నాజీరు

కొత్త నేపథ్యం నుంచి ఇండస్ మార్టిన్ చెప్తున్న కథలు

ఇండియా దేశంలో పొష్టు పొష్టు తెల్లదొరలు కట్టిన కాలేజీ ‘చర్చ్ మిషనరీ సొసైటీ కాలేజ్ ఆఫ్ కోటయం’. దీన్నే ఇప్పుడు సీ ఎమె సీ కోటయం అంటారు. కేరళలోని ట్రావణకోర్ సంస్థానంలో 1817లో దీన్ని కట్టారు. ఆతరవాత బంగ్లా రాష్ట్రంలోని సిరంపూరూలో కూడా విలియం కేరీ దొరగారు మరో ఇద్దరు దొరలతో కలిసి 1818లో మరో కాలేజీ కట్టారు. ఆ తరవాత రూర్కీ ఐ ఐ టీ, బొంబే యూనివర్సిటీలు కూడా వచ్చాయి. అయితే తెలుగు నేలమీదకి కాలేజీలు రాటానికి మటికి వుంకో ఎనబై ఏళ్ళే పట్టింది. జాన్ క్రిస్టియన్ ఫ్రెడ్రిక్ హయ్యర్ దొరగారు 1885 లో గుంటూరు లో మా ఏసీ కాలేజీని కట్టారు. ఆంధ్రా క్రిస్టియన్ కాలేజ్.. అదీ మా కాలేజీ పేరు. ‘యునైటెడ్ లూథరన్ చర్చ్ ఇన్ ఎమేరికా ‘ సంస్థ పంపించగా వచ్చిన దొరల్లో ఈయన చానా దయగలిగిన మనిషి అని పేరు.

ఆయనే ఆంధ్రా ఇవాజెలికల్ లూథరన్ చర్చీని కూడా గుంటూరు కేంద్రంగా మొదులుపెట్టాడు అని మా నాయన చెప్పగా మొదటి సారి ఇన్నాను. ఆయన్ని మానాయన ఫాదర్ హయ్యర్ అనేవోడు. ఆయనేగాదు… మా చర్చీ జనాలంతా అయన్ని అట్టాగే ఇప్పుటికీ పిలుత్తారు. ఆయనలాంటి ఇంకా చానా మంది దొరలు అప్పుట్లో మా కాలేజీలో పాఠాలు చెబుతా, హాస్టళ్ళలో వార్డెన్లుగా పనిజేత్తా వుండేవోళ్ళంట. ఆళ్ళందరి పేర్ల మీద మా కాలేజీకి మొత్తం అయిదు హాస్టళ్ళు ఉండేవి. స్ట్రాక్ హాలు, వుల్ఫ్ హాలు, హయ్యర్ హాలు, గన్ హాలు, బుల్లర్డ్ హాలు. ఈ టన్నిటికీ గరిమనాభి స్ట్రాక్ హాలే. ఎందుకంటే అది మా ఆడపిల్లల హాస్టలు. మా అమ్మలూ, అప్పజెల్లెళ్ళూ, ఆంట్లూ చానా మంది సదివిన హాస్టలు అది. దానికి పక్కనే వుండేది వుల్ఫ్ హాలు. వుల్ఫ్ దొరగారి పేరు మీద పెట్టిన హాస్టల్ అన్నమాట. ఏసీ కాలేజీలో ఆర్ట్స్ సబ్జెక్టులు సదివిన మహా మహా వీరోలంతా అందులోనుండే వచ్చారని మా కాలేజీలో కతలు కతలుగా చెప్పుకునేవోళ్ళు. కానీ అట్టా ఫైల్లోకి వొచ్చిన ఒక్క హీరూ గూడా మా ఆస్టలు గురిచ్చీ, కాలేజీ గురిచ్చీ ఎక్కడా ఆళ్ళ ఆత్మకతల్లో మాట వరసకు కూడా చెప్పకపోవటమే నాచేత ఈ కతల్ని రాపిస్తందంటే మీరు నమ్మరుగాక నమ్మరు. కానీ మరియమ్మ తల్లి తోడు… అదే సత్యం.

అట్టాటి వుల్ఫ్ హాలులోకి ఒకరోజు పోలీసులు ఇరుసుకుపడి దొరికినోడ్ని దొరికినట్టు పొట్టుకుని స్టేషనుకి ఈడ్సుకు పోయేరు. ఆ యాడాది జులై 17 వ తారీకున మా కాలేజీ మొత్తం కారంచేడు అనే వూరి గురిచ్చి మాట్టాడుకున్నారు. అంతకు ముందు రోజు ఆ కారంచేడులో మా మాలా మాదిగలకు చెందిన తాగేనీళ్ళ చెరువులో బరిగొడ్లను తోలిన కమ్మోళ్ల కుర్రోడ్ని సువార్తమ్మ అనే మాదిగోళ్ళ అక్కాయి గదమాయిచ్చిందని ఆ తెల్లారి సుట్టుపక్కల వూళ్ళల్లో వుండా కమ్మోళ్ళ మొగ మనుషులంతా కలిసి మా పల్లెల మీద పడి మా మొగోళ్ళని గొడ్డును నరికినట్టు నరికేరనీ, పొత్తికడుపుల్లో బరిశలు నాటి కసకసా మెలితిప్పేరనీ, చానామంది ఆడగూతుళ్ళను చెరిచేరనీ … ఇట్టా చానా దిగులు పుట్టిచ్చే మాటలు చెప్పుకున్నారు. నాలాంటి పిల్లకాయలకు అదంతా అర్ధం కాలేదు గానీ బియ్యే సదుంకునే గోవతోటి పీటరు, చింతల రమేషూ, మంచాల మోహన్ రావూ అసుంటి అన్నాయోళ్ళకి మటికి యమా మూగ కోపం వొచ్చింది. ఆ కారంచేడు సుట్టుపక్కల మాల మాదిగి గూడేలనుంచి వొచ్చిన సదవర్లు చానా దిగులు పడతా ఆళ్ళ ఇళ్ళల్లో అన్నా అక్కలు,  అమ్మా అయ్యలు ఎట్టా వుండారోనని కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు.

నాకు ఇల్లొదిలిపెట్టి ఆస్టల్లో వుండటం అదే మొదుటితూరీ కాకపోయినా ఏసీ కాలేజీ యవ్వారం, అక్కడ ఆస్టళ్ళలో డిగ్రీ సదవర్ల నకరాలూ పొష్టుకాడినుండీ అయోమయంగానే వుండేవి. ఆరోజు జులై 18, గురువారం. ఎప్పుటికిమల్లే ఏడున్నరకల్లా డైనింగు హాలు తెరిచారు. వారం ఇంత బాగా గుర్తుందంటే మనమేదో యమా వింటలిజెంటు అనుకోమాకండి. మా ఆస్టళ్ళల్లో  రోజుకొక రకం చొప్పున టిఫిన్లూ, కూరలూ వండటం రూలు. ఆ ఫిర్కాలో, ఆ ఇరవై ముప్పై యేళ్ళలో మా ఆస్టళ్ళలో పెట్టిన తిండి గురిచ్చి ఇప్పుటిమటికీ జనాలు కతలు కతలుగా చెప్పుకుంటారు. గూడేలలో, పల్లెల్లో మగతా పనులకూ, ముఠా కూలీలకూ ఎల్లే కుటంబాల్లోనుంచి వచ్చిన మా పిలకాయలకే కాదు, కలిగిన కులాల పిల్లలకూ, ఆళ్ళ అమ్మా అయ్యలకూగూడా ఆ తిండి అప్పుట్లో నోరెళ్ళబెట్టిచ్చే సంగతే. మాకు సోమవారం ఉప్మాతో మొదలయ్యేది. ఎవుడికీ ఇష్టం వుండేదిగాదు. అయినా ఒక్కడు గూడా కిక్కురుమనేవొడుగాదు. దానికి కారణం ముందురోజు ఆదివారం తిండి. దాని గురిచ్చి ఉంకో కతలో ఇవరంగా మాట్టాడుకుందారి. మా గురువారం, వారంలో నడిమజ్జ రోజు కామట్టి ఊతప్పంతో మొదలయేది.

రొండు అరిచేతులంత వూతప్పాలు మూడేసి పొట్టుకొచ్చి అరిటాకుల్లో ఏసేవోళ్ళు. ఒక్కొక్కటీ మా డైనింగు టేబులంత మందంగా వుండేది. ఏసీ ఎయ్యంగానే మేము ఆ ఊతప్పాల మజ్జలో తొక్కుడుబిళ్ళంత కంతలు కత్తిరిచ్చి ఆ ముక్కల్ని నవలతా కూకునేవోళ్ళం. అప్పుడు మా మార్కు బాబాయో, పెరుమాళ్ళు బాబాయో వొచ్చి (మా కుక్కుల్ని అట్టాగే పిలుసుకునేవోళ్ళం) ఆ కంతలు పొర్లిపోయేతట్టు శనగపొప్పు కొబ్బిరి కలిపి రుబ్బిన చెట్నీ ఏసేవోళ్ళు. సుట్టూ పొర్లిపోతన్నా చట్నీ ఆకు దాటేలోపు మేం ఊతప్పాల్ని చుట్టూతా గబగబా తుంచి ఆ ముక్కలతో సుక్కగూడా వుర్దా కాకుండగా యమా వాటంగా ఎత్తి నోట్లో పెట్టుకునేవోళ్ళం. మజ్జమజ్జలో వుల్లిపాయా, పచ్చి మిరగబాయా ముక్కలు కసిక్కున తగలతా, కమ్మటి శనగపొప్పు చెట్నీ నాలికమీద మాదిఫలరసాయనంలాగా కమ్ముకుంటండగా ముక్కా ముక్కా తినే ఆ వూతప్పాల గురువారాన్ని అమ్మ బాయితాగిన ఏ గైరునాబట్టా మర్చిపోలేడు. అందుకే ఆరోజు నాకు బాగా గుర్తుంది.

అట్టా టిఫిను తిని బ్రాడీపేట ఖాధీభాండారులో కొన్నా ఖద్దరు రుమాలుకు తుడుసుకుంటా చేతిలోకి ‘కాలేజ్’ బ్రాండు వైరు బైండిగ్ (స్పైరల్) నోట్సును తీసుకుని రోడ్డు దాటి కాలేజీ లోకి అడుగు పెడతంతోటే లోపల స్పర్జన్, పిడుగురాళ్ళ శ్యాం అసుంటి పెద్దన్నోళ్ళు ‘అరేయ్… ఇయ్యాల స్ట్రైకు… అందరూ పోయి వుల్ఫ్ హాలు ముందు నిలబడండి… రాస్తారోకో చెయ్యాల… దొబ్బున పదడి అని గంబీరకంగా చెప్పి బయటకు పోయేరు. నేను మా సావాసగాళ్ళు వడ్డే జయచంద్రా, కోరే సురేంధ్రలను ఎతుక్కుంటా లోపలికి పోయేను. అట్టా ఆళ్ళకోసం ఒక అర్దగంట లోపలే తిరిగి, ఎవుడూ అగపడకపోయేతలికి మెల్లిగా బయటకు వొచ్చేను. నేను రోడ్డు మీదకి వొచ్చేతలికి జనాలు అరుసుకుంటా అటూ ఇటూ లగెత్తుతున్నారు. నాకు ఏవీ మతికిపోలా… దూరంగా మున్సిపాల్ గెస్టు హవుసు సెంటర్లో నడిరోడ్డు మీద ఆర్టీసీ బస్సొకటి ఆపి వుంది. నేనుగూడా రొండు అంగల్లో రోడ్డు దాటి వుల్ఫ్ హాలు ఆస్టలు లోకి లగెత్తడం మొదలు పెట్టా. ఎనక నుండి ఎవుడో మా ఆస్టలోడు..’లగెత్తండ్రా పోలీసులొత్తన్నారు…. మనోళ్ళు బొసును పలగగొటేరు… పరారవ్వండి…’ అని అరిసేడు. నాకు ఏం జరుగుతుందో అర్ధంకాలేదు. తలకాయ మొత్తం బకింగ్ హాం కాలవ సుడిగుండలో పడ్డప్పుటికిమల్లే తెల్లటి బయ్యంతో నిండిపోయింది. నేను లగెత్తటం మొదులుపెట్టా… పోలీసులచేతిలో అరెస్టు అవ్వడం అన్నా, పోలీసులు ఇంటికి రావటం అన్నా అన్నిటికన్నా నామర్దా పనులు అని మా ఇంట్లో, మా సుట్టాల ఇళ్ళల్లోగూడా అనుకునేవోళ్ళు.  గ్రౌండును దాటి ఆస్టల్ వికెట్టు గేటులోకి పోయా.. ఎనకాల ఎవురో తరుంతున్నట్టు ఇనపడింది. నేను ఆగకుండగా మెట్లు కిందనుండి డైనింగు హాలు దిక్కు లగెత్తా… యనకమాల తరువుతున్న సప్పుడు ఆగలా… నేను మా వంటగదికి అడ్డంపడి ఆస్టలు ఎనకమాల గోడ దెగ్గిరికి వొచ్చి ఆగిపోయా…. తొమ్మిదడుగుల గోడ.. ఎగిరినా అంచు దొరకదు…చుట్టూ చూత్తే గోడవారగా పోసి వుండా వరి వూక దిబ్బ కనపడింది. ఆ దిబ్బగనక ఎక్కితే గోడమిదికి పోవచ్చని అనిపిచ్చింది. దిబ్బ ఎక్కటం మొదులుపెట్టా… ఎక్కుతున్నాకొద్దీ దిబ్బ జారిపోతంది… ఎనకనుండి బూట్లసప్పుడు దగ్గర పడింది… ఇక ఆకరి శాన్సు అన్నట్టు ఎనక్కి వొచ్చి అదుగో పట్టు అని అమాంత దిబ్బ మీదకు చేరుకున్నా… ఆడనుండి ఎట్టా గోడ ఎక్కానో… ఎట్టా అంత ఎత్తునుండి దూకానో.. ధబేల్మని కింద వుండా బాత్రూం నీళ్ళ గుంటలో పడ్డా…నాకేం జరుగుతుందో తెలీదు…బయ్యం…. పోలీసులు…లాఠీలు… ఇవే కళ్ళముందు మెదులుతున్నాయి. అక్కడినుండి లెగిసి మా ఆస్టలు ఎనక వుండా పోలీసు క్వార్టర్ల మీదగా నగరం పాలేం రోడ్డెక్కేదాకా పరుగు ఆపలా… దొరక కూడదు… అరెస్టు అవుతే మళ్ళీ ఉజ్జోగం రాదు… ఏ పని చెయ్యాలన్నా పోలీసు కేసులు ఉండగూడదు, పోలీసు టేషనుకెళ్ళాడనే అగమానం మా అమ్మా అయ్యలకు ఇయ్యగూడదు… ఇట్టాంటి ఆలోచనలతో నగరంపాలెం స్టేట్ బ్యాంకీ దెగ్గిరికొచ్చిపడ్డాను.

ఎవురికి ఏవయ్యిందో తెలవదు. ఎంతమందిని పోలీసులు పొట్టుకు పోయేరో తెలీదు. ఎనక్కి పోయే దైర్న్యం లేదు. అసలు మావోళ్ళను ఎందుకు అరెస్టు చేత్తన్నారో తెలీదు. కారంచేడులో మావోళ్ళను సంపీ, చెరిచీ అవతల నూకితే ఆళ్ళ బిడ్డలుగా మేం చూపిచ్చే అంతమాత్రం నిరసన ‘నేరం ‘ ఎట్టాగయ్యిందో ఇప్పుటికీ తెలీదు. మండల్ కమీషనప్పుడు ఆసావుల పిల్లలు పలగగొట్టిన బొసులూ, రైళ్ళూ, గవుర్నమెంటు ఆపీసులూ గుర్తుకొస్తాయి. ఆళ్లను ఎవుడూ ఏవీ ఎందుకనలేదో తెలీలేదు. గవుర్నమెంటు అంటే ఆళ్ళేగామట్టి ఆళ్ళ ఆస్తుల్ని ఆళ్ళు పగలగొట్టుకుంటే తప్పుకాదేవో అని నాకు ఇప్పుటికీ అనిపిచ్చుద్ది.

అట్టా మజ్జానం రొండింటిదాకా ఆడే రోడ్డుపక్కన కూకుని చానా ఆలోచిచ్చా. కడుపులో ఆకలి మొదలయ్యింది. గుడ్డలు వుచ్చ కంపు కొడతన్నాయి. జేబులో అద్దరూపాయి కూడా లేదు. తిరిగి పోదావంటే పోలీసులు కాల్చి సంపుతారేవో అని బయ్యం. నేను చేసిన తప్పేందో తెలీదు. ఇంటికి పోదావన్నా తొమ్మిది కిలోమీటర్లు నడవాలి. తలకాయ పైకెత్తి చూశా… ఈ నేల మీద మాకు నీడనిచ్చే అరిచేతంత మొబ్బు తునక కూడా నాకు అగపడలా. నాకెందుకో నేనొక పరాయి గడ్డమీద బిచ్చమెత్తుకుంటన్నా పకీరు సాయిబులా అనిపిచ్చింది. ఆకలి, ఎండ, వుచ్చ కంపు గుడ్డలు, పరాయితనం… ఇయ్యన్నీ కలిసి నాలోని బయ్యాన్ని మెల్లిమెల్లిగా ముంచేశాయి.

యావైతే అదయ్యిందని ఆస్టలు దిక్కుగా నడక మొదులు పెట్టా. తెలుగు బ్యాప్టీస్టు చర్చీ, స్టాల్ గరల్స్ హైస్కూలూ దాటి మా ఆస్టలు పక్కనే వుండా సెంటినరీ బ్యాప్టీస్టు చర్చీ ఎనకమాల వుండా చెక్క గేటు ముందుకొచ్చి ఆగా… లోపల డైనింగు హాలు దిక్కు నుండి పళ్ళాల సప్పుడు లీలగా ఇనపడింది… దైర్న్యం చేసి లోపలికి అడుగు పెట్టా.

గురువారం లంచ్ అంటే మొత్తం కాలేజీ కాలేజీ మా హాస్టల్లోనే వుండేది. వారం మజ్జలో దొరికే కోడిమాసం కూరా, టమాటా రసం, వొరన్నం, దొండకాయ పచ్చడీ, ఒక్కొక్క అరకోడ్ని నాలుగు తుంపులు చేసి మనిషికి ఒక బాగం వొచ్చ్చేటట్టు వొండి బాదంకాయ ప్లేట్లలో సర్ధితే, మా కుక్కులొచ్చి తలా ఒకటి మా పళ్ళాల ముందు పెట్టేవోళ్ళు… మళ్ళీ ఆదివారం దాకా చియ్య కనబడదనే దిగులుకైనా ఎక్కడెక్కడుండా సదవర్లంతా బొక్కులు వొదిలిపెట్టి బోళ్ళు పట్టుకుని మా డైనింగ్ హాలు ముందు పొష్టు బ్యాచ్చీలో కూకోటానికి రంగమహల్ నేల టిక్కెట్టు కౌంటర్ లెక్కన ఒకిడ్ని ఒకుడు తోసుకుంటా, తొక్కుకుంటా వుంటారు. అసుంటిది ఆయాల మొత్తం పదిమంది కూడా లేరు. పెరుమాళ్ బాబాయ్ మాసం కూరని ఎప్పుటికిమల్లే బాదంకాయ్ పళ్ళాలలో సర్దేసి దూరంగా ఒక బెంచీమీద కూకుని ఎటో చూత్తా ఆలోచిత్తన్నాడు. లోపల నేనూ, మా క్ల్యాసు వైకుంఠపురం రమేషుగోడూ ఇంకా ఏడెనిమిది మందిమి మాత్రమే వుండాం. పెరుమాళ్ళు బాబాయ్ వొడ్డిచ్చటానికి రాలేదు. ‘పెట్టుకు తినండి… అన్నీ ఆడ్నే పెట్టా’ అన్నాడు. మావూలుగా అయితే అట్టాంటి శాన్సును ఎవుడూ వొదులుకోడు. గబగబా ముందుకెల్లి కూర గిన్నెల్లో మిగతా గిన్నెలకన్నా వుఠాగా వుండా గిన్నెనే కోరుకునే మా సదవర్లు ఆ రోజు ఒక్కడుగూడా ముందుకి కదల్లా. నాకైతే ఇంతకు ముందున్నా ఆకలి పోయి, దాని చోటులో అదేదో అవమానం, అనాధతనం ఉబికి వచ్చాయి.

అట్టా మేం వులక్కుండా పలక్కుండా డైనింగు హాల్లో కూకుని వుండగానే మా కాలేజీ ఎదురుగా వుండే జగజ్జీవనరా  పేటలో కాపరం వుండే సెట్టి కన్నమరాజు అనే మా దళిత పెద్దాయన లోపలికి వొచ్చేడు. ఆయన ఎప్పుడూ తెల్ల పైజామా, తెల్ల లాల్చీ ఏసుకు తిరగతా కనపడేవోడు. అప్పుట్లో ఆయన ‘పీడితజన ‘ అనే ఒక పత్రిక కూడా నడిపేవోడు. ఆ పత్రిక కాపీలు మాబోటి సదవర్లకు పంచుతా మా కాలేజీ చుట్టుపక్కల కనబడేవోడు. ఆయన ‘అరే తమ్ముళ్ళూ… మనోళ్ళనందర్నీ అరండల్ పేట టూ టౌన్ స్టేషన్లో పెట్టేరు. ఆకలికి అల్లాడతన్నారు. అన్నాలు తీసుకు పోవాలి లెగండ్రా..’ అన్నాడు. నాకు ఒక్కసారి వుడుకుతున్నా దున్నమాసం కూర మీద గజ్జెల పొంగుకుమల్లే  కడుపునిండా దైర్న్యం తన్నుకొచ్చింది. మాయమ్మ నన్ను ఎప్పుడూ ఒంటూపిరోడా అని తిట్టేది. బిందెడు నీళ్ళుగూడా మోయటం రాదని ఎగతాళి చేసేదీ. పిల్లలందర్లో అయిదో రోజుకే నా నెత్తిమీద మాడు పెంకు కట్టిందనీ, అందుకే నాకు తలకాయలో కోడి చేదంత ఎర్రి వుందనీ అనేది.  అసుంటిది ఆయాల యాడ్నుండి వొచ్చిందో అంత బలం…. దాదాపు ముప్పై కిలోల బియ్యం వుడికే డేగిశాను అన్నంతో పాటు నెత్తికెత్తుకున్నాను. మా రమేషుగోడు కూర పళ్ళేలన్నిటినీ వుంకో డేగిశాలోకి వొంపేసి దాన్ని నెత్తికి ఎత్తుకున్నాడు. కన్నమరాజు అన్న బక్కీట్లలో రసం, పచ్చడీ, అరిటాకులూ అందుకున్నాడు.

డైనింగు హాలు నుండి మెయిన్ రోడ్డు మీదకి డేగిశాలను మోసుకొచ్చి అటుగా పోతన్నా రుచ్చా బండిని ఆపి అందులో ఎక్కిచ్చి ‘బిరాన అరండాల్ పేట టేషనుకి తీసకపోమని చెప్పాం. మేం ఎక్కేదానికి రుచ్చాలో సోటు లేదు. అయితే మాన్లే అని ఆ రుచ్చా పక్కనే లగెత్తుతా అయిదు నిమషాల్లో టూ టౌన్ టేషనుకి ఎల్లేతలికి మావోళ్ళంతా కాంపౌండు లోపలా, పంచలో, లోపల గదుల్లో కుక్కుకుని వుండారు. కన్నమరాజు ఎస్సైతో పిల్లల్ని వొదిలిపెట్టండని బతిమిలాడాడు. ఎస్సై నాయుడు. ‘రేయ్ … నువ్వేదో ఆసముల్లాగా తెల్ల ప్యాంటూ , తెల్ల సొక్కా ఏసుకోని వొస్తే ఈడ కదిలే ఎంటికలేవీ లేవు. నాకొడకా నిన్నుగూడా లోపలేసి గు..పగల..దె..తా.. ఎక్కువ మాట్టాడమాక మాల లంజాకొడకా ‘ అని బోకరిచ్చేడు.

సెట్టి కన్నమరాజు గుడ్లనీళ్ళు పెట్టుకునే పనయ్యింది. బయట రుచ్చాలో అన్నం నిలబడే వుంది. ఇదంతా సూత్తా వున్నా మా ఆస్టలు సదవర్లలో కొద్దో గొప్పో కమీనిస్టు సంఘాల పరిచయం వుండావోడు ‘డౌన్ డౌన్ ఎస్సై నాయుడూ, నశించాలీ కుల దురహంకారం, జిందాబాద్ ఏసీ కాలేజీ విద్యార్ధి సంఘం..’ అని స్లోగన్లు ముదులుపెట్టేడు. ఎవుడూ చెప్పకుండగానే అంతా స్లోగన్లలో గొంతు కలిపేరు. రొండే రొండు నిమషాల్లో స్టేషన్ మొత్తం స్లోగన్లతో మిరగబాయలు ఏపే మంగలం మల్లే మోత మోగిపోతంది. ఈ లోపు కన్నమరాజు టేషను బయటకు వొచ్చి ‘రాండ్రా రోడ్డు మీద కూకుందాం… మొత్తం ట్రాఫిక్కును ఆపండి ‘ అని మాకు చెప్పేడు. ఎట్టా వొచ్చిందో ఆబలం నేను రోడ్డుకు అడ్డంపడి బొసుల్నీ, స్కూటర్లనీ ఆపేసి రోడ్డు మీదే బాసంపట్టా ఏసుకుని కూకుని గొంతు బొంగురు పోయేటట్టు ‘డౌన్ డౌన్ ఎస్సై నాయుడూ ‘ అని అరవటం మొదులు పెట్టాను. చిన్నప్పుడు గోలీలాతకు పోతేనే ‘మోటోళ్ళ పిల్లల్తో మట్టిలో ఆడతావంటరా అటికితలకాయోడా ‘ అని కొబ్బరి చీపురులోని ఈనలన్నీ వాతలై తేలేదాకా ఇంట్లోవోళ్ళంతా ఇరగ చెదిచ్చే కుటంబం నుంచి వొచ్చిన నేను, అట్టా ఎట్టా తెగిడిచి రోడ్డున పడ్డానా ఇప్పుటిమటికీ అర్ధం కాదు నాకు.  మా రమేషుగోడూ, కన్నమరాజా.. ఇంకా ఎవురో మాకు మద్దవతుగా రోడ్డు మీద కూకున్నారు. మొతం ట్రాఫిక్కు ఆగిపోయింది. పావుగంటలో సీ ఐ రావాల్సొచ్చింది. కన్నమరాజుని మాట్టాడుకుందాం లోపలికి రామని పిలిచేరు. కన్నమరాజు మటికి ‘ముందు మా కుర్రోళ్ళకు అన్నాలు పెట్టుకోనియ్యండి , అప్పుడు మాట్టాడుకుందాం ‘ అన్నాడు. సరే లెగండి అని ఆళ్ళు పర్మీషను ఇచ్చేరు. నేనూ మా రమేషుగోడూ అన్నం గుండిగెల్ని రుచ్చా బండిలోనుంచి టేషన్లోకి పట్టేము. ఆకులు కడగమని అన్నాడు ఎవుడో.. ‘ కడిగేదేందిరా… పచ్చటి ఆకులో వుడుకుడుకు అన్నం పడితే ఆకు మొత్తం సుబ్రం అయిపోద్ది ‘ అన్నాడు ఉంకోడు. టేషనులో, పంచలో, బయట మెల్లా మీదా  ఎక్కడ సోటుంటే అక్కడ ఆకులు పరిచేరు. గబగబా అన్నాలు వడ్డిచ్చేం. గోవతోటి పీటరన్నోళ్ళు కోడిమాసం గుండిగెని మోసుకుంటా గెంటితో అందరికీ తలా ఒక గెంటెడు కూర వొడ్డిచ్చేరు. మావోళ్ళంతా అట్టా పోలీసు టేషన్లోనే కోడీకూరతో అన్నాలు బోంచేత్తంటే అక్కడే వుండా వోంగార్డులు ‘మీపనే బాగుందిరా అబ్బాయిలూ, టేషన్లోగూడా అల్లుడు మరేదలు. సదువుకుంటే ఇంత డిమాండింగ్ అని మాకు చెప్పినోడు లేడు ‘ అని మా ఆకుల ఏపు ఆశగా చూసేరు.

అప్పుడూ చూశా… మా వడ్డే జయచంద్రను.. ఆకు ముందు కూకుని అన్నంలో చెయ్యి పెట్టబోయేవోడూ ఆగి ‘అన్నాయ్… దా.. నాపక్కన కూకో … ఈడ ప్లేసు వుంది. మాతోపాటు రొండు ముక్కలు నువ్వుగూడా తిను ‘ అని వోంగార్డుల్ని పిలిచేడు. ఇంకేవుందీ… వరసలో కూకున్నా నలుగురైదుగురు మా కుర్రోళ్ళు లేచి ప్లేసులు ఖాళీ చేసి ‘వదూ.. వద్దూ ‘ అని మొహవాట పడతన్నా వోంగార్డుల్నందర్నీ బంతిలో కూకోబెట్టేరు.

ఆస్టలు ఎకన నా గుడ్డల్ని తడిపిన మా వుచ్చల కంపు నాకు ఇప్పుడు అసియ్యం అనిపిచ్చలేదు. అన్నం డేగిశా మోసిన తలమీద పేరుకున్న మసి నాకెందుకో ఇప్పుడు అచ్చజఠామాంసి తైలమై పిలిస్తీయులను అంతం చేసిన సంసోనుకు మల్లే నన్నూనాజీరు ‘ చేసినట్టు అనిపిచ్చింది.

నాజీరు: ఒక మహాకార్యానికై ప్రత్యేకంగా మొక్కుకున్న వ్యక్తి. బైబూలులో సంసోను నాజీరు చెయ్యబడినవాడు. 

 

ఇండస్ మార్టిన్

62 comments

Leave a Reply to INDLA CHANDRA SEKHAR Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మనసులోని మాలిన్యం కడిగేసే కథలు మొదలు పెట్టినందుకు థాంక్స్!

  • Love you anna. .
    కన్నీరు ఉబికింది.
    చుండూరు సంఘటనలో రైల్వే ట్రాకుల వెంట పరుగులెత్తిన అనేక సంఘటనలు కళ్ళముందు కదలాడినవి.

  • కటిక పూల సువాసనని గుర్తు చేస్తున్నాయీ కథలు

  • అన్న… నీ కథనం ఎంతో బాగుంది…. నేను మీతో కాలేజీ లో కలిసే ముందు జరిగిన మన కాలేజీ విషయాలు తెలుసుకునేందుకు అవకాశం కలిగింది… అణగదొక్కబడిన మన వెతలు…. ఎవరికి అర్థం అయ్యేనూ… వివక్ష, అంటరానితనం, అవమానాలు… అనుభవించిన వాడికే అర్థం అవుతుంది… Keep it up anna… 👏👏👏👏

  • <అన్నా చదువుతున్నట్టు లేదు నీతో పాటే నేనూ ఉన్నట్టు అనిపించింది ..కళ్లనీళ్లు తిరిగాయి కోపమొచ్చింది , చేతులు బిగుసుకున్నాయి ..
    లవ్ యూ అన్నా…

  • ప్రత్యక్షంగా చూస్తున్న చూస్తున్న అనుభూతి మీ కథ చదువుతున్నంతసేపూ. మీ తరువాత కథ కోసం ఎదురుచూస్తూ …….

    • అద్భుతమైన కధనం.
      ఒక్కటే చిన్న సవరణ. గవుర్నమెంటు అంటే ఆళ్ళేగామట్టి ఆళ్ళ ఆస్తుల్ని ఆళ్ళు పగలగొట్టుకుంటే తప్పుకాదేవో అని నాకు ఇప్పుటికీ అనిపిచ్చుద్ది.గవర్నమెంట్ అంటె ఆల్లే గానీ ఆస్థి మాత్రం శ్రామికులదే

  • Wow, wow, wow… శెట్టి కన్నామ రాజు గారిని మళ్ళీ గుర్తు చేసినందుకు ధన్యవాదాలు అన్నా… ఆ పరయితనమే, అనాధతనమే, రాజీ లేని పోరాటానికి ఉసిగొల్పి ఉంటది…

  • రెండో కటికపూలు అనుమానం లేదం. మొదటి కటికపూలంతా గాఢమైన ప్రభావం వేసే మొదలు..

  • 🙏🏻🙏🏻 Chaalaa chaalaa baavundhi.. You make people travel along all the way. Just can’t describe how great you are at penning down at times, actually most of the times..

  • Good narration …. but i feel it touched one side of the truth ….. how can some one simply kill people … that too having familier for so many years and work in their fields …

    • Yes sir. You are right. The daliths of Karan chesu first killed around 35 of those kamma people . And as a retaliation , they killed daliths. Same is the case with Tsunduru . All the massacres are first initiated by daliths. Thank you for opening my eyes.

      • You get such reminders sir that you need to open many eyes in the society, that your writing is relevant. Of course you cannot open the eyes of those who deliberately closed their eyes.

      • I born and bought up in a village where my house is almost adjacent to Dalit wada , even now at the age of 32 , I called my dalit friends as macha ( means aunts son in Chittoor Dialect ) your generalisation towards a particular caste is not correct it seems

      • కొత్తపల్లి రవిబాబు గారూ, నిజమే. చారిత్రక సత్యమే. అలాంటి చారిత్రక సత్యాలు, దురాగతాలు అన్ని మతాలు, కులాలు, వర్గాలు చేసినవి (వాళ్ల సామాజిక జీవితం ఆధారంగా) కొన్ని వందల, వేల సంవత్సరాల నుండీ చాలా వున్నాయి. వాటిని మళ్లీ మళ్లీ గుర్తుతెచ్చే రచనల ప్రాసంగికత, ఇప్పటి సామాజిక అవసరం గురించి మీరు వివరిస్తే తెలుసుకోవాలనుకుంటున్నాను.

      • Dear Srinivasudu sir …..
        You have rightly said …. wise people like you have to reapond .. otherwise spreading of hatered in the name of memories under the veil of story telling will continue ….

      • ఆయేషా గారూ, వారు కోరుకుంటున్నది విద్వేషవ్యాప్తేనని వారి వ్యాఖ్యల ద్వారా మీకు అర్థమైనందుకు నా అభినందనలు.

    • If u wanna express your anguish towards the genocide or massacre then Mention the names of guilty .. . not the caste …. it is highly un acceptable …

      • మావాల్లు హత్యలు చేసుకుంటూ పోతారు. మీరు అవన్నీ మరిచిపోండి లేకపోతే వాటిని నెమరేసుకుంటు బతకలేరు. భయపడి చస్తారు. బతకడానికి కూడా అవకాశం ఉండదు అంటున్నారు శ్రీ నివాసుడు గారు, అంతేనా!

      • నిజమే తిరుపాలుగారూ, హంతక కులాలు ఇన్ని వేలయేళ్ల నుండీ హత్యలు చేసుకుంటూ పోతున్నారు. కానీ, హతులయ్యే కులాలు ఇంకా బ్రతిేకే వున్నాయంటే విచిత్రంగా లేదూ. అంటే, ఒక కులంలో జన్మించినవారందరూ హంతకులు, ఇంకో కులంలో జన్మించినవారందరూ హతులు. అంతేనా తిరుపాలుగారూ?
        ముస్లింలదరూ హంతకులు అనే మతవిద్వేష ప్రచారకులకు మీకూ తీడా వుందంటారా? బై ది బై, ఇలాగ కుల రేసిస్టు వ్యాఖ్యల ప్రకారమే మిగతా కులాలు కూడా మాట్లాడితే ఎలా వుంటుందో ఉదాహరణ చెప్పనా? చిలకలూరిపేట బస్సులో వున్నవాళ్లందరూ హంతక కులాలా, హతుల కులాలా? వాళ్లందరూ హతులయ్యే కులాలకు చెందితే అగ్గిపుల్ల వెలిగేదా? పెట్రోలు పడేదా? కుల విద్వేష రేసిస్టు స్థాయికి మేమింకా దిగజారలేదు. బహుశా ప్రజలందరూ కూడా దిగజారలేదనే నేను భావిస్తున్నాను.

  • ఇప్పుడే చూసినట్టుంది. మీ కాలం సారంగలో చూడటం చాలా సంతోషం.

    • నిజమే శ్రీనివాసుడు గారు, ఈ సంఘటనలు కంతా ఉపయోగపడింది దోపిడీ భావజాల మే! కారంచేడు, చుండూరు, చిలకలూరిపేట అంతటా ఉన్నత వర్గాల భావజాలమే! అయితే కారం డు, చుండూరు వెనుక ఉన్నది వ్వవస్థ గత దోపిడీ అయితే, చిలకలూరిపేట సంఘటన వ్వక్తి గత దోపిడీ. వీరిద్దరూ ముష్కరులు ఎవరినుండి నేర్చుకున్నారు? రాత్రికి రాత్రి ఉన్నత దోపిడీ దారులు సరసన చేరిపోవాలని! దాన్నే కదా ఈ సమాజం ప్రోత్సహిస్తున్నది. మొన్నటికి మొన్న అయేష హత్య కేసులో ఇరికించడానికి ఒక దళితుడి వ్వవస్థ గత దోపిడీ యే కారణం.

  • కారంచేడులో జరిగింది ఫలానా సుబ్బయ్య ఫలానా రామయ్య పై వ్యక్తిగత కక్ష తీర్చుకోడం కాదు, పేర్లు చెప్పడానికి. ముమ్మాటికీ కులాహంకారంతో ఒక వర్గానికి చెందిన మనుషులు (??) మరో వర్గంపై సాగించిన మారణహోమం. ఈ రోజుకీ ఆ మాట బహిరంగంగా ఇంకా ఒప్పుకోలేని జనాలు వున్నంత కాలం, “మా ఇల్లు దళితవాడ పక్కనే, వాళ్ళని నేను స్నేహితులుగానే ట్రీట్ చేస్తాను” అనే కానీ, దళిత వాడ ఇంకా ఎందుకు వుంది అని ప్రశ్నించుకోని తరం వున్నంత కాలం ఈ జీవితాల కథలు రెలవెంటే. అవి మళ్ళీ, మళ్ళీ చెప్పుకొని తీరాల్సిందే.
    Indus Martin గారు 👏

    • ఇలాంటి మూసుకున్న మెదడులు, తెరుచుకున్న నడమంత్రపు నోళ్ళ మధ్య చరిత్రను చెప్పడం కూడా సాహసమే.

      దళిత వాడల్లోని జనాలను మచ్చ్చా అని పిలుస్తాను అని గర్వంగా చెప్పుకునే ముందు ఇంకా దళిత వాడలు ఎందుకు ఉన్నాయో మాత్రం ఆలోచించరు.

      కారంచేడు మారణహోమం కులమధం నేపథ్యంలో జరిగిన నేరమైనా దాన్ని ఇద్దరు మనుషుల మధ్య జరిగిన తగాడాగా నోరు ముపించాలి అనడం ఇంకా రేప్ అనేది ఇద్దరు మనుషుల మధ్య జరిగిన చిన్న తగాదా, అంతేగానీ అది స్త్రీ మీద జరిగిన పురుష దాడి అనకూడదు లాంటి వాదన. ఇంకా ఇలాంటి వాదనలు వింటూ రచనలు చెయ్యడం ప్రాణహాని ఆహ్వానించడంతో సమానం. ఏం చేస్తాం… మన సమాజపు తీరు ఇలా తగలడింది.

      • అవును నా చిన నాటి స్నేహితులను నేను మచ్చా అని పిలుస్తున్నాను, అందుకు గర్వపడడం , సిగ్గు పడడం ఎందుకు , కమ్మ పల్లె , రెడ్డి వారి పల్లి ,నాయుడు పేట, బలిజ పల్లి ఎందుకు వున్నాయో దలితవాడ కూడా అందుకే వుంది

        నేను పుట్టక ముందు జరిగిన ఒక సంగతి గురించి కమ్మ వాడిగా పుట్టినందుకు నేను ఎందుకు నా కులం గురించి మాటలు అనిపించ్కొవాలి , ఎవరో ఎక్కడో ఎందుకో చేసిన ఒక పని ని సిలువలాగా నేను ఎందుకు మోయాలి లేదా నాకులస్తులు అందరూ ఎందుకు మోయాలి , మీ భావజాలం సరిగా లేదు

        ఒక నెపాన్ని చూపి మా మీద ఇంకా ముప్పై ఏల్ల తర్వాత స్వారీ చెయ్యాలనుకోవడం దివాలా కోరు తనం ,

        మా దలిత వాడలో ఒక రజక అమ్మాయిని తీసుకొచ్చి పెల్లి చేసుకొని ముగ్గరు పిల్ల్ల్లు పుట్టిన తర్వాత ఇంకో అమ్మాయిని పెల్లి చేసుకొని ముందు పెల్లాన్ని కిరొసిన్ తో తగలబెట్టిన ప్రబుద్దుడు మీ కులానికి ఎలా ప్రతినిధి కాడో అలాగే కారంచేడు కమ్మలు మొత్తం సామాజిక వర్గానికి ప్రతినిధులు కాజాలను.

      • మీ మాటలు చదువుతుంటే చాలా నవ్వొస్తుంది. కారంచేడు కమ్మలే మొత్తం కమ్మ కులానికి ప్రతినిధులు అని ఎవరైనా ఇక్కడ తీర్పు తీర్చారా? ఎందుకు అలా మిమ్మల్ని మీరు ఒక పీడక గుంపుకు ప్రతినిధిని చేసుకుంటున్నారూ? దళితుల్లో రేపిస్ట్లు ఉండవచ్చు. వాళ్ళతో నన్ను నేను ఐడెంటిఫై చేసుకోను. మీరెందుకు ….?

        మీ మాటల ప్రకారం ముప్పై ఏళ్ళ క్రితం జరిగిన మారణ హోమాన్ని ఇప్పుడు మాట్లాడకుడదూ అనే నియమాన్ని పాటిస్తే, అసలు ముప్పై ఏళ్ళ క్రితం జరిగిన సంఘటనల ఈ కథల పరంపరే మడిచి పక్కన పెట్టాలి. మీకు అలా అనే అధికారం ఉందా? ఎంత మధపు మాటో కదా మీరు మాట్లాడింది? ఎవడు ఏది రాయాలో నిర్దేశించే అహం ఎక్కడి నుండి వచ్చిందీ? దాని మూలాలు ఎక్కడివీ? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ కామెంట్లు చదువుతున్న ప్రతీ ఒక్కరూ గుర్తుపట్టి వుంటారు…. కులం.

        మనుషుల్లో నల్లవాళ్ళు తెల్లవాళ్ళు అనే వివక్ష కూడా ఉంది. ఆ వివక్షలో మీరు నల్లవాళ్ళు అయితే మిమ్మల్ని మీరు ఎటువైపు చూసుకుంటారూ? నల్లవాళ్ళ మీద తెల్ల జాతీయులు చేసిన దమనకాండ గురించి ఎవరూ మాట్లాడకూడదు అని అంటారా? పురుషులు స్త్రీల మీద చేసిన చేస్తున్నా అణచివేత గురించి మాట్లడ కుడదూ అంటారా?

        జరిగిన నేరాల ప్రస్తావనే మీకు స్వారీలా అనిపిస్తుంటే… జరిగిన, జరుగుతున్న అమానవీయ దాష్టీకాన్ని తలుచుకుంటే దళితులు హంతకులుగా మారాల్సిన అవసరమే కనబడుతుంది. కానీ అది నా అభిమతం కాదు. కేవలం మీలో వున్నా కులాహంకారపు ఏడుపు ఇది.

      • Indus Martin గారు, మీకెప్పుడైనా ఎందుకు రాయాలి, ఎవరికోసం రాయాలి అనే ఆలోచన వస్తే, మళ్ళీ ఒకసారి ఇక్కడికి వచ్చి కామెంట్లు చదవండి, మీకు వెంటనే సమాధానం దొరుకుతుంది. ఒక స్త్రీగా, అగ్ర (సామాజిక వ్యావహారికంలో మాత్రమే) కులస్తురాలిగా చెప్తున్నాను, మీ కథలు నాకు అవసరం. ఏ రోజైనా మనిషితనాన్ని కోల్పోతున్నామేమో అనిపిస్తే తిరిగి, తిరిగి చదువుకోడానికి ఈ కథలు అవసరం. ఈ కథలను బలంగా చెప్పగలిగే శక్తి మీకుంది. వచ్చే తరమైనా మన తరంకంటే ఇంకాస్త మనసుతో, మానవత్వంతో పెరగడానికి మీ కథలు ఒక పనిముట్టు కావాలి. వచ్చే నెల సారంగలో మీ కథ కోసం నాలాంటి పాఠకులందరూ ఎదురు చూస్తుంటాము.

  • అద్భుతమైన కధనం.
    ఒక్కటే చిన్న సవరణ. గవుర్నమెంటు అంటే ఆళ్ళేగామట్టి ఆళ్ళ ఆస్తుల్ని ఆళ్ళు పగలగొట్టుకుంటే తప్పుకాదేవో అని నాకు ఇప్పుటికీ అనిపిచ్చుద్ది.గవర్నమెంట్ అంటె ఆల్లే గానీ ఆస్థి మాత్రం శ్రామికులదే

    • మీకు నవ్వు ఎందుకొస్తోందో నాకు అర్థం కాలేదు

      మీరు మతం మార్చుకున్నా కులాన్ని వదలలేక పోతున్నారు

      నాలో మీకు కుల దురహంకారం ఎక్కడ కనిపించింది

      ముద్రలు వేయడం సులభం కదా పైగా అందులో ఒక సౌలభ్యం వుంది ఎం చెప్పినా చెల్లు బాటు అవుతుంది

      ఇక ఈ ముద్ర మరీ ప్రమాదకరం నేను ఎం మాట్లాడినా అగ్రకుల దురహంకారం

      ఇకనావాదన అరణ్యరోదన

      పైగా హంతకులు గా మారతామని బెదిరింపు ఒకటి

      ఎప్పుడో ఎక్కడో జరిగిన ఒక సంఘటన చిన్నదో పెద్దదో జరగకూడనిది జరిగింది అందుకని దాన్ని తవ్వి తవ్వి నెత్తిన వేసుకోవడం వల్ల మీరు ఎం ఆశిస్తున్నారు

      ఇక ప్రతి కమ్మవాన్నీ అనుమానం గా చూద్దమా

      వాడిలో ఏ కులాదురహం కారం దాగుందో అని సత్య శోధన పరీక్షలు చేద్దామా

      మళ్ళీ మళ్ళీ గుర్తు చేసి ఆత్మ రక్షణ లోకి నెడదామా

      తెలుగు నేల మీద కమ్మలు కొత్తరకం యూదులు

      ఇది వాస్తవం

    • …అని వాళ్లు అనుకోవటం లేదగా! విద్యాసాగర్ గారు, ఎవడు అధికారము లో ఉంటే వాడిదే గవర్నమెంట్ దాని ఆస్తులు. దాని యంత్రాంగం.

  • ఊపిరి సలపనీయని కథనం..ఉక్కిరిబిక్కిరి చేసిన వ్యథార్త దృశ్యావిష్కరణ. మార్టిన్ కు అభినందనలు

  • అచ్చజఠామాంసి తైలమై పిలిస్తీయులను అంతం చేసిన సంసోనుకు మల్లే నన్నూనాజీరు ‘ చేసినట్టు అనిపిచ్చిం

    What mistake palastinians done for you and your community … you identify your self with people of far away lands ie; christians of middle east and hate those who are near to your … double standards …

    • Details of INDIAN PENAL CODE Sections 153A, 295 & 295A

      SECTION 153 A:

      The purpose of the Section 153 A is to punish persons who indulge in wanton vilification or attacks upon the religion, race, place of birth, residence, language etc of any particular group or class or upon the founders and prophets of a religion.

      The jurisdiction of this Section is widened so as to make promotion of disharmony, enmity or feelings of hatred or ill-will between different religious, racial, language or regional groups or castes or communities punishable.

      Offence on moral turpitude is also covered in this section.

      The offence is a cognizable offence and the punishment for the same may extend to three years, or with fine, or with both. However, the punishment of the offence committed in a place of worship is enhanced up to five years and fine.

      Ingredients of Section 153A:

       The act of promoting enmity between different groups on grounds of religion, race, place of birth, residence, language, caste, community or any other group.
       Acts prejudicial to the maintenance of harmony between different groups or castes or communities, if the acts disturb public tranquility.

       Acts causing fear or alarm or a feeling of insecurity among members of any religious, racial, language or regional group or caste

      Eg: దళితులు హంతకులుగా మారాల్సిన అవసరమే కనబడుతుంది

    • Hahahah, what a fun!!! So you decided that i am a christian? wow! By the way, Samson is not a Christian , he was a Jew. Philistines are his arc enemies. Its an idiomatic expression, perhaps you do not understand such things.

  • మీ కథల గురించి యేమని రాయాలి ? యేమని చెప్పాలి ? మీరు మాస్టర్ స్టొరీ టెల్లర్. మొదటి లైన్ నుంచి చివరి లైన్ వరకు ఆపకుండా చదివించగలిగే నేర్పు మీకు ఎలా వచ్చింది? అద్బుతం. తొందరగా మిగతా బాగాలు రాసి పంపండి. ఇండస్ మార్టిన్ గారు మీరు సామాజిక చరిత్ర రాస్తున్న గొప్ప పరిశోధకులు. రాయండి. రాల్లెయ్యనియ్యండి. ఆ రాల్లతో పనికిమాలిన చరిత్రలకు సమాధులు కడదాం.

    • Oh …. your feelings are only feelings …. your pain is pain and your preferences are only count … where are we … heading towards where … so if you scold others others have to buy it …. otherwise you scold them ….. pity on you …

      • I pity on you chandra sekhar and Martin … what does sudheer told … he is asking you not to scold his caste … whats wrong with you .. if he scold your caste …. will u take it …. sinvasudu garu has rightly said … what is the relevence of this story for todays context …

      • And you are not the victim of such vandalism. … you have not experienced the pain .. you have seen and listen to the stories … the guilty are already punished by court of law … why you wanted to take the same again and want to seed the hatered towards a particular community .. if you are representing a particular group of people … whats wrong in others repreent their own group of people …..

      • Ayeesha, I equally pity you and feel helplessly tickled at your immaturity. Who scolded Sudheer? Where did i scold one caste out-rightly? Should you be the victim of a rape directly to condemn a rape incident? Is there any time limitation on how long one can write on genocides? Why do people write about the killings of Adolf even now? Is it simply to spread hatred? What an argument? These are all elementary arguments that we came across a decade and half back. All such base arguments have been answered for hundreds of times.

        Shall i tell you this…. Finally you are going to end up by talking about reservations. Thats it.

    • ఇండ్ల చంద్రశేఖర్ గారూ, మీరు మీ వ్యాఖ్య వ్రాసే సమయానికి ఈ కథపై వచ్చిన వ్యాఖ్యలన్నింటిలో నేను, సుధీర్ గారు మాత్రమే స్పందించాం. (మీ దృష్టిలో రాళ్లేసాం). ఎటువంటి వ్యక్తిగత దూషణ గాని, ఆరోపణలుగానీ మేమిరువురమూ మా వ్యాఖ్యల్లో చేయలేదనే నమ్ముతున్నాను. నా వ్యాఖ్యలో గాని, సుధీర్ గారి వ్యాఖ్యలలోగాని ఉన్న రాళ్లను మీరు తెలిపితే వాటితో మీరెలా సమాధులు కడతారో మేము అవగాహన చేసుకుంటాం. అలాగే, ఈ కథా రచయిత తన వ్యాఖ్యలలో చేసిన విద్వేష వ్యక్తిగత దూషణలను మీరు చదవేవుంటారు. అందుకే వాటిని మళ్లీ ియిక్కడ నేను యివ్వడంలేదు. మరి, మీ లెక్క ప్రకారం మా వ్యాఖ్యా రాళ్లతో మా పనికిమాలిన చరిత్రలకు సమాధులు కట్టబోతున్నారు కదా. మరి, మీ విద్వేష వ్యాఖ్యలతో మీరు మీ చరిత్రలకి సమాధుేలు కట్టుకోబుతున్నారని మేము ఆశించవచ్చా?

      • Dear Martin & Chandra Sekhar,

        ఇంత అసహనం దేనికిసూచన ,

        మీరు తిడితే తిట్టించుకొవాలా ,

        ఎదురు మాట్లాడితే మీకు కులాహంకారం కనిపిస్తుంది ,

        ఉన్నఫలంగా హంతకులుగా మారాల్సిన అవసరం కనిపిస్తుంది

        కాదంటే సమాధులు కడతారు ,

      • హహహ… అసహనాన్ని అలంకారంగా మోస్తూ జనాలకు అదే బలహీనతను అంటగట్టడం మీకే చెల్లు. చరిత్రలో జరిగిన మారణ హోమాన్ని ప్రస్తావించడమే భరించలేక మీ కులాన్ని మొత్తాన్ని ఎవరో ఎదో తిట్టారని అబద్ద సాక్ష్యాలూ పలుకుతూ, ఎరెస్ట్ చేయిస్తామని లా పాయింట్లు కోట్ చేస్తున్నారు. మీరేగనక మ్యాన్ ఆఫ్ ఇంటగ్రిటీ అయితే …. ఈ కథను తీసుకెళ్ళి నా మీద కేసు పెట్టండి. చట్టాన్ని గౌరవిస్తాను.

        చరిత్ర నేపధ్యంలో కథలు మొదలు పెట్టాగానే మీకు అంతలేసి వులుకు ఎందుకో? ఎవడు ఏం రాయాలో చట్టపరిధిలో నిర్ణయించుకునే హక్కే లేదా? మధ్యలో మీ అభ్యంతరం ఏమిటీ? దీన్నే నేను కులాహంకారం అంటాను. ఎందరో మంచి కమ్మ స్నేహితులు వుండగా హంతకుల తరుపునే ప్రాతినిధ్యం వహించాలని చూడటం మీ దాష్టీక మనస్తత్వానికి ఋజువు. నేను పురుషుడిని. స్త్రీల మీద జరుగుతున్నా అత్యాచారాల నేపధ్యంలో పురుష జాతిని నిందిస్తుంటే నేను పురుషుల వకాల్తా తీసుకోను. ఎందుకంటే నేను దాష్టీక పురుషుడిని కాను కాబట్టి. ఎటు వైపు నిలబడాలో మీరే నిర్ణయించుకోండి. మీకు ఇలా చిలవలూ పలవలూ సమాధానాలు చెప్పే సమయం నాకు లేదు.

  • హహహ… అసహనాన్ని అలంకారంగా మోస్తూ జనాలకు అదే బలహీనతను అంటగట్టడం మీకే చెల్లు. చరిత్రలో జరిగిన మారణ హోమాన్ని ప్రస్తావించడమే భరించలేక మీ కులాన్ని మొత్తాన్ని ఎవరో ఎదో తిట్టారని అబద్ద సాక్ష్యాలూ పలుకుతూ, ఎరెస్ట్ చేయిస్తామని లా పాయింట్లు కోట్ చేస్తున్నారు. మీరేగనక మ్యాన్ ఆఫ్ ఇంటగ్రిటీ అయితే …. ఈ కథను తీసుకెళ్ళి నా మీద కేసు పెట్టండి. చట్టాన్ని గౌరవిస్తాను.

    చరిత్ర నేపధ్యంలో కథలు మొదలు పెట్టాగానే మీకు అంతలేసి వులుకు ఎందుకో? ఎవడు ఏం రాయాలో చట్టపరిధిలో నిర్ణయించుకునే హక్కే లేదా? మధ్యలో మీ అభ్యంతరం ఏమిటీ? దీన్నే నేను కులాహంకారం అంటాను. ఎందరో మంచి కమ్మ స్నేహితులు వుండగా హంతకుల తరుపునే ప్రాతినిధ్యం వహించాలని చూడటం మీ దాష్టీక మనస్తత్వానికి ఋజువు. నేను పురుషుడిని. స్త్రీల మీద జరుగుతున్నా అత్యాచారాల నేపధ్యంలో పురుష జాతిని నిందిస్తుంటే నేను పురుషుల వకాల్తా తీసుకోను. ఎందుకంటే నేను దాష్టీక పురుషుడిని కాను కాబట్టి. ఎటు వైపు నిలబడాలో మీరే నిర్ణయించుకోండి. మీకు ఇలా చిలవలూ పలవలూ సమాధానాలు చెప్పే సమయం నాకు లేదు.

    • Well said Sir! Even the Britishers had better sense during their colonisation here. Individual Britishers sympathetic to the cause of our Independence didn’t take it personally when we were attacking the British exploitation. Dalit movement respects individuals from the so-called upper castes who have been self-critical.

    • చదువరులకు: మీ అభిప్రాయాలను మేం గౌరవిస్తాం. కాని, ఆ గౌరవం విలువ మీకు తెలియకపోతే, మేం కొన్ని కామెంట్లని ఎడిట్ చేయడమో, అసలు ప్రచురణకి నిరాకరించడమో చేయక తప్పదు.

  • అద్భుతమైన కథనం చాలా బాగుంది మీ నుండి మర్రిన్ని కధనాలు రావాలి బ్రదర్

  • Koddi nelala kritam Mississippi Burning, Detriot ani rendu cinemalu chi kanneeti paryantamiyyanu. Aa rendu cinemalu chusinappudu naa madiloki vachhina rendu sanghatanalu Karamchedu, Tsundur lojarigina daruna marana kandalu. Ventane ee rednu ghatanalki evarana sahitee roopam ichara ani vethikanu. 2,3 fact finding report lu tappa ekkada smagramaina rachane ledu. Appatlo chala kavitalu vachhina gurtu. Kani sahiteearam ga a gatanalani bhavishattuu taralaki andichandaniki samagra prayatnam jaragaledemo anipinchindi. AA lotu teerche disagaa idi modati adugu anukuntanu. Mee anubhavanni shahitee bhaddam chesinanduku krutagjatalu. Kadha chaduvutunte ubikina kannella gurinchi pratyekam gaa cheppakkarledanukunta!

  • ‘పాదిరిగారి అబ్బాయి’ ‘నాజీరు’ తో మొదలవ్వడం బాగుంది.దళిత క్రైస్తవ నేపధ్యం నుంచి కధలు తక్కువగా రావడమే కాదు కుల నిర్మూలనా స్పృహతో, క్రైస్తవం పట్ల విమర్శనాత్మక దృష్టితో రాలేదు. ఇలాంటి కధలు ఇప్పటివరకు లేని లోటుని మార్టిన్ కాలం తీరుస్తుంది. కధనం గొప్పగా దళిత డిక్షన్ తో వస్తుంది.’ కటికపూలు’ కధలతో తెలుగు కధకి సరికొత్త కలర్ ని తెచ్చి పెట్టిన ఇండస్ మార్టిన్ పాదిరిగారి అబ్బాయిగా మరింత మెరిసిపోతాడు. అభినందనలు మార్టిన్

  • Ma naanna cheppevadu Karamchedu,Chunduru vishayalagurinchi chinnappudu. Mee ee story appati sangathulani kallaki kattinatlu cheppindi.
    Goosebumps brother.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు