నవ్వుతున్న దెయ్యం

“ఎంతసేపిలా ప్లేట్ పట్టుకొనుండాలి పమ్మీ! తిందువ్ రా”

రోజూ రాత్రి ఇదో పెద్ద పని. ఆరేళ్లొచ్చాయి. అల్లరి పెరిగింది తప్ప తగ్గలేదు. ఒక్కచోట కాలు నిలవదు. అన్నం తినిపించాలంటే నానా హైరానా. ఇళ్లంతా తిప్పి తిప్పి మేడపైకి తీసుకొచ్చింది.

“నాకొద్దు పో”

“కొంచమే! రెండు ముద్దలు”

“ఊహూ”

“వేస్టవుతుంది. రా పమ్మీ”

“వద్దు! పడేయ్”

పట్టుకొని నోట్లో పెడదామంటే ఆగితేనా! అటూఇటూ తిరుగుతూ ఆడుతోంది.

“అన్నం పారేయకూడదు. పారేస్తే దేవుడికి కోపం వస్తుంది.”

“వస్తే?”

“నీకు కడుపు నొప్పి తెప్పిస్తాడు. డాక్టర్ దగ్గర ఇంత లావు ఇంజెక్షన్ వేయిం..”

సరిపోయింది. డాక్టరంటే భయపడదు. సంతోషపడుతుంది. స్కూల్ మానేసి ఇంట్లో ఉండొచ్చని ఆశ. పోయి పోయి అదే చెప్పాను. ఇంక తిన్నట్టే!

“ఇలా రా! ఇక్కడ చూడు. ఆ చివర ఏదో కనిపిస్తుంది.”

నా గొంతులో వినిపించిన కంగారుకు బుద్ధిగా‌ దగ్గరికొచ్చింది. చంకనెక్కించుకుని బయట రోడ్డు వైపు చూపించాను.

“అటు.. ఆ చివర చెట్టు దగ్గర చూడు! నల్లగా ఏదో వస్తోంది.”

నల్లగా.. అని ఒత్తి పలికేసరికి భయంతో ముడుచుకుపోయింది. లోలోపల నవ్వుకున్నాను.

“ఏంటి మమ్మీ అది?”

“దెయ్యం”

నా భుజాన్ని గట్టిగా పట్టుకుంది.

“ఏం చేస్తుంది?”

“నీలా మమ్మీ మాట వినని పిల్లల్ని ఎత్తుకుని వెళ్లి..”

“ఊ…”

“చీకటి గదిలో​ పడేసి.. అన్నం పెట్టకుండా.. బాగా కొడుతుంది”

నోరు తెరిచింది. హమ్మయ్య! దెయ్యం మంత్రం పనిచేసింది. నోట్లో అన్నం ముద్ద పెట్టాను.

“ఎందుకలా చేస్తుంది?” ఆసక్తి, భయం కలిపి అడిగింది.

“పెద్ద వాళ్ల మాట వినకపోతే అంతే! అలాంటి పిల్లలంటే దెయ్యానికి కోపం. అందుకే గుడ్ గర్ల్‌లాగా ఉండాలి”

రెండో ముద్ద నోట్లో పెడుతూ చెప్పాను.

“రమణ అంకుల్ ఇదే మాట చెప్పాడు.”

రమణ వాళ్లు ఎదురింట్లో ఉంటారు. వాళ్ల తోటలో చాలా​ పూల మొక్కలున్నాయి. వాటి కోసం రోజూ వెళ్తుంది.

“ఏమన్నాడు?”

“పెద్దవాళ్ళు చెప్పినట్టు వినాలంట. అరవకూడదంట. ఏం చెప్తే అలా చేయాలంట. నేను అంకుల్ చెప్పినట్టే చేశా.”

“ఏం చేశావ్?”

“డ్రస్ తీయమన్నాడు.‌ తీసేశా. కిస్ చేయమన్నాడు.. ఇంకా ఏమేమో చెప్పాడు. ఎవరికీ చెప్పకుండా​ ఉంటే గుడ్ గర్ల్ అన్నాడు.”

చేతిలో ప్లేట్ జారి కిందపడింది. అన్నం చెల్లాచెదురయ్యింది.

ఎదురింటి వాకిట్లో దెయ్యం కనిపిస్తోంది. పాపను చూసి నవ్వుతోంది.

*

 

విశీ

తెలుగు కథాలోగిట్లో ఇప్పుడిప్పుడే అడుగు పెడుతున్న పసిపిల్లాడి ఛాయ నాది. కథలు చదవడం, చదివించడం ఇష్టమైన పనులు. మంచి కథ గురించి నావైన నాలుగు మాటలు చెప్పడం బాధ్యతలా భావిస్తాను. మన చుట్టూ ఉన్న భిన్న అంశాలను నాదైన కోణంలో చూపించేవే ఈ మైక్రో కథలు.

14 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చిన్నపిల్లల పాలిట.. “రమణ అంకుల్” లాంటి దెయ్యాలు ఈ లోకంలో చాలా ఉన్నాయి.
    అలాంటి వాళ్లను అప్రమత్తతో తరిమేయాల్సిన అవసరం ఉంది.
    చిన్న కథలో మంచి సందేశం..!

  • Entho mandhi pillalu chparu.. Kondharu bhyam tho, nkonthamandhi ardhm kaka.. Ilanti neighbour dhayyalu untay, intlo dhayyalu kuda untay..
    Bhga rasav ✍vamshi.. 👍👍

  • పిల్లలు నమ్మి, ప్రేమించే వారే పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఏదోక ఆశ పెట్టో, నచ్చచెప్పో, బెదిరించో ఇలాంటి నీచమైన పనులు చేస్తున్నారు. పిల్లలపై లైంగిక దాడి అనేది ఎంతో హేయమైన చర్య. ఇలాంటి దాడులు జరగకుండా.. పిల్లలకు ముందు నుంచే తలిదండ్రులు జాగ్రత్తలు చెప్పాలి. ఏం చేస్తాం, ఆడపిల్లలను కనాలంటేనే భయపడే సమాజంలో ఉంటున్నాం మరి!
    ……
    #విశీ_మైక్రో కథలు.
    -చిన్న కథలో లోతైనా భావాలతో మంచి సందేశమిచ్చారు.

  • ఏం చెప్పాలి?? ఏం రాయాలి సమీక్ష?? మాటలు లేకుండా చేసేశారు.. మనసు బరువెక్కింది. ఎంతో ఉత్సాహంగా చదివిన నేనూ కూడా ఆ తల్లిలాగే చివారఖరికి స్తంభించి పోయాను.

  • Bhayya intha chinna Katha lo antha pedda vishadam,

    Ramana lanti వ్యక్తి ని కొడితే సరిపోదు
    అలాంటి వాళ్ళను పూర్తిగా పటాపంచలు చేయాలంటే వాళ్ళలో వుండే మానసిక భూతాన్ని తరిమేయాలి.

  • చిన్నగా ఎంత స్ట్రాంగ్ గా డైరెక్ట్ గా చెప్పేరు … విశీ గారు

  • Great.
    అద్భుతంగా వుంది వంశీ.
    అభినందనలు.
    కొండని అద్దం లో చూపించావు

  • అబ్బా… ముగుంపు ఎంత ఆలోచించేదిగా రాశావన్నా…. స్సూపర్

  • అందుకే గుడ్ టచ్ ..బాడ్ టచ్ గురుంచి పిల్లలికి చెప్పాలి..చిన్న పిల్లల్ని ఒంటరిగా ఎక్కడికి పంపకూడదు..ఒంటరిగా వదిలేయకూడదు…కొన్ని నిమిషాలు చాలు జీవితం నాశనం కావడానికి…

  • సాయి వంశి గారు మీ కథలు
    గ్రైండర్

    చచ్చిపోయిన ఇష్టాలు

    వర్షా సమయం

    నవ్వుతున్న దెయ్యం

    ఈ కథలన్నీ కూడా మైక్రో కథలు అంటే సూక్ష్మ కథలుగా

    బావున్నాయి.

    సూక్ష్మం లోనే మోక్షం చూపించారు .

    అయితే ఈ కథల్ని ఇంకా కొంచెం విశదీకరిస్తూ రాస్తేఒక మంచి ప్రయత్నం అవుతుందని నేను అనుకుంటున్నాను.

    చాలా మంచి ప్రయత్నం అవుతుంది

    ఇలాగే కంటిన్యూ చేయండి గుడ్ లక్ .

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు