నా బల్లి జారి మీ నెత్తిన పడ్డట్టే!

కథా వస్తువు అందరికీ తెలిసినదే కావడం, అందరూ ఇందులో పాత్రధారులు కూడా కావడంతో కొంచెం విభిన్నంగా చెప్పాలని అనుకున్నా.

“Don’t bend; don’t water it down; don’t try to make it logical; don’t edit your own soul according to the fashion. Rather, follow your most intense obsessions mercilessly.”

― Franz Kafka

దే సూత్రం అనుసరించా. సహజంగా కథను లోలోతుల్లోంచి దూకించా. అది దాని లక్ష్యాన్ని అదే వెతుక్కుంటూ, దారులు చేసుకుంటూ ప్రవాహంలా సాగిపోయింది. ఈ నిర్మల ప్రవాహంలో నీటిని దోసిట పడితే, ఎంతోమందికి తమ అసలు ముఖం ప్రముఖంగా కనబడి తీరుతుంది. నాకు మాత్రమే కాదు, మనందరికీ తెలిసిన జీవితాలను-ఎలా కళ్లు మూసుకుని దాటవేయాలని చూస్తున్నామో, అదే ఈ కథ. తెలుగు కథ అనగానే చాలా బరువుగానో, భారంగానో; ఆ ఒక్క కథతోనే పాఠకుడిని మార్చేయాలనే బాధ్యతను భుజాలకెత్తుకునో వుంటుందనీ, వుండాలనే అభిప్రాయాన్ని అసలు పట్టించుకోలేదు. అలాగే, ఈ కథకు స్థలకాలాలు కూడా లేవు. ఎందుకంటే, ఇది ఎప్పుడైనా, ఎక్కడైనా జరుగుతూ వుంటుంది.

రైతులు, శ్రామికులు, కష్టజీవులు; కులంతోనో,ధనంతోనో, కుటుంబంతోనో అణచివేతకు, వివక్షకు గురవుతున్న వారి గురించి చాలామంది కథకులు రాశారు, రాస్తున్నారు. కానీ, వీరిలో చాలామంది ఆయా వర్గాలకు చెందినవారు కాదు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడో, ఇంజినీరో అయి మహానగరాల్లో నివసిస్తున్న రచయిత ఎక్కడో మారుమూల పల్లెటూరులోని రైతు కడగండ్లను, కుల వివక్షను గురించి రాస్తాడు. ఇలా రాయడంలోని మంచిచెడులపై చర్చను అలా వుంచితే, ఈ రచయితల వృత్తి చుట్టూగానీ, వారి సాధారణం జీవితాన్ని పెనవేసుకునిగానీ కథలు ఏమీ వుండవా? అనే సందేహం తలెత్తింది ఓసారి. వుంటాయి కదా, మరి అవెందుకు రాయరు? అనే ఆలోచన అప్పటి నుంచే తొలిచేయడం మొదలైంది. ఆ పని మనం ఎందుకు చేయకూడదు అనుకున్నప్పుడు మన గురించిన ఈ కథ ఇలా వ్యక్తమయ్యింది.

కథా వస్తువు అందరికీ తెలిసినదే కావడం, అందరూ ఇందులో పాత్రధారులు కూడా కావడంతో కొంచెం విభిన్నంగా చెప్పాలని అనుకున్నా. మనం ఇంట్లోకానీ, పని ప్రదేశంలోగానీ, ఏదో పొడిచేస్తున్నామని అనుకుంటున్న సాహిత్యరంగంలోగానీ- మనం.. మనంగా లేమని సాధ్యమైనంత చురుక్కుమనేలా చెప్పడానికి ప్రయత్నించా. గతమెంతో ఘనకీర్తి-అదే, అమోఘమైన ఫ్లాష్ బ్యాక్ వున్న ఎందరో, ఇప్పుడు బల్లులుగా మారిపోవడానికి కారణం-భయం. భయం అంటే కేవలం ప్రభుత్వం నుంచో, పోలీసుల నుంచో ఎదురయ్యే కేసులో, నిర్బంధమో మాత్రమే కాదు. బతకడంలో, పరిగెట్టడంలో, పక్కవారితో పోల్చుకోవడంలో భయం. దీనికి తోడు తాను ఎన్నాళ్లగానో నమ్మిన సామాజిక రాజకీయాల్లో ఎన్నదగిన ముందడుగు కానరాకపోవడం పెనుభయం. ఇన్ని భయాలు నరనరాల్లోకి చొచ్చుకుపోయాక ఇక ఎవడైనా బల్లి కాకుండా తప్పించుకోజాలడు.లోలోపటి ఆ భయాన్ని దాపెట్టి ప్రపంచాన్ని భయపెట్టే డాంబికం ప్రదర్శించకమానడు.

ఈ కథ కేవలం ఏ ఒక్కరిద్దరినో ఉద్దేశించినది కాదు. లోపల్లోపల ఆవేదనను దిగమింగుకుంటూ కొందరు, అసలు అలాంటిది తమ గుండెల్లో వుందని తెలియకుండానో మరికొందరు కవులుగా, రచయితలుగా, సాహితీవేత్తలుగా, ప్రగతిశీలురుగా తమ జబ్బలు తామే చరుచుకుంటూ మున్నుందుకు తోసుకుపోతున్నారు. ఎప్పటికప్పుడు కాకపోయినా, కనీసం ఎప్పుడో ఒకప్పుడైనా మనలోకి మనం చూసుకోకపోతే మనకు మనం కూడా మిగలకుండా పోతాం. ఈ కథ ఆ ఉలికిపాటును కలిగిస్తే-నా బల్లి జారి మీ నెత్తి మీద పడినట్టే.

 

అనేకానేక బల్లులు, ఒకేఒక్క ఫ్లాష్‌బ్యాక్

-దేశరాజు

బల్లంటే బల్లే. కానీ, ఫ్లాష్‌బ్యాక్ అంటే గతం తాలూకూ జ్ఞాపకాల బ్లాక్ అండ్ వైట్ పాత సినిమా రీలు కాదు. ఫ్లాష్ ఉన్న బ్యాక్ అన్నమాట. ఆ ఫ్లాషేమిటో, దాని బ్యాకేమిటో తెలుసుకునే ముందు మీరు అతడి గురించి తెలుసుకోవాలి. అతడెవరనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. శతకోటి లింగాల్లో ఓ బోడి లింగం అని చెప్పకపోయినా మీరు గ్రహిస్తారు. అతడి భార్య గురించి అసలేమీ చెప్పను. ఎందుకంటే, పరాయివారి ధర్మపత్నుల గురించి మనం మాట్లాడుకోవడం భావ్యం కాదని మీకు తెలుసు కదా.

అనుకున్నట్టుగానే ఆమె ఈ ఆధునిక కాలంలో కూడా ధర్మపత్నే. అందుకని పొద్దున్నే తన భర్తకి కాఫీ కలపడం కోసం వంట గదిలోకి వెళ్లి లైటు వేసింది. వెళ్లేప్పుడు అన్ని గదుల్లో కనిపించే దేవుడి పటాలకు నమస్కరించుకుంటూ, ఆవేళ ఏం వారమో గుర్తు చేసుకుని సంబంధిత దేవుళ్ల దగ్గర కాస్త ఎక్కువ సేపు ఆగి కళ్లు మూసుకుని, లెంపలేసుకంటూనే వెళ్లింది. అయినా, కాఫీ నీళ్లు పడేయాల్సిన గిన్నెకంటే ముందు ఆమెకు బల్లి కనబడింది. మామూలుగా అన్ని కథల్లోలాగే ఆమె కూడా

‘‘యావండోయ్.. బ.. బ.. బల్లి’’అనే అరిచి, వంటింట్లోంచి బయటకు ఒక్క గెంతు గెంతింది. లేకపోతే ఆయా రచయితల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంది కదా.

కానీ, ఆయనేమీ పరిగెట్టుకుంటూ రాలేదు. భయంతో వణుకుతున్న ఆమెను చంకనెత్తుకోలేదు. అందుకు కారణం వయసు అనుకున్నా, కౌగిట్లోనూ బంధించకపోవడానికి మాత్రం వారిద్దరికీ ఉన్న పొట్టలే కారణం.  ‘అయ్య వచ్చే వరకూ అమావాస్య ఆగదు’ కాబట్టో లేక ‘ఆమెను భయపెట్టాంగా, చాల్లే’ అనే సంతోషంతోనో బల్లి కూడా చల్లగా ఎక్కడికో జారుకుంది. అయినా, ఆమె నైటీ విదిలించుకుంటూ అటూ ఇటూ కంగారుగా చూస్తూనే ఉంది. ధర్మపత్నులు నైటీలు వేసుకోకూడదనే రూలేంలేదని మీరిక్కడ గుర్తుంచుకోవాలి.

ధర్నపత్ని అయినంత మాత్రాన కోపం రాకూడదని రూలు కూడా లేదు కాబట్టి, పిలిచిన వెంటనే రానందుకు ఆయనకు చెడామడా చివాట్లు వేసింది. అతను కూడా పరమ ధర్మాత్ముడిలా నెమ్మదిగా తలదించుకుని వెళ్లిపోయాడు. అతడలా వెళ్లిపోతుంటే ఆమెకు పారిపోయిన బల్లే గుర్తుకు వచ్చింది.

అతడు త్వరత్వరగానే రెడీ అయ్యి ఆఫీసుకు బయల్దేరాడు. అయినా, యథాప్రకారం ఆలస్యం అయ్యింది. అప్పటికే బాస్ వచ్చి క్యాబిన్‌లో దూరేశాడు కాబట్టి ఇక సచ్చినట్టు లోపలికి వెళ్లి రోట్లో తల పెట్టాల్సిందే. బాస్ ముఖంలో బాస్ కళ ఉట్టిపడుతుండటంతో చిచ్చర పిడుగులా చెలరేగిపోయాడు. మనవాడు ‘ఎప్పటిలాగే శవంలోని భేతాళుడు తిరిగి చెట్టు ఎక్కినట్టు’ తల వంచుకుని బల్లిలా బయటపడ్డాడు. కొలీగ్స్ కు బెదిరిపోయిన బల్లి బితుకు.. బితుకు మంటూ చూసినట్టు కనిపించాయి అతడి చూపులు. అతడికి కూడా వాళ్లంతా తమ కోటా పుచ్చేసుకున్న బల్లుల్లాగే కనబడ్డంతో అతడు నిశ్శబ్దంగా బల్లుల్లో బల్లిలా కలిసిపోయాడు.

కాసేపటికి అంతా ప్రశాంతత నెలకొంది. ఎవరి పనుల్లో వాళ్లు సర్దుకున్నారు. మధ్యాహ్నం అంతా క్యాంటీన్‌కు వెళ్లి ఎవరి డబ్బాలు వారు తెరుచుకుని భోజనాలు కానిచ్చారు. చారులు, పచ్చళ్లు ఇచ్చిపుచ్చుకుని ఒకరికొకరు సుహృద్భావాన్ని చాటుకున్నారు. మధ్యాహ్నం కాస్త నిద్ర ముఖాలు పెట్టుకున్నా. సమయం ముగింపుకు వచ్చే సరికి ‘బిడ్డకు విడుదల’ అనే ఉత్సహంతో పనిచేస్తుండగా ఓ హఠాత్పరిణామం ముంచుకు వచ్చింది.

ఆఫీసులోని పైఫ్లోర్‌లో ఉండే ఎండీ విసవిసా లోపలికి వచ్చింది. నిజానికి వాళ్లయనే ఆ కంపెనీకి ఎండీ. కానీ, ఆయన ఎప్పుడూ టూర్స్‌ లో ఉండటం వలన ఆవిడే ఆ కంపెనీ వ్యవహారాలన్నీ చక్కబెడుతుంది. కాబట్టి అంతా ఆమెనే ఎండీగా భావిస్తారు. ఆమె ఎప్పుడు వచ్చినా ఒక్కత్తే వస్తుంది. కానీ, ఎందుకనో అందరికీ ఆమె చుట్టూ వందలాదిమంది ఉన్నట్టు, పెద్ద ప్రవాహంలా, హోరుగాలిలా వస్తున్నట్టు అనిపిస్తుంది.

ఆమె రాకను పసిగట్టిన బాస్ గబగబా బయటకు వచ్చి పాత సినిమాల్లోలా చేతులు కట్టుకోకుండా హుందాగా విష్ చేశాడు. కానీ, ఆమె మాత్రం పాత సినిమాల్లోలాగా వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా  ‘‘ముంబై కంపెనీ ప్రొఫైల్ అప్‌డేట్ చేసి ఇవ్వమన్నా కదా. ఎందుకని లేట్? రెడీ కాలేదా?’’అని ఇంగ్లీషులో చాలా కూల్‌గానే అడిగింది.

లోపల వస్తున్న వణుకును లోపలే దాచుకున్న బాస్ కాస్త బల్లిలా కంగారుపడుతూ ‘‘అయిపోయింది మేడమ్, పంపిస్తా’’ అన్నాడు.

‘‘ఎల్లుండి సండే, రేపు ఎట్టి పరిస్థితిల్లో అది వెళ్లిపోవాలి. ఇప్పుడు నాకు బయట మీటింగుంది. రేపు ఫస్ట్ అవర్‌లో పంపండి’’ అని వెనుదిరిగింది.

అలా వెనుదిరిగినంత మాత్రాన ఆమె వెళ్లిపోదని అనుభవం మీద తెలిసినవాడు కాబట్టి, బాస్ కాస్త నెమ్మదిగా ఆమె వైపు పాకాడు-సారీ, రెండడుగులు వేశాడు. అతడు ఊహించినట్టుగానే ఆమె కాస్త పక్కకు తిరిగి అతడు వస్తున్నట్టు గ్రహించి ‘‘టైమ్ మెంటైన్ చేయండి. అనుకున్నవి అనుకున్నట్టు జరగాలి. లేకపోతే జరిగే నష్టానికి మీరు బాధ్యత వహిస్తారా?’’అని మెత్తగా రుసరుసలాడింది.

‘‘లేదు మేడమ్, అలాగే మేడమ్’’లాంటి సమాధానాలతో ఆమె వెనకే పాకుతున్న- అదే నడుస్తున్న బాస్‌ని చూసి ‘‘అనుకుంటాంగానీ, పాపం బాస్‌ది కూడా మన బల్లి జాతేరా’’ అనుకున్నారు అక్కడి ఉద్యోగులంతా. అనుకున్నారు కాబట్టి ఆ సౌభాతృత్వాన్ని చాటుకోవడానికి అన్నట్టు ఓ గంటలేటైనా ఆ కంపెనీ పని పూర్తి చేసి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

‘‘మీ వల్లయ్యా, అంతా మీ వల్లే. నేను అనవసరంగా దొబ్బులు తింటున్నా’’అని అరవాలనుకున్నా; ఇప్పుడు వారితో అత్యవసరమైన పని ఉన్నందువల్లో లేక బల్లుల్లాంటి వారిని కంగారు పెడితే అసలుకే మోసం వస్తుందనో.. ఆ అరుపులను మరోసారికి వాయిదా వేసుకుని నిశ్శబ్దంగా వారిని పరిశీలిస్తూ తన స్థానంలోకి వెళ్లిపోయాడు.

అందరూ తలో చేయి వేసుకోవడంతో పని మరీ ఆలస్యం ఏమీ కాలేదు. అయినా, మధ్యలో భార్య నుంచి వచ్చిన రెండు ఫోన్ కాల్స్ ను సైలెంట్‌లో పెట్టేశాడు. అతడు బయటకు వచ్చేసరికి చీకటిలో వాహనాలు, షాపింగ్ మాల్స్ లైట్లతో ధగధగలాడుతున్నాయి. ఆమెకు ఫోన్ చేసి లేటయిన కారణం చెబుదామనుకున్నాడు. మాట్లాడటానికి ముందు ఏదైనా మెసేజ్ పెట్టిందేమోనని వాట్సప్ ఓపెన్ చేశాడు. అక్కడి మెసేజ్‌లు చూస్తుంటే ఆ రోజు ఒక సభ ఉన్నట్టు గుర్తుకు వచ్చింది. అలా సభలకు వెళ్లడం ఎప్పుడో మానేశాడు. అయినా, అలవాటుగా ఎవరో ఒకరు వాట్సప్‌లో ఫార్వర్డ్ చేస్తారు. కానీ, ఇవాళ ఎందుకో వెళ్లాలనుకున్నాడు.

మొదట్లోనే చెప్పుకున్నట్టు మనవాడి బ్యాక్‌లోని ఫ్లాష్ ఇదేనన్న మాట. ఇలా సింపుల్‌గా చెప్పెస్తే సరిపోదు. ‘ఇప్పుడంటే ఇలా ఉన్నాడుగానీ.. ఒకప్పుడు మనవాడు అబ్బో.. మామూలు వాడు కాదు’ అనే రేంజ్‌లో చెప్పుకోవచ్చు. మరో రకంగా చెప్పాలంటే మనవాడు బల్లి కాదు.. బెబ్బులి. పులి చంపిన లేడి నెత్తురు కాకపోయినా, బుక్కాగుండ వంటి నిండా చల్లుకున్నవాడు. విప్లవాలేమీ చేయకపోయినా ‘అమ్మా నను కన్నందుకు విప్లవాభివందనాలు’ అని పాడుకున్నవాడు. మహా కవి అనిపించుకోవాలని కోరికలేమీ లేకుండానే ‘చాలా బావున్నాయ్’ అనే అందరి ప్రశంసంలు పొందే కవిత్వం రాసినవాడు. ఎప్పుడూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సిన సదవకాశం లభించలేదుగానీ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన పలు విధానాలకు వ్యతిరేకంగా అప్పుడప్పుడు నిరసనల్లో పాల్గొన్నవాడు. నల్లబ్యాడ్జీలు పెట్టుకుని ఆఫీసుకు కూడా వెళ్లి తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా ప్రకటించేవాడు. టీలు తాగుతూ గంటలు, గంటలు చర్చలు జరిపేవాడు. ఒకోసారి అవి తీవ్రస్థాయిలోకి వెళ్లి, అక్కడి నుంచి ఆఫీసులోకి పాకి ఉద్యోగం మీదకు కూడా వచ్చి పడినా చలించనివాడు. అప్పుడు మళ్లీ వేరే చోటు వెతుక్కునేవాడు. అంతమాత్రాన బాధ్యతల బరువు తెలియనివాడేమీ కాదతడు. కాకపోతే, ఆవేశమో, ఆదర్శమో నడిపించేవతడిని. మొన్నీ మధ్య వరకూ కూడా అతను అలాగే ఉన్నానని అనుకునేవాడు. కానీ, డార్విన్ పరిణామ సిద్ధాంతంలా చాలా నిశ్శబ్దంగా, క్రమంగా జరిగిన పోయిన ఈ మార్పు గురించి ఈ మధ్యే ఎరుకలోకి వచ్చాడు. అప్పటి నుంచే అతడిలో కాస్త భయంలాంటిదేదో చోటు చేసుకుంది. అప్పటి నుంచే అతడి బతుకు బల్లయిపోయింది.

ఈ అసహనం అతడిలోనే కాదు, అతడిలాంటి చాలామందిలో ఉంది. అయితే, దీనికి వ్యతిరేకమైన అసహనం కూడా దేశంలో పెరిగిపోతోంది. దీన్ని ఎదుర్కోవడానికి అన్ని శక్తులూ ఏకం కావాలని సభలో పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఆశ్చర్యం ఏమిటంటే అతడు ఆ సభ జరుగుతున్న హాలులోకి ప్రవేశించగానే అందరూ బల్లుల్లాగే కనబడ్డారు. వక్తల్లో ఒకాయన ప్రొఫెసర్ అయితే మరొకాయన కవి. ఇంకొకాయన కూడా సాహితీవేత్తే. కానీ, ఆయన ఏం రాశాడో అక్కడున్న ఎవరికీ తెలీదు. అతను వెళ్లేప్పటికే మొదలై పోయిన సభలో బల్లులు- అదే ప్రేక్షకులు పలచగానే ఉన్నారు. ఒకప్పుడు ఇదే స్పీకర్లు మాట్లాడుతుంటే హాళ్లు కిక్కిరిసిపోయేవి. కాకపోతే, అప్పుడు వాళ్లు ఇలా బల్లుల్లా ఉండేవారు కాదు. దానికితోడు వేర్వేరు పేర్లతో ఎవరి కుంపటి వారు పెట్టుకోవడంతో వచ్చే ఆ కాసిని బల్లులు కూడా అటూఇటూ చెదిరిపోయాయి.

సభ ముగిసింది. బల్లులన్నీ తమ అవతారాలని కాస్త సవరించుకుంటూ బయటకు వచ్చాయి. సిగరెట్లు, టీలు, సెండాఫ్‌లతో అందరూ గుమిగూడుతున్నారు. గతానికి భిన్నంగా చాలామందికి కార్లు ఉండటం అతడికి తెలిసిందే. అయితే, ఈసారి ఒకటి, రెండు ఖరీదైన కార్లు కూడా ఉండటం అతడిని మరింత నిరత్సాహపరిచింది. ‘నరుడు వానరుడుగా మారే క్రమంలో శ్రమ నిర్వహించిన పాత్ర’అని మార్క్స్ రాసినట్టే ‘మనుషులు బల్లులుగా మారే క్రమంలో భయం నిర్వహించిన పాత్ర’అని ఒక వ్యాసం రాయాలని అతడు ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు.

ఇంతకుముందు ఎవరైనా కారు కొనుక్కుంటే-అది కూడా చాలా మామూలు కారు-చాలా సిగ్గుపడిపోయేవారు. నడుంనొప్పనీ, డాక్టర్ బండి నడపొద్దన్నాడనీ సంజాయిషీలు కూడా అడక్కుండానే ఇచ్చేవారు. కానీ, ఇప్పుడు తమ ఖరీదైన కార్లను ప్రదర్శించడానికి ఏమీ మొహమాటపడటంలేదు. సరికాదా, వాటిలోని అత్యాధునిక సౌకర్యాల గురించీ, అవి కారుల్లో ఏర్పటు చేయడానికి అయ్యే ఖర్చు గురించీ చాలా ఓపెన్‌గా డిస్కస్ చేస్తున్నారు.  తాము నిచ్చెన ఎక్కడానికి అవసరమైనవారినీ, ఉపయోగపడతారని అనుకున్నవారినీ దారిలో విడిచిపెడతామని ఆ ఖరీదైన కార్లలో తోలుకుపోతున్నారు.

ఇంతలో అతడిని చిరకాల మిత్రుడు పలకరించాడు. ఎన్నో ముసుగులు తొడుక్కునే ఎందరి మధ్యో ఏ ముసుగులు లేకుండా మాట్లాడుకునే స్వేచ్ఛ వీళ్లిద్దరి మధ్యా ఉంది. మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సిందే మిటంటే ఒకరి ముందొకరు బల్లి అవతారం ఎత్తరు. ఇద్దరు ఆ జనానికి కాస్త దూరం జరగడానికి నడక ప్రారంభించారు.  సందు చివరకు వచ్చి ఛాయ్ చెప్పి, సిగరెట్ వెలిగించారు. ఇంతలో ఓ కారు వాళ్ల పక్క నుంచి వెళుతూ ఆగింది. అందులోంచి ఓ రచయిత దిగి వీళ్లిద్దరినీ పలకరించాడు.

‘‘ఏంటి డ్రైవింగ్ చేయడం లేదా, దర్జాగా వెనక నుంచి దిగారు’’ అన్నాడు మిత్రుడు

‘‘ఎందుకు రిస్క్ అని మానేసానబ్బా. డ్రైవర్‌ని కూడా ఆఫీసు వాళ్లే ఇస్తారు. మనకేం పడదు’’ అన్నాడా రచయిత.

‘‘అన్నట్టు మర్చిపోయా, మంచి రెస్పాన్స్ వచ్చింది మీ ఆర్టికల్‌కి. యూఎస్ నుంచి కూడా మన వాళ్లు ఫోన్ చేశారు. కాపీలు పంపాలి. ఎవరైనా వెళుతున్నట్టు తెలిస్తే చెప్పు. నేను మాట్లాడతా’’ అని కాసేపు మాట్లాడి వెళ్లిపోయాడాయన.

ఆయన అలా వెళ్లగానే మిత్రుడిపై విరుచుకుపడ్డాడు.

‘‘వీడి మొదటి పుస్తకం తప్ప దేంట్లోనైనా కవిత్వం ఉందా? రెండో పుస్తకంలోంచే మార్పు కనిపించిందని నువ్వు కూడా అన్నావ్. మర్చిపోయావా?’’ అన్నాడు.

‘‘నువ్వింకా మొదటి రెండు పుస్తకాల దగ్గరే ఉన్నావ్. అసలు ఆయన ఎన్ని పుస్తకాలేశాడో తెలుసా?’’ అంటుండగానే మిత్రుడిని అడ్డుకున్నాడు.

‘‘వాడు కాస్తా, ఆయనెప్పుడయ్యాడ్రా’’ అన్నాడు ఆశ్చర్యంగా.

‘‘హే.. అదేం లేదు. కాస్త పెద్దవాడయ్యడు కదా, అందుకని..’’ నసిగాడు.

మళ్లీ ఏమనుకున్నాడో ‘‘కాసేపు ఉంటావా? ఫర్వాలేదా?’’ అన్నాడు.

‘‘ఫర్వా అంటే లేనట్టే..’’ అన్నాడు చిన్నగా నవ్వి.

ఇద్దరు మరి కాస్త దూరం నడిచి వైన్ షాపుకు చేరుకున్నారు. కావలసినవన్నీ మిత్రుడే కొంటుంటే ‘‘ఉండుండు, నేను కూడా ఇస్తా’’అని జేబులోంచి రెండు వందలు తీసిచ్చాడు. ఇద్దరూ పక్కనే ఉన్న పర్మిట్ రూంలో దూరారు. అక్కడంతా చిత్తడిగా, చిరాగ్గా ఉంది. కానీ, ఇద్దరూ అదేం పట్టించుకోలేదు.

కాస్త గొంతు తడిసిన తరువాత అసలు చర్చకు తెరతీశాడు మిత్రుడు. ‘‘ఏమోరా, మనకు చేతగాక పోవడం వల్ల ఎదగలేదేమో? లేకపోతే..’’ అన్నాడు.

‘‘చేతగానితనం అనకు. నాకు మండుతుంది. ఎదగడం అంటే ఏమిటనేదానికి మనం ఇచ్చుకునే నిర్వచనంపై ఆధారపడి ఉంటుంది. ఎలాగైనా ఎదగాలనుకుంటే, ఆ మాత్రం ఎదగలేకపోదుమా’’ అన్నాడు.

‘‘అనుకుంటాంగానీ, అది కూడా అంత సులువేం కాదు’’ అని మరో గుక్క తాగి ‘‘సర్లే, అందరూ మనలాగే ఉంటారా ఏం? అవకాశం వస్తే అందిపుచ్చుకుని..’’

‘‘అవకాశం వస్తే అందిపుచ్చుకోవద్దని అనడం లేదు. అంచలంచెలుగా లభించే ఉద్యోగపరమైన ప్రమోషన్లనూ కాదనడం లేదు’’

‘‘మరి దేన్నీ కాదన్నప్పుడు ఇంక గొడవేముంది?’’

‘‘గొడవేముందంటే.. ఎదగడం కోసం అర్రులు చాచడం. అన్నిటినీ తుంగలో తొక్కి దిగజారడాన్ని ఎదగడం అనుకోవడం. అందకు వర్గం, మతం, కులం, ప్రాంతం అన్నీ అడ్డం పెట్టుకోవడం. అలా సాధించుకున్న ఐశ్వర్యంతో అచ్చొత్తి కట్టలు, కట్టలు సాహిత్యం వెదజల్లడం, ఇంకాసిని కట్టలు పడేసి దాన్ని ప్రమోట్ చేసుకోవడం, డబ్బుతో దేన్నయినా సాధించవచ్చని దర్పాన్ని ప్రదర్శించడం..’’

‘‘ఏంటి తమిళంగానీ నేర్చుకున్నావా? అన్నీ సున్నంబాకం, మీనంబాకం టైపులో మాట్లాడుతున్నావ్’’ అంటూ భళ్లున నవ్వాడు మిత్రుడు.

అతడికి అర్థమయ్యింది. మిత్రుడు కావాలనే చర్చను విరమించుకున్నాడని. అంతేకాదు, ఇంతకాలం మడిగట్టుకు కూర్చున్నందుకు సిగ్గుపడుతున్నాడనీ, దాన్ని ఛేదించుకుని బయటపడే క్రమంలో సతమతమవుతున్నాడనీ. ఎగబాకే వాళ్ల అరికాళ్లకు ఆయిల్ రాస్తూ తానూ ఎదిగిపోతున్నాననే భ్రమలో ఉన్నాడని కూడా అర్థమయ్యింది.

ఎంత మత్తులో ఉన్నా, ఇతడి కంటే రెండాకులు ఎక్కువ చదివినవాడు ఆ మిత్రుడు. గతంలో లోపల కూడా పనిచేసిన వాడు. తనను పూర్తిగా తీసి పారేశాడనీ, తన పతన పరాకాష్టను అర్థం చేసుకున్నాడని కూడా గ్రహించాడు.

‘‘కాలం మారింది బాస్, ఒకప్పటిలా ఎలా కుదురుతుంది. ఇప్పుడు దేశమంతా అసహనం పెల్లుబికుతోంది. మనలాంటి వాళ్లం అంతా ఒక్క గొంతుతో కాదు, పది గొంతుకలతో కలిసి అరవాల్సిన సమయం. కానీ, అరవగలమా? అంతవరకూ ఎందుకు కనీసం చిన్నగా గుసగుసగానైనా మాట్లాడుకునే పరిస్థితి ఉందా? మహామహా నేతలకే ఊపిరాడ్డం లేదు. వికలాంగులు, వృద్ధులపై సైతం ఎటువంటి జాలీ, దయా చూపడం లేదు. ఆందోళనలు, రాస్తారోకులు, రైల్ రోక్‌లు, బంద్‌లు ఏవీ లేవు. ఏదో సోషల్ మీడియాలో మనలాంటి వాళ్లం మేమింకా బల్లులం కాదు అని చెప్పుకోవడానికి వేసే వేషాలకు స్పందన ఏముంటుంది, ఉంటే రివర్స్ లో తప్ప.  రేపు ఎట్నుంచి ఎటొచ్చినా మనల్ని ఆదుకోవాలంటే వీళ్లే దిక్కు. మన కుటుంబాలకు కూడా ఓ రూపాయి ఇచ్చేది వీళ్లే. పార్టీలూ, పెద్దలూ ప్రకటనలు మాత్రం ఇస్తారు. మాటలు చెబుతారు. అయినా, నువ్వు గుర్తించావో, లేదో.. వాళ్లు ఎప్పుడో చేతులెత్తేశారు, మీ సంక మీరు నాక్కోండిరా అని. మనమేదో పులుపు చావక ఇంకా గొణుక్కుంటున్నాం’’ అన్నాడు.

కాసేపటికి మరో పెగ్గు దాటేసరికి ఆ గిల్ట్ ఫీలింగ్ కూడా వదిలేసి ‘‘చూడ్రా, నేనెంతో కవిత్వం రాశా. రాశిలో కాకపోయినా వాసిలో ఎన్నదగిన కవిత్వం నువ్వు కూడా రాశావ్. నీ పుస్తకం ఇప్పటి వరకూ రాలేదు. అప్పుడప్పుడు రాసినవన్నీ ఒక దగ్గర లేకుండా నువ్వు ఎవరినైనా ఎలా రీచ్ అవుతావ్? నా పుస్తకం కూడా కూతురు పేరున పబ్లిషింగ్ పేరు పెట్టి ఆయనే వేశాడు. నీకు తెలుసు నేను కవిత్వంతో సమానంగా విమర్శ కూడా రాశానని. అవి కూడా వేద్దామంటున్నాడు, చూడాలి. మనం ఎప్పుడెప్పుడో రాసినవి ఇప్పుటి తరానికి అందుబాటులోకి తేకుండా, మనం గొప్ప అని నా భుజం నువ్వూ.. నీ భుజం నేనూ చరుచుకుంటే సరిపోతుందా?’’ అని నేరుగా నిలదీశాడు.

‘అతడు మాట్లాడే వాటిల్లో వాస్తవాలు, తర్కాలు అతడికి తెలియనివి కావు. కానీ, ప్రస్తుతం పరిస్థితులు అలా అతడితో మాట్లాడిస్తున్నాయ్’ అని అతనికి అర్థమయ్యింది. అందుకు ప్రధాన కారణం భయం అని కూడా అర్థమైంది. భయంతోనే అందరూ బల్లులైపోతున్నారనే నిజం భళ్లున బయట పడేసరికి అతడికి నిజంగానే ఊపిరాడలేదు. న్యాయంపై కూడా పెత్తనం చేస్తున్న నియంతృత్వం గుర్తుకొచ్చి ఉక్కిరిబిక్కిరి అయ్యాడు.

మిగిలినదాన్ని గ్లాసెత్తి గటగటా తాగేశాడు. వెంటనే అతను మునుపటిలా బల్లిలా మారిపోయాడు. వెంటనే ఎదురుగా ఉన్న స్నేహితుడు ‘మన నిజస్వరూపం ఇదే’ అన్నట్టుగా అభినందిస్తూ కౌగిలించుకున్నాడు.  తూలుకుంటూ, పాక్కుంటూ ఇద్దరూ రోడ్డు మీదకు వచ్చి ఎవరింటి దారి వారు పట్టారు. స్నేహితుడు వెళ్లిపోయాక అతడు తన బండి తీస్తుండగా ఒంటేలు పోవాల్సిన అవసరం ఏర్పడింది. వెంటనే ఎదురుగా గోడ కనిపించింది. పని కానిస్తుండగా, ఖాళాగా ఉన్న ఆ గోడపై కొత్త నినాదం రాయాలని మనసు పుట్టింది.

‘భయం మనిషిని బల్లిని చేయును’ అని రాయాలనుకున్నాడు.

కానీ తానిప్పుడు బల్లి అనే విషయం వెంటనే స్ఫురించింది-అంత మత్తులోనూ.  రేపు తెల్లారాకా.. మనిషిగా మారాకా.. తప్పకుండా రాయాలి అనుకుంటూ వెనక్కు వచ్చి బండి ఎక్కేశాడు. ఎందుకంటే, ‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యోదయాన్ని ఆపలేరు’ అని ఆయన అంతరంగం బలంగా నమ్ముతోంది మరి.

బండి మీద వెళుతున్న బల్లిని ఎవరూ వింతగా చూడలేదు. ఎందుకంటే బల్లులకు బల్లులు వింతగా కనబడవు కదా.

(పాలపిట్ట మాస పత్రిక దసరా కథల పోటీలో ప్రత్యేక బహుమతి)

ప్రచురణ: జనవరి, 2021, పాలపిట్ట.

దేశరాజు

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • దేశరాజు గారు కథ బాగుంది కానీ… “నరుడు వానరుడుగా మారే క్రమంలో శ్రమ నిర్వహించిన పాత్ర’అని మార్క్స్ రాసినట్టే” ఈ వ్యాసాన్ని ఎంగెల్స్ రాసాడని రాసుకుంటే ఇంకా బాగుండేది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు