నా కథకు ముడిసరుకు బాధిత వర్గమే: రెహాన

టీవీకి రిపోర్ట్‌ చేసిన తర్వాత కూడా కెమెరా వెనుక కొన్ని అనుభవాలు మిగిలిపోతాయి.

  1. హాయ్ రెహాన ఎలా ఉన్నారు …?

హాయ్‌ అండి…మీతో ఇలా ఈ వేదిక పై మాట్లాడటం విభిన్నమైన అనుభూతి. ప్రశ్నించటం నా వృత్తిలో భాగం. ఇప్పుడు నా డ్యూటీ మీరు చేస్తున్నారు. మీ ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను.

  1. సాహిత్యం వైపు మిమ్మల్ని ఆకర్షించిన అంశాలు ఏంటి..?

సాహిత్యం వైపు నేను ఎలా ఆకర్షితురాలిని అయ్యానో ఇమిద్దంగా చెప్పలేను. అదొక సహజ ప్రక్రియ ఏమో. సాహిత్యం జీవితాలని ఒడిసిపడుతుంది. వివిధ కాలాల్లోకి, ప్రాంతాల్లోకి మనల్ని తీసుకువెళుతుంది. మనకు తెలియని పార్స్వాలను మనకు తెలియజేస్తుంది. మనమేమిటో మనలోకి మనం వెళ్లి తెలుసుకునేందుకు ద్వారాలు తెరుస్తుంది. అలా నా ఎనిమిదో ఏట నేను సాహిత్యం అనే ప్రక్రియలోకి అడుగుపెట్టాను. నాకు బాగా గుర్తు. నేను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు మొదటి సారి కవిత రాశాను. మా స్కూల్‌లో చాలా పెద్ద గ్రౌండ్‌ ఉండేది. సాధారణంగా సాయంత్రాలు నాలుగు తర్వాత పెద్గగా క్లాసులు ఉండేవి కావు. నచ్చిన ఆట ఆడుకుంటూ స్వేచ్ఛా విహంగాలై గ్రౌండ్‌లో తిరగే అవకాశం మాకు ఉండేది. అదొక అదృష్టం. ఓ సాయంత్రం ఆకాశం మేఘా వృతం అయి ఉంది. చిరుగాలి హోరు మొదలయ్యింది. ఆ దృశ్యం నాలో ఏదో తెలియని అలజడిని రేపింది. ఏవో భావోద్వేగాలు నాలో. అప్పుడు ఓ తాటి చెట్టుకు చేరగిల పడి రాయటం మొదలు పెట్టాను. ప్రకృతిని వర్ణిస్తూ రాసిన ఆ అక్షరాలే నా మొదటి కవిత. ఆ తర్వాత ఇంటర్‌ వరకు ఈ కవితా ప్రక్రియ కొనసాగింది. పబ్లిషింగ్‌ కోసం పంపించాలన్నంత ఆలోచన, అవగాహన అప్పట్లో లేవు. ఆ తర్వాత ఎందుకో హఠాత్తుగా కొన్ని సంవత్సరాల పాటు కవితలు రాసే జోలికి వెళ్లలేదు. కాని చదవుతూ ఉండేదాన్ని. అదొక పరిణామ క్రమం.

  1. తెలుగు సాహిత్యం మొత్తం మీద అటు కథ, ఇటు కవిత్వం మధ్యలో వ్యాసం రాసిన అతి తక్కువ మంది జర్నలిస్ట్ లలో అందునా మహిళా జర్నలిస్ట్ లలో మీరు ఒకరు.దీని నేపధ్యం గురించి చెబుతారా..?

అవును. కథ, కవిత, వ్యాసం ఇలా మూడు ప్రక్రియల్లోనూ రాయగలగుతున్నాను అన్న తృప్తి ఉంటుంది. అయితే ఈ అన్ని ప్రక్రియల్లోనూ నేను చేయాల్సిన ప్రయాణం చాలానే ఉందని కూడా నాకు తెలుసు. కవిత నాలో యాధృచ్చికంగానే బీజం వేసుకుంది. వాస్తవంగా ఈ ప్రశ్న నాకెప్పుడూ ఎదురుకాలేదు. మీరు అడిగిన తర్వాత ఆలోచిస్తే …అనిపిస్తుంది…బహుశా మా తెలుగు టీచర్‌ భాష వ్యక్తీకరణేచ్ఛను నాలో రేపి ఉంటారు. పాఠశాల దశలో భాషా ఉపాధ్యాయుల ప్రభావం పిల్లల పై కచ్చితంగా ఉంటుంది. అప్పుడు ఆమె నా అభిమాన టీచర్‌. ఆమె తరగతి చాలా ఆహ్లాదంగా సాగిపోయేది. పాఠాలు వింటున్నాం అన్న ఒత్తిడి ఉండేది కాదు. ఏడు, ఎనిమిది పిరియడ్స్‌లో కనుక తెలుగు సబ్జెక్ట్‌ ఉంటే ఆమె ఆడుకోవటానికే పంపేసేవారు. అలా అని నిర్దిష్ట సమయంలో పోర్షన్‌ పూర్తి కాకపోవటం ఉండేది కాదు. మిగిలిన అన్ని సబ్జెక్టుల కంటే తెలుగే ముందు పూర్తి అయ్యేది. ఇక కథ ప్రక్రియకు వస్తే కవితలో ఇమడలేని భావోద్వేగాలు కొన్ని నాలో గూడుకట్టుకున్నాయి. అది ”నిశ్శబ్ద రేఖ” కథ (నా మొదటి కథ) రూపంలో బయటకు వచ్చాయి. అంతకు ముందు కూడా ఒకటి రెండు కథలు రాసే ప్రయత్నం చేసినా…ప్రక్రియను సరిగ్గా ఒడిసి పట్టలేకపోయాను. “నిశ్శబ్ద రేఖ” నాటికి కథ రాయటంలో కొంత స్పష్టత వచ్చింది. ఆ తర్వాత ఇప్పటి వరకు పది వరకు కథలు రాశాను. ఇక వ్యాసం అంటారా…జర్నలిస్ట్‌గా సామాజిక, ఆర్ధిక, రాజకీయ అంశాల పై కథనాలు రాస్తూనే ఉంటాను కాబట్టి కొత్త కాదు. అయితే టీవీకి రాయటం వేరు, పత్రికలకు రాసే విధానం వేరు. టీవీకి సూటిగా, సంక్షిప్తంగా రాయాల్సి ఉంటుంది. నా దగ్గర ఉండే విజువల్‌ ఫీడ్‌ను దృష్టిలో పెట్టుకుని పదాలను, వర్ణనను ఎంచుకోవాల్సి ఉంటుంది. పత్రికకు రాయటంలో కాస్త స్వేచ్ఛ ఉంటుంది. చేయాల్సిన అధ్యయనం కూడా ఎక్కువగానే ఉంటుంది. వ్యాస రచనను మాత్రం ఉద్దేశపూర్వకంగానే ఎంచుకున్నాను. రాయటంలో నేర్పు అలవడుతుంది, అదే సమయంలో పలు అంశాల పై అధ్యయనం చేయాల్సిన అవశ్యకత ఏర్పడుతుంది. తద్వారా నా జ్ఞాన పరిధిని విస్తరించుకునే అవకాశం ఉంటుంది.

  1. జర్నలిస్ట్ అంటేనే కాస్త కష్టమైన వృత్తి అందులో మీరు సాహసాల్ని ఎంచుకుంటున్నారు. సాహిత్యం కన్నా సాహస జర్నలిజం ఎక్కువ ప్రాముఖ్యత వస్తుంది అనుకున్నారా..?

జర్నలిజం నా వృత్తి మాత్రమే కాదు. అదొక ప్యాషన్‌ నాకు. అందులోనూ సాహసోపేత రిపోర్టింగ్‌ చేయటాన్ని మరింత ఆస్వాదిస్తాను. ఎవరూ వెళ్ళని, వెళ్ళటానికి ధైర్యం చేయని లోతుల్లోకి వెళ్లాలనుకుంటాను. అప్పుడే సమస్యను మరింత స్పష్టంగా ప్రేక్షకులకు/ప్రజలకు తెలియజేయగలుగుతాం. అది నా వృత్తి ధర్మంగా భావిస్తాను. నిజం చెప్పాలంటే నా కళ్ళ ముందు లక్ష్యమే కనిపిస్తుంది కాని, ఆ తర్వాత వచ్చే పేరు, ప్రఖ్యాతులు నా ఆలోచనల్లోనే ఉండవు. ఇక్కడ ఒక ఉదాహరణ చెబుతాను. 2016 సర్జికల్‌ స్ట్రైక్స్‌ తర్వాత జమ్ము-కాశ్మీర్‌ రాష్ట్రంలో భారత-పాక్‌ సరిహద్దుల్లో ఒక రకంగా యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. అప్పుడు నేను ఆ అంతర్జాతీయ సరిహద్దు పహారా, సైన్యం ముందు ఉన్న సవాళ్ళను చిత్రీకరించాలనుకున్నాను. అది కూడా రాత్రి పూట. అనుమతులు తీసుకునే క్రమంలో ఓ అధికారి నాతో అన్నారు పగలు కూడా ఇదే రకమైన పహారా ఉంటుంది చిత్రించటానికి అని. శత్రువు నుంచి ప్రమాద తీవ్రత ఎప్పుడు ఎక్కువగా ఉంటుందని అడిగాను. నిశ్సందేహంగా రాత్రిపూటే అన్నారు. ఆ క్షణంలో మన సరిహద్దుల్లో పొంచి ఉండే అత్యంత క్లిష్టమైన సవాళ్ళను ప్రజల ముందు తీసుకురావాలనే ఆలోచనే నాలో ఉంటుంది కాని… తర్వాత నాకు ఒరిగే ప్రయోజనం ఏమిటన్నది కాదు. అలానే ఉత్తరాఖండ్ వరదల సమయంలో డెహ్రాడూన్‌లోని ఎయిర్‌ బేస్‌లో నిలబడి లైవ్‌లు ఇస్తూ అక్కడి వరద పరిస్థితిని, ఇతర వివరాలు ప్రేక్షకులకు అందించవచ్చు. కాని బద్రీనాథ్‌లో చిక్కుకుపోయిన తెలుగువారి గోడు ప్రేక్షకుల కళ్ళకు కట్టాలంటే నేను ప్రాణాలను పణంగా పెట్టాల్సిందే. 200 కిలోమీటర్లకు పైగా ఘాట్‌ రోడ్డులో ఆ వర్షంలో, ప్రయాణం చేయాలి. మళ్లీ కొంత దూరం బురదమయం అయిన కొండలు ఎక్కి కాలినడకన వెళితే కాని బద్రీనాథ్‌ చేరుకోం. వార్తను సేకరించేందుకు, బాధితుల గోడు వినిపించేందుకు రిస్క్‌ను సైతం ఎదుర్కొనేందుకు సిద్ధపడే స్వభావమే ఆ రోజు నన్ను బద్రీనాథ్‌ వరకు చేర్చింది.

  1. బుల్లెట్ల వాన కురుస్తున్న దగ్గర్లో మైక్ పట్టుకుని వృత్తి ని నిబద్దత గా చేశారు,చేస్తున్నారు. తగిన గుర్తింపు వచ్చిందా లేక మహిళ కాబట్టి అణచేవేయబడ్డాను అనే అభిప్రాయంలో ఉన్నారా..?

లేదండి. అణచివేయబడ్డానా అన్న ఆలోచనకు ఆస్కారమే లేదు. వాస్తవంగా చెప్పాలంటే నా సాహసోపేత రిపోర్టింగే సమాజంలో నాకో ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది. చాలా మంది ఎక్కడైనా నన్ను చూసి గుర్తించి దగ్గరకు వస్తే …నా సరిహద్దు కథనాలు, కాశ్మీర్‌ రిపోర్టింగ్‌ వంటి వాటినే ప్రస్తావిస్తారు. అంతకు మించిన తృప్తి ఏముంటుంది. అంతే కాదు దేశంలో ఏ మూల ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఏర్పడినా ఎన్టీవీ నుంచి రెహానా వెళుతుంది అన్న అభిప్రాయం మీడియా సర్కిల్స్‌లోనే కాదు నన్ను గుర్తించే సగటు వ్యక్తుల్లోనూ ఉంటుంది. ఇక అమ్మాయిగా వివక్ష అంటారా మా ఛానల్‌లో ఒక రకంగా రివర్స్‌ అనే చెప్పాలి. ఇటువంటి పరిణామాలు వస్తే కవరేజ్‌కి ఎవరిని పంపాలి అన్న ప్రశ్నే తలెత్తదు అంటే అతిశయోక్తి కాదు. బై డిఫాల్ట్‌ నా పేరే ఉంటుందని గర్వంగా చెప్పగలను. నా మీద మా మేనేజ్‌మెంట్‌కు ఉండే నమ్మకం అది. వారికి కృతజ్ఞతలు అని చెప్పటం చిన్న వ్యక్తీకరణే అవుతుంది.

  1. కథ, కవితా లో మీరు నిష్ణాతులు మీ ఊహాలు ముఖ్యంగా కధలు రాసేప్పుడు దాని ముడి సరుకు ఏమైఉంటుంది…?

నా కథకు ముడిసరుకు సమాజమే. బాధిత వర్గమే. నేను ఇంత వరకు రాసిన ప్రతి కథ, వాటిలోని పాత్రలు నిజ జీవిత గాథల నుంచి పురుడు పోసుకున్నవే. నా వృత్తిలో భాగంగా నేను అనేక ప్రాంతాలకు వెళుతుంటాను…అనేక మందితో మాట్లాడుతుంటాను. ఈ క్రమంలో బాధితుల జీవితాలను దగ్గరగా పరిశీలించే, అర్థం చేసుకునే అవకాశం దొరుకుతుంది. టీవీకి రిపోర్ట్‌ చేసిన తర్వత కూడా కెమెరా వెనుక కొన్ని అనుభవాలు మిగిలిపోతాయి. టీవీ వార్తంశానికి ఉండే పరిమితులు రీత్యా కొన్నింటిని తెర మీద చూపించలేం. అటువంటి కొన్ని సంఘటనలు, సందర్భాలు, బాధితుల కన్నీటి గాథలు నాలోపలే ఉండిపోయి నన్ను నిద్రపోనివ్వవు. అలజడి రేపుతుంటాయి. మనసును తొలుస్తూ ఉంటాయి. ఇక అప్పుడు అక్షరాల్లోకి వాటిని ఇంకించి కథ రూపంలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను.

  1. చాలా అవార్డులు పొందారు వాటి వివరాలు… ఇంత బిజీ జీవితంలో కూడ మీరు నిర్వర్తిస్తున్న అదనపు బాద్యతల గురించి చెబుతారా…?

అవార్డుల్లో ముఖ్యంగా చెప్పాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తమ ఎలక్ట్రానిక్మీడియా జర్నలిస్ట్అవార్డు, తెలంగాణా మీడియా అకాడమి బెస్ట్జర్నలిస్ట్అవార్డు, స్టాండ్ఫర్నేషన్సంస్థ విశిష్ట సేవా పురస్కార్, బాలికా బంధు గా అవార్డ్, స్వరమాధురి, లలిత కళా స్రవంతి వంటి అనేక ఇతర సంస్థల నుంచి పురస్కారాలు, అవార్డులు వచ్చాయి. ఇక నేను నిర్వర్తిస్తున్న ఇతర బాధ్యతల విషయానికి వస్తే ప్రస్తుతం హైదరాబాద్ప్రెస్క్లబ్కు వైస్ప్రెసిడెంట్‌, జర్నలిస్ట్కోఆరేటివ్హౌసింగ్సొసైటికి జాయింట్సెక్రటరీగా, ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ మీడియా వ్యవహారాల కమిటి సభ్యురాలు, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక జాతీయ ట్రెజరర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను.

  1. ప్రతీ గురువారం పెన్ డ్రైవ్ అనే కాలమ్‌ రాస్తున్నారు.పొలిటికల్ గా మీ గొంతు మీరు వినిపిస్తున్నారు. ఎక్కడైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా..?

అవునండి ప్రజాతంత్ర దినపత్రికలో “పెన్‌ డ్రైవ్‌” పేరుతో వీక్లీ కాలమ్‌ నిర్వహిస్తున్నాను. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోనూ రాజకీయ అభిప్రాయాలు స్వేచ్ఛగా వ్యక్తం చేసే, ప్రభుత్వాల పని తీరు పై విమర్శనాత్మక కథనాలు ఇచ్చే వాతావరణం మీడియా హౌస్‌లకు లేదు. పెన్‌ డ్రైవ్ ద్వారా కొంత వరకు నా అభిప్రాయాలు, ఆలోచనలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇంత వరకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు.

  1. ప్రస్తుతం భారత దేశం యువత పౌరసత్వం మీద పోరాడుతుంది. ఒక ముస్లిం మహిళగా, సమాజాన్ని నడిపే జర్నలిస్ట్ గా మీరు ఈ సమస్య మీద ఎలా స్పందిస్తారు.

పౌరసత్వ అంశం పై కేవలం ముస్లిం మైనార్టీ వర్గాలే కాకుండా ప్రజాస్వామిక వాదులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యువత మరింత చురుకైన పాత్ర పోషిస్తోంది. యువతలో సామాజిక చైతన్యం ఉండటం, తమ హక్కుల కోసం గళం ఎత్తే స్వభావం సమాజాభివృద్ధికి, సామాజిక పరిణామక్రమానికి చాలా కీలకం. అయితే అటు కేంద్ర దేశంలోని ఏ వర్గం నుంచి పౌరసత్వాన్ని లాక్కోమని, భయపడాల్సిన పని లేదని అంటోంది. నిజమే కదా. భారత గడ్డ పై పుట్టి, ఇక్కడి గాలి పీల్చి ఇక్కడే పెరిగి…ఇది నా దేశం అని గర్వంగా తలెత్తుకునే ఏ ఒక్కరిని దేశం నుంచి తరిమిసే అధికారం ఏ ఒక్కరికైనా ఎలా ఉంటుంది? అయితే ఈ భయాందోళనలు అర్థ రహితమని, భిన్నత్వంలో ఏకత్వాన్ని నమ్మే దేశమని ప్రజలకు వివరించి వారి నమ్మకాన్ని చూరగొనాల్సిన బాధ్యత ఇప్పుడు కేంద్రం మీదే ఉంది.

  1. ఆ మధ్య మీ పోస్ట్ ఒకటి విపరీతముగా ట్రోల్ అయింది.ఆ క్లిష్ట పరిస్తితిని ఎలా ఎదుర్కొన్నారు

ఆర్టికల్‌ 370 రద్దు సమయంలో నేను కాశ్మీర్‌కు ఎన్టీవీ ప్రతినిధిగా వెళ్లాను. అక్కడి పరిస్థితులు, శాంతిభద్రతల అంశాలు, ప్రజాభిప్రాయం ఇలా అన్ని కోణాల్లో రిపోర్ట్‌ చేశాను. ఆ సందర్భంగా కొంత మంది నన్ను ట్రోల్‌ చేసే ప్రయత్నం చేశారు. అదే సమయంలో సోషల్‌ మీడియాలో వేలాది మంది నాకు మద్దతుగా నిలబడటం నాకు నైతిక స్థైర్యాన్ని ఇచ్చింది.

  1. మీ పేరుకి అర్ధం ఏమిటి చెప్పగలరా..?

నా పేరుకు అర్థం తులసి దళం.

*

 

అనిల్ డ్యాని

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఇంటర్వ్యూ మొత్తం, సజావుగా, సజీవంగా సాగింది.. రెహనా నిజంగా, నేటి కల్లోలితసమాచారవ్యవస్థ లో తులసిదళమే.. Hats up rehan ji.👍.అభినందనలు అనీల్ సర్!💐మంచి ఇంటర్వ్యూ, చేసినందుకు..!

  • మీ సాహ‌సోపేత‌మైన రిపోర్టింగు స్ఫూర్తిదాయ‌కం. వాస్త‌వానికి మీరు ఈ స్థితికి ఇంత సులువుగా వ‌చ్చి ఉండ‌రు. ఎన్నో క‌ష్టాల‌ను ఎదుర్కొని వ‌చ్చి ఉంటారు. ఎల‌క్ట్రానిక్ మీడియాలో ఉద్యోగం చేయ‌టం క‌ష్ట‌త‌ర‌మైన‌దే. అది కూడా రిపోర్ట‌ర్‌గా చాలా ప్రెజ‌ర్లుంటాయి. ఏదేమైనా మహిళా జ‌ర్న‌లిస్టుల్లో మీరు ముందుంటారు. అంతెందుకు.. పురుషుల‌కు ఏమాత్రం తీసిపోకుండా ప‌నిచేస్తున్నారు. కంగ్రాట్స్‌. బాధితుల వ‌ర్గంలోని మ‌రిన్ని క‌థ‌లు రాయండి. అంత‌కంటే ముందుగా రిపోర్టింగు క‌థ‌నాలు రాసి పుస్త‌కాలేయండి (పుస్త‌కాలు రాశారేమో. నాకైతే తెలీదు). ముందు త‌రాల‌కు అవి ఉప‌యోగ‌ప‌డ‌తాయి.
    మీడియాలో ప‌నిచేస్తూనే వ్యాసం, క‌థ‌నాలు, క‌థ‌లు, క‌విత‌లు రాస్తు సాహితీలోకానికి ద‌గ్గ‌ర కావ‌టం అరుదు. ఈ ఇంట‌ర్వ్యూ చేసిన సారంగ‌ ఎడిట‌ర్స్‌కు, డ్యానీ స‌ర్‌కి థ్యాంక్స్‌
    -రాళ్ల‌ప‌ల్లి రాజావ‌లి

  • బాధ్యతగల వ్యక్తిని ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ బాగుంది అనిల్ గారూ.

    లోతైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు రెహానా. మీకు అలాయ్ బలాయ్లు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు