ఔను
నాకు కళ్ళులేవు అయినా
చూసాను
చూడలేక ఉప్పొంగి నాలో కలిపేసుకున్నాను కొన్ని
బరువెక్కిన హృదయం తో విలవిల
నాకు దూరంగా ఇంకెన్నో
ఎవరి దురాగతమో నేనెరుగలేను
అర్ధరాత్రుల్లో తవ్వకాలు వినిపించేవి
ఏడుపులు మూలుగులు నన్ను ఏడిపించేవి
బెదిరిన పక్షులు నావైపు వచ్చేవి
నాదారిన నేను ప్రశాంతంగా పోతుంటే
ఈ దారుణాలు చూడలేక అక్కడే మెలితిరిగి పోయాను
చుట్టూ వనసంపద మధ్య
అత్యాచారాల ఆక్రందనలు అరణ్య రోదనై మిగిలాయి
నేను నేత్రావతి ని
అప్పుడూ ఇప్పుడూ నేను ప్రత్యక్ష సాక్షి ని
నాకు నోరు లేదు
నోరున్న జనం నోరు మెదపట్లేదు
ఒకే ఒక్కడు పశ్చాత్తాపం తో వచ్చాడు!
వెలుగులోకి వస్తారో లేదో కాలం సమాధానం చెప్పాలి మరి!
నేను ఎప్పటిలాగే అరేబియా వైపు వెళ్తున్నాను
పడమట సంధ్య వాలిపోతుంది!!
*
Add comment