నన్నావహించి పిచ్చివాణ్ణి చేసిన విశాఖ: గొరుసు

ఎనిమిదేళ్ల వయసు నుండి దాదాపు 20 ఏళ్లపాటు విశాఖ వెళ్లినప్పుడల్లా ఆ పరిసరాల్లో, అక్కడి మనుషుల్లో వచ్చిన మార్పుని, ముఖ్యంగా విశాఖ యాసని గమనించేవాణ్ణి.

డ్డీల వ్యాపారంలో చితికిపోయిన జీవితాలు…

పాతికేళ్ల కాలంలో మారుతూ వచ్చిన విశాఖనూ…

కథా పరిధిలోకి తీసుకుని అల్లిన కథ వాల్తేరత్త…..

***
తెలుగు కథా సాహిత్యంలో పరిచయం అక్కర్లేని పేరు గొరుసు జగదీశ్వర్. వలస పక్షులు, బతుకు గోస, గజఈతరాలు, జగదాంబ జంక్షన్, జలగల వార్డు, చీడ, ఉసుళ్లు….లాంటి కథలతో రచయితగా తన స్థానం సుస్థిరం చేసుకున్నారు. రాశి కన్నా వాసి ముఖ్యం అని నమ్మే కథకుడు.  రాసింది చాలా తక్కువ కథలే ఐనా…ఆయన కథలు పాఠకులపై గాఢమైన ముద్ర వేశాయి. ఆయన పేరు వినగానే వినిపించే కథ గజ ఈతరాలు.  గ్లోబలైజేషన్ కాలంలో చితికిపోయిన పూర్ణమ్మ లాంటి అనేక మంది జీవితాలను…మానవీయ కోణంలోంచి కథలుగా మలిచిన చిత్రకారుడు గొరుసు. కథకుడిగానే కాకుండా….కొత్తతరం కథకులను ప్రోత్సహిస్తూ, సూచనలిస్తూ తెలుగు కథకు కొత్త రక్తం ఎక్కించడానికిక నిరంతరం తపన పడుతుంటారు. ఒక్కముక్కలో తెలుగు కథా సాహిత్యంలో అందరి బంధువు…… గొరుసు.

మర్చిపోలేని కథానుభవం కోసం వాల్తేరత్త కథ వెనుక అనుభవాన్ని సారంగ పాఠకులకోసం పంచుకున్నారు.

మొదట వాల్తేరత్త కథ చదవండి

                                                                                                                            ***

నేను ” వాల్తేరత్త ”  కథ రాసేనాటికి ‘విశాఖపట్నం’ అంటే నాకు విపరీతమైన ఇష్టం, ప్రేమ, పిచ్చి, మైకం, మోజు … ఇన్ని మాటలెందుగ్గాని, ఆ ఊరి యాసలో కాస్తా మొరటుగా చెప్పాలంటే ‘సెడ్డ రోకు’. చలంగారి లాంటి మహానుభావుడినే కుదిపి కుదిపి వెర్రివాణ్ణి చేసిన సౌందర్యం అది.

నేనేపాటి … పిపీలికాన్ని!

సరే, ఇంతకూ, ఇంతగా విశాఖ నన్నెందుకు ఆవహించిందంటారా?! –

ఏం చెప్పాలి? – అమ్మ కడుపులో నుంచి బాహ్య ప్రపంచంలోకి రాగానే విశాఖ మట్టిని ముద్దాడినందుకా? మా బంధుజనుల పటాలం ఆ ఊరి నిండా ఉన్నందుకా? ఆకాశానికెగబాకిన యారాడకొండా? దిగంతాలను చుంబించే సముద్రమా? భీమ్లీ నరసింహాస్వామా? సింహాచలం సంపెంగలా? సిమ్మాద్రి అప్పన్నా? కనకమాలచ్చిమా? సొర్రపిట్టు రుచా? కర్రపెండలం దుంపా? పూర్ణా మార్కెట్టా? ఎల్లమ్మతోటా? చావుల మదుఁవా? షిప్పియార్డా? కాల్టెక్సా? ఆంధ్రా యూనివర్సిటీయా? శాంతాశ్రమమా? గవర్నర్‌ బంగ్లానా? ఆశీలుమెట్ట జంక్షనా? సెంట్రల్‌ జైలా? ఎర్రమట్టి దిబ్బలా? సీతమ్మధారా? కెజీహెచ్చా? కలెక్టరాఫీసా? భీమ్లీ డచ్చీ స్తూపాలా? ముడసల్లోవ అందాలా? అరకులోయలో రైలు ప్రయాణమా? రిషికొండా? తొట్లకొండా? భీమ్లీ బీచ్‌ రోడ్డా? కైౖలాసగిరా? లేక .. రావిశాస్త్రి, శ్రీశ్రీ, ఆరుద్రలు దోగాడిన నేలా?

ఏది.. ఏదని చెప్పాలి? ఎవరని చెప్పాలి? పెగ్గు పెగ్గుకీ నిషా అంచెలంచెలుగా నషాళానికెక్కినట్టు… వెళ్లిన ప్రతిసారీ ఒక్కక్కటీగా నన్నావహించి పిచ్చివాణ్ణి చేసిన విశాఖ అది. అమ్మో! అది అందమా? కళ్లు చిట్లిపోయి, గుండె పిట్లిపోయే సౌందర్యం. దాన్ని భరించాలంటే మనిషన్నవాడికి మనసుండకూడదు. ఉన్నా దానికి విశ్వమంత కళాపోసనుండాలి? నక్షత్ర మండలానికి రెట్టింపు కళ్లుండాలి! యారాడ కొండంత గుండె నిబ్బరం కావాలి!!

ఉమా (ఆర్‌.ఎం.) హైద్రాబాద్‌ ‘ఆంధ్రజ్యోతి ఆదివారం’ మాగజైన్‌కి ఇన్‌ఛార్జ్‌గా పనిచేసే రోజుల్లో బతిమాలి, బామాలి, తిట్టి, గిల్లి, కసిరి, కొట్టేంత పనిచేసి కొందరితో కథలు రాయించినట్టే నా చేత కూడా ‘వాచ్‌మెన్‌’, ‘జలగలవార్డు’, ‘గజ ఈతరాలు’ లాంటి రెండు, మూడు కథలు రాయించి, హఠాత్తుగా బదిలీ చేయించుకుని 1999 – 2000 ప్రాంతాల్లో తిరుపతి వెళ్లిపోయాడు. తర్వాత ఆ స్థానం లో  తాత్కాలికంగా   మిత్రుడు పారుపల్లి శ్రీధర్‌  నియామకమై నన్నో కథ రాసిమ్మని అడిగారు. అప్పటికే నాలో సంవత్సరాలుగా నలుగుతున్న ‘వాల్తేరత్త’ కథకి శ్రీకారం చుట్టాల్సి వచ్చింది.

ఈ కథానేపథ్యం చెప్పాలంటే కాలయంత్రంలో ముల్లుని నాలుగు దశాబ్దాలు వెనక్కి తిప్పాలి. డాగులు పడి, మసకబారిన నా బాల్యపు అద్దాన్ని తళతళ మెరిసేలా రుద్దాలి.

నాకు ఊహ తెలిసింది పాలమూరులో. నాన్న ఉద్యోగరీత్యా మేమంతా మహబూబ్‌నగర్‌ టౌన్లో ఉండేవాళ్లం. అప్పటికి ప్రతి మనిషికి ఒక స్వంత ఊరనేది ఒకటుంటుందనే విషయం కూడా తెలీదు నాకు. ఎనిమిదేళ్ల వయసప్పుడు వేసవి సెలవులకి (1967 – 68) తొలిసారి అమ్మ, అన్నయ్యలతో కలిసి ఇప్పట్లా 12 గంటల్లో కాదు, దాదాపు రెండు రోజులు ప్రయాణం చేసి విశాఖపట్నం వెళ్లాను. అక్కడకి వెళ్లాకే తెలిసింది.. మా అమ్మానాన్నల స్వంత ఊరు విశాఖపట్నం అని.

అక్కడి మా బంధువర్గాన్ని చూసి అదిరిపోయాను. అమ్మమ్మ, తాత, పెద్దమ్మలు, పిన్నమ్మలు, అత్తలు, మేనమామలు, చిన్నాన్నలు, పెదనాన్నలు, బావలు, బామ్మరుదులు, మరదళ్లు, వదినలు… వాళ్ల పిల్లలూ, జల్లలూ అబ్బో… అప్పటికే వందమందికి పైగా ఉంది పటాలం. ఒక పిన్ని మద్దిలిపాలెంలో ఉంటే, ఒక మామయ్య రేసవానిపాలెంలో, పెద్దమ్మ భీమ్లీలో, మిగతా మరికొందరు ఇసకతోట పరిసర ప్రాంతాల్లోనే ఉండేవారు. నాన్న తరపువాళ్లంతా తగరపువలస దగ్గర్లో ఉన్న అమనాంలో. ఎవరి కుటుంబం వాళ్లదే. అమ్మమ్మ తాతలు మా చిన్న మేనమామ ఇంట్లో ఉండేవారు. ఆ పక్కనే మరో ఇంట్లో మా పిన్ని ఎల్లయ్యమ్మ (ఆవిడే ఈ కథకి మూలం ) తన ఆరుమంది సంతానంతో ఉండేది. చినాన్న పోర్టు ఉద్యోగి. మిగతా బంధువుల్లో ఎవరెవరు ఏ ఏ వరస అవుతారో మొదట్లో అంతా గందరగోళంగా ఉండేది. అప్పట్లో తాత, వాళ్ల ఇంటికి కూతవేటు దూరంలో ఉండే పొలాన్ని (ప్రస్తుతం కృష్ణా కాలేజీ ఏరియా) కౌలుకి తీసుకుని గంట్లూ (సజ్జలు), సోళ్లూ (రాగులు) చిలగడదుంపలూ పండించేవాడు.

ఒకటి రెండుసార్లు వేసవి సెలవుల్లో విశాఖపట్నం వెళ్లి రావడంతో వాళ్లంతా నాకేమవుతారో కొద్దికొద్దిగా బోధపడింది. విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే పల్లెల్లో మరికొంతమంది బంధువులు కూడా ఉన్నారని తెలిసింది. ఎప్పుడు విశాఖ వెళ్లినా మా పెద్దమ్మ వాళ్ల ఇంటికి భీమునిపట్నం (భీమ్లీ) మాత్రం తప్పకుండా వెళ్లేవాళ్లం. ఆ ఊరిని పహరా కాస్తూ ఉండే నిలువెత్తు గంటస్తంభం, ఆకాశాన్నంటే రావిచెట్లతో  భీమ్లీ ఒక ద్వీపకల్పంలా … మా పెద్దమ్మ వాళ్ల ఇంటి నుండి చూస్తే మూడు వైపులా సముద్రమే కనిపించేది. కుంభకర్ణుడి ఉచ్వాస నిశ్వాసాల్లా దాని హోరు మాత్రం ఆగకుండా చెపుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉండేది.
అప్పటికి సాహిత్యం గురించి నాకు ఓనమాలు తెలీకపోయినా, భీమ్లీలో రచయిత్రి ద్వివేదుల విశాలాక్షిగారి ఇల్లు కెరటాలని తాకుతూ ఉండేదని, వాళ్లింట్లో పనిచేసే ఆవిడ మా పెద్దమ్మ ఇంటి పక్కనే ఉండేదని చెప్పుకునేవారు. ‘రచయిత్రి అంటే ఏంటని’ అడిగేవాణ్ణి మా పెద్దమ్మ కూతుళ్లని. ‘కథలు రాస్తార్రా …‘ రెండు కుటుంబాల కథ’ సినిమా చూశావా? దాని మూల కథ (‘వారధి’ నవల) విశాలాక్షిగారు రాసిందే. పైగా ఆవిడ షావుకారు జానకిగారికి వియ్యపురాలని కూడా చెప్పారు. ఆ వయసులో ఆ మాటలు నాకెంతపూర్తి అర్థమయ్యేవో గానీ ‘ఒహో’ అని తలూపేవాణ్ణి.

ముందే చెప్పినట్టు ఇక ఈ కథలోని వరాలమ్మకి ప్రేరణ మాత్రం మా ఎల్లయ్యమ్మ పిన్నే. చిన్నాన్న తను సంపాదించిన జీతం డబ్బులన్నీ పేకాటలో పెట్టేసేవాడు. తప్పని పరిస్థితుల్లో సంసారాన్ని తన భుజాలపై వేసుకుని ఒకవైపు బడ్డీకొట్టు నడుపుతూ, మరోవైపు వడ్డీలకు తిప్పుతూ నెట్టుకొచ్చేది పిన్ని.

విశాఖలో నేనుండే ఆ వేసవి సెలవుల కాలంలో పిన్నిని గమనించేవాడిని. ఇంట్లో పెద్ద పెద్ద ట్రంకు పెట్టెలుండేవి. వాటినిండా కుదవ బెట్టిన సామానుండేది. వాచీలు, రేడియోలు, ఇత్తడి గిన్నెలతోపాటు చెవికమ్మలు, ముక్కుపుడకలు, పుస్తెలతాళ్లు, పట్టగొలుసులు, గాజులు ..  ఉంగరాల్లాంటి నగలైతే సర్వసాధారణం. ఆమె దగ్గర చిత్రగుప్తుడి చిట్టాలాంటి పెద్ద రిజిస్టరు ఒకటుండేది. ఎవరెవరికి ఎంతెంత డబ్బు ఇచ్చింది? ఎంత వడ్డీ? వాళ్లు కుదవపెట్టిన వస్తువుల లెక్కలన్నీ తేదీతో పాటు అందులో రాసేది. వాళ్లిచ్చిన వస్తువుకు పూర్తి వివరాలు రాసిన ఒక కాగితాన్ని మడిచి ‘టాగ్‌’లా కట్టేది.

ప్రతిరోజూ సూర్యోదయం కాకముందే ఒకరో ఇద్దరో ఇంటిముందు నిద్రకళ్లతో ఏదో ఒక వస్తువుతో డబ్బు కోసం రెడీగా నిల్చుని ఉండేవారు. ఎక్కువగా రెల్లి, బెస్త .. రకరకాల చిల్లర వ్యాపారాలు చేసేవారే. తరచూ డబ్బు అవసరం ఉండేది వాళ్లకి. పిన్నికి తోడుగా మా అమ్మమ్మ సపోర్టు. ఒక్కోసారి ఇద్దరూ కలిసి జమిలిగా వడ్డీ వ్యాపారం చేసేవారు. పిన్ని వాళ్ల పెద్దబ్బాయిని వడ్డీ వసూళ్లకు పంపేది. వసూలు చేసిన డబ్బులతో వాడు సినిమాలు, షికార్లు చేసేవాడు. ఒక్కోసారి కుదవ పెట్టిన నగలను అమ్మేసి, ఆ డబ్బుతో రాజమండ్రి పారిపోయి జల్సా చేసి వచ్చేవాడు.

మరో పిన్ని మద్దిలిపాలెంలో ఉండేది కాబట్టి ఈ కథలోని పరిసరాలకు ఆమె ఇంటిని వాడుకున్నాను. ఆ చిన్నాన్న మాత్రం తాగడంలో ‘దేవదాసు’ బ్రదరే! కథలో సౌలభ్యం కోసం పేకాట చిన్నాన్నని తాగుబోతుగా మార్చేశాను. నా పాత్రని కథలో ఇంట్లో అద్దెకున్న వారి అబ్బాయి రమణగా, వరాలమ్మ రోజువారి దినచర్యను గమనిస్తున్నట్టుగా రాస్తూ కథను అల్లుకున్నాను.

నా ఎనిమిదేళ్ల వయసు నుండి దాదాపు 20 ఏళ్లపాటు విశాఖ వెళ్లినప్పుడల్లా ఆ పరిసరాల్లో, అక్కడి మనుషుల్లో వచ్చిన మార్పుని, ముఖ్యంగా విశాఖ యాసని గమనించేవాణ్ణి. నేను తొలిసారి వెళ్లినప్పుడు ఊరు మొత్తానికి పదిలోపు సినిమాహాళ్లు మాత్రమే ఉండేవి. ప్రభాత్‌, రామకృష్ణ, సరస్వతి, లీలామహల్‌, అలంకార్‌, పూర్ణ, నవరంగ్‌, చిత్రాలయ. అ తర్వాత ‘జగదాంబ’తో పాటు మరెన్నో వెలిశాయి. ఇసకతోట పక్కనే ఇప్పుడున్న ఎం.వి.పి. కోలనీ అప్పట్లో జీడి, జామ తోటలతో రెల్లి వాళ్ల పరిరక్షణలో ఉండేది. మా అమ్మమ్మ వాళ్ల మేడమీదనుండి చూస్తే పెదవాల్తేరు మీదుగా సముద్రపు నీలపు రాశి దర్శనమిచ్చేది. బీచ్‌కు వెళ్లాలంటే శివాజీపాలెం తాటిపెండలం ఇరుకు దారిలోంచి బిక్కుబిక్కుమంటూ భయంభయంగా వెళ్లేవాళ్లం. అంత నిర్మానుష్యంగా, కీచురాళ్ల రొద తో ఉండే నిర్జన ప్రదేశం మార్గం అది.

భీమ్లీలో ఉన్నప్పుడంతా పెద్దమ్మకు తోడుగా చేపల మార్కెట్ వెళ్లేవాడిని. రంగురంగుల పీతలు, రకరకాల చేపలు… ఇసకతోటలో  కూడా సాయంత్రం అవగానే విధిగా చేపల మార్కెట్టుకి ఆడవాళ్లంతా వెళ్లడం, వాళ్లని నేను ఫాలో అవడం. చేపలమ్మే స్త్రీల హావభావాల్ని పరిశీలించడంలో గొప్ప సరదాగా ఉండేది. మాటలోని యాస, అందులోని సాగతీతతో పాటు వారి ‘మ్యానరిజం’ నన్ను సూదంటు రాయిలా ఆకర్షించేవి. అన్నట్టు చేపల్లో అన్ని రకాలుంటాయిని కూడా అప్పుడే తెలిసింది.

మా పిన్ని వాళ్ల పిల్లలతో పాటు జీడి తోటల్లో కాయల దొంగతనానికి వెళ్లడం, జీడి పిక్కలు ఏరుకుని రావడం, వాటిని కాల్చడం, రెల్లి వాళ్లతో తిట్లు తినడం… ఆ బాల్యాన్ని కూడా కథలో వాడుకున్నాను. విశాఖ అనగానే సింహాచలం సంపెంగల పరిమళం… వాటికి భిన్నంగా ఉండే చేపల నీచు వాసన. ఎర్రటి మట్టి దిబ్బలు… అనంత జలరాశి …. లంగరేసిన పెద్ద పెద్ద ఓడలు, పచ్చదనంతో మెరిస్తూ విశాఖకు ఒకవైపున బారులు తీరిన కొండలు… అలా ఒకటీ ఒకటీ నా మస్తిష్కం లో నిక్షిప్తమై పోయాయి. పిన్ని వడ్డీ వ్యాపారాన్ని కేంద్రంగా కథ అల్లుకుని, విశాఖ సౌందర్యాన్ని నాకు చేతనైనంత లో కథలో నిబిడీకృతం చేశాను.

కాలక్రమంలో మా పిన్ని వడ్డీ వ్యాపారం చేసి, చీటీలు వేసి తన ఆరుగురి పిల్లల్ని ప్రయోజకుల్ని చేసింది. అందరికీ పెళ్లిళ్లు చేసింది. మునిమనవల్ని కూడా ఎత్తుకుంది. ఆమె బతుక్కే కాదు, ఎందరో బతుక్కి వడ్డీ వ్యాపారం ఆసరా అవుతున్నా దానివల్ల నష్టపోయినవాళ్లూ ఉన్నారు. చీటీలు పాడేసుకున్నాక పారిపోయేవాళ్లు, ఆ డబ్బులు కట్టడానికి నగా, నట్రా, ఇల్లు, పొల్లు అమ్ము కున్నవాళ్లను కూడా చూశాను. డబ్బు మూలంగా సొంతవాళ్లతో పేచీలు, తిట్లు, గొడవలూ, కొట్టుకోవడాలూ చూశాను. ముఖ్యంగా భర్తల బాధ్యతారాహిత్యం ఆయా కుటుంబాలని ఎలా అతలాకుతలం చేస్తుందో చెప్పే ప్రయత్నంతో పాటు, వడ్డీల వ్యాపారంలో చితికిపోయిన జీవితాలు, పాతికేళ్ల కాలంలో మారుతూ వచ్చిన విశాఖనూ కథాపరిధిలోకి తీసుకుని అల్లిన కథ వాల్తేరత్త.

చివర్లో వరాలత్త కొడుకు నగలు తీసుకుని పారిపోయినట్టు… వాడికోసం ఆమె నిరీక్షణ .. వాడొస్తాడనే తపన మాతృ ప్రేమకు పరాకాష్ట గా, కథకు కొంత నాటకీయత అద్దాలి కాబట్టి జోడించక తప్పలేదు.

నాన్న మహబూబ్‌ నగర్‌ (అమ్రాబాద్‌)లో రిటైర్డ్‌ అయ్యాక, భూమి గుండ్రంగా ఉందని నిరూపిస్తూ తిరిగి విశాఖ వెళ్లి అమ్మమ్మ వాళ్ళు మా అమ్మకు పసుపు కుంకుమ కింద ఇచ్చిన స్థలంలో ఇల్లు కట్టుకున్నారు. ఎప్పుడో యాభైల తొలినాట నిజాం పాలన పోలీసు శాఖలో ఉద్యోగిగా చేరిన నాన్న, తెలంగాణ ప్రాంతంలోనే పూర్తి జీవితాన్ని గడిపి, మా అన్నదమ్ములిద్దరికీ ఒక దారి చూపించి, అవసానంలో వానప్రస్థంగా వెనక్కి విశాఖ చేరిపోయారు. కట్టుకున్న ఇంట్లో పట్టుమని పదేళ్లయినా తృప్తిగా జీవించకుండా కాటికి తరలి, కాష్టమై కడలిలో కరిగి, గాలిలో కలిసి కనుమరుగయ్యాడు నాన్న. ఆయన్ని వెతుక్కుంటూ అమ్మకూడా మరో మూడేళ్లకు …
ఒకప్పుడు తన సౌందర్యంతో నన్ను పిచ్చెక్కించి మత్తెక్కించి మరులు గొలిపిన విశాఖ అంటే ఇప్పుడు నాకు ఆనాటి మోజూ లేదు, ఎలాంటి రోకూ లేదు!!

*

గొరుసు

కథల ఆనుపానులన్నీ తెలిసి, కలం మాత్రం విప్పని పిసినిగొట్టు గొరుసు. తెలుగు కథా సాహిత్యానికి walking encyclopedia.

23 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • రచనా నేపధ్యమే ఒక కథలా సాగింది. మీ విశాఖ అనుబంధం చదువుతుంటే బెజవాడతో నా అనుబంధం కళ్ళముందు కదలాడింది. విశాఖ మీద మోజుతో పాటుకథలు రాయడం ఆపేయడమే బాలేదు.

    • నిజమే సార్. ఇన్ని మంచి కథలు రాసిన గొరుసు గారు కథలు ఆపేయడం ఏమీ బాగాలేదు. మీ స్పందనకు ధన్యవాదాలు

  • విశాఖ లో పుట్టి పెరిగిన నాకు గొరుసు గారు విశాఖ ని వర్ణించినట్టుగా (నేను 6 సంవత్సరాలు చదివిన ఆంధ్ర విశ్వవిద్యాలయం పక్కన ఉన్న చిన్న వాల్తేర్, పెద్ద వాల్తేర్ ల గురించి చెప్పలేదని కొంత బాధ వేసింది) మిగతా అన్నీ చక్కగా చెప్పారు, రావి శాస్త్రి గారి గురించి మాట్లాడినప్పుడు ఆయనతో స్నేహంగా ఉండే సంకు పాపారావు బావ్, ఆయన విశాఖ యాసలో చెప్పే కబుర్లు (1960 లలో) విశాఖ కు గొప్ప అందం కలిగించేవి. రాసిన గోరుసు గారికి పరిచయం చేసిన చందు తులసి గారికి అభినందనలు .

    చాత్రి బావ్ సెప్పినట్టు మా వొయజోగ్ ఎప్పుడూ కొత్తగానే ఉంటాది.

    • విశాఖ తో అనుబంధం ఉన్న మీరంతా అదృష్టవంతులు సార్. జీవితానికి సరిపడా జ్ఞాపకాలు పోగేసుకున్నారు.
      మీ స్పందనకు ధన్యవాదాలు

  • కథ పుట్టిన గొంతుక ఎప్పుడు చిలవలు పలవలుగానే, దాగిదాగకుకుండా, ఎద లొతుల్లో సుళ్లు తిరిగి ఉంటుంది. గొరుసుగారిలో వాల్తేరు అత్త కథ జన్మించిన నేపథ్యం నిండా ఓ పెద్ద ప్రపంచమే దాగుంది. ఆ ప్రపంచంలో అనుభవాల ముళ్లు, పరిధులు దాటిన, దాటలేని మనుషుల జీవన సంవేదనలు వంటివి ఎన్నో… … వాటిలోంచి కథను ఏరుకోవడం, ఎన్నుకోవటం, కథగా మలచడంలోని గొరుసుగారి సృజనకు… ఏం చెప్పగలం… అంతే…

    • బాగుంది మీ కథ వెనుకఆసక్తికరమైన కథ. రోకు అనే పదం నేర్చుకున్నా

      • రోకు అంటే విపరీతమైన మోజు అని “నిందార్థం”లో వాడతారు మేడం. కొందరుకి అది తిట్టు మరికొందరికి బూతు 🙂

      • తెలంగాణ లో ఇలాందిదే పా…వురం అని ఒక పదం ఉంటుంది మేడం. ఇష్టం , ప్రేమ అనే అర్థంలో వాడుతాము.
        ఇలా ఎన్ని పదాలు అంతరించి పోతున్నాయో.
        మీ స్పందనకు ధన్యవాదాలు మేడం

    • ఒక నవల సరిపోయేంత వస్తువును అద్భుతమైన కథగా మలిచిన గొరుసు గారు మీరన్నట్టు గొప్ప సృజనశీలి

  • “వాల్తేరత్త’కి రెండో స్థానం ఇఛ్చినా….నా మెదడుకి, మనసుకి దాని స్థానం ఎప్పటికీ మొదటిదే.
    మొట్టమొదటి సారి చదివినప్పుడే “వరాలత్త’కి సొంతం అయిపోయాను. ఆ భాషకి, యాసకి, కట్టుకీ, బొట్టుకీ ఆఖరికి ఆమెకీ కట్టుబడిపోయాననిపించింది.
    అత్తని చూడడానికి వెళ్లిన గొరుసు సార్ సారీ రమణ బాబుకి మనుషులంటే ప్రేమ. వారిని గమనించడమంటే ప్రేమ. వారిని ఆకళింపు చేసుకోడమంటే ప్రేమ. వారిని ఆవహించుకోవడం అంటే ప్రేమ. వారిని ఆవాహన చేసుకోవడం అంటే ప్రేమ. ఆ నీలిసముద్రపు కెరటాలంత ప్రేమని పొందిన వాల్తేరత్త ఎంతో పుణ్యం చేసుకునుంటుంది.
    అలాంటి అత్తనో, మామనో, మరదలినో మళ్ళీ మనకందిస్తే మరొకసారి ప్రేమలో పడాలని ఉంది.

    • ఔను సార్. గొరుసు గారి కథలన్నీ దేనికదే గొప్పగా ఉంటాయి.
      పూర్ణమ్మ కానీ, జలగల వార్డు, జగదాంబ జంక్షన్, బతుకు గోస, చీడ…. ఏదీ మర్చిపోలేం

  • చాన్నాళ్లకి కేజీఎచ్ అప్పు ఎక్కించి, కాలేజీ డౌను దింపీసారు. స్వంత ఊరిపై మమకారం, తీపి అందరికీ ఉండేవే. తీరా ఇప్పుడు అక్కడికి వెళ్తే ఎదురయ్యే అనుభవం, చేదుగా ఉంటుంది. ఆనాటి మాధుర్యం, మనం మన గతానికి ఆపాదించుకున్నదే అని తెలిసివస్తుంది. ముఖ్యంగా ఆ మనుషులూ ఉండరు, ఆ గుర్తులూ మిగలవు; ఙ్ఞాపకాలుగా మన లోలోపలే ఉండిపోతాయి. వాటిని అక్కడ పదిలపరచుకోవడమే ఉత్తమం. గొప్ప కథ. మళ్లీ చదివించినందుకు, గొరుసుకీ, చందుకీ ధన్యవాదాలు!

    • గతం ఎప్పటికీ తిరిగి రాదు కనుక…. గొప్పగా అనిపిస్తుందేమో సార్. ఆశ్చర్యం ఏమంటే ఇప్పుడు నచ్చని వర్తమానం గతం అయ్యాక ….ఎంత బాగుందో అనిపిస్తుంది. ఊరగాయ రుచిలా అనుభవాలు కూడా కొంతకాలం ఊరబెట్టాలి అనుకుంటాను..

      మీ స్పందనకు ధన్యవాదాలు

  • వాల్తేరత్త కళ్ళముందుంది. చదవటం పూర్తయ్యే సరికి బరువుగా అనిపించింది. తెలిసిన మనిషిని మళ్లీ చూసినట్టనిపించింది. ఎంత బాగా రాసారు. చాలా బావుంది. చందూకి, గొరుసు గారికి థాంక్స్.

    (ఫేస్బుక్ అలవాటులో ఇక్కడ కూడా లవ్వు symbol వెతుక్కున్నా. Katha నేపథ్యం.. అందులో Visakha, సముద్రం గురించి భలే రాశారు. నేను చూసిన రెండు మూడు సార్లు ఇలాగే అద్భుతంగా అనిపించింది. )

    • సముద్రం నిద్ర పోనివ్వదు కదా భయ్యా
      ❤️❤️❤️❤️

      • 🙂
        అవును.
        నిద్రపోదు, పోనివ్వదు కదా..
        నువ్వూ మొన్నే చూసొచ్చావుగా..!!

  • అప్పుడెప్పుడో చదువుతున్నప్పుడు ‘వాల్తేరత్త’ ఎంత ఏడిపించిందో, ఇప్పుడు ‘తల్లిపేగు ఆర్తనాదం’ అంతకు రెట్టింపు ఏడిపించి వదిలిపెట్టింది నన్ను. నేను పెరిగి పెద్దైన విశాఖపట్నం…నేను పిచ్చిగా ప్రేమించే విశాఖపట్నం…ఇప్పటికీ కలల్లోకి వచ్చి మెలుకువ వచ్చాక మళ్ళీ నిద్రపోనివ్వని విశాఖపట్నం…నాకళ్ళ ముందే…చూస్తుండగానే…పాతిక, ముప్పై ఏళ్ళలోనే, కరిగి, నీరై పక్కనే ఉన్న బంగాళాఖాతంలో ఆనవాలులేకుండా కలిసిపోయిన అరవై, డెబ్బైలనాటి అందమైన అమాయకమైన విశాఖపట్నం…a breath taking bucolic beauty మాఊరు ఆరోజుల్లో…దాన్ని ఇన్నాళ్ళ తరవాత, ‘గొరుసు’ నా కళ్ళకి సినిమా చూపించినట్టు చూపిస్తూ, దానికి ‘తల్లిపేగు ఆర్తనాదం’ అన్న పేరు కూడా పెట్టి, నాతో శోకాలు పెట్టిస్తుంటే, చెప్పొద్దూ అతనిమీద మా చెడ్డకోపం వచ్చింది. అంతకంటే ఇంకా ఎక్కువ కోపం ఎందుకొచ్చిందంటే, అద్భుతంగా రాయగలిగి కూడా రాయకుండా అతని చేతులు అతనే కట్టేసుకొని కూర్చున్నందుకు. ఇలాంటిదో, ‘వలసపక్షులు’ లాంటిదో మరో మంచి కథ ‘గొరుసు’ మళ్ళీ త్వరలో రాయాలని కోరుకుంటూ

    • ఇంతమంది పాఠకులు అడిగినందుకైనా
      గొరుసు గారు ఒక కథ రాస్తే బాగుంటుంది

  • ఎప్పుడూ నేను చూడని విశాఖ తీరంలో ఇప్పుడే వ్యాహాళికి వెళ్ళి తిరిగి వచ్చాను… మీ అక్షరాలు పట్టుకుని. మీ సింహాచలం సంపంగెల పరిమళం… రకరకాల చేపల నీచు కలగసిన వింత వాసనేదో సోకి గుమ్మెత్తిపోయింది మనసు. అయితే… ఈ రచనతోపాటు “వాల్తేరత్త” కథను కూడా ఇక్కడ ఇచ్చి ఉంటే, ఆమె దర్శనం చేసుకుని తరించి ఉంటాను. అయినా ఫరవాలేదు. ఎక్కడున్నా వెదకి చదువుతా.

  • సారీ, వాల్తేరత్త కథ లింక్ ఇప్పుడే గమనించాను. ధన్యవాదాలు.

  • గొరుసు జగదీశ్వర్ గారి ప్రతికథా సమాజంలోని ఏదోవొక సందర్భంలో జరిగే జీవన పోరాటాన్ని వాస్తవికంగా, ప్రతిభావంతంగా చిత్రించేదే. ఆయన కథలు పాఠకులను చాలాకాలం వెంటాడుతాయి. అలాంటి ఒక కథే వాల్తేరత్త. ఈ కథా నేపథ్యం గురించి జగదీశ్వర్ గారు రాసిన తీరే ఒక మంచి నోస్టాల్జిక్ కథ రాసినట్టుంది. ఆయన కలంనుంచి ఇంకా చాలా మంచి కథలు రావాల్సివుంది. ఆయన ఆ ప్రయత్నం తిరిగి ప్రారంభించాలని మాలాంటి సాహితీమిత్రుల కోరిక.

    • ఔను సార్.. గొరుసు గారి కలం నుంచి ఇంకా మరిన్ని కథలు రావాలని కోరుకుందాం

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు