నా అభిరుచికి దోహదం చేసిన రచయిత!

రెండు చేతులతోనూ అవలీలగా శరసంధానం చేసిన ‘నరుణ్ణి’ మనం ‘సవ్యసాచి’ అంటున్నాం. రెంటాల గారు భాషాపరంగానూ, సాహిత్యప్రక్రియా పరంగానూ అదే పని చేశారు

–     కాకరాల, ప్రముఖ రంగస్థల – సినీ కళాకారుడు

(అభ్యుదయం, అందులోనూ మరీ ముఖ్యంగా సాహిత్య, సామాజిక విప్లవం సమాజాన్ని ముందుకు నడిపిస్తుందని నమ్మిన తరానికి చెందిన వ్యక్తి ప్రముఖ రంగస్థల, సినీ నటుడు కాకరాల. తమ తరాన్ని ప్రభావితం చేసిన రచయితలు, సాంస్కృతిక ఉద్యమవీరుల్లో రెంటాల గోపాలకృష్ణ లాంటి వారు ఉన్నారని కాకరాల తరచూ చెబుతుంటారు. రెంటాల కవిత్వాన్నీ, నాటకాలనూ, అనువాదాలనూ అమితంగా అభిమానించడమే కాక, తరచూ వాటిని గుర్తుచేసుకొనే కాకరాలకు రెంటాలతో వ్యక్తిగత పరిచయమూ ఉండేది. రెంటాల రచనల్లో తనపై ప్రగాఢంగా ముద్ర వేసిన కొన్ని రచనల్నీ, అంశాల్నీ ప్రస్తావిస్తూ కాకరాల రాసిన సంస్మరణ వ్యాసం ఇది).

‘‘అభ్యుదయ సాహిత్యోద్యమ వైతాళికుల్లో రెంటాల గోపాలకృష్ణ గారొకరు. ఆయన కవి, నటుడు, రచయిత, నాటకకర్త, విమర్శకుడు, పాత్రికేయుడు… ఒక్కమాటలో బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు సాహిత్యంలో రెంటాల కృషిని సంస్మరించుకోవడం మన కర్తవ్యం. సాహిత్యానికి సంబంధించి వారికి ప్రాచీన, అర్వాచీన భేదం లేదు. జన ప్రయోజనానికీ, మానసిక వికాసానికీ అవకాశం ఉన్న దేన్నైనా అందరికీ అర్థమయ్యే సులభ వచనంలో అందించాలన్నదే ఆయన ఆశయం.

అలా అభిమానం ఏర్పడి…

నాకు ఊహొచ్చి, నేను నటుడిగా నాటక రంగంలోకి అడుగుపెట్టేనాటికే రెంటాల వారు ఆధునిక తెలుగు సాంస్కృతిక రంగంలో కృషి చేస్తున్నారు. రచయితగా, నాటక రచయితగా అప్పటికే ఆయన తనదైన ప్రత్యేక స్థానాన్ని పొందారు కూడా! కనుక నా సాహిత్యాభిరుచికి దోహదం చేసిన రచయితల్లో ఒకరిగా వారి మీద నాకు అభిమానం ఏర్పడి, అభివృద్ధి చెందింది. ఆ అభిమానంతో దూరం నుంచి వారిని చూసి, వారిని గురించి ఎక్కువగా వినేవాణ్ణి. విజయవాడ వెళ్ళినప్పుడు కలవడం, వారు నా మంచిచెడ్డలు విచారించడం జరుగుతూ ఉండేది. వారి రచనల్లో ప్రత్యేకించి కొన్ని నాకు బాగా అప్పటికీ, ఇప్పటికీ గుర్తుండిపోయాయి.

కవిగా రెంటాల వారి ప్రతిభకు దర్పణాలు ‘సంఘర్షణ’, ‘సర్పయాగం’ కవితా సంకలనాలు. వాటిలోని కవితలు కార్మిక, కర్షక, పీడిత ప్రజల జీవితాలనూ, జీవనవేదననూ అద్భుతంగా చిత్రించాయి. ఉదాహరణకు పల్లకీ బోయీల జీవనవేదన ‘సర్పయాగం’లోని ‘పల్లకీ బోయీలు’ అనే బోయీల పాటలో వినిపిస్తుంది.

ఇప్పటికీ ఆ రిహార్సల్స్ నాటి అనుభూతే!

సుప్రసిద్ధ రష్యన్ రచయిత గొగోల్ ‘ఇన్‌స్పెక్టర్ జనరల్’ నాటకాన్ని రెంటాల అద్భుతంగా తెలుగులోకి తెచ్చారు. ఆ నాటకాన్ని వారు అనువదించారనే కన్నా అనుసృజన చేశారనడం సమంజసంగా ఉంటుంది. ఆ నాటకంలో నేను నటించే అవకాశం కలిగింది. సమాజాన్ని విమర్శనాత్మకంగా విశ్లేషించి, ‘వాస్తవికత’ను ప్రజల ముందు ఉంచి ఆలోచింపజెయ్యడంలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన బహుకొద్ది నాటకాల్లో గొగోల్ ‘ఇన్‌స్పెక్టర్ జనరల్’ ఒకటి. దాన్ని ఆధునిక తెలుగు సమాజ జీవితానికి అన్వయిస్తూ, రెంటాల అనుసృజించిన తీరు నిజంగా పరిశీలించదగినది, మెచ్చదగినదీనూ! ఆ నాటకం రిహార్సల్సు చేస్తున్నంతకాలం నేను పొందిన, ఈ నాటికీ పొందుతున్న అనుభూతి ఇది!!

 నేను మరచిపోలేని ఆ నవల…

రెంటాల గారి అనువాద కృషి నాటకం దగ్గర ఆగిపోలేదు. రష్యన్ సాహిత్యం నుంచి టాల్‌స్టాయ్, మాక్సిమ్ గోర్కీ, అలెగ్జాండర్ కుప్రిన్ రచనల్ని ఆయన తెలుగు పాఠకులకు అందించారు. అందులో అలెగ్జాండర్ కుప్రిన్ ప్రసిద్ధ రచన ‘యమా ది పిట్‌’ను ‘యమకూపం’గా రెంటాల అనువదించిన తీరు అపూర్వం. ఆ అనువాద నవలలోని పాత్రలు, సన్నివేశాలు ఈనాటికీ ఆలోచనల్లో కదిలి, ఆవేదనకు గురిచేస్తాయి. విప్లవానికి ముందు రష్యా సమాజం ఏ దుర్గతీ, దుఃస్థితుల్లో ఉందో – ఈనాడు భారత సమాజం అదే పరిస్థితుల్లో ఉంది. ఇంకా చెప్పాలంటే, ఆ దుఃస్థితీ, దుర్గతులు ఇంకా ద్విగుణీకృతం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో డిస్ట్రబ్ చేసి, సరైన డైరెక్షన్ చేసి, ఆలోచింపజెయ్యగల ఈ నవల ప్రజల చేతుల్లో ఉండడం చాలా అవసరం.

ఇక సంస్కృతం నుంచి పంచ కావ్యాల్నీ, రామాయణ, భారత, భాగవతాది ఇతిహాసాలనూ, పురాణాలనూ, తెలుగు ప్రబంధాలనూ తేటతెలుగులో సులభశైలిలో రెంటాల గారు అందించిన విషయం అందరికీ తెలుసు.

సాహితీ సవ్యసాచి రెంటాల!

నేను విజయవాడ వెళ్ళినప్పుడు, అప్పుడప్పుడు సాహిత్యసభల్లో కలిసినప్పుడు ఎంతో ఆప్యాయంగా, అభిమానంతో మాట్లాడే రెంటాల గారి రూపం ఇప్పటికీ నా కళ్ళల్లో కదులుతోంది. రచయితగా, నాటక రచయితగా వారు ఒక దశలో ఆంధ్రదేశాన్ని ప్రభావితం చేశారు. ఆ వైనాన్ని దూరం నుంచి, ఎంతో కొంత దగ్గర నుంచి చూశాను. స్థూలంగా నా చూపు నుంచి వాటి గురించి రాశాను. రెండు చేతులతోనూ అవలీలగా శరసంధానం చేసిన ‘నరుణ్ణి’ మనం ‘సవ్యసాచి’ అంటున్నాం. రెంటాల గారు భాషాపరంగానూ, సాహిత్యప్రక్రియా పరంగానూ అదే పని చేశారు. ఈ ‘సాహిత్య సవ్యసాచి’ సంస్మరణ సందర్భంగా నాదో చిన్న విన్నపం. ఆయన అన్ని రచనలనూ సంపుటాలుగా తేగలిగితే సంతోషం. కనీసం వాటిలో వర్తమాన సమాజ పరిస్థితుల్ని గుర్తించి, సరైన దిశగా ఆలోచింపజెయ్యగల యమకూపం లాంటి రచనలనైనా ఎంపిక చేసి, సంపుటాలుగా ప్రచురించి, ప్రజలకు అందివ్వడం ఆ సాహితీమూర్తికి సరైన నివాళి అవుతుంది. సాహిత్యాభిమానులు, సంస్మరణ సంఘం ఆ దిశగా ఆలోచించాలి. సాహితీలోకం అందుకు సహకరించాలి.

  • మద్రాసు, 16 ఆగస్టు 1996

……………………..

రెంటాల

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • రెంటాల వారి యమకూపం చాలా ఏళ్ళ క్రితం చదివాను. పునః ముద్రణ జరగాలి

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు