిపిస్తే అన్ని భాషాల సాహిత్యాల్ని ఇతర భాషల్లోకి అనువాదాలు చేసి ప్రజల్లోకి పంపించండి.  తెలియాల్సింది సారస్వతమే కానీ భాష కాదు కదా!   రూపాయి నోటు మీదున్న పద్నాలుగు భాషల్లో ప్రతి భాషకి అది ఏర్పడటానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర వుంది. అవి హిందీ కంటే అత్యంత ప్రాచీనమైనవి.  వాటి మీద మీ బోడి ఆధిపత్యం ఏమిటి?

బీజేపి మాజీ ఎంపి తరుణ్ విజయ్ “భారతదేశంలో జాత్యహంకారం లేనే లేదు,  వుంటే నల్లగా వుండే దక్షిణాది వారితో మేమెలా సహజీవనం చేయగలం?” అన్నాడు. ఇది నిజానికి ఉత్తర భారతీయుల ఆలోచనా విధానానికి ఉడికిన అన్నం మెతుకు వంటిది.  దక్షిణ భారతీయుల పట్ల ఒక చులకన భావం.  వాళ్ల సినిమాల్లో, టీవీ యాడ్లలో దక్షిణాది వాళ్లెప్పుడూ కమెడియన్సే లేదా మూర్ఖులే.  అమితాభ్ వేసిన “అగ్నిపథ్” నుండి సారుక్ చేసిన “చెన్నై ఎక్స్ప్రెస్” వరకూ చూడండి. మన దక్షిణాది కట్టు బొట్టుల్ని వేళాకోళంగా చూపిస్తుంటారు.  ఇప్పుడు వీళ్లకి ఈ దాష్టీకం చాల్లేదు కాబోలు, హిందీని జాతీయభాషగా రుద్దాలని చూస్తున్నారు.

అసలు అమిత్ షా మొన్న ఏదో స్టేట్మెంట్ ఇచ్చి హడావిడి చేసేంతవరకు హిందీ ప్రాంతం వారికి కూడా అధికారిక భాషకి, జాతీయ భాషకి తేడా తెలియదు.  అసలు ఇప్పటి వరకు భారతదేశానికి జాతీయ భాష అనేదే లేదంటే వారికి ఆశ్చర్యం కలిగిస్తుంది.  రాజ్యాంగం ఎనిమిదో షెడ్యూల్లో 22 భారతీయ భాషల్ని పొందుపరుచుకుంది.  అవి అస్సామీ, బెంగాలి, గుజరాతీ, హిందీ, కన్నడ, కాశ్మీరీ, కొంకణి, మళయాళం, మణిపురి, మరాఠి, నేపాలీ, ఒడియా, పంజాబి, సంస్కృతం, సింధి, తమిళ్, తెలుగు, ఉర్దు, బోడో, సంథాలి, మైథిలి, డొగ్రి,  వీటిలో హిందీ మినహా మిగతా 21 భాషలు మాతృభాష గలవారికి, ఇంకా లిపి లేని అనేక వందల భాషల వారికి ఇప్పుడు హిందీ ద్వారా ప్రమాదం ఎదురు కాబోతున్నదన్నదనే అనిపిస్తున్నది.  మేం ఏ భాష యొక్క హోదాని తగ్గించటం లేదుగాబట్టి ఇంక ప్రమాదమేముంది అని ప్రశ్నించవచ్చు.  కొన్ని ప్రశ్నలకి వెంటనే సమాధానాలు దొరకవు.   ఆ ప్రమాదాలు కాలక్రమంలో అస్తిత్వాన్ని కోల్పోయే విషాదంగా పరిణమిస్తాయి.  ఆ 22 భాషల్లో సంస్కృతం, హిందీకి (దేవనాగరి లిపి) దగ్గరగా వుండే ఉత్తర భారత, పశ్చిమ భారతానికి చెందిన ప్రాంతీయ భాషల వారికి హిందీ జాతీయ భాషగా వుండటం ఆమోదయోగ్యం కావొచ్చు.  ఆయా రాష్ట్రాల వారి భాషలకి, సంస్కృతికి మధ్య పెద్ద తేడా వుండకపోవచ్చు.  కానీ ఖచ్చితంగా ద్రవిడ సంస్కృతి, భాష మూలాధారంగా వున్న దక్షిణ భారత రాష్ట్రాల భాషలకి హిందీతో ఖచ్చితమైన పేచీ వున్నది.  ఒక కల్చరల్ ఎక్స్చేంజ్, లాంగ్వేజ్ ఎక్స్చేంజ్ లేకుండా కేవలం ఒక ఉత్తరాది భాషని దేశంలోని మిగతా ప్రాంతాల వారందరూ మాట్లాడాలని శాశించటం లేదా హిందీ మాట్లాడేవారికి అధిక ప్రయోజనం కలిగేలా వ్యవహరించటం హిందీయేతర ప్రాంతాల హక్కుల్ని దెబ్బ తీయటమే కాగలదు.

దేశం అంతా హైస్కూలు స్థాయిలో త్రీ లాన్వేజి ఫార్ములా వుంది కదా ఇక్కడ మీకు హిందీ పట్ల ఏమిటి అభ్యంతరం అనొచ్చు ఎవరైనా!  కానీ పాఠ్శాల స్థాయిలో “త్రీ లాంగ్వేజ్ ఫార్ములా” తెనాలి రామకృష్ణ కథల్లోని “తిలకాష్ట మహిష బంధనం” వంటిది.  ఈ పథకం కింద నాన్-హిందీ రాష్ట్రాల్లోవిద్యార్ధులు హిందీ-స్థానిక భాష-ఇంగ్లీష్ ని ఎంచుకోవచ్చు.  అదేవిధంగా హిందీ రాష్ట్రాలలో “హిందీ-ఇంగ్లీష్-ఏదైనా ఆధునిక భారతీయ భాష”ని ఎంపిక చేసుకోవచ్చు. అక్కడ దక్షిణాది భాషల్ని ఎవరు తీసుకుంటారు మనం హిందీ తీసుకున్నట్లు.   సాంస్కృతికంగానే కాదు వాళ్ల భాషలు కూడా చాలా సన్నిహితంగా వుంటాయి కనుక వాళ్లకి త్రీ లాంగ్వేజ్ ఫార్ములా ఇబ్బంది కాబోదు.  కానీ దక్షిణ భారతంలోని భాషలు అన్నీ దాదాపుగా ద్రవిడ కుటుంబానికి చెందినవి.  ద్రవిడ భాషలకి హిందీకి మధ్య ఏనుగుకి దోమకీ వున్నంత తేడా వుంది.  ఎక్కడా పొసగదు.    తమిళనాడు మినహా దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వ విద్యా విధానంలో హైస్కూల్ వరకు హిందీ తప్పనిసరి సబ్జెక్ట్.  కానీ ఉత్తరభారతంలో వాళ్లెవ్వరూ మరే ఇతర “మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్”ని నేర్పే ఊసే లేదు.  అసలా సాధనా సంపత్తి (ఇన్ ఫ్రాస్ట్రక్చర్) లేనేలేదు.  ప్రాంతీయ భాష-హిందీ-ఇంగ్లీష్ వుంటుంది వాళ్లకి. అంటే వాళ్లు మన భాషలు నేర్చుకోరు కానీ మనం చాలా ఖచ్చితంగా వాళ్ల హిందీ నేర్చుకుంటాం అన్నమాట.  మనకి కూడా ఇక్కడ మరో ఆప్షన్ లేనేలేదు.  మనకి ఎంతమంది తెలుగు పండిట్స్ వుంటారో అంతమంది హిందీ పండిట్స్ కూడా వుంటారు.  ఆ రకంగా పాఠశాల స్థాయిలో “త్రీ లాంగ్వేజ్ ఫార్ములాని”  ముసుగు మోసంగా అర్ధం చేసుకోవాలి.

నిజం చెప్పాలంటే ఉత్తరభారతం వారందరికీ హిందీ మాతృభాష కాదు.  బిహార్ వెళ్లినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను.  అక్కడ జిల్లాకొక భాష వుంటుంది.  అన్నీ లిపి లేని భాషలే.  అదే పరిస్తితి మధ్య ప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో కూడా వుంటుంది.  ఒక రాష్ట్ర స్థాయిలో అయినా అక్కడి ప్రజలందరికీ లిపి వున్న ఒక లింక్ లాంగ్వేజ్ అత్యవసరం కాబట్టి హిందీ సహజంగానే ఆ కర్తవ్యం నెరవేరుస్తుంది.  అన్ని ఉత్తరాది రాష్ట్రాల పరిస్తితి దాదాపు ఇదే. కానీ దక్షిణాది పరిస్తితి వేరు.  తుళు వంటి భాషల్ని మినహాయిస్తే అన్ని భాషలకి ఒకే స్క్రిప్ట్ వుంటుంది.  పైగా ఐదు రాష్ట్రాల ప్రజలందరూ (మాతృభాషతో పనిలేకుండా) తమ తమ రాష్ట్ర వ్యాపితంగా ఒకటే భాషని ధారాళంగా మాట్లాడగలరు.  అంటే కర్నాటకలో కన్నడ, తమిళనాడులో తమిళం, తెలంగాణ – ఆంధ్రప్రదేశ్లో తెలుగు, కేరళలో మళయాళం అన్నమాట.  ఈ రాష్ట్రాల్లో భాషా మైనారిటీలు సులువుగానే ఇంటిగ్రేట్ కాగలరు.

****

నిజానికి దేశ ఐక్యతకి హిందీనే కావాలా?  అసలు బలమైన భిన్న సంస్కృతులు, భాషలతో ఎలాగోలా కలిసి బతుకుతున్న ప్రజలకు, వారి మనుగడలకు హిందీ రాకుంటే వచ్చిన నష్టమేమిటి?  ఇప్పుడు సమస్త భారతీయులు హిందీ నేర్చుకొని ఒరగబెట్టేదేమిటి?  భిన్నమైన భాషలు మాట్లాడే దేశాలు చాలానే వున్నాయి.  భిన్న భాషలు మాట్లాడే బెల్జియం, స్విట్జర్లాండ్, కెనడా వంటి దేశాల్లో జాతీయ భాషంటూ లేదు.  కేవలం అధికారిక భాషలే వుంటాయి.  అవన్నీ ప్రజలు మాట్లాడే భాషలే.  మరైతే ప్రజలందరూ సామూహికంగా ఏ భాషలో మాట్లాడుకోవాలి అనేది బలమైన ప్రశ్నలా కనిపిస్తుంది కానీ అది నిజానికి దూదిపింజ కంటే బలహీనమైనది.  ఒక హిందీయేతర ప్రాంతానికి చెందిన వ్యక్తి ఉత్తరాది వెళితే ఖచ్చితంగా హిందీ నేర్చుకుంటాడు.  అలాగే ఒక ఉత్తరాది వ్యక్తి మరో హిందీయేతర ప్రాంతానికి వెళితే అక్కడి ప్రాంతీయ భాష నేర్చుకోవాలి.  మా గుంటూరులో బోలెడంతమంది మార్వాడీలున్నారు.  వాళ్లు అద్భుతమైన తెలుగు మాట్లాడతారు.  ఇక్కడి సంస్కృతిలో కలిసిపోయారు వాళ్లు.  అవసరమే ఒక కొత్త భాషని నేర్చుకునేలా చేయాలి కానీ ఒక సెంటిమెంట్ ముసుగులో అవసరం లేదు.  నేను హిందీ ప్రాంతానికి వెళితే హిందీలో మాట్లాడటం నేర్చుకుంటా.  తాత్కాలికంగా వెళితే అసలు నేనే కాదు ఎవరైనా ఒక కొత్త భాష ఎందుకు నేర్చుకోవాలి?

****

స్వాతంత్రం వచ్చిన  కొత్తలో ఒక లింక్ లాంగ్వేజ్ అవసరం అనిపించేదేమో కానీ ఇప్పుడైతే ఆ అవసరం లేదు.  శాస్త్ర సాంకేతిక అభివృద్ధి తో కూడిన ఆధునిక జీవితం,, ప్రపంచీకరణ, నగరీకరణ కారణంగానూ, అనివార్యమౌతున్న ఇంగ్లీష్ మీడీయం విద్య వల్లనూ దేశంలో ఇంగ్లీష్ భాష ప్రాబల్యం విపరీతంగా పెరిగింది.  ఇంగ్లీష్ వస్తే ఉపాధి దొరికినట్లే అవుతున్నది.  ఇంగ్లీష్ రాకుంటే అదో డిజడ్వాంటేజ్ గా మారే పరిస్తితి ఏర్పడింది.  హిందీ నేర్చుకుంటే ఇక్కడ హిందీ టీచర్ అవటం మినహా వేరే ప్రయోజనం లేదు.  హిందీ వచ్చు కాబట్టి వేరే హిందీ రాష్ట్రం వలస వెళ్లం కదా?  ఇంగ్లీష్ విషయంలో మనం ఉత్తరాది రాష్ట్రాల కంటే ఎంతో ముందున్నాం.  సివిల్స్ లో,అన్ని రకాల ఉవిద్యా, ఉద్యోగ పోటీ పరీక్షల్లో దక్షిణాది వారికి దరిదాపుల్లో ఉత్తరాది వారు లేరు.  గత నాలుగొందలేళ్లుగా ఈ దేశంలో ఇంగ్లీష్ చెలామణిలో వున్నందున ఇంగ్లీషుని దేశభాషల్లో ఒకటిగానే అంగీకరించాలి. ఇంగ్లీషే లింక్ లాంగ్వేజిగా వ్యవహరించగలదు.  పైగా ఇంగ్లీష్ ఇచ్చే ఉపాధి అవకాశాలు హిందీ ఇవ్వలేదు.  ఇంగ్లీషుని లింక్ లాంగ్వేజిగా ఆమోదిస్తూ ఇప్పుడున్నట్లు హిందీ, ఇంగ్లీషులను ఆధికార భాషలుగా కొనసాగిస్తే చాలు.  త్రీ లాన్వేజి ఫార్ములాని రద్దు చేయాలి.

****

హిందీని జాతీయభాషగా ప్రకటిస్తే ఆ ప్రకటన జాతీయవాదం గాను, జాతీయావాదం మెజారిటేరియనిజంగానూ, మెజారిటేరియనిజం ఫాసిజంగానూ పరిణమించటానికి అట్టే కాలం పట్టదని అభిజ్ఞవర్గాల భోగట్టా!

*

అరణ్య కృష్ణ

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఇప్పుడు దాదాపు 32 భాషలు తమకు ఎనిమాదవ షెడ్యూల్ లో గుర్తింపు కోసం డిమాండ్ చేస్తున్నాయి. వాటిలో దాదాపు 22 భాషలు “హిందీ” ప్రాంతానికి చెందినవి

  • Well-presented article. “అవసరమే ఒక కొత్త భాషని నేర్చుకునేలా చేయాలి కానీ ఒక సెంటిమెంట్ ముసుగులో అవసరం లేదు” I completely agree with this. I learnt even English only when I needed it. As part of my work, I traveled in different North Indian states where I could manage with English. Hindi నేర్చుకోవాల్సిన అవసరం రాలేదు. ఇంతవరకు నేర్చుకోలేదు. జాతీయవాద భావనను పెంపొందించేందుకు జాతీయ భాష అవసరం అనే వాదన నాకు ఎంతో అసంబద్ధంగా అనిపిస్తుంది. We speak different dialects within the same state. But still we have the feeling that we are one.

  • ఏ భాష అయినా అవసరం అనిపిస్తే, లేదా నేర్చుకోవాలన్న అభిలాష ఉంటే నేర్చుకోవచ్చు. కానీ కచ్చితంగా ఫలానా భాష నేర్చుకొని తీరాలి అంటే అదొక నియంతృత్వం అవుతుంది. ఇక ఇంగ్లీష్ విషయానికి వస్తే ప్రపంచాన్నే కుగ్రామంగా మార్చేసిన భాష. పెరుగుతున్న టెక్నాలజీ కి ఇంగ్లీష్ తోడై ప్రపంచాన్నే అరచేతిలో చూడగలుగుతున్నాం.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు