పొద్దుపోయిన ఆకాశాన్ని ఆవరించిన
చైత్రపు పొగమంచులో
అమ్మ పెట్టిన చుక్కల ముగ్గు
పాలు నిండిన జొన్న గింజల్లా
పరుచుకున్నాయి
వాటినే నక్షత్రాలని అంటారా!
ఏదో చోట వెలుగు ప్రకాశిస్తే
మరేదో దగ్గర చీకటి ప్రసవించింది
మరెప్పటికి…పహారా లేని
గణతంత్ర గగనతలాలు కనిపిస్తాయి?
మిణుకు మిణుకుమనే తారలను
చూసినప్పుడల్లా
పావురాలు గుర్తుకొస్తాయి
వాటి రెక్కలు కదలాడినట్లు
చప్పుళ్లు వినిపిస్తాయి
![](https://magazine.saarangabooks.com/wp-content/uploads/2020/05/ee-vaaram-kavita-1024x683.png)
ఇప్పుడు
ఎటుచూసినా అంతులేనన్ని
పావురాల జాడలు
ఎన్ని హృదయాలు
ఆశగా
ఆకాశదేశంలోకి చూస్తున్నాయో!
వేల మైళ్ళ దూరానికి
పుట్టిన నేల నుండి
కాళ్ల సందులకు
పలకరింపు సందేశాన్ని కట్టుకుని
ఎగిరి వస్తున్నట్లు అనిపిస్తుంది.
ఏ పిల్లాడి నిక్కరు జేబులో నుంచో
మరమరాల ఉండ జారిపోయినట్లు
అచ్చం
తోకచుక్క నేలరాలిపోయింది.
ఇప్పుడు
వర్షం ముందు ఆకాశంలా
చుక్కలు కనిపించడం లేదు
ఏదో శూన్య తీరం
నాలో సృష్టింపబడింది.
*
Add comment