ఇప్పుడు మళ్లీ మా ఊరిని తలుచుకుంటూ, నా జ్ఞాపకాలు రాయటం అంటే, పూర్తిగా నేను ఊరివాణ్ణి కాకపోవడం అనే చెప్పుకోవాలి.
దేన్నుంచి అయినా ఎడం అయ్యాకే మనం, వాటిని జ్ఞాపకం చేసుకుంటాం అనుకుంటా. అయితే నేను ఊరివాణ్ణి కాకుండా పోయాకే, నేను ఊరికి చెందిన వాన్ని అని చెప్పుకోవడానికి మా ఊరి కథలు రాసి ఉంటాను. ఇది ఒకరకంగా పాఠకులను మోసం చేయటం కావచ్చు కూడా. అందుకు నాకు రాత అనేది తోడ్పడింది. నేను ఎవరి వద్దైనా ఊరి వాణ్ణి అని చెప్పుకోవడానికి కేవలం నా వద్ద రాత మాత్రమే మిగిలింది.
ఇప్పుడు నేను రాసిన కథల నేపథ్యంలో మా ఊరి గురించి నాకున్న జ్ఞాపకాలు చెప్పుకోవడం అంటే, ఎప్పటి నన్ను మళ్ళీ తలుచుకోవడమే. అసలు మా ఊరి నాకొక జానపద కథలాగా కనిపించేది. ఇందుకు మొదట మా నాయనమ్మ పిచ్చమ్మ కారణం. తర్వాత మానాన్న, మిగతా నా చుట్టూ ఉన్న వాళ్ళు. వీళ్లంతా ఎప్పుడో జరిగిపోయిన విషయాల్ని, గొప్ప కథనంతో చెప్పేవాళ్ళు. అలా చెబుతూ ఉన్నప్పుడు దానికో ఎత్తుగడ, ముగుంపు ఉండేవి.
ఆటలకు పోయి వచ్చాక నన్ను మా నాయనమ్మ దగ్గర కూర్చో పెట్టుకొని అనేక శాత్రాలు, వాళ్ళకాలంలో వాళ్ళు బతికిన విషయాలు అన్నీ ఆసక్తిగా చెప్పేది. అవి విని నేను, మళ్ళీ నాతో పాటు పిల్లలకి చెప్పేవాన్నీ. ఆమె చెప్పే విధానం అంటే నాకు చాలా ఇష్టం. నన్ను కట్టిపడేసి అవి నా బుర్రలో సుడులు తిరిగేలా చేసేది.
మా తాతను ఎప్పుడూ చూడలేదు. చిన్నప్ప అని ఎరికలోల్ల ఆయన నన్ను ఎంకటయ్యా అని పిల్చేవాడు. మా తాత గురించి ఏవేవో గొప్ప సంగతులు చెప్పేవాడు. “నువ్వచ్చం మీ తాతలాగే ఉన్నవ్” అనేవాడు. నాకు మా తాత గురించి తెలుసుకోవాలి అనిపించేది. నేను ఒక్కసారి అయినా చూడాలి అనుకునే వాణ్ణి. కానీ నేను పుట్టక ముందే ఆయన చనిపోయాడు.
మవ్వ దగ్గరకి పొయ్యి అడిగితే “మీ తాత కథలు ఎంత బాగా చెప్తాడని, ఆయన కథలు చెప్తుంటే అందరు ఆయన ముందు గుమికూడి వినేవాళ్ళు. ఎవురు కనపడ్డా ఎంకటయ్య ఓ శాత్రం చెప్పమని అడిగేవాల్లు. రోజుల తరబడి కూడా ఆయన శాత్రం జెప్పేవాడు” అనేది. ఆయన చెప్పిన కథలు గుర్తుంటే నాకు చెప్పవా అని మవ్వని అడిగితే,
“యాడ్రా ఆ ముసలోడితో పాటే అయ్యన్నీ పోయినియి. అటా సింత సెట్ల కింద బొందలోనే ఉండు. ఆ కతలన్నీ ఆడే ఉన్నయి” అనేది.
అది నా మనసులో పడింది. నిద్రలో ఒక్కన్నే మా తాత కోసం వెతుకుతూ, సింత చెట్ల కాడికి పోతే, అవి అంతంత ఎత్తు ఉండి, వేర్లు అంతంత లావుండి నడవటానికి సందులేకుండా కనిపించేవి. వాటి కాడ మా తాత బొంద ఎక్కడా అని నేను వెతుకి, ఆడికి పొయ్యి దాన్ని తవ్వి ఆయన్ని తీయబోతే అప్పుడే మెలుకవ వచ్చేది. కలలో మా తాత మొకం చూడాలి, ఆయన గొంతు వినాలి అనుకున్నా వినలేక పోయేవాణ్ణి.
ఈ కల నన్ను చాన్నాళ్ళు వెంటాడింది. ఇప్పుడు పుట్టకుండా ముందే పుట్టి ఉంటే మా తాతను చూసేవాణ్ణిగా అని ఎన్నో సార్లు అనుకున్నాను.
ఇదీ నా మీద బలమైన ముద్ర వేసింది. ఇప్పుడు పెద్దవాణ్ణి అయ్యాక అంతగా అనుకోవటం లేదు కానీ ఒకసారి అయినా ఆయన మొకం చూడాలి అని బో ఉబలాట పడేవాన్ని.
మా తాత పోవడంతో మా నాన్నకు రెండు పెళ్లిళ్లు. గొడవలు, కేసులు. దీంతో అప్పుడు ఉన్న పదిహేను ఎకరాలు, గొర్ల మంద, రెండు జతల ఎద్దులు, బరిగోల్లు, ఇల్లు, అన్నీ పోయాయి. మా నాన్న తాగి ఇల్లు పట్టించుకోకుండా ఉండేవాడు.
మమ్మోల్లని తాగినప్పుడు బాగ కొట్టేవాడు కూడా. మమ్మ ఎన్నిసార్లు ఆ దెబ్బలు తిని, రాత్రంతా ఏడ్చుకుంటూ పడుకుందో నాకు తెలుసు. మమ్మ మళ్ళీ ఎప్పటిలా ఉండేవరకూ నాకు ఏమీ తోచేది కాదు. ఆ సమయంలో భయపడే వాణ్ణి. ఒక్కన్ని ఎటైనా పోయి కూర్చునే వాణ్ణి. తర్వాత మా నాన్న తాగుడు తగ్గించేసి మళ్ళీ సంపాదనలో పడ్డాడు. అదీ నాకోసం.
నన్ను చేనికి తీసుకెళ్లే వాడు. ఆయనతో ఉన్నప్పుడు ఎన్ని సంగతులు చెప్పేవాడని. మా నాన్న అలా చెబుతూ ఉంటే పొద్దు కుంకకుండా ఉంటే బాగుండు అనిపించేది. ఎప్పుడన్నా పండగలకి పనికి పోకుండా ఇంటికాడ ఉన్నప్పుడు మమ్మ దగ్గరకి చేరేవాన్ని. మమ్మ వాళ్ళ ఊరు గురించి, వాళ్ళ అమ్మ, నాన్న గురించి చాలా చెప్పేది. మమ్మకి వాలోళ్ళ గురించి చెప్పటం అంటే ఎంత ఇష్టమో. మమ్మ జాకెట్టు ఉచ్చుని వేలితో రుద్దుతూ నేను ఆ ముచ్చట్లు వినేవాణ్ణి. ఇవి నా మీద పెద్ద ముద్రను వేశాయి.
కుందేటి గురయ్య అని ఉండేవాడు. ఎప్పుడో చనిపోయాడు. ఇప్పుడు ఆయన మొకం కూడా గుర్తు లేదు నాకు. కానీ ఆయన బో సరదా మనిషి. కొద్దిగా చెవుడు కూడా ఉండేది. చిన్నప్పుడు ఆయన్ని ఆటపట్టించబోయినా, ఎప్పుడూ చేయి చేసుకునే వాడు కాదు. ఆయన ఎంత చిత్రమైన మనిషి అంటే ఆయన పెళ్ళాన్ని ఏదో పని మీద బయట కూర్చున్నప్పుడు పిలుస్తాడు. ఆవ బదులు చెప్పిద్ది. ఈయనకు వినిపించదు. అందుకని పెళ్ళాన్ని పట్టుకొని ‘నీ పెళ్లాన్ని దెంగా’ అనేవాడు.
‘నీ పెళ్ళానికి పెళ్ళాం యాన్నుంచి వచ్చింది’ అంటే, ‘అట్ట నీ పెళ్లాన్ని దెం….. అంటే రోసం వచ్చిద్దని’ అనేవాడు. తెగ నవ్వుకునే వాళ్ళం. కానీ ఆ మనిషి ఎలా కనుమరుగయ్యిండో కూడా తెలీదు. మనిషి మీద మనిషి ఎత్తు ఉండే ఆ మనిషి ఏ రోగం తగిలిపోయిండో ఈ పిలగాడికి ఏం తెలుసు.
ఇంకొకయాన ఉండేవాడు. పేరు మర్చిపోయాను. బట్టలు అల్లేవాడు. పొరక గానీ, తడిక గానీ, బుట్ట గానీ, తట్ట గానీ ఎట్ట అల్లేవాడని! ఆయన ఆలుతుంటే చూడాలి కళ్ళు పక్కకు కూడా తిప్పేవాళ్లం కాదు. ఆయన చనిపోయింది గుర్తు ఉంది. చివరి రోజుల్లో పక్షవాతం వచ్చి చూసేవాళ్ళు లేక, పీలగా అయిపోయి కాలం చేశాడు. ఇలా నేను నా పదేళ్ల, పదేనేళ్ల లోపు చూసిన ఈ మనుషులంతా, మా తాతలాగా కనిపించకుండా, వినిపించకుండా వెంటాడేవాళ్ళు. ఎవరైనా పలానా మనిషి అని తలుచుకుంటున్నప్పుడు వాళ్ళంతా నన్ను కమ్మేసేవాల్లు. దాంతో నాకు పాతకాలం మనుషుల గురించి తెలుసుకోవడం చాలా ఆసక్తిగా ఉండేది.
రంగప్ప అని మా ఇంట్లో అయిదో తరం క్రితం మనిషి. అద్దీడు దొనకొండ (ఇప్పటి దొనకొండ) నుంచి ఇక్కడికి వచ్చాడు. మొదట మూగచింతలపాలెంలో కళ్ళు గీసుకుంటా ఉంటే, గరికపాట్లో ఈదులు ఎక్కువగా ఉన్నాయని అమరేశం అరిజెన తాతోల్ల తాత ఇక్కడికి తీసుకొచ్చి చెట్లు గీసుకో అన్నాడు. ఆ రంగప్ప అనే ఆయన దగ్గర నుంచి నా దాకా మా నాన్న పెద్ద కథగా ఎప్పుడన్నా చెబుతూ ఉండేవాడు. ఇదీ నా మనసులో నిలిచిపోయింది. ఎప్పటికైనా ఇదంతా ఒక పెద్ద నవల రాయాలని ఆశ. ఈ సంగతులు చెప్పేటప్పుడు వాళ్ళు ఆనాటి పరిస్థితులు, తిన్న తిండి, కట్టిన బట్ట, చావులు, పుట్టుకలు, పెళ్లిళ్లు అన్నీ చెప్పేవాళ్ళు. అవన్నీ వింటూ ఆ మనుషుల దగ్గర ఉన్నట్లు ఊహించుకునే వాణ్ణి. వాళ్ళు నాలో తిష్ట వేసుకునేవాళ్లు.
ఎంతో మంది గురించి నా వాళ్ళు నోటి కథలుగా చెప్పేవారు. మరి ఈ మనుషుల్ని నేను మళ్ళీ తలుచుకోవడానికి, ఎప్పటికీ మర్చిపోకుండా ఉండటానికి రాత నాకు తోడు అయింది. ఇలా అనేకమైనవి నా మీద బలమైన ముద్ర వేశాయి.
అవన్నీ ఈ చిన్న వ్యాసంలాంటి దాంట్లో కుదించటం నా వల్ల కాదు. మా ఊరి గురించి ఇంకా అనేక కథలు ఉన్నాయి. అవి రాస్తాను. ఆధునిక కాలంలో చిక్కుకుపోతూ ఆ పాత మనుషుల్ని మర్చిపోయే లోపు ఇలా రికార్డు చేసుకోవాలి. అందుకోసం నా వద్ద ఉన్నది కేవలం రాత మాత్రమే. ఈ భాష లేనినాడు వీళ్లతో పాటు నేనూ కనుమరుగై పోతాను. అందుకే నాకు భాష ప్రాణం.
వాళ్ళని నిలపటానికి అదొక్కటే నాకున్న ఆదరువు.
*
Add comment