నయాగరాలో ముంచి ప్రాచీన జలధారలో తడిపిన ఏల్చూరి

తెలుగులో ప్రచురించిన తొలి అభ్యుదయ కవితా సంకలనంగా గుర్తింపు పొందిన ‘నయాగరా’ పుస్తకావిష్కరణ సభకు అధ్యక్షత వహించింది ఎవరు? కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. ‘ఇది నా శిష్యుల సభ. ఇదొక కొత్త రచన. మీరంతా విని ఆశీర్వదించాలి..’ ఆయన సభా ప్రారంభం చేశారు. విశ్వనాథ మాత్రమే కాదు, శ్రీమద్గురుభాగవతములోని ఏకాదశ, ద్వాదశ స్కంధములను రచించిన మిన్నికంటి గురునాథ శర్మ వంటి సంప్రదాయ వాదులూ ఈ సభకు విచ్చేశారు. 1944 ఆగస్టు 6న గుంటూరు లీలామహల్ లో జరిగిన ఇలాంటి సభను నేడూహించగలమా.. విప్లవ ధోరణిలో వినూత్నస్వరాలు వినిపించే సభలో ప్రాచీన సాహిత్యంలో పండితుడైన వారెవరైనా కనపడతారా? సాహిత్యం ఒక ధార. ఒక ప్రవాహం. ప్రాచీనం, ఆధునికం, ఆధునికానంతరం అనేవి మనం చేసే విభజనలు. కేవలం సామాజిక పరిణామాల్ని అధ్యయనం చేసేందుకే అవి ఉపయోగపడతాయి. కాని సాహిత్యం,సాహిత్యమే.  పాశ్చాత్య సాహిత్యంలో క్లాసికల్ రచనలు ఇప్పటికీ ఇష్టపడుతూ చదువుకునేవారెంతమందో.. అదే గౌరవం తెలుగు సాహిత్యానికి మనం ఎందుకు వర్తింపచేయం?

“మానవమేధస్సు  సంకెళ్లను తగిలించిన గత సాంఘిక శిలాశాసనం పడగొట్టను పగిలిన నా నిప్పుల కంఠం పలికిన విప్లవగీతం- హిట్లర్లకు, చాణక్యులకు గోరీ కట్టిందట… నరహంతకులకు, చెరసాలలకు, ఉరి తీర్పులకు నిరంకుశ నియంతలకు తల కొరువులు పెట్టిందట.”.

అని బెల్లంకొండ రామదాసు చదువుతుంటే.. తన ప్రాణమిత్రుడు బెల్లంకొండ రాఘవరావు కొడుకు కవితాగానమని విశ్వనాథ అమిత శ్రద్దతో విన్నారు. ‘మన్నుతిన్న పాముల్లాంటి మన్యం వీరుల గుండెల్లో రేగినై ప్రళయ ప్రళయంగా తుఫాను సహస్రాలు..’ అని అల్లూరిపై కుందుర్తి చదివిన కవితా ఆయనను ఆకట్టుకుంది.

ఆ తర్వాత మరో కంఠం ఖంగుమంది. అది ఏల్చూరి సుబ్రహ్మణ్యంది.ఆయన రెండు కవితలు చదివారు. మొదటిది బ్రిటిష్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన ఘడ్వాల్ రైఫిల్ దళం నాయకుడు ఠాకూర్ చంద్రసింగ్ కు విప్లవాంజలిలా సమర్పించిన దేశ భక్తి గీతం.

‘పున్నమి వెన్నెలలై పొంగిన, బానిస సంద్రంలో పొర్లిన మబ్బుల కెరటం.. సామ్రాజ్యపు చెలియలి కట్టను ఛేదించిన రక్తతరంగం..’

‘గగనంలో వేగుచుక్క జగమంతా జగఛ్ఛక్తి తమస గర్భ దళసహేతి బానిసత్వ విచ్ఛేదన ప్రబల విజయ ప్రజాశక్తి.. వొస్తున్నది ప్రజాశక్తి!’

రెండో కవిత చదువుతూ ఆయన రాజకీయోపన్యాసం చేయడం మొదలు పెట్టేసరికి  ఇదేదో రానున్న కమ్యూనిస్టు పత్రిక ‘ప్రజాశక్తి’ కు స్వాగత గీతం కాబోలని భావిస్తూ జనం వేదికపైకి దూసుకువచ్చారు. విశ్వనాథ వారినీ అడ్డుకుని సద్దుమణిగేట్లు చేయగలిగారు.

కొసమెరుపు ఏమంటే ఎవరిపైనైతే ఏల్చూరి సుబ్రహ్మణ్యం తన కవిత చదివారో ఆ ఠాకూర్ చంద్రసింగ్ అదే సభలో మారువేషంలో ఉన్నారు.  ఆ ఆజాను బాహువు తనపై చదివిన కవితకు పులకించి సుబ్రహ్మణ్యంను కౌగలించుకోవడం ఒక అపురూప ఘట్టం.

ఇంకో కొసమెరుపేమంటే ఈ పుస్తకావిష్కరణ సభకు నాటి అందాల తార కాంచన మాల వస్తారనే చిలిపి అబద్దాన్ని కరపత్రంలో వేశారట. దీనితో హాలు నిండా జనం పోగయ్యారు!!

తెలుగులో శ్రీశ్రీ, శిష్ట్లా రచించిన ప్రగతిశీల కవితలు పత్రికల్లో ప్రచురిస్తున్న సమయంలోనే 1944లో తొలి అభ్యుదయ కవిత్వం ‘నయాగరా’ పేరుతో అచ్చయింది. మహోదయకర్త కె.వి. రమణా రెడ్డి అన్నట్లుగా  “శ్రీశ్రీ కల్పించింది వాతావరణం మట్టుకే కాగా “నయాగరా” కల్పించింది ఆ వాతావరణంలోని స్థూలరేఖలు.

ఈ ఘట్టాలను రచించింది ఎవరో కాదు, నయాగరా కవి ఏల్చూరి సుబ్రహ్మణ్యం కుమారుడు.  తెలుగు, సంస్కృత,ఆంగ్ల భాషల్లో అఖండమైన పట్టు ఉన్న పండితుడు ఏల్చూరి మురళీధర రావు. ప్రపంచ సాహిత్యాన్ని అవపోశన పట్టిన మేధావి.

ఏల్చూరి మురళీధర రావు అనుభవాలు ఇప్పటివి కావు. ఆయన తెలుగు సాహిత్యానికి కొత్త దారులు తీసిన మహా పండితుడు అబ్బూరి రామకృష్ణారావు రచించిన పద్యాలపై  దేవులపల్లి కృష్ణ శాస్త్రి, పిలకా గణపతి శాస్త్రి ల మధ్య జరిగిన వ్యాకరణ చర్చను విన్నవారు. విశ్వనాథ పంచశతి పద్యాల్ని సేకరించి అబ్బూరి వరద రాజేశ్వరరావుకు పంపించినవారు. విశ్వనాథ ఆశువుగా పద్యాలు చెబుతుంటే ఆలకించిన వారు.

నేను రెండు దశాబ్దాల క్రితం  కేంద్ర సాహిత్య అకాడమీలో అనువాదం గురించి చర్చిస్తూ విశ్వనాథ రామాయణ కల్పవృక్షం గురించి ప్రస్తావించాను. ‘మరల నిదేల రామాయణం బన్నచో, నీ ప్రపంచకమెల్ల నెల్ల వేళ
తినుచున్న అన్నమే తినుచున్నదిన్నాళ్ళు, తన రుచి బ్రదుకులు తనివి గాన
చేసిన సంసారమే చేయుచున్నది’ అని రాసిన విశ్వనాథ యాంత్రిక వాదా.. అన్న సందేహం వ్యక్తపరిచాను. అక్కడే ఉన్న ఏల్చూరి మురళీధరరావు కలుగ చేసుకుని

కవి ప్రతిభలోన నుండును గావ్యగత శతాంశములయందు తొంబదియైన పాళ్ళు
ప్రాగ్విపశ్చిన్మతంబున రసము వేయిరెట్లు గొప్పది నవకథా ధృతిని మించి

అని విశ్వనాథ పద్యాన్ని పూర్తిగా ఉదహరించి నా అభిప్రాయం ఏ విధంగా తప్పో వివరించారు. ఆ ఉద్దండుడితో అప్పుడే పరిచయ భాగ్యం కలిగింది.

అబ్బూరి, విశ్వనాథ కాలంలో  కవిత్వంలో ప్రతి పదంపై చర్చ జరిగేది. రజాశ్లేష, ఊహాలోకం అనవచ్చా అని చర్చించేవారు. ఇవాళ ఎందరమో  పదాలను అలవోకగా గౌరవం లేకుండా విసిరివేస్తున్నాం.

ఏల్చూరి మరళీధరరావు  ఇటీవల రచించిన ‘వాజ్ఞ్మయ చరిత్రలో కొన్ని వ్యాసఘట్టాలు- మరికొన్ని విశేషాంశాలు’  అన్న పుస్తకం అమూల్యమైనదడంలో ఏ మాత్రం సందేహం లేదు.

నయాగరా కవులే కాదు, శ్రీశ్రీ, దేవులపల్లి కృష్ణ శాస్త్రి, ఆచంట జానకిరామ్, అనిశెట్టి, ఆరుద్ర,బైరాగి వంటి ఆధునికుల సాహిత్యాన్ని ఆయన ఎంతో ఇష్టంగా పలవరించారు.

‘అలఘుధ్వాంతనితానసంభరితరోదోంతర్మహాగహ్వరస్థలి యంభోనిధి యయ్యే’ అని రాసిన శ్రీశ్రీ ఛందోబస్తుల్ని ఎలా ఛేదించారో రాశారు.

మహా పండితులై ఉండి కూడా దేశికవిత తీపిని గ్రోలి, వ్యావహారిక భాషలోని సొగసులను గుప్పున గుబాళింపచేసిన వేటూరి ప్రభాకర శాస్త్రీ మురళీధరరావు రచనల్లో దర్శనమిస్తారు.

“జీవితం కూడా ఒక పువ్వే.. ఎంత పరిమళభరితమో అంత క్షణికం.. జీవితాన్ని ప్రేమించడమే జీవితం” అంటే అని కవిత్వం రాసిన ఆచంట జానకిరామ్  ‘సాగుతున్నయాత్ర’ లో ప్రస్తావించిన అబ్బూరి రామకృష్ణారావు, దేవులపల్లి, విశ్వనాథ, మల్లవరపు విశ్వేశ్వరరావు, ఇంద్రగంటి హనుమఛ్చాస్త్రి, బెజవాడ గోపాలరెడ్డి,పిలకా గణపతి శాస్త్రి   వంటి మహామహులనూ స్పృశించి, వారితో చర్చించిన  అనుభవమూ మురళీధర రావుకు దక్కింది. పాట పంపడంలో ఆలస్యం చేస్తే,  సినీపరిశ్రమకు చెందిన ఒక అసిస్టెంట్ దురుసుగా మాట్లాడినందుకు వారిచ్చిన నోట్లకట్టను విప్పి చెల్లా చెదురయ్యేట్లు రోడ్డుపై విసిరేసిన దేవులపల్లి  ఆగ్రహాన్నీ ఆయన కళ్లారా చూశారు.

కృష్ణశాస్త్రి ని ఒక సభకు రమ్మంటే ఆయన సభా నిర్వహణ ఇలా జరగాలని వారికి లేఖ రాశారట. ఆ నిబంధనలు ఇలా ఉన్నాయి-

 

1) సభ ఎక్కడ జరిగినా ఫర్వాలేదు.

2) ఎంతమంది వచ్చినా, రాకపోయినా ఫర్వాలేదు.

3) నేను సభాస్థలి ప్రాంగణంలోకి అడుగుపెట్టేసరికి వేదికమీద మా అబ్బూరి, రాయప్రోలు ఆసీనులై ఉండాలి.

5) నేను వేదిక మీదికెక్కి అబ్బూరి కాళ్ళకు మ్రొక్కి, రాయప్రోలుకు పాదాభివందనం చేసి, ఇద్దర్నీ కౌగిలించుకొని, పుష్పమాలలు వేసి, ఆ తర్వాత నేనూ కుర్చీలో కూర్చొనాలి.

6) సభ దరిదాపుల్లో ఎక్కడా మంత్రులూ, పందులూ ఉండటానికి వీల్లేదు అని.

 

ఇలా చెప్పడానికి ఒక సాహితీ వేత్తకు ఇవాళ ఎంత ధైర్యం కావాలి?

 

పూజాశిరీషము లేరుకుంటిని,
పోయి వచ్చెద జవ్వనీ
తేజోవిలీన దృగంచలమ్ముల
తేరిచూచెద వెవ్వనీ..

ఆలింపు పాడెద నాంధ్ర కోమలి

యార్ద్ర హైందవ గీతులన్

 

అని రాసిన అబ్బూరి తన గీతిని నవ్య శయ్యా రీతిగా అభివర్ణించుకున్నారు. ఈ గీతమంతా సామవేదసంహితలోని ఊహాగానానికే ఆధునిక పరివర్తనం అని ఏల్చూరి విశ్లేషించారు. ఇదే అబ్బూరి ఢిల్లీ జీవితం గురించి రాస్తూ

అంతులేని ధనపిపాస అనాగరక నాగరకత,
ఈ రొదలో ఎలా మనం మనుగడ సాధించగలం?

అన్నారు.

జీవితమిట కటుమృత్యువు, జీవితమిట అకృత్యం

జీవితమిట ఒక దుస్తర ప్రస్తర హస్తపు సత్యం

 

అని బైరాగి అభివర్ణించారు. అస్తవ్యస్థా విజిగీష బైరాగి కావ్య జీవితానికి ఊపిరి పోసింది అన్నారు ఏల్చూరి. ప్రపంచం బాధ అంతా ఈ ‘నేను’ పడే బాధే అని ఒక్క మాటలో చెప్పారు.

అదొక కాలం. సంప్రదాయాన్నిఆధునికతతో మేళవించిన కాలం. వ్యక్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్నీ రచయితలు కాపాడుకున్న కాలం.  ఇవాళ ఏది సంప్రదాయమో, ఏది ఆధునికతో తెలియక కొట్టుమిట్టాడుతున్నాం. ఇప్పుడు వ్యక్తిత్వం, ఆత్మగౌరవం అన్న పదాలకు విలువ ఎంతమందికి తెలుసు?

ఇదంతా ఒక ఎత్తు ప్రాచీన సాహిత్యంపై ఏల్చూరి మురళీధరరావు ప్రదర్శించిన విశ్వరూపం మరో ఎత్తు.

………….

“వసంత మాసపు రాత్రి వచ్చింది కాని, వస్తానని మాట యిచ్చిన విభుడు మాత్రం రాలేదు. ఈ విరహాగ్నిలో నా ప్రాణాలు దహించికొని పోవటం తథ్యం. అప్పుడిక నాకు పునర్జన్మగ్రహానికై దైవాన్ని వేడుకొంటాను. మానవజన్మ అంటూ కలిగితే బోయవాడినై పుడతాను. మధుమాసవేళ నాకు విరహతాపాన్ని కలిగించిన కోయిలను బంధించివేస్తాను. ఒకవేళ గ్రహజన్మమే కలిగిందా, రాహుగ్రహాన్ని అవుతాను. హిమకరుణ్ణి ధ్వంసం చేస్తాను. కాదు, పరమశివుని కంటిలోని కాంతిశిఖనై జన్మిస్తాను. మన్మథుణ్ణి మసి చేస్తాను. లేక, మన్మథజన్మమే కలిగిందా, నన్ను ఇంత విరహవేదనకు గురిచేసిన నా ప్రాణేశ్వరునికి మన్మథబాధ అంటే ఏమిటో చూపిస్తాను. అందుకని, ఓ బ్రహ్మదేవా! నాకు మళ్ళీ జన్మను ప్రసాదించు!”

ఓ కాంతా! ఆ విధాత నీ కన్నులను అందాలొలికే నల్ల కలువల కాంతులతో సృజించాడు. మోమును ఎఱ్ఱని తామర పువ్వు తళుకులతో మలిచాడు. పలువరుసను మల్లె మొగ్గల తెలికాంతులతో రూపొందించాడు. పెదవిని క్రొత్త చిగుళ్ళతో కల్పించాడు. సంపెంగ పువ్వు రేకులతో నీ తనువులోని అణువణువును నిర్మించాడు. ఇంతా చేసి, హృదయాన్ని మాత్రం ఎందుకో మరి, బండరాయితో  గండరించాడు!

ఓ కాంతా! ఉన్న పళాన లోపలికి రా. బయటలా కూర్చోకు. చందమామకు గ్రహణం పట్టే వేళ ముంచుకొని వస్తున్నది. ఆ పాడు రాహువున్నాడే, మచ్చలేని నీ ముఖచంద్రుణ్ణి చూశాడంటే తప్పకుండా వాడు ఆ పున్నమి చంద్రుణ్ణి వదిలి నిన్ను మింగాలని మీదికి వస్తాడు, సుమీ!

ఇంతకు మునుపెన్నడూ ఎరుగని నిప్పేదో ఉన్నది, ఆ కామిని చనుకట్టులో. దూరాన ఉన్నప్పుడు నిలువెల్లా దహించి వేస్తుంది. గుండెలకు హత్తుకొన్నప్పుడు మాత్రం చల్లదనం గిలిగింతలు పెడుతుంది”

ఇంత మనోహరమైన వాక్యాలు రాసిందెవరు?

అభినవ కాళిదాసు అని పేరు పొందిన క్రీ.శ. 1397-1430 నాటి కోటిజిత్కవి అట. ఆయన రచించిన శృంగార తిలకంలోని రసవత్తరమైన  శ్లోకాల పరిమళం తెనాలి రామలింగకవి, నన్నెచోడుడు,  శ్రీనాథుడి నుంచి పోతన  తదితరుల వరకూ గుబాళించిందని ఎంతమందికి తెలుసు?

ఏల్చూరి మురళీధరరావు  అద్భుత పరిశోధనలో  ఇలాంటి కనులు విప్పారజేసే  అంశాలెన్నో ఉన్నాయి.

క్రీస్తుశకం 1029-1064ల మధ్య  కాశ్మీరదేశాన్ని పరిపాలించిన అనంత నరేంద్రుని ఆస్థానకవి క్షేమేంద్రుని ‘కలావిలాస’  కావ్యాన్ని నన్నెచోడుడు ‘కళా విలాసం’ పేరుతో ఏ విధంగా అనువదించారు? రామకృష్ణ కవి పద్య శిల్పాన్ని నన్నెచోడుడు ఏ విధంగా ఉపయోగించారు?  దాన్ని బట్టి నన్నెచోడుని కాలాన్ని ఎలా నిర్ణయించవచ్చు? నన్నెచోడుని కుమార సంభవంలోని పద్యాలకు గాథా సప్తశతిలో ఉన్న మూలాలు ఏమిటి? వ్యాస మహభారతాన్ని నిజంగా వ్యాసుడు చెబుతుంటే విఘ్నేశ్వరుడు రచించాడా? వేగాతి వేగోక్తి నియమాన్ని విధించాడా? లేక వ్యాసుడి గురించి ఘట్టాలన్నీ మహాభారత రచన పూర్తయిన తర్వాత పండితులు ప్రవేశపెట్టారా? వ్యాసుడి శ్లోకాలను కవిత్రయం ఎంతవరకు అనువదించారు? వారి సృజనాత్మకతను ఎలా ప్రదర్శించారు? నన్నెచోడుని కుమారసంభవము లోని పద్యాన్ని తెనాలి రామకృష్ణ కవి తన ‘కందర్పకేతు విలాసం’ లో అర్థచౌర్యం చేసి వాడుకున్నారన్న మానవల్లి రామకృష్ణ కవి విశ్లేషణ లోని వాస్తవమెంత? ఆదికవి గా భావించే నన్నయ్య మహా భారతంలోని సభా పర్వంలో రాసిన ‘ధారుణి రాజ్యసంపద మదంబున కోమలి కృష్ణ జూచి, కురువృద్ధుల్, కురువృద్ధ బాంధవులు’  అనే ప్రముఖ పద్యాల పై  భట్టనారాయణుని వేణీ సంహారం, రాజశేఖరుడు ప్రచండ పాండవ నాటకం లో చిత్రించిన చిత్రణ ప్రభావం ఎలా పడింది? ‘స్తుతమతి అయిన ఆంధ్రకవి ధూర్జటి పల్కుల కెట్లు కల్గెనో నీ యతులిత మాధురీ మహిమ’ అని ధూర్జటి పై శ్రీకృష్ణ దేవరాయలు అడిగిన ప్రశ్నను తెనాలి రామకృష్ణ కవి నిజంగా పూరించాడా, అసలు వారవనితా జనత అంటే ఎవరు, తెనాలి రచించిన శబ్దార్థ గూఢ చిత్ర పద్యం అంతరార్థమేమిటి?

ఒక  పదాన్నిఒక కంద పద్యంలో ఏడు సార్లు వాడితే ప్రతి సారీ ఆ పదానికి వేర్వేరు అర్థాలు చెప్పడం ఎలా సాధ్యం? ఉట్టి ‘దదదద’ అని ఏకాక్షరాధారితంగా రాసిన శ్లోకం గూఢార్థమేమిటి? పద్యం వినగానే తెలుగా, సంస్కృతమా అనిపించే పద్యం గొప్పతనం ఏమిటి? నాలుగు పాదాల్లో మూడు పాదాలను ఒకే సమాసం తో రచించిన కవి ప్రతిభ ఎట్టిది? ద్వ్యర్థి కావ్యాలను, త్ర్యర్థ కావ్యాలను చదివేటప్పుడు ఒక అర్థం సుగమంగాను, మరో అర్థం దుర్గమం గానూ, పదాల విరుపు వల్ల మూలాన ఏర్పడ్డ అన్వయ ప్రౌఢి, మూడర్థాలు, నాలుగర్థాలు, ఏడర్థాలు, ముప్పై అర్థాలు, నూరేసి అర్థాలుగాను  ఉన్న రచనలలోని ప్రౌఢి ఏమిటి?  ఒక సంస్కృతాంధ్ర భాషా పద్యానికి సంస్కృత శ్లోకంగా ఒక అర్థం, తెలుగు పద్యంగా మరో అర్థం ఎలా ఉంటాయి? సందర్భాన్ని బట్టి వేరు వేరు అర్థాలను ఎలా చెప్పవచ్చు,

ఈ ప్రశ్నలకు  ఏల్చూరి పుస్తకంలో సమాధానాలు లభిస్తాయి. తెలుగు పద్యంలో మార్మికత, నిగూఢత ఎలా ఉన్నాయి, అనేవి తెలుసుకోవడం సాహితీ ప్రియులకు ఎంతో అవసరం. నిజంగా చిత్రకవిత్వ ప్రీతి ఉన్నవారు రాసే పద్యాలకు అర్థాలను అన్వేషించడం అంత సులభం కాదు. అందుకు కవి హృదయావిష్కరణ కూడా అవసరం.

‘బాణోఛ్ఛిష్టమ్ జగత్సర్వం’ అన్నారు పెద్దలు. అంటే బాణుడు తన తర్వాతి కవులకు వదిలిపెట్టిన వర్ణనలు కానీ పదబంధ చమత్కృతులు కానీ లేవని, తెలుగు కవులు నన్నయ్య, నాచన సోమన, శ్రీనాథుడు, పెద్దన్న, తెనాలి రామకృష్ణుడు, పింగళి సూరన ఇత్యాది కవులు  బాణుని ప్రభావానికి లోనైన వారే అని పేరాల భరత శర్మ అనే పండితుడు ‘కాదంబరీ రసజ్ఞత’ అనే వ్యాసంలో వక్కాణించారు. బాణుడి మాదిరే సుబంధుడు కూడా తెలుగుకవులపై  ఎంతో ప్రభావం చూపారని ఏల్చూరి సవివరంగా ప్రస్తావించారు. ‘ప్రత్యక్షర శ్లేషమయ ప్రపంచ విన్యాస వైదగ్ధ్య నిధి’ అయిన ప్రబంధాన్ని రచిస్తానని చెప్పి సుబంధుడు వాసవదత్తా గద్యం రాశారట. నన్నయ్య,  తిక్కన, ఎర్రన, శ్రీనాథుడు, తెనాలి రామలింగకవి తదితరుల పద్యాలపై  ఆయన చూపిన ప్రభావం కూడా ఏల్చూరి ఉటంకించారు.

‘వాణి నా రాణి’ అని ధైర్యంగా ప్రకటించిన 14-15వ శతాబ్దానికి చెందిన పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడి విషయంలో సాహిత్యిక, చారిత్రిక విశేషాలు రచించిన ఏల్చూరిలో ఒక గొప్ప పరిశోధకుడు కనపడతాడు. మూడు భాగాలుగా రచించిన ఈ వ్యాసపరంపరలో పిల్లలమఱ్ఱి గ్రామం నల్లగొండ జిల్లా సూర్యాపేట తాలూకా ఆమనగంటికి ఆరుమైళ్ల దూరంలో ఉంటుందని చెప్పడమే కాదు, పినవీరన కాలం, ఆయన  కుటుంబం విజయనగరంలో స్థిరపడడడం, గోత్ర నామాదులు, రచనల తీరుతెన్నులు, కవితా సౌరభం,  ఆయన రచనలపై ఇతర మహాకవుల ప్రభావం, భారతీ తీర్థయతీంద్రులతో ఆయన సంబంధాలు వివరించారు.  ఆయన జైమిని భారతాన్ని అంకితమొందిన సాళువ నరసింహరాయలి చరిత్ర తామ్ర శాసనాలను పరిశీలించి మరీ ఏల్చూరి రాశారు.70వ దశకంలో జీవీ సుబ్రహ్మణ్యం  పిల్లలమఱ్ఱి పై రచించిన రచనలో కంటే ఏల్చూరి వ్యాసాల్లో అత్యధిక సమాచారం ఉన్నది.

‘తెలుగులో అలబ్ద వాజ్ఞ్మయం’ పేరిట ఆచార్య రవ్వా శ్రీహరి రాసిన ఒక గ్రంథంలో శ్రీనాథుడు రచించిన శాలివాహన సప్తశతి కూడా లభించడం లేదని రాశారు. స్కాంధ పురాణం ఆధారంగా రచించిన కాశీఖండంలో శ్రీనాథుడు తానే స్వయంగా ‘నూనూగుమీసాల నూత్నయౌవనమున శాలివాహన సప్తశతి నుడివితి’ అని రాసుకున్నారు అయితే అందులో అయిదు పద్యాలే లభించాయని  రవ్వా శ్రీహరి పేర్కొన్నారు. ఈ శాలివాహన సప్తశతి నుంచి పలు సార్లు ఉటంకించిన పద్యాలు సప్తశతి లో రచించినవా, కాదా అన్న విషయంలో ఏల్చూరి సమగ్రంగా వివరించారు. శాలివాహన సప్తశతి తాళపత్రాన్ని ఆచార్య బిరుదురామరాజు గారు తన బాల్యంలో చూశారని, దాన్ని 1931లో కాకతీయ చారిత్రక మహోత్సవాల్లో ప్రదర్శించారని ఏల్చూరి చెప్పారు. కాని దాన్ని కాపాడుకోలేకపోవడం మన దురదృష్టం.1881లో  హాలుడి గాథా సప్తశతిని వ్యాఖ్యానంతో సహా ప్రచురించిన అల్బెష్ట్ వెబర్ వంటి జర్మన్ పండితుడు మళ్లీ జన్మిస్తే కాని ఇలాంటి కావ్యాలు వెలుగులోకి రావేమో!?

శ్రీనాథుడి ప్రవేశం సమయంలో  ఆంధ్రదేశపు సాహిత్యవాతావరణంలో ఎన్నడూ లేని కొత్తగాలులు వీస్తున్నతీరును,  తెలంగాణంలో కాకతీయుల రాజకీయ విజయాల ఫలితంగా ఆంధ్రదేశమంతటా ఉత్సవోత్సాహం వెల్లివిరిసి, శ్రవ్యమాధ్యమాల స్థానంలో దృశ్యమాధ్యమాలకు ప్రచారం వచ్చి రంగస్థల ప్రదర్శనలు ప్రజాదరణకు నోచుకొన్న తీరును, నాటక రంగానికి ప్రాధాన్యత పెరిగిన వైనాన్ని ఏల్చూరి మురళీధర రావు తన మరో  వ్యాసంలో చరిత్రకారుడి  రూపంలో అమోఘంగా వివరించారు.

ఒక మూలగ్రంథం నుంచి అనువాదం ఎలా చేయాలి? ఈ రహస్యాన్ని తెలుగు సాహిత్యంలో ముందుగా తెలియజెప్పింది శ్రీనాథుడే కావచ్చు. శ్రీహర్ష నైషధాన్ని అనువదించేటప్పుడు తాను మాతృకానుసారంగా చేశానని, అందరికీ హృదంగమంగా, శబ్దాన్ని అనుసరించి, అభిప్రాయాన్ని కూర్చి, అలంకారాన్ని గౌరవించి, ఔచిత్యాన్ని పాటించి, అనౌచిత్యాన్ని పరిహరించానని శ్రీనాథుడు స్వయంగా చెప్పుకున్నారు. ఈ అనువాద లక్షణాలను శ్రీనాథుడు ఎలా పాటించారో, వాటి అర్థం ఏమిటో ఏల్చూరి ‘శ్రీనాథుని ఆంధ్రీకరణ శిల్ప సూత్రం: అర్థపరిశీలన’ అన్న వ్యాసంలో సవివరంగా, సలక్షణంగా చర్చించారు.

అనువాద లక్షణాలనే కాదు, ఉత్తమ శ్రేణి కావ్యలక్షణాలను కూడా శ్రీనాథుడు నిర్వచించాడు.  తన ‘భీమేశ్వర పురాణము’ అవతారికలో

హరచూడా హరిణాంక వక్రతయు, గాలాంతస్ఫురచ్చండికా
పరుషోద్గాఢపయోధర స్ఫుటతటీ పర్యంత కాఠిన్యమున్‌,
సరసత్వంబును సంభవించెననగా సత్కావ్యముల్‌ దిక్కులం
జిరకాలంబు నటించుచుండు గవిరాజీగేహరంగంబులన్‌!

అని రాసిన పద్యంలోని వక్రోక్తి లక్షణాలను, కాశ్మీర హర్షదేవుని ఆస్థానంలో కవిగా ఉన్న శంభుకవి ప్రభావం శ్రీనాథుడిపైన పడ్డ తీరునూ  ఏల్చూరి అనన్య సామాన్యంగా వివరించారు.

సంస్కృత మూల భాగవతంలో లేకపోయినప్పటికీ పోతన తన భాగవతంలో ఎన్నో రమణీయమైన పద్యాలు రాశారు. అందులో ఒకటైన ‘రవిబింబం బుపమింప బాత్ర మగు ఛత్రంబై, శిరోరత్నమై ..’ .అన్నప్రముఖ పద్యం పోతన  ఊహాశాలితకు, కల్పనానల్ప శిల్పానికీ నిదర్శనమంటూ ఏల్చూరి రాసిన వ్యాఖ్య ఆ పద్యానికి మరింత అందాన్నిసమకూర్చింది. రుయ్యకుని అలంకారసర్వస్వానికి జయరథుడు కూర్చిన విమర్శినీ వ్యాఖ్యలో సారాలంకార వివరణ వద్ద ఇలాంటి శ్లోకాన్ని ఉదాహరించారని, ఇది పోతన బహు గ్రంథాల అధ్యయానికి నిదర్శనమని ఏల్చూరి వివరించారు. పోతన తెలుగు మహాభాగవతానికి మరింత సొబగు చేర్చేందుకు మూలాతిరిక్తంగా కనీసం 30-40 గ్రంథాలనుంచి 70 దాకా అనువాదాలను చేశారని ఆయన చేసిన వ్యాఖ్య వెనుక అపారమైన పరిశోధన ఉన్నట్లు అర్థమవుతోంది.

భాగవతంలోని పంచమస్కంధంలో కొన్నిపద్యాలను పూరించిన బొప్పన గంగరాజు మాత్రం అనువాదం మూలానికి అత్యంత విధేయంగా ఉన్నప్పటికీ ఏ విధంగా మనోహరమైనవో నిరూపించేందుకు అందమైన పద్యాలెన్నిటినో ఉటంకించారు. గంగరాజు వల్ల పోతన రచనా ప్రవాహం ఏమాత్రం దెబ్బలేదని అర్థమవుతోంది. గంగరాజు నిజాం రాష్ట్ర వాసి అని ఆంధ్ర కవితరంగిణిలో చాగంటి శేషయ్య రాసినప్పటికీ ఆయన జీవిత విశేషాలేమీ తెలియడం లేదని ఏల్చూరి బాధపడడంలో అర్థం ఉన్నది.

ఛందస్సు, వ్యాకరణం, అలంకారాలతో సర్వలక్షణ శిరోమణి పేరుతో కూర్చడమే కాక అందుకు అనుగుణంగా ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసం అనే ప్రబంధాన్ని రచించిన గణపరవేంకటకవి ఎక్కడెక్కడి నుంచి పద్యాలు సేకరించి  చిత్రకవిత్వం రాశారో ఏల్చూరి వివరించారు.అన్నమయ్య భక్తి శృంగార మంజరిలోని సౌరభాన్నీ పరిచయం చేశారు.

“వసంతుడు ఎండిన మోడు చిగురించేటట్లు కవిత్వం చెప్పాడు. చంద్రుడు దానిని మెచ్చక చంద్రకాంత శిలలు కరిగేట్లు కవిత్వం చెప్పాడు. ఎంత బాగా చెప్పినా సమకాలం వారు మెచ్చుకోరు కదా!” అని చేమకూరి వేంకటకవి చెప్పిన ప్రసిద్ద పద్యానికి ఏల్చూరి కవి పరంగా మనోహర వ్యాఖ్య చేశారు.  కవి ఎవరిని విమర్శిస్తున్నట్లు? నేటి కవులు కూడా ఒకరి కవిత్వాన్ని మరొకరు మెచ్చుకోవడం తక్కువే కదా!

జూలూరి అప్పయ్య ,మండపాక పార్వతీశ్వరశాస్త్రి, కూచి నరసింహం,  మద్దిపట్ల సూరి,   బోయి భీమన్న, పి.బి.శ్రీనివాస్, భారతీతీర్థ మహాస్వామి వారు, గుంటూరు శేషేంద్రశర్మ, ముళ్ళపూడి వెంకటరమణ, కోరాడ రామచంద్రశాస్త్రి, అనుమాండ్ల భూమయ్య, అప్పాజోస్యుల సత్యనారాయణ తదితరుల సాహిత్య ప్రతిభ కూడా ఆయన అభివర్ణించారు.

‘సౌందర్యమే ఆయనకు అలంకారం,సౌందర్యమే ఆయన జీవితం. కావ్యవిమర్శలో శేషేంద్ర శర్మ సౌందర్యశిల్పశాస్త్రానికి శబ్దశాసనం చేయాలని  ఉద్యమించారు’ అని రాసిన వ్యాఖ్యలు శేషేంద్ర రూపాన్ని, సారాన్ని మన కళ్లముందు సాక్షాత్కరింపచేశాయి.

కరీంనగర్ జిల్లా లోని వెదురుగట్ట అనే మారుమూల గ్రామంలో జన్మించిన అనుమాండ్ల భూమయ్య తేటగీతి చ్ఛందంలో తెలుగుదనం ఎలా ఉట్టిపడుతుందో ఏల్చూరి కమనీయంగా వివరించారు.

“నన్ను మీ తండ్రి పెండ్లాడే, నాటినుండి ఒక్క శుభముగానీ,  సుఖమే ఒకటి గాని ఇంతవరకు నే జూచిన ఎరుక లేదు”…  అని  కౌసల్య పడిన మనోవేదనను భూమయ్య తన ‘జ్వలిత కౌసల్య’ లో ఆర్ద్రంగా చిత్రించారు. ఇది నేడు  ఎందరో స్త్రీలకు వర్తిస్తుందనడంలో సందేహం లేదు.

 

……

ఉన్నట్లుండి ఏల్చూరి మురళీధరరావు ఒక చైనా మహా కవిని పరిచయం చేశారు.

‘సుకవి నిల్చు ప్రజల నాలుకలయందు.’ అన్న జాషువా మాటల్ని నిరూపిస్తూ చైనాలో కొన్ని వేళ క్రింద ప్రజల కోసం తన జీవితాన్ని బలి చేసుకున్న ఛు యువాన్ అనే ఒక మహాకవిని ఇప్పటికీ ప్రజలు గుర్తించుకుంటున్న తీరును ఏల్చూరి మురళీధర రావు ఒక వ్యాసంలో అద్భుతంగా వివరించారు. ఒక కవి, వేదాంతి, ప్రజా శ్రేయస్సును కోరేవాడు మంత్రి అయితే ఎలా ఉంటుంది? రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. ప్రజలు సుఖశాంతులతో జీవిస్తారు. ప్రజోపయోగకరమైన చట్టాలు అమలు అవుతాయి. అయితే రాజు చుట్టూ చేసిన అవినీతిపరులు ఈ పరిణామాలను సహిస్తారా? రాజుకు ఏవో చెప్పుడు మాటలు చెప్పి ప్రవాసానికి పంపించి వేస్తారు. చివరికి శత్రుదేశంతో కుమ్మక్కై రాజ్యం కుప్పకూలేలా చేస్తారు. అప్పుడు కవి ఏమి చేయగలడు?  మనసు చెదిరిపోయి కవితలు రాయగలగడం తప్ప? కష్ట జీవులకోసం ఆయన రాసిన కవితలు ఆదరణను చూరగొన్నాయి. చైనాలో క్రీస్తుపూర్వం 340-278ల మధ్య జీవించిన  ఛు యువాన్  ఒకరోజు మీలో నదిలోకి దూకి జీవ యాత్ర చాలిస్తారు.  ఆయన చనిపోయి వేల సంవత్సరాలైనా ఇప్పటికీ ప్రజలు ప్రతి ఏటా చైనాప్రజలు ప్రతి ఏటా డ్రాగన్ పడవ పోటీలను నిర్వహించి నివాళులు అర్పిస్తారు. ఆయన దేహాన్ని ఆహరంగా స్వీకరించవద్దని జలచరాల్ని ప్రార్థిస్తూ ఉండ్రాళ్లను నీటిలో వదిలిపెడతారు.

ఆడంబరాలకు లొంగిపోనెప్పుడూ

ఏకాకిగా జీవించాల్సి ఉంటుంది

పాతకాలానికి చెందిన ఒక రుషి

బానిసగా మారి  శిరోముండనం చేసుకున్నాడు

మంచి చెప్పే మంత్రుల హత్య జరిగింది.

ఒక సాధువు బలవంతంగా నగ్నంగా

తిరగాల్సివచ్చింది

మరొకరి రక్తం ప్రవహించింది

 

ప్రాచీన కాలం నుంచీ ఇదే జరుగుతోంది

మరి నేనెందుకు ఫిర్యాదు చేయాలి?

నేను ఇప్పటికి అచంచలంగా సత్యాన్నిఅనుసరిస్తాను

నన్ను వధించినా ఫర్వాలేదు

 

అని రచించిన ఛు యువాన్ అమరుడే. మన ప్రాచీన కవుల్ని ఇలా గుర్తుంచుకున్న ఉదంతాలేవీ?

…….

సాహిత్యం, చరిత్ర వేరు వేరా.. చరిత్ర రచన అంటే ఏమిటి.. పరిశోధన అంటే ఏమిటి.. ఈ విషయంలో సైద్దాంతిక కొలమానాల మాట ఎలా ఉన్నా గతంలోకి వెళ్లి మనకున్న అనుమానాలను శాస్త్రీయంగా నివృత్తి చేసుకోవాలంటే అందుకు పాండిత్యం, భాషపై పట్టు, సాహిత్యం పట్ల అభిరుచి ఎంతో అవసరం.

ఇట్లాంటివన్నీ తెలుసుకోవడం అవసరం కాదని చాలా మంది నేటి రచయితలు అనుకోవచ్చు. ఆధునిక కవి దేవీప్రియకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించినప్పుడు నేను అకాడమీ నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయనను ఇంటర్వ్యూ చేశాను.

‘నేటి యువకవులు ప్రాచీన సాహిత్యం చదవడం అవసరమంటారా?’ అని నేను ప్రశ్నించాను.

“కృష్ణా, మీకు తెలుసు. ప్రాచీన సాహిత్యాన్ని తప్పకుండా చదవాలని చెప్పేవాళ్లలో నేనొకడినని. యువకవులకు నేను ఈ విషయం పదే పదే చెబుతాను. సరే, భారత, రామాయణాల సంగతి అటుంచితే, తెలుగులో పంచ మహాకావ్యాలున్నాయి. నేటి యువకులు భాషా సాహిత్యాల మీద పట్టు ఏర్పర్చుకోవాలంటే, అలంకార శాస్రం గురించి నేర్చుకోవాలంటే లభ్యమైన ప్రాచీన కావ్యాలు చదవాలి. వాటిని అధ్యయనం చేసేందుకు రకరకాల సాధనాలున్నాయి. సీనియర్ల సహాయం తీసుకోవచ్చు.. కాని ఏదీ చదవకుండా సాహిత్యం గురించీ, శిల్పం గురించీ, సాహిత్య పరిణామం గురించీ మనకు పరిజ్ఞానం ఎలా పెరుగుతుంది?” అని ఆయన నాకు జవాబిచ్చారు.

నిజానికి ప్రాచీన సాహిత్యంలో కవికాలాదిక చర్చలు, కర్తృత్వ నిరూపణ చర్చలు, పాఠ నిర్ణయ సమస్యలు ఇలాంటివన్నీ వివాదాస్పదాలే. వీటన్నింటిని పరిష్కరించాలంటే అనేకమంది పండితుల విశ్లేషణలను అధ్యయనం చేయడంతో పాటు స్వంత వివేచనతో విశ్లేషణ చేయడం కూడా అవసరం అలాంటి సాహితీ ప్రకర్ష, పాండిత్యం తెలుగునాట అతి కొద్ది మందిలో మాత్రమే ఉన్నది. నిజానికి అలాంటి పండితులు రోజురోజకూ మృగ్యమైపోతున్నారు. వారిలో ఒక ప్రాజ్ఞుడు, ప్రాచీన ఆధునిక సాహిత్యాల మధ్య నిజమైన వారధి అనదగ్గ ఏల్చూరి మురళీధర రావు అని చెప్పేందుకు ఎంత మాత్రమూ సందేహించవలసిన పనిలేదు. అంతే కాదు,వాజ్మయ చరిత్రలో విస్మరించలేని అబ్బురం గొలిపించే అంశాలను ఆయన మన ముందుంచారని చెప్పక తప్పదు. ఈ ఒక్క పుస్తకం లెక్కలేనన్ని పిహెచ్డీలకు అర్హమైన పుస్తకం, సాహితీ ప్రియులకు మాత్రం ఇది ఎన్నిసార్లు తిన్నా ఆస్వాదించగలిగే షడ్రసోపేతమైన విందుభోజనం. ఈ గ్రంథరాజాన్ని ప్రచురించిన అభో-విభో-కందాళం ఫౌండేషన్ కు అభినందనలు

(వాఙ్మయచరిత్రలో కొన్ని వ్యాసఘట్టాలు – మరికొన్ని విశేషాంశాలు- సాహిత్య వ్యాస సంపుటి. రచన- ఏల్చూరి మురళీధరరావు వెల రూ.1000)

 

కృష్ణుడు

వారం వారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఢిల్లీ నుంచి కాలమ్ రాసే ఎ. కృష్ణారావు, అడపా దడపా కవితలు రాసే కృష్ణుడూ ఒకరే. జర్నలిస్టుగా 34 సంవత్సరాల అనుభవం ఉన్న కృష్ణుడు కవి, సాహితీ విమర్శకుడు కూడా. ఇండియాగేట్, నడుస్తున్న హీన చరిత్ర పేరుతో రాజకీయ వ్యాసాల సంకలనాలు వెలువరించిన కృష్ణుడు ఇంకెవరు, ఉన్నట్లుండి, ఆకాశం కోల్పోయిన పక్షి అనే కవితా సంకలనాలను వెలువరించారు.

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఆనాటి సభా విశేషాలు, నయాగరా కవులు, శ్రీ మురళీధరరావు గారి పాండిత్య విశేషాలు వివరించిన కృష్ణుడు గారికి హృదయపూర్వక అభినందనలు. చాలా మంచి వ్యాసం చదివిన తృప్తి కలిగింది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు