నవలా నాయకి ప్రాణం పోసుకొని నడిచివచ్చింది

ఇంత మానవ సంఘర్షణ, ఇంత విస్తృతి ఉన్న నవల 130 పేజీలకు మించకపోవడం విచిత్రమే. మరింత తీరుబాటుగా రాసి ఉంటే రష్యన్ క్లాసిక్ లా ఉండే అవకాశం ఉంది.

రాగో తలపుల్లో ఉండగానే విశాఖ నుండి విషపు గాలి గుప్పుమంది. మీడియా మోసుకొచ్చిన హాహాకారాలు. చెట్టు నుండి రాలి పడిన ఆకుల్లా వేలాది మనుషులు. నోరు తెరిచి నిస్సహాయంగా చచ్చిన మూగజీవాలు. నిలువునా మాడిపోయిన చెట్లు, పంట పొలాలు. భీతావహమైన ప్రకృతి. పెట్టుబడితో కరచాలనం చేసిన చేతులే జనం కన్నీరు తుడిస్తే కళ్ళలో గుచ్చుకున్న కరకు కాగితపు నోట్లు! బిడ్డను పోగొట్టుకున్న శోకం కంపెనీ రక్షణ గోడల కట్టలు తెంచితే ఆ అమ్మ ఆక్రోశంలో మళ్ళీ రాగోయే కనిపించింది. ఆ విషపు గాలి రాగోను బలితీసుకున్న పెట్టుబడే. పచ్చని ప్రకృతికి ఆ విషపు గాలులు సోకకుండా వెచ్చని చేతులడ్డుపెట్టి కాపాడుతున్నది ‘రాగో’లే. విచిత్రమేమిటంటే అటువంటి రాగోలను వేటాడుతున్న ఆపరేషన్ పేరు ‘గ్రీన్ హంట్’.

ఆకలిని, ఆంక్షలను తప్పించుకొని కన్నఊరికి సాగిన ప్రయాణం రైలు పట్టాల మీద చిక్కటి నెత్తురైనప్పుడు ఎందుకో రాగోయే గుర్తొచ్చింది. స్వేచ్చనే కోరుకుంది రాగో. తన స్వేచ్చయే కాదు. స్వేచ్చాయుత మానవ సామాజాన్ని కోరుకుంది. ఆకలి, అవమానాలు, దోపిడీ, పీడనల నుండి విముక్తిని కోరుకుంది.

రాగోతో నా పరిచయం ఇరవై ఏళ్ల నాటిది. విప్లవ సాహిత్యం పరిచయమైన తొలిరోజుల్లో ఎవరో నా చేతిలో రాగోను పెట్టారు. రాగోను చదువుతున్నప్పుడు రెండు మూడు సన్నివేశాల్లో కలిగిన అనుభూతి నాకిప్పటికీ గుర్తుంది.

పసుపు బట్టల్లో రాగో అడవుల వెంట పరిగెత్తడం ఒక దృశ్యంగా అలా గుర్తుండిపోయింది.

ఇష్టం లేని పెళ్లి నుండి తప్పించుకొని రెండుసార్లు దొరికిపోయి దెబ్బలు తిన్న రాగో మూడో సారి మళ్ళీ పారిపోతుంది. ఈ సారి దళం కనిపిస్తుంది. వాళ్ళామెను రక్షిస్తారేమో అనుకున్నా సినిమాటిగ్గా!

చాలా పేజీల తర్వాత రాగో పాంటూ, చొక్కా తొడిగి భుజాన తుపాకీ ధరించడం కళ్ళు మూసుకొని ఊహించుకున్నా. ఆమె తిరిగి చూసే సరికి ఆమె చీరెను చింపి తుపాకీ క్లీన్ చేసే గుడ్డగా వాడుకోడానికి తలాయింత పంచుకుంటారు సహచరులు. ఆశ్చర్యపోయి చూస్తున్న ఆమె చేతిలోనూ కొన్ని పీలికలు పెట్టి ఉంచుకో పనికొస్తుందంటారు. నవ్వుకున్నాను. చదువుతుంటే చాలా తృప్తిగా అనిపించింది. అప్పటికి ఉద్యమం గురించి పెద్దగా తెలీదు. సహజంగా అనుభవంలోకి వస్తున్న ఒక ఇరుకుదనం నుండి చల్లగాలి పీల్చుకున్న హాయి.

తాను విడిచి వచ్చిన గూడేనికి దళసభ్యురాలు జైనిగా మారి తిరిగివస్తుంది రాగో. మామూలుగా మనం చదివిన పుస్తకాల్లో కొన్ని సన్నివేశాలు అలా ప్రత్యేకంగా గుర్తుండిపోతాయి. ఇవి చెప్తుంటే విప్లవ నవలలో ఇంతకన్నా ఏముంటుంది అనుకోవచ్చు. అది అకెడెమిక్ దురభిప్రాయం అని చెప్పొచ్చు. రాగో సందర్భంలో ప్రత్యేకంగా కూడా చెప్పొచ్చు. అక్కడికీ వస్తాను.

ఈ నవలా నాయిక రాగో అకస్మాత్తుగా మళ్ళీ తారసపడింది. రాగో పోలీసు కాల్పుల్లో చనిపోయిందని మిత్రులెవరో ఫేస్ బుక్ లో రాశారు. ఇది నిజమా? రాగో నిజమా? నిజంగానే ఈ భూమ్మీద పుట్టిందా? ముప్పై ఏళ్ల నాటి నవలా నాయకి ప్రాణం పోసుకొని వచ్చిందా? చనిపోయిందని అంటున్నారే? రాగో ఉనికి ఇలా తెలిసి రావడం ఎంత విషాదం! స్క్రీన్ మీద ఛిద్రమైన రూపం. కానీ రాగో నవలా నాయికలానే నిలిచిపోయింది శాశ్వతంగా. విచిత్రమేమిటంటే సృజన జీవితం రాగో నవలకు ప్రేరణ అయి ఉంటుందనుకున్నాను, కానీ, సృజనయే రాగో అని తెలిసింది. ‘రాగో’ను చేతుల్లోకి తీసుకున్నాను. కొత్తగా చదివితే ఎన్నెన్ని పొరలు విప్పిందో!

రాగో సందర్భంలో చాలా చర్చలున్నాయి. రాగో పుస్తకంగా వచ్చినప్పుడు, ఇప్పుడు మళ్ళీ రాగో అమరత్వమప్పుడు. ఈ చర్చ చేయడానికి అదాటున తారసపడిన సందర్భమే కాదు రాగో. నవలలోపల కూడా అందుకు అవసరమైన స్టఫ్ ఉంది. నవలలో అంటే రాగో జీవితంలో అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాగో జీవితంలో అన్నప్పుడు ఆదివాసీ సమాజంలో, ఇంకా నిర్దిష్టంగా ఒక రాజకీయ భావజాల ప్రభావానికిలోనయిన ఆదివాసీ సమాజంలో అని చెప్పాలి.

ఏ సాహిత్యానికైనా మానవ జీవితమే ముడిసరుకు. మానవ అనుభవం నుండి సాహిత్యంలోకి వాస్తవికత వస్తుంది. అయితే వాస్తవికత ఒకే ముద్దలాగా ఉండదు. అందులో అనేక పొరలుంటాయి. ఏ మనిషి అనుభావానికైనా వాస్తవికతకు సంబంధించిన ఒక పొర మాత్రమే వస్తుంది. అంటే కేవలం అనుభవం ద్వారానే వాస్తవికతను చేరుకోలేం. ఉదాహరణకు పితృస్వామ్యం మన సాధారణ అనుభవంలోకి కుటుంబ హింస రూపంలో వస్తుంది. అయితే సమాజం మొత్తంలో, లేదా వ్యవస్థలో పితృస్వామ్యం ఎలా పని చేస్తూ ఉంటుందో అర్థం చేసుకోవాలంటే దానికోసం మన అనుభవం నుండి బైటికి విస్తరించి ఇంకో అన్వేషణ చేయాలి. సాహిత్యం వాస్తవికతకు సంబంధించిన ఒకానొక అనుభవం మాత్రమే చెప్పదు. అనుభవం వెనక ఉన్న లాజిక్ ఏమిటో కూడా అన్వేషిస్తుంది. అప్పుడది సమాజ మూలాల్లోకి వెళుతుంది.

రాగో తన అనుభవం దగ్గర బయలుదేరుతుంది. రాగో అనుభవం ద్వారా ఆదివాసీ సమాజంలోని దారుణమైన పితృస్వామిక అణచివేత మన పరోక్ష అనుభవంలోకి వస్తుంది. ఇది మైదాన ప్రాంతంలో ఉన్నవారికి పూర్తిగా కొత్త అనుభవం. ఉదాహరణకు పెళ్ళైన తర్వాత యువతులు చాలీ చాలని బట్టలోకి మారిపోతారని, అలంకరణలన్నీ తీసేస్తారని, వారికి చాలా నిషేధాలు ఉంటాయని మనకు దండకారణ్య సాహిత్యం ద్వారానే తెలిసింది. మామూలుగా హిందూ సాంప్రదాయంలో వితంతువులను అలా చేయడం మనం చూస్తాం.

మాడియా గోండు యువతి ‘రాగో’ ఇష్టం లేని పెళ్లి నుండి పారిపోవడంతో నవల ప్రారంభమవుతుంది. వాళ్ళ తెగ సాంప్రదాయం ప్రకారం మగపిల్లవాడు ఆడపిల్ల తండ్రికి జీవపారె (కన్యాశుల్కం) ఇవ్వాలి. అది ఇచ్చుకోలేని వాళ్ళు ఇల్లరికం వచ్చి ఆ కుటుంబానికి ఆసరాగా ఉంటే పిల్లనిస్తారు. ఆ పద్ధతిలో రాగోకు చిన్నప్పుడే తన బావతో పెళ్లి నిశ్చయమవుతుంది. అమ్మాయి ఇష్టం పట్టించుకోని రీతి రివాజుల పట్ల రాగోకు చాలా అసహనం ఉంటుంది. పారిపోయి తను ఇష్టపడిన యువకున్ని (నాన్సు) చేరుకోవాలనుకుంటుంది. అయితే అతనామెను పెళ్లి చేసుకోవాలంటే ముందుగా పెళ్లి నిశ్చయమైన వాడికి డబ్బు కట్టాలి, లేదా ఇద్దరూ పారిపోవాలి. నాన్సు అందుకు సిద్ధపడదు. అతనికి అప్పటికే పెళ్ళయి ఉంటుంది కనక (తెగలో బహుభార్యత్వం తప్పు కాదు) ఆ బరువు తలకేత్తుకోకుండా తప్పించుకుంటాడు. పారిపోయి తన ఇంటికొచ్చిన రాగోను గదిలో పెట్టి, ఊరి పెద్దలకు మొహం చూపకుండా పారిపోతాడు. రాగోను విపరీతంగా కొట్టి తండ్రి లాక్కుపోతాడు. మళ్ళీ ఇంటి నుండి పారిపోయి స్నేహితురాలి వద్దకు పోతుంది. అక్కడా నిమ్మళంగా ఉండలేక అడవి దారి పడుతుంది. వేట జంతువును పట్టుకున్నట్లు రాగోను పట్టుకుంటారు. పెళ్ళికి సిద్ధం చేస్తుండగా మళ్ళీ పారిపోతుంది. ఇదంతా రాగో స్వేచ్చా కాంక్షను తెలియజేస్తుంది.

తను కోరుకున్నవాడు తోడు నిలవడని తెలిసినా, ఊరు, ఊరి పెద్దమనుషులు తన బాధ ఆలకించరని తెలిసినా తండ్రి నిశ్చయించిన పెళ్లికి రాజీపడదు. తన మానాన తాను ఒంటరిగా కూడా సమాజం బతకనివ్వదని, ‘కేర్దే’ (తిరుగుబోతు) అని ముద్రవేసి వేధిస్తారని తెలుసు. కానీ రాగో (రామచిలుక) పంజరం దాటేస్తుంది. ఇక దొరక్కుండా ఉండాలని దట్టమైన అడవుల్లోకి ప్రవేశిస్తుంది.

అప్పటికే అక్కడికి విప్లవోద్యమం ప్రవేశించింది. రాగోకు దళం తారసపడటం అనుకోని సంఘటన కాదు. తన ప్రయాణంలో ఉద్యమం తాలూకు ఛాయలు ఆమె చూస్తూనే ఉంటుంది. సంఘ సభ్యురాలు రూపి ఆమెను చేరదీస్తుంది. ఇప్పుడు రాగో భవిష్యత్తు రాగోయే నిర్ణయించుకోగలదు. కానీ ఆమెకు జవాబు దొరకని ప్రశ్నలున్నాయి. అంతటా రీతి రివాజుల పేరుతో స్త్రీని అణచివేయడమే. ఇష్టమైనవాణ్ని కట్టుకున్నా తప్పేది కాదిది. రాగో అనుభవం నుండి పుట్టిన ప్రశ్నలు మరింత లోతైన అన్వేషణకు పురిగొల్పాయి. సంఘం వెంట తిరుగుతున్న రాగో తన చుట్టూ ఉన్న సమాజం గురించి మరింత హేతుబద్ధంగా, విమర్శనాత్మకంగా ఆలోచించడం నేర్చుకుంది. రాగో అనుభవాన్ని విప్లవోద్యమం తనలోకి తీసుకుంది. ఆమె అవగాహనాను విప్లవోద్యమం మరింత అభివృద్ధిపరచింది. ఇక్కడ రాగో అనుభవం అంటే ఆదివాసీ స్త్రీ అనుభవం. రూపి వెంట సంఘంలో పనిచేస్తున్న రాగో దళాన్ని చూస్తుంది. దళ సభ్యురాలు గిరిజ మాటల్లో, పాటలో ఆదివాసీ మహిళల బాధలు వింటుంది. తన జీవితమే తన కళ్ళెదుట కనపడుతుంది. అన్నీ వింటూ ఆ ఊరి మగవాళ్ళ కిక్కురుమనకుండా అలా కూచుని ఉండడం ఆమెకు ఊరటనిస్తుంది.

సాధన (రచయిత) ఆదివాసీ సమాజంలోపల ఒక స్త్రీ అనుభవాన్ని సాహిత్యం చేయాలనుకోవాడానికి ప్రేరణ దండకారణ్య మహిళా ఉద్యమమే. నవల రాసేనాటికి అది నిర్మాణ దశలో ఉంది. విప్లవ మహిళా సంఘాలు ఏర్పడుతున్నాయి. ఉద్యమంలో మహిళా భాగస్వామ్యం పెరగడానికి అది ఎంతగానో దోహదం చేసింది. అదే సమయంలో ఉద్యమం సాంస్కృతిక అంశాల మీద పనిచేయడానికి కూడా ఇది దోహదం చేసింది. సామాజిక సాంస్కృతిక విప్లవాలకు వర్గపోరాటం ఎట్లా దారులు వేస్తుందో దండకారణ్య మహిళా ఉద్యమం ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఆదివాసుల రీతిరివాజుల జోలికి పోకుండా అక్కడి పితృస్వామ్యాన్ని గాని, తెగ పెత్తందారీ ఆధిపత్యాన్ని గానీ దెబ్బకొట్టడం సాధ్యం కాదు. మామూలుగా ఏ సమూహపు రీతి రివాజుల జోలికి పోవడమైనా చాలా సున్నితమైన విషయం. కానీ ఇక్కడ చట్టాలు చేయలేని పనులు కూడా వర్గపోరాటం చేయగలుగుతుంది. ఎందుకంటే వర్గపోరాటం ప్రజల జీవికకు సంబంధించిన సమస్యలను పట్టుకుంటుంది. దానిద్వారా ప్రజలకు ఒక భారోసానిస్తుంది. అందుకనే దళం మీటింగులు పెట్టి చెప్తే గ్రామం మొత్తం వింటుంది.

అలా రాగో దళంలోకి వెళుతుంది. అయితే అప్పుడు కూడా ఆమెకు దళం గురించి, వారి ఆచరణ గురించి పూర్తిగా తెలియదు. కామ్రేడ్స్ తో తాను నడవాల్సిన కఠినమైనదారుల గురించి అనుభావంలోనే తెలుసుకుంటుంది. ఇక్కడే నేను పైన ప్రస్తావించిన సన్నివేశం -ఆమె ఆహార్యం పూర్తిగా మారిపోతుంది. రాగో ఆహార్యమే కాదు, రాగో కూడా పూర్తిగా మారిపోయి ‘జైని’ అవుతుంది. అమాయక ఆదివాసీ యువతి ఒక నూతన మానవిగా మారడం -నిజానికి ఇదొక మెటామార్ఫోసిస్. మహిళగా బాధలు పడిన రాగో మహిళలందరి స్థితిని, పితృస్వామ్యాన్ని అర్థం చేసుకుని.. ఆ స్థితిలో మార్పు తెస్తున్న ఉద్యమంలో భాగమవుతుంది. విప్లవోద్యమం ద్వారా రాగోకు మొత్తంగా ఆదివాసీ సమాజం ఎటువంటి దోపిడీ పీడనలకు గురవుతున్నదీ అవగాహనలోకి వస్తుంది. క్రమంగా వ్యవస్థ స్వభావాన్ని, వర్గపోరాటాన్ని అర్థం చేసుకునే పరిణతి ఆమెకు వస్తుంది. నవలలోని ఒక సన్నివేశంలో ఆమె చదువు నేర్చుకుంటూ ఉంటుంది. మరో సన్నివేశంలో సైనిక పాత్ర పోషిస్తుంది. ఇంకోచోట గ్రామ మహిళల ఎదుట గతంలో గిరిజ మాట్లాడినట్లుగా వారి బాధల గురించి మాట్లాడి వారు సంఘంగా ఏర్పడేలా ప్రోత్సహిస్తుంది. ప్రజాపంచాయితీ నిర్వహిస్తుంది.

నవలలో గిరిజ పాత్ర గురించి కూడా చెప్పుకోవాలి. రాగో తర్వాత కాస్త నిడివి ఉన్న పాత్ర గిరిజ. పట్టణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, రేడికల్ ఉద్యమ ప్రభావంతో విప్లవ పార్టీలోకి వస్తుంది. ఆమె ఆదివాసుల మధ్య డీ క్లాసిఫై కావడం, రాగో ఆదివాసీ అమాయకత్వం నుండి ఎదగడం, ఆ ఇద్దరూ, మరి కొందరు మహిళలు పురుషులతో కలిసి దళంలో నడవడం, ఒక దశలో మహిళలు మాత్రమే ఉన్న దళం గ్రామాల కాంపెయిన్ కు రావడం ఇవన్నీ దృశ్యాలుగా వెంటవెంటనే నవలలో నడుస్తూ పోతాయిగాని ఇదంతా ఇక పరిణామ క్రమం. గిరిజ దగ్గరుండి రాగోను ప్రోత్సహిస్తుంది. గిరిజ, రాగో ఒకేసారి డిప్యూటీ కమాండర్స్ అవుతారు. గిరిజ గానీ, రాగో గానీ ఆయా సామాజిక నేపథ్యాల ప్రాతినిధ్య పాత్రలు. స్వభావరిత్యా కూడా గిరిజ గలగలా మాట్లాడుతుంది. రాగో ఎప్పుడో గాని మాట్లాడదు. (ఆదివాసులు తక్కువ మాట్లాడతారు) గిరిజ అడవిలోని భౌతిక పరిస్థితులకు అలవాటుపడటంలో ఇబ్బందులు గాని, రీతిరివాజులను అధిగమించడానికి రాగో పడే సంఘర్షణ గానీ రచయిత నిజాయితీగా రాస్తాడు. ఉదాహరణకు రాగో మొదటిసారి దళంతో పాటు ఒక మాదిగ ఇంట్లో టీ తాగినప్పుడు ఆమె మనసులో జంకు ఉన్నదని రచయిత ప్రస్తావిస్తాడు. ఆదివాసులు అంటు ముట్టు వ్యవహారాల్లో ఎంత రిజిడ్ గా ఉంటారో నిజానికి మనం ఊహించలేం. అక్కడి నుండి రాగో ఎంతో దూరం ప్రయాణం చేస్తుంది.

ఆదివాసీ సమాజంలో ‘రాగో’ల ప్రభావం వేగంగా అల్లుకుపోతుంది. సమిష్టితత్త్వం ఎక్కువగా ఉండటం ఇందుకు కారణం. అందువల్లే ఈనాడు క్రాంతికారీ ఆదివాసీ మహిళా సంఘంలో ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం ఉంది. విప్లవ పార్టీలో, ప్రాతినిధ్యంలో సగం మంది మహిళలున్నారు. ఒక రాగో వేలాది రాగాలు కావడం అంటే అదే.

అదలా ఉంచితే ఉద్యమానికున్న ఎక్స్ టెన్షన్ నవలకుంది. రచయితగా సాధన గోండులతో మమేకమయ్యాడు. గోండీలో సంభాషణలకు ఒక్కోచోట అర్థం తెలీక సన్నివేశాన్ని బట్టి అవి ఏమై ఉంటాయో ఊహించుకోవాల్సి వస్తుంది. ఇంత మానవ సంఘర్షణ, ఇంత విస్తృతి ఉన్న నవల 130 పేజీలకు మించకపోవడం విచిత్రమే. మరింత తీరుబాటుగా రాసి ఉంటే రష్యన్ క్లాసిక్ లా ఉండే అవకాశం ఉంది. అయితే పదేళ్లుగా వస్తున్న దండకారణ్య విప్లవ సాహిత్యం మరెంతో ముందుకుపోయింది. విప్లవ సాంస్కృతికోద్యమం ఎంతో మంది రచయిత్రులను తయారుచేసింది.

భౌతికంగా నలబై ఎనిమిదేళ్ళు జీవించిన రాగో ముప్పై ఏళ్ల విప్లవోద్యమ చరిత్ర రచనలో భాగమైంది. కరోనా విస్తరించకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కాంపెయిన్ నిర్వహిస్తుండగా లాక్ డౌన్ పాటించని పారా మిలిటరీ బలగాలు జైనిని కాల్చి చంపినట్లుగా ప్రకటన వెలువడింది. కాలుష్యం వెదజల్లే ఫ్యాక్టరీ గొట్టాలకు, ఆకలి చావులకు ఎలా లాక్ డౌన్ లేదో, పోలీసు కాల్పులకు కూడా లాక్ డౌన్ లేదు. వాస్తవం కల్పన కన్నా శక్తివంతంగా కళ్ళ ముందు నిలిచిన సన్నివేశంలో ప్రకృతంత స్వచ్చమైన రాగో స్వేచ్చా కాంక్ష ఎటుచూసినా కనపడుతున్నది.

*

పి.వరలక్ష్మి

4 comments

Leave a Reply to Prabhu Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మాంచాల అచ్యుత సత్యనారాయణరావు
    9494052775
    వరలక్ష్మి గారు రాసిన
    నవలా నాయకి ప్రాణం పోసుకుని నడిచి వచ్చింది చదివా. ఆదివాసి గోండు యువతి ‘రాగో’ చలం కలలుగనే ఒక స్త్రీ మూర్తి , ఈ భూమి మీద పుట్టింది,ఒక ఆదర్శవాద ఆలోచనలతో విప్లవోద్యమంలో ఒక అనామిక మహిళగా నిరక్షరాస్యత ఉండి సహజంగా తనను తాను అభివృద్ధి చేసుకుంటూ మానవాళి పట్ల ప్రేమతో నవ సమాజ నిర్మాణానికై ‘జైనీ’గా మారడం ప్రపంచ విప్లవ సాహిత్యంలో ఒక నూతన అధ్యాయం అని చెప్పవచ్చు. వ్యాస ప్రారంభం కవితాశైలి , తాత్విక పరిశీలనతో పెట్టుబడి ప్రపంచ విప్లవోద్యమలను పర్యావరణాన్ని ఎలా అణచివేస్తుందో చాలా క్లుప్తంగా తెలియజేశారు, ఈనాడు ప్రపంచానికి
    జనతన సర్కార్ ఒక నమూనాగా కనబడుతోంది.

  • చాలా మంచి అనాలసిస్. ఇంకోసారి నవల చదువుతాను.

  • మంచి విశ్లేషణ. నాకొకటి తోస్తున్నాడు. సృజన హత్యతో నవలా నాయకిగా రాగోకి ఒక భౌతిక అస్తిత్వం ఉందని నిర్ధారణయింది. ఆవిధంగా కాల్పనిక పాత్రయిన రాగో తనకు మాతృకయిన వ్యక్తితో మరణాంతర కొనసాగింపయింది. నేను సరిగ్గా చెప్పగలిగానా?

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు