నాదంతా నిష్ప్రయోజన నిరీక్షణమే
ఎన్నెన్ని సుదీర్ఘ పగళ్ళు వెతికానో
ఎన్ని నిర్నిద్ర రాత్రులు వేచానో
గగనతలంలో నక్షత్రాలకే ఎరుక
కళ్ళను దివిటీలు చేసి నీకై
మనసంతా యుగాలు వేచాను
నువ్వు అత్తిపత్తి ఆకువై ముడుచుకుంటావు
నా కళ్ళ కొలనెప్పుడూ ఎండి పోదు
పెదవి దాటని మాటలెన్నో
గుండె మాటున గండి పడ్డా
ఆరని ఆశలన్నీ పెదవిపై స్వారీ చేస్తూ
నన్ను నాకు ఇవ్వాలని చూస్తుంటాయి
కల్లోల కొలిమి
అణువణువునూ దహనం చేసినా
సానుకూల దృక్పథం
ప్రతికూలతని తిప్పి కొడుతూనే ఉంది
నీకివన్నీ అర్థం కాని పదాలే
నావన్నీ వ్యర్థప్రయాసలే!
ఏ అనురాగబంధం అనన్య ప్రేమని
నామనసుకిచ్చిందో..!!
మనిషిలోని మనసుని వేరుచేసే
మరయంత్రానివి కమ్మని ఆజ్ఞాపించకని
ఒక్కొక్క క్షణానీకీ విన్నవిస్తున్నా..
మనం పల్లవించేలా
నాలోని నన్ను నీలోకి
నీలోని నిన్ను నాలోకి
ఆవాహనం చేయమని..
2
నయా జిందగీ
ఏదీ తెలియని మైకంలోకి
ఇంకిపోతున్నా
పుట్టుకతోటే ఒంటరినని మరచి
బంధాలల్లుకున్నా
ఒకొక్క బంధమూ
ఒకొక్క బంధికానా అనే నిజం
అంతా బావున్నంతవరకూ తెలియలేదు
ప్రేమనీ పాశమనీ
ఆప్యాయతనీ అనురాగమని
సుఖమనీ ధుఃఖ్ఖమనీ
బ్రమల్లో మునిగి.. నిజాన్ని మరచి
ఇహంలో మాయపొరల్ని
కళ్ళనిండుగా చుట్టుకుని
లోకాన్ని చూస్తుంటా
మనుషుల్నాడించే మరయంత్రం చేసిన
జంతర్ మంతర్ జాధూగరీ చూసి చూసి
విస్తుపోతూ..
నాలోకి నేను చూసుకోవడం మొదలెట్టాక
నన్ను నేనే ప్రశ్నించుకున్నా.. నేనెవరని?
దేహాన్నా..?
దేహాన్ని తొడుక్కున్న ప్రాణాన్నా?
ఈ రెంటికీ అతీతమైన ఆత్మనా?
ఏది నేనని ప్రశ్నించుకుంటూనే ఉన్నా!
మాయలో ఉన్నా.. మర్మమై ఉన్నా
మాయలోనే మర్మమై ఉన్నా..
నిజమేంటో అంతుపట్టలేదు
పుట్టడం జరిగిపోయింది
గిట్టడం జరిగి తీరుతుంది
మద్యలోని కాలమంతా
ఏంటింత తపన?
దేనికోసం వెంపర్లాట
ఎందుకోసం పాకుల్లాట
నటనే జీవితమెందుకౌతుంది
హృదయం నవ్వని నవ్వుల్ని
ఆ పెదవులెందుకు పూస్తున్నాయి
కళ్ళు కుమ్మరించే ద్వేషాన్ని
ఈ మాటలెందుకు దాస్తున్నాయి
లోపలొకటుంటే బయటకు
మరొకటెందుకు వస్తుంది
నయవంచనే నయా జిందగీనా!
*
ఆద్యంతం చదివించ గల్గిన కవిత
ధన్యవాదాలండీ..
రెండు కవితలూ దేనికదే అంతర్వీక్షణలోకి తీసుకెళ్తున్నాయి. నిశిత పరిశీలనా దృష్టి లోతైన అర్ధంతో ….. విభిన్నత గోచరిస్తున్నాయి. మరోమారు చదివించే ప్రత్యేక శైలి …
అందుకోండి అభినందనలు యామిని దేవి గారూ!
ధన్యవాదాలు సర్
రెండూ కవితలూ దేనికదే ప్రత్యేకంగా ఉన్నాయి. లోతైన భావాలు … అంతర్వీక్షణతో ఆలోచింప జేసేవిగా ఉన్నాయి.
అభినందనలు యామినీ…గారూ !
Thank you Sir..