నగ్నారణ్యం

“నేను కందులూరు లో పుట్టి ఉండక పోతే బహుశా నేను నాటకాలు చేసి వుండే వాడిని కాదేమో. ఎందుకంటె మా వూరి ప్రజలకి కోలాటం , నాటకం , డప్పు వాయిద్యం జీవన విధానంలో ఒక భాగం. కందులూరు ప్రతి ఒక్కరికి నాటకం అంటే ప్రాణం. అందుకే నేను నాటకాన్ని వృత్తిగా తీసుకున్నప్పుడు అందరిలా యెగతాళి చెయ్యకుండా నన్ను ప్రోత్సహించారు”

మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాల మధ్య ఘర్షణలో ఎప్పటికైనా పైచేయి మానవ సంబంధాల దే అన్న సందేశంతో రాసిన నేను-నాన్న-బిర్యానీ కథతో పాఠకులతో పాటూ, అటు కథకుల గుర్తింపు పొందారు ఇండ్ల చంద్ర శేఖర్.

“నేను-నాన్న- బిర్యానీ, దినం, బోర చెక్క” లాంటి దళిత నేపథ్య కథలతో పాటు రంగుల చీకటి లాంటి ప్రయోగాత్మక కథలూ రాశారు. సాక్షి దినపత్రిక నిర్వహించిన కథల పోటీల్లో “దినం”…కథ ప్రశంసాత్మక బహుమతి పొందింది. ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని కందులూరు అనే చిన్న గ్రామానికి చెందిన చంద్రశేఖర్ నాటక రంగమే జీవితం గా ఎంచుకుని అటు ఆ రంగంలోనూ, ఇటు కథా ప్రక్రియ లోనూ రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు.

ఇతివృత్తం సీరియస్ టాపిక్ ఐనా… ఆద్యంతం సెటైర్లు  వేస్తూనే…. గుండె తడిని తట్టిలేపే ముగింపుతో పాఠకుల్ని ఆలోచింపచేయడం తన కథల బలం. వర్ధమాన కథకుల్లో  ప్రామిసింగ్ రైటర్ గా గుర్తింపు తెచ్చుకుంటున్న ఇండ్ల చంద్రశేఖర్ రాసిన … “నగ్నారణ్యం” ఈ పక్షం ….సారంగ రేపటి కథ.

 

నగ్నారణ్యం

ళ్ళు మూసినా తెరిచినా కరుడుగట్టిన కారుచీకటే కనిపిస్తుంది అక్కడ. కళ్ళు తెరిచే వున్నానని నా కనిపిస్తున్నా అది నిజం అని తెలుసుకోవడానికి ఎదురుగా  ఏ ఆధారమూ కనిపించడం లేదు. ఎంత ప్రయత్నిస్తున్నా కనుచూపుమేర అనేది ఒకటుందని కూడా అర్ధం కావడం లేదు. గుడ్డి వాన్నయ్యానేమో అనిపించింది. భయమేసింది. బ్రతకాలని ఆశ కలిగింది. నేను కదిలినప్పుడల్లా ఎండిన ఆకులు కదిలిన చప్పుడు, నేను అరిసినప్పుడల్లా ధ్వని ప్రయాణిస్తున్న దూరం  స్పష్టంగా వినపడుతున్నాయి. నాలో నేనున్నానో ఆత్మనయ్యానో తెలియని పరిస్థితి. నా దగ్గర ఫోన్ ఉండాలనే విషయం గుర్తుకొచ్చి జేబిలో చెయ్యి పెట్టబోతే అది ఎండిన ఆకుల్లో దూరింది. నేను ఎండిన ఆకుల్లో సగం వరకు మునిగి వున్నానని అప్పుడే తెలిసింది.

ఫోన్ బయటకు తీశాను. టార్చ్ వేశాను. చీకటికి నెర్రి పడ్డట్టు, ఏటికి గండి కొట్టినట్టు వెలుతురు పరిగెత్తగలిగినంత దూరం పరిగెత్తి పడిపోయింది. నేను గుడ్డివాన్ని అవ్వలేదన్న ఆనందంలో వున్న నాకు చుట్టూ మ్రానులు కనిపించాయి. బలంగా, దృడంగా , భయంకరంగా బరితెగించి పెరిగిన మ్రానులు. పైకి చూస్తే ఆకుల ఆకాశం తప్ప మేఘాల జాడలు మచ్చుకకైనా కనపడలేదు. రాలిన ఆకులు చచ్చి పడిన గబ్బిలాల నదిలా వెలుతురు పడినంతమేర విస్తరించి వున్నాయ్. చుట్టూ చూస్తుంటే ఆ వెలుతురులో మ్రానుల నీడల జాడలు  ప్రాణమొచ్చిన ప్రేతాత్మల్లా వెలుతురుని వెంబడించాయి. వెలుతురు ఎంత భయంకరమైనదో అప్పుడే నాకు తెలిసింది. టార్చ్ ఆపేసాను. ఫోన్ విసిరేసాను. చీకట్లో కలిసిపోయాను. ఇక భయం కనపడదనే ధీమాలో గట్టిగా గాలి పీల్చు కున్నాను. నాలో నేను దూరమై  చావుకి సిద్దంగా వున్నాను.

ఆ ఆకుల్లో ఏమాత్రం కదలకుండా గాలి కూడా నెమ్మదిగా పీల్చుకుంటూ నిశబ్దాన్ని వింటున్న నాకు అకస్మాత్తుగా  ఆకుల్లోంచి ఏదో లేచిన చప్పుడు వినపడింది. చూద్దామంటే చుట్టూ చీకటి పరిగెడదామంటే  కనపడని దూరం. అక్కడే వుంటే ఏమవుతుందోనని భయం. ఆ చప్పుడు వస్తున్న వైపు చూడటానికి ప్రయత్నిస్తున్నాను కాని నాకేం కనపడటం లేదు. వినపడుతుంది. చెవులకు చూపొచ్చింది. ఆ ఆకులు కదిలే శబ్దం లో నాకో భయం కనపడుతుంది. గాబరా తాలూకు ఘర్షణ కనపడుతుంది. కనపడని కళ్ళల్లో కల్లోలపు అలజడి కనపడుతుంది. సహాయాన్ని అర్ధిస్తున్న శ్వాస వినపడుతుంది.

“విజ్జి ఎక్కడున్నావ్? విజ్జి నాకు భయంగా వుంది విజ్జి” వినపడింది నాకు. అది నా భార్య. విజయ్ అంటారు అందరూ  విజ్జి అంటుంది తను.

“శ్రీ నేనిక్కడున్నాను” అన్నాను ఆనందంలో .

“ఎక్కడ? నాకేం కనపడటం లేదు విజ్జి భయంగా వుంది” అంది.

“ముందుకి రా నేను వస్తున్న” అంటూ మొండిగా ముందుకి కదిలాను. ఆ చీకట్లో ముందుకు కదులుతుంటే నా చేతులకి చూపొచ్చింది పట్టుకున్న ప్రతి ఒక్కటి నాకు  తెలుస్తుంది, కొమ్మా… కాయ… ఆకు… పచ్చిది… ఎండిది… కర్రా… పుల్ల.  కాళ్ళకు చూపోచ్చింది, రాయి… రప్పా… ముళ్ళు … నీళ్ళు. నా భార్యను చేరుకున్నాను.

నా  చేతుల్లో భయం తో వణికి పోతున్న తన చేతులు తప్పించుకోవడానికి తపన పడుతున్న చేపల్లా. “విజ్జి మనమెక్కడున్నాం విజ్జి, విజ్జి భయంగా వుంది విజ్జి, విజ్జి మన బాబు ఎక్కడ ? వాడెక్కడున్నాడు?” కౌగిలించుకున్నామిద్దరం.

“శ్రీ వాడు నీతో లేడా ? వాడు నీతో వున్నాడనుకున్నాను శ్రీ.” చూపోచ్చిన నా  చేతులకి తన కళ్ళనీళ్ళు కనపడ్డాయి. “విజ్జి వాడికి చీకటంటే భయంవిజ్జి, ప్లీస్ విజ్జి వాడెక్కడున్నాడో చూడు విజ్జి, వాడు మనిద్దరి మధ్యలోనే కదా కూర్చున్నాడు? మనమిద్దరం ఇక్కడ వున్నామంటే వాడు ఇక్కడెక్కడో వుండే ఉంటాడు విజ్జి” అని “రేయ్ చిన్నా…” పెద్దగా పిలిచింది. “రేయ్ చిన్నా…. నాన్న దగ్గరకు రామ్మా…… బయపడద్దు  అమ్మా నాన్న ఇక్కడే వున్నాం,” నేను కూడా పిలిచాను. ఒకరి చేతులు ఒకరం విడవకుండా కనపడని దిక్కుల్లో మా  కొడుకు కోసం అరిసిన అరుపులకి పిలిచిన పిలుపులకి  ఆ అడవికూడా జాలిపడి మేము పిలిచినా ప్రతిసారి తిరిగి పిలవడం  మొదలు పెట్టింది. అది నాకు స్పష్టంగా వినిపించింది.

కటిక చీకటి కనిపిస్తే రాత్రయినట్టు. మసక మసక చీకటి మాత్రమె వస్తే తెల్లారినట్టు. రోజులన్నీ చీకట్లో గడిచి పోతున్నాయ్.  బయటకు వస్తున్నామనుకుంటూనే అడవి లోపలికి  వెళ్లి పోతున్నాం.  ఈ రోజు చనిపోతామనుకుంటూనే ప్రతి రోజు బ్రతికేస్తున్నాం. కొడుకు కనిపిస్తాడేమోనని కొండంత ఆశతో ఎదురుచూస్తున్నాం. వానలొస్తే వడుపుకి , ఏరులెదురొస్తే వెనక్కి మల్లుతున్నాం. మెరుపుల్లో వెలుగుని పిడుగుల్లో నిప్పుని చూసి ఆనందపడుతున్నాం. గుచ్చుకున్న ముళ్ళని గుర్తులనుకొని పొడుచుకున్న రాళ్ళని మెట్లనుకొని ముందుకు సాగుతున్నాం. నా షూ లు అరిగిపోయాయి, తన చీర సగం చినిగిపోయింది. నడకాపలేదు. వెనకకి తిరిగి చూడలేదు. ఆ గుహ లోకి చేరిందాక.

“విజ్జి మనం బయటకు వెళ్తామా” అని అడిగింది ఆ గుహలో  వున్న ఒక చాప రాయి పై కూర్చుంటూ. నా దగ్గర సమాధానం లేదు.

“నువ్వు నాకు తోడూ లేకపోతే నా పరిస్థితి ఏమయ్యుండేది విజ్జి, పాపం వీడెక్కడున్నాడో… బ్రతికున్నాడో లేదో… ఏమి తిన్నాడో… ఏమి చేస్తున్నాడో” మాట్లాడుతూనే వుంది తను ఆ చాప రాయి పై నడుం వాల్చుతూ. తన శ్వాసలో మార్పులను బట్టి తను ఏడుస్తుందని తెలుసుకున్నాను. తనను దగ్గరకు తీసుకొని “బయపడకు శ్రీ  నీకు నేనున్నా కదా, నీకేం కాదు. ఎలాగైనా బయటకు వెళ్దాం. నా ప్రాణాలు ఫణంగా పెట్టయినా నిన్ను కాపాడుకుంటా నన్ను నమ్ము” బుగ్గ మీద ముద్దు పెట్టాను. లేచి నా  ఒల్లో పడుకుంటూ తన చేతులని నా  మెడ చుట్టూ చుట్టి ఛాతీ మీద  ముద్దు పెట్టింది. తనని గట్టిగా గుండెలకి హత్తుకున్నాను. నా నడుంచుట్టూ చేతులేసి మీదకు లాక్కుంది. కలసిపోయాం. అలసిపోయాం. నిద్ర పోయాం.

మూసుకొని వున్న నా కళ్ళ పై వెలుగుల నీడలు.  ఎవరో కదులుతున్న అలికిడి. వెచ్చటి సెగ.  “విజ్జి” అని పెద్దగా అరిచింది నా  భార్య. కళ్ళు తెరిచి కూర్చున్నాను భయంతో. సుమారుగా ఏడు అడుగుల ఎత్తైన మనిషి, ఒంటిపై నూలు పోగు లేకుండా, చేతిలో వెలుగుతున్న ఒక దివిటీలాంటి దాన్ని పట్టుకొని నా వైపు నా భార్య వైపు మార్చి మార్చి చూస్తున్నాడు. ముదురు గోధుమ రంగులో కండలు తిరిగి వున్న అతని శరీరం ఆ వెలుతురిలో నిగ నిగ లాడుతూ వుంది.  ఆకారం మనిషిలా వున్నా  అతను నుంచున్న విధానం ఏదో మృగాన్ని పోలినట్టే వుంది. అతని శ్వాస కి చేతిలో వున్న దివిటీ  మంట కూడా బయపడుతున్నట్టు వణికిపోతుంది.

“విజ్జి నాకు భయంగా వుంది విజ్జి” అంటూ దగ్గరకు జరిగింది నా  భార్య. “నువ్వేం భయపడకు నేనున్నాను కదా” అంటూ తనని ఇంకొంచెం దగ్గరకు తీసుకున్నాను. ఉలుకూ పలుకూ లేకుండా మా వైపే చూస్తున్నడామనిషి. ఇద్దరం చేతులెత్తి దండం పెట్టాం మమ్మల్నోదిలెయ్యమని. ముందుకి కదిలాడు. అప్రయత్నంగా మేమిద్దరం వెనక్కి జరిగాం. ఇంకొంచెం ముందుకి కదిలాడు. వెనక్కి జరుగుదామనుకున్నాం. వీలు కాలేదు. ఆ దివిటీని అక్కడున్న రాయిపై నుంచోబెట్టి మా ముందుకొచ్చి కూర్చున్నాడు. భయంతో వస్తున్నమా  శ్వాసలు ఒక్కటిగా చేరి అతని గుండెలపై రోమాలతో యుద్ధం చేస్తున్నాయి.

చెయ్యి ముందుకు చాపి నా భార్య  కాలు పట్టుకున్నాడు. తను కాలుతో బలంగా తన్నింది. దానికి అతను భయపడలేదు, బెదరలేదు. ఇంకో సారి పట్టుకున్నాడు. ఇంకో సారి తన్నింది. అవమానపు తాలూకు బుసలు మొదలయ్యాయి అతనిలో “విజ్జి నాకు భయంగా వుంది విజ్జి వాణ్ణి ఏదొకటి చెయ్ విజ్జి” అంది నాలో పూర్తిగా ముడుచుకు పోతూ.  వాడు పెద్దగా తోడేలులా అరిచి నా రెండు చేతులని పట్టుకొని దూరంగా విసిరేసి శ్రీ చెయ్యి పట్టుకొని బలంగా తన వైపుకి లాక్కున్నాడు. నడుం పై చెయ్యి వేసి శ్రీ ని తనపైకి లేపుకున్నాడు. ఎక్కడ్నుంచొచ్చిందో నా కా తెగువ వాడిపై సింహంలా  దూకాను కాని నన్ను వాడు కొట్టిన దెబ్బకి  బల్లిలా గోడకి కరుచుకపోయాను, లేవలేకపోయాను. “విజ్జి… విజ్జి నన్ను కాపాడు” అని తను భయం తో అరుస్తుంది. వాడు తనని వదల్లేదు. నేల మీదకి విసిరేశాడు. మీద పడ్డాడు. అడ్డొచ్చిన ఆమె చేతులని నేలకి నొక్కి పట్టాడు. గింజుకుంటున్న తన కాళ్ళ మద్యలో తన తుమ్మ మొద్దు లాంటి నడుంతో వత్తాడు. “విజ్జీ, విజ్జీ … వి…జ్జీ…” అని భారంగా అరుస్తుంది. నేను దాన్ని చూడలేక  కళ్ళు మూసుకున్నాను. వినలేక చెవులు.

కొంత సేపటికి అక్కడ ఏ అలికిడి లేదు. కళ్ళు తెరిస్తే నా  భార్యను ఏ దుస్థితిలో లో చూడాల్సి వస్తుందో తెలియదు, ఒక వేల ముక్కలు ముక్కలుగా విరిగిపోయిన కాళ్ళు చేతులతో ఉంటే, రక్తపు మడుగులో కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతూ వుంటే , ఆ మృగపు గోళ్ళ రక్కుల్లతో పంటి గాయాలతో బాధపడుతూ వుంటే ఎలా చూడాలో ఏమి చెయ్యాలో తెలియన అసహాయతతో  కళ్ళు తెరవలేక పోయాను. “విజ్జీ” అని నా భార్య మూలుగు వినపడింది కొంత సేపటికి. కళ్ళు తెరవకుండా ఉండలేకపోయాను. వాడొదిలెల్లిన దివిటీ వెలుతురిలో అచేతనంగా పడివున్న శ్రీ కనపడిందినాకు. పైకి లేచి నెమ్మదిగా ముందుకు కదిలాను. శ్రీ భారంగా కళ్ళు తెరచి నెమ్మదిగా కూర్చుంది. మృగం లాంటి మనిషి మీద పడినా తట్టుకొని నిలబడ్డ నా భార్యను చూసి నాకు ఆశ్చర్యం కలిగింది.  నడుస్తున్నవాడినల్లా ఆగిపోయాను. తను దగ్గరకు రమ్మని చేతులు చాపింది. ఏదో వింతను గమనిస్తున్నవాడిల తనవైపే తధేకంగా చూస్తున్నాను. కుచ్చిల్లు ఊడిన  చీరను సరిచేసుకుంటుంది తను. అంత పెనుగులాటలో కూడా చినగని తన రవిక వైపుకి నా ద్రుష్టి మళ్ళింది. “విజ్జి ఇక్కడకు రా ప్లీస్” అని పిలిచింది భారంగా కాళ్ళు ముడుచుకుంటూ. అడుగుల్లో అడుగేసుకుంటూ దగ్గరకు వెళ్ళాను. ఎదురుగా కూర్చున్నాను.

“నాకు చాల నొప్పిగా వుంది విజ్జి” అని నా చెయ్యి పట్టుకుని తన చెంపపై పెట్టుకుంది. నాలో ఏ స్పందనలు కలగలేదు. నా దృష్టంతా తన దేహం పైనే. ఎక్కడ కూడా గాయాలు లేవు. నేను ఊహించినట్టు ఎక్కడా రక్తపు మరకలు కనిపించలేదు. తన చేతిలోనుంచి నా చేతిని విడిపించుకొని పక్కన  కూర్చున్నాను . మళ్ళీ నా చేతిని ఆమె చేతిలోకి తీసుకుంటూ “బాధపడకు విజ్జి నాకేం కాలేదులే” అంది. ఆ మాటకు నేను గట్టిగా కళ్ళు మూసుకున్నాను ఊపిరి గట్టిగా పీల్చుకొని వదులుతూ. నాకు తెలియకుండానే నా కళ్ళల్లోనుంచి నీళ్ళు  కారాయి, కాని అవి నా  భార్య పడుతున్న బాధకు స్పందించి వచ్చిన కన్నీళ్లు కావు. నా భార్య ఆ కళ్ళ నీళ్ళని తుడుస్తూ  “విజ్జి బాధపడకు నాకేం కాలేదులె” అందిమళ్ళి. నేను ఊహించినట్టు శ్రీ  వంటిపై ఎక్కడా కూడా రక్తపు మరకలు లేకపోవడం,  గోళ్ళ గిచ్చుళ్ళు పంటి  గాట్లు  లేకపోవడం,  చీర ఏ మాత్రం చినగక పోవడం అంత ఘోరం జరిగినా  తను నాకేం కాలేదులె  అని మామూలుగానే మాట్లాడటం నేను  జీర్ణించు కోలేకపోయాను. కోపంతో కళ్ళు  తెరిచాను. అవమానంతో నోరు విప్పాను.

“శ్రీ.., నాకో విషయం చెప్పు, వాడు నిన్ను రేప్ చేస్తున్నప్పుడు నువ్వు కూడా వాడికి అనుగుణంగానే ప్రవర్తించావు కదూ”,

“ఏం మాట్లాడుతున్నావు విజ్జి”,

“పరాయి మొగాడు నిన్ను అనుభవిస్తుంటే కనీసం అరవకుండా వాడికి ఎదురు తిరగకుండా హాయిగా పడుకున్నావు కదూ”

“షటప్ విజ్జి”

“కనీసం వాడి నుంచి తప్పించు కోవడానికి నువ్వు ఏ మాత్రం ప్రయత్నించలేదు కదూ”

“నీకు పిచ్చి పట్టిందా విజ్జి”

“నాకు పిచ్చి పట్టలేదే… నీకే మదమెక్కింది, కండలు తిరిగిన మగాన్ని చూసి నీకు మదమెక్కింది అందుకే వాడి కింద హాయిగా పడుకున్నావు” పట్టరాని కోపంతో అరిచాను.

“విజ్జీ” చెయ్యేత్తింది.

“లంజ … పరాయి మగాడు పైన పడ్డప్పుడు ఎత్తని చెయ్యి నా మీద ఎలా లేస్తుందే” శ్వాసలో అనుమానం కలసి శబ్దం ఉదృతమైంది.

“విజ్జి దయచేసి ఆపు… ఆ మృగం చేసిన పని కంటె నీ మాటలే నన్ను ఎక్కువగా బాధ పెడుతున్నాయి.”

“నీకు ఇష్టం కాబట్టే ఆ మృగం చేసిన పని నీకు హాయిగా వుంది, తప్పుని నిలదీస్తున్న నా  మాటలు కష్టంగా వున్నాయి కదూ… థు…” అని మొఖం మీద వూసాను.

తను ఊహించని నా  ప్రవర్తనకి నిర్గాంతపోయి చూస్తుంది.

“ఇకనుంచి నీ మొఖం నాకు చూపించకు. ఇక్కడే పడి చావు,” అని కోపంతో తన మొఖం పై కాలితో తన్ని అక్కడ వున్న దివిటి ని తీసుకొని తన జుట్టుకి నిప్పంటించి అడవిలోకి వెళ్లి పోయాను.

కాలం కారు చీకట్లలో తెలియకుండానే కరిగిపోయింది. ఎన్నాలయ్యిందో ఎన్నేల్లయ్యిందో అడవికే తెలియాలి. వందల మైళ్ళు నడిచినా నేను  అడవిని జయించలేక పోయాను. రాత్రి మాత్రమె చీకటిలా వుండి పగలు వెలుతురు సోకే ప్రదేశానికి మాత్రం చేరుకోగలిగాను. నీటి మడుగుల్లో గుడ్డలు లేని నా ఒళ్ళు, పీక్కు పోయిన కళ్ళు, గుండె వరకు పెరిగిన గుబురు గడ్డం,  కండలు  తిరిగిన కాళ్ళు, ముదురు గోధుమ రంగులోకి మారిన శరీరం చూసుకొని ఆశ్చర్యపోయాను. నీళ్ళు తాగి నడక ప్రారంభించాను అడవిలోకి బయటకు వెళ్ళాలన్న ఆశలోకి. ముందుకెలుతున్నాను ఆ చెట్లల్లో పుట్లల్లో  కొండల్లో బండల్లో నిప్పుల్లో నీళ్ళల్లో పడుతూ లేస్తూ పరిగెడుతూ. దారుంటే ముందుకు లేకుంటే పక్కకు. మూడడుగులు ముందుకు ముప్పై అడుగులు వెనక్కి. చీకటి పడింది. ఒక పెద్ద బండ మీదకు చేరుకున్నాను. చీకట్లో కనిపించే శూన్యాన్ని చూడలేక బోర్లా పడుకొని నిద్రపోయాను.

నా రెండుకాళ్ళ ను ఎవరో ఎడం చేస్తున్నట్టుగా అనిపించింది. నేను  కళ్ళు తెరిచేలోపే బరువైన కొమ్మ విరిగి మీద పడ్డట్టు ఒక రూపం నాపై పడి నన్ను కదలనీకుండా చేసింది. కదిలితే ఏమవుతుందో కదలకపోతే ఏం చేస్తుందో తెలియని భయంతో బిగుసుకుపోయాను. పట్టు సడలినప్పుడల్లా అదేంటో చూడాలని ప్రయత్నిస్తున్నాను దాన్ని చూడాలని ప్రయత్నించినప్పుడల్లా ఇంకొంచెం దాని పట్టు బిగిస్తుంది. అది బలమైన బుసలు  కొడుతూ నా చెవిపై తన నాలుకతో నాకుతుంది, దాని నోట్లో జిగటంతా నా చెవిలోకి పోతుంది. భరించలేని  కంపు. నీచు వాసన. కొంచెం సేపు కదలకుండా చచ్చిన శవం లా వున్నాను  ఎలుగుబంటి అయితే వదిలేస్తుందని. అది వదల్లేదు.

అది నడుం ని బాగా పైకెత్తి నా పిర్రల మద్యలో దుడ్డు కర్రలాంటి దాన్ని గుచ్చి బలంగా లోపలికి తోసింది. ఆ నొప్పికి నా కళ్ళు బైర్లు కమ్మాయి. నొప్పి. బాధ. ఊపిరి తీసుకోలేకపోతున్న. అరవలేక పోతున్న. కదలలేక పోతున్న. ఇంకొంచెం లోపలికి తోసింది. పేగులు చీలిపోయిన శబ్దం. తట్టుకోలేక లేవడానికి ప్రయత్నించా, ఇంకొంచెం పట్టుబిగించి నన్నారాయిపై  వత్తిపెట్టేసి నా పిర్రలపై ముందుకీ వెనకకి వేగంగా ఊగుతుంది. ఎముకలు విరిగిపోతాయేమోనన్న భయంతో కదులుతుంటే అది ఇంకా విజృంభించి నా పై బలాన్ని ప్రయోగిస్తుంది. ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొని ఇన్నాళ్ళు ఈ అడవిలో బ్రతికిన నాకు ఎలాగైనా దీన్నుంచి బయటపడాలనే ఆశ కలిగింది. దానితో పోరాడే శక్తి లేక, బ్రతకాలనే ఆశ చావక, దాన్నేమి చెయ్యలేక దానికి ఒల్లప్పగించాను. నా పై వత్తిడి తగ్గింది. కొంత సేపటికి నా పై బరువు తగ్గింది. అది వెళ్లి పోయింది.

నా భార్య గుర్తుకొచ్చింది. కాలిపోతున్న తన  జుట్టు బ్రతికున్న నన్ను చితిపై పెట్టి తగల బెట్టడానికి వస్తున్న తల కోరివిలా అనిపిస్తుంది. నేను తన్నినప్పుడు తన ముక్కులోంచి కారిన రక్తం నన్ను చూసి నవ్వుతుంది. ఆ కటిక చీకటి శక్తి నంతా కూడదీసుకొని నాపై కేకరించి ఉమ్ముతుంది.  ఆ కొండ నన్ను మిండగాడ అని తన కాళ్ళ దగ్గరకు నన్ను చేర్చుకుంది. నాకిప్పుడు నా భార్య కావాలి నన్ను చూసి తను ఏడుస్తుంటే తన చేతిని నా చెంపపై పెట్టుకొని నాకేం కాలేదని నేను తనకి భరోసా ఇవ్వాలి. మిగిలన శక్తినంతా కూడా దీసుకొని కొండపై నుంచి కిందకి దొర్లాను. కాల్లిరిగాయి. కన్నీళ్లు రాలేదు.

నడవలేని నేను నా జీవితాన్ని ఆ చెట్టుపైనే గడిపేస్తున్నాను. ఆకలేస్తే ఆకులు వానోస్తేనే నీళ్ళు. ఆకలితో పస్తు పడుకున్నాగాని పక్షుల గూలల్లో గుడ్ల వంక మాత్రం నేనెప్పుడూ చూడలేదు. తల్లి పక్షులు తన పిల్లల నోళ్ళల్లో ఆహారాన్ని అందించే దృశ్యం చూడటానికే నేను బ్రతికున్నానేమో అన్నంత ఆశగా ఆ దృశ్యం కోసం ఎదురు చూస్తూ ఉండేవాడిని. తల్లి పక్షులు  లేనప్పుడు నేను వాటి గూళ్ళ దగ్గరకు వెళితే ఆ చిన్ని పిల్లలు నన్ను చూసి నేనే వాటి తల్లి ననుకొని నోరు తెరిచినప్పుడు నాకు తప్పిపోయిన నా కొడుకు గుర్తుచ్చి గుండె బరువయ్యేది. దుఃఖం పొంగుకోచ్చేది. ఋతువులు మారుతున్నాయ్ అడవి తన రూపం మార్చుకుంటుంది. నేను వేగంగా ప్రాకడం నేర్చుకున్నాను. చెట్లు వెక్కడం దిగడం నేర్చుకున్నాను. ఆహరం సంపాదించుకోవడం చెట్టెక్కి కూర్చోవడం గుడ్లగూబల జోల పాటలో నిద్రపోవడం అదే నా పని గా మారిపోయింది.

రేచుకుక్కలు ఎవరినో తరుముతున్న శబ్దం వినపడింది ఒక రోజు పొద్దున్నే. చెట్టుపైనుంచే దాన్ని చూడటానికి ప్రయత్నించాను. ఆ రేచు కుక్కలకు దొరక్కుండా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఒక చిన్న పిల్ల వాడు ఆ చెట్టు కింద కొచ్చి పడ్డాడు. రొప్పి రొప్పి చచ్చి పోయేలా వున్నాడు. వాడు నా కొడుకేనని రోమాలు నిక్కబొడుచుకున్నాయి నాకు. ఇంకో కొమ్మ మీదకు మారి వాడి మొఖాన్ని చూడాలని ప్రయత్నించాను. ఇంతలో సుమారుగా ఇరవై రేచుకుక్కలు ఆ పిల్ల వాణ్ని చుట్టు ముట్టాయి. వాడు భయపడలేదు. పైకి లేచాడు.  దొరికిన ఒక ఎండు మొద్దుని అందుకొని రేచుకుక్కల మీదకి దూకాడు. దొరికినదాన్ని దొరికినట్టు బాదుకున్నాడు. దెబ్బ తిన్న కుక్కలు  ఇంకా కోపంతో వాడి మీదకు వురుకుతున్నాయి. వాడి చేతులో వున్న ఎండు మొద్దు విరిగిపోయింది. నేను ఇంకో కొమ్మ మీదకు మారాను వాణ్ని చూడాలని. మొఖం సరిగ్గా కనపడటం లేదు.

వాడి చేతిలో ఏమి లేకపోయినా రేచుకుక్కలు అరుస్తున్నాయే గానే వాడి దగ్గరకు రావడానికి భయపడుతున్నాయ్. వాడు నిస్సహాయుడై మోకాళ్ళ పై కూర్చున్న వెంటనే ఒక రేచుకుక్క మీదకు దూకింది. దానికి అప్రయత్నంగా నేను కూర్చున్న కొమ్మను వదిలేసి వాణ్ని వెళ్ళిపొమ్మని వారించబోయాను. కిందపడ్డాను కచ్చితంగా ఆ రేచుకుక్కల మద్యలో. ఆ హటాత్పరిణామానికి రేచుకుక్కలు దడుచుకొని కొంచెం వెనక్కి తగ్గాయి. అదే అదనుగా భావించి ఆ పిల్లవాడు నా వైపు కృతజ్ఞతగా చూసి మెరుపులాగా తప్పించుకున్నాడు. వాడు నా కొడుకు కాదు. రేచుకుక్కలు నా వైపు కోపంగా చూస్తూ అరుస్తున్నాయి. నేను వీన్ని కాపాడినట్టు ఎవరో ఒకరు నా కొడుకుని కూడా కాపాడి ఉంటాడని నమ్మి ఆ రేచుకుక్కలతో పోరాడే ఓపిక లేక బ్రతుకు మీద ఆశ వదులుకొని వాటి వైపు భయంగా చూసాను. రేచు కుక్కలు మూకుమ్మడిగా అడుగులు ముందుకు వేసాయి. కళ్ళు మూసుకున్నాను.

ఏదో పిడుగు పడ్డట్టు శబ్దం. రేచుకుక్కలు చావు దెబ్బతిన్నట్టు వింతగా  అరుస్తూ దూరం జరిగాయి. కళ్ళు తెరిచాను . నా ఎదురుగా ఒక ఆడమనిషి వెనుక భాగం కనిపిస్తుంది, ఒంటిపై నూలుపోగు లేకుండా. ముదురు గోదుపురంగు ఒళ్ళు కండలు తిరిగి. కోపంతో వున్న రేచుకుక్కలు మూకుమ్మడిగా తనపై దూకాయి. ఒక కుక్కని గొంతు కొరికి విసిరేసింది. ఇంకో కుక్కని గాల్లో నే తన్నింది. ఇంకో కుక్కని కాలు పట్టుకొని చెట్టు మొదలుకేసి బాదింది.  ఒక నిమిషంలో మెరుపే మనిషై చంపిన రేచుకుక్కలను కుప్పగా కూర్చి సింహంలా వాటి పై కూర్చుంది. ఆ పోరాటం లో ఎగిసిన దుమ్మూ ధూళి శాంతించి చల్లబడ్డాక చూస్తే సింహాసనం పై విజయగర్వంతో కూర్చున మహారాణిలా శ్వాస వేగంగా తీసుకుంటూ నా వైపే చూస్తుంది నా శ్రీ… నా భార్య.

నమ్మలేకపోయాను. నేను నెమ్మదిగా తన దగ్గరకు పాకుతూ వెళ్లి తను శ్రీ నే అని నిర్ధారించుకున్నాను. తన కాళ్ళ కింద రేచుకుక్కలు కొన్ని మూలుగుతూ వున్నాయి. రక్తాలు కక్కుకుంటూ వున్నాయి. తను నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ వుంది.  తుఫాను తరువాతి ప్రశాంతత అక్కడ అణువణువునా విస్తరించి వుంది. “శ్రీ నాకో విషయం చెప్పు ఇన్ని రేచు కుక్కల్ని చంపగలిగిన నువ్వు ఆ రోజు ఆ మృగం లాంటి మనిషిని ఎందుకు ఎదుర్కోలేదు” అడిగాను.

తను కోపంగా పైకిలేచింది.  వెనక్కి తిరిగి ఆ రేచుకుక్కల గుంపుని కుడి కాలితో తన్నింది. కుక్కలన్నీ ఇంతెత్తు లెగిచి తలో దిక్కులో దిక్కు లేకుండా పడ్డాయి. కళ్ళు మూసుకుంది. కళ్ళల్లో నీళ్ళు. వచ్చి నా కాళ్ళ మీద పడుతుంది అనుకున్నాను.క్షమించడానికి సిద్ధంగా వున్నాను. గట్టిగా నిట్టూర్చి తను అడవి వైపుకి తిరిగింది.  అడవి రెండుగా చీలిపోయింది.  శ్రీ వెనుదిరిగి  చూడకుండా అడవిలోకి వెళ్లిపోయింది. నన్నొదిలి మృగాల మద్యలోకి.  చెట్టు పైనుండి నా పై పిట్ట రెట్ట వేసింది కాండ్రించి వుమ్మలేక.

(అయిపోయింది)

*         

మాదిగ  జీవన సౌందర్యం ఇష్టం: చంద్ర శేఖర్

1-హాయ్. చందూ…  ఎప్పటి నుంచి కథలు రాస్తున్నారు.? మొదట రాసిన కథ ఏమిటి…?

ఎలా అలవాటు అయ్యింది ఎందుకు అలవాటు అయ్యిందో తెలియదు చిన్నప్పటినుంచి రాస్తూనే వున్నాను. ప్రతి రోజూ డైరీలు, చిన్నప్పుడు దేశభక్తి కవితలు, ఇంటర్ లో సింగిల్ పేజి సెక్స్ కథలు, డిగ్రీ లో ప్రేమ కవితలు డబ్బుల కోసం  స్వాతి కి సరస కథలు(ఒక్కటి ప్రచురణకు అర్హత పొందలేదు కాని నన్ను కథలు రాయడానికి ప్రేరేపించింది మాత్రం ఈ సరస కథల పోటీనే). రాసి రాసి ఎప్పుడు మారానో ఎలా మారానో తెలియదు గాని నా మొదటి కథ (2008) “ముళ్ళు” రచన లో సాధారణ ప్రచురణకు అర్హత పొందినది. దాన్ని నేను తప్ప బహుశా ఎవ్వరు చదివి వుండరు. నన్ను నలుగురు చదివిన కథ మాత్రం “నేను నాన్న బిర్యాని”. ఈ స్టొరీ ని ఈ మధ్య  ఒక షార్ట్ ఫిలిం గా నేను యు ట్యూబ్ లో చూసి ఆశ్చర్యపోయాను.

2- నేను నాన్న బిర్యానీ…కథ ఆర్థిక సంబంధాలు-మానవ సంబంధాల మధ్య చిన్న ఘర్షణను ప్రతిఫలిస్తుంది. ఆ కథకు స్ఫూర్తి ఏమిటీ?

ఆ కథలో కొడుకంత దారుణంగా నేను నిజంగా ప్రవర్తించలేదు గాని ఇది నాకు జరిగిన కథే. నేను డిగ్రీ ఫెయిలయ్యి మా చిన్నాన్న స్కూల్లో లోయర్ క్లాస్స్ టీచర్ గా చేరి డిగ్రీ పాస్ అవ్వడానికి చదువుకుంటున్న టైం లో జరిగింది ఈ కథ. ఆ కథలో పొట్టెంకటేసు, ఉషారాణి నా స్టూడెంట్స్. అప్పట్లో నిజంగా బిర్యాని తినడం అంటే నాకు చాల ఇష్టం. కాని నాదగ్గర డబ్బులు ఉండేవి కాదు. పాపం మా నాన్న దగ్గర కూడా . ఆ రోజు మా నాన్న నాకు పెట్టించిన బిర్యాని రుచి నాకిప్పటికి గుర్తు వుంది అనడం లో అతిశయోక్తి లేదు. మేము చాల పేద వాళ్లము అయినప్పటికీ మా నాన్న నాకెప్పుడు లోటు చెయ్యలేదని చెప్పాలనిపించి ఆ కథ రాసాను.

3- మీరు రాసిన కథల్లో బాగా నచ్చిన కథ ఏది…? ఎందుకని…?   

నా కథల్లో నాకు బాగా నచ్చిన కథ “దినం”. దీన్లో ఏ మాత్రం కల్పితం ఉండదు. అతి నిజాయితీగా రాసిన కథ. ఈ మధ్య మా నాన్న చనిపోయినప్పుడు నా దినం కథ మా నాన్న  దినం అయిపోయేంత వరకు నాతో పాటే తిరిగింది. మా పల్లెల్లో చనిపోయిన ప్రతి మనిషి నా దినం కథని మల్లి మల్లి రాస్తుంటారు. కథ చావు గురించి అయినా ఎప్పటికీ బ్రతికే వుంటుంది. అందుకే నా కథల్లో దినం కథ అంటే నాకు చాల ఇష్టం.

4- గుండు- కథ కానీ లేదా, సుభాషిణి కథ…. ఇలా చాలా కథల్లో సీరియస్ టాపిక్ ని  కూడా…వ్యంగ్యంగా చెపుతుంటారు. సెటైర్ అంటే బాగా ఇష్టమా…? 

పతంజలి గారి కథలను చదువుతున్న టైం లో రాసిన కథ గుండు. నాకు తెలిసి ఆయన కథల ప్రభావం నా గుండు పై వుండి మీకు అలా అనిపించి ఉండవచ్చు. ఇక సుభాషిణి కాదు సుమలత కథలో అయితే పాత్రల స్వభావం సహజంగా అలాగే వుంటుంది కాని నేను కావాలని సటైర్ మాత్రం రాయలేదు.

5.బోర చెక్క కథ …బీఫ్ సమస్య నేపథ్యంగా రాసిన కథ కదా….ఆ కథ గురించి  చెప్పండి.

నాకు అన్ని కూరలలో కెల్లా బీఫ్(దున్న కుర్ర మాంసం) అంటే చాల ఇష్టం. అందులో బోరచెక్కు అంటే ఇంకా ఇష్టం. నాకే కాదు మా పల్లెల్లో ప్రతి ఒక్కరికి చికెన్ మటన్ కన్నా బీఫ్ అంటేనే ఇష్టం. కొద్దో గొప్పో చదువుకున్న వాళ్ళు చెడిపోయి దినం బంతుల్లో పుట్టిన రోజు బంతుల్లో చికెన్ ఏస్తున్నారు కాని మిగతా వాళ్ళంతా అతి ఇష్టంగా బీఫ్ ని మూడు రకాలుగా వండి వడ్డిస్తారు, ఈ మద్య చాల మంది కుర్రవాళ్ళు పెళ్లి బోజనాల్లో కూడా బీఫ్ వుంటే బాగుంటుందని చాల సార్లు నాతో అన్నారు. పండగ రోజు కంటె బీఫ్ తినే ఆ మరుసటి రోజే మాకు పెద్ద పండగ గా వుంటుంది. మా ఇల్లు వాకిలి గొడ్డూ గోదా  లాగానే బీఫ్ కూడా మా జీవన విధానంలో ఒక భాగం ఆ విషయాన్ని తెలియ చెయ్యడమే ఆ కథ ఉద్దేశ్యం. మా జీవన విధానం పై ఎవ్వరి పెత్తనం చెల్లదని కూడా ఆ కథ లో నేను తెలియ చేసాను

6. ఆ కథకొచ్చిన స్పందన ఎలా ఉంది.. విమర్శలు కూడా వినిపించాయనుకుంటా!

ఈ కథ వాకిలి వెబ్ మాగజైన్ లో వచ్చింది కాబట్టి బహుశా  నా తోటి లేదా నా కన్నా పెద్ద రచయితలు మాత్రమె చదివి ఉండవచ్చు. సరిగ్గా ఈ కథ ప్రచురించినప్పుడే నాతో పాటు అలిపిరిలా  సత్యప్రసాద్ గారి కథ “కథ పేరు గుర్తులేదు” ప్రచురించారు. అది కూడా ఆహారం గురించే కావడం వల్ల ఒకరిద్దరు దానికి నా కథకి పోలికలు చెప్తూ నా కథ కన్నా ఆ కథే బాగుంది అన్నారు. బి.అజయ్ ప్రసాద్, పసునూరి రవీందర్, మహ్మద్ ఖదీర్ బాబు , పూడూరి రాజి రెడ్డి, ఇండస్ మార్టీన్ , రాజీవ్ వేలిచేటి  లాంటి వాళ్ళు ఆకథ బాగుందని నాకు మెసేజ్ పెట్టడం నాకు చాల సంతోషాన్ని ఇచ్చింది.

7-దళిత వాదం, దళిత కథ గురించి అభిప్రాయం.

నిజం చెప్పాలంటే దళితవాదం గురించి నేను తెలుసుకోవల్సింది ఇంకా చాలా వుంది కాబట్టి దాని గురించి ఇప్పటికి మాట్లాడను. తెలుసుకున్నాక కచ్చితంగా దాని మీద మంచి కథ రాస్తాను. ఇక దళిత కథ విషయానికొస్తే నాగప్పగారి సుందరరాజు , పసునూరి రవీందర్ , జూపాక సుభద్ర , ఇండస్ మార్టీన్, ఒక్క కథే రాసిన “బుడ్డగిత్తరంకి” లాంటి పవర్ ఫుల్ కథ రాసిన పెంచల్దాసు లాంటి వాళ్ళు నాకు ఆదర్శం. దళితులు కథలు రాస్తున్నారు కాబట్టి అవి దళిత కథలు అయ్యాయా ? లేదా దళితుల గురించి రాస్తున్నారు కాబట్టి అవి దళిత కథలు అయ్యాయా? నాకిప్పటికి తెలియదు. కాని దళితుల జీవితాల గురించి దళితులు రాసినంత అందంగా ఇంకెవరు రాయలేరని మాత్రం నేను గట్టిగా నమ్ముతాను. కాని దళిత కథలు రాస్తున్నారు కాబట్టి వాళ్ళు దళిత కథా రచయితలు అని ప్రతి సారి సంభోదించడం మాత్రం ఒక్కోసారి ఇబ్బందిగా అనిపిస్తుంది. అది వారిని ఇంకో రకమైన జానర్ లో కథలు రాయడానికి అడ్డు వస్తుందని నేను అనుకుంటున్నాను.

ఇక నా కథల విషయానికొస్తే నా కథల్లో నా మాదిగ ప్రజల జీవన సౌందర్యం చూపించడానికే నేను చాల సార్లు ప్రయత్నిస్తాను. “గుండు” కథలో ఒక తగాదా లో జరిగే తీర్పులు, అమాయకపు వాదనలు , “సుభాషిణి కాదు సుమలత” కథలో పాటకుల కోసం వడపోయ్యని మా పల్లె పదజాలం, “నేను నాన్న బిర్యాని” కథలో నాకూ మా నాన్న కి మద్య వున్న ప్రేమ , “దినం” లో మా మనుషుల మద్య వుండే ప్రేమానురాగాలు, స్నేహ బంధం , “బోరచెక్కు” కథలో బీఫ్ పై మాకుండే మక్కువ గౌరవం ఇలాగ.

నా దళిత జాతి గొప్పతనం గురించి రాస్తూనే రకరకాల జానర్ లో కథలు రాయడం నాకు చాల ఇష్టం . అందుకే సాక్షి పత్రికలో ప్రచురించిన “రంగుల చీకటి”, “జనారణ్యం” తెలుగు వెలుగులో వచ్చిన  “నాటకాలయనింట్లో పాము” సారంగలో వస్తున్న “ఈ నగ్నారణ్యం” రాయడం జరిగింది. ఇంకా రాస్తాను ఎందుకంటె నాకు కథలు రాయడం అంటే చాల ఇష్టం.

8-మీకు బాగా నచ్చిన కథలు, రచయితలు.

మొదట్లో నేను కథలు రాయడం కోసమే మిగతా వాళ్ల కథలు చదివాను. నేను మొదటిగా అతి ఇష్టంగా చదివిన కథల పుస్తకం సలీం గారి “రూపాయి చెట్టు” దాన్ని నేను చాల సార్లు కొన్నాను. ముగ్గురు కొత్త రచయితలకి గిఫ్ట్ గా కూడా ఇచ్చాను. తరువాత నేను కూడా కథలు రాయవచ్చు అని నమ్మకం కలించింది ప్రేరేపించింది మాత్రం నామిని గారి “మిట్టూరోడి పుస్తకం” అసలయిన కథా లేదా నవలల రుచి చూపించింది మాత్రం KNY పతంజలి గారు. ఇప్పటికీ ఎప్పటికి ఆయన్ని మించిన రచయిత లేడని నేను నమ్ముతాను. కేశవరెడ్డి గారి నవలలు, కొలకలూరి ఇనాక్ గారి కథలు , అల్లం శేషగిరి రావు కథలు ,పెద్దింటి అశోక్ కుమార్ గారి కథలు నాకు బాగా నచ్చుతాయి. ఖదీర్ బాబు గారు“ కథలు ఇలా కూడా రాస్తారు” అనే బుక్ మాత్రం నన్ను నేను కొత్తగా మలచుకోవడానికి చాల ఉపయోగపడింది.  మా గురించి కూడా కథలు రాసుకోవచ్చు అని నన్ను ప్రేరేపించిన పుస్తకం మాత్రం నాగప్పగారి సుందర్రాజు గారు రాసిన “మాదిగోడు” కథ ల పుస్తకం.

9-అటు నాటకరంగంలోనూ కృషి చేస్తున్నారు కదా.

నన్ను నలుగురికి తెలిసేలా చేసింది, నాకిప్పటికీ అన్నం పెడుతుంది నాటక రంగమే. అసలు నాటకాలు నమ్ముకున్నవాడికి తిండే దొరకదు అనుకునే రోజుల్లో నాటకాన్నే నా వృత్తిగా తీసుకోగలిగే  దైర్యాని కలిగించింది “పడమటిగాలి” రచయిత పాటిబండ్ల ఆనందరావు గారు వరసకు ఆయన నాకు మామయ్య.  ఆయనే నన్ను యూనివర్సిటీ అఫ్ హైదరాబాద్ లో మాస్టర్ అఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ లో చేర్పించాడు. డిగ్రీ లో 45 శాతం మార్కులతో ముక్కీ మూలిగీ పాస్ అయిన  నేను యం. ఏ మాత్రం 80 శాతం కి పైగా మార్కులతో పాస్ అయ్యాను. నాకు నాటకరంగం అంటే అంత ఇష్టం. తరువాత పాండిచెర్రి యూనివర్సిటీ లో యం.ఫిల్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ చేసాను, ఇప్పుడు మళ్ళీ యూనివర్సిటీ అఫ్ హైదరాబాద్ లో PhD చేస్తూ ప్రస్తుతం ది అఘాఖాన్ అకాడెమీ లో డ్రామా టీచర్ గా పని చేస్తున్నాను.

నేను యం.ఏ చేస్తున్నప్పుడు నాకు అతి ఇష్టమైన అసిస్టెంట్ ప్రొఫెసర్  రాజీవ్ వేలిచేటి గారు  గోపాత్రుడు నవలని పరిచయం చేసాడు దాన్నే నాటకీకరణ చేసి ప్రదర్శించడం తో నా నాటక కెరియర్ సార్ట్ అయ్యింది. తెలుగులో వున్న గోప్పకతలని, నవలలని నాటకాలు గా ప్రదర్శించి ఆ కథలని నాటక ప్రక్రియ ద్వారా జనాలకు చేరువ చెయ్యాలని నా బలమైన కోరిక.

10- మిస్ మీనా నాటకం మీకు మంచి గుర్తింపు తెచ్చినట్టుంది కదా…. దాని గురించి కూడా చెప్పండి.

అవును నాకు మంచి పేరు తీసుకు వచ్చిన నాటకం మాత్రం “మిస్ మీనా” అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎనబై ప్రదర్శనలు పూర్తిచేసుకోవడమే కాక కొన్ని నేషనల్ థియేటర్ ఫెస్టివల్స్ లో కూడా ప్రదర్శించబడింది. అది యూనివర్సిటీ అఫ్ హైదరబాద్ వాళ్ళ అవుట్ రీచ్ యూనిట్ లో భాగంగా చెయ్యబడిన నాటకం. తెలుగు నాటకరంగానికి కొత్త నాటకాలని , కొత్త  ప్రదర్శన పద్దతులని తెలియచేస్తూ నాటక రంగానికి  కొత్త ఆడియన్స్ ని సంపాదించుకోవడానికి ప్రారంభించిందే థియేటర్ అవుట్ రీచ్ యూనిట్.

ఆ థియేటర్ అవుట్ రీచ్ యూనిట్ లో మిస్ మీనా అనే తమిళ నాటకాన్ని తెలుగులో చెయ్యడానికి రాజీవ్ కృష్ణన్ గారికి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉండమని పిలిచారు థియేటర్ అవుట్ రీచ్ యూనిట్ కోఆర్డినేటర్ పెద్ది రామారావు గారు. నేను దానిలో పాల్గొనే విధానం చూసి రాజీవ్ కృష్ణన్ గారు నన్నే ఆ నాటకాన్ని తెలుగులో దర్శకత్వం చెయ్యమని ప్రోత్సహించారు. ఆ విధంగా నేను ఆ నాటకానికి దర్శకున్ని అయ్యాను. ఆ నాటకం చాల సకెస్స్ పొందింది. దాన్లో నటించిన నటులు కూడా నాటకాన్నే తమ వృత్తిగా తీసుకోవడం మాకు మా థియేటర్ అవుట్ రీచ్ యూనిట్ కి గర్వకారణమైన విషయం.

11- మీ నేపథ్యం…  

మాది ప్రకాశం జిల్లా లో ఒంగోలుకు దగ్గరలో లో కందులూరు అనే పల్లెటూరు. అమ్మ పేరు సత్యవతి నాన్న పేరు అంకయ్య వ్యవసాయ కూలీలు. ఈ మాత్రం నేను కథలు రాస్తూ నాటకాలు చేస్తున్నానంటే కారణం మా చిన్నాన్న ఇండ్ల ఏసుపాదం ఆయనే మా తొలి గురువు. నేను కందులూరు లో పుట్టి ఉండక పోతే బహుశా నేను నాటకాలు చేసి వుండే వాడిని కాదేమో. ఎందుకంటె మా వూరి ప్రజలకి కోలాటం , నాటకం , డప్పు వాయిద్యం జీవన విధానంలో ఒక భాగం. కందులూరు ప్రతి ఒక్కరికి నాటకం అంటే ప్రాణం. అందుకే నేను నాటకాన్ని వృత్తిగా తీసుకున్నప్పుడు అందరిలా యెగతాళి చెయ్యకుండా నన్ను ప్రోత్సహించారు .

యూనివర్సిటీ అఫ్ హైదరాబాద్ లో మాస్టర్ అఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ చేసి  80 శాతం కి పైగా మార్కులతో పాస్ అయ్యాను. తరువాత పాండిచెర్రి యూనివర్సిటీ లో యం.ఫిల్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ చేసాను, ఇప్పుడు మళ్ళీ యూనివర్సిటీ అఫ్ హైదరాబాద్ లో PhD చేస్తూ ప్రస్తుతం ది అఘాఖాన్ అకాడెమీ- హైదరాబాద్ లో డ్రామా టీచర్ గా పని చేస్తున్నాను.

*

చంద్రశేఖర్ ఇండ్ల

17 comments

Leave a Reply to ఇండ్ల చంద్రశేఖర్ Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మగ మానసిక స్ధితిని గూర్చి చెప్పిన కథ…పురుషులంందరూ తప్పక చదవాల్సిన కథ…హ్యాట్సాఫ్ టు చంందూ సార్

    • వేణు థాంక్యూ నన్ను చదువుతున్నందుకు అంతకు మించి నన్ను ప్రోత్సహిస్తున్నందుకు

    • థాంక్స్ మనో నా కథలన్నీ చదివి నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు

  • థాంక్స్ మనో నా కథలన్నీ చదివి నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు

  • కథ చాలా బలంగా రాశారు. మిస్ మీనా నాటకం ఒంగోలులో చూసి త్రిల్ అయ్యాను, సాక్షిలో ఒక కథ చదివాను. దళిత రచయితలు ప్రపంచం గురించి రాయాల్సిన సమయమొచ్చింది. ఆ నమ్మకమూ కలిగింది మీ కదా చదివాక. చందుకి ధన్యవాదాలు మంచి కథని పరిచయం చేసినందుకు.

    • కరుణాకర్ సార్ థాంక్యూ…
      చందూ లాంటి కథకులు … ఇంకా మంచి కథలు రాయాలంటే మీ లాంటి వారి ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉండాలి.

    • కరుణాకర్ గారు ధన్యవాదాలు. ఖచ్చితంగా మంచి నాటకం తో మంచి కథతో ఇంకోసారి మీ ముందుకి వస్తాను

    • నారాయణ స్వామి గారు మీ స్పందనని ఏ విధంగా అర్ధం చేసుకోవాలి

  • వేణు థాంక్యూ నన్ను చదువుతున్నందుకు అంతకు మించి నన్ను ప్రోత్సహిస్తున్నందుకు

  • రచయితకు అభినందనలు . ఈ కథను ఎన్నిక చేసి ప్రచురించిన సారంగకు ధన్యవాదాలు .రచన శైలి వస్తువు అన్ని బాగున్నాయి .ముందు ముందు మరిన్ని మంచికథలు రావాలని ఆశిస్తున్నాను .

  • “బుడ్డగిత్తరంకి” లాంటి పవర్ ఫుల్ కథ రాసిన పుట్టా పెంచల్దాసు లాంటి వాళ్ళు నాకు ఆదర్శం అన్న ఇండ్ల చంద్రశేఖర్ గారూ మీదెంత పెద్ద మనసు.

    మిమ్మల్ని ఇంత విపులంగా పరిచయం చేసిన చందు తులసికి కృతజ్ఞతలు.

    “నేను నాన్న బిర్యాని” రాసిన చంద్ర కి ఒంగోలులో మా చిన్నప్పటి అజంతా హోటల్లో భోజనం పెట్టి సత్కరించాలని ఉంది ( తమ్ముడూ చంద్రా, నేను గోమాతకు నమస్కరిస్తాను. అది నాకు మాత్రమే సంబందించిన విషయం. బీఫ్ తినే వాళ్ళ పట్ల నాకెలాంటి విరోధము ఉండదు. అది వాళ్ళ హక్కుగా గుర్తించి గౌరవిస్తాను ).

    • ధన్యవాదాలు రామయ్య గారు ఒంగోలు అజంతా హోటల్లో, రమ్య ప్యూర్ వెజ్ లో, ఇంత పప్పు అంత మామిడి కాయ పచ్చడి వేసుకొని దానిపై నెయ్యి వేసుకొని బీఫ్ తిన్నంత ఇష్టంగా తిన్న రోజులు బోలెడు. మీ ప్రేమకు (గో)పాత్రుణ్ణి

  • మీ కదా బావుంది. నాటక రంగం లో మీ అభిరుచి తెలియడం బావుంది, మీకు శివ తెలిసే ఉండవచ్చు. మేమిధ్య బారిష్టర్ పార్వతీశం ను నాటకీకరణ చేసి హిందీ లోనూ తెలుగు లోనూ ప్రదర్శిస్తున్నాం.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు