ఛేంజ్ ఈజ్ ది ఓన్లీ కాన్‌స్టంట్ – మార్పు ఒక్కటే స్థిరమైంది.. అంటారు. దశాబ్దాలు గడుస్తున్న కొద్దీ జీవన విధానాల్లో వస్తున్న మార్పులు ఒక తరానికి తీపి గుళికలుగా, మరో తరానికి చేదుమాత్రలుగా అనిపించడం సహజం. ఆ మార్పులు – పెళ్లి అనే కాన్సెప్ట్‌కి అన్వయించవలసివస్తే? ఆ అన్వయంలోని చేదూతీపిలని – తీరుగా చిత్రించిన నాదెళ్ల అనూరాధ కథ – క్వీన్.
https://youtu.be/N4ZEESn7FHQ
‘పని అయిపోయిందా? బయలుదేరుతున్నారా?’ అంది మాధురి ఫోన్ తీస్తూనే.
‘లేదు, ఈ పూట శ్వేతని చూసే అవకాశం దొరికింది’ అన్నాడు శ్యామ్ ఉత్సాహంగా. ‘నేను వస్తున్నట్టు శ్వేతకి చెప్పకు. సర్ప్రైజ్ ఇవ్వాలి’ అని భార్యకి చెప్పాడు. భర్త కూతురికి ఇవ్వబోతున్న సర్‌ప్రైజ్‌లో తనూ భాగం కాలేకపోతున్నందుకు మాధురి కొంచెం నిరుత్సాహపడింది.
పూణె నగరానికి అతిథిగానైనా రావటం ఎప్పుడూ ఇష్టమే శ్యామ్ కి. ఇదివరకెప్పుడో కెరీర్ మొదట్లో పూణేలో ఉన్నప్పుడు అక్కడి పురాతన శివాలయం పాతాళేశ్వర్ జ్ఞాపకాల్ని ఇష్టంగా తలుచుకున్నాడు. ఆ ప్రాంతంతో ముడిపడి ఉన్న బాంధవ్యం అపురూపమైనది.
ఆఫీసు పని ఒక్క పూటతో తెమిలి పోతుందని, కూతురు శ్వేతని చూసే టైము కూడా ఉండదని మాధురిని తనతో తీసుకురాలేదు శ్యామ్. తీరా పని పూర్తి కాక, శ్వేతని కలుసుకునేందుకు అనుకోకుండా అవకాశం దొరకడంతో భండార్కర్ రోడ్డులో తనని డ్రాప్ చెయ్యమని ఓ కొలీగ్‌ని అడిగాడు.
‘గుల్మొహర్ పార్క్’ అపార్ట్మెంటు కాంప్లెక్స్ ముందు టాక్సీ దిగి, ఫ్లాట్ నంబరు మరోసారి మననం చేసుకుని లోపలికి వెళ్లబోతుంటే గేటు దగ్గర సెక్యూరిటీ గార్డ్ అటకాయించాడు. వివరాలు చెప్పి, విజిటర్స్ బుక్ లో సైన్ చేసి మూడో అంతస్థులో ఉన్న శ్వేత ఇంటిముందు బెల్ నొక్కాడు.
మనసంతా ఉద్విగ్నంగా ఉంది. తనను చూసి కూతురు ఎంత సంతోషిస్తుందో అనుకుంటుంటే పెదవులపైకి చిరునవ్వు పరుచుకుంది.
తలుపుతీసిన వ్యక్తి ఎవరో అపరిచితుడు. ఉత్తరాది వ్యక్తి అని తెలుస్తోంది. ముఫ్ఫై సంవత్సరాలు ఉంటాయి. అప్పుడే స్నానం చేసి వచ్చినట్టున్నాడు, తల తుడుచుకుంటూ, ‘ఎస్’ అన్నాడు.
ఇదేమిటి తను పొరపాటున వేరొకరి ఇంటికి వచ్చాడా? అనుకుంటూ ‘సారీ’ చెప్పబోయేంతలో లోపలినుండి శ్వేత ‘ఎవరొచ్చారు రాహుల్’ అంటూ ఇంగ్లీషులో ప్రశ్నిస్తూ ముందుగదిలోకి వచ్చింది.
తండ్రిని చూస్తూనే, గబుక్కున రెండు అడుగులు ముందుకు వేసి, ‘హాయ్ డాడ్, ప్లెజెంట్ సర్ప్రైజ్! అమ్మని కూడా తీసుకొచ్చారా? ‘ అంటూ తండ్రిని దాటి వెనక అమ్మకోసం వెతికింది.Powered by wordads.co
We’ve received your report.
Thanks for your feedback!
Seen too often
Not relevant
Offensive
Broken
‘లేదురా, ఆఫీసు పనిమీద పొద్దున్నే వచ్చాను. పని అవకపోవటంతో ఆగిపోవాల్సి వచ్చింది.’ అంటూన్న తండ్రిని ‘డాడ్, ఇతను రాహుల్, నా కొలీగ్’ అంటూ ఆ యువకుడిని పరిచయం చేసింది.
శ్యామ్ కూతురికోసం కొన్న మాంజినిస్ కేక్స్ టేబిల్ మీద పెట్టి స్నానానికి లేచాడు.
శ్వేత , రాహుల్ వంటింటి లోంచి గిన్నెలు, పళ్లేలు తెచ్చి వడ్డన చేసారు. అతనికి ఆలోచన సాగటం లేదు. యాంత్రికంగా భోజనం చేసాడు. రాహుల్ కూడా అదే అపార్ట్ మెంటులో ఉంటున్నట్టు గ్రహించుకున్నాడు. కూతురికి సర్ ప్రైజ్ ఇవ్వాలనుకున్న తనకే ఇక్కడ ఒక పెద్ద సర్ ప్రైజ్ ఎదురైంది.
‘డాడ్ , ఈ రోజు ఆఫీసు నుండి త్వరగా వచ్చేం కనుక సినిమా ప్లాన్ చేసుకున్నాం. చాలా రోజులుగా చూడాలని అనుకుంటున్న సినిమా. నువ్వు కూడా రా మాతో. అలసట తీరి కాస్త రిలాక్స్ అవచ్చు.’ అంటూ తండ్రిని బయలుదేరదీసింది.
కారు వెనక సీట్లో జారగిలపడి కూర్చుని, ముందు సీట్లో కబుర్లలో మునిగిపోయిన రాహుల్ ని, శ్వేతని చూస్తూ ఆలోచనలో పడ్డాడు శ్యామ్.
దాదాపు ఆరునెలల పైనే అయింది కూతురు తమ వూరొచ్చి. ఈలోపు ‘చాలా రోజులైపోయింది, శ్వేతని చూడాలని ఉంది’ అని మాధురి గోల పెడుతూనే ఉంది. మధ్యలో శ్వేత ఎనిమిది వారాల పాటు ప్రాజెక్టు పనిమీద బయటకు వెళ్లింది. వచ్చిన తర్వాత ‘ ఇంటికి వస్తున్నా’ అంటూనే ఆఫీసులో పని వత్తిడి అంటూ రాలేకపోతోంది.
క్రితంసారి శ్వేత ఇంటికి వచ్చినప్పుడు కూడా తను ఆఫీసులో ఇనస్పెక్షన్ హడావుడిలో ఉన్నాడు. ఒక్క వీకెండ్ వచ్చివెళ్లిపోయింది, అప్పుడే చెప్పింది ఆఫీసుపనిమీద కొన్నాళ్లు బయటకు వెళ్తున్నానని. అంతే. మళ్లీ ఇప్పుడే చూడటం.
శ్వేత వచ్చి వెళ్లాక భార్య ముభావంగా ఉండటం గమనించాడు. తను పదేపదే రెట్టించి అడగటంతో శ్వేత పెళ్లికి సుముఖంగా లేదని, కూతురి ఆలోచనలు తనకు అందటం లేదని మాధురి చెప్పుకొచ్చింది.
అప్పుడే తన చిన్ననాటి స్నేహితురాలు, మానసిక విశ్లేషకురాలు అయిన మాలతిని కూడా కలిసి వచ్చింది. తను మాత్రం భార్య భయాలూ, ఆలోచనలూ తేలిగ్గానే తీసుకున్నాడు.
కొన్ని నెలల క్రితం జరిగిన విషయాలు మరోసారి అతని మనోఫలకం మీదకొచ్చాయి.
**********
ఆ వారాంతంలో శ్వేత ఇంటికి రావటంతో మాధురి చిన్నపిల్లలా ఆనందంతో గెంతులు వేసింది. వరండా ముందు క్రొత్తగా ఎదుగుతున్న నైట్ క్వీన్ మొక్కని కూతురికి చూబించింది. అకస్మాత్తుగా పడిన వర్షపుజల్లుల్లో కూతురితో కలిసి తడిసింది. కూతుర్ని ఒక్క క్షణం వదలలేనట్లు రాత్రి పగలూ కబుర్లూ, షాపింగ్ ల మధ్య గడిపేసింది శనివారమంతా. ఆఫీసు పని వలన కూతుర్ని మిస్ అవుతున్నాడని శ్యామ్ ని వెక్కిరించింది కూడా.
ఆదివారం ప్రొద్దున్నే, తీరిగ్గా కూతురికోసం జంతికలు చెయ్యటం మొదలుపెట్టింది మాధురి.
‘ఎందుకమ్మా, కష్టపడతావ్? అన్నీ బయట దొరుకుతూనే ఉన్నాయి. ఎప్పుడు తినాలని ఉంటే అప్పుడు కొనుక్కుంటానుగా. హాయిగా నూన్ షో చూసి, ఎక్కడైనా బయట భోజనం చేసి వచ్చే వాళ్లం కదా.’ అంటున్న కూతుర్ని మురిపెంగా చూసుకుంటూ, ‘దొరుకుతాయిరా, కానీ ఇంట్లో చేసిపెడితే నాకు తృప్తిగా ఉంటుంది’ అంది.
తల్లీ కూతుళ్ల కబుర్లు కొంచెంసేపు శ్వేత ఆఫీసు పని గురించి, స్నేహితుల గురించీ, సినిమాల గురించీ నడిచీ, శ్వేత పెళ్లి వైపుకి మలుపు తిరిగాయి.
‘చిన్నీ, చదువయ్యాక కొన్నాళ్లు ఉద్యోగం అన్నావు. ఆ సరదా తీరింది. ఇంక బుధ్ధిగా మేము చూసిన సంబంధం చేసుకో’. మాధురి ఈసారి ఎలాగైనా కూతుర్ని పెళ్లికి సుముఖురాల్ని చెయ్యాలని పట్టుదలగా ఉంది. ‘ఆ ముచ్చట జరిపించటం తమ బాధ్యత కూడా’ అనుకుంటోంది.
మాధురి స్నేహితురాలు పద్మ కూతురు, ప్రేమించి పెళ్లి చేసుకుంది. పద్మ, ఆమె భర్త కూడా తమ పెద్దరికాన్ని కూతురు లక్ష్యపెట్టలేదని చిన్నబుచ్చుకున్నారు.
‘మధూ, నీ కూతుర్ని పెళ్లి విషయం తేల్చమను. ఎవరినైనా ఇష్టపడిందేమో కనుక్కో. ఎటూ వాళ్ల ఇష్టాల్ని కాదనమని తెలుసు వాళ్లకి. అన్ని విధాలా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే లోకజ్ఞానం, వయసు, ఆర్థిక స్వతంత్రం ఉన్నాయి కదా.’ అంటూ చెబుతూనే ఉంది పద్మ. కూతురి వైవాహిక జీవితం సంతృప్తికరంగానే ఉన్నా, తల్లిగా తనవైపు నుండి కొన్ని అసంతృప్తులు ఆమెలో ఇంకా ఉండిపోయాయి. అందుకే ఆమె మాటల్లో కూతురి పట్ల నిష్టూరం ధ్వనిస్తూనే ఉంటుంది.
‘మన పిల్లలవి మనలాగా మొక్కుబడి చదువులు కావు. పెళ్లి అనగానే తలొంచుకుని సరేననేందుకు మన కాలమూ కాదు.’
మాధురి ఆమె మాటలు విన్నప్పుడల్లా ఆలోచనలో పడుతుంది. శ్వేత ‘తాము చెప్పిన మాట వింటుంది, చూసిన సంబంధం చేసుకుంటుంది’ అని గాఢంగా నమ్ముతోంది. ఎంత చక్కగా పెంచింది తను! తన కూతురు అందరిలాటి అమ్మాయి కాదు. చదువు పూర్తి అయి, ఉద్యోగరీత్యా ఇల్లు వదిలి వెళ్లే వరకూ ‘అమ్మనాన్నలు చెప్పిందే వేదం’ అన్నట్టు నడుచుకునేది.
మాధురి ఆలోచనలు అకస్మాత్తుగా చెదిరాయి.
‘పెళ్లి మాట ఎత్తకమ్మా. పెళ్లి చేసుకునే ఆలోచన లేదు నాకు,’ అంటున్న శ్వేతని చూసి తను విన్నదేమిటో అర్థం కాక, కూతురు తనని ఆట పట్టించటానికి అలా మాట్లాడుతోండేమో అని చూసింది. అలాటి సూచన ఏదీ కనపడకపోయేసరికి, ‘ఏమిటా పిచ్చి మాటలు?’ అంటూ కసురుకుంది.
‘పిచ్చిమాటలేముంది? నా పెళ్లి – నా ఇష్టం. నాకు చేసుకోవాలని లేదు. అదే చెబుతున్నాను’ మనసులో మాట గట్టిగా చెప్పింది శ్వేత.
పిడుగుపాటులాటి ఆ మాటలకి మాధురి కళ్లు చెమరించాయి. ఇది ఊహించని సమాధానం. కూతురి ముందు బేలగా బయటపడకూడదని తనను తాను సర్దుకుంది.
‘ఏం, ఎందుకు చేసుకోవు? అదేదో ప్రపంచానికి కొత్త విషయంలా కొట్టిపారేస్తున్నావు. మన కుటుంబాల్లో ఎవరైనా పెళ్ళి చేసుకోకుండా మానేసేరా?’
‘అమ్మా, నువ్వు పెళ్లి చేసుకుని మూడు దశాబ్దాలు దాటింది. నువ్వు అప్పటి మనుషులు, అలవాట్లు, ఆచారాలు చూశావు. అవన్నీ ఇప్పటి కాలానికీ వర్తించేవే అనుకుంటున్నావు. బయట ప్రపంచాన్ని చూడు. ఎన్నెన్ని మార్పులు వచ్చాయో, వస్తున్నాయో తెలుస్తుంది. నువ్వు అంటూంటావుగా, నేను చూస్తున్న ప్రపంచం నువ్వు చూసిన దానికంటే చాలా విశాలమైనది అనీ, నాకళ్లతో చూసే ప్రపంచాన్ని గురించి నీకు చెప్పమనీ?’
ఒక్క క్షణం ఆగింది. తల్లి ముఖం అప్పటికే వాడిపోయింది. చేస్తున్న పని పూర్తి చేసి, చేతులు కడుక్కుంటున్న తల్లి ప్రక్కకి వచ్చి నిశ్శబ్దంగా నిలబడింది.
‘అమ్మా, పెళ్ళి మీద నీకున్నంత నమ్మకం నాకు లేదు. ఇప్పటి తరం జీవనశైలికి అదెంత వరకూ నప్పుతుందో చెప్పలేం. అలా అని ఎవరూ పెళ్లిళ్లు చేసుకోవట్లేదా అంటే చేసుకుంటున్నారు. కాని ఎన్ని పెళ్లిళ్లు మీ తరంలోని పెళ్లిళ్లులాగా కుదురుగా, స్థిరంగా ఉంటున్నాయి? చెప్పు?’
మాధురి మౌనంగా ఉండిపోయింది. మొన్న మొన్నటిదాకా ప్రతి విషయానికీ ‘అమ్మా, నాన్నా’ అంటూ తమ వెనుకే తిరిగిన పిల్లేనా ఇప్పుడు మాట్లాడుతున్నది? తనకెందుకో ఇదంతా కొత్తగా ఉంది. ఆమోదయోగ్యంగా లేదు. తనూ నిత్యం పుస్తకాలూ న్యూస్పేపర్లూ చదువుతుంది. తన స్నేహితులు వాళ్ల పిల్లల గురించి చెబుతున్న ఎన్నో సమస్యలు, కంప్లెయింట్లు వింటూనే ఉంది. కాని, శ్వేత చెప్పినట్టు, పెళ్లి అనేది ప్రస్తుతం ఇంత నిరసించదగ్గ విషయం కావడాన్ని మాత్రం అంగీకరించలేకపోతోంది.
‘అమ్మా, ప్రపంచాన్ని నీకు అలవాటైన కోణంనుండి కాకుండా చూసేందుకు, నీకు ఒక చిన్న ఉదాహరణ చెబుతాను, ప్రీతి తెలుసుకదా నీకు. తను తిలక్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరివైపూ పెద్దల ఆమోదం దొరకలేదు. వీళ్ల నిర్ణయాన్ని నిరసించనూ లేదు. అలా అని వీళ్లని దగ్గరకు తీసుకోనూలేదు. ఇద్దరూ బానే ఉన్నారు.
తిలక్ ఈ మధ్య ఉద్యోగరీత్యా తరచూ దేశం విడిచి వెళ్తున్నాడు, వస్తున్నాడు. ప్రీతిని, పాపాయిని తీసుకుని వెళ్లటం కుదరదు. ఇక్కడ ప్రీతి, అటు, ఉద్యోగాన్ని, ఇటు పాపాయిని చూసుకోవటంతో సతమతమవుతోంది. స్నేహితులమున్నాం. కాని భర్తకి దూరంగా ఉండటం, అమ్మ ఇంటికో, అత్తగారి ఇంటికో వెళ్దామని ఉన్నా ఇప్పటికీ వాళ్లు ఆదరించకపోవటం తనని చాలా బాధ పెడుతున్నాయి. ఊహ తెలుస్తున్న తన కూతురికి అందరూ ఉండీ, ఒంటరిగా పెరుగుతోందని బాధపడుతోంది.
ఆ మధ్య కూతురికి బావులేదని హాస్పిటల్లో చేర్చింది. మేమంతా సాయం చేసేం. మా కొలీగ్ శ్రీనాథ్ ఆమె వెంట ఉండి చాలా సహాయం చేసేడు. అది తనకి నచ్చలేదని తిలక్ అన్నాడట. శ్రీనాథ్ లో ఒక స్నేహితుణ్ణి, శ్రేయోభిలాషిని కాకుండా ఒక మగవాణ్ని మాత్రమే చూసిన తిలక్ ని ఎలా అర్థం చేసుకోవాలంటుంది ప్రీతి. దాని గురించి ఇంకా భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతోంది. అది ఎంతవరకూ వెళుతుందో అర్థం కావట్లేదు,’ శ్వేత చెప్పిన విషయం విని నిట్టూర్చింది,
‘నిజమే. తిలక్ అలా ఆలోచించకూడదు. అంతమాత్రాన పెళ్లి వ్యవస్థే నమ్మదగ్గది కాదు అంటే నేను ఒప్పుకోను. మన బంధువుల్లో నీ వయసు పిల్లలు బోలెడు మంది ఉన్నారు. వాళ్లెవరూ నీలా పెళ్లి వద్దని కూర్చోలేదు. ఇన్నాళ్లూ కాస్త సమయం ఇమ్మని చెప్పి ఇప్పుడసలు పెళ్లే వద్దంటున్నావ్. శ్వేతా, నా మనసు బాధ పెట్టకు. నువ్వు ఎవరినైనా ఇష్టపడితే చెప్పు. అంతేకాని, ఇలా మాట్లాడకు.’
‘నీకెలా చెప్పాలో తెలియట్లేదు. నాకు నమ్మకం లేనిది, అవసరం అనిపించనిదీ నువ్వు చేసుకోమంటే చేసుకుంటాననుకోకు.’
‘అయితే జీవితమంతా ఒంటరిగా ఉండిపోతావా? ఒక తోడు కావాలని నీకు అనిపించట్లేదా? మాకు ఉన్నదే నువ్వు ఒక్కదానివి. నీకు పెళ్లి చేసి ఆ ముచ్చట తీర్చుకోవాలని మాకు మాత్రం ఉండదా? కని, పెంచిన మా ఇష్టాల గురించి ఆలోచించవా? అయినా నీ వయసు పిల్లలు పెళ్లిచేసుకోవాలని, ఒక తోడు కావాలని కోరుకోవటం అసహజం కాదుకదా?’
‘అమ్మా, తోడు కావాలంటే పెళ్లే చేసుకోనక్కరలేదు. నచ్చిన వ్యక్తి దొరికినప్పుడు కలిసి జీవించటం బావుంటుంది. అంతవరకే. పెళ్లి అనే సంకెళ్లు వేసుకోనక్కర్లేదు. పిల్లలకోసం తాపత్రయ పడక్కరలేదు. ఆ సహచర్యం సాగినన్నాళ్లు సాగుతుంది. ఆ తర్వాత ఎవరి జీవితాలు వాళ్లవి. దాని గురించి కూడా దిగుళ్లు పెట్టుకోనక్కర్లేదు .’
Powered by wordads.co
We’ve received your report.
Thanks for your feedback!
Seen too often
Not relevant
Offensive
Broken
మాధురి కూతురివైపు విచిత్రంగా చూసింది. ఇదేమిటి? ఈ ఆలోచనలు తానింతవరకూ వినలేదే?!
తన చెల్లెలు రుక్మిణి, కూతురు లాస్య పెళ్లి కుదిరినప్పుడు, ‘అక్కా, శ్వేత ఇప్పుడే పెళ్లి వద్దంటోందని చెప్పావు నువ్వు. ఒక మంచి సంబంధం వచ్చింది. లాస్య కూడా అభ్యంతరం చెప్పలేదు. న్యాయంగా పెద్దపిల్ల కనుక ముందు శ్వేత పెళ్లి జరిగితేనే బావుంటుంది. కాని ఇప్పుడు పరిస్థితి ఇలా వచ్చింది’ అంది ఏదో అపరాధం చేస్తున్నట్టు.
తను నవ్వుతూ ‘ అలాటివేం పెట్టుకోకు’ అని కొట్టిపారేసినా, అప్పుడే ఒక న్యూనతా భావం కమ్ముకుంది.
శ్వేత ఆలోచనలు ఎందుకిలా ఉన్నాయి? తన పెంపకంలో లోపమా? పెళ్లి, కుటుంబ వ్యవస్థపట్ల కూతురిలో సరి అయిన అవగాహన కల్పించలేక పోయిందా తను? ఎక్కడుంది లోపం? ఒక తల్లిగా తను సరైన బాధ్యత నిర్వర్తించలేదా? భర్తకి చెబితే ఏమంటాడు? కూతుర్నే సమర్ధిస్తాడా? అసలు అతను కాదూ ఇన్నేళ్లూ కూతురి మాటలకి వంత పాడుతూ, పెళ్లి వాయిదా వేస్తూ వచ్చింది? తన దగ్గర చెప్పిన విషయాల్నే తండ్రి దగ్గర కూడా చెబుతుందా శ్వేత? ఏమి చెయ్యాలి తను?
శ్వేత ఆరాత్రే బయల్దేరి వెళ్లిపోయింది. తెల్లవార్లూ నిద్రపట్టక పక్కమీద మసులుతూనే ఉంది మాధురి. కిటికీ బయట చిక్కని వెన్నెల మనసుని సేదదీర్చలేకపోయింది.
*************
ప్రొద్దున్న శ్యామ్ ఆఫీసుకు వెళ్తూ దార్లో మాలతి క్లినిక్ దగ్గర తనను దింపాడు.
మాలతి అప్పుడే వచ్చినట్టుంది. క్లినిక్ లో ఆమె ఒక్కతే ఉంది. మాధురి తన మనసులో బాథ వెళ్లబోసుకుంది.
‘మధూ, శ్వేత చెప్పిన విషయం నాకు విస్మయాన్ని కలిగించటం లేదు. ఇప్పటి తరం ఆలోచనలు ఇలాగే ఉన్నాయి. నా దగ్గరికి కౌన్సిలింగ్ కోసం వచ్చే పిల్లల్ని, తల్లిదండ్రుల్ని చూస్తున్నాను కదా. ఈ మార్పు అనివార్యమనే అనిపిస్తోంది. మన అమ్మల కాలంలో చాలావరకు ఉమ్మడి కుటుంబాలే. వాళ్లు స్వంత ఊళ్లని వదలవలసిన అవసరం రాలేదు. మన తరం ఉద్యోగాల పేరుతో స్వంత ఊళ్లనీ, కన్నవాళ్లనీ వదిలి పరాయి ప్రాంతాలకొచ్చేసేం. ఇదంతా సహజంగానే జరిగిపోయిందనుకున్నాం. వెనుక మిగిలిపోయిన వాళ్ల ఆలోచనలు ఏమిటన్నది మనం అంతగా పట్టించుకోలేదు.
మనం పెరిగిన వాతావరణం ఒక్కసారి గుర్తు తెచ్చుకో. అలాటి బలమైన కుటుంబ వ్యవస్థలో, మనం పెరిగిన నేపధ్యంలో, అమ్మకి దీటుగా పెద్దమ్మలు, పిన్నమ్మలు, నానమ్మలు, అమ్మమ్మలు అందరూ మన వెనుకే ఉన్నారు. వాళ్లంతా మన కుటుంబంలో భాగంగానే ఉండేవాళ్లు.
మారుతున్న కాలంలో మన జీవితాలు ‘మనమిద్దరం, మనకిద్దరు లేదా ఒక్కరు’తో మొదలయ్యి, కొంచెం సంకుచితం అవుతూ వచ్చేయి. మనతరంలోనే కొందరు కుల-మత-వర్గాల్ని ప్రక్కకి పెట్టి పెళ్లిళ్లు చేసుకున్నవాళ్లున్నారు. వాళ్లకి సమాజం నుండి చాలా వ్యతిరేకత ఎదురైంది. అయినా పెళ్లిపట్ల, స్వంత నిర్ణయం పట్ల ఉన్న కమిట్మెంట్, వాళ్ల జీవితాల్ని సవ్యంగా నడిపించింది.
ఇప్పుడు ఉద్యోగాలపేరుతో పొరుగూళ్లు, పొరుగు రాష్ట్రాలు, పొరుగు దేశాలు పట్టుకు తిరుగుతున్నారు. ఇద్దరు, ముగ్గురే సభ్యులున్న కుటుంబం కూడా రెండు వేరువేరు చోట్ల జీవించాల్సి వస్తోంది. భార్య, భర్తల ఉద్యోగమనో, పిల్లల చదువులనో ఈ రకంగా సంసారాలు రెండు, మూడు ముక్కలుగా బ్రతికేస్తున్నాయి…….’
మాలతి మాటలకి అడ్డం వస్తూ మాధురి అంది, ‘ఏమో మాలతీ.. ఇవన్నీ వింటుంటే భయమేస్తోంది. ఏమయిపోతోంది మన సమాజం? ఎవరు కారణం ఈ మార్పులకి?’
‘అలా భయపడితే ఎలానోయ్ అమ్మాయీ?! నువ్వు కుటుంబం వరకే పరిమితమై బయట ప్రపంచాన్ని, వస్తున్న మార్పుల్ని గమనించట్లేదని చెబుతాను. ఇప్పుడున్న సమాజాన్ని ఎవరో ఎందుకు మార్చేస్తారు? మనం, మన పిల్లలు ఆ మార్పుకి కారణం. ఏ తరంలో అయినా యువతరం ముఖ్యనిర్ణయాల్ని చేస్తూ తమకు అనువైన కొత్త మార్పుల్ని తీసుకొస్తుంటుంది కదా. క్రిందటి తరంవాళ్లు వాళ్లకు అనువైన మార్పుల్ని తెచ్చుకున్నారు సమాజంలో. అది అప్పటి పెద్దలకి పెనుసవాళ్లనే విసిరింది. ఆ సవాళ్లని ఎదుర్కోటం ఇప్పుడు మన వంతు. Powered by wordads.co
We’ve received your report.
Thanks for your feedback!
Seen too often
Not relevant
Offensive
Broken
ఎక్కడికక్కడ ఎవరి జీవితాలు వారివీ, ఎవరి సమస్యలు వారివీ అయినప్పుడు, మిగిలిన వాళ్లకోసం ఆలోచించే తీరిక ఎవరికుంది?
నీ కూతురు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. అందుకే తన అభిప్రాయాన్ని అంత స్పష్టంగా చెప్పింది. తన ఆలోచనల పట్ల ఎలాటి అయోమయం లేదు తనకి.
ఇప్పటి వాళ్లు ప్రాక్టికల్ గా ఎదుర్కొంటున్న ఇబ్బందులున్నాయి. వాళ్లకి అనువుగా, సౌకర్యంగా ఉన్న నిర్ణయాల్ని వాళ్లు తీసుకుంటున్నారు. నీ కూతురికి కౌన్సిలింగ్ కావాలని అన్నావు కదూ. తనకు కౌన్సిలింగ్ ఇవ్వవలసిన అవసరం లేదు. నీకు మాత్రం కొంత అవసరం.’ నవ్వుతూ తను చెప్పదలచుకున్నది చెప్పింది మాలతి.
‘మాలా, నీకు వేళాకోళంగా ఉంది నా సమస్య. కూతురికి పెళ్లి చెయ్యాలన్న ఆశ, ఆ బాధ్యత తీర్చుకోవాలన్న తపన న్యాయమైనదేకదా’ మాధురి ముఖంలో అలక.
‘వేళాకోళం కాదు మధూ, మన చుట్టూ సమాజంలో విడాకుల రేటు పెరుగుతోందన్నది చూస్తున్నావుగా. జీవితాల్లో వచ్చిన వేగం, ఉద్యోగపు ఒత్తిళ్లు, పోటీ ప్రపంచంలో భవిత గురించిన అభద్రత ఇప్పటి తరాన్ని వేధిస్తున్నాయి. వాళ్లని వాళ్లు చూసుకోవటం, వాళ్ల పోరాటాలు …. ఇప్పుడు ఇవే జీవితంలో ముఖ్య సమస్యలు అయిపోయాయి. ఇంకా పెళ్లి, పిల్లలు లాటి జంఝాటాలు వాళ్లకి సహించరానివిగా ఉన్నాయి. ఇది నువ్వు ఒప్పుకుతీరాల్సిందే.
అదీకాక కూతురి పెళ్లి చెయ్యాలన్న ఆశ, దాన్నో బాధ్యతలా భావించటం – ఈ కాలానికి నప్పవు. నీ ఆనందం కోసం పిల్లలు, అది వాళ్లు పిల్లలుగా ఉన్నంతవరకే. పెంచటం వరకే నీ బాధ్యత. ఆ తర్వాత వాళ్ల జీవితాలమీద నీకు ఎలాటి హక్కూ లేదు. ఎందుకంటే అది వాళ్ల జీవితం. ఆ మంచి చెడులు వాళ్లని ఆలోచించుకోనీయటమే న్యాయం. నువ్వు చెయ్యవలసింది, అవసరమైనప్పుడు వాళ్ల వెనుక నువ్వు ఉన్నావన్న నమ్మకం వాళ్లకి కలిగించటంవరకే.’Powered by wordads.co
We’ve received your report.
Thanks for your feedback!
Seen too often
Not relevant
Offensive
Broken
‘అయితే ఇక కుటుంబాలు, వివాహ వ్యవస్థ సమాజంలోంచి మాయమైపోతాయా? సమాజం అంటే ఒంటరి వ్యక్తుల సమూహమేనా?’
‘ఎందుకు మాయమవుతాయి? ఈ తరం వాళ్లలో శ్వేతలాగా ఆలోచించేవాళ్లతోపాటు, నీ ఆలోచనలని సమర్ధించే వాళ్లు కూడా ఉన్నారు కదా. పెళ్లిళ్లు ఉంటాయి. అయితే విడాకులు, కుటుంబాలు విచ్చిన్నమవటం, మరింత పెరుగుతాయి. ఎదుటి వ్యక్తి కోసం ఆలోచించటం, సర్దుబాటు అనేవి లేనప్పుడు ఇది తప్పదు. ఒంటరి జీవితాలు అని నువ్వు అంటూన్నావే, అవి కొన్నేళ్లకి మనుషుల మధ్య కొత్త బంధాలకోసం ఆరాట పడేలా చేస్తాయేమో. ఆ తర్వాత మళ్లీ సమాజంలో ఒక స్థిరత్వం కోసం ప్రయత్నాలు మొదలవుతాయేమో! అప్పుడు మళ్లీ వివాహవ్యవస్థ కావాలని బలంగా కోరుకుంటారేమో! చూద్దాం.’.
ఎవరో పేషెంట్లు రావటంతో, మాధురి మళ్లీ కలుస్తానంటూ లేచింది. ఇంటికొస్తుంటే దారిపొడవునా ఆలోచనలే. ఊపిరి సలపనట్టుగా అనిపిస్తోంది. తనను అర్థం చేసుకుంటుందనుకున్న మాలతి కూడా, తన ఆలోచనాధోరణి ఈ కాలానికి చెల్లదని సూటిగా చెబుతోంది.
అమ్మవాళ్ల తరం కంటే కాస్త ముందడుగు వేసి, డిగ్రీ చదివి, అంతో ఇంతో ప్రపంచాన్ని గమనిస్తూ కూడా తను కూతురి అభిప్రాయాల్ని అర్థం చేసుకోలేని దశలో ఉందన్న వాస్తవాన్ని మాధురి ఒప్పుకోలేకపోతోంది. తరానికి తరానికి మధ్య ఈ అగాధాలు పూడ్చలేనివేనా?
*******************
Powered by wordads.co
We’ve received your report.
Thanks for your feedback!
Seen too often
Not relevant
Offensive
Broken
సినిమా ఆసక్తిగానే అనిపిస్తున్నా, మధ్యమధ్యలో భార్య గురించిన ఆలోచన శ్యామ్‌ని కాస్త అస్థిమితం చేస్తూనే ఉంది.
‘ఈ సినిమాలో హీరోయిన్ తన జీవితాన్ని తనకు కావలసినట్టు మలుచుకుంది. ముందు పిరికిగా కనిపించి, ఏడుస్తూ కూర్చున్నా, బయటి ప్రపంచంలోకి వచ్చాక తనకు కావలసినదేమిటో నిర్ణయించుకునే మెట్యూరిటీ ని సంపాదించింది. సినిమా పేరుకి, ఆ నాయిక పాత్రకి తగినట్టుగానే, నిజంగా ‘క్వీన్’ లాగే తన జీవితాన్ని తను రచించుకుంది. నీకు నచ్చిందా డాడ్’ అంటూ అడుగుతోంది శ్వేత సినిమా నుండి వస్తూంటే.
శ్యామ్ కూతురి అభిప్రాయాన్ని అంగీకరించాడు. కథానాయిక పాత్రని అద్భుతంగా పోషించినందుకు కంగనా రనౌత్ కి జాతీయ అవార్డ్ వచ్చిందని చెబుతోంది శ్వేత.
అవును, క్వీన్ ఈ కాలపు పిల్ల. తనకు ఏం కావాలో తనే నిర్ణయించుకుంది.
శ్వేత తన జీవితం పట్ల తీసుకున్న నిర్ణయాన్ని మాధురికి అర్థం అయ్యేలా చెప్పడానికి సన్నద్ధమయ్యాడు శ్యామ్ .
******************
It is all about easy life. No commitment, no contentment. World is changing so much that we don’t know what changes next minute.
Nice story . Present day scenario in writers’ words .
It’s a very relevant story for the current generation and their thought process. Even if some of us from prior generation finds this surprising or uncomfortable this may be more suitable for their lifestyles ? Very thought provoking story! Thanks to the writer!
Loved the story. It discusses the difference of perspectives due to generation gaps.
It was really nice story which the current youth has to follow. Anuradha garu always inspires with her stories.