కేశరాజుపల్లీ..!!
అమ్మా..! ఎట్లున్నవే…
పానం బాగున్నదానే
మనుషుల మధ్య పెరుగుతున్న కాలుష్యం దాటి
చూపు ఆనుతున్నదానే
ఈ మద్య ఒకపాలి రైల్లో
నీ పక్క నుంచి పోతుంటె
నువ్వు చేతులు సాచినట్టే అనిపించిందే
నన్ను దగ్గరికి తీస్కోని
తనువంతా తడిమి చూస్తున్నట్టే తోచిందే
నేను దూరంగా పోతుంటే
ఏమైపోతానోనని బెంగపడుతున్నట్టే అగుపించిందే
నా జీవాన్నేదో అక్కడ వదిలేసి పోతున్నట్టయ్యిందే
నను సాదిన ఊరా..!
కన్న తల్లీ.. కేశరాజుపల్లీ..!
నీకెంత దూరమైపోయానమ్మీ…!
నిన్ను వదిలి దేశమంత తిరుగుతున్నా
రాత్రింబవళ్లు నీ యాది
మనసుల కలె తిరుగుతుంటదే..
నన్ను అమ్మగల్లాడిరచిన నేలమ్మా..
నాకు తప్పటడుగులు నేర్పిన మట్టితల్లీ
కేశరాజుపల్లీ..!
మళ్లీ మళ్లీ నన్ను భూమ్యాకర్షణతో
నీ దిక్కు లాక్కుని పడేయించి
గుండెలకు హత్తుకున్న మాc..!
తుజే సలామ్..!
నువ్ నేర్పిన మాటల్ ఆటపాటల్ ఈతల్ సైకిల్
దూకించిన గోడల్ ఎనుగుల్
ఎక్కించిన కొమ్మల్ దాచుకున్న రెమ్మల్
నన్ను మలిచిన పువ్వుల్ తేనెల్ ఈనెల్ దోనెల్
నన్ను తీర్చిదిద్దిన పక్షి రెక్క పుంజుకూత చేప ఈత యాపపూత
నెమలి ఈక కోయిల గొంతుక
అన్నీ.. అన్నీ.. నీ భాగ్యమేనే..
నెలవంక ఒడివే అమ్మా నువ్వు
ఆ చల్లదనం చెప్పిన కథలు
సూర్యుడి ఎండ రాయించిన చెమట చుక్కల వెతలు
అన్నీ నువ్వు చెప్పిన పాఠాలే
దోస్తానా స్వచ్ఛత.. తాజాదనం.. కలివిడుల మనిషితనం
అన్నీ నువ్వు నేర్పిన పుణ్యమే
అవన్నీ పోగొట్టుకుంటున్న మనుషుల్ని చూస్తుంటే
మనసింట్లో చింత పెరుగుతున్నదే…
స్వచ్ఛమైన నీళ్లల్ల తానాలాడిచ్చినవ్ కదా..
ఇయాల పట్నంల తాగేనీళ్లను కొనుక్కుంటున్నమే తల్లీ
చెట్లల్ల చేనుల్ల అచ్చమైన గాలితోటి సేదతీర్చేదానివి గదా
ఇక్కడ మురికి గాలిల మసిబారిపోతున్నమే
పచ్చని నేలా నీలి ఆకాశం పరిచి
సోంచాయించడం నేర్పితివి
ఇక్కడ మనసుల్ ఇరుకైపొయ్నయే
మనసంతా నువ్వే నిండి నీ కాడికొచ్చేయాలనున్నా
పట్నం జిందగీల ఇరుక్కుపోతినమ్మీ..!
నన్ను మన్నించు తల్లీ.. కేశరాజుపల్లీ!
•
మనసు మలగని రూపం-
ప్రేయసి మీద కవిత రాద్దామనుకుంటాను
లవ్ జిహాద్ జైలు ఊచ గుండెల్లో దిగుతుంది
తమ్ముడిని తలపోద్దామనుకుంటాను
అకారణ ఎన్ కౌంటర్ అయ్యే యువకుల రక్తం
కంటి మీద మడుగు కడుతుంది
ముక్క నోట్లో పెట్టబోతాను
బీఫ్ నెపంతో ముక్కలైన దేహం తలపుకొస్తుంది
లోకం తెలీని బిడ్డ గుండెలపై మారాం చేస్తుంటే
దాని రేపేమిటోనన్న భయం పెరిగి పెద్దదవుతుంది
మిత్రులు ఏదో సంబురానికి పిలుస్తారు
సామూహిక ఊచకోత తలపుకొస్తుంది
••
పచ్చని కవిత రాద్దామనుకుంటాను
చుట్టూ అడవులు తగులబెడుతున్న దృశ్యం
Add comment