‘నాన్న! ఎలా ఉన్నారు?’
ముఖం అంతా ఆనందం పులుముకుని
అడిగాను
ఆ వేడుకలో ఓ వైపు ముగ్గు బుట్టల్లే కూర్చుని ఉన్నారు
చూసి చాలా కాలం అయ్యింది మరి
ఫోనులు వచ్చాక మాటల దూరం తగ్గిందో
మనుషుల మధ్య దూరం పెరిగిందో
కాలాన్ని కట్టేసి
మనం పరుగెడుతున్నాం
ఆగితే లోపలి శూన్యమేదో ఉబికి వస్తుందని భయమేమో
ఆరుబయట మడత మంచం పై
నాన్న పక్కలో కూర్చొని
అప్పజెప్పిన అ ఆ ఇ ఈ లు
ఆ కొబ్బరి మట్టల్లో ఇంకా ఊ కొడుతూనే ఉన్నాయి
నిద్రలో జోగుతూ… నాన్న తెచ్చే
కొబ్బరి బిళ్ళల కోసం ఎదురుచూపులు
ఆ తాటాకు ఇంటి చూరులో భద్రంగానే ఉన్నాయి
నాన్న చేతి పెరుగన్నం చివరి ముద్ద కోసం
అన్నతో కోట్లాట
ఇప్పటికీ చిరునవ్వుకు ఎరువవుతూనే ఉంది
ఙాపకాలు పొరలు పొరలుగా పోగు బడుతున్నాయి
‘నాన్న!…. నేను’
ఈసారి అనుమానం, ఆందోళన ఏదో గుండె గొంతుకలోకి వచ్చి నిలబడ్డాయి
ఆ గాజు కళ్ళు నన్నే చూస్తున్నాయి
చిన్నప్పుడు నాన్న చిటికెన వేలు పట్టుకుని నేను లోకాన్ని చూసినట్లు
*
Great memorable things lies in very small and simple emotions.. Better to retain basic fundamentals ALWAYS..