నాతోనే ఉంటావు న‌న్నే న‌డిపిస్తావు …

పాట:
మ‌న‌సా మ‌న‌సా మ‌న‌సారా బ్రతిమాలా త‌న వ‌ల‌లో ప‌డ‌బోకే మ‌న‌సా..
పిలిచా అరిచా అయినా నువ్ విన‌కుండా త‌న‌వైపు వెల‌తావ మ‌న‌సా..
నా మాట అలుసా
నేనెవ‌రో తెలుసా
నాతోనే ఉంటావు న‌న్నే న‌డిపిస్తావు న‌న్నేడిపిస్తావే మ‌న‌సా..
మ‌న‌సా మ‌న‌సా మ‌న‌సారా బ్రతిమాలా త‌న వ‌ల‌లో ప‌డ‌బోకే మ‌న‌సా..
పిలిచా అరిచా అయినా నువ్ విన‌కుండా త‌న‌వైపు వెల‌తావ మ‌న‌సా..
చ‌ర‌ణం – 1
ఏముంది త‌న‌లోన గ‌మ్మత్తు అంటే
అది దాటి మ‌త్తేదో ఉందంటు అంటూ
త‌న‌క‌న్నా అందాలు ఉన్నాయి అంటే
అందానికే తాను ఆకాశ‌మంటూ
నువ్వే నా మాట.. హే…
నువ్వే నా మాట విన‌కుంటే మ‌న‌సా..
తానే నీ మాట వింటుందా ఆశ‌
నా మాట అలుసా.. నేనెవరో తెలుసా
నాతోనే ఉంటావు న‌న్నే న‌డిపిస్తావు నన్నాడిపిస్తావే మ‌న‌సా..
మ‌న‌సా మ‌న‌సా మ‌న‌సారా బ్రతిమాలా త‌న వ‌ల‌లో ప‌డ‌బోకే మ‌న‌సా..
పిలిచా అరిచా అయినా నువ్ విన‌కుండా త‌న‌వైపు వెల‌తావ మ‌న‌సా..
చ‌ర‌ణం – 2
తెలివంత నా సొంత‌మనుకుంటు తిరిగా
త‌న‌ముందు నుంచుంటే నా పేరు మ‌రిచా
ఆ మాట‌లే వింటు మ‌తిపోయి నిలిచా
బ‌దులెక్కలుంద‌ంటు ప్రతి చోట వెతికా
త‌న‌తో ఉండే… హే….
తనతో ఉండే ఒక్కొక్క నిమిషం మ‌ర‌లా మ‌ర‌లా పుడ‌తావా మ‌న‌సా
నా మాట అలుసా నేన‌వ‌రో తెలుసా
నాతోనే ఉంటావు న‌న్నే న‌డిపిస్తావు న‌న్నాడిపిస్తావే మ‌న‌సా..
మ‌న‌సా మ‌న‌సా మ‌న‌సారా బ్రతిమాలా త‌న వ‌ల‌లో ప‌డ‌బోకే మ‌న‌సా..
పిలిచా అరిచా అయినా నువ్ విన‌కుండా త‌న‌వైపు వెల‌తావ మ‌న‌సా..
సినిమా:మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్
రచయిత:సురేంద్రకృష్ణ
గానం:సిద్ శ్రీరామ్
సంగీతం:గోపి సుందర్
కొని పేర్లు పరిచయం లేనట్టుగానే అనిపిస్తాయి.
కొంతలోనకెళ్ళి ఆలోచన చేస్తే ఖచ్చితంగా ఆ నైపుణ్యమున్న వ్యక్తి మనలో ఒకడిగా మనకు పరిచయం అవుతాడు.మనమంతా దృష్టిని ఒకే చోట కేంద్రీకృతం చేస్తాము.ఎంతసేపు అదే నచ్చుద్ది.కొత్తదనాన్ని అంత తొందరగా స్వీకరించలేం.నేటి పరిస్థితులు అందుకు భిన్నం. పాతనీరు వెళ్ళి కొత్తనీరు వస్తూనే ఉంది.దాహానికి పనికొచ్చేవా,దేహానికి పనికొచ్చేవా అనే విషయం వదిలేద్దాం.ముందు స్వాగతం పలుకుదాం.ఆదరిద్దాం.
ఈ కాలమ్ లో నేను తీసుకున్న రచయిత సురేంద్రకృష్ణ పాటల రచయితే కాదు,మాటల రచయిత కూడా.గిల్లికజ్జాలు సినిమాతో సినీరంగంలోకి ప్రవేశించాడు.తమ్ముడు సినిమాలో “ఏదోలా ఉందీ వేళ నాలో” అనే  ఓ సూపర్ హిట్ సాంగ్ రాశాడు.కొత్తగా అతను రాసిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ” సినిమాలోని పాటను మీ ముందుకు తీసుకొస్తున్నాను.
ఈ పాటంతా మనసు చుట్టూ తిరుగుతుంది.
మనసనగానే “మనసుకవి” ఆత్రేయ గుర్తొస్తాడు.మూగమనసు సినిమాలోని ఓ పాటలో మనసు గురించి “మనసు మూగదే గాని బాసున్నది దానికి,చెవులుంటే మనసుకే వినిపిస్తుంది అది” అని ఆయన రాసిన మాటలు గుర్తొస్తాయి.
మనసు పేరు చెప్పగానే ఎన్నో పాటలు గుర్తొస్తాయి.మౌనమే నీ భాష ఓ మూగ మనసా,మనసు పలికే మౌనగీతం,మనసున మనసై బ్రతుకున బ్రతుకై,తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో,మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా ఇలా ఎన్నో ఎన్నో పాటలు వేడుక చేస్తాయి.ఈ పాటలో కూడా రచయిత మనసును తీసుకొని మనసుతో తన
భావాలు పంచుకుంటూ సుతిమెత్తగా మనసును బతిమాలినట్టుగా రాశాడు.
మనసు గురించి పూర్తిగా అధ్యయనం చేయాలంటే మనస్తత్వ శాస్త్రం చదవాల్సిందే.మొదట పల్లవిలోనే మనసు కొన్ని సందర్భాల్లో మనిషి మాట వినదనే అభిప్రాయంతోనే రచయిత మొదలు పెట్టాడు.
వాస్తవంగా ఇడ్,ఈగో,సూపర్ ఈగో లాంటివి మనిషిపై ప్రభావం చూపుతుంటాయి.ఓ అంతర్యుద్దం,ఓ సంఘర్షణ రోజు లోపల జరుగుతూనే ఉంటుంది.ఆ పెనుగులాటంత ఈ పాటలో కన్పిస్తుంది.
మనసు దోబూచులాడుతుంది.చెప్పిన మాట వినదు.మనిషి మనవాడేనని అలుసుగా తీసుకుంటుంది.ఒక్కోసారి మనసు ఈ మనిషి ఎవరనేంతలా ఓ ప్రశ్న వేసి సందిగ్ధావస్థలోకి నెట్టేస్తుంది.
మనిషి అద్దమయితే,మనసు ప్రతిబింబం కావాలి కానీ అప్పుడప్పుడు సీన్ రివర్సయిద్ది.అద్దం ముక్కలవుద్ది.
అప్పుడు అరిచినా ప్రయోజన ముండదు.పల్లవి అంతా ఈ నేపథ్యంతో సాగుతుంది.”నాతోనే ఉంటావు నన్నే నడిపిస్తావు నన్నేడిపిస్తావే మనసా”అంటూ
పల్లవిలో రచయిత మనసు స్థితిని గురించిన నిర్వచనాన్ని ఓ రెండు పదాల్లో ఎంతో ఆకట్టుకునేలా చెప్పాడు.
మొదటి చరణంలో మత్తు,గమ్మత్తు అంటూ ప్రాస పదాలతో పాటకు అందాలనద్దాడు.అందానికి ప్రతీకగా ఆకాశాన్ని తీసుకొని ఎంతో ఎత్తున నిలబెట్టాడు.నిజంగా ఈ రోజుల్లో యువతకు మనసు అదుపులో ఉంటుందా?మనసును అదుపులో పెట్టగలమా?మనసును అదుపులో ఉంచుకోవటమంటే ఇంద్రియాలను కట్టడిచేయటమే.మనసు తనను ఇష్టపడుతుంది ,తన మనసు మరి నన్ను ఇష్టపడుతుందా అన్నట్టుగా వాక్యాలు frame చేస్తూ “తానే నా మాట వింటుందా ఆశ” అని రచయిత one way లో వెళ్ళే వాళ్ళకి హెచ్చరికలు జారీ చేశాడు.
మనిషి బుద్దిజీవి.తెలివితేటల పుట్ట.ఆదిమానవుని కాలం నుండి ఇప్పటివరకు ఎన్నో కొత్త కొత్త ఆలోచనలతో,ఆవిష్కరణలతో ముందుకు సాగుతున్నాడు.తనను తాను మరిచిపోయేంతలా ఎదుటి వాళ్ళముందు లొంగిపోవటం అసాధ్యం .కానీ ప్రేమ అనే మత్తుకు ,గమ్మత్తుకు ఎంతటివాడైనా దాసోహమవ్వాల్సిందే.మనసునంతా ఒకే చోట లగ్నం చేసినప్పుడప్పుడు తినటం,పడుకోవటం ఏదో చేయాలనే ధ్యాసే ఉండదు.అంతా తానే అన్నంత మతిపోతుంది.తనతోనే ఉండాలనిపిస్తుంది.తనను చూసుకుంటూ అలా ఉండిపోవాలనిపిస్తుంది.తన మాటల తీయదనాన్ని దోసిట్లోకి ఒంపుకోవాలనిపిస్తుంది.ఇలా రకరకరకాల ఆలోచనలతో ఉన్న మనసును కొత్తగా పుట్టాలని రచయిత కోరుతూ “తనతో ఉండే ఒక్కొక్క నిమిషం మరలా మరలా పుడతావా మనసా”అంటూ ఓ ధీనస్థితిలో పీకలలోతుల్లోకి కూరుకుపోయిన ఓ sensitive ప్రేమికున్ని పరిచయం చేశాడు.రెండవ చరణమంతా మనిషిలోంచి మనసు బయటపడుతుంది కానీ మనసులోంచి మనిషి బయటపడడు అన్నట్టుగా
చూపించాడు. మనసు,మనిషి నిజానికి శత్రువులా?మిత్రులా? ఏదో ఒకటి కావచ్చు.కానీ రెండు కలిసి విజయం సాధించినప్పుడే  ఆ మనిషి సంపూర్ణమైనవాడు.రచయిత ఈ పాటలో రెండు దేహాలు,రెండు మనసులు ,కొన్ని ఆలోచనలు, కొంత ప్రేమ ,కొన్ని ప్రాసలు వాడి చక్కగా మనసుభాషను చిత్రించాడు.
మనసుతో ముడిపెట్టటపడిన పాటలోని కొన్ని అనుబంధ పదాలు..
1) మనసు-వల
2) మనసు-అరుపు
3) మనసు -అలుసు
4 ) మనసు -మత్తు,గమ్మత్తు
5 ) మనసు- అందం,ఆకాశం
పాటలో రచయిత వాడిన ఈ పదాల ప్రవాహం శ్రోతను ముంచెత్తుతుంది.వీటిలోని depth ness మనల్ని ఇంకా ఇంకా ముందుకు ఏవో ఆలోచనల్లోకి తీసుకెళ్ళగలదు.మనసు వేగాన్ని మనం ఎంత రికార్డు చేసినా ఇంకాస్త మిగిలే ఉంటుంది.మనసును గూర్చి ఓ చోట కొన్ని అక్షరాల్లో situation  తగ్గట్టుగా తీసుకురావటమనేది రచయిత మేధను పట్టిస్తుంది.మనసు గురించి మనసు పెట్టి రాసిన ఈ రచయితో సృజనాకారుడని చెప్పవచ్చు.
*

తండ హరీష్ గౌడ్

35 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • బాగుంది… మీ విశ్లేషణ చాలా అద్భుతంగా ఉంది.

  • సినిమా శీర్షిక సిల్లీగా ఉన్నా అందులోని పాట పరమార్థం మాత్రం మనసు లోతుల్లోకి వెళ్ళింది. అలాగే మీ విశ్లేషణ శీర్షిక కూడా బహు పెద్దగా ఉన్న అందులోని వివరణ మాత్రం పాట పరమార్థం కంటే అపరిమితంగా ఉంది.

  • ఒక పాట లో ఇంతటి విశ్లేషణ ఉంటుంది అని చూపించారు . ఏది ఏమయినా ఒక అద్భుతమయిన పాట కు మీ కవిత్వ భావం తో చాల లోతైయినా పదాలతో మంచి వివరణ ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు సర్. 🙏🙏

  • ఆలోచన రావడం ఒక ఎత్తు
    పదాల కూర్పు మరో ఎత్తు……….
    పదాల పాదాలు కదలడం
    ఆ పాదాలకు లయ తోడవడం
    అది కవితాలయంలో
    మనసును ఆవిష్కరించడం
    పాఠకులను తన గమ్మత్తు తో
    మత్తులోకి దించడం
    హరీశ్ గమ్మత్తు
    అతనికి మాత్రమే సొంతమైన
    కవితా జగత్తు.
    చక్రవర్తుల శ్రీనివాస్….

  • I am really impressed with your analysis.
    I appreciate you.
    Thank you for your support.
    Sincearly
    Surendra krishna.

    • Thank you very much for ur valuble comment sir..these lines are telling about ur nature..iam impressed alot sir..

  • ఈటీవీ సుమన్ గారు రాసిన
    ” మనసా మనిషంటే నీకింత అలుసా ”
    గుర్తుకు వచ్చించి
    మనసు పాట గురించి
    చాలా బాగా రాసారన్నా👏👏
    మనఃపూర్వక అభినందనలు 💐🌹💐

  • ఎంతో అప్ డేటు గా ఉన్నారు అన్నా.ఇప్పటి సినీసాహిత్యంలో మంచిపాటలు వస్తలేవు అన్న మాటను తుడిచేస్తుంది ఈ శీర్షిక.పరిశోధనాత్మకంగ,విశ్లేషణాత్మకంగ సాగింది వ్యాసం.చివరలో మనసుతో జతచేసిన పదాలను ప్రస్తావించడం బాగుంది.మరిన్ని గొప్పపాటలు మీ శీర్షికలో కండ్లు తెరవాలనీ…

      • Your analysis was great sir, A person who had described about songs very nicely will become greatest achiever. You made such good analysis sir.

  • ఒక రచయిత తాను ఎంచుకున్న subject ఏదైతే ఉందో ఆ subject నే పదేపదే ఆలోచించి ఒక పాట కానీ ఒక కథ కానీ రాసాడు, అదికూడా నలుగురికి నచేవిధంగా రాయాలంటే మాములు విషయం కాదు, అలాంటిది మీరు ఆ పాటను ఇంత గొప్పగా అర్థం చేసుకొని విశ్లేషించడం మాములు విషయం కాదు, రచయిత యొక్క భావాలను చాలా చగగా అర్థం చేసుకున్నారు. సూపర్ సర్

  • చాలా బాగా విశ్లేషించారు అన్నా.. చాలా బాగుంది

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు