తెలుపు…ముదురు గులాబీ రంగు…
గేటుకి చెరొక వైపు నాటిన బోగన్విల్లాలు పెరగడం రోజూ చూస్తున్నా, అవి ఆర్చి మీదనుండి పాకి ఒకదాన్నొకటి చేరడానికి సంవత్సరం పైనే పట్టింది. సెలవులు అయి తిరిగి వచ్చాక ప్రతిసారీ ఆశగా ఎదురుచూసే నా బాధ గమనించి చాలా తేలికగా మా తోటమాలి చెప్పాడు, “ఎందుకమ్మా ఎదురు చూస్తారు టైమ్ వచ్చినపుడు అవే కలుస్తాయి” అని. ఒక్కసారిగా ఈ ప్రపంచంలోకి లాక్కొచ్చాడు సింపుల్ గా. అతనెంత నింపాదిగా అన్నా. ..వాటి సాక్షిగా నాకున్న.జ్ఞాపకాలు బుట్టెడు.
–
రాత్రి పడుకునేముందు టెర్రస్ లో నడవడం అలవాటు.తర్వాత జర్నల్…
“కలిసి ఉండే టైమ్ దొరకడంలేదని బాధనిపించడం లేదు- కలిసి ఉండకపోవడం అలవాటవ్వాలి కదా? ఇదీ ఒకందుకు మంచిది కాదా?
నాకు తెలుసు ఆలోచిస్తే బాధనిపిస్తుందని, అందుకే ఆలోచించడం లేదు.
నాకు తెలీదు, ఈ అక్షరాలు మళ్ళీ రాయగలనా లేదా?
అక్షరాలు చాలు మైమరిచి పోయేందుకు…అని అంటే కాస్త పైత్యం అనుకుంటారు ఎవరైనా. నా మట్టుకు నాకు- స్పందన తరువాతి స్థితి, అది మాటల్లోకి కరిగిపోయే అనుభూతి, రెండూ అనుభవం అయ్యాక- మళ్లీ అవెక్కడ గడ్డ కట్టి పోతాయో అన్న జంకు తప్ప, ఇంకేం లేదు. అయినా నా పిచ్చి గానీ, అయితే మాత్రం ఏంటంట…కాకపోతే ఈ బరువు భరించ గలనో లేదో అని కాస్త భయం….ఇంతకు ముందున్న ఓపిక సహనం స్థైర్యం తగ్గుతున్నాయి. వయసైపోతోంది కదా! అందరూ అంటుంటారు, వయసుతోపాటు పరిణతి రావాలి, మనసు నిలకడగా ఉండాలి అనీ…..కానీ ఒక్కసారి నిజంగా ప్రేమించు….ప్రతి ఎమోషన్ విలువ తెలుస్తుందని అంటాను….మనసుకి వయసు ఉంటుందా? . ఇలా ఆలోచించడం ఇమ్మెచ్యుర్ అని జనం అనుకున్నా నాకు ఓ. కె.”
–
నువ్వు లేని వెలితి ఫీల్ అవట్లేదు అని చెప్పాలంటే కొంచెం ధైర్యం, ఇంకొంచెం అహం కావాలి. ఆ రెండూ నా దగ్గర లేవు, కనీసం నీ విషయం లో. దూరంగా ఉండటం, ఆలోచించకుండా ఉండగల నిశ్చింత…ఉహూ…నో వే! కానీ ఎప్పుడో చెప్పినట్లు రెసిడ్యూ ఆఫ్ లవ్ ఈస్ ఫిలాసఫీ. ఇది మాత్రం స్పష్టంగా అనుభవం లోకి వచ్చిన సత్యం.
నాకు నీతో ఉన్న బంధం beyond all this, అది నన్ను నేను చూసుకునే అద్దం లాంటిది. మన గురించి, మనుషుల గురించి, మనసుల గురించి, సాగే ప్రతి సంభాషణలో నూ నాలోని కొత్త కోణాన్ని చూపిస్తావు నువ్వు. ఎప్పుడు నీతో ఉండాలి అని బలంగా అనిపిస్తుందో, ఏదో ఒకటి జరుగుతుంది, మిగిలిన అందరిలా ప్రవాహం లో కొట్టుకు పోకుండా ఆపుతూ, నాకు సర్ది చెప్తూ, కొంచెం కొంచెంగా మెచ్యూరిటీ పెంచుతూ!
–
ఒక ఆదివారం మధ్యాహ్నపుబరువు మోయడం కష్టం. ఆ మాటకొస్తే కొన్ని కొన్ని ఆదివారాలు ఉదయంతోనే అదోరకమైన అనిశ్ఛితి మొదలౌతుంది…ఎంత అంటే….రోజువారీ పనులే నయం అనిపించేంత….
పరుగెత్తడం అలవాటైన తరువాత, ఆపడం ఎంత కష్టమో, పని లేకుండా గడవడం అంతే కష్టం. మొదట్లో బానే ఉండేది, కానీ ఇలా పిల్లలు చదువుల కోసం వెళ్లిన తరువాత, ఇంట్లో ఒంటరిగా ఉన్నరోజులు ఎక్కువైపోయాయి ఈమధ్య.
జ్ఞాపకాలు ముసురుకున్న శరత్కాలపు ఉదయం వాటి బరువు మోస్తూ, ఇంకా పక్షులు లేవని వేళ కదా అని, వేడి కాఫీ తో, నిశ్శబ్దాన్ని తాగేద్దామని కుర్చుంటానా? రెండు గుక్కలు తాగగానే …. స్వగతం మొదలు….
–
“స్థితప్రజ్ఞత రావాలంటే, పురాణాలు శాస్త్రాలు వంట బట్టించుకోవాలి, లేదా, నీతో ప్రేమలో పడితే సరిపోదూ? అంతకు మించిన స్థితి ఏముందింకా? దెప్పిపోడుపు గా అనడం లేదు- నిజం. ఎంతగా ప్రేమించకపోతే, నిన్ను ప్రేమించే వాళ్ళని, నువ్వు ప్రేమించే మనుషుల్నీ చూస్తూ, చలించని మనసుతో ఉండటం మామూలు విషయమా చెప్పు? కాకపోతే, అంతో ఇంతో ఈ విషయం అనుభవం అయి ఉన్నాను కనుక, మనసు అంతగా ఇబ్బంది పెట్టదు. చూసావా! ఇంత అన్ కండిషనల్ గా నిన్నెవరైనా ప్రేమించగలరా?
–
మన జీవితంలోని ప్రతి బంధం పిల్లలకి జన్మనివ్వడం లాంటిదేనేమో. కన్సీవ్ అయినప్పుడు అపురూపంగా చూస్తాం, తర్వాత ప్రొటెక్టెడ్ గా పెంచుతాం, నాకు మాత్రమే సొంతం అనుకుంటాం, బాధపడతాం. పిల్లల విషయంలో రెక్కలు వచ్చి ఎగిరిపోయారు అని సర్ది చెప్పుకోకండా ఉంటే కష్టం. కావాలంటే ఉన్నామన్న భరోసా తప్ప అక్కరలేనంత గా వాళ్ళ వెంట పడకూడదు. బంధాలు బరువైపోతాయి. ప్రపంచంలో ప్రతి ప్రాణీ ఏ బరువు ఎక్కువ రోజులు మోయాలి అనుకుంటుందా, ఎంత ఇష్టమయిన కూడా!
కానీ….
ఇంతటి హడావిడి నిండిన జీవితాల్లో, హఠాత్తుగా చల్లబడి వర్షం కురిసిన వేళ నో, రాత్రి ప్రపంచం అంతా సద్దుమణిగిన తరువాత నిద్ర రాకుండా తెలీని అలజడి అనిపించినప్పుడో ….మనలోకి మనం చూసుకున్నప్పుడో….ఎప్పుడో ఒకసారి కలవరం.. ఏ ఒక్కరి పరిచయం కారణం లేకుండా జరగదు, ఎంత వరకు మన పాత్ర, ఎంత వరకు వాళ్ళ పాత్ర, పూర్తయ్యాక తెర వెనుకకు వెళ్ళాలి కానీ, స్టేజి మీద ఉండ గలమా…కాదు కూడదు నేనుంటా అంటే నాటకాల్లో ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో….జీవితమైనా అంతే! ఎలా తెలుసుకోవడం…
Isn’t it better to sit in the last row and watch the play….
And be there if needed!
“….తేరే బిన్ ఏక్ దిన్ జైసే సౌ సాల్ హై
తుంహారీ తస్వీర్ కే సహారే మౌ సం కయీ గుజారే…”
అర్జిత్ సింగ్ గొంతు…వినిపిస్తోంది…తడిగా..
బయట వర్షం….మెల్లగా పెద్దదౌతూ…..
“When the time comes…….”
My gardener is right!
*. *. *
Add comment