నయాగరా (ఆఖరు) కవి కెరటం!

కీ.శే. పురాణపండ రంగనాథ్, ప్రముఖ జర్నలిస్టు – రచయిత

(రెంటాల గోపాలకృష్ణ సారథ్యంలో, ఆయనతో కలసి పనిచేసిన ప్రముఖ జర్నలిస్టు, రచయిత స్వర్గీయ పురాణపండ రంగనాథ్. ఆయన రాసిన నివాళి వ్యాసం ఇది. రెంటాల మరణించిన మూడోరోజున 1995 జూలై 20, గురువారం సంచిక ‘విశాలాంధ్ర’ దినపత్రికలో ‘నయాగరా (ఆఖరు) కవి కెరటం!’ పేరిట ఇది ప్రచురితమైంది. అప్పటి ఆ వ్యాసం యథాతథంగా…)

“రెంటాల గోపాలకృష్ణ గారితో నా పరిచయం రెండు దశలుగా ఉంది.

నేను చదువుకొనే రోజుల్లోనే…

విద్యార్థిగా ఉన్నప్పుడు మా ఊరు (తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు) కో-ఆపరేటివ్ బ్యాంక్ వారి లైబ్రరీలో పుస్తకాలు తెగ చదివేవాడిని. ఆ అధ్యయనంలో నన్ను ఆకర్షించిన రెంటాల గారి రచన – ‘ఆటమ్’ (అణుబాంబు). అది ఒక మూకాభినయ నాటిక. పెట్టుబడిదారీ సమాజం శాస్త్రవిజ్ఞానాన్ని ఎంతటి వినాశనానికి తీసుకువెళ్ళి, దురుపయోగం చేసిందో నాటకీయంగా చెప్పిన కథాంశం.

ఆ తర్వాత ఆయన వ్రాసిన టాల్‌స్టాయ్ రచనల అనువాదాలు, గొగోల్ (నాటకం) ‘ఇన్‌స్పెక్టర్ జనరల్‌’కి అనువాదం, కొన్ని కవితలు చదివాను. అప్పట్లో అలా చదవడం వలన లోకజ్ఞానం పెరగడంతో బాటు, తెలుగు వచన రచనలో వస్తున్న భావ, భాషా పరిణామానీ, మార్పుల్నీ అవగతం చేసుకొనేందుకు ఆస్కారం ఏర్పడింది. అది స్వగతం – ఆయనతోటి పరోక్షానుబంధం.

‘ఆంధ్రప్రభ’లో… ఆ నైట్ షిఫ్టులలో…

కాగా, చదువై విజయవాడ ‘ఆంధ్రప్రభ’ దినపత్రికలో ఉపసంపాదకునిగా 1972లో పనికి కుదిరాక, రెంటాల గారితో 12 సంవత్సరాల ప్రత్యక్ష పరిచయం, అనుబంధం ఏర్పడినాయి. నైట్ షిఫ్టులలో ఎన్నో విషయాలు చర్చకు వచ్చేవి. ఆయన ఉద్యోగ విరమణ చేశాక కూడా తరచూ కలిసేవాళ్ళం. యోగక్షేమాలు, రచనా వ్యాసంగం గురించి ముచ్చటించుకొనేవాళ్ళం. అదొక ‘‘భావనాత్మక బంధం’’ అనిపిస్తుందిప్పుడు.

అభ్యుదయ కవిగా, ‘నయాగరా’ కవి మిత్రులలో ఆఖరువాడిగా రెంటాల గారు తన సాహితీయాత్రను 1995 జూలై 18న ముగించుకొని వెళ్ళిపోయారు. కానీ, ఆయన మిగిల్చిన అక్షర సంపద అక్షయంగానే ఉంటుంది.

నరసరావుపేట ‘నయాగరా’ కవి మిత్రులు…

ఒక్కసారి వెనక్కి వెళ్ళి, రెంటాల గారి సాహితీ ప్రయాణం గమనిస్తే… నరసరావుపేట ప్రాంతానికి చెందిన కుందుర్తి ఆంజనేయులు, బెల్లంకొండ రామదాసు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, అనిసెట్టి సుబ్బారావు, రెంటాల గోపాలకృష్ణ – వీరు ‘నయాగరా’ కవులుగా 1940లలోనే ప్రసిద్ధి చెందారు. అభ్యుదయ భావబంధురాలైన కవితల్ని వారు గానం చేశారు.

తదుపరి రెంటాల గారు ‘దేశాభిమాని’, ‘జనవాణి’ పత్రికలలో పనిచేశారు. ఎక్కడ, ఏ పనిలో ఉన్నా అది ‘‘ఆ జీవిక’’యే కాని, ‘‘అదే జీవితం’’ కాదనే వారాయన! సృజనాత్మక రచనలు చేయడమే తనకు తృప్తి అనీ, ఈ తరం వారికి ప్రాచీన భారతీయ సాహిత్య సౌరభాన్ని అందించాలనీ తపన పడేవారు.

‘ఆంధ్రప్రభ’ దినపత్రికలో ఉద్యోగ జీవితంలో కుదుటపడ్డాక, ఆయన ఆలోచనా ధోరణిలో అంతర్ముఖత్వం చోటుచేసుకొంది. అందుకే, భర్తృహరి సుభాషితాలకూ, జయదేవుని గీతగోవిందానికీ చక్కటి వచనం వ్రాసి, తెలుగు పాఠకులకు పరిచయం చేశారు. చేస్తూ, చేస్తూ హఠాత్తుగా కన్నుమూశారు.

అసిధారావ్రతం లాంటి అనువాదాలు అద్భుతంగా…

రెంటాల గారు 1939 నుంచి, ఇంచుమించుగా ఆమరణాంతం రచనలు చేస్తూనే ఉన్నారు. ‘పార్వతీశ శతకం’తో మొదలుపెట్టి, ‘రాజ్యశ్రీ’ (1939) నుంచి తాజాగా ప్రముఖ మాసపత్రిక ‘స్వాతి’లో భర్తృహరి సుభాషితాలకు అనువాదం వరకు ఆయన శతాధిక గ్రంథాలు వెలయించారు. ‘కిరాతార్జునీయం’ పౌరాణిక నాటకం, ‘రాజ్యశ్రీ’ చారిత్రక నవల వంటి రచనలే కాక, ‘సంఘర్షణ’ కవితా సంపుటి, ‘సర్పయాగం’ కవితా సంపుటి రెంటాల భావసంపుటికి నికషోఫలాలు.

‘శిక్ష’ నాటికల సంపుటి, అందులోని మూకాభినయ నాటిక ‘ఆటమ్’ (అణుబాంబు), అలాగే ‘ఇన్‌స్పెక్టర్ జనరల్’ నాటకం – రెంటాల గారి అభ్యుదయ భావజాలానికి అక్షరసాక్ష్యాలు. పుష్కిన్ రచనల్నీ, మాక్సిమ్ గోర్కీ రచనల్నీ, రవీంద్రనాథ్ టాగూర్ నాటికల్నీ, అలెగ్జాండర్ కుప్రిన్ నవలనూ – ఇలా ఎందరో ప్రపంచ ప్రసిద్ధ రచయితల కృతుల్ని తెలుగు పాఠకులకు తన సరళ సుందరమైన అనువాదం ద్వారా అందించిన మంచి అనువాదకుడు రెంటాల.

మూల రచయిత భావాన్ని చెడగొట్టకుండా, తెలుగు నుడికారపు సొబగు పోకుండా అనువాదం చేయడం చాలా క్లిష్టమైన పని. అసిధారావ్రతం వంటి ఆ పనిని రెంటాల సునాయాసంగా నిర్వర్తించారు. లియో టాల్‌స్టాయ్ బృహన్నవల ‘వార్ అండ్ పీస్’ను ‘యుద్ధము – శాంతి’ పేరిట మూడు భాగాలుగా ఆయన అందించారు. అలాగే ‘అన్నా కెరినినా’ నవలను చక్కటి తెలుగులోకి తర్జుమా చేశారు. పాశ్చాత్య కథా చక్రవర్తులలో ఒకడైన ఆస్కార్‌వైల్డ్ కథలను రెంటాల గారు అద్భుతంగా అనువదించారు.

అంతేకాక, వ్యాసభారతాన్ని (18 పర్వాలు) ఆధారం చేసుకొని, ఆయన వచన భారతాన్ని వెలయించారు. వాల్మీకి రామాయణానికి సరళ సుందర అనువాదం చేశారు. శ్రీ భగవద్గీతను ఒక కావ్యంగా అందించారు. కవికుల గురువు కాళిదాసు వ్రాసిన ‘రఘువంశం’, ‘కుమార సంభవం’, ‘మేఘసందేశం’ కావ్యాలకు అనువాదం పలికారు. ‘కిరాతార్జునీయం’, ‘విక్రమోర్వశీయం’, ‘విక్రమార్క చరిత్ర’లను తెలుగు చేశారు.

బాలల కోసం అసంఖ్యాకంగా రచనలు చేశారు. ‘వాత్స్యాయన కామసూత్రాల’కు ఆయన చేసిన అనువాదం పండిత, పామర జనరంజకమై, వివాదాన్ని కూడా సృష్టించింది. దర్శక, నిర్మాత గిడుతూరి సూర్యం గారి ‘పంచకల్యాణి – దొంగల రాణి’, ‘కథానాయకురాలు’ చలనచిత్రాలకు రెంటాల రచన చేశారు.

చిరస్మరణీయమైన ఆ రెండు ఎడిటోరియల్స్!

ఈ రచనలన్నీ ఒక ఎత్తు… ‘ఆంధ్రప్రభ’ దినపత్రికలో అప్పుడప్పుడు ఆయన వ్రాసిన వ్యాసాలు, సంపాదకీయ వ్యాఖ్యలు ఒక ఎత్తు అనాలి. 1974 ప్రాంతంలో ఔత్తరాహిక పండితుడు సంఖాలియా వాల్మీకి రామాయణంపై, రామాయణ కాలం నాటి లంక ఉనికిపై విచిత్ర ప్రతిపాదనలు చేశారు. అప్పుడు రెంటాల గారు ఆ వాదాలను పూర్వపక్షం చేస్తూ, ధారావాహికంగా సంపాదకీయ వ్యాఖ్యను రాశారు. ఆ రచనలో రామాయణ కావ్యంపై ఆయనకు గల ఆధిపత్యం, తార్కిక ప్రజ్ఞ ప్రస్ఫుటం అవుతాయి. అలాగే, కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు దివంగతులైనప్పుడు ఆయన ‘ఆంధ్రప్రభ’లో వ్రాసిన ‘వాగ్దేవీ కటాక్షం పొందిన కవిమూర్ధన్యుడు’ సంపాదకీయం చిరస్మరణీయం. ఇలాంటి ఉదాహరణలు రెంటాల సాహితీ, పత్రికా ఉద్యోగ జీవితం నుంచి ఎన్నైనా ఇవ్వవచ్చు.

ఆ డొక్కశుద్ధి… ఆత్మాభిమానం వల్లే…

1920 సెప్టెంబర్ 5వ తేదీన గుంటూరు జిల్లా పల్నాడు తాలూకా రెంటాలలో జన్మించిన రెంటాల గోపాలకృష్ణ గారు కవిత, నవల, కథ, నాటకం, వ్యాసం, వచన కావ్య రచనలలో తనదైన కృషి ద్వారా ఒక స్థానాన్ని పదిలపరచుకొన్నారు. రచయితగా, విమర్శకుడిగా, వక్తగా ఆ యా రంగాలలోని వారికి ఆయన గుర్తుంటారు. శతాధికాలైన ఆయన రచనలు ఇక ముందు కూడా అధ్యయనం చేయబడుతాయి.

ముక్కుసూటిగా పోవడం, నిర్మొహమాటం, తెలుగు – సంస్కృత భాషలు నేర్చిన డొక్కశుద్ధి వలన ప్రాప్తించిన ఆత్మాభిమానం – ఈ కాలంలో మనిషిని ‘‘రాణ’’కు రానివ్వవు అన్న ఒక కఠోరసత్యానికి రెంటాల సాహితీయాత్ర ప్రబల నిదర్శనం. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే స్వభావం కాదు ఆయనది. రచయిత అంటే అతడే కదా!’’

    (1995 జూలై 20, గురువారం, విజయవాడ)

 

రెంటాల

3 comments

Leave a Reply to Rentala Ramachandra Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • May I know if “The complete works of Rentala garu ”
    ఆయన సమగ్ర రచనలు దొరికే అవకాశం ఉంటే తెలియచేయమని ప్రార్థన

    • The details of Rentala’s biography and works detailed list is available in .pdf file. If interested please share mail id so that will be forwarded.
      Thanks for your interest.

    • రెంటాల రచనల జాబితా, ప్రథమ ముద్రణ తేదీల వివరాలు ఇవీ:
      1. పార్వతీశ శతకం (కవిత); చంద్రికా ప్రెస్‌, గుంటూరు; 1942; 50 పేజీలు. 2. రాజ్యశ్రీ (చారిత్రక నవల; ప్రముఖ పండితులు, చరిత్ర శాస్త్ర అధ్యాపకులు శ్రీమారేమండ రామారావు ముందు మాటతో); వెంకటేశ్వర ప్రెస్‌; గుంటూరు; 1939; 60 పేజీలు. 3. కిరాతార్జునీయం (పౌరాణిక నాటకం); చంద్రికా ప్రెస్‌, గుంటూరు; 1943; 80 పేజీలు. 4. సంఘర్షణ (కావ్యసంపుటి; ప్రముఖ అభ్యుదయ కవి శ్రీరంగం నారాయణ బాబు వ్రాసిన ముందుమాట ‘ప్రవర’తో); సాహితీ స్రవంతి, విజయవాడ; జూన్‌ 1950; 72 పేజీలు. 5. శిక్ష (ఆటం, శిక్ష, మూడో యుద్ధం, ఆకలి అనే నాలుగు నాటికల సంపుటి); సాహితీ స్రవంతి, విజయవాడ; జూన్‌ 1952; 112 పేజీలు. 6. ‘కల్పన’ (ఆధునిక కవితా సంపుటి) (సంపాదకత్వం) (ముద్దుకృష్ణ ‘వైతాళికులు’ తరువాత అంతటి విశిష్టత సంపాదించుకున్న అభ్యుదయ కవితల సంకలనం ఇది. అప్పటి ప్రముఖ కవులందరి కవితలున్న ఈ పుస్తకాన్ని ఆనాటి ప్రభుత్వం నిషేధించింది); చేతన సాహితి, విజయవాడ; 26 ఏప్రిల్‌ 1953; 338 పేజీలు.

      నవోదయ పబ్లిషర్స్‌, విజయవాడ: 7. సర్పయాగం (కావ్య సంపుటి); ఫిబ్రవరి 1957; 94 పేజీలు (ప్రజాశక్తి బుక్‌ హౌస్‌, విజయవాడ – 2 వారిచే మార్చి 1997లో మలి ముద్రణ). 8. విజయ ధ్వజం – మొదటి సంపుటం (నవల; మూలం: మకరెంకో రచన ‘లెర్నింగ్‌ టు లివ్‌’); 1957; 389 పేజీలు. 9. విజయ ధ్వజం – రెండో సంపుటం; డిసెంబర్‌ 1957; 328 పేజీలు.

      (రెండు సంపుటాలూ కలిపి ఒకే గ్రంథంగా ‘మంచి పుస్తకం’ ప్రచురణ సంస్థ వారు 2007లో ప్రచురించారు; 448 పేజీలు).

      .విశాలాంధ్ర ప్రచురణాలయం, విజయవాడ.
      10. గజదొంగ నికోలా (ఇవాన్‌ ఓల్బ్రాహ్ట్‌ా రాసిన చెక్‌ నవలకు అనువాదం); 1959; 351 పేజీలు. 11. థాయిస్‌ (నవల, మూలం: నోబెల్‌ బహుమతి గ్రహీత, ఫ్రెంచి నవలాకారుడు ఆనటోల్‌ ఫ్రాన్స్‌ రచన); మార్చి 1960; 316 పేజీలు 12. ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (నాటకం; ఆధారం: రష్యన్‌ నాటకకర్త గొగోల్‌ రచన); (గొగోల్‌ మాతృక ఆధారంగా మరికొన్ని నాటకానువాదాలు వెలువడినప్పటికీ, రెంటాల చేతిలో రూపుదిద్దుకొన్న ఈ రచన అచ్చ తెలుగు నాటకంగా అందరి ప్రశంసలు పొందింది. ఈ నాటకం రాష్ట్ర వ్యాప్తంగానూ, రాష్ట్రం వెలుపలా వందలాది ప్రదర్శనలతో ఆదరణ చూరగొంది); ఏప్రిల్‌ 1956; 112 పేజీలు. 13. ఇస్పేట్‌ రాణి (నవల; మూలం: ‘రష్యాదేశపు షేక్స్‌పియర్‌’గా అభివర్ణితుడైన ప్రపంచ ప్రఖ్యాత కవి, రచయిత అలెగ్జాండర్‌ పుష్కిన్‌. ఆయన రచనలలో మణిపూస ‘ది క్వీన్‌ ఆఫ్‌ స్పేడ్స్‌’కు ఇది ప్రశంసలు పొందిన తెనుగు సేత); 1964; 86 పేజీలు. 14. వచ్చాయి మంచిరోజులు (నవల; మూలం: మైఖేల్‌ స్టెల్‌మాక్‌ రష్యన్‌ రచన ‘ది రిటర్న్‌ ఆఫ్‌ ది వైల్డ్‌ శ్వాన్స్‌’); జనవరి 1966; 229 పేజీలు. 15. ప్రేమజ్యోతి (నవల; మూలం: చకోవ్‌స్కీ రష్యన్‌ నవల ‘ది లైట్‌ ఆఫ్‌ ఎ డిస్టెంట్‌ స్టార్‌’); అక్టోబర్‌ 1966; 393 పేజీలు.

      ఆదర్శ గ్రంథమండలి, విజయవాడ: 16. ఆకలి పాటలు (కవిత); అక్టోబర్‌ 1952; 30 పేజీలు. 17. వెఱ్ఱివాడు (కథలు; మూలం: టాల్‌స్టాయ్‌ కథలు); 1952; 146 పేజీలు. 18. విజ్ఞాన కథలు – 1వ భాగం(మూలం: టాల్‌స్టాయ్‌ కథలు); 1954; 49 పేజీలు. 19. విజ్ఞాన కథలు – 2వ భాగం(మూలం: టాల్‌స్టాయ్‌ కథలు); 1954; 49 పేజీలు. 20. నిలకడ మీద నిజం (కథలు; మూలం: టాల్‌స్టాయ్‌ కథలు); 1955; 107పేజీలు. 21. నివేదన (ఆత్మకథ; మూలం: టాల్‌స్టాయ్‌); 1955; 90 పేజీలు. 22. టాల్‌స్టాయ్‌ నాటక కథలు; 1955; 207 పేజీలు. 23. టాల్‌స్టాయ్‌ పిల్లల కథలు – మొదటి భాగం; 1955; 68 పేజీలు. 24. టాల్‌స్టాయ్‌ పిల్లల కథలు – రెండో భాగం; 1955; 58 పేజీలు. 25. పిల్లల తెలివితేటలు (టాల్‌స్టాయ్‌ నాటికల అనువాదం); 1956; 76 పేజీలు. 26. అన్నా కెరినినా (విశ్వ విఖ్యాత టాల్‌స్టాయ్‌ నవలకు సాహితీవేత్తల ప్రశంసలు పొందిన సరళ అనువాదం); 1956; 586 పేజీలు. 27. భయస్థుడు (నవల; మాక్జిమ్‌ గోర్కీ రష్యన్‌ గ్రంథం ‘ఫోమా గార్డియెవ్‌’ (ది మ్యాన్‌ హు వజ్‌ ఎఫ్రయిడ్‌)కు అనువాదం); 1956; 490 పేజీలు. 28. ఆస్కార్‌వైల్డ్‌ కథలు; 1956; 160 పేజీలు. 29. పిల్లల బొమ్మల ప్రపంచ కథలు; 1956; ద్వితీయ ముద్రణ (కొండా శంకరయ్య, హైదరాబాద్‌); 1959; 124 పేజీలు. 30. మానవ హృదయాలు (నవల; మూలం: ఫ్రెంచి రచయిత మపాసా రచన); 1957; 350 పేజీలు. 31. సంసార సుఖం (నవల; మూలం: టాల్‌స్టాయ్‌ రచన ‘ఫ్యామిలీ హ్యాపీనెస్‌’); 1960; 192 పేజీలు. 32. యమకూపం (నవల; మూలం: అలెగ్జాండర్‌ కుప్రిన్‌ రాసిన ప్రపంచ ప్రఖ్యాత రష్యన్‌ రచన ‘యమా ది పిట్‌’); 1960; 391 పేజీలు. 33. సింగినాదం – జీలకఱ్ఱ; సెప్టెంబరు 1967; 68 పేజీలు. 34. యక్ష ప్రశ్నలు; 1967; 68 పేజీలు.

      దేశి కవితా మండలి, విజయవాడ: 35. మూడు ఎలుగులు – మధ్య పసిపాప (పిల్లల కథ; మూలం: టాల్‌స్టాయ్‌ రచన); మే 1956; 26 పేజీలు. 36. చెప్పడం సులభం – చేయడం కష్టం! (టాల్‌స్టాయ్‌ కథలు); అక్టోబరు 1956; 96 పేజీలు. 37. కోడిగుడ్డంత గోధుమగింజ (టాల్‌స్టాయ్‌ కథలు);అక్టోబరు 1956; 100 పేజీలు. 38. రవ్వంత నిప్పు ఇల్లంతా కాలుస్తుంది! (టాల్‌స్టాయ్‌ కథలు); అక్టోబరు 1956; 116 పేజీలు. 39. ప్రేమ ఉన్నచోట దేవుడున్నాడు! (టాల్‌స్టాయ్‌ కథలు); 1956; 93 పేజీలు. 40. దేశం ఏమైంది! (ఎలన్‌ పేటన్‌ ఆఫ్రికన్‌ నవల ‘క్రై ది బిలవ్డ్‌ కంట్రీ’కి అనువాదం. ఈ నవల 1949లో ‘సండే టైమ్స్‌’ ప్రత్యేక బహుమతి పొందింది); (దక్షిణ భాషా పుస్తక సంస్థ సహకారంతో); ఆగస్టు 1958; 551 పేజీలు. 41. మాలిని (నాటకం; మూలం: రవీంద్రనాథ్‌ టాగోర్‌ రచన); జూలై 1961; 342 పేజీలు. 42. చీకటి గదిలో రాజు (సన్యాసి, చీకటి గదిలో రాజు నాటకాల సంపుటి; మూలం: రవీంద్రనాథ్‌ టాగోర్‌ రచన); ఆగస్టు 1961; 159 పేజీలు. 43. రాజు-రాణి (నాటిక; మూలం: రవీంద్రనాథ్‌ టాగోర్‌ రచన); 1962; 42 పేజీలు. 44. బలిదానం (చండాలిక, బలిదానం నాటకాల సంపుటి; మూలం: రవీంద్రనాథ్‌ టాగోర్‌ రచన); 1962; 96 పేజీలు. 45. ఎర్రగన్నేరు (చిత్ర, ఎర్రగన్నేరు నాటకాల సంపుటి; మూలం: రవీంద్రనాథ్‌ టాగోర్‌ రచన); మే 1962; 151 పేజీలు. 46. నటీపూజ (కచ-దేవయాని, కర్ణ-కుంతి, నటీపూజ నాటకాల సంపుటి; మూలం: రవీంద్రనాథ్‌ టాగోర్‌ రచన); 1962; 111 పేజీలు. 47. గోరా (రవీంద్రనాథ్‌ టాగోర్‌ సుప్రసిద్ధ నవలకు అనువాదం); జనవరి 1964; 603 పేజీలు. 48. రజని (నాటకం; ప్రముఖ పాత్రికేయుడు శ్రీ నార్ల వెంకటేశ్వరరావు ముందుమాటతో); ఏప్రిల్‌ 1967; 128 పేజీలు. 49. ఆర్య కథామాల (సంస్క ృత పురాణాలలోని ప్రశస్త గాథలు); (దక్షిణ భాషా పుస్తక సంస్థ సహకారంతో); నవంబర్‌ 1959; 251 పేజీలు.

      ఉమా పబ్లిషర్స్‌, విజయవాడ: 50. ఆంధ్ర వచన భాగవతం – ప్రథమ సంపుటము (మొదటి 8 స్కంధాలు); సెప్టెంబరు 1960; 407 పేజీలు. 51. ఆంధ్ర వచన భాగవతం – ద్వితీయ సంపుటము (9వ స్కంధం నుంచి చివరిదైన 12వ స్కంధం వరకు); 1960; 400 పేజీలు. 52. శ్రీ రామకృష్ణ పరమహంస (జీవిత సంగ్రహం); నవంబర్‌ 1962; 44 పేజీలు. 53. శ్రీ రామానుజాచార్యులు (జీవిత సంగ్రహం); నవంబర్‌ 1962; 48 పేజీలు. 54. శ్రీ రామతీర్థ స్వామి (జీవిత సంగ్రహం); నవంబర్‌ 1962; 40 పేజీలు. 55. శ్రీ వివేకానంద స్వామి (జీవిత సంగ్రహం); డిసెంబర్‌ 1962; 56 పేజీలు. 56. శ్రీ మధ్వాచార్యులు (జీవిత సంగ్రహం); 1962; 48 పేజీలు.

      తెలుగు వెలుగు బుక్స్‌, విజయవాడ: 57. పంజరం విడిచిన పావురాలు (నవల; మూలం: విఖ్యాత రచయిత లిన్‌ యూ టాంగ్‌ రచన ‘ది ఫ ్లయిట్‌ ఆఫ్‌ ది ఇన్నోసెంట్స్‌’); అమెరికన్‌ సమాచార శాఖ సహకారంతో; ఫిబ్రవరి 1967; 616 పేజీలు. 58. శాంతిసంధాత స్వప్నభంగం (నవల; మూలం: రష్యన్‌ రచయిత అబ్రామ్‌ టెరెట్జ్‌ రచన); అమెరికన్‌ సమాచార శాఖ సహకారంతో; 1968; 340 పేజీలు. 59. అడవి పల్లెలో అద్భుత కథలు (మూలం: నథానియల్‌ హాథారన్‌ రచన ‘ఎ వండర్‌ బుక్‌’); అమెరికన్‌ సమాచార శాఖ సహకారంతో; నవంబర్‌ 1968; 260 పేజీలు.నవభారత్‌ ప్రచురణలు, విజయవాడ: 60. జాతీయ నాయకులు (నెహ్రూ); 1963; 42 పేజీలు. 61. జాతీయ నాయకులు (గాంధీ); 1963; 44 పేజీలు.

      జయంతి పబ్లికేషన్స్‌, విజయవాడ: 62. మూడు నాటికలు (సోమకుడు-రుత్విక్కు, అమ-రమ, గాంధారి హృదయ వేదన నాటికల సంపుటి; మూలం: రవీంద్రనాథ్‌ టాగోర్‌ రచన); 1966; 48 పేజీలు. 63. మనుచరిత్ర (అల్లసాని పెద్దన విరచిత కావ్యం-వచనంలో); 1967;135 పేజీలు. 64. మృచ్ఛకటికం (శూద్రక మహాకవి రచన-వచనంలో); 1967; 125 పేజీలు. 65. కళాపూర్ణోదయం (పింగళి సూరన విరచితం-వచనంలో); 1967; 122 పేజీలు. 66. విక్రమోర్వశీయం (కాళిదాసు కావ్యం-వచనంలో); జూలై 1968; 88 పేజీలు. 67. విక్రమార్క చరిత్ర(జక్కన మహాకవి రచన-వచనంలో);జూలై1968; 152 పేజీలు. 68. ఉత్తర హరివంశం(నాచన సోముని కృతి-వచనంలో); జూలై 1968;159 పేజీలు. 69. మాలతీమాధవం(మహాకవి భవభూతి రచన-వచనంలో);జూలై1968; 71పేజీలు. 70. మేఘసందేశం (మహాకవి కాళిదాస కృతం-వచనంలో); 1968; 76 పేజీలు. 71. మాళవికాగ్ని మిత్రం (కవి కాళిదాస విరచితం-వచనంలో);1968; 72 పేజీలు. 72. కాదంబరి (బాణ భట్టారకుని సుప్రసిద్ధ కృతి-వచనంలో); 1968; 223 పేజీలు. 73. మొల్ల రామాయణం (కవయిత్రి మొల్ల విరచితం-వచనంలో); అక్టోబర్‌ 1969; 185 పేజీలు. 74. కుమార సంభవం (కాళిదాసు రచన-వచనంలో); నవంబర్‌ 1969; 164 పేజీలు. 75. రఘువంశం (కవి కాళిదాసు కృతి-వచనంలో); డిసెంబర్‌ 1969; 251 పేజీలు. 76. కిరాతార్జునీయం (కవి భారవి రచన-వచనంలో); అక్టోబర్‌ 1970; 155 పేజీలు. 77. జైమిని భారతం (పిల్లలమఱ్ఱి పిన వీరభద్రకవి రచన-వచనంలో); డిసెంబర్‌ 1970; 254 పేజీలు. 78. థకుమార చరిత్ర (మహాకవి దండి విరచితం-వచనంలో); ఆగస్టు 1971; 284 పేజీలు. 79. పల్నాటి వీర చరిత్ర (శ్రీనాథుడి రచన-వచనంలో);అక్టోబర్‌ 1971; 284 పేజీలు. 80. వాల్మీకి రామాయణం (వచనంలో); జనవరి 1976; 412 పేజీలు. 81. మహాభారతం (వచనంలో); జనవరి 1976; 396 పేజీలు. 82. భగవద్గీత (వచనంలో); ఆగస్టు 1978; 263 పేజీలు. 83. వచన మహాభారతం (వ్యాసప్రోక్తానుసారం). మొత్తం 18 పర్వాలు – ఏడు సంపుటాలలో; ఆది, సభాపర్వాలు; జూన్‌ 1985; 341 పేజీలు. 84. అరణ్య పర్వం; జూన్‌ 1985; 222 పేజీలు. 85. విరాట, ఉద్యోగ పర్వాలు; జూన్‌ 1985; 264 పేజీలు. 86. భీష్మ, ద్రోణ పర్వాలు; జూన్‌ 1985; 270 పేజీలు. 87. కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలు; జూన్‌ 1985; 224 పేజీలు. 88. శాంతి పర్వం; జూన్‌ 1985; 228 పేజీలు. 89. అనుశాసనిక, ఆశ్వమేథి క, ఆశ్రమవాసిక, మౌసల, మహాప్రస్థానిక, స్వర్గారోహణ పర్వాలు; జూన్‌ 1985; 224 పేజీలు. 90. వాల్మీకి వచన రామాయణం (మొత్తం 6 కాండలు, ఆరు సంపుటాలలో); బాలకాండ; డిసెంబర్‌ 1988; 141 పేజీలు. 91. అయోధ్య కాండ; ఆగస్టు 1989; 248 పేజీలు. 92. అరణ్య కాండ; ఆగస్టు 1989; 128 పేజీలు. 93. కిష్కింధ కాండ; డిసెంబర్‌ 1989; 163 పేజీలు. 94. సుందర కాండ; జూలై 1988; 176 పేజీలు. 95. యుద్ధ కాండ; జనవరి 1990; 336 పేజీలు. 96. ‘యుద్ధం – శాంతి’ ప్రథమ సంపుటం (ప్రపంచ సాహిత్యంలో అగ్రశ్రేణికి చెందిన ఈ నవల టాల్‌స్టాయ్‌ బృహత్తర రచన ‘వార్‌ అండ్‌ పీస్‌’కు అనువాదం); అక్టోబర్‌ 1991; 424 పేజీలు. 97. ద్వితీయ సంపుటం – అక్టోబర్‌ 1991; 380 పేజీలు. 98. తృతీయ సంపుటం – అక్టోబర్‌ 1991; 296 పేజీలు. (పై మూడు సంపుటాలు ‘సమరము – శాంతి’ పేరిట మొట్టమొదటి ప్రచురణ; 1957, 1959, 1959; దేశి కవితా మండలి, విజయవాడ).

      క్వాలిటీ పబ్లిషర్స్‌, విజయవాడ: 99. శృంగార నైషథం – 3, 4 ఆశ్వాసాలు. 100. సుభాషిత రత్నావళి (సంస్క ృతంలోని సూక్తులకు తెలుగు వ్యాఖ్యానం); మార్చి 1980; 196 పేజీలు. 101. జాతీయాలు – పుట్టు పూర్వోత్తరాలు మరియు సంస్క ృత న్యాయాలు (అందరికీ ఉపయుక్తమైన జాతీయాలు ఎలా పుట్టాయో కథల రూపంలో; ప్రయోగాల సహితంగా); మార్చి 1980; 180 పేజీలు.

      నవరత్న బుక్‌ సెంటర్‌, విజయవాడ: 102. బాలానంద బొమ్మల థావతారములు; జనవరి 1984; 122 పేజీలు. 103. బాలానంద బొమ్మల శ్రీకృష్ణ లీలలు; 1984; 68 పేజీలు. 104. బాలానంద శ్రీ సత్యనారాయణస్వామి వ్రత మహాత్మ ్యం; 1987; 44 పేజీలు. 105. బాలల బొమ్మల ఆలీబాబా నలభై దొంగలు; మే 1990; 72 పేజీలు. 106. బాలల బొమ్మల మర్యాద రామన్న కథలు; జూన్‌ 1990; 99 పేజీలు. 107. బాలల బొమ్మల అల్లావుద్దీన్‌ అద్భుత దీపం; జూన్‌ 1990; 74 పేజీలు. 108. బాలానంద బొమ్మల టిప్పు సుల్తాన్‌; మార్చి 1993; 86 పేజీలు. 109. బాలానంద బొమ్మల వీరపాండ్య కట్ట బొమ్మన; సెప్టెంబర్‌ 1993; 60 పేజీలు. 110. తెలుగు సామెతలు; అక్టోబర్‌ 1997; 144 పేజీలు. 111. మీ చిన్నారి పిల్లలకు అందాల పేర్లు; సెప్టెంబర్‌ 1995; 120 పేజీలు. 112. అందరి ఆరోగ్యానికి యోగాసనాలు; అక్టోబర్‌ 2000; 120 పేజీలు. 113. బాలల బొమ్మల షిర్డీసాయి చరిత్ర 114. బాలల బొమ్మల శ్రీఅయ్యప్ప స్వామి చరిత్ర

      నవసాహితీ బుక్‌ హౌస్‌, విజయవాడ: 115. మన నగరాలు – మొదటి భాగం; ఆగస్టు 1989; 56 పేజీలు. 116. మన నగరాలు – రెండవ భాగం; ఆగస్టు 1989; 56 పేజీలు. 117. మన నగరాలు – మూడవ భాగం; ఆగస్టు 1989; 56 పేజీలు. 118. మన నగరాలు – నాలుగవ భాగం; ఆగస్టు 1989; 56 పేజీలు. 119. మన చారిత్రక ప్రదేశాలు – మొదటి భాగం; ఆగస్టు 1989; 56 పేజీలు. 120. మన చారిత్రక ప్రదేశాలు – రెండవ భాగం; ఆగస్టు 1989; 56 పేజీలు. 121. మన చారిత్రక ప్రదేశాలు – మూడవ భాగం; ఆగస్టు 1989; 55 పేజీలు. 122. మన చారిత్రక ప్రదేశాలు – నాలుగవ భాగం; ఆగస్టు 1989; 55 పేజీలు. 123. మన నదులు – మొదటి భాగం; ఆగస్టు 1989; 64 పేజీలు. 124. మన నదులు – రెండవ భాగం; ఆగస్టు 1989; 56 పేజీలు. 125. మన నదులు – మూడవ భాగం; ఆగస్టు 1989; 56 పేజీలు. 126. మన నదులు – నాలుగవ భాగం; ఆగస్టు 1989; 56 పేజీలు.

      (పై పన్నెండు పుస్తకాల మొట్టమొదటి ముద్రణ, ఆగస్టు 1961; ఆదర్శ గ్రంథ మండలి, విజయవాడ).
      127. ఋషుల కథలు – ఒకటవ భాగం; జూలై 1989; 40 పేజీలు. 128. ఋషుల కథలు – రెండవ భాగం; జూలై 1989; 44 పేజీలు. 129. ఋషుల కథలు – మూడవ భాగం; జూలై 1989; 40 పేజీలు. 130. ఋషుల కథలు – నాలుగవ భాగం; జూలై 1989; 40 పేజీలు.

      (పై నాలుగు పుస్తకాల మొట్టమొదటి ముద్రణ 1962; ఉమా పబ్లిషర్స్‌, విజయవాడ).
      131. ఈసప్‌ నీతి కథలు – మొదటి భాగం; 1958 132. ఈసప్‌ నీతి కథలు – రెండో భాగం; 1958 133. ఈసప్‌ నీతి కథలు – మూడో భాగం; 1958 134. ఈసప్‌ నీతి కథలు – నాలుగో భాగం 135. ఈసప్‌ నీతి కథలు – అయిదో భాగం

      (అయిదు భాగాలూ కలిపి ఒకే పూర్తి సంపుటం); ఆగష్టు 1989; 300 పేజీలు.
      (పై అయిదు భాగాలు విడివిడిగా మొట్టమొదటి ముద్రణ 1958; ఉమా పబ్లిషర్స్‌ విజయవాడ).
      136. వాత్స్యాయన కామసూత్రాలు (ప్రసిద్ధ ప్రాచీన శాస్త్రీయ గ్రంథానికి యశోధరుని జయమంగళ వ్యాఖ్యానుసారం సరళమైన తెలుగు వచనం – బొమ్మలతో); (పూర్వార్ధం) మొదటి భాగం (మొదటి రెండు అధికరణాలు); డిసెంబర్‌ 1986; 328 పేజీలు. 137. వాత్స్యాయన కామసూత్రాలు (ఉత్తరార్ధం) రెండోభాగం (మూడో అధికరణం నుంచి చివరిదైన ఏడో అధికరణం దాకా); మే 1987; 312 పేజీలు.

      (రెండు భాగాలుగా ఈ గ్రంథం తొలి ప్రచురణ: డీలక్స్‌ పబ్లికేషన్స్‌, విజయవాడ); ఫిబ్రవరి 1993 నుంచి ఒకే పూర్తి సంపుటంగా 390 పేజీలలో నవసాహితీ బుక్‌హౌస్‌ ప్రచురణగా లభిస్తోంది. ఇప్పటికి డజనుకు పైగా ముద్రణలు పొంది బహుళ జనాదరణకు పాత్రమైంది).

      ఇతర ప్రచురణలు: 138. ఆకలి (నవల); (పెట్టుబడిదారీ పాలకవర్గాన్ని కంపింపజేసిన రచన. మూలం: నార్వే జాతీయుడూ, నోబెల్‌ బహుమతి గ్రహీత నట్‌ హామ్సన్‌ ప్రపంచ ప్రఖ్యాత రచన ‘హంగర్‌’); ‘నగారా’ ప్రచురణాలయం, గుంటూరు; అక్టోబర్‌ 1954; 264 పేజీలు. 139. రష్యా – చైనా (మూలం: హెన్రీ వీ రచన ‘సోవియట్‌ రష్యా అండ్‌ చైనా’); సెప్టెంబర్‌ 1958; 203 పేజీలు. 140. లోకమాన్య బాలగంగాధర తిలక్‌ జీవితచరిత్ర; అమరావతి ప్రెస్‌ అండ్‌ పబ్లికేషన్స్‌ (ప్రై) లిమిటెడ్‌, హైదరాబాద్‌; ఏప్రిల్‌ 1960. 141. ‘మగువ – తెగువ’ (నైతికంగా పతనమై, విప్లవకారిణిగా మారిన మగువ తెగువ ఎలాంటిదో తెలుపుతూ సాగే ఈ నవల విభిన్న మనస్తత్త్వాలు గల ముగ్గురి మధ్య విచిత్రమైన అంతర్నాటకం. మూలం: లూయీ చార్లెస్‌ రాయర్‌ రచన); అన్నపూర్ణ పబ్లిషర్స్‌, విజయవాడ-2; ఫిబ్రవరి 1962; 246 పేజీలు. 142. భారత తొలి ప్రధాని (పండిట్‌ జవహర్‌లాల్‌ జీవితచరిత్ర; మూలం: గావిన్‌ సి. మార్టిన్‌ రచన); జయభారత్‌ బుక్‌ డిపో, హైదరాబాద్‌; ఫిబ్రవరి 1965; 224 పేజీలు. 143. మృత్యుముఖంలో తుది రోజు (కొద్ది క్షణాలలో ఉరికంబం ఎక్కబోతున్న వ్యక్తి మనఃస్థితికి నిలువుటద్దం పట్టే నవల. మూలం: సుప్రసిద్ధ ఫ్రెంచి రచయిత విక్టర్‌ హ్యూగో రచన ‘ది కండెమ్‌న్డ్‌’); జగ్‌జీవన్‌ పబ్లికేషన్స్‌, విజయవాడ; ఏప్రిల్‌ 1967; 140 పేజీలు. 144. భారతీయుల దృష్టిలో కెనడీ (‘కెనడీ త్రూ ఇండియన్‌ ఐస్‌’ – వ్యాసాలు); అమెరికన్‌ సమాచార శాఖ సహకారంతో; సర్వోదయ పబ్లిషర్స్‌, విజయవాడ; 1967; 282 పేజీలు. 145. రాజాజీ మెచ్చిన భాగవతం (రాజగోపాలాచారి గారి మెప్పు పొందిన సరళమైన భాగవత రచన); వ్యాస ప్రచురణాలయం, హైదరాబాద్‌; 1974; 424 పేజీలు. 146. నవయుగ వైతాళికులకు సందేశం (నూతన ప్రపంచ వ్యవస్థ సృష్టికి ఆధ్యాత్మిక శక్తుల సంకల్పాన్ని తెలిపే రచన. మూల రచయిత: రామ్‌నందన్‌); పబ్లిషర్స్‌: జి.సుదర్శనమ్‌, హైదరాబాద్‌-4; 30 పేజీలు. 147. దేవతల నిజ చరిత్ర (1982లో జరిగిన అరతర్జాతీయ వ్యాస రచన పోటీకి ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ప్రశస్తమైన పది వ్యాసాలలో ఒకటిగా ఎంపికైన ఆంగ్ల రచనకు తేటతెనుగుసేత. మూలం: కె.రాధాకృష్ణ రాసిన ‘ట్రూ హిస్టరీ ఆఫ్‌ గాడ్స్‌ అండ్‌ గాడెసెస్‌ ఆఫ్‌ ఏనిషియంట్‌ భారత్‌’); శివనందిని పబ్లికేషన్స్‌, తిరువూరు; 1991; 112 పేజీలు. 148. శివధనువు (కవితా సంపుటి; ‘నగరంలో రాత్రి’, ‘ఆకలి పాటలు’తో సహా); రెంటాల స్మరణోత్సవ సంఘం, సాహితీ స్రవంతి, విజయవాడ; మార్చి 1997; 197 పేజీలు. 149. మాయమబ్బులు (నాటకం; సాహిత్య మాసపత్రిక ‘నవభారతి’ 1958 జూన్‌ సంచికలో ప్రచురితం). 150. కర్ణభారం (నాలుగు దృశ్యాల పౌరాణిక నాటకం) 151. మగువ మాంచాల (చారిత్రక శ్రవ్య నాటిక. 1975 – 80 మధ్య కాలంలో విజయవాడ ‘ఆకాశవాణి’ కేంద్రం నుంచి పలుమార్లు ప్రసారమై, విశేష ఆదరణ చూరగొంది). 152. రుద్రమదేవి (చారిత్రక శ్రవ్య నాటకం. శ్రీ నోరి నరసింహశాస్త్రి నవలకు నాటకీకరణ. 1993 సెప్టెంబర్‌ 7న రాష్ట్రవ్యాప్తంగా ‘ఆకాశవాణి’లో ప్రసారమైంది).

      (పై నాలుగు రచనలూ ‘ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌’తో కలిపి ఒకే పుస్తకంగా ‘రెంటాల నాటక సాహిత్యం’ మొదటి సంపుటం పేరిట ప్రచురితమైంది; రెంటాల స్మరణోత్సవ సంఘం, సాహితీ స్రవంతి, విజయవాడ; 5 సెప్టెంబర్‌ 1997; 248 పేజీలు).
      పుస్తక రూపం పొందాల్సిన రెంటాల రచనలు:

      153. రెంటాల ‘బాలల గేయాలు’ 154. బాలల రామాయణం 155. బాలల భారతం 156. బాలల భాగవతం 157. బాలల పంచతంత్రం 158. గుఱ్ఱపుతల రాకుమారుడు (బాలల నవలిక) 159. తీరని కోరిక (కథానిక); రచనా కాలం: 1951 ప్రాంతం 160. ప్రతీకారం (కథ; మూలం: ప్రపంచ ప్రసిద్ధ రచయిత చెకోవ్‌; సాహిత్య మాసపత్రిక ‘నవభారతి’ 1958 సెప్టెంబర్‌ సంచికలో ప్రచురితం). 161. తప్పుడు లెక్క (సాహిత్య మాసపత్రిక ‘నవభారతి’ 1960 ఫిబ్రవరి సంచికలో ప్రచురితం). 162. వెట్టి చాకిరీ (కథ) 163. బొమ్మలు చెప్పిన కథలు (కవి కొఱవి గోపరాజు విరచిత ‘సింహాసన ద్వాత్రింశిక’. విక్రమార్కుడి సింహాసనం పైన ఉన్న 32 సాలభంజికలు భోజరాజుకు చెప్పిన కమ్మని కథలకు కమనీయ రూపం; ‘బాలజ్యోతి’ మాసపత్రికలో దాదాపు నాలుగేళ్ళపాటు ధారావాహికగా ప్రచురితమై విశేష ఆదరణ పొందిన రచన). 164. కాశ్మీర గాథలు (కల్హణుని ‘రాజతరంగిణి’లోని కథలు; ‘ఆంధ్రజ్యోతి’ వారపత్రికలో ప్రచురితం). 165. ఫిల్మ్‌ టెక్నిక్‌ (చలనచిత్ర నిర్మాణ ప్రక్రియలోని మెలకువలు తెలిపే రచన. ‘ఆంధ్రపభ’ దినపత్రికలో సీరియల్‌గా ప్రచురితం). 166. పురాణ గాథలు (‘ఆంధ్రప్రభ’ డైలీలో ధారావాహికంగా ప్రచురితమైన ఆసక్తికరమైన పౌరాణిక కథలు) 167. ప్రముఖ తత్త్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి బోధనలు (‘స్వాతి’ సపరివార పత్రికలో వారం వారం ప్రచురితమైన వ్యాసాలు). 168. బేతాళ పంచవింశతి (పట్టువదలని విక్రమార్క చక్రవర్తికి, శవాన్ని ఆవహించిన బేతాళుడు చెప్పిన పాతిక కథలు – ‘అసలు బేతాళ కథలు’ పసందైన తెలుగులో! ‘బాలజ్యోతి’ మాసపత్రికలో రెండేళ్ళపాటు మాసం మాసం పిల్లల్నీ పెద్దల్నీ అలరించిన రచన). 169. బుద్ధుడి జాతక కథలు (బోధిసత్వుడి ఆసక్తికర జీవిత గాథలు; ‘బాలజ్యోతి’ మాసపత్రికలో నెలనెలా ప్రచురితం). 170. బృహత్కథ (విశ్వకథా సాహిత్యానికి శ్రీకారం చుడుతూ పైశాచీ భాషలో గుణాఢ్యుడు చేసిన రచన, సోమదేవుడి ‘కథాసరిత్సాగరా’నికి మాతృక; ‘బాలజ్యోతి’ మాస పత్రికలో ప్రచురితం). 171. చిలుక చెప్పిన చిత్రమైన కథలు (పాలవేకరి కదరీపతి విరచిత సరస శృంగార కథలు – ‘శుకసప్తతి’ తేట తెలుగులో). 172. రాధామాధవ ప్రణయకేళీ విలాసం జయదేవుని గీతగోవిందం (మహాకవి జయదేవ విరచిత అష్టపదుల ప్రణయకావ్యం గీత గోవిందానికి సంస్క ృత మూలంతో సహా సరళమైన తెలుగు అనువాదం; ‘స్వాతి’ మాసపత్రికలో రెండేళ్ళకు పైగా ప్రచురితమై పాఠకాదరణ పొందిన రచన). 173. అతివకు హంసనీతి (పరపురుషుని పొందు కోరి బయలుదేరిన పడతికి హంస చెప్పిన పసందైన కథలు. అయ్యలరాజు నారాయణామాత్యుడు రచించిన శృంగార ప్రబంధం ‘హంస వింశతి’. ‘స్వాతి’ మాసపత్రికలో నెలనెలా ప్రచురితం). 174. మృదుమధుర భక్తి ధారాధురీణమ్‌ ‘శ్రీకృష్ణ కర్ణామృతమ్‌’ (యోగీంద్రుడు లీలాశుకుడు రాసిన సంస్క ృత మూలం, వెలగపూడి వెంగనామాత్యుడి తెలుగు పద్యానువాదంతో సహా సాగిన తేట తెనుగు సేత; ‘స్వాతి’ మాసపత్రికలో ధారావాహికంగా ప్రచురితం). 175. విద్వజ్జన విభూషితమ్‌ భర్త ృహరి సుభాషితమ్‌ (భర్త ృహరి విరచిత ‘సుభాషిత త్రిశతి’ సంస్క ృత మూలం, ఏనుగు లక్ష్మణ కవి తెలుగు పద్యానువాదంతో సహా సాగిన వచన రచన; ‘స్వాతి’ మాసపత్రికలో ధారావాహిక ప్రచురణ). 176. శ్రీమద్భగవద్గీత (వేద వ్యాసమహర్షి ప్రోక్తమైన మహాభారతంలోని మూల శ్లోకాలతో సహా, సరళమైన తెలుగు సేత). 177. రెంటాల సంపాదకీయాలు 178. కల్యాణమల్లుని కామశాస్త్ర గ్రంథం ‘అనంగరంగం’ (‘ఆంధ్రప్రభ’ సచిత్ర వారపత్రికలో 1999 డిసెంబర్‌ నుంచి కొన్ని వారాల పాటు ప్రచురితమైంది). 179. అంతా పెద్దలే! (సాంఘిక, రాజకీయ వ్యంగ్య నాటకం. ఆంధ్ర ప్రజానాట్య మండలి సారథ్యంలో కొన్ని వందల ప్రదర్శనలిచ్చి, రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల్లో ప్రేక్షక జనాళిని ఓ ఊపు ఊపిన రచన). 180. దగ్ధశాంతి (నాటిక. ‘అభ్యుదయ’ పత్రికలో ప్రచురితం. 2000 సెప్టెంబర్‌ 6న ‘యుద్ధోన్మాదులు’ పేరిట ‘ఆకాశవాణి’ విజయవాడ కేంద్రం నుంచి ప్రసారితం).

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు