నదిగా నీవు.. తీరంగా నేను

తెలుగు వెంకటేష్ తెలుగు కవిత్వంలో తనదైన ముద్ర వున్న కవి. మూడు దశాబ్దాలుగా నిరంతరం కవిత్వ యజ్ఞం నిష్ఠతో చేస్తున్న వాడు. “ఒక తడి..అనేక సందర్భాలు(2004)” కాలం నుండి “తూనీగతో సాయంకాలం (2021)” వరకు తనదైన సాహితీ ప్రయాణం లోని పరిణామక్రమం విశిష్టమైనది. ప్రేమ కవితలన్నీ ఒకచోట చేర్చి”నూర్జహాన్ కో ప్రేమ లేఖ” పేరుతో మరో పుస్తకం ముస్తాబవుతుంది. ‘కవిసంగమం’ వేదికగా 2016 నుండి యిప్పటి వరకు రాస్తూ వస్తున్న వందలాది కవితల్లోంచి మేలిమి వంద కవితలతో యింకో పుస్తకానికి ప్రణాళికలు వేసుకుంటున్నాడు. ఈ సందర్భంలో కవి మానవ సంబంధాలలోని సున్నితమైన అంశాన్ని వస్తువుగా స్వీకరించి రాసిన “ఏకవాక్యం” కవిత గురించి మాట్లాడుకుందాం.
*
ఏకవాక్యం 
~
ఈ మధ్య చూపులు 
చూసీ చూడనట్టు ఉంటున్నాయి 
పెదాలు తలుపులు వేసుకుని 
గొళ్ళెం పెట్టుకున్నాయి 
పక్కపక్కనే స్నేహంగా మాట్లాడుకునే 
జోళ్ళు కూడా విసిరేసినంత దూరంలో 
ఏకాకి దిగులును అనుభవిస్తున్నాయి 
కోపం బహుచెడ్డది 
మనసుల్ని దూరం చేస్తుంది 
ఫోన్ నెంబర్లు మైండులో ఉన్నా 
అస్పష్టంగా దాక్కున్నాయి 
వాన వచ్చింది వెళ్ళింది 
రెండు గొడుగులు కలిసి నడవలేదు 
క్యాంపస్ లో రాలిన పచ్చపూల మధ్య 
పూలను గాయపరచకుండా నడవడం 
నీకూ నాకూ ఎంతిష్టం 
నదిగ నీవు , తీరంగా నేను 
సాయంకాలాలు కలవడం 
ఎంతబావుండేది 
నాలో నీ బొమ్మ నిదురిస్తున్నపుడు 
ఎన్ని క్షమాపణల్ని నీ పాదాల చెంత 
రేయంతా నిలబెట్టానో….
భౌతిక మన్నింపులు
నీకు ఇష్టముండదని నాకు తెలుసు 
మౌనంగా ఉంటూ 
నిశ్శబ్దంగా మాట్లాడుకుంటోన్న సంగతి 
మన శ్వాసలకే తెలుసు 
రంగుల్లేని బొమ్మల్లా 
ఈ కొంత కాలం మసలిన మనం 
ఎంతో కొంత కొత్తగా నేర్చుకున్నాము 
దరిమిలా…
విరామ చిహ్నాల పాత్రలు 
ఇక ముగిద్దాం 
ఏకవాక్యమై దగ్గరవుదాం 
విడిపోనంతగా…
*
కొంతకాలం నుండి రాస్తున్న కవులైనా, కొత్తగా రాస్తున్న కవులైనా ఒక వస్తువును కవిత్వం చేయడానికి రకరకాల ప్రయోగాలు,  ప్రయత్నాలు చేస్తుంటారు. పదిమంది కవులు పది రకాలుగా స్పందిస్తారు. ఎవరి శైలి వారిది. ఎవరి వ్యక్తీకరణ విధానం వారిది. సీమిలీ వాడొచ్చు. మెటాఫర్ వాడొచ్చు. మెటానమీ, సినక్డకీ ఇలా రకరకాల ట్రోప్స్ వాడుతూ వస్తువును ఎలివేట్ చేయొచ్చు. మానవ గుణారోపణ ద్వారా కవిత్వం చేయొచ్చు. ఒక సందర్భాన్ని చెప్పడానికో, వాతావరణ చిత్రణ చేయడానికో ప్రతీ కవి తనదైన, అనువైన టూల్స్, టెక్నిక్స్ ను ప్రత్యేకంగా ఏర్పర్చుకుంటాడు. తెలుగు వెంకటేష్ రాసిన ‘ఏకవాక్యం’ కవిత – ఇద్దరి మధ్య వున్న స్వల్ప ఎడబాటును వస్తువుగా స్వీకరించింది. ఆ ఇద్దరు- ప్రేమికులు/జీవన సహచరులు ఎవరైనా అయి ఉండవచ్చు. స్వల్పమైన ఎడబాటుకు వారి అహం దెబ్బతినడమో, చిన్నపాటి మనస్పర్ధలో, కోపం, చికాకు, అసహనం మొ. కారణమై ఉండవచ్చు.
*
ఇద్దరు గొడవ పడ్డారనో, వారి మధ్య మాటలు లేవనో చెబితే అది సాధారణమైన వాక్యం అవుతుంది. “పెదాలు తలుపులు వేసుకుని గొళ్ళెం పెట్టుకున్నాయి” అన్నప్పుడు అదే అర్థం స్ఫురించే వాక్యం ఎంతో ఎఫెక్టివ్ గా అనిపిస్తుంది.  సాధారణ వాక్యం పలచబడి తేలికవుతుంది. అదే.. కవిత్వ వాక్యం స్థిరంగా కొంతకాలం నిలబడుతుంది. కవిని నిలబెడుతుంది. వ్యక్తుల ‘మానసిక స్థితి’ని కాళ్లకు వేసుకునే చెప్పుల ద్వారా వ్యక్తపరచడం, అవి ఏకాకి దిగులును అనుభవించడం కొత్తగా ధ్వనించింది. “వాన వచ్చింది వెళ్ళింది/రెండు గొడుగులు కలిసి నడవలేదు” అన్నప్పుడు నిజానికి గొడుగులు నడుస్తాయా? అన్న ప్రశ్న ఉదయిస్తుంది. ‘గొడుగులు’ ఎవరిని సంబోధిస్తున్నాయి? ఎడమొహం, పెడమొహంగా వున్న ఇద్దరు వ్యక్తుల్ని చూపిస్తున్నాయి. ‘వాళ్ళిద్దరు కలిసి నడవలేదు’ అని రాసి వుంటే ఇంత ప్రభావవంతంగా ఉండదు.
*
గొడవ జరగడం, ఒంటరితనాన్ని అనుభవించడం, హృదయంతో సంభాషించడం, మథనపడడం, పశ్చాత్తాపం ప్రకటించుకోవడం, గుణపాఠం నేర్చుకోవడం, సర్దుకుపోవడం, కలిసి బ్రతకడం ఇలా ఒక సీక్వెన్స్ కనిపిస్తుంది. ఎత్తుగడ, కొనసాగింపు, ముగింపుగా కవితను విభజించినప్పుడు కవికి ‘శిల్పం’ పై వున్న పట్టు ఎలాంటిదో అర్థమవుతుంది. విషయపరంగా ‘ఒకప్పుడున్న వాతావరణం ఇప్పుడు లేదు’ అని కవి చెప్పకుండానే పాఠకులు గ్రహిస్తారు,పలవరిస్తారు, “విరామ చిహ్నాల పాత్రలు ఇక ముగిద్దాం” అన్న వాక్యాన్ని తమ మనసుల్లోకి ఆవాహన చేసుకుంటారు. రాశిలోనూ, వాసిలోనూ మెరుగైన కవిత్వాన్ని రాస్తున్న కవికి శుభాకాంక్షలు.
*

బండారి రాజ్ కుమార్

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా చక్కని వివరణ, విశ్లేషణా. అయితే అచ్చతెలుగు కవితా లక్షణాలు చెప్పేందుకు..సిమిలీ, మేటఫర్ లాంటి పదాలు వాడక పోతే బావుణ్ణు…కదా.

    ఇప్పటి తరానికి తెలీదు అనుకోకూడదు. రాసిన ఆయన కవి. తన భాషలో అవి తెలుసుకున్న వాడై ఉంది తీరాలి.లేదూ…తెలుగులో చెప్తూ బ్రకెట్లలో ఆంగ్ల పదాలు ఇస్తే..కనీసం మనమైనా తెలుగు భాషా దినోత్సవం నాడు కాకుండా..కవిత్వం లో భాషని కాపాడుకోవచ్చు. నమస్కారం

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు