ముదురాకుపచ్చ కొండల దొంతర్ల పై పరచుకొన్న మంచు మైదానాల పక్కగా నీలి గగనం నుంచి ల్యాండ్ అవుతోన్న విమానం లోంచి నేల వైపు చూస్తోంటే వో చిర పరిచితమైన మనోదేహ స్వర పరిమళమొకటి దర్శనని మెల్లమెల్లగా పలకరిస్తోంది. చక్రం నేలని తాకీ తాకగానే అంతా హడావిడిగా సెల్ ఫోన్స్ ఆన్‌చేశారు. ఫ్రెంచ్, యింగ్లీష్ భాషల కలగాపులగపు పలకరింపుల సవ్వడి. దర్శన యెరైవల్స్ లాంజ్ వైపు వస్తుంటే విహాన్ యెదురొచ్చాడు. పొడువుగా పెరిగిన అతని జుట్టుని చేతివేళ్లతో చిన్నగా చెరుపుతూ ‘నైస్’ అంటూ అతన్ని హగ్ చేసుకొంది. యిద్దరూ బయటికి వచ్చారు.
అతని పక్కన జీప్‌లో కూర్చుంటూ, ‘‘వో భలే వుందే. సెల్ప్ డ్రైవింగ్ కోసం రెంట్‌కిస్తారా,’’ అడిగింది దర్శన.
‘వూ.’’
దారికి అటుయిటూ వొంపులు తిరిగిన పచ్చని కొండలు. అసలే మంచు కురిసే కాలం, పైగా రాత్రి చిన్న వానజల్లు. ఆకులు పువ్వులు కొండలు భూమి తడిసిపోయిన సువాసన మత్తుగా కమ్ముకొంటుంటే ఆమె అతని అతి పల్చని గడ్డంపై చూపుడువేలితో టచ్ చేస్తూ, ‘‘హౌ వోల్డ్ యీజ్ యిట్’’ అడిగింది.
‘‘వన్ డే. రాత్రి నువ్వొస్తున్నావని చెప్పాక యీ రోజు వుదయం షేవ్ చేయలేదు,’’ అన్నాడు విహాన్.
‘‘వో నేనిలా సడన్‌గా రావటంతో నిజంగానే నీ వర్క్ డిస్ట్రబ్ కాలేదుగా,’’ అడిగింది.
‘నాట్ యెటాల్, నిన్నే షూట్ పూర్తి అయిపోయింది. టీమ్ రాత్రే వెళ్లిపోయింది. ఫుల్ ఆఫ్ కలర్స్‌తో వున్న యీ ప్లేస్‌లో నువ్వుంటే బాగుండునని చాలాసార్లు అనుకొన్నా. సడన్‌గా నువ్వొస్తానంటే ద్రి¸ల్ అయ్యా. సో యీ వీకెండ్ యిక్కడే నీతో స్పెండ్ చేయటం… రియల్లీ ఐ యామ్ వెరీ హ్యాపీ,’’ అన్నాడు విహాన్.
‘‘వో… ధ్యాంక్ యు.’’
జీప్ యెత్తైన కొండపై నుంచి వెళ్లుతోంది. నిలువెత్తు హోటల్. పక్కనే పొదరిల్లులాంటి కాటేజస్. రూమ్ లోకి వస్తూనే కిటికీకి వున్న లేతాకుపచ్చ కర్టెన్స్‌ని రెండు చేతులతో రెండు వైపులకి జరిపింది. యెదురుగా ముదు రాకుపచ్చ కొండలపై విలాసంగా పరుచుకొన్న మంచు. అతను ఆమె వెనగ్గా నిల్చుని ఆమె భుజంపై చుబుకాన్ని ఆన్చి రెండు చేతుల్ని ఆమె మెడ చుట్టూ వేసి బుగ్గపై చిన్ని ముద్దు పెట్టాడు. బయటకి చూస్తున్న ఆమె తల తిప్పి అతని వైపు చూస్తూ, ‘‘యింత అందమైన ప్రదేశంలో యెన్ని పాటలు షూట్ చేశారు,’’ అడిగింది.
‘‘రెండు పాటలు, నాలుగు సీన్స్,’’ అన్నాడు.
‘‘ఆ ప్రదేశాలన్నీ తిరిగి చూడొచ్చా,’’ అడిగింది.
‘‘చూద్దాం.’’
‘‘నీకు చూసేసినవేగా అనిపిస్తుందేమో.’’
‘అనిపించదు దర్శన. షూట్ చేస్తున్పప్పుడు చుట్టూ అందం కళ్లలోకి యింకదు. లైట్ మిస్సవుతామా… యిది స్క్రీన్ మీద యెలా వుంటుంది… యూనిట్ దృష్టంతా ప్రోడక్ట్ మీదే. అందులో మా డైరెక్ట్‌ర్‌గారు లొకేషన్‌లో పనిపై తప్ప యింకే విషయంపై దృష్టి వుంటే వూరుకోరు. కాఫీ తాగుతావా.’’
‘‘వూ.’’
వేడివేడి బ్లాక్ కాఫీ కలిపి యిచ్చాడు.
సిప్ చేసి, ‘‘బ్లాక్ కాఫీ బాగా ప్రిపేర్ చేస్తావ్,’’ అందామె.
‘‘ధ్యాంక్ యూ. బయటకి వెళదామా,’’ అడిగాడు.
యిద్దరూ బయటకి వచ్చారు.
జీప్ పచ్చని మంచు తెరల్లోంచి కొండ వాలుల్లోంచి పయనిస్తోంది.
మంచు కమ్ముకొంటున్న విహాన్ చల్లని బుగ్గపై దర్శన ముద్దు పెట్టింది. అతని బుగ్గపై ఆమె పెదవుల ఆకృతి. తిరిగి క్షణంలో ఆ అధర చిత్రం మంచుతో నిండిపోతుంటే ఆమె తిరిగి అతని బుగ్గకి వేగంగా తన పెదవులని ఆన్చింది. తిరిగి ఛాయ. మళ్లీ మంచు. ‘‘నిన్ను ముద్దు పెట్టు కోవటానికి నాతో యీ వేళ మంచు పోటిపడుతోంది,’’ నవ్వుతూ అంది దర్శన.
అతను అతి నిశ్శబ్దంగా నవ్వాడు.
దర్శన యెప్పుడు యిలానే హై స్పిరిట్స్‌లో వుంటుంది. పోయినసారి వచ్చినప్పుడు బాస్‌తో చికాకు వుందని చెప్పింది. అయినా యిలానే యెనర్జిటిక్‌గా వుంది. యెందుకో రీజన్ తెలీదు.
‘‘‘నీ ఆఫీస్ ప్రోబ్లమ్ సాల్వ్ అయిందా.’’
‘‘జాబ్‌లో అలాంటివి తప్పవని కాస్త అర్థం అయింది,’’ అంది.
‘‘యెలాంటివి…’’
‘‘మా టీమ్ లీడర్‌తో చికాకు. ప్రతి విషయానికి చికాకు పెడతాడు. అతను మొదట్నుంచి యీ యెన్విరాన్‌మెంట్ నుంచి రాలేదు. సో యిక్కడ యెలా వుంటుందో తెలీదు. చాల కన్‌ఫ్యూజ్డ్ ఫెలో. అంతే కాకుండా కాస్త యిన్‌ఫీరియారిటి కాంప్లెక్స్. దాన్ని సుపీరియర్ క్వాలిటీగా ప్రదర్శించాలనే తాపత్రయం. వుద్యోగాలు వుద్యోగాల్లానే వుంటాయి. వాటి విషయంలో యెక్కువ బాదర్ కాకూడదని మా కౌన్స్‌లర్ చెప్పింది,’’ అంది దర్శన.
‘‘అయినా నీ బిహేవియర్‌లో అలాంటి చికాకే పోయినసారి కనిపించలేదు. యిప్పుడూ లేదు. అలా యెలా వుండగలవ్…’’
‘‘సింపుల్ విహా. నా హేపీనెస్ అంతా నువ్వు. అందుకే మిగిలిన చికాకులేం తాకవ్,’’ అతని చెవిలో ముద్దు పెడుతూ అంది.
‘‘సో యూ ఆర్ హ్యాపి. గుడ్..’’ విహాన్ మాటలు పూర్తి కాకుండానే ఫోన్ మోగింది.
‘‘హాయ్.. స్వీట్ హార్ట్. ష్యూర్.’’
‘‘నేనర్జంట్‌గా వెళ్లాలి దర్శన. యిక్కడ నుంచి క్యాబ్ బుక్ చేస్తాను. హోటల్‌కి వెళ్లిపోతావా,’’ అడిగాడు.
యేంటన్నట్టు చూసింది.
‘‘ఐ నీడ్ టు గో,’’ అని అతను అంటుండగానే తిరిగి ఫోన్.
‘‘కమింగ్.. కమింగ్,’’ అని అతను హడావిడిగా జీప్ తిప్పుకొంటూ దర్శనని దిగమన్నట్టు సైగ చేస్తోంటే ఆమె దిగింది.
అతను వెళ్లిపోయాడు.
ఆ కొండల యేటవాలు బాటపై ఆమె వొంటరిగా నిలబడింది. ఆమెకి అసలు అతను తనని వదిలి అలా యెందుకు వెళ్లిపోయాడో, అసలు అంత అర్జెంట్ విషయం యేమైవుంటుందోనని ఆలోచిస్తూ నిల్చుంది కాసేపు. చాల ముఖ్యమైన విషయమేదో కాకపోతే అలా వెళ్లిపోడు కదా.. పిచ్చబ్బాయి!! వెనక్కి తిరిగేగా వెళుతున్నాడు తనని యేదో వొక టాక్సీ పాయింట్ దగ్గర ఆపొచ్చుగా. ముందు అలానే అను కొన్నట్టున్నాడు. మళ్లీ ఫోన్ వచ్చేసరికి ఆ విషయమే మర్చిపోయినట్టున్నాడు. జీప్ కూడా దిగిపోమన్నాడు. ముందుకు వెళితే ట్యాక్సీ దొరుకుతుందా?! వెనక్కి వెళితే దొరుకుతుందా?! అటుయిటు టూరిస్ట్‌లతో వెళుతోన్న వాహనాలు కనిపిస్తున్నాయి. వాటిని ఆపితే.. యెటు వెళ్లాలో అడిగితే.. తిరిగి వచ్చిన దార్నే వెనక్కే నడుస్తుంటే ఆమె మనసు దిల్ తడప్ తడప్.. హమ్ చేస్తూ నడుస్తోంది. యిలాంటి అందమైన కొండల్లోకి వచ్చాకే కదా మధుమతి కనిపిస్తుంది. ఆజారే పరదేసి.. వూహా.. అంటుండగానే దబదబా నాలుగు చినుకులు రాలయి. సంగీతానికి యెంత పవర్ వుందో కదా. యిలా పాడుతున్నానో లేదో అలా వాన. వో గాడ్ యేం కనిపించవేంటి..! ఫోన్ చేస్తే విహాన్‌కి. వో గాడ్! హాండ్ బ్యాగ్ జీప్‌లోనే వుండిపోయింది. మొబైల్ అందులో వుంది. ఆహా… అచ్చు సినిమాలో హీరోయిన్ లా చేతిలో డబ్బుల్లేవ్. ఫోన్ లేదు. కొత్త ప్లేస్. దారీ తెలీదు. సరిగ్గా యిలాంటి వేళే హీరో వస్తాడు. హీరో వస్తాడా?! అరే దర్శనా వదిలి వెళ్లిందే హీరో కదా… యింక హీరో రావటం యేంటి?! వెరైటీగా విలన్ వస్తాడేమో… విలన్ లిఫ్ట్ యిచ్చి హీరో దగ్గరకి తీసుకు వెళతాడేమో… వెరైటీ కథ… డిఫరెంట్ లవ్‌స్టోరీ… బాప్‌రే టీవీ చూసి చూసి కామెడి అలవాటైపోయింది.
ఆమె ఆగింది. యిలా యెంత దూరం నడుస్తుంది. కాళ్లు లాగుతున్నాయి. కాసేపు దారి పక్కన కూర్చుంది. దాహం వేస్తోంది. యెలా… యిలా కాదు యేదో వొక వాహనాన్ని ఆపటమే. ప్రయత్నించి వో టూరిస్ట్ మినీబస్సు యెక్కింది. కొంత దూరం వెళ్లాక ‘మనీ లేదు.’ అంటూ క్లీనర్ లాంటి అతనికి మెల్లగా విషయం చెప్పింది. ఫోన్ నెంబర్ యిస్తానంది. అతని నెంబర్ యివ్వమంది. మనీ యిచ్చేస్తానంది.
‘‘బస్సు యెక్కకముందే చెప్పాల్సింది… డబ్బుల్లేవని,’’ అన్నాడు.
ఆమె నవ్వి, ‘‘యింత కథని అక్కడ చెప్పి మిమ్మల్ని వొప్పించటం టైమ్ వేస్ట్ కదా… అయినా మీరు హెల్ప్ చేసేవారిలానే కనిపించారు,’’ అంది.
ఆమె డబ్బులు యిచ్చినా యివ్వకపోయినా పర్లేదు. తనని పొగిడింది అదే చాలు యీ జన్మకి అని అతను అనుకోలేదు. యిలాంటి అందమైన మాటకారి అమ్మాయిలని తను చాలామందినే చూశాడు. మనీ ముఖ్యం… అనుకొంటూ, ‘‘నా ఫోన్నుంచి కాల్ చేసి సెంటర్ దగ్గరకి మనీ తెమ్మనండి,’’ అన్నాడు.
ఆమె విహాన్‌కి కాల్ చేసింది. అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అదే అతనికి చెప్పింది. రేపు మనీ యిచ్చేస్తానని చెప్పి తన నెంబర్‌కి అతని మొబైల్ నుంచి ఫోన్ చేసింది.
అక్కడ నుంచి దారి కనుక్కొంటూ మెల్లగా నడుచుకొంటూ హాటల్‌కి వచ్చింది. నిండైన కొండల ప్రాంతమేమో అప్పటకే చీకట్లు అల్లుకొంటున్నాయి.
రూమ్ లోకి వెళ్లి అలా సోఫాలో వాలింది. ఆకలి తెలుస్తోంది చాలా సేపటిగా. ముందు వో కప్పు కాఫీ కలుపుకొని తాగింది.
విహాన్ యేమయ్యాడు?! యింతసేపు యెటు వెళ్లిపోయాడు?! అసలు యేమయింది?! రూమ్ లోంచి కాల్ చేసింది. నో రిప్లై.. కాసేపు అతని కాల్ కోసం చూసి స్నానం చేసింది. ఫుడ్ ఆర్డర్ చేద్దామా అనుకొంది. యెటూకాని యీ టైమ్ లో తింటే డిన్నర్ చేయటం కష్టం. విహాతోనే డిన్నర్ చెయ్యాలి. ఫ్రూట్ బాస్కెట్‌లోంచి వో స్ట్రాబెర్రీ తీసుకొంది. ఆ ఫ్రూట్ చూస్తూ ‘అచ్చు విహాన్ లిప్స్‌లా వుంది,’ అనుకొంది.
టివి ఆన్ చేసి టైమ్ చూసింది. టైమ్ యేడున్నర. యింటికి ఫోన్ చెయ్యాలి. అమ్మకి వుదయం నుంచి చేయలేదు. నెంబర్ గుర్తులేదు. సెల్ లేదు. ‘అసలు యీ అబ్బాయి యేమయ్యాడో…’ తిరిగి తిరిగి ఆలోచనలు అక్కడికే వెళుతున్నాయి. అరే అతనేంటి కనీసం తన కాల్స్‌కి కూడా రెస్పాండ్ కావటం లేదు. విహాకి తెలిసినవాళ్లు యిక్కడ తనకెవ్వరూ తెలీదు. తిరిగి కాల్ చేసింది. నో రెస్పాన్స్. యేమయి వుంటుంది!? అంతకు మించి ఆమె మనసు కారణాలని వెతకటం వైపో లేదా వూహించటం వైపో వెళ్లటం లేదు.
తలుపు తట్టిన శబ్దం వినగానే ఛంగున గెంతుకొంటూ వెళ్లి తలుపు తీసింది. బెడ్ చేయటానికి వచ్చినతన్ని చూసి ముందు వద్దని చెప్పబోయి తిరిగి చేయమంది, కాసేపైనా యెవరో వొకరు రూమ్ లో తన ఆలోచన లకి అడ్డకట్ట వేస్తారని.
అతను బెడ్ చేసి, ‘గుడ్‌నైట్,’ అన్నాడు.
అతనికి టిప్ యివ్వటానికి కూడా తన దగ్గర డబ్బులు లేవు.
అతను వో క్షణం ఆగి వెళ్లిపోయాడు.
మరో కాఫీ తాగింది.
లాబీకొచ్చింది. రిసెప్ష్‌న్‌కి వెళ్లి వాళ్లని సెల్‌ఫోన్ అడిగింది. విహాకి మెసేజ్ పెట్టింది. కాసేపు యెదురుచూసింది. నో రిప్లై.. వుదయమంతా ఆ యెత్తైన కొండలు గుట్టలు మలుపులోంచి నడిచిందేమో అలసి పోయింది.
గదికొచ్చి అలా బెడ్ మీద వాలిందో లేదో నిద్రొచ్చేసింది.
ఆ పక్కనే మరో హోటల్ సూట్‌లో మగతనిద్రలో వున్న విహా ఫోన్ సైలెంట్‌లో వుంది. హఠాత్‌గా అతనికి దర్శన గుర్తొచ్చింది. మై గాడ్! తనని కాంటాక్ట్ చెయ్యాలి.. అనుకొంటూ ఫోన్ తీశాడు. కాల్ చేశాడు. నో రిప్లై. నిద్రపోయిందా.. అనుకొంటూ యస్ యం యస్ చూశాడు. వో గాడ్.. తన హాండ్‌బ్యాగ్ జీప్‌లోనే మర్చిపోయిందా. ‘హోటల్‌కి కాల్ చేద్దాం,’ అనుకొంటుండగా మంచి నిద్రలో మంచం మీద వున్న ముఫ్పై మూడేళ్ల హనీ కాస్త కదిలింది. అతను పక్కనున్న రూమ్ లోకి వెళ్లాడు.
హోటల్‌కి కాల్ చేయపోతోండగా, ‘‘డార్లింగ్,’’ మత్తైన స్వరంతో హనీ గదిలోకి వచ్చి అతని వొడిలో తలపెట్టుకొని పడుకొని అతని నడుం చుట్టూ చేతులు చేసి, ‘‘నన్ను వదిలి యిక్కడేం చేస్తున్నావ్…’’ అంది.
అతను వొంగి ఆమె బుగ్గపై ముద్దు పెట్టాడు. ఆమె మరింతగా అతన్ని పెనవేసుకొంటూ, ‘‘నేనుండగా నో ఫోన్స్ అని చెప్పానా.. నేనొచ్చినప్పుడు నీ రెండు చేతుల్లో వుండాల్సింది నేనేనని చెప్పానా.. నాకు దొరికే టైమే తక్కువ. అందుకేగా నీ షూట్ అవ్వగానే సర్‌ప్రైజ్‌గా వచ్చేశాను,’’ అని అతన్ని హత్తుకొంది. అప్రయత్నంగా అతను ఆమెని హగ్ చేసుకొన్నాడు.
తెల్లవారుతోంటే మెలుకువ వచ్చింది దర్శనకి. వెంటనే విహాన్‌కి కాల్ చేసింది.
సడన్‌గా ఆమెకి భయం వేసింది. యేమయింది?! యెందుకిలా?! అసలు కాంటాక్ట్ చేయనంత పని యేముంటుంది. యేమై వుంటుంది. యెవరిని అడగాలి… తామిద్దరికి వున్న కామన్ ఫ్రెండ్స్… వాళ్లిక్కడ లేరు. అక్కడివాళ్లకి యీ విషయం తెలీదు. నెంబర్స్ లేవ్. నిన్న వొక టాప్‌లెస్ జీప్‌లో వచ్చాడు కదా… రెంట్‌కి యిస్తారని చెప్పాడు. అలాంటి జీప్స్ యిచ్చేవాళ్లు యిక్కడ యెంతమంది వుంటారు. ట్రావెల్ డస్క్‌కి కాల్ చేసింది. నిన్న విహాన్‌కి జీప్ యిక్కడ నుంచే బుక్ చేశారు, అని అడిగింది.
‘‘సారీ… అలా వివరాలు యివ్వలేం,’’ అన్నారు.
ఆమె లాంజ్‌లోకి వచ్చింది. మేనేజర్‌ని కలిసి నిన్న విహాన్ బయటకి వెళ్లాడు. యిప్పటివరకు రాలేదని.. యిలా విషయం చెపితే కంగారుపడొచ్చు. అతను యింకెవరికైనా చెప్పొచ్చు. విహాని యెంబ్రాసింగ్ సిట్యు యేషన్‌లో పెట్టటం యెందుకు.
‘‘జీప్ వొకటి కావాలి. యెక్కడిస్తారు,’’ అడిగింది.
వాళ్ల నెంబర్ నోట్ చేసుకొని, వో క్యాబ్ తీసుకొని అక్కడికి వెళ్లింది. అక్కడెలా మాటాడాలో ముందే రిహార్సల్స్ వేసుకొంది.
‘‘నిన్న మా ఫ్రెండ్ తీసుకెళ్లారు. అలాంటి జీప్ వుందా,’’ అని అడిగింది.
‘‘యెవరు,’’ అడిగాడు అతను.
‘‘విహాన్…’’
‘‘ఆ పేరుతో యేం లేదే,’’ అన్నాడతను సిస్టమ్ లో బుకింగ్స్ చూసి.
‘‘వూ… మే బీ… సినిమా కంపెనీ పేరు… లేదా హోటల్ పేరు మీదా…’’ అంది.
‘‘వో.. సినిమా డైరెక్టర్ సాబ్… అలాంటిది యిప్పుడు లేదు. అన్నీ బుక్ అయి వెళ్లిపోయాయి,’’ అన్నాడు.
‘‘అతను రిటన్ చేసేశాడా… అదీ వెళ్లిపోయిందా?’’
‘‘లేదు… రేపిస్తారంటా… వాళ్ల అసిస్టెంట్ యిందాకే ఫోన్ చేశాడు,’’ అన్నాడతను.
‘వో… ధ్యాంక్ గాడ్… యెవరోవొకరితో యేదో వొక కమ్యునికేషన్ వుంది,’ ఆమెకి వూరటగా అనిపించింది.
‘‘అవి లేకపోతే వద్దులేండి. ధ్యాంక్ యూ,’’ అని అక్కడ నుంచి హోటల్‌కి వచ్చి రెస్టారెంట్‌కి వెళ్ళింది.
బ్రేక్‌ఫాస్ట్ చేసి గదికి వచ్చింది.
రేపటి వరకు రాడా..!? యెలా.. యింతసేపు తనని అతనెందుకు కాంటాక్ట్ చేయలేదు. యిన్ని గంటల్లో వో రెండు క్షణాలైనా యెందుకు దొరకలేదు… యేమైవుంటుంది. పనా… లేక అతని హెల్త్‌కి యేమైనా అయిందా… తిరిగి ఆదుర్దా. యింట్లో వాళ్లని కాంటాక్ట్ చేయటం యెలా. సెల్‌ఫోన్‌లోనే సమస్తం స్టోర్ చేసేటప్పటికి నెంబర్స్ యెక్కడ రాయక పోవటం.. ఛ.. అనుకొంటూ బిజినెస్ సెంటర్‌కి వెళ్లింది. సిస్టమ్ తీసుకొని ఫేస్‌బుక్ వాల్‌పై చెల్లెలికి మాత్రమే యిన్పర్మేషన్ పోస్ట్ చేసింది. తల్లికి మెయిల్ రాసింది. తను రోజూ మెయిల్ చెక్ చేయదు కదా… అనుకొంటూ, ‘మమ్మీకి హాయ్ చెప్పు. సెల్ మిస్‌ప్లేస్ అయింది,’ అని తిరిగి చెల్లెలికి మెస్సేన్ జర్ లో మెస్సేజ్ చేసింది. యేదో వొకటి’ చూస్తుందిలే’’ అనుకొంది.
గదికి వచ్చింది.
పర్సు లేదు. క్రెడిట్‌కార్ట్ లేదు. ఫోన్ లేదు. తెలిసిన మనుష్యులు లేరు. ఆమెకి అసలు యేంటిదంతా అనిపించింది. గదిలో కూర్చుంటే యివే ఆలోచనలు అనుకొంటూ బయటకి వచ్చింది.
ఆ సన్నని చలిలో ఆ అపరిచిత దారుల్లో నడుస్తుంటే విహాతో స్పెండ్ చేయాలని యెంతగా కలలు కందో మనసులో మెదిలింది. యీ చల్లని చలిలో లేతవెచ్చదనం ప్రవహించే విహా చేతుల్లో వొదిగిపోవటం యెంత హాయిగా వుంటుంది. అసలు విహా సమక్షమే మోహరాగాలని యెప్పటి కప్పుడు కొత్తగా ఆలపిస్తుంటాయి.
ఆమె వొక్కక్షణం వులిక్కిపడింది. అదే జీప్.. విహా.. తన పక్క నుంచే వెళుతున్నాడు. తనని చూసుండడు. పక్కన యెవరో వున్నారు. విహా తన కోసం హోటల్‌లో కాంటాక్ట్ చేస్తాడేమో… యిప్పటికే కాంటాక్ట్ చేశాడేమో…
ఆమె తిరిగి హోటల్ రూమ్ కి వచ్చింది. యెలాంటి మెసేజ్ లేదు.
నిరీక్షిస్తునే వుంది. మధ్యాహ్నాం మూడవుతుంటే విహా వచ్చాడు.
‘‘వో సారీ డియర్. స్టక్ విత్ వర్క్,’’ ఆమెని హగ్ చేసుకొంటూ అన్నాడు.
పర్‌ఫ్యూమ్ … అతని బ్రాండ్ కాదు.
‘‘వొక్కసారైనా కాంటాక్ట్ చెయ్యాల్సింది. చాల టెన్స్‌గా అనిపించింది.’’
‘‘యెక్కడ డార్లింగ్… మొన్న చేసిన షూట్‌లో ప్రోబ్లమ్ వచ్చింది. అందుకే బయటకి రాలేకపోయాను. యిప్పుడే యిలా రావటం,’’ అన్నాడు.
దర్శనకి అతను కొత్తగా తోచాడు. యేదో తేడా… అడగాలా వద్దా… నో వద్దు… అనుకొంటూ నిన్నట్నుంచి తను పడిన ఆదుర్దా, యిన్‌కన్వీనియన్స్ చెప్పి, ‘‘నిన్నట్నుంచి నువ్వు వొక్కసారైనా నన్ను కాంటాక్ట్ చేయలేని స్థితిలో వుండటం రియల్లీ స్ట్రేంజ్… నీ సిట్యుయేషన్ నాకు తెలీదు… కాని యెందుకో యిదంతా అన్‌ప్లెజంట్‌గా వుంది. నీ కోసం నీ జీప్ రెంట్ కిచ్చిన ప్లేస్‌కి వెళ్లాను. అతనికి అతని జీప్ విషయంలో అప్‌డేట్ వుంది. ఆ విషయంలో తీసుకొన్నంత శ్రద్ధ కూడా నువ్వు నా విషయంలో తీసుకోలేదు,’’ అంటుంటే ఆమె కళ్లలో గిర్రున నీళ్లు తిరిగాయి.
‘‘యెక్స్‌ట్రీమ్లీ సారీ,’’ గిల్టీగా అనిపించింది విహాన్‌కి.
‘‘యిట్స్ వోకె విహా,’’ నిర్లిప్తంగా అంది.
ఆమెకి అతను వుదయం కనిపించటం పదేపదే గుర్తొస్తోంది.
ఆమె కాసేపు ఆగి, ‘‘అడగటం కరెక్టో కాదో తెలీదు. కానీ వుదయం నిన్ను చూశాను,’’ అంది.
అంటే తనని క్రాస్‌చెక్ చేస్తోందా.. హనీని చూసిందా..!? అతనికి వుక్రోషం వచ్చేసింది. అది కాస్తా కోపంగా మారింది.
‘‘నన్ను చూసినప్పుడు చూశాను అని కాకుండా యిలా క్రాస్‌చెక్ చేస్తావా… అన్ ఫేర్,’’ చికాగ్గా అన్నాడు.
దర్శనకి వింతగ అనిపించింది అతని చికాకు.
‘‘నీ సంస్కారమంతా యేమయింది. వొకమ్మాయిని చూడగానే యిలా అనుమానంగా బిహేవ్ చేస్తున్నావా,’’ రూడ్‌గా అన్నాడు.
అమ్మాయా!? పక్కనెవరో వున్నట్టు అనిపించింది కాని అమ్మాయో అబ్బాయో తెలీదు. అరే యిలా మాటాడుతున్నాడేంటి.. అనుకొంటూ ‘‘నీ పక్కనెవరున్నారో నే చూడలేదు. వున్నట్టు అనిపించింది. అంతే… అసలు నిన్ను క్లియర్‌గా కూడా చూడలేదు. అలా మాటాడతావేంటీ,’’ బాధపడుతూ అంది.
‘‘దర్శనా, నా ప్రొఫెషన్‌లో అందరితో పనిచెయ్యాల్సి వస్తుంది. యిలా ప్రోవింగ్‌గా వుంటే యెలా?! నిన్ను అంతసేపు అలా వెయిటింగ్‌లో పెట్టటం కరెక్ట్ కాదని నేనే చెపుతున్నా. కానీ నువ్వేంటో మాటాడు తున్నావ్…’’ మరింత విసుగ్గా అన్నాడు.
‘‘విహా.. నే చూడలేదు. నువ్వలా పని అంటూ చెపుతున్నప్పుడు నువ్వు కనిపించిన విషయం చెపితే బాగుండదనే ముందు నే మాటాడ లేదు. కానీ యేంటోలా వుంది నువ్వు మాటాడుతోంది. అందుకే మాటాడాను. యిట్స్ వోకె,’’ అంది దర్శన.
అతను కూడ కాసేపు నిశ్శబ్దంగా వున్నాడు.
ఫ్లైట్ టైమ్ అవుతోంటే ఆమె, ‘‘టైమ్ అవుతోంది. యెర్‌పోర్ట్‌కి బయలుదేరాలి,’’ అంది.
యిద్దరూ బయటకి వచ్చారు. జీప్ యెక్కారు. జీప్‌లోనూ అదే ఫర్ ఫ్యూమ్ పరిమళం.. అతని షర్ట్‌పై నుంచి వచ్చిన పరిమళమే.
అదే దారి… అవే మేఘాలు… అదే మంచు… కాని యిద్దరి మధ్యా అనుకోని యిరుకు.
యేర్‌పోర్ట్‌లో దిగాక ఆమె లోపలికి వెళ్లబోతూ అతన్ని హగ్ చేసుకొంది. అతని చేతులు ఆమెని తటపటాయింపుగా దగ్గరకి తీసుకొన్నాయి. ఆమెకి దు:ఖం వచ్చేసింది. వెక్కివెక్కి యేడ్చింది.
అతనికి మరింత గిల్టీగా అనిపించింది. కాని ఆ విషయాన్ని యెలా హాండిల్ చెయ్యాలో తెలియక, ‘‘యేంటా యేడుపు,’’ చికాగ్గా అన్నాడు.
ఆమె కళ్లు తుడుచుకొంటూ, ‘‘బై,’’ అంది.
కళ్ళయితే తుడుచుకొంది కాని వికలమైపోయిన మనసుని యెలా క్లీన్ చెయ్యాలో తెలియక సతమతమౌతూ చెకిన్ చేసింది.
యేర్‌పోర్ట్ నుంచి వెళుతుండగా విహాన్ మొబైల్ మోగింది.
‘‘ఫ్లైట్‌లో వున్నాను. నువ్వెప్పుడొస్తావ్..’’ అడిగింది దర్శన.
‘‘యేమో. బై…’’ అన్నాడు.
ఆమెకి మరింత దుఃఖం వచ్చింది.
అతను వో చోట జీప్ ఆపాడు. అతని మనసంతా చికాగ్గా వుంది.
‘దర్శన తనతో స్పెండ్ చేయాలని వచ్చింది. తనకి చాలా యిష్టం దర్శన సమక్షమంటే. తనతో యీ రెండ్రోజులు గడుపుదామని తను యీగర్‌గా యెదురు చూశాడు. కాని అనుకోకుండా హనీ వచ్చింది. హనీ తన కెరీర్‌కి చాలా చాలా యింపార్టెంట్ రిసోర్స్. తనని యిగ్నోర్ చేయటం కుదరదు. అంతేకాదు, తనకి మరో స్త్రీతో సంబంధం వుందని తెలిస్తే హనీ చాలా అప్‌పెట్ అవుతుంది. దర్శన తన మనిషి. అప్‌సెట్ అయినా సర్ది చెప్పొచ్చు అనుకొన్నాను. కాని తను తనని చూసింది.. హనీని చూసిందా లేదా అన్నది తనకి తెలీదు. అర్థంకావటం లేదు. తనకెందుకో యిదంతా గిల్టీగా అనిపిస్తుంది. దర్శనకి జవాబు చెప్పలేక సంభాషణ పొడిగించటం యిష్టం లేక కాస్త గట్టిగా మాటాడాను. చాలా బాధపడింది…’ అనుకొంటూ ఆమెకి కాల్ చేశాడు.
అమె లిఫ్ట్ చేయగానే, ‘‘వచ్చే వారం వస్తాను,’’ అన్నాడు.
ఆమె చాలా సంతోషంతో, ‘‘ధ్యాంక్ యూ,’’ అంది.
‘యేదో విసుగులో అలా బిహేవ్ చేశాడు కాని తను మారిపోలేదు. అయినా వొక్క యిన్సిడెంట్‌తో మనుష్యులని అంచనా వేయటం కరెక్ట్ కాదుకదా. అదో బాడ్ టైమ్. అలా జరిగిపోయింది. ఫర్‌గెట్ యిట్…’ అనుకొంది.
ఆమె రిలాక్స్ అయిందనిపించింది విహాన్‌కి.
‘‘మేమ్.. టేకాఫ్…’’ చిరునవ్వుతో అంది యెర్‌హోస్టెస్.
‘‘బై.. ల్యాండ్ అయ్యాక కాల్ చేస్తాను,’’ అంది.
ఆమె మనసు విమానంతో పాటు అలా మేఫూలలో తేలిపోతోన్నట్టుంది.
‘ఘాట్ కదా కాస్త టర్బ్‌లెన్స్ వుంది. యిట్స్ వెరీ కామన్…’ అనుకొంది దర్శన.
***
రోజూ ఆఫీస్‌కి వెళ్లటం, రావటం. ఫోన్‌లో విహాన్‌తో మాటాడటం. విహాన్ వస్తానన్న టైమ్ కి రావటం లేదు. ఆఫీస్‌లో బాస్ చికాకు యెక్కువగానే వుంది.
‘‘వోసారి అతనితో లాంగ్ డ్రైవ్‌కి వెళ్లు. నీకీ గోల వదిలిపోతుంది,’’ కన్నుగీటుతూ అంది కొలీగ్ వినీత.
‘‘ఐ కాన్ట్…’’ అంది దర్శన.
‘‘వో మై డియర్ నీదంతా చాదస్తం. నువ్వు నీ వర్క్‌తో మాత్రమే శాటిస్‌ఫై చేయలేవ్. మేమది ముందే రియలైజ్ అయ్యాం. అందుకే యిప్పుడు చూడు మాకు రోజు వాడి సతాయింపు వుండదు. పైగా రోజు పేంపర్ చేస్తాడు. వో పెగ్… వో హగ్ అంతే. లైఫంతా కూల్,’’ అంది.
‘‘యిది కాకపోతే మరొకటి… వీడికంత యింపార్టెన్స్ వేస్ట్,’’ అంది దర్శన.
‘‘ఆర్ యూ మేడ్.. కొన్నిచోట్ల యింతే. దానికోసం మరో ఆర్గనై జేషన్‌కి మారటం వేస్ట్ అనుకుంటున్నాను’ నీకు తెలుసా నా కాస్మోటిక్స్ బిల్ వొకడికి, నా ఫేషియల్, సెలూన్ బిల్ వొకడికి యిచ్చేస్తుంటాను ప్రతి నెల. దర్శనా యీ యేజ్‌లోనే యీ మగవాళ్లకి మనపై ఆసక్తి వుంటుంది. క్యాష్ యిట్… ఆ తర్వాత పెళ్లి, పిల్లలు. మన హబ్బీ కూడా మన ముఖాన్ని ఆసక్తిగా చూడడు. అతనికి అవకాశాలు కెరీర్‌లో బోల్డుంటాయి. మన బాస్‌లా… మన బాస్ వైఫ్ యెంత అందంగా వుంటుందో… అతనికి యీ అవకాశం వుంది యెంజాయ్ చేస్తున్నాడు. అసలు లైఫ్‌లో యివన్ని టెంపరెరీ… వీటికి యెక్కువ యింపార్టెన్స్ యివ్వటం కూడా టైమ్ వేస్ట్,’’ నవ్వుతూ అంది వినీత.
‘‘వర్క్ ప్లేస్‌లో యిలాంటి హెరాస్‌మెంట్…’’ యింకా ఆమె వాఖ్య పూర్తి కాకుండానే వినీత నవ్వుతూ, ‘‘వో పాగల్… అవన్నీ అందరికీ తెలుసు కానీ అవేవి చాలాచోట్ల వర్క్‌వుట్ కావ్. సింపిల్ బేబీ.. వొక్కసారి నువ్వు ప్రోబ్లమేటిక్ అని తెలిసిందనుకో ఆ బాస్ జాబ్ కాదు పోయేది. నీదే. అంతే కాదు నువ్వు యెక్కడ జాబ్‌కి వెళ్లినా స్వీట్‌గా మాటాడి, వో కప్పు కాపిచినో యిచ్చి పంపించేస్తారు. మన వాల్యూస్ మనలని నిచ్చెనలని యెక్కించాలి కాని యెక్కటానికి నిచ్చెనే లేకుండా చేయకూడదు కదా.. వొక్కసారి ఆలోచించు,’’ అంది వినీత.
దర్శనకి నవ్వొచ్చింది. తన చుట్టూ వాతావరణం యెలాంటిదో తనకి నిజంగా తెలీదా.. తెలుసు. యెన్ని చూడటం లేదు. తమ సీనియర్స్‌లో కొందరు యిలాంటి ఫన్ యేజ్‌ని దాటేసినందుకు బాధపడటం. యంగ్ స్టర్స్‌తో పోటీపడటానికి మరింత యెక్స్‌ట్రా వర్క్ చేయటం. అసలు అమ్మాయిలుగా పుట్టనందుకు అబ్బాయిలు బాధపడటం, అలా వెళ్లటం వొక యిష్యూనే కానిచోట అదే యిష్యూగా తనెవ్వరితో మాటాడుతుంది. విహాని చూస్తే మల్లెలపొదయ్యే శరీరం మరెవ్వరిని చూసినా అలా వికసించదు. శరీరాన్ని చాల క్యాజువల్‌గా తీసుకోవటం తనకెందుకు సాధ్యం కావటం లేదు. అలా కానివాళ్లు యిక్కడ నుంచి వెళ్లిపోవటం తెలుసు. కాంప్రమైజ్ అయిన వాళ్లు తెలుసు. యిలాంటి నాన్‌సెన్స్ లేని వర్క్‌ప్లేసేస్ యీ రంగంతో సహా ప్రతీ రంగంలోనూ వున్నాయి. మనం యెక్కడ నిలబడాల్సి వస్తుందో మన చేతుల్లో లేదు. ఛ… బాస్ నస సాధ్యమైనంత వరకు తను భరిస్తుంది. కాని ఐ కాంట్ డు సచ్ థింగ్స్.
విహాకి ఫోన్ చేసింది.
నో రిప్లై…
యింటికి వచ్చినా దర్శనకి విహా నుంచి కాల్ రాలేదు.
దర్శన వచ్చినప్పట్నుంచి కాస్త డల్‌గా వుండటం చూసిన రాధిక, ‘‘విహా యెప్పుడొస్తున్నాడు,’’ అడిగింది.
‘‘వస్తానన్నాడమ్మా.. కాని డేట్ తెలీదు,’’ అంది.
‘‘వాళ్ల పేరెంట్స్‌తో మేరేజ్ విషయం మాటాడదామని చెప్పు,’’ అంది రాధిక.
‘‘వోకే.’’ అంది దర్శన.
విహాకి తిరిగి కాల్ చేసింది.
‘‘వూ… చెప్పు,’’ అన్నాడు.
అతనంత పొడిగా అనగానే ఆమెకి యెలా మాట్లాడాలో తెలియ లేదు.
‘‘బిజిగా వున్నావా. మళ్లీ కాల్ చేయనా?’’
‘‘లేదు లేదు.. చెప్పు..’’
‘‘మమ్మీ నువ్వు యెప్పుడొస్తున్నావని అడిగింది. ఆంటీ, అంకుల్‌తో మన మ్యారేజ్ విషయం మాటాడతానంది,’’ సంతోషంగా చెప్పింది దర్శన.
‘‘మ్యారేజ్…’’ చిన్నగా నవ్వి, ‘‘దర్శనా అప్పుడే పెళ్లా..! నో, కెరీర్‌లో సెటిల్ అవ్వాలి కదా,’’ అన్నాడు.
‘‘లైఫ్ పేర్‌లల్‌గా నడుస్తుంది విహా.’’
‘‘బాప్‌రే.. ప్రస్తుతం లాంగ్ కమిట్‌మెంట్స్ యివ్వలేను. యీ పెళ్లి పిల్లలు.. ప్రస్తుతం బ్యాగేజ్ వద్దు. ఆంటీ అడిగితే యిలా చెప్పలేను. సో.. వాళ్లు నాతో మాటాడకుండా నువ్వే చూడు. ఆంటీ, అంకుల్ నాతో యీ విషయం మాటాడితే నీతో అసలు మాటాడను. అంతే. యిప్పుడే మ్యారేజ్ వద్దని నువ్వే పోస్ట్‌పోన్ చేస్తున్నట్టు చెప్పు,’’ అన్నాడు.
‘‘అదేంటి విహా. నేనెలా చెపుతాను. వాళ్లని నేనెలా ఆపుతాను. మేరేజ్ చేసుకొందాం.’’
‘‘వో.. అయితే యిదంతా నీ ఆలోచనా.’’
‘‘కాదు. మమ్మీనే అడిగింది. అయినా యెన్నాళ్లు పోస్ట్‌పోన్ చేస్తాం. నిన్ను కలవటానికి ఆ వూర్లు వచ్చినప్పుడంతా మమ్మీకి మనం యిలా పెళ్లి కాకుండా స్పెండ్ చేస్తున్నామని యెవరైనా అడుగుతారని భయం భయంగా వుంటుంది. నిన్ను చూడకుండా వుండలేను. చూడటానికి వెళతానంటాను. వద్దనలేక పంపిస్తారు యింట్లో. మనం కూడ వాళ్ల వైపు నుంచి ఆలోచించాలి కదా.. అయినా నేనిలా యెక్కువ రోజులు నీకు దూరంగా వుండటం చాలా దిగులుగా వుంటుంది. అసలు నేను నీకే యిబ్బంది కలిగించను కదా.. నీ కెరీర్‌కి నేనెలా అడ్డు…’’ దిగులుగా అడిగింది దర్శన.
‘‘మళ్లీ మాటాడతాను దర్శనా. యెవరో వచ్చారు,’’ అన్నాడు.
దర్శన, ‘‘వోకే,’’ అంది.
***
యీ యిష్యూని యెలా హేండిల్ చేయటం. దర్శనని యిప్పుడు పెళ్లి చేసుకొంటే ఖచ్చితంగా తన కెరీర్‌కి దెబ్బ. హనీకి యిండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్లతో వ్యాపార సంబంధాలున్నాయి. తనింకా యెస్టాబ్లిష్డ్ డైరెక్టర్ కాదు. తనకి యిండస్ట్రీలో ఫ్యామిలి కనెక్షన్స్ లేవ్. అసలే బాలీవుడ్.. వొక్క సినిమా పోయినా తిరిగి యెవ్వరూ యిన్వెస్ట్ చేయరు. తనకి హనీ సపోర్ట్ కావాలి. హనీకి తన యిరవై ఆరేళ్ల శరీరం కావాలి. హనీకి తనపై ఆసక్తి పోయేలోగా తన కోసం వొక్క ప్రొడ్యూసర్‌నైనా ఫిక్స్ చేయించుకోవాలి. తన జీవితాంతం యీ హనీ వుండదు. ఆ విషయం హనీకి తెలుసు. తన జీవితానికో నిచ్చెన వేయించుకొనే వరకు హనీ కావాలి. యీలోగా యెమోషనల్ కమిట్‌మెంట్స్‌కి దూరంగా వుండాలి. అసలు హనీ తర్వాత మరో హనీలాంటి వాళ్లు రారని యేంటి.. తన మార్కెట్ కావాలనుకొనే వరకు తనని మార్కెట్ చేసేవాళ్లు కావాలి. యీ మొత్తంలో తనని కమ్ముకోటానికి మంచుతో పోటీపడే దర్శనని యెలా నమ్మించటం. యెలా మేనేజ్ చేయటం. ఆపాలి. కొన్నాళ్లు తనని ఆపాలి. వొకేసారి వద్దంటే బాధపడు తుంది. పోస్ట్‌పోన్ చెయ్యాలి. ముందు హర్ట్ అయినా తనే కొన్నాళ్లకి మర్చిపోతుంది. ఆ రోజులాంటి సంఘటన అదే మొదటిది కాబట్టి దర్శన తనని యెటాక్ చేయకుండా తనే యెదురు దాడి చేశాడు. ఆ విషయం తనకి తెలుసు. తిరిగితిరిగి యిలాంటివి మరో రూపంలో యెదురు కావొచ్చు. దర్శనతో యిలా మాటాడొచ్చు కానీ హనీకి యెప్పుడైనా తను దర్శనతో కనిపిస్తే, హనీ, దర్శన విషయం అడిగితే హనీపై దర్శనపై అరిచినట్టు మాటాడగలనా..?! అసలే గ్లామర్‌ఫీల్డ్ .. యేదోరోజు యేదో వొక యీవెంట్‌కి హనీ కలిసి వెళదామంటుంది. వద్దనలేడు. లైవ్ టెలికాస్ట్‌లో చూసి దర్శన అప్‌సెట్ కావొచ్చు. యెందుకిన్ని కాంప్లికేషన్స్. ఖచ్చితంగా వద్దంటే వొకవేళ యీ యిండస్ట్రీలో సక్స్‌స్ కాకపోతే అంత అందమైన దర్శన, తనని యెంతగానో యిష్టపడే దర్శనని మిస్ చేసుకోవటమే. వో మై గాడ్.. యింత టెన్షన్ అవసరమా..?! తనకి తన కెరీర్ యింపార్టెంట్.
యెందరెందరికో అణిగిమణిగి అందరి చుట్టూ తిరుగుతోంది వోడిపోటానికా.. యేమైనా డైరెక్ట్‌ర్ విహాన్… అని తెరపై సింగిల్ కార్డ్ చూసుకోవాలి.
చెప్పెయ్యాలి.. చెప్పెయ్యాలి.. దర్శనకి చెప్పెయ్యాలి.
***
ఆఫీస్‌లోని కౌన్సిలర్స్ అయితే తమ విషయాలని కాన్పిడెన్షియల్‌గా వుంచుతారా లేదానే అనుమానం.. మరోవైపు రోజూ వాళ్లని చూడాలి కదా యెందుకీ యెంబరాస్‌మెంట్ అని దర్శన తనకి బాగా తెలిసి మరో చోట పనిచేస్తోన్న కాస్త స్నేహం వున్నతనకంటే సీనియర్ అయిన’ ఉజ్వల దగ్గర వెళ్లింది.
‘‘వో దర్శనా.. మళ్ళీ బాస్‌తో గొడవా.. చూడు బాస్ మనల్ని సపోర్ట్ చేయటం లేదని కొలీగ్స్‌కి తెలిసిందనుకో… వాళ్లు లెక్కచెయ్యరు. నువ్వు యెవరితో పని చేయించాలో ఆ టీమ్ నీ మాట వినరు. యీరోజు జరిగింది అదే. నిన్ను వోవర్ కవ్‌ర్ చేసి వాళ్లు నీ బాస్ దగ్గరకి వెళ్తారు. నీ బాస్ వాళ్లనే సపోర్ట్ చేస్తున్నాడు. అది చాలా సహజం. అదే బాస్ పవర్. హైయర్ మేనేజ్ మెంట్ మన కంప్లైంట్స్‌ని చాల సార్లు’ పట్టించుకోదని యింతకు ముందు చెప్పాను కదా. మరో విషయం కూడా గుర్తుపెట్టుకో. వాళ్లే యెప్పుడైనా యెవ్వరినైనా పంపించాలనుకొంటే వాళ్లపై కంప్లైంట్ వున్న వాళ్లని యూజ్ చేసుకొంటుంది. అప్పటివరకు పట్టించుకోదు. అందుకే యీ మిడిల్ మేనేజ్ మెంట్ చాలా పవర్‌ఫుల్. యిప్పుడు చూడు నిన్నే పరిస్థితికి తీసుకొచ్చాడో. నీ టీమ్ నుంచే నీకు వ్యతిరేకతని తెచ్చాడు. యిదంతా పవర్ గేమ్ దర్శనా.. ‘యెందుకు నేనంటే లెక్కలేదు’ అని’ అధారిటీని యిష్టపడని వాళ్లకి ఆ అధారిటీ టేస్ట్ చూపించాలనుకొంటారు. అంటే నాట్ రియల్లీ క్రేవింగ్ ఫర్ యూ. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ స్టార్ట్ చెయ్యాలి కొన్ని’సార్లు . యిదంతా యెందుకు ఆనుకుంటే నీకు కం ఫర్ట్ బుల్ గా అనిపించే నిర్ణయం తీసుకో. యే నిర్ణయం అయినా నీకు మనశ్శాంతి ని యివ్వాలి సో…’’ అంటూ యింకా యేదో చెప్పబోతోన్న ఉజ్వలతో, ‘‘యిన్ని పాలిటిక్స్ మీకెలా తెలుసు,’’ అడిగింది దర్శన.
‘‘యెక్స్‌పీరియన్స్,’’ అంటూ నవ్వింది ఉజ్వల .
‘‘యిన్ని పాలిటిక్స్, యింత అధారిటీ అవసరమా వర్క్‌ప్లేస్‌లో.’’
‘‘వర్క్‌ప్లేస్ యేంటి దర్శనా… ప్రతిచోట యివే ఆపరేట్ అవుతున్నాయి.
“పర్సనల్ లైఫ్ కూడా దీనికి అతీతం కాదుకదా,’’ అంది ఉజ్వల.
‘పర్సనల్ లైఫ్…’ వులిక్కిపడింది దర్శన.
‘‘ప్రేమలో…’’ చప్పున అడిగింది.
ఉజ్వల కాసేపు మౌనంగా వుండి, ‘‘యస్.. కొన్ని సిట్యుయేషన్స్‌లో యేవీ వేటికీ అతీతం కాదు. అందులో మీది బ్రేక్ కే బాద్ జనరేషన్. యిమోషనల్ డిసిప్లీన్ కాస్త తక్కువే. కెరీర్, యిమేజ్ డామినేట్ చేస్తు న్నాయ్. దేనినైనా నిమిషాలపై వదులుకొనేట్టు మానసికంగా మిమ్మల్ని సిద్ధం చేసే పరికరాలు చుట్టూ వున్నాయి. యింకో విషయం చెప్పనా, యిది యెక్కువగా సిటీస్‌లో కనిపిస్తోంది. యింక కాస్మోపాలిటన్ సిటిస్‌లో అయితే మరీ యెక్కువగా వుంది. యిలాంటివి మీరు వర్క్ చేసే ఫీల్డ్ పై కూడా ఆధారపడి వుంటాయి,’’ అంది ఉజ్వల.
దర్శనకి చప్పున విహాన్ ప్రవర్తన గుర్తొచ్చింది.
అదంతా యేంటి… మారుతున్నాడా…!?
‘‘వోకే… దర్శనా, డామేజ్‌ని యెక్కువ చేయకుండా మీ బాస్‌తో వో స్మూత్‌నెస్ తెచ్చుకోటానికి ట్రై చేయ్… ప్రవాహానికి యెదురీదటం అశాంతినే యిస్తుంది. నువ్వు ఆ అశాంతిని యెంతవరకు యెదుర్కోగలవో చూసుకో. లేదంటే మరో జాబ్.. లేదంటే బి పార్ట్ ఆఫ్ ర్యాట్ రేస్.. దర్శనా. ఆల్ ది బెస్ట్,’’ అంది ఉజ్వల.
‘‘ధ్యాంక్ యూ,’’ అని బయటకి వచ్చింది దర్శన.
కార్తీకపుగాలి శరీరాన్ని వూయల వూపుదామనుకొంటోంది… మనసేమో విహాన్ మారుతున్నాడాని ఆలోచిస్తోంది.
వొకేసారి ప్రొఫెషనల్ లైఫ్‌లోనూ పర్సనల్ లైఫ్‌లోనూ డిస్ట్రబెన్స్. వుద్యోగాన్ని చప్పున వదిలేస్తే యెలా… వో వైపు రిసెషన్. వుద్యోగం చేస్తూ మరోటి చూసుకోవాలి. అప్పటివరకు యితన్ని యెలా మేనేజ్ చెయ్యాలి. ఛ విహాని స్పర్శించిన మనసు, శరీరం యెదురు తిరుగుతున్నాయి.
వొకవేళ విహాన్ తన జీవితంలో లేకపోతే తను అతన్ని ఫ్లర్ట్ చేయటానికి లేదా ఫ్లర్ట్‌ని వొప్పుకోటానికి వోకేనా… స్ట్రేంజ్…హేపోధిటికల్ క్వచ్చన్స్.
తన కొలీగ్స్‌కి బాయ్‌ఫ్రెండ్స్ వున్నారుకదా.. షిట్.. నో యిలా ఆలో చించటంయేంటి..
ముందు యెక్కడికైనా వెళ్లాలి.. యిలా వొంటరిగా వుంటే యివే ఆలోచనలు. యెక్కడికి.. యిదో దురదృష్టం. సరదాగా గడపటానికి బోల్డంత ప్రపంచం. మనసుకి కష్టమేస్తే చెప్పుకోటానికి వొక్కరు కూడా లేరు.
విహాన్‌కి కాల్ చేసింది. నో రిప్లై. యీ మధ్య చాలాసార్లు యిలాంటి మాటలే వినాల్సి వస్తోంది.
యిటాలియన్ సినిమాని సబ్‌టైటిల్స్‌తో చదువుతూ చూస్తోన్న విహాన్ ‘యిప్పుడు ఆన్స్‌ర్ చేస్తే పెళ్లి అంటుందేమో.. మూడంతా అప్‌సెట్ అవుతుంది. తర్వాత మాటాడొచ్చులే,’ అని ఫోన్ తీయలేదు.
దర్శన కళ్లల్లో నీళ్లు తిరిగాయి.
సినిమా తర్వాత సినిమా చూస్తూ అందులో యేయే సన్నివేశాలని తన సినిమాలో పెట్టుకోవచ్చో లేదా యెడాప్ట్ చేయొచ్చో ఆలోచిస్తూ, మధ్యలో హనీ కాల్ చేస్తే ఆమెని పేంపర్ చేస్తూ దర్శనకి ఫోన్ చేయటమే మర్చిపోయాడు. ఆమె రెండు మూడుసార్లు చేసినా తీయలేదు.
దర్శన మనసంతా వికలమైపోయింది.
యెలా వుండేవాళ్లం యెలా అయిపోయింది పరిస్థితి. అస్సలు భయం లేని నిష్కల్మషమైన అనురాగం వుండేది.
యిప్పుడు ఫోన్ చేస్తే తీస్తాడా, తీయడనే సందిగ్ధం. పనిలో వున్నాడేమో తర్వాత చేస్తాడనే యెదురుచూపు వో యెండమావి. చికాకుపడతాడేమో.. విసుక్కుంటాడేమో లేదా యేదో వో కారణం చెప్పి అసలు మాటాడడేమో.. అన్నీ భయాలే.. ఆలోచిస్తూ ఆఫీస్‌కి రెడీ అవుతోంటే, యీరోజు యెలాంటి చికాకులో ఆఫీస్‌లో.. అని భయం. ఆమెకి సడన్‌గా కుడిచెయ్యి లాగుతున్నట్టనిపించింది.
విహాన్‌కి కాల్ చేసింది. నిద్రలోంచి, ‘‘హలో,’’ అన్నాడు.
‘‘నిద్రపోతున్నావా… వోకే. యీవినింగ్ కాల్ చేస్తా,’’ అంది.
విహాన్ ఫోన్ తీసినందుకు మనసు కాస్త తెరిపినపడినట్టయింది.
ఆఫీస్‌కి మాత్రం అవే భయాందోళనలతో వెళ్లింది.
***
సినిహీరో అవ్వాలనే ప్రయత్నాలలో వున్న మరో యువకుడిని హనీ తనతో సింగపూర్ తీసుకువెళ్లిందని తెలిసి విహాన్‌కి కంగారుగా అనిపిం చింది. తనకింకా వో అవకాశం కూడా రాలేదు. హనీ యింత తొందరగా షిఫ్ట్ అయిపోతే యెలా.. ఆమె వలన యెక్కడా అసిస్టెంట్‌గా పనిచేయకుండానే తనకి అసోసియేట్ డైరెక్టర్‌గా అవకాశం రావటమే చాలా యెక్కువనుకొందా. యెలా… తనకి హనీ విషయాలు యేం తెలీనట్టు ఫోన్ చేసి మాటాడితే. అదే కరెక్ట్. కాంటాక్ట్ పోగొట్టుకోకూడదు.
హనీకి ఫోన్ చేశాడు. నో రిప్లై.
గాన్ కేస్.. మళ్లీ రేపట్నుంచి తన సపోర్టివ్ సిస్టమ్స్ ని వెతుక్కోవాలి. అతని మనసంతా చికాకు. దర్శనకి కాల్ చేశాడు. స్విచ్ ఆఫ్. యెందుకని.. వో, ఆఫీస్ టైమ్ లో సెల్‌ఫోన్ని తీసుకువెళ్లనివ్వరు కదా.. యిలా రూమ్ లో కూర్చుంటే అవకాశాలు రావు. వెళ్లాలి. పరిచయాలు పెంచుకోవాలి.
విహాన్ బయటకి వెళ్లబోతుంటే రూమ్మేట్ ఆకాష్ లోపలికి వచ్చాడు. అతని ముఖంలో స్పష్టమైన విసుగు. అతను వుదయమే వో ప్రొడక్షన్ హౌస్ వాళ్లు పిలిస్తే వెళ్లాడు. హీరో అవ్వాలనే ప్రయత్నాల్లో వున్నాడు. డ్యాన్స్ చక్కగా చేస్తాడు. హేండ్‌సమ్ . తన మాతృభాషే కాకుండా హిందీ, యింగ్లీష్ ఫ్లూయంట్‌గా మాటాడతాడు. రోజూ జిమ్ కి వెళతాడు. అలాంటి వాళ్లు బోల్డంతమంది యిండస్ట్రీలో వొక్క ఛాన్స్ అనుకొని కలల కౌముదుల్లా తిరుగుతుంటారు. అలాంటి వాళ్లల్లో ఆకాష్ వొక్కడు.
‘‘వాట్ డూడ్,’’ అన్నాడు విహాన్.
‘‘షిట్.. యూ నో.. అతను గే.. కంపెనీ కావాలంట.. వోకే అయితే రేపు ఫోన్ చేయమన్నాడు. యూ ఆర్ లక్కీ.. హనీ వెరీ గుడ్ కాంటాక్ట్. ఐ డోన్ట్ హేవ్ గే ధాట్స్. ఫర్ గెటిట్..’’ విసుగ్గా అన్నాడు ఆకాష్.
‘‘ హనీ షిఫ్ట్ అయిపోయినట్టుంది…’’ బిట్టర్‌గా నవ్వాడు విహాన్.
‘‘వో.. యెవరా న్యూ బకరా,’’ అడిగాడు ఆకాష్.
‘‘నేను కూడా యిప్పుడు అన్నిరకాల ప్రయత్నాలు మొదలు పెట్టాలి. ప్రొడక్షన్ హౌస్ ఆఫీస్‌కి వెళుతున్నాను. బై…’’ అన్నాడు.
***
దర్శన పనిచేస్తోంది కానీ ఆమెని రకరకాల ఆలోచనలు కమ్ముకుంటున్నాయి. యెంత ఆనందంగా వుండేవి చదువుకొనే రోజులు. మంచి వుద్యోగం అని అంతా తనని యెంతగా మెచ్చుకొన్నారు. వుద్యోగం వచ్చాక తనపై యింట్లో వాళ్ళ కంట్రోల్ కూడా పూర్తిగా తగ్గిపోయింది. తనకి పూర్తి స్వేచ్చనిచ్చారు. విహాన్ పరిచయం, ప్రేమని పూర్తిగా వోకే అన్నారు. తన చుట్టూ ప్రతి వొక్కరు బోల్డంత సంతోషంగా వున్నారు. యెందుకు తన జీవితం వొక్కసారే యిలా వేదనగా అయిపోయింది!? యెక్కడ యేం జరిగింది… అవును ఆరోజు విహాన్ యెవరో అమ్మాయి అన్నాడు. యెవరా అమ్మాయి…!? హీరోయిన్.. మరో అసోసియేటా… యెవరు… ఆ అమ్మాయి తో వుండి తనకి కాల్ చేయలేదా?! అలా కంప్లీట్ గా వొక అమ్మాయితో వుండిపోవటమే కాకుండా తన ప్రెజన్స్‌ని కూడా దాచిపెట్టాల్సిన అవసరం వచ్చిందంటే ఆ అమ్మాయికీ విహాన్‌కీ మధ్య యేం జరుగుతోంది. విహాన్ యెప్పుడు కెరీర్‌కి యింపార్ట్‌న్స్ యిచ్చేవాడు. కాని అంతకుముందెప్పుడు విహాన్ పెళ్లిని బ్యాగేజ్ అనలేదు. యిప్పుడు అతను మాటాడుతోన్న కొత్త జార్‌గాన్ భావమేమి తిరుమలేశా…!?
బాస్ పిలుపు.
ఆమెకి తెలీకుండానే గుండెల్లో చిన్ని దడ మొదలైయింది. గొడవ పడొద్దు. బయట వుద్యోగాలు లేవ్. యీ జాబ్ లేకపోతే ఫైనాన్షియల్‌గా యింట్లో వాళ్ల మీద ఆధారపడాలి. అప్పుడు నీకింత స్వేచ్చ వుండదు. యెప్పుడంటే అప్పుడు విహాని కలవటానికి ఫ్లైట్‌లో వెళ్లటం కష్టమవుతుంది. కారు యి.యమ్. ఐ లు కళ్ళ ముందు కదిలింది.
‘‘గుడ్ మార్నింగ్.. వో.. పికాక్ బ్లూ టెమ్ యీ కలర్‌లో టైస్ రావటం చాలా రేర్. వెరీ నైస్,’’ అంది అప్రయత్నంగా.
‘వో తనతో సరిగ్గా లేకపోతే కష్టమని అర్థమయి వుంటుంది. అయినా అప్పుడే హ్యేపీగా మాటాడొద్దు. లీనియన్స్ యిచ్చినట్టు అవుతుంది,’ అనుకొంటూ, ‘‘వో.. ధ్యాంక్ యూ.. మీ టీమ్ తో వో మీటింగ్ పెడదాం. యేవైనా యిష్యూస్ వుంటే.. లెటస్ డిస్కస్,’’ అన్నాడు.
‘‘ష్యూర్ టీ కావాలి,’’ అడిగింది దర్శన.
‘యింతకు ముందెప్పుడు యిలా టీ అడగలేదు కదా,’ అనుకొంటూ లోలోపల సంతోషిస్తూ, ‘‘ష్యూర్ గ్రీన్ టీ,’’ అన్నాడు.
‘దొంగముఖం. లోపల సంతోషిస్తునే బయటకి బింకాలు పోతున్నాడు. చూడరా.. నీతో యెలా అడుకొంటానో.. యూ స్టుపిడ్,’ అనుకొంటూ లోలోపల నవ్వుకొంది దర్శన.
***
ఆ సాయంకాలానికి దర్శన మనసంతా గ్లూమీగా అయిపోయింది. తన మనసుకి వ్యతిరేకంగా తను ప్రవర్తించటం, ర్యాట్ రేస్‌లో తనూ ర్యాట్ అవ్వటం ఆమెకి చాల అనీజ్‌గా అనిపించింది.
యింటికి వెళ్లి అలా టీవీకి అతుక్కుపోయింది.
ఆరోజు విహాన్‌కి ఫోన్ చేయలేకపోయింది.
హనీ విషయంలో చికాగ్గా వుండి ఆ రాత్రి విహానే ఫోన్ చేశాడు. కాస్త బాగా మాటాడాడు.
దర్శన ఆలోచిస్తోంది.. తనలానే విహాన్‌కి కెరీర్‌కి సంబంధించిన యేవైనా కంప్లషన్స్ వున్నాయా.. తనలానే సతమతమౌతున్నాడా.. యేదో అడ్డుపడుతోంది…
హనీ యెప్పుడొస్తుందో తెలీదు. అవకాశాలు యెలాగనే చికాకు మనసుకి. శరీరం ఖాళీ పోని దర్శనని రమ్మంటే.. ఖండాలా వెళితే… కాస్త రిలాక్స్. యెలాను వీకెండ్‌కి వొక్క సినిమా ఆఫీస్ తీసుండదు.
‘‘దర్శనా.. కాస్త ఖాళీగా వున్నాను.. వీకెండ్‌కి వీలైతే రా…’’ అన్నాడు విహాన్.
‘‘చూస్తాను. వీలైతే వస్తాను,’’ అంది.
***
దర్శన వచ్చింది విహాన్ దగ్గరకి.
ఖండాలాలో యెటు చూసినా వాన చిలకరింపులు.. మంచు దొంతర దొంతర్లుగా కమ్ముకొంటూనే వుంది.
అతను డ్రైవ్ చేస్తున్నాడు. ఆమె మనస్సెరీరాలు వొకప్పట్లా విహాని కమ్ముకోటానికి వానజల్లులతో, మంచుదొంతర్లతో పోటీపడటం లేదు.
అతని మనసూ హనీ తిరిగివచ్చాక తనని పట్టించుకొంటుందా లేదాని.. లేదా తనకి అవకాశాలు యివ్వడానికి మరో హనీ దొరుకుతుందా లేదాని ఆలోచిస్తుంటే ఆకాష్‌కి వచ్చినటువంటి అవకాశం వస్తే ఆ ఆలోచనకే అతనికి నవ్వొచ్చింది.
యేమిటన్నట్టు అతని వైపు చూసింది.
ఆకాష్‌కి యెదురైన యిన్సిడెంట్‌ని చప్పున చెప్పేస్తూ, ‘‘లేడీ అనుకో యే యేజ్ అయినా అవకాశం కోసం వోకే అనేవాడు,’’ నవ్వుతూ అన్నాడు.
‘నీ పరిస్థితి యేంటి విహాన్,’ అనుకొంటూ, ‘యే ఫీల్డ్ అయితేనేం ర్యాట్ రేస్‌లో అందరం.. యేదో రకంగా భాగస్తులమే.. వొకరిని వొకరు అర్థం చేసుకోటానికి యెవరి ప్రయత్నాలు వాళ్లు చెయ్యాల్సిందే. యెలాంటి సపోర్టివ్ ది¸ కింగ్ అవసరమో.. ఆలోచిస్తోన్న దర్శన ఆలోచనలని, కారు రికార్డ్ ప్లేయర్ నుంచి, ‘లవ్ యీజ్ యిన్ నీడ్ ఆఫ్ లవ్ టుడే’ స్టీవ్ వండర్ స్వరం బ్రేక్ చేస్తూ వెనువెంటనే కంస్ట్రెక్ట్ చేస్తూ మనసుని హమ్ చేస్తోంది…
చినుకు మాసపత్రిక, జులై 2013
చిత్రం: సృజన్ రాజ్
[…] View all posts ఎన్నో ప్రశ్నలకు జవాబులు దొరికాయ్! ద లాస్ ఆఫ్ యిన్నోసెన్స్ […]
👌❤👌