నర్సయ్య ధ్యానం

గంప కింద నిద్రపోతున్న కోడి తెల్లారుతందని కూసింది.

నర్సయ్య మంచం మీంచి లేచి బయిటికి పోయిండు. తను వొచ్చేలోపే రావమ్మ పొయ్యకాగులోంచి వేడి నీళ్లను పోసి జాలట్ల సిద్ధంగా వుంచింది.

నర్సయ్య ఆ వేడి నీళ్లతో స్నానం చేసిండు. ఉతికిన దోతీ కట్టుకొన్నడు. నేల మీద చాప వేసుకొని ధ్యానంలో కూచున్నడు.

కొద్ది సేపయ్యాక, కళ్లు తెరిచిండు. చింతనిప్పుల్లా వున్నయి అవి. అటూయిటూ చూసిండు. జరగరానిదేదో జరుగబోతందని అర్థమైంది రావమ్మకు. ‘‘యేమైందయ్యా’’ అని నిమ్మలంగా అడిగింది.

‘‘సెంద్రెయ్యా.. యింకా యెంత సేపు పంటవురా? లే లేచి బయిటికి రా’’ అని కేకలేసిండు నర్సయ్య.

నాయిన కేకలతో గబగబా లేసి బయటికొచ్చిండు. సెంద్రెయ్య భార్య యెల్లమ్మ. యిద్దరు పిల్లలను పక్కలో యేసుకొని యింకా నిద్ర పోతనే వున్నది.

సెంద్రెయ్య కళ్లు తుడుచుకుంటా వొచ్చి తండ్రి నర్సయ్య ముందు నిలబడ్డడు. యేమైందని అడగలేక పోయిండు. యేదో ముఖ్యమైన పని వుంటేనే అలా తొందరపెడుతడని తనకు తెలుసు.

‘‘నువ్వు బాయికాడ్కి పో. దుబ్బ సెల్కలో కంది కొయ్యలు అట్నే వున్నయి. వాటిని తీసేయి. తమ్ముళ్లను పాతబాయికాడ నాగళ్లు కట్టమను. వాళ్లు యింకా పండుకొనే వున్నట్టున్నరు.

పోతా పోతా సాకలి ఎల్లయ్యను లేపు. వెంటనే బయల్దేరి సల్వాయికి పొమ్మను. యేందీ యెందుకు అని అడిగితే, నేను కలువమన్నని సెప్పు’’ అని తరిమిండు సెంద్రెయ్యను.

సెంద్రెయ్య అట్టాగే సేసిండు. నత్తి యెల్లయ్యను నిద్రలేపిండు. ‘‘నాయిన నిన్ను సల్వాయికి జల్దీ పొమ్మంటండు’’ అని చెప్పిండు. తనకు అర్థం కాలేదు. యెందుకటా? అని అడిగిండు. ‘‘అది నాకు చెప్పలే. నువ్వే పోయి నాయినను అడుగుపో’’ అని బాయికాడికి యెళ్లిపోయిండు.

నర్సయ్య యేమి చెప్పిండో తెల్వదు. కానీ నత్తి యెల్లయ్య హడావుడిగా సల్వాయి పయనమై యెళ్లిపోయిండు.

యిది జరిగిన మూణ్నెళ్ల తర్వాత సెంద్రెయ్య జీవితం మరో మలుపు తిరిగింది.

 

మూడు రోజుల నుండీ వాన ముసురు ఎడతెరిపి లేకుండా కురుస్తంది. ఆ వానలోనే అందరూ పొలాల్లో నాట్లేసే పనిలో  వున్నరు. వొక జనుప బస్త సంచిని కొప్పెర చేసుకొని తలమీద కప్పుకున్నడు సెంద్రెయ్య. అది జారి కింద పడిపోకుండా సుతిల్దారంతోటి నడుముకు, మెడకు కట్టుకున్నడు. ఎడ్లను నాగలికి కట్టి బంధంవాగు పొలంలోకి దిగిండు.

సల్లటి సలిని తట్టుకోవడానికి పాటందుకున్నడు. నాగలి దున్నుతా గొంతెత్తి పాట పాడుతండు సెంద్రెయ్య.

ఆ పాటలు చాలా తీయగా వున్నయి. వొక్కో మడి దున్నతా నాట్లకు సిద్ధం చేస్తున్నడు. తను దున్నిన మడిల గొర్రు కొడ్తున్నడు తమ్ముడు సోమయ్య. సాఫు చేసిన మడిల శాంతవ్వ, ఎల్లమ్మ, చిలుకమ్మ, సరోజన యింకో అయిదుగురు కూలోల్లు నాట్లేత్తండ్లు.

నర్సయ్యకు యిద్దరు భార్యలు. రామవ్వ, శాంతమ్మలు. రామవ్వ తెల్లగుంటది. మంచి అజం వుంటది. రామవ్వకు పిల్లలు కాలే. పాలోల్లు గొడ్డుమోతడని హేళన చేసినా, సానాకాలం సహించింది. కానీ శాంతమ్మకు మాత్రం రేషం వొచ్చింది. నాకు గాకపోతే, యిట్టనే వంశం నాశనం సేత్తవా. పాలోల్లకు సమాధానం సెప్పాలంటే నువ్వు యింకోదాన్ని సేసుకో అని వొకరోజు పంచాతీ పెట్టుకున్నది నర్సయ్యతో. తొలుత వొప్పుకోలే. కానీ, రావమ్మ వొదులలే. చివరికి సరే అన్నడు. కానీ ఎవరు దొరుకుతరు?

ఆ తర్వాత మూణ్ణెళ్లకు తమ్మడపల్లిల సుట్టాలాయన సచ్చిపోయిండు. ఆయన దినాలకు పోయిండు. అక్కడే శాంతమ్మను చూసిండు. ఆమెను పెళ్లి చేసుకుంటానని నిర్ణయించుకున్నడు. ఆమె తండ్రితోటి మాట్లాడి కొత్త రయిక తొడిగిచ్చి తీసుకొచ్చిండు మల్లంపల్లికి. అట్లా శాంతమ్మకు నలుగురు కొడుకులయ్యిండ్లు. ఎల్లయ్య, సెంద్రెయ్య, వెంకటయ్య, సోమయ్యలు ఆ నలుగురు. పెద్ద కొడుకు ఎల్లయ్య జనగాం పక్కనున్న నిడిగొండకు యిల్లరికం బోయిండు. మిగిలిన కొడుకులు మల్లంపల్లిల అయిదు దాకా సదివిండ్లు. నర్సయ్య సచ్చిపోయి అప్పటికి అయిదేండ్లయితంది.

యిరవై యెకరాల యగుసాయం. ముగ్గురన్నల్దమ్ములు యగుసాయంలో పోటీపడి పని సేత్తండ్లు. రెండో కొడుకు వెంకటయ్యకు పెద్దపేరు. తెలివికల్లోడు. సదువుకున్నోడు. ఎవనికీ భయపడడు. నర్సయ్య లెక్కనే వూల్లె అందరికీ పెద్ద దిక్కోలె వున్నడు. నర్సయ్య తర్వాత తాననే కుటుంబ యవ్వారాలన్నీ చూస్తండు.

జీతగాళ్లిద్దరితో కలిసి పాతబాయి కాన్నుంచి వెంకటయ్య నారు కావడితో మోసుకొత్తండు. నారును కుప్పలు గట్టి పొలంల పెడ్తండు.

శాంతమ్మ కోడల్లతో కల్సి నాట్లేత్తంది.

‘‘ఎవరీ దానివే బామినీ

నీ వూరి పేరేమే వో గజగామినీ’’ అని సెంద్రెయ్య పాడుతా ఆఖరి మడి దున్నుతండు.

ఆ పాటల మాధుర్యానికి ఆడోళ్లు హుషారుగా నాట్లేత్తండ్లు.

ఆఖరి పొలం దున్నేసి నాగలిని బయటకు తోలుకొచ్చిండు. గొడ్ల తాళ్లు యిప్పి బంధం వాగులకు తోలి నీళ్లతో వాటి పెయ్యంతా కడుగుతండు.

 

వొక యిద్దరు అటువేపు నడిచొస్తున్నారు. వొకరి చేతిలో తాడుంది.

దూరం నుంచే వొకడు కేక వేసిండు. ‘‘వో అయ్యా. యిటు రెండు బర్లేమయినా వొచ్చినయా’’ అని కేకేసిండు.

అది సరిగా యినపడుత లేదు. నాటేసేటోళ్లు పని ఆపి వాళ్లకేసి చూసిండ్లు.

ఆ యిద్దరూ గొడ్లను కడుగుతున్న సెంద్రెయ్య కాడికి పోయిండ్లు.

‘‘వో తమ్మి యిటు రెండు బర్లు వొచ్చినయా. దొంగబర్లు పాడుగాను ఎటో పోయినయి’’ అన్నడొకడు.

వాళ్లను యింతకు ముందు యిక్కడ చూసిన గుర్తు రావటం లేదు. అందుకే కొద్దిగ అనుమానంతో చూసిండు.

‘‘యే వూరు మీది?’’ అని సెంద్రెయ్య అడిగిండు.

‘‘మాది వాయిలాల. మూడు రోజులాయె బర్లు పోయి. ఆట్ని యెతుకుతా తిరుగుతన్నం’’ వొరం మీద కూసున్నడు యింకొకాయన.

ఎడ్లను సుబ్రంగా కడిగి, వాటిని వాగుల నుంచి బయటికి తోలిండు సెంద్రెయ్య.

జేబుల నుండి బీడి తీసి జకుముఖి వున్నదా అని వొకడు అడిగిండు.

బీడిని సూడగానే సెంద్రెయ్యకు కూడా కుతిగుంజింది. అసలు పనిలో పడి బీడి తాగలేదన్న సంగతి మర్చేపోయిండు. నడుంకు సెక్కుకున్న జకుముఖిని తీసిండు. రాళ్లను రాపాడించి నిప్పు తయారు చేసిండు.

నిప్పును బీడి పట్టుకున్న మనిషికి చేత్తో అందించిండు.

అదును కోసం సూత్తన్న అతను సెంద్రెయ్య రెక్కను గట్టిగ పట్టుకొని వొడిదిప్పిండు.

యింకొకడు గబుక్కున రెండుకాళ్లూ పట్టి సెంద్రెయ్యను కింద పడేసిండు.

‘‘యే యెవర్రా మీరు?’’అని ఆ యిద్దరితో పెనుగులాడుతండు.

దూరం నుండి వాళ్ల పెనుగులాటను చూసిన ఆడోళ్లు ‘‘వాయ్యే యెక్కడి లంజకొడుకులురో మీరు’’ అని నాటేసే పని వొదిలేసి వురుకొత్తండ్లు. ఏడ్పులు పెడబొబ్బలు పెడుతండ్లు.

ఆ సంగతి దూరం నుంచే చూసిన వెంకటయ్య నారున్న కాడిని కిందపడేసి ‘‘వో లంజ కొడుకులారా యేవర్రా మీరు’’ అని ఉరుకొత్తండు.

‘‘మీ అవ్వల దెంగ. మా అన్నను కొడుతార్రా’’  అని సోమయ్య ముల్లుగట్టె అందుకొని వురుకొత్తండు.

సెంద్రెయ్య వొకణ్ణి లేపి యెత్తేసిండు. యింకోణ్ణి యెదురొమ్ము తన్నిండు. వాడు బురుద పొలంల పడ్డడు.

శాంతమ్మ బోరున ఏడుత్తంది.

సిలుకమ్మ వురుకొచ్చింది. ‘‘వో అయ్యా. నా బావను సంపుతండ్లురో వీళ్ల కాష్టం గాల’’ అని వురుకొచ్చి పట్టుకున్నోన్ని నూకేసింది.

వెంకటయ్య దొరికిన పెద్ద కట్టెపట్టుకొని బిర్రున వురుకొచ్చి వొకణ్ణి యేసిండు. వాడు జర్రల తప్పుకున్నడు గానీ లేకపోతే  దెబ్బకు సచ్చేటోడే.

సోమయ్య యింకోని మీదికి యెగవడ్డడు. వాడు సోమయ్యను నెట్టేసిండు.

’’సెంద్రెయ్య రాండ్రిరా లంజా కొడుకుల్లరా. మిమ్ముల తొక్కి సంపకపోతే నేను సెంద్రెయ్యనే కాదు’’ అని మీసం మెలేసిండు.

వెంకటయ్య కట్టె రయ్యిమని తిప్పుతున్నడు.

‘‘సెంద్రెన్నా, నువ్వాగు. నేను సూసుకుంట నా కొడుకుల’’ అని వొగన్ని వీపుల యేసిండు గట్టిగా. ఆ దెబ్బకు వాడు తల్లడిల్లిండు.

పరిస్థితి చెయ్యి దాటుతుందని వాళ్లలో వొకడు గ్రహించిండు.

‘‘యే ఆగుండ్లి. దగ్గరికొత్తే ఖబర్దార్. మేం ఎవ్వలమనుకుంటండ్లు? పోలీసులం’’ అని గట్టిగా అరిచిండు.

పోలీసులనే మాట యినగానే సెంద్రెయ్యకు మొత్తం అర్థమైంది. వొక్కసారిగా ఉరుకబోయిండు.

వొకడు రెక్కపట్టుకొని గట్టిగ అదిమి పట్టిండు. యింకోడు ఆ రెక్కలకు బేడీలేసిండు.

వెంకటయ్యకు యేమీ అర్థం కాలేదు. ‘‘మీరు పోలీసులైతేంది? మా అన్నను యెందుకు పట్టుకున్నరో సెప్పుండ్లి’’ అని నిలదీసిండు.

‘‘బాంచొత్ మీ అన్న సంసారి పొక్క అనుకున్నావురా. వొగణ్ణి సంపిండు. ఏమీ తెల్వనోని లెక్క మాతోటే కలెబడుతావురా’’ అని వెంకటయ్య మీదికి కట్టెలేపిండు వొక పోలీసు.

తమ్ముని మీదికి కట్టెలేపగానే సెంద్రెయ్యకు కోపం పొంగింది. ‘‘యే పోలీసు. కట్టెదించు. కట్టెదించు నీయమ్మను దెంగ. నీకు దమ్ముంటె నాతో కొట్లాడు. నువ్వో నేనో వొక్కడే బతుకాలె. నా తమ్ముని మీదికి కట్టెలేపుతావ్ బాంచెత్’’ అని రోషంతో ముందుకు వురుకొచ్చిండు.

‘‘యేందిరా నీతో కొట్లాడేది. స్టేషన్లేసి తొక్కితే గుద్దల పెండ కారాలె’’ అని యింకోడు రెక్కబట్టి గుంజిండు.

‘‘నాకు హాత్కడిలేసిండ్లు. నన్ను మీ యిష్టం వొచ్చిన కాడికి దీస్కపోండ్లి. మీకు నచ్చింది చేస్కోండ్లి. నా వోల్ల జోలికి మాత్రం పోవద్దు’’ అని సింహం లెక్క గర్జించిండు. ఆ మాటలకు పోలీసులిద్దరూ కొద్దిగా జడిసిండ్లు.

అన్న చేతికున్న హాత్కడీలు చూసి వెంకటయ్య, సోమయ్యలిద్దరూ బోరుమన్నరు.

శాంతమ్మ వో నా కొడ్కా నీ కెంత కష్టం వొచ్చెరో అని శోకం పెట్టింది.

చిలుకమ్మ, ఎల్లమ్మ, సరోజన భూమి పగిలేలా పెడబొబ్బలు పెట్టిండ్లు. పనికొచ్చిన ఆడోళ్లు పట్టుకున్నోళ్లను తిడుతండ్లు. పక్క పొలాల్లో పని చేసేటోళ్లు ఆడికి వురుకొచ్చిండ్లు. అంతా గందరగోళంగా వుంది.

నడువు స్టేషనుకు అని సెంద్రెయ్యను నెట్టిండ్లు. తమ్ముళ్ల ఏడ్పు చూసి సెంద్రెయ్య కూడా కన్నీళ్లు పెట్టుకుండు.

అడుగు ముందుకేసిండు. వూళ్లెకు దీసుకొచ్చి గడి ముందట నిలబెట్టిండ్లు.

ఎవరు సెప్పిండ్లో తెల్వదు గానీ నర్సయ్య గడికాడికి ఉరుకొచ్చిండు. రావమ్మ గూడా వొచ్చింది. సెంద్రెయ్యకు యేసిన బేడీలు చూసి బావురుమన్నది. నా కొడుకు ఏం తప్పు చేసిండని బేడీలేసిండ్లని పోలీసోల్లను తిట్టింది. వాళ్లు దూరం పొమ్మని నూకేసిండ్లు. నర్సయ్య పోలీసోల్లతోటి వాదులాట పెట్టుకున్నడు. అప్పుడు,  గడీల నుండి అమీను బయటికొచ్చిండు. ఆయన ఎన్కే గోపాల్రావు దొర వొచ్చిండు. పోలీసు పటేలు రామయ్య కూడా వున్నడు వాళ్లతో.

బురద అంటిన బట్టలతో వున్న పోలీసులను చూసిన అమీను ఏమైందని అడిగిండు.

‘‘మాతో కలెబడ్డడు సార్’’ అని ఫిర్యాదు చేసిండొకడు.

పోలీసు పటేలు వొంక చూసి ’’యింకోడు యేడి? వాన్ని కూడా బయటికి దీస్కరా’’ అన్నడు.

గడీల తాళ్లతో కట్టేసి వున్న సాకలి రాజయ్యను గుంజుకొచ్చిండు.

అక్కడున్నోళ్లకు యేం జరుగుతందో అర్థం అయితలేదు.

సెంద్రెయ్యను, రాజయ్యను మోకాళ్ల మీద కూసొమ్మన్నడు అమీను. వాళ్లు అలాగే చేశారు. లాఠీతో సెంద్రెయ్య వీపు మీద నాలుగు దెబ్బలేసిండు. దెబ్బలకు తోలు చిట్లింది. కానీ సెంద్రెయ్య నొప్పిని పంటి బిగువున సహించిండు. ఏడ్వలేదు.

రావమ్మ, శాంతమ్మ ‘‘అయ్యో అయ్యో నా కొడుకును కొట్టయ్యా. నీ కాల్మొక్తా’’ ముందుకు రాబోయిండ్లు. పోలీసోల్లు అడ్డం నిలబడి వాళ్లను ఆపేసిండ్లు.

 

ఆ దెబ్బలు చూస్తున్న సెంద్రెయ్య భార్య, తమ్మళ్లు వెంకటయ్య, సోమయ్యలిద్దరూ తల్లడిల్లిండ్లు. యిగ శాంతమ్మ, సిలుకమ్మ, సరోజన శోకాలు పెట్టి యేడుత్తండ్లు. నర్సయ్య మొహంలో ఆందోళనయేమీ లేదు. అతను స్థిరంగా వున్నడు. కొడుక్కు దెబ్బలను తట్టుకొనే మొండిగుణం బానే వుందని తనకు తెలుసు.

 

వూరంతా అక్కడే గుమిగూడింది. యేం జరిగిందో తెల్వక బేలమొహం వేసుకొని సూత్తండ్లు.

 

సాకలి రాజయ్య జుట్టువట్టి అటూయిటూ వూపిండు అమీను. బూటుకాలితోటి డొక్కలో తన్నిండు. రాజయ్య విలవిల్లాడిండు. కిందపడి కొట్టుకుంటండు.

లాఠీతో రాజయ్యను కుల్లబొడిసిండు అమీను.

గడి ముందున్న యాప సెట్టు అమీను క్రూరత్వాన్ని చూసి వూగిపోతంది. ఆకులు రాలి నేలమీద పడుతున్నయి.

రాజయ్య తండ్రి నత్తి యెల్లయ్య లబోదిబోమని నెత్తినోరూ కొట్టుకొని కింద కూలబడ్డడు. నా కొడుకును సంపకురయ్యో నీ కాల్మొక్తా అని పెడబొబ్బలు పెట్టిండాయన.

పెద్దమేతరి సోమయ్య ముందుకొచ్చిండు. ‘‘అయ్యో, సంపుతరా యేంది సారు? గంతగనం యెందుకు కొడుతండ్లు?’’ అని గట్టిగా అడిగిండు.

’’నువ్వెవ్వనివిరా అడుగడానికి?’’ అని అమీను గద్దించిండు.

‘‘నేను మాదిగ్గూడెం పెద్దమేతర్నయ్యా’’ అని బదులిచ్చిండు.

అమీను ఎగాదిగా చూసిండు. ‘‘అయితేందిరా? నువ్వడిగితే చెప్పాల్నా?’’ అని మళ్లీ సెంద్రెయ్యను లాఠీతో బాదిండు.

అది చూసి వెంకటయ్యకు కోపం ఆగలేదు.

‘‘అమీను సాబ్, యిదేమన్నా రజాకార్ల రాజ్యమనుకుంటన్నవా? నీ యిష్టం వొచ్చినట్టు కొడుతన్నవు? హమ్ బీ జాన్తే క్యా ఖానూన్ హై ఔర్ క్యానహీ. ఆప్ ఐసా మార్నానై’’ అని గట్టిగా అన్నడు.

అమీనుకు ఆ మాటతో కోపం వొచ్చింది. కానీ వీడెవ్వడో ఖానూన్ తెలిసిన వాడిలా వున్నాడని ఆలోచించాడు. దొరకేసి, పోలీసు పటేలు కేసి చూసిండు.

పోలీసు పటేలుకు సంగతి అర్థమైంది.

‘‘యెంకటయ్య నువ్వాగు. అమీను సాబ్ తో అట్లనేనా మాట్లాడేది’’ అని అన్నడు.

వెంకటయ్య అతని మాటలు లక్ష్య పెట్టలేదు. అమీను కేసి చూస్తూనే గోపాల్రావు దొరను ఉద్దేశించి యిలా అన్నడు.

‘‘దొరవారూ, నా గురించి ఈ అమీను సాబుకు జర చెప్పుండ్లి. మా అన్న తప్పు చేస్తే కోర్టు శిక్ష విధిస్తది. అమీను సాబుకు శిక్షించే అధికారం లేదు. హాత్కడీలేసిండు తీస్కపోయి అదాలత్ల అప్పచెప్పమనుండ్లి. లేకపోతే నేను గూడా యాడికి పోవాలో ఆడి దాకా పోతా’’ అన్నడు.

ఆ మాటలకు అమీను కూడా అదురుకున్నడు.

తన ముందు అంత ధైర్యంగా మాట్లాడుతున్నడంటే బాగా పలుకుబడి గల్లోడే అయ్యింటాడని అర్థమైంది. కొద్దిగా తగ్గిండు.

గోపాల్రావు దొర వెంకటయ్య గురించి చెప్పిండు. ఎమ్మెల్యేతోటి బాగా పరిచయం వున్న వ్యక్తి. చదువుకున్నోడు. వూళ్లో పెద్దమనిషి. కాబట్టి నిదానించమని చెప్పిండు.

అమీను వెంకటయ్య మొఖంలోకి చూసిండు. స్థిరనిశ్చయంతో భయం లేకుండా వున్నాయా కళ్లు.

తలతిప్పి అందరి వైపు చూసిండు. అందరూ నిశ్శబ్దంగా ఊపిరి బిగబట్టి తన వేపే సూత్తండ్లు.

‘‘యీ యిద్దరూ మామూలోల్లు కాదు. వొకణ్ణి చంపిన హంతకులు. యిద్దరు కలిసి వొకణ్ణి చంపేసిండ్లు. మూడు నెల్ల కిందట సల్వాయిలో చంపి యేమీ తెల్వనోళ్ల లెక్క తిరుగుతండ్లు. అందుకే హాత్కడీలేసినం. స్టేషనుకు తీస్కపోతన్నం’’ అని పోలీసు పటేలు వైపు చూసిండు. అతను యేమీ మాట్లాడ లేదు.

సెంద్రెయ్య దగ్గరికి పోయి భుజం పట్టి పైకి లేపిండు వెంకటయ్య. సోమయ్య దగ్గరికొచ్చిండు. తలకిందికి దించుకొని నిలబడ్డడు సెంద్రెయ్య.

ఎందుకు హత్య చేశావని అడగాలనిపించింది వెంకటయ్యకు. కానీ అడగలేదు. అప్పటికే అన్న అవమాన భారంతో కుంగిపోయి వున్నాడని తనకు అర్థమైంది.

‘‘రాజయ్యతోటి సోపతి వొద్దంటే యినవైతివి. యిదా నీ ఉద్దారకం. మా యిజ్జతి దీత్తివి’’ అని కోపం చేసిండు సోమయ్య.

సెంద్రెయ్య యేమీ మాట్లాడ లేదు.

నెత్తురు కారుతున్న యీపును చూసి బైండ్లోళ్ల ఆడోళ్లు బావురుమని యేడుత్తండ్లు.

 

పోలీసు జీబుల యెక్కించుకొని కొడకండ్ల దీస్కపోయిండ్లు.

 

ఆ రేయి యింట్ల యెవ్వరూ నిద్ర పోలేదు. యింట్ల పొయ్యి యెలుగలేదు.

గౌండ్లోళ్ల పెద్దమనుషులు యింటికొచ్చి ధైర్యం చెప్పిపోయిండ్లు. గొల్లోల్ల రాంచెంద్రు యింటికొచ్చి వాకిట్ల పీటమీద సానాసేపు కూసొని మాట్లాడిండు. ‘‘తమ్మడు యిట్ల సేసిండంటే నాకు నమ్మబుద్ది అయితలేదురా ఎంకటయ్య’’ అన్నడు.

‘‘మా అన్న లంగపనులు సేత్తడు గని, మనిషిని సంపేటోడైతే గాదే’’ అన్నడు సుట్ట కాల్చుకుంటా.

దూదేకుల ఉస్సేను వొచ్చి బాధపడ్డడు. అత్తిసత్తెయ్య వొంటి కాలితో సంకల కర్రలు పెట్టుకొని నడుసుకుంటా యింటికొచ్చిండు. ఎవ్వనికి రాని ఆపతి నీకే వొచ్చెరా బిడ్డా అని వెంకటయ్యను చూసి యేడ్చిండు.

ఏర్పుల రామచెంద్రు వొచ్చి ఎంతకాలమైందో తెల్వదు. ‘‘యే నీ యవ్వకు నా బారెద్దు. సెంద్రెన్న సచ్చినాడే? ఆపు. వో తమ్మి. నా మాట యిను. నువ్వు యెట్లన్నా సరే, సెంద్రన్నను బయిటికి దీస్కరావాలే. మాదిగిండ్లన్నీ నీకు తోడున్నయి. యేవోయి మైసయ్య? యేమంటవు? అబ్బురాం నాయిన కూడా ఈన్నే వున్నడు. తమ్ముడు అత్యచేసిండంటే నేను నమ్మ. సెంద్రన్న కొడుతడెవ్వన్నైనా. అవుతలోని బలమంతా తీసేత్తడు వొంట్లె నుంచి. మనిషినైతే సంపేటోడు కాడు తమ్మీ. నువ్వు నమ్ము. ఎట్లయినా గానీ అన్నను బయిటికి తీస్కరావాలే’’ అన్నడు.

 

అన్నగురించి వెంకటయ్యకు బాగా తెలుసు. మనిషి కరుకు. కానీ మనసు సున్నితం. దోస్తాన్ కోసం ఏమైనా సేత్తడు. నీతికి నిలబడుతడు. సెంద్రెయ్యకు చెప్తే తప్పు చేసినోణ్ణి యియ్యరమయ్యర దంచుతడు. చేతికి యేది దొరికితే దానితోటి బర్రెను బాదినట్టు బాదుతడని అందరికీ తెలుసు. కానీ, మనిషిని సంపేంత దుర్మార్గుడు కాడు. యిలా చాలా ఆలోచించిండు.

‘‘మా అన్నకు సాకలి రాజయ్యకు జిగ్రి దోస్తానుంది. ఆ రాజిగాని వొల్లనే యేదో మోసం జరిగి వుంటది’’ అని సోమయ్య అన్నడు.

యిల్లు సాలా పెద్దది. కానీ అది దీపం వెలుగులో దిగులుగా వుంది. యింట్లో ఆడోళ్లు ఏడ్చి ఏడ్చి అలిసిపోయి నేలమీద సాపలేసుకొని పడుకున్నరు.

శాంతమ్మ నిద్రపోలేదు. కొడుకును కచ్చీరులో ఎన్ని దెబ్బలు కొడుతున్నరో అని బెంగపడుతంది. రావమ్మ సన్నగా శోకం పెడుతూ పొయిలో మంటారకుండా పుల్లలు ఎగదోస్తంది. నా కొడుకును కొట్టిన సేతులు యిరిగిపోను. వాళ్ల యిల్లు కూలిపోను. కాలిపోను అని శాపనార్థాలు పెడుతూనే వుంది.

 

నర్సయ్య ఏమీ మాట్లాడకుండా కూచున్నడు. వెంకటయ్యకు నాయిన యెందుకంత నింపాదిగా వుంటండో అర్థమైత లేదు. నాయినకు సెంద్రెన్న మీద పావురం లేదా? యేమీ పట్టనట్టు యెట్లా వుండగలుగుతండు నాయినా? యివీ తనను తొలుస్తున్న ప్రశ్నలు.

 

యెట్లా తెల్లారిందో తెల్వదు.

తెల్లదోతి కట్టి, తెల్ల అంగి దొడిగిండు వెంకటయ్య. నేరుగా గోపాల్రావు దొర కాడికి పోయిండు. అప్పటికే తయారై యెటో పోవడానికి సిద్ధంగా వున్నడు.

‘‘దొరా, మీరు సాయం చేయాలె. మా అన్నను బయిటికి దీస్కరావాలె’’ అని అడిగిండు. మల్లంపల్లి దొరలు ప్రజాకంఠకులు కాదు. ప్రజలను పీడించటం, వేధించటం వాళ్లకు తెలియదు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగిన కాలంలో కూడా మల్లంపల్లి దొరలు ఆ కారణంగానే క్షేమంగా వున్నారు. పైగా బైండ్ల నర్సయ్య అంటే తనకు ప్రత్యేక అభిమానం. ఆయన హూందాతనం. న్యాయం వైపునిలబడే నిక్కచ్చితనం అంతా తనకు చాలా నచ్చింది. వెంకటయ్య ఐదో తరగతి చదువుకున్నడు. తెలివిగల్లోడు. తండ్రి పేరు నిలబెట్టే శక్తిగల్లోడని వెంకటయ్య మీద గురి వుంది గోపాల్రావు దొరకు.

‘‘నా చేతనైన సాయం చేస్తా నీకు. యివ్వాళ నేను హన్మకొండకు పోతున్నా. రెండు రోజులయినంక వస్తా. ఈలోపు నువ్వు కొడకండ్ల దొరను కలువు. నా మాటగా చెప్పు. ఆయనే కచ్చీరులో అమీనుతోటి మాట్లాడుతడు. అంతా మంచే జరుగుతది. నువ్వేమీ భయపడకు వెంకటయ్య’’ అన్నడు.

ఆ మాటలు తనకు ధైర్యం యిచ్చినయి. దొర జీపు యెక్కి యెళ్లిపోయిండు.

 

యింటికొచ్చిండు. యేవో కాయితాలు తీసుకున్నడు. బయల్దేరిండు. ‘‘యింత అన్నం తిని పోరా’’ అంది రావమ్మ. యేమీ మాట్లాడకుండా యెళ్లిపోయిండు.

‘‘నేనూ నీతో వస్తా’’ అన్నడు సోమయ్య.

‘‘యేమొద్దు. నేను కచ్చీరుకు పొయ్యి అన్న సంగతి మాట్లాడొత్త. నువ్వు ఆ నాటు పనులు కానియ్. జీతగాళ్లకు కందిసేనులో గుంట్క కొట్టియ్యి’’ అని పనులు పురమాయించి కొడకండ్లకు బయల్దేరిండు.

 

మల్లంపల్లి చెరువుకట్ట యెక్కగానే యేదో వొక తరంగం వొళ్లంతా తాకింది. చెరువు కట్టమీద దర్గా వుంది. అది దర్గా నుండి వొచ్చిన శక్తనిపించింది. చెప్పులు పక్కకు యిడిసి దర్గాకు దణ్ణం పెట్టుకున్నడు. కొద్దిగా ధైర్యం వొచ్చింది. మళ్లీ చెప్పులేసుకొని బయల్దేరిండు. కొద్ది దూరం పోయినంక కట్టకింద పెద్ద చెట్టు వుంది. దానికింద ఉప్పలమ్మ వుంది. అక్కడే యేటా బోనాల పండుగ సేత్తరు. ఉప్పలమ్మకు దండం పెట్టుకొని ముందుకు కదిలిండు.

 

వడివడిగా నడుస్తున్నడు. ఏగిలివారక ముందే బాయిలకాడికి పోయినోళ్లు ఎదురు పడ్డరు. పయిలంగా పొయిరమ్మని అంతా ధైర్యం చెప్పిండ్లు.

పొద్దు నెత్తి మీదికి యెక్కే యాళ్లకు ఏడునూతులకు చేరుకున్నడు. ఆ వూళ్లో పాలోళ్లు వుంటరు. వాళ్ల యింటికి పోంగనే ఏం జరిగింది? ఎట్లా జరిగిందని అడిగి కన్నీళ్లు పెట్టుకున్నరు. అక్కడే యింత చెయ్యి కడిగి కాసేపు కూసున్నడు. మళ్లీ బయల్దేరి కొడకండ్లకు పోయిండు.

కచ్చీరు యమకూపంలా వొంటరిగా నిలబడి వుంది. ఏ అలికిడీ లేదక్కడ.

కచ్చీరు కాపలాదారు తుపాకీ పట్టుకొని గల్వకాడ నిలబడ్డడు.

అతని కాడికి పోయి సెంద్రెయ్య గురించి అడిగిండు.

‘‘ఆ యిద్దరినీ తెల్లారక ముందే హన్మకొండకు తీస్కపోయిండ్లు. అదాలత్ ల జడ్జీ ముందు నిలబెట్టాలె. ఆణ్ణించి వరంగల్ సెంట్రల్ జైలుకు తీస్కపోతరు. నువ్వు ఆడికే పోవాలే’’ అని ఆ పోలీసాయన చెప్పిండు.

ఏం చేయాలో అర్థం కాలేదు. కాసేపు కచ్చీరు ముందున్న యాప చెట్టు కింద కూచున్నడు.

కొడకండ్ల దొర యతిరాజారావు. అతను ఎమ్మల్యే కావాలని ప్రయత్నం చేస్తున్నడు. గోపాల్రావు దొర కూడా తననే కలవమని చెప్పిండు.

యాపచెట్టు గాలి కొత్త శక్తిని యిచ్చింది. లేచి యతిరాజారావు యింటికి చేరుకొని ఆయన్ని కలుసుకున్నడు. జరిగిన సంగతి చెప్పి, సాయం చెయ్యమని అర్థించిండు.

‘‘యిది పోలీసుల యవ్వారం. మీ అన్న యేదో తప్పు చేసి వుంటడు. వాణ్ణి యెందుకు కాపాడుతవు? వాడు తప్పు చేయకపోతే ఎలాగూ పోలీసులు వొదిలేస్తరు గదా’’ అని సలహా యిచ్చిండు.

ఆ మాటలు వెంకటయ్యకు ఉపశమనం కలిగించ లేదు.

‘‘సార్, మాయన్న తప్పు చేసిండో లేదో తేల్చాల్సింది కోర్టులోని జడ్జి. మా అన్న అనుమానితుడు మాత్రమే. నేను పట్టించుకోక పోతే, నెలల తరబడి మాయన్న జైలులో వుండాల్సి వస్తది. అనుమానం నిజమని నిరూపించడానికి చాలా కాలం పడుతది. అప్పటిదాకా జైల్లోనే వుండాలా? మీరు సాయం చేస్తే మా వాడు బయటికి వస్తడు’’ అని నెమ్మదిగా అన్నడు వెంకటయ్య.

‘‘నేనేం చేయగలను? మీ బాధలేవో మీరు పడండి. మధ్యలో నాకెందుకు యీ గోల’’ అని లేచి యతిరాజారావు యింట్లోకి వెళ్లిపోయిండు.

నిస్సహాయంగా వెంకటయ్య బయటికి వచ్చిండు.

కొడకండ్ల నాలుగు బాటల కాడ వొక దుకాణం కాడ ఆగిండు. వొక చెట్టు కింద నిలబడి ఆలోచిస్తండు.

దేవేందర్ రెడ్డి యాదికొచ్చిండు. తనను వొకసారి అడిగితే ఏమంటడో చూద్దాం అని తోచింది. దేవేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడే. తను ఎమ్మెల్యే కావాలని ఆశపడుతున్నాడు.

వెంకటయ్య అతణ్ణి కలిసి సమస్య చెప్పిండు. ఆయన వెంటనే అదాలతులో వకీలుగా పని చేసే తన స్నేహితుడికి ఫోను చేసిండు. విషయం చెప్పి వెంకటయ్య వొచ్చి కలుస్తడని చెప్పిండు.

‘‘వెంకటయ్య, నువ్వేమీ భయపడకు. బాల్రెడ్డి నా మిత్రుడు. మంచోడు. నువ్వు హన్మకొండకు పొయ్యి తనను కలువు. హన్మకొండలోని బ్రాహ్మణవాడలో వుంటడు. ఎవరిని అడిగినా చెప్తరు. మీ వూరి గోపాల్రావు యిల్లు కూడా అక్కడే వుంటది. గోపాల్రావు యింటికి నాలుగో యిల్లు ఆవల బాల్రెడ్డది. పోయి కలువు’’ అని నవ్విండు. ఫోను నెంబరు కూడా యిచ్చిండు.

ఆయన పెద్ద సాయం చేశాడు వెంకటయ్యకు. ‘‘మీ సాయం మర్చిపోను సార్’’ అని చెప్పి దండం పెట్టిండు. దేవేందర్ రెడ్డి నవ్వుతూ ‘‘మనిషికి మనిషి సాయం చేయకపోతే దెయ్యం చేస్తదా? అంతా మంచే జరుగుతది పో’’ అన్నాడు.

 

రాత్రి ఏడుగంటలకు మళ్లీ మల్లంపల్లికి చేరుకున్నడు. నర్సయ్య యేమైందని కొడుకును అడిగిండు. జరిగింది చెప్పిండు.

 

తెల్లారక ముందే లేచి తయారైండు. హన్మకొండకు బస్సు యెక్కాలంటే వర్ధన్నపేట దాకా నడుచుకుంటా పోవాలె. అక్కడ ప్రయివేటు బస్సు ఉంటది. అది తొమ్మిది గంటలకే వుంటది. దాన్ని అందుకోవాలె. అందుకే తొందరగా లేచిండు.

చేతిలో కొన్ని కాగితాలున్న సంచి పట్టుకున్నడు. వొక కట్టె చేతిల పట్టుకొని బయల్దేరిండు. బుర్హాన్ పల్లి దాటే సరికి ఏడు దాటింది. యింకో గంట నడిచినంక వర్ధన్నపేట వొచ్చింది. అప్పటికే బస్సు జనాలతో నిండిపోయింది. వురికి ఎక్కి కూచున్నడు.

గంట తర్వాత వరంగల్లులో దిగిండు. అక్కణ్ణించి హన్మకొండకు చేరుకున్నడు. బాల్రెడ్డిని కలిసి కేసు గురించి చెప్పిండు. బాల్రెడ్డి కొడకండ్ల పోలీసు స్టేషనుకు ఫోను చేసి వివరాలు తెలుసుకున్నడు. ‘‘ఇది హత్య కేసు. నిజానికి పోలీసుల దగ్గర సరైన సాక్షాలేవీ లేవు. అనుమానంతో ఈ యిద్దరినీ అరెస్టు చేసిండ్లు. చనిపోయిన వ్యక్తని కచ్చితంగా ఈ యిద్దరే చంపి వుంటారనేందుకు బలమైన ఆధారాలైతే లేవు. ఎఫ్ఐఆర్లో అది అనుమానస్పద మరణం అని మాత్రమే వుంది. కచ్చితంగా యిది హత్యే అనేందుకు రక్తపు మరకలుగానీ, గాయాలు గానే యేవీ లేవు. కాబట్టి మీయన్నను బయటికి తీస్కొచ్చే బాధ్యత నాది. కానీ కొద్దిగ సమయం పడుతుంది. ఖర్చు కూడా అవుతుంది. నువ్వు సరే అంటే యిప్పుడే బెయిల్ పిటీషను వేద్దాం’’ అన్నడు. వెంకటయ్య సరే అన్నడు.

 

బెయిల్ పిటీషను యేసిండు. కానీ బెయిల్ రాలేదు.

కాళ్లీడ్చుకుంటా మళ్లా మల్లంపల్లికి చేరుకున్నడు వెంకటయ్య. యింటికి చేరుకోగానే సాకలి రాజయ్య తండ్రి నత్తి ఎల్లయ్య తన కోసమే ఎదురు చూస్తండు.

వెంకటయ్యను చూడంగనే నత్తి ఎల్లయ్యకు దుఃఖం వొచ్చింది.

‘‘అయ్యా, ఆళ్లు కనపడ్డరా? ఎట్లున్నరు?’’ అని అడిగిండు. హన్మకొండలో యేమి జరిగిందో చెప్పిండు. నత్తి యెల్లయ్య దిగులు పడ్డడు.

‘‘అయ్యా నా కొడుక్కు యెన్ని కష్టాలొచ్చినయో సూడు. మూణ్ణెళ్ల కిందనే నా కోడలు బాయిల పడి సచ్చిపోయింది. పెళ్లాం పోయిన బాధ నుండి బయిటపడక ముందే వీడు జైలు పాలయ్యిండు. ఏం పాపం చేసిన్నో నేను. నా కొడుక్కు శిచ్చ పడబట్టే’’ అని కన్నీరు మున్నీరయ్యిండు.

ఆ మాటలతో వెంకటయ్య కదిలిపోయిండు. నిజమే, రాజయ్య పెళ్లాం బాయిలపడి చనిపోయింది. ఎందుకు పడ్డది? ఎలా పడ్డది? అంత బాధయేం వొచ్చిందీ తనకు? ఆమె చావుకు ఈ హత్యకు యేమైన సంబంధం వుందా? యెన్నో ఆలోచనలు తొలిచినయి.

‘‘నీ అన్నతో పాటే నా కొడుకును కూడా తీస్కరా అయ్యా. నీకు పున్నెం వుంటది’’ అని వెంకటయ్య చేతులు పట్టుకున్నడు నత్తి యెల్లయ్య.

‘‘తప్పకుండా తీస్కొస్త. డబ్బులు ఖర్చయితయి. అవి సర్దుకో’’ అని ధైర్యం చెప్పిండు.

 

వెంకటయ్య వరంగల్లుకు, మల్లంపల్లికి తిరుగుతనే వున్నడు.  మూడు సార్లు పిటీషను యేసిండు వకీలు. మూడోసారికి బెయిల్ వొచ్చింది.

వరంగల్ సెంట్రల్ జైలు నుంచి సెంద్రెయ్య, రాజయ్యలిద్దరూ జామీను మీద విడుదలయ్యిండ్లు. అప్పటికే మూడు నెలలు దాటింది.

యిద్దరూ కొద్దిగా బక్కపడ్డరు. రాజయ్య కుంగిపోయినట్టు కనిపిస్తంది.

సెంద్రెయ్య మాత్రం యివేవీ పట్టనట్టు శాంతంగానే కనిపించిండు.

 

యిద్దర్నీ తీస్కపోయి హోటల్ లో మాంసంతో అన్నం తినిపిచ్చిండు. కడుపు నిండా తిన్నరు.

‘‘లక్ష్మి టాకీసుల సినిమా ఆడుతంది. కొత్తది. సూద్దామా?’’ అని నెమ్మదిగా అడిగిండు సెంద్రెయ్యను.

బీడి తాగుతా అటూయిటూ సూసిండు. వొద్దని తల అడ్డంగా ఊపిండు.

ముగ్గురూ బయల్దేరిండ్లు. వర్ధన్నపేట దాకా బస్సు మీదొచ్చిండ్లు. అక్కణ్ణించి మల్లంపల్లికి నడుస్తున్నరు.

పడమట సూర్యుడు నిద్ర పోవడానికి తొందరపడుతున్నడు.

ముగ్గురూ వేగంగా నడుస్తున్నరు.

 

బుర్హాన్ పల్లి దాటినంక వెంకటయ్య నోరు విప్పిండు.

‘‘రాజయ్య బావా, యెట్లుంది జైలు? మంచిగున్నదా?’’ అని అడిగిండు.

అతను యేమీ మాట్లాడ లేదు. కాసేపయ్యినంక మళ్లీ అడిగిండు.

‘‘అవును బావా, రేణ సెల్లే ఎట్లా సచ్చిపోయింది? అసలేమైంది?’’ అడిగిండు నడుస్తూనే.

చీకటిని తొలిగించడానికా అన్నట్టు మబ్బు మాటున వున్న వెన్నెల బయటికొచ్చింది.

రాజయ్య ఏమీ మాట్లాడ లేదు. అతని గుండె నిండా ఎవరికీ సెప్పుకోలేని సొద వుంది.

యెట్లైనా సరే, అసలు నిజమేందో తెలుసుకోవాలని వుంది వెంకటయ్యకు. ఎడ్లబాట పాములా వొంకలు వొకలు తిరిగి వుంది. చేతిలోకి వొక కట్టె తీసుకొని, దాన్ని నేల మీద పొడుస్తూ ముందు నడుస్తున్నాడు వెంకటయ్య. అలా నేలను గట్టిగా పొడవటం వల్ల ఎవరో వస్తున్నారని గ్రహించి పాములు, విషప్పురుగులూ పక్కకు తొలిగిపోతున్నాయి.

సెంద్రెయ్య బీడి తీసి వెలిగించాడు. పొగ పీలుస్తూ మౌనంగా నడుస్తున్నాడు.

చీకటికి అందరి కళ్లూ అలవాటయ్యాయి. ఎక్కడో వొక చెట్టు మీద పిట్టలు వొక్కసారిగా చప్పుడు చేస్తా గాల్లోకి లేచినయి. వాటిని యేదో జంతువో పామో భయపెట్టినట్టుంది.

 

‘‘యేమీ మాట్లాడవేంది, రాజయ్య బావా? అసలేం జరిగింది? యెందుకు వాన్ని చంపిండ్లు?’’ అని అడిగిండు. అయినా రాజయ్య మాట్లడ లేదు.

యింకా నోరు తెరవక పోవడంతో కోపం వొచ్చింది. ‘‘అయితే, మా సెల్లే తప్పు చేసిందా? తను మంచిది కాదా యేంది?’’ అని గట్టిగా అడిగిండు.

‘‘తను దేవత. నా దేవతను వాడు..’’ అని బోరుమన్నడు. ఎగిసి ఎగిసి యేడుత్తండు.

ఆ యేడుపుకు ఆకాశంలోని వెన్నెల చిన్నబోయింది. చీకట్లో కీచుమని సప్పుడు చేసే కీటకాలు కూడా నోరు మూసుకున్నాయి.

తువ్వాలతో కళ్లు తుడుసుకున్నడు. ముక్కు చీదుకున్నడు.

‘‘సల్వాయిలో బతుకుదామని పోయినం. అక్కడ నీళ్లుంటయి. మంచి పంటలుంటయి. ఎంతసేపూ అందరి బట్టలుతుకుతా యెంతకాలం బతుకుతం. మనం యాడికన్నా పోయి కూలి పని చేసుకుందాం. యింత బూమి కొనుక్కుందాం. అందులో యింత పండించుకుంటా బతుకుదాం అంది. నేను సరే అన్నా. సల్వాయి వాళ్ల తల్లిగారు. అక్కడికి పోయినం.

మా అత్తగారు కూడా బాగనే సూసుకున్నరు. కాయ కట్టం చేసినం. అయిదెకురాల బూమి కొనుక్కున్నం.

మా పక్కన్నే కాపోనిది. వాడు దుర్మార్గుడు. నా పెళ్లాం మీద కన్నేసిండు.

నేను పని మీద వేరే వూరు పోయిన వొకరోజు. బాయికాడ వొంటరిగా పని చేస్తున్న రేణ, నా బంగారు తల్లి మీద పడ్డడు వాడు. బలాత్కారం చేసిండు. అది సయించలేకపోయింది. బాయిల దున్కి సచ్చిపోయింది.’’ అని బోరు బోరున విలపిస్తున్నడు రాజయ్య. కొద్దిసేపయినంక తమాయించుకున్నడు.

 

‘‘పోలీసులు పంచనామా చేసిండ్లు. చివరికి నీ పెళ్లాన్ని యెవడో బలాత్కారం చేసిండు. నీకు యెవని మీదన్నా అనుమానం వుందా చెప్పు? అని అడిగిండ్లు. బంగారు తల్లిని బాయిల సూసినప్పుడే అనుకున్న. వాడే బలవంతం చేసి వుంటడని. కానీ నేను పోలీసులకు చెప్తే ఏమైతది. మా అంటే వాడు జైలుకు పోతడు. మల్లా బయిటికొత్తడు. అందుకే, నేను పోలీసులకేమీ చెప్పలేదు. కానీ, నా గుండె రగిలిపోతంది. దినాలయినంక మల్లంపల్లికి వొచ్చిన. సెంద్రెయ్య బావతో జరిగిన సంగతి సెప్పిన. గంతే’’ అని మౌనం దాల్చిండు.

 

చాలా సేపటి దాకా వెంకటయ్య యేమీ మాట్లాడ లేదు. రాజయ్యకు జరిగిన అన్యాయం సయించలేనిది. రేణ చాలా మంచిది. కనపడితే చాలు ‘అన్నా బువ్వదిన్నవా?’ ‘అన్నా మంచిగున్నవా?’ అని పల్కరించేది. బాయికాడికి పోయే దారిలోనే రాజయ్య యిల్లు వుంది. వచ్చీపోయేటప్పుడు సెల్లే రేణా ఏం సెత్తన్నవురా అని పల్కరిస్తే మురిసి పోయేది. మంచి మెరుపు. మంచి తెలివి. ఎవరూ తనను వొంకపెట్టలేరు. నింద మోపలేరు. అలాంటి మంచి మనిషి చనిపోయిందని తెలిసిన రోజు మనస్సంతా మూగబోయింది. ఆ తర్వాత యేవేవో పనులతో తీరిక లేక ఆ సంగతే మరిచిపోయిండు వెంకటయ్య.

 

 

కానీ, సెంద్రన్న జైలుకు పోతడని నాయినకు ముందే తెలుసా? చిన్న విషయానికే ఉగ్రరూపుడయ్యే నాయిన ఎందుకు శాంతంగా వున్నాడు? యేందో వెంకటయ్యకు తోయటం లేదు. అదే సెంద్రెయ్యను అడిగిండు.

‘‘నాయినకు తెల్వకుండా నేనేమీ చెయ్యలేదు. ఆ రోజు నన్ను తెల్లారక ముందే నిద్రలేపి బాయికాడికి పంపిండు. ఎల్లయ్య మామను వేగిరమే సల్వాయికి పొమ్మని చెప్పమని నన్ను పురమాయించిండు. నాయిన కళ్లు ఎర్రగా వున్నయి. మొహం చూస్తే ఏదో జరగరానిదే జరిగిందని అర్థమైంది. కానీ అడిగే ధైర్నం లేకపోయింది నాకు. యెల్లయ్య మామకు చెప్పి, నేను బాయికాడికి పోయిన. నువ్వు, సోమయ్య యిద్దరు పాత బాయికాడ పని చేస్తండ్లు. నేను అప్పుడు దుబ్బ సెలుకలో కందికొయ్యలు పీకేసే పనిలో వున్నా. నీకు యాదికొచ్చిందా?

నాయిన ఆ రోజు బువ్వదినే యాళ్లకు నా దగ్గరికి వొచ్చిండు. నాతో పాటు కంది కొయ్యలు పీకేసిండు కాసేపు. నేను యెల్లయ్య మామ గురించి అడిగిన.

ఆపతి వొచ్చింది బిడ్డా. యెల్లయ్య కోడలు బాయిల దునికి సచ్చిపోతంది. మధ్యాన్నం కల్లా బాయిల పడి సచ్చిపోతది. దాన్ని యెవ్వరూ ఆపలేరు. యిది తలరాత కాదు. ఆ పిల్లకు జరిగిన అన్యాలం సయించలేక అట్టా సచ్చిపోద్ది. వాడు దుర్మార్గుడు. యిప్పటికే  ఆ వూళ్లో నలుగురి సావుకు కారణమైయ్యిండు. రేణ అయిదోది. తలుసుకుంటేనే బాధయితంది.

యిదంతా నీకెట్టా తెలుసు? జరగబోయేది నీకెట్టా తెలుస్తది నాయినా? అని అడిగినా. దానికి నాయిన యేమన్నడో తెలుసా? నాకెట్లా తెలుసని కాదురా అడుగాల్సింది? రేణకు న్యాయం యెట్లా సెయ్యాలే అని అడుగాలె అన్నడు. నా సిన్నప్పుడే మా నాయిన సచ్చిపోతే, నన్ను నా తమ్ముళ్లను మా మేనమా మద్దిరాలకు తీస్కపోయిండు. తమ్ముళ్లను నన్నూ జీతం వుంచుతా అన్నడు మా మేనమామ. నేను సదువుకుంటా అన్నా. నువ్వు జీతమే వుండాలె అన్నడు తను.

మా నాయిన సంపాయించిన బూమి జాగలున్నయి. నేనెందుకు జీతముండాలె. నువ్వు పెట్టే నాలుగు మెతుకుల కోసం నా బత్కు నాశనం సేత్తవా అని మా మేనమామతో పంచాయితీ పెట్టుకున్నా. నీ దగ్గరుండ అని నేను మద్దిరాల నుండి వొక్కణ్నే నడుచుకుంటా వొచ్చినా. అప్పడు నాకెంత వయసుంటుందో తెలుసా? యెనిమిదేళ్లుంటయి కావొచ్చు. అడుక్కుంటా అడుక్కుంటా మల్లంపల్లికి వొచ్చిన. నాకు సదువుకోవాలని బలమైన కోరిక. అందుకే దర్దపల్లికి పోయిన. అక్కడే ఉర్దు బడి వుంది. తుర్కపంతులు సదువు సెప్పేది. నేను ఆ పంతులుని కలిసి సదువుకుంటా అన్నా. బడిల చేర్చుకున్నడు. కానీ తినడానికి తిండి లేదు. ఆ బడి చెట్టుకిందే పొద్దంతా వుండేవాణ్ణి. రెండు రోజుల దాకా నాకు తిండి లేదు.

దర్దెపల్లిలో సాకలి సోమయ్య అని వొక పెద్దాయన వుండేవాడు. ఆయన నా పరిస్థితి చూసిండు.

దయ చూపిండు. నన్ను వాళ్ల యింటికి తీస్కపోయి బువ్వ పెట్టిండు. ‘‘తినరా అల్లుడా. నువ్వెంత తింటే అంత బాగా సదువుతవు. వొంటో బలం లేకపోతే, బుర్రయెట్టా పని చేస్తదిరా’’ అని నా మట్టి గిన్నెలో బువ్వ పెట్టేటోడు. వాళ్లయింట్లోనే తిని, అక్కడే పండుకొనేటోన్ని.

ఆయన భార్య లింగమ్మ. సాలా మంచి తల్లి. వూళ్లో అందరి బట్టలూ ఉతికేవాళ్లు. యిద్దరూ నన్ను సొంత బిడ్డలా సూసుకున్నారు. వాళ్లకు అప్పటికి పిల్లల్లేరు. అందుకే నన్ను తన సొంత బిడ్డ అనుకున్నారు.

 

అందరి బట్టలూ ఉతికి సూదరిలల్ల బువ్వ అడుకొచ్చే వాళ్లు. ఆ బువ్వను వాళ్లింత తిని నాకే ఎక్కువ పెట్టేటోళ్లు. నాకు సరిపోయే బట్టలు మరీ అడుక్కొచ్చి నాకిచ్చే వాళ్లు.

నేను మా నాయిన పేరు చెప్పినా వొక రోజు. అప్పుడేమన్నరో తెలుసా. ‘‘వొరే అల్లుడా, మనవి వ్రుత్తి కులాలురా. యే కార్యం జరగాలన్నా, చాకలి, మంగళి, మాదిగ, బైండ్ల కులాలుండాల్సిందే. మనది సుట్టిరికంరా. అంటూముట్టు అంటా యేవీ పట్టించుకోకు. నువ్వు మా బిడ్డవి. అంతే’’ అంది లింగమ్మత్త. నేను ఐదో తరగతి కొచ్చే యేట వాళ్లకు వొక కొడుకు పుట్టిండు. యీ యెల్లయ్య తనే. వాడు పుట్టిన రోజు నేను బాగా సంబురపడ్డా. వాణ్ణి నా చేతిల పెట్టి, వొరే అల్లుడా. యిదిగో నీ బామ్మర్ది. వీన్ని నువ్వే చూసుకోవాలా అన్నరు. మేమున్నా లేకున్నా వీన్ని కంటికి రెప్పలా చూసుకోవాల్రా అని మాట తీసుకున్నరు.

వాడి అద్రుష్టమో దురద్రుష్టమో గానీ వాడికి పదేళ్లు కూడా రాకుండానే ఆ వాళ్లు పోయారు. నేను వాన్ని మల్లంపల్లి తీస్కొచ్చినా. నాతోపాటే వాడూ. వాళ్లకు నేను మాటిచ్చినా. వాడు బాధపడకుండా చూసుకుంటానని.

యిప్పుడు వాని కుటుంబానికి అన్యాయం జరిగింది. ఎవరికీ యే హానీ చేయని మంచి పిల్ల రేణ. ఎల్లయ్య కోడలు చనిపోతంది వొకడు బలాత్కారం చేయటం వల్ల.

నువ్వేం చేస్తావో తెల్వదు. ఆ బిడ్డకు న్యాయం జరగాలె’’ అని నాయిన శాసించిండు.

 

నాయిన చెప్పింది న్యాయమే కదా.

అందుకే, రేణ సెల్లెకు న్యాయం చేసిన. వొకరోజు రాత్రి దొరికిండు  ఆ నా కొడుకు.

రాజయ్య బావా, సూత్తన్నవా. కళ్లారా సూడు. వీడే రేణమ్మను చెరిచింది. సంపింది వీడే. వీణ్ణి సంపమని మా నాయిన సెప్పిండు. సంపుతున్న సూడు అని వాణ్ణి వొకేవొక్క దెబ్బ కొట్టిన. యెక్కడా గాయం లేదు. నెత్తురు కారలే. గుండెలోపలి నరాలు ఆ దెబ్బకు పగిలిపోయినయి. కుక్క కన్న ఈనంగా వాడు పానం యిడిసిండు. అంతే.

యే బాయిల దున్కి రేణ సచ్చిపోయిందో, అదే బాయిల వాడు శవమై తేలిండు’’ అని సెంద్రెయ్య మీసం మెలేసిండు. రాజయ్య మళ్లీ విలపించిండు. ఆ ఏడ్పులో తన కసి తీరిన సంతోషం స్పష్టంగా తెలుస్తుంది.

 

వెంకటయ్యకు చాలా గర్వంగా వుంది. సెంద్రన్నను చూస్తే వెలుగుతున్న ఆకాశాన్ని చూస్తున్నట్టుంది.

అప్పటి దాకా చీకటి పరుచుకున్న దారంతా తెల్లగా స్పష్టంగా కనిపిస్తుంది.

ఎందుకో వొకసారి కళ్లు మూసుకొన్నాడు. నాయిన యేం చేస్తున్నాడో అని మనుసులో అనుకున్నాడు.

నాయినా నవ్వుతూ కనిపించాడు. ‘‘తొందరగా రాండ్లిరా’’ చేతులు వూపుతున్నాడు. ఆశ్చర్యపోయాడు వెంకటయ్య. కళ్లు తెరిచి చుట్టూ చూశాడు. సెంద్రెయ్య, రాజయ్యలిద్దరూ తన వెనకే నడుస్తున్నారు. ముగ్గురూ నడక వేగం పెంచిండ్లు.

యింట్లో నర్సయ్య మంచంలో కళ్లు మూసుకొని పంచభూతాలను ధ్యానిస్తున్నాడు.

ఆ ముగ్గురి కాళ్లకింద తొలిగిపోతున్న విషప్పురుగులను చూసి చిర్నవ్వు నవ్వుతున్నాడు.

*

 

జిలుకర శ్రీనివాస్

3 comments

Leave a Reply to డాక్టర్ సిద్దెంకి యాదగిరి Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • సాకలి రేణని చంపిన వాన్ని చంపి జైలుకు పోయి రావడం. కథ. సస్పెన్స్ గా కథ నడిపిన విధానం రచయిత ప్రత్యేకత. అణువణువు నాటకీయత కనబడ్డది. కథ చదివినట్టుగా కాకుండా దృశ్యీకరణగా ఉండడం వల్ల పాఠకుని ఆసాంతం చదివిస్తుంది.

    కథ చాలా బాగుంది. అభినందనలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు