1
నేను నా భూమిని రచిస్తాను
నేను నా మాతృభూమిని
కవిత్వం చేయాలనుకుంటున్నాను
పదాలు కూడా భూమిగా ధ్వనించేవి కావాలి
కానీ, నేనొక రోమన్లు చెక్కిన శిల్పాన్ని
అరబ్బులు మరిచిపోయిన వాడిని
వలసవాదులు తెగిన నా చేతిని దొంగిలించి
మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టారు.
అయినాసరే
నేను నా మాతృభూమిని
కవిత్వం చేయాలనుకుంటున్నాను
అంతటా నా మాటలు వున్నాయి
నిశ్శబ్దం నా కథ
* * * * * *
2
బాంబుల వర్షం ముగిసింది
రేపు నీవెవరో ఎవరికీ తెలియదు
రక్తపాతం ముగిసింది
తిరిగి నీలో మొదలవుతుంది
భవంతులు కూలిపోయాయి
సరిహద్దు రేఖలు కాలిపోయాయి
అవి నీలో అగ్ని కీలలుగా ఎగిసిపడుతున్నాయి
రాళ్లను సైతం మింగి వేసే అగ్ని కీలలు
హతులైన వాళ్ళు నిద్రలో మునిగిపోయారు
నిద్ర నీ దరి చేరదు
మేల్కొని వుండు
విశ్రమించిన దేవుని కన్నీళ్ళుగా చెప్పే
ఈ పెద్ద రాళ్లు కూలిపోయేవరకు
క్షమించడం ఇక ముగిసిన మాట
కరుణ, సమయం వెలుపల రక్తమోడుతున్నది
ఇప్పుడు నీవెవరో ఎవరికీ తెలియదు
రేపు కూడా నీవెవరో ఎవరికీ తెలియదు
బాంబుల వర్షం కురుస్తున్న స్థలంలో
నాటబడి పెరిగిన చెట్టు వంటి వాడివి
3
శ్వాస భారంగా వుంది
నేను నా కొన ఊపిరిని చేతిలో పట్టుకుని
దెయ్యం వలె ఈ పాడుబడిన ఇళ్లలోకి ప్రవేశించినపుడు
గదుల్లోంచి దుఃఖం ప్రవహిస్తోంది
నిద్రపోవడం మేల్కొనడం శిథిలాలతోనే
ఇంతటి నిరాశామయ శూన్య భారానికి
అలవాటు పడడం
అడుగు ముందుకు వేయడం కష్టంగా వుంది
ఈ పాడుబడిన ఇళ్ళు
ఎడారులుగా మారిన ఇళ్ళు
నన్ను మరింత కుంగదీస్తున్నాయి
అరబ్బులు పర్షియన్లు బైజాన్టియన్లు
ఎవరూ నా బాధను అనుభూతి చెందలేరు
ఎన్నడూ ఏ చరిత్రా లేని వాడినా నేను
చరిత్ర దారిలో వాళ్ళని ఎక్కడ పోగొట్టుకున్నాను
ప్రపంచాన్ని ఆవిష్కరించిన పద్యాలను
ఒక్క క్షణంలో ఎక్కడ పోగొట్టుకున్నాను
మీరంతా కలిసి పక్కటెముకలు లేని
ఈ గ్రహంలో నన్ను వొదిలేశారు
ఒంటరిని చేసి వొదిలేశారు
బతుకు భారం చేసి వొదిలేశారు
నేను వెళ్ళిపోతున్నాను అని చెబితే
ఇక్కడ వినేవాళ్ళు కూడా ఎవరూ లేరు
శిథిలాల లోంచి
నా స్వరాన్ని కూడా మింగివేసే
ఒక భయానక గద్గద స్వరం తప్ప
- 1978 లో జెరూసలేం లో జన్మించిన నజ్వాన్ దార్విష్, సమకాలీన అరబ్బు కవులలో శక్తివంతమైన స్వరం. ఇప్పటిదాకా ఎనిమిది పుస్తకాలు వెలువడ్డాయి. దాదాపు 21 భాషలలో అతని రచనల అనువాదాలు వెలువడ్డాయి. అతడి కవితల ఇంగ్లీష్ అనువాదాల సంపుటి ఇటీవల Exhausted On The Cross పేరుతో వెలువడింది
- ఇంగ్లీష్ అనువాదం: కరీం జేమ్స్ అబూ జేద్ – అరబ్ సాహిత్య ప్రపంచంలో గొప్ప పేరున్న అనువాదకుడు.
(World Literature Today- Summer 2012 సంచిక నుండి ఈ కవితలను స్వీకరించడం జరిగింది
Add comment