నాకు ఊపిరి కావాలి

రిచయాల పుటల్లోంచి ఒక్కో పేజీ రాలిపోతున్న వేళ జీవితంలో ఒకో క్షణం అమూల్యంగా మారుతోంది.  మరణానికి ముందు జీవితం ఎలా ఉంటుందో తెలియదు కాని మరణానంతర జీవితం ఏమిటో ఇప్పుడే పరిచయం అవుతున్నట్లనిపిస్తోంది. ఆకాశం వైపు చూస్తే నీలి మేఘాలు తచ్చాడుతూ మిత్రుల జ్ఞాపకాల్ని మోసుకు వెళ్తున్నట్లనిపిస్తోంది. వసంతం ఊపిరి పీల్చుకున్నప్పుడు దాని పరిమళంతో నిండిపోయే  ప్రతి ఇల్లూ ఒక మృత్యు సందేశం కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఉన్నది.

చెట్ల ఆకులు, పూలు ఎప్పటిలాగా గాలికి ఊగుతూ కనపడుతున్నా ఓదారుస్తూ తమలా నవ్వుతూ బతకమని చెబుతున్నాయి. కాని చూపంతా నేల రాలిన పూలు, ఆకులపైనే పడుతూ వాటిలో ఉన్నట్లుండి మాయమైన స్నేహాలను అన్వేషిస్తోంది.

ఎవరి స్మృతుల్లో నెమరు వేసుకుంటున్నట్లుగా రెండు పిట్టలు బాల్కనీ గోడపై వాలి ముచ్చటించుకుంటున్నట్లనిపిస్తోంది. వాటి భాషను మౌనంగా వినాలనుకునేలోపు అవి ఎగిరిపోయి మళ్లీ వస్తాయో లేదోనన్న దిగులు మనసంతా పరుచుకుంది.  కాళ్లక్రింద పచ్చిక బయళ్ల తడి తగిలినప్పుడల్లా ఎవరి కన్నీరో తడుముతోంది.

తలెత్తి చూస్తే ఎవరూ లేరు. ఒక నిర్మానుష్య ప్రపంచంలో నేనొక్కడినే. మనుషులంతా ఆత్మలై చెట్ల ఆకుల్లో సంచరిస్తున్నట్లు గాలి ఉధృతంగా వీస్తోంది. ఆ గాలి సుపరిచితమైన గాలి. నిన్నటి ఊపిర్లను నింపుకున్న గాలి. గాలి తగిలినప్పుడల్లా ఏదో రహస్యం చెవులకు తగులుతోంది, ఎవరి ఊపిరో వేగం పెంచుకుని నన్ను తడుముతూ నన్ను అల్లుకుంటూ ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది. మనిషి ఎదురైతే ఆత్మ ఎదురైనట్లు భ్రమ కలుగుతోంది.

ఎన్ని ఊపిర్లు కలిస్తే ఈ గాలి!  కాశీ ఖండంలో శ్రీనాథుడు వర్ణించినట్లు  పర్వత రాజపుత్రి  పార్వతి దేవి జీవుడి తలను తన ఒడిలో పెట్టుకుని తన పవిట గాలితో   స్వాంతన పలికినట్లు

అమ్మ ఒడిలో కేరింతలు కొడుతూ, ఆమె ముంగురులతో లేత చేతులతో ఆడుకుంటున్నప్పుడు నా చెంపకు తగిలిన ఆమె ఊపిరి ఈ గాలిలో ఉందేమో… చదువుకోనందుకు నాన్న కొట్టి మళ్లీ దగ్గరికి తీసుకుని తొడపై కూర్చో పెట్టుకున్నప్పుడు తగిలిన సిగరెట్ పొగ లాంటి ఆ ఊపిరి ఈ గాలిలో ఉందేమో…. పక్క బెంచిలో మల్లెపూలు ధరించిన జడను చూసి అందమైన ఊహలు అల్లుకుంటుంటే ఆ ఊహలు విడిచిన ఊపిరి ఈ గాలిలో ఉందేమో.. ప్రక్క ప్రక్కనే కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు ఆ గుసగుసల సామీప్యంలో ఊపిరి పీల్చుకున్న మోహన రాగం ఏ వాయులీనమైందో..

‘ఏది రచిస్తున్నానో, చూస్తున్నానో, ఊపిరి తీస్తున్నానో’ అని చదివిన రోజు విడిచిన వేడి నిట్టూర్పులు ఏ గాలిలో కలిసిపోయాయి? ‘అలజడి మా జీవితం, ఆందోళన మా ఊపిరి, తిరుగుబాటు మా వేదాంతం’ అని నేర్పిన కవి తో గొంతు కలిపిన వేళ మా ఆందోళనలో లయించిన ఊపిరి ఎక్కడ పెనుగులాడుతోంది?

ఊపిర్లు కోల్పోయిన దేహాలు శ్మశానంలో స్థలం కోసం మౌనంగా ఊపిరి బిగపట్టుకుని  నిరీక్షిస్తున్నాయి. చితిని రగిలిస్తున్న గాలిని కూడా పీల్చలేని దేహాలు నిర్జీవ ఆకాశం వైపు నిర్లిప్తంగా చూస్తున్నాయి. నగరం నగరమంతా శ్మశానమే, ఆకాశం శ్మశానమే, నేలంతా శ్మశానమే. గది లోపల జాషువా  శ్మశాన వాటిక పద్యాలు. గది బయట అజంతా మృత్యు భీకర క్షుద్ర సంధ్య! గదిలోపల గుండెచప్పుళ్ల మధ్య భయంభయంగా కదులుతున్న ఊపిరి. గది బయట ఆగిపోయిన ఊపిర్లను కలుపుకుంటూ భారంగా కదులుతున్న మృత్యు గాలి.

స్వేచ్చగా వీస్తున్న గాలీ, నీవు అన్నిదశలనుంచీ వీచి ఈ శవాలలో ఊపిరి పోయగలవా, ఈ జ్ఞాపకాలకు ప్రాణం పోయగలవా, ఈ చిరునవ్వులను సజీవంగా పరిమళించగలవా, గంగానదీ, నీ  తరంగాలు ఆత్మలను విముక్తి చేస్తాయో తెలియదు కాని మనుషుల దేహాలలో ఊపిరి పోయగలవా, దేవాలయాల్లో మనుషులు మోగించిన గంటల ధ్వనులు ఏ గాలిలో కలిసి పోయాయో, ఆధ్వనులు నిర్జీవంగా మారిన గుండె చప్పుళ్లను మళ్లీ వినిపించెలా చేయగలవా, మనుషులు వెలిగించిన వేలవేల దీపాల కాంతులు ఒక్క మనిషిలో ప్రాణ దీపాన్ని వెలిగించగలవా, ఎన్ని వేద గానాలు, ఎన్ని ప్రార్థనారావాలు ఈ గాలిలో ఎన్నాళ్లుగా ప్రవహిస్తున్నాయో ఒక్క పవిత్ర ఘోషమైనా ప్రాణనాదాన్ని మోగించగలదా..ఎన్ని హోమాల పొగలు మేఘాల్లో కలిసిపోయాయో ఒక్క మేఘమైనా జీవితాన్ని వర్షించగలదా..

దేవుడు ఊపిరి పోశాడా, ఊపిరి దేవుడిని సృష్టించిందా, ఊపిరి లేనప్పుడు దేవుడిని ఎవడు చూశాడు, ఊపిరి ఉన్నప్పుడు దేవుడిని ఎవడు సృజించాడు? ఒక సదసత్సంశయం!

ఊపిరి యాడనీని కఠినోపలబంధములో, కలా కలా
లాపముగాని, నర్తన విలాసముగాని, ధరా పరీమళా
వాపముగాని, లేనిపుటపాకపు చీకటి జీవితంబు నె
ట్లోపితినోగదా, యవలియొ డ్డగుపింపని కాల మీదుచున్

అన్నాడు వేదుల సత్యనారాయణ శాస్త్రి

ఏదీ అవతలి ఒడ్డు? ఎంతకాలమీ మృత్యు ప్రయాణం?

ఊపిరి ఒక జీవన గమనం.. ఊపిరి ఒక గుండె చప్పుడు.. ఊపిరి వెచ్చటి స్పర్శ, ఊపిరి ఒక ప్రేమమయ చూపు, ఊపిరి కను రెప్పల మధ్య నీలి ఆకాశాన్ని బంధించడం, ఊపిరి రాత్రి నక్షత్రాల్నీ, ఉదయం నీలి మేఘాల్ని దర్శించడం, ఊపిరి పక్షుల కిలకిలా రావాల్ని ఆస్వాదించడం ఊపిరి ఒక చిరునవ్వు, ఒక పసిపాప పలకరింపు.

నాకు ఆ ఊపిరి కావాలి. కటకటాల్లోంచి విముక్తి అయిన కవి స్వేచ్చాగీతిక కావాలి. మనుషుల స్వేదంతో తడిసిన పొలం లోంచి తగిలే నేల పరిమళం కావాలి. జీవితాలతో కళకళ లాడే వీధుల మధ్య వినపడే జీవన నాదం కావాలి.

నువ్విప్పుడొక విత్తనానివి

రేపు పూసే చిగురుకు

సరికొత్త ఊపిరివి

అన్నాడు అలిశెట్టి ప్రభాకర్. ఎక్కడున్నావు ప్రభాకర్, నీవు మళ్లీ ఇంటింటా చిగురించాలి, నీ ప్రభాత రేఖలు ప్రసరింపచేయాలి!

*

కృష్ణుడు

వారం వారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఢిల్లీ నుంచి కాలమ్ రాసే ఎ. కృష్ణారావు, అడపా దడపా కవితలు రాసే కృష్ణుడూ ఒకరే. జర్నలిస్టుగా 34 సంవత్సరాల అనుభవం ఉన్న కృష్ణుడు కవి, సాహితీ విమర్శకుడు కూడా. ఇండియాగేట్, నడుస్తున్న హీన చరిత్ర పేరుతో రాజకీయ వ్యాసాల సంకలనాలు వెలువరించిన కృష్ణుడు ఇంకెవరు, ఉన్నట్లుండి, ఆకాశం కోల్పోయిన పక్షి అనే కవితా సంకలనాలను వెలువరించారు.

9 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు