అందు మూలముగా సమస్త జనులకు తెలియజేయునదేమనగా…..
ప్రపంచం తల్లకిందులుగా నడుస్తున్నదని, అందునా భారతదేశం పరిస్తితి మరీ దారుణమని, ఇక్కడ ఈ దేశం కనీసం తలకిందులుగా కూడా నిలకడగా వుండలేదని, ఊరకూరకే నీరసించి గుడ్లు తేలేసి పడిపోతుంటుందని, ప్రతి అవరోధానికి చిగురుటాకులా వణికిపోతుందని, బిక్కచచ్చిపోతుంటుందని నొక్కి వక్కాణించడమైనది. కుల, మత, ప్రాంత, వర్గ, భాషాధిపత్యాలతో చీలిపోయి సమాజం అంతా అసంబద్ధంగా, రోతగా, కంగాళీగా, చిరాకుగా, బానిస బుద్ధులతో, ప్రజల ఏకీకరణకు ఐకమత్యానికి సంబంధం లేదనే జ్ఞానంతో పని లేని చితికిపోయిన మెదళ్లతో, భినాభిప్రాయాల్ని సమర్ధించే చైతన్యవంతమైన సంభాషణల్ని మింగేసే భజనలతో, ప్రశ్నించిన కంఠాల్ని బరబరా ఈడ్చుకొచ్చి అండా సెల్లుల్లో విసిరేస్తూ, స్వీయ గుండె చరుపుళ్లతో నిండిన పాలకులతో కునారిల్లుతుందని, ఇందుకు వేద కాలాల నుండి బ్రిటీషోడి పాలన వరకు తగు చారిత్రిక కారణాలున్నాయని అందుమూలంగా ప్రకటించటమైంది. మీరు భజన చేస్తున్న పరిపాలకులందరూ వొట్టి అసమర్ధ, విధ్వంసక, హింసాత్మక రాతి గుండెల క్రూర మృగాలని, జాతి మత కులాల మీదుగా ప్రజలు తమ సమాధుల మార్గాన్ని తామే వేసుకునేలా పాలకులు చేస్తారని, మీరు కీర్తిస్తున్న విలువలన్నీ మనుషుల్ని సజీవ ప్రేతాలుగా మార్చే మారణాయుధాలనీ, మీరు రక్షణగా భావిస్తున్న చట్టాలన్నీ మిమ్మల్ని నోరెత్తనివ్వని ముళ్లగదలనీ, మీరు నెత్తిన పెట్టుకొని ఊరేగుతున్న ప్రజాస్వామ్య సిద్ధాంతాలన్నీ వారసత్వాల స్వామ్యమనీ, మీరు నమ్మే ఆదర్శాలన్నీ ఊసుబోక చెప్పుకునే సామూహిక బాతాఖానీలనీ, మీ దేశభక్తి నినాదాలన్నీ పలాయనవాదానికి ఫ్రీ టిక్కెట్లని కుండలు పగలగొట్టి మరీ చెప్పటమైనది.
ఇంతకీ ఇదంతా ఎక్కడ? “విలోమ కథలు”లో.
****కొంతమంది రచయితలు సమాజ దౌర్భాగ్యాల్ని పరిశీలనతోనొ లేదా ఊహాశక్తితోనో రాస్తారు. మరికొందరు బలిపశువులై రాస్తారు. అంటే కొంతమంది ఒడ్డున కూర్చొని నడి సంద్రంలో ఎవరో నిస్సహాయంగా మునిగిపోవటాన్ని చూస్తూనో లేదా ఊహించుకొనో సానుభూతితో రాస్తారు. మరికొందరు సముద్రం మధ్యలో వుండి కూడా మునిగిపోకుండా బతికి బైటపడటానికి జీవన్మరణ పోరాటం చేస్తూ, అరుస్తూ, కేకలేస్తూ, తపతపా తన్నుకుంటూనే కలాల్ని గుండెల్లో ముంచి రాస్తారు. నగ్నముని అలాంటివాడే. రచనలు చేసినందుకు ఆయన జైలుకెళ్లాడు. జైలుకెళ్లొచ్చి ఇంట్లో కూచొని మరీ రాసాడు. ఉద్యోగం పోగొట్టుకున్నాడు. వీధిలో నిలబడ్డాడు. బతకటానికి కష్టపడ్డాడు. రాయటానికి ఇంకా ఎక్కువ కష్టపడ్డాడు. కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన కారుచీకట్ల ఎమర్జెన్సీ కాలంలో ఆరు “విలోమ కథలు” రాయటానికి నగ్నముని ఎంత హింస అనుభవించి వుంటాడో! ఎంత రొష్టు పడి వుంటాడో! తన మేధస్సుని, సృజనాత్మక శక్తిని ఎంత రాచి రంపాన పెట్టి వుంటాడో! నగ్నమునిలా ఆ హింసని మోసినవాళ్లు చాలామంది వుండొచ్చు. అయినా నగ్నముని నగ్నమునే! అతనిదొక బాణీ. అతనిదొక దుర్గం. అది స్వర్గం మాత్రం కాదు.
****విలోమ కథలు రాసే సమయానికి దేశం “స్వాతంత్ర్యం” అనే రెడీమేడ్ చొక్కా తొడుక్కొని సుమారు 30 ఏళ్లైంది. 80శాతం పైగా జనాభా దరిద్ర రేఖకి దిగువన బతుకుతూ దేశ దరిద్రం దరిద్రంగానే కొనసాగుతుండగా సంపన్నుల ఆస్తులు, మార్కెట్లో పెట్టుబడి మాత్రం పెరుగుతున్నది. భూసంస్కరణలు గ్రామీణ ఫ్యూడలిజాన్ని దెబ్బ కొట్టలేదు. బ్యాంకుల జాతీయకరణలు పేదల ఆర్ధిక స్థితిగతుల్ని ఉద్ధరించలేదు. మతవాదపు జనసంఘ్ పార్టీకి దేశంలో భావజాల మద్దతు వున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్యం తీసుకొచ్చిన కీర్తి గడించిన యూఫోరియా లొనే వుంది. ప్రజాస్వామ్య ఉద్యమాల పేరుతో జయప్రకాశ్ నారాయణ్ వంటి ప్రతిపక్ష పాలకవర్గ పరపతి పెరుగుతున్నది. జేపి శిష్యుడైన రాజ్ నారాయణ్ అనే పొలీటిషియన్ అలహాబాద్ హైకోర్టులో అప్పటి ప్రధాని ఇందిరాగాంధి పార్లమెంటు ఎన్నికల్లో గెలిచిన గెలుపు చెల్లనేరదని అలహాబాద్ హైకోర్టులో వేసిన పిటిషన్లో విజయం సాధించటంతో పాలక పార్టీల మధ్య సంక్షోభం ముదిరింది.ఈ నేపథ్యంలోనే ఇప్పటికి సరిగ్గా 46 సంవత్సరాల క్రితం అంటే 25 జూన్, 1975 అర్ధరాత్రి ఉరుములు, పిడుగులు లేని ఒక భయంకరమైన రాజకీయ తుఫానొకటి దేశం మొత్తాన్ని కల్లోలం చేసింది. దేశ పటం మొత్తాన్ని చీకటి బురదలో ముంచి తీసింది. రాజ్యం తాను వేసుకున్న ప్రజాస్వామ్యపు ముసుగుని విసురుగా తీసేసి కొమ్ముల, క్జోరల, రక్తపు నాలికల నిజస్వరూపాన్ని చూపిస్తూ బరితెగింపుగా నిలిచింది. తన రూపానికి “ఎమెర్జెన్సీ” అని నామకరణం చేసుకున్నది. (ఆ నాటి రాష్ట్రపతి స్నానాలగదిలో నీటి తొట్టెలో లాల పోసుకుంటూ ఎమర్జెన్సీ ఆర్డర్ మీద సంతకం పెట్టినట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ దిన పత్రిక కార్టూనేసి కిసుక్కున నవ్విందిలే) రాజ్యాధిదేవత ఐన ఇందిరాగాంధి తన కుర్చీకి అంటుకున్న నిప్పుని ఆర్పటానికి, తన కుమారుడికి తన పక్కనే మరో చిన్న కుర్చీ వేయించటం కోసం ఎమర్జెన్సీ ప్రకటించింది. కనుచూపుమేరలోనే కాదు అసలు దేశంలోనే తన మాటకే కాదు తన చూపుకి కూడా ఎవరూ అడ్డం రాకూడదని ఆజ్ఞాపించింది. బడి గోడలు లేపాల్సిన నేల మీద జైళ్ల గదులు పెంచింది. ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యాన్ని కలలు కన్నది. రాజ్యమంటే పోలీసని, పోలీసంటే సామాన్యజనం వీపుల మీద లాఠీ దెబ్బని, నిరసించిన వారి గుండెల్లోకి సూటీగా తుపాకీ గుండు దిగటమని, పార్లమెంట్ అంటే రాజాస్థానమని, చట్టాలు పాలకుల సౌలభ్యాల కోసం చేసేవని ఆమె పరిపాలనకు కొత్త నిర్వచనాలు ఉదహరణాత్మకంగా చూపింది. ఆమె తన కాళ్లు తానే కడుక్కొని, ఆ కడిగిన నీళ్లు తానే తన నెత్తిన చల్లుకోవటంతో పాటు రాజ్యం యొక్క సమస్త అంగాలు కూడా ఆ నీటిని చల్లుకుంటూ ప్రజలందరి నెత్తిన చల్లాలని ఆదేశించింది.
అంతే! ఆకాశవాణి మోరెత్తి మరీ అమ్మవారి గొప్పతనాన్ని కూసింది. పత్రికల సెన్సారింగ్ మొదలై పోలీసులు, ప్రభుత్వాధికారులు పార్ట్ టైం సంపాదక వృత్తిని చేపట్టారు. దినపత్రికలు తమకు ప్రభుత్వం ఏ గడ్డిని కేటాయిస్తే ఆ గడ్డి తిని అవే వార్తల పిడకల్ని గోడల మీద విసర్జించాయి. ప్రతిపక్ష నాయకుల అరెస్టులతో, యువ విద్యార్ధి నాయకుల హత్యలతో, కళాకారుల దేహాలు రైలు పట్టాల మీద శవాలుగా తేలటంతో దేశమంతా ఓ చీకటికొట్టంగా తయారైంది. కానీ అమ్మవారు, వారి యువరాజు మాత్రం దేదీప్యమానంగా వెలిగిపోతున్నారు. కమ్యూనిష్టోడు లేదు, ఆరెస్సెస్సోడు లేదు…ఎవడు నోరెత్తితే వాడు హఠత్తుగా ఇంటి నుండి మాయం అయ్యేవాడు. వాడి అదృష్టం బాగుంటే జైల్లో తేలేవాడు లేదా ఏ శివార్లలోనో ఎన్ కౌంటరయ్యేవాడు. ఆ సమయంలో పార్టీ కేడర్కి పోలీసోడికి కూడా తేడా లేకుండా పోయింది. అంతా గూండాగిరి! సామాన్యజనం పొట్టల మీద పడి బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసేసారు. మునిసిపాలిటీ వాళ్లు వీధి కుక్కల్ని పట్టుకొని “స్టెరిలైజ్” చేసినట్లు అసలు పెళ్లికాని యువతీ యువకులకు కూడా “ఆపరేషన్లు” చేసేసారు. పేదరిక నిర్మూలన కార్యక్రమం పేరుతో పేదల నిర్మూలన అమలైంది.
సరిగ్గా ఈ సందర్భంలోనే నగ్నముని విలోమ కథలు రాసారు. విలోమం అంటే తలకిందులు. అసంబద్ధత అని కూడా చెప్పొచ్చేమో. ఒక అసంబద్ధ, తలకిందుల వాస్తవాన్ని చెప్పటానికి ఆయన విలోమ విధానాన్నే ఎంచుకున్నారు. అంటే ఈ కథలలో విలోమం అనేది వస్తువు, కథనం (కంటెంట్ అండ్ నేరేషన్) రెండింటిలోనూ కనబడుతుంది. ఏది పాలకుల దుర్మార్గమో అది కీర్తించబడటం, ఏ రాజకీయ, సామాజిక వాతావరణంలో ప్రజలు వ్యక్తిత్వాల్ని కోల్పోతారో అది సౌకర్యవంతమైన, సుఖప్రదమైన వ్యవస్థగా ప్రచారం చేయబడటం, ఎక్కడ చైతన్యం వెల్లివిరియాలో అక్కడ వెన్నెముకలు లేనట్లుగా జనం ప్రవర్తించటం….ఈ కాంట్రాస్ట్స్ ని వస్తువుగా స్వీకరించారు. బానిసత్వాన్ని, రాజకీయ నిరంకుశత్వాన్ని ధిక్కరించే తాత్విక ధోరణే ఈ కథల వెనుకనున్న అసలు అంశం. రెండవది శైలి. నగ్నముని మామూలు సాదాసీదా నేరేటీవ్ పద్ధతిలో కథలు చెప్పలేదు. జంతు రూపంలో వున్న మనుషుల పాత్రలు, మనుషుల రూపంలో వున్న జంతుపాత్రలూ సృష్టించారు. యానిమల్ ఫార్మ్! ఎందుకంటే అంతా కలగలిసిపోయిన వాతావరణం. మనుషుల ఆలోచనల్లో మెదడులేనితనం, ప్రవర్తనల్లో పరాయీకరణ, మానవసంబంధాల్లో డబ్బు యొక్క క్రూర కర్కశ పాత్ర, రాజకీయంగా ఏమాత్రం చైతన్యం లేనితనం, కుటుంబ జీవితంలో హింస, ఆధిపత్య ధోరణులు, సామూహిక జీవితంలో ఒకరినొకరు తొక్కేసుకునే గందరగోళం – ఇది ఏ మాత్రం ఆరోగ్యంగా వున్న సమాజం కాదన్నదానికి దృష్టాంతంగానే ఆయన ఈ ఆరు విలోమ కథలని రాసారు. వాస్తవికతని పాఠకుల బుర్రల్లోకెక్కించేందుకు ఆయన అధివాస్తవిక ధోరణిని కత్తిలా వాడుకున్నారు.
మరి ఆయన ముఖ్యంగా, ప్రముఖంగా కవి కదా, మరి కవిత్వం రాయకుండా కథలెందుకు రాసారంటే నవరస భరిత ఉద్వేగమూ, బలమైన ఊహతో కూడిన భావచిత్రాలు, గుండెలు జలదరించే ఉపమానాల ప్రయోగం…ఇవన్నీ గొప్ప కవిత్వ లక్షణాలైతే – ఈ కథల నిండా ఆ లక్షణాలు వున్నాయి. లైన్లుగా విడగొడితేనే కవిత్వమా? పేరాగ్రాఫుల్లో కూడా కవిత్వం రాయొచ్చుగా! ఆయన అదే పని చేసారు. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలన్నట్లు అసంబద్ధ వాస్తవికతని అసంబద్ధ శైలీ విన్యాసంతో, అథివాస్తవిక కవితాత్మక కథనంతో ఆయన ఈ ఆరు కథలు రాసారు. వాక్యాలకు వాక్యాలు పర్వత శిఖరాగ్రాల నుండి అగాధాలలోకి జలపాతపు ధారలా పడుతున్నట్లున్న కవిత్వస్థాయితో దిగ్భ్రాంతికి గురిచేస్తాయి. కథకి, కవిత్వానికి అభేదం పాటించిన కథన శైలితో మనల్ని చకచ్చకితుల్ని చేస్తాడు రచయిత. అంతిమంగా మనకి కనిపించేది మాత్రం ఆయనలోని పాలకుల దురాగతాల పట్ల ధర్మాగ్రహం, రాజ్య వ్యవస్థల నిర్లక్షం అసమర్ధత పట్ల నిరశన, ప్రజల తరపున నిలబడాల్సిన శక్తుల నిర్ల్లిప్తత పట్ల తీవ్ర అధిక్షేపణ! ఈ కారణాల చేతనే దివంగత రామతీర్థ “విలోమ కథలు” అంతర్జాతీయ స్థాయిని కలిగి వున్నాయని అని చెబుతూ నగ్నమునిని ఫ్రాంక్ కాఫ్కా, ఆల్బర్ట్ కామూతో పోలుస్తారు.
****మొత్తం ఆరు కథలు. కథాంశం ఏదైనా ప్రతి కథా ఒక దృశ్య ప్రవాహం. తమని తాము కోల్పోయిన మనుషుల అంతరంగాల్లోకి వెళితే ఏం కనబడుతుందో అదో దృశ్యమై కథగా సాక్షాత్కరిస్తుంది. ఈ కథలన్నింటి సామాజిక దృశ్యం ఒక్కటే. ప్రజలకు, పాలకులకు మధ్య ఏ రకమైన సానుకూల సంబంధం లేకపోవడం, ప్రజలు వాళ్ల చావులు వాళ్లు చస్తుంటే పాలకులు తమ బొజ్జలు తాము నింపుకుంటూ, తమ కుర్చీల్ని కాపాడుకోవడం. ఇందులోని అన్ని కథల్లోనూ ప్రభుత్వ కార్యాలయాల వాతావరణం, ప్రభుత్వోద్యోగుల యాంత్రిక పని విధానం, వారి చాలీ చాలని బతుకులు కనబడటం యాధృచ్చికం కాదు. నాలుగున్నర దశాబ్దాల క్రితం నాటి పేద, దిగువ మధ్య తరగతి జీవితాల దుర్భర దరిద్రం కళ్లకు కట్టినట్లు ఆయా కథల్లోని పాత్రల గృహ వాతావరణంలో కనబడుతుంది. ప్రజలెంత బలహీనంగా వుంటే ఎమర్జెన్సీ వంటి రాజకీయ ఉత్పాతాలు ఏర్పడతాయో అర్ధం అవుతుంది. ఎమర్జెన్సీ సామాన్య ప్రజానీకం ప్రయోజనం కోసం కాక రూలింగ్ పార్టీల మధ్య కుర్చీ తగాదాల పరిణామమే ఐనప్పటికీ దానికి బలి పశువులు మాత్రం అప్పటికే చితికిపోయి వున్న సామాన్య, బలహీన ప్రజలే. ఈ కథల్లోని పాత్రధారులు వాళ్లే. ఈ ఆరు కథల్లోని ఒక్క చివరి కథ మినహా ఏదీ డైరెక్ట్ గా ఎమర్జెన్సీ గురించి మాట్లాడదు. ఐనప్పటికీ మనకు ఆ కాలపు రాజకీయం, పాలనా వ్యవస్థ బాగా అర్ధమవుతాయి ఈ కథల ద్వారా!
మొదటి కథ శీర్షిక “ఇందుమూలముగా సమస్తమైనవారికీ మన ముఖాలూ కాళ్లూ చేతులూ వగైరా సర్వాంగాలను గురించి తెలియజేయడమేమనగా….” ఈ కథలో ఒక రాజకీయ అవ్యవస్థలో మనిషి తాను ఉపయోగించడం మానేసిన జ్ఞానేంద్రియాల ఘోష వినబడుతుంది. ఎవరూ తమ స్వంత బుర్రలతో కాకుండా మరొకరి ఆలోచనలతో బతకాల్సిన దౌర్భాగ్య స్థితి మీద వ్యంగ్యపు కొరడా చెళ్చళ్మని మోత మోగిస్తుంది. ఒకరి తలకాయలు మరొకరు పెట్టుకొని తిరగడం ఓ గొప్ప ప్రతీక!
రెండో కథ “పులి బెబ్బులి”. జీవితాన్ని వ్యాపార విలువలు ఆక్రమిస్తే మనిషిలోని జంతువు నిద్రలేచి చుట్టుపక్కల జీవితాల్ని ఆరగించేస్తాడనేది ఈ కథ సారాంశం. మెల్లగా మొదలైన వ్యక్తిత్వ హననం పూర్తిగా తనని తాను కోల్పోయేంత వరకు తెలియదు. చివరికి ఒక్క మనిషి తలకాయ (ఆలోచన) వున్న వ్యక్తి కోసం అన్వేషణ చేయాల్సి వస్తుందనేది సారాంశం.
మూడో కథ “శిశు హత్య”. ఓ దిగువ మధ్య తరగతికి చెందిన విఘ్నేశ్వర్రావు కథ ఇది. చేతి వాచీ నుండి ఇంట్లో తప్పేలాల వరకు ఇంట్లో వస్తువుల్ని తాకట్టు పెట్టుకుంటే తప్ప అప్పటి జీవితంలో కనీస రిలాక్సేషన్ అయిన సినిమా కూడా చూడలేని బతుకు అతనిది. సినిమాకి వెళ్లినా ఏ అప్పులాడో ఎక్కడ తగులుకుంటాడో అనే భయం కూడా అతనిదే. మగపిల్లాడి కోసం మూడో కానుపుకో, నాలుగో కానుపుకో పెళ్లాన్ని సిద్ధం చేసిన అతను ఓ రాత్రి పుట్టబోయే బిడ్డతో సంభాషణ జరుపుతాదు. ఓ విషాద ముగింపు తప్ప అలాంటి జీవితాలకి మరేం మిగులుతుంది?
నాలుగో కథ “లైకా మజ్ఞు ప్రళయ గాధ”. ఇదో ఫక్తు రాజకీయ కథ. ఐతే రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల పాత్రలు లేని కథ ఇది. దేశం మొత్తంలో ఏర్పడుతున్న నియంతృత్వ ధోరణులకి ప్రతీకగా లైకా అనే కుక్క, ఆ కుక్క మొసలి రూపంలో వున్న మజ్ఞు అనే మరో పెద్ద నియంతతో ప్రేమలో పడి గర్భం దాల్చి, తన యజమానులైన ప్రజలకి కాపలా కాయాల్సిన తన ప్రాధమిక బాధ్యతల్ని విస్మరించి వారినే గాయపరిచే వైనమే ఈ కథాంశం. అంతర్జాతీయంగా ఏదో సామ్రాజ్యవాద శక్తితో కలియడమే తప్ప తన దేశంలో బాధ్యతాయితమైన ప్రజాస్వామిక పరిపాలన మరిచిన అలనాటి పాలకురాలు గుర్తుకు రాకమానదు. ఈ క్రమమే ఎమర్జెన్సీ విధింపుకి దారి తీసిందనేది రచయిత అవగాహన కావొచ్చు.
ఐదో కథ “సిమెంటు సంతతి”. ఈ లోకంలోకి మనుషులు వచ్చి పోతుంటారు కానీ కాంక్రీటు సిమెంటు నిర్మాణాలకు మనుషుల్ని మించిన ఆయుర్దాయం వుంటుంది. సిమెంటు శిలా రూపంలో జంక్షన్లలో మనల్ని దివంగత నాయకులు చేతులూపుతూనో, చిరున్నవ్వులతోనో పలకరిస్తున్నంత కాలం వారి దుర్మార్గ పరిపాలనా భావజాలం కూడా సజీవంగా వున్నట్లే. ఎందుకంటే వారు ఆదర్శం చేయబడతారు. పార్కులో ఓ మూల పడిపోయిన విగ్రహం కూడా అమాయక యువతిని మోసం చేయడం ఈ కథాంశం.
ఆరవ కథ “గ్రహణం” (ఇప్పుడు పునర్ముద్రణలో ఈ కథ శీర్షికని “నర గ్రహణం” అని మారుస్తున్నారు). ఈ సంకలనంలో వున్న అతి ముఖ్యమైన కథ. అతి పెద్ద కథ కూడా ఇదే. కథ మొదలవటమే 26, జూన్ 1975 అని మొదలవుతుంది. అంటే ఆ ముందురోజు అర్ధరాత్రే (25 జూన్ అర్ధరాత్రి) ఎమర్జెన్సీ విధించటం జరిగింది. 26వ తేదీ మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు గాఢాంధకారం అలుముకొని ఉండటంతో కథ మొదలవుతుంది. సమాజంలో ఎన్నో వర్గాలు…ఒకదానితో మరొకదానితో సంబంధం లేకుండా. ఎవరి బతుకు వాళ్లదే. అవయవాలు అమ్ముకునే వారి నుండి కార్లలో జల్సాగా తిరిగేవాళ్ల వరకు. ఈ నికృష్ట సందర్భంలో కూడా నియంతని ఎదిరించి నిలిచే గుంపు స్వామివంటి వారి ప్రస్తావన ఉంటుంది. “ఓ దివిటీ చీకటిని నుసినుసిగా కాలుస్తూ ఎర్రని జెండాలా రెపరెపా వెలుగుతుంది” అంటూ ముగిస్తారు. అది ఎమర్జెన్సీ కాలంలో పెరుగుతున్న ప్రజా ప్రతిఘటనకి సంకేతం. ఔను. చివరికి ఆ ప్రతిఘటనే నియంతని కుర్చీ నుండి దింపింది.
****
నాలుగున్నర దశాబ్దాల తరువాత మూడవ ముద్రణగా “విలోమ కథలు”ని నగ్నమునిగారు మళ్లీ ప్రచురిస్తున్నారట. అయితే ఇప్పుడా అవసరం ఉందా అనేది అవసరమైన ప్రశ్నే. “అవును! ఆ అవసరం వుంది” అనేది అంతకు మించిన అత్యవసర సమాధానం. ఎమర్జెన్సీలని అధికారికంగా ప్రకటించే మొహమాటాల్ని పాలకులు వదిలేసి చాలా కాలమైంది. మళ్లీ దరిద్రం భయంకరంగా బుసలు తున్నది. వాక్స్వాతంత్ర్యం ఒక పురాతన జ్ఞాపకమౌతున్నది. ఆధిపత్య సంస్కృతి దేవుడి మేకప్ వేసుకొని నడి బజార్లలో వీరంగమేస్తున్నది.
ఇంతకంటే అత్యవసర సమయం వున్నదా “విలోమ కథలు” మళ్లీ ప్రచురణకి రావటానికి?
ముందు మాట అద్భుతంగా రాశారు అరణ్య కృష్ణ గారూ…నేటి కాలానికి ఆ కథల ఆవశ్యకత చెప్పారు…
…కానీ పరిస్థితి లో మార్పు వచ్చింది…ద్రవ్య పెట్టుబడి తన దైన నిర్మితమైన వ్యవస్థని,పరిణామాలను సృష్టించింది…క్యాపిటల్ ఆధారిత సంస్కృతి ని adopt చేసుకోవాలి…any how thanks to saaranga and aranyakrishna.. పోటు రంగారావు
ధన్యవాదాలు రంగారావుగారూ. మీ అభిప్రాయంని మరికొంత విశదీకరిస్తారా?
విలోమ కథల సంపుటి మూడో ప్రచురణకు రావడం సంతోష విషయం..కథల ప్రాసంగికత విషయానికొస్తే అత్యవసర పరిస్థితి అప్పుడు ప్రకటిత మైనది ఇప్పుడు అప్రకటితం అంతే తేడా!
మీ ముందుమాట చాలా బాగుంది.నగ్నముని గారికి మీకు అభిననందనలు💐💐💐💐💐
ధన్యవాదాలు వేణుగోపాల్ గారూ!