దొడ్డి కొమురయ్య కోసం ‘ఊరేగింపులు’

“అమరజీవి నీవు కొమురయ్యా

అందుకో జోహార్లు కొమురయ్యా

లంచగొండుల అండ దేశముఖులకు నుండ

న్యాయ రక్షణ కొరకు నడుము బిగించితివి

గుండాల తుపాకి గుండ్ల కెదురుగ పోరి

బలియైన వీరులలో కొమురయ్యా

మార్గదర్శిగ వుండు కొమురయ్యా

నీ పేరు నిలుపకనే కొమురయ్యా

నిదురైన మేం బోము కొమురయ్యా”

భూమి కోసం, భుక్తి కోసం, శతాబ్దాలుగా తెలంగాణ ప్రజల జీవితాలను నిర్బంధించిన బానిస సంకెళ్ళ విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం (1946-1951) ఈ నేల మీద జరిగిన ఎన్నో ఉద్యమాలకు నిరంతర స్ఫూర్తి. దొరల, దేశముఖ్ ల, పటేలు, పట్వారీల దౌర్జన్యాలను, రజాకార్ల బీభత్సకాండను, నిజాం నిరంకుశత్వాన్ని ‘బాంచెన్ నీ కాల్మొక్తా’ అని కొడవలిలా వంగి భరించిన సామాన్యులే ‘నీ జులుమేందిరా?’ అని ‘సంగం’ మద్దతుతో తిరగబడ్డారు.  రావి నారాయణ రెడ్డి, భీంరెడ్డి నర్సింహారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి వంటి ఎందరో కమ్యూనిష్టు నాయకులు ప్రజల వైపు నిలబడి వెట్టి చాకిరీ నిర్మూలన కోసం, దోపిడీ, దౌర్జన్యాల అంతం కోసం, లేవీ ధాన్యం వసూలుకు వ్యతిరేకంగా, నిరంకుశత్వానికి, రజాకార్ల ఆగడాలకు, తూటాలకు, అత్యాచారాలకు  వ్యతిరేకంగా ప్రజలను సాయుధ  పోరాట వీరులుగా  మలిచారు.

1946 జూలై 4న కడివెండి గ్రామంలో ఊరేగింపు చేస్తోన్న ప్రజా సమూహం మీద విస్నూరు దేశముఖ్ రామచంద్రారెడ్డికి చెందిన గుండాలు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తుపాకి తూటా తగిలి దొడ్డి కొమురయ్య అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడు. ఎంతో మంది తీవ్రంగా గాయపడ్డారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమురయ్య. దొడ్డి కొమురయ్య మరణ వార్త ఆంద్రమహాసభ కార్యకర్తలకు, నాయకులకు విషాద వార్తయింది. దొడ్డి కొమురయ్య అంతిమ యాత్రలో వేలాది మంది పాల్గొన్నారు.

దొడ్డి కొమురయ్య మరణం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని గొప్ప మలుపు తిప్పింది. ప్రజల్లో విప్లవ జ్వాలలను రగుల్కొల్పింది. ఫ్యూడల్ శక్తులకు వ్యతిరేకంగా ప్రజల పోరాటం ఊపందుకుంది. 1946 జూలై 26న దొడ్డి కొమురయ్యకు శ్రద్ధాంజలి ఘటించేందుకు ఆంద్రమహాసభ పిలుపునిచ్చింది. “ఆ పిలుపుననుసరించి తెలంగాణాలోని ప్రతి పల్లె కదిలింది. ప్రతి ఊరు ఏరులాగా పొంగింది. ఆనాడు ఎక్కడ చూసినా సభలు, ఊరేగింపులు. కొమురయ్య ఏ ఆశయ సాధనలో బలి అయ్యాడో ఆ ఆశయ సాధన కోసం ముందుకు సాగుతామని ఆనాడు యావత్ తెలంగాణా ప్రజానీకం ప్రతిజ్ఞ తీసుకున్నారు.“ దీనికి దృశ్య రూపమే “ఊరేగింపులు” కథ.

కథ ఊరేగింపులుచదవండి.

కథకుడు ఓ రోజు ఉదయం బావి దగ్గర ముఖం కడుక్కుంటుంటే గ్రామాల నుండి కొంత మంది ఎర్ర జెండాలు పట్టుకొని వెళ్ళడం చూస్తాడు. వెంటనే పరుగెత్తి ఏమి జరిగిందో తెలుసుకుందామనుకుంటాడు. “గ్రామం చివరలో ఉన్న గొల్ల యువకుడైన గంగయ్య ఇంటికి వెళ్లి చూచేసరికి ఎవ్వరూ లేరు. తొంబై సంవత్సరముల వృద్దురాలు మాత్రం ఉంది. చేతిలో కట్టె తీసుకొని బయటికి రావటానికి ప్రయత్నించుచున్నది. ఏమవ్వా గ్రామంలో ఏం జరుగుతుందని” అడుగుతాడు.

“ఇవాళ మా అమరజీవి కొమురయ్య వీర మరణానికి ఊరేగింపు జరుగుతుంది. నేను అక్కడికే వెళ్ళుచున్నాను. నీవు కూడా రావయ్యా” అని పిలిచింది ఆ వృద్ధురాలు. పొలంలో నాటు వేసే స్త్రీలు, పక్క పొలంలో పని చేసే జీతగాళ్ళు అందరూ కూడబలుక్కొని ఊరేగింపు కోసం బయలుదేరుతారు. గొర్రెలను మేపే గొల్లవాండ్లు, ఎడ్లను మేపే పశుకాపరులు, మోటలు తోలేవాళ్ళు, నాగళ్ళు దున్నేవాళ్ళు అందరూ ఊరేగింపు కోసమే వెళ్లినట్టు గమనిస్తాడు. తాను కూడా వేగంగా నడుచుకుంటూ వెళ్తాడు. ఊళ్ళో అందరూ ఆంద్ర మహా సభ ఆఫీసుకే వెళ్ళారని గ్రహిస్తాడు.

పోతూ పోతూ ఏ ఇంట్లోనైనా అలికిడి వినిపిస్తుందేమోనని తొంగిచూస్తూ పోతాడు. ఒక్క ఇంట్లో కూడా సవ్వడి లేదు. ఒక ఇంట్లో పాలు పొంగుతుంటాయి. మరొక ఇంట్లో సగం తిని వదిలిపెట్టిన పళ్ళెం కనిపిస్తుంది. ఇంకో ఇంట్లో పొయ్యి మీద అన్నం గిన్నె మాడుతున్న వాసన వస్తుంది. దళితుల వాడకు పొతే ముత్తయ్య ఇంటి ముందు చెప్పులు కుట్టే సామానంతా చిందరవందరగా పడి ఉంటుంది.  ఏ ఇంట్లో ఎవరూ లేరు. ఓ ఇంటి ముందు రోటిలో సజ్జలు పోసి దంచుతూ రోకలి పడేసి వెళ్లిపోయినట్టు కనిపిస్తుంది.

ఇంకా ఎవరెవరు ఎలా ఆ ఊరేగింపులో పాల్గొన్నారు? ఎన్ని గ్రామాల నుంచి ఎన్ని వేల మంది ప్రజలు ఆ ఊరేగింపుకు తరలి వచ్చారు. ఏయే నినాదాలు చేశారు? ఏయే పాటలు పాడారు. ఏయే తీర్మానాలు చేశారు? ఏయే ప్రతిజ్ఞలు చేశారు? చివరికి ఏమైంది? తెలియాలంటే మనం కూడా ఆ ‘ఊరేగింపు’లో కలవాల్సిందే.

ఆనాడు దొడ్డి కొమురయ్య మరణానికి నివాళిగా చాలా గ్రామాల్లో ‘ఊరేగింపులు’ జరిగాయి. అందుకే కథకుడు ఈ కథకు ‘ఊరేగింపులు’ అని బహువచనంలో పేరు పెట్టాడు. ‘ఊరేగింపుల’ను ఆపడానికి ఆనాటి క్రూర నిజాం ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలను సృష్టించినా ప్రజలు ప్రాణాలకు తెగించి ‘ఊరేగింపు’ల్లో పాల్గొన్నారు. గ్రామాల నిండా ఎర్రపూల వనాలు పూయించారు. అందుకే కథకుడు ఈ వస్తువునే ప్రధానంగా తీసుకొని కథ రాశాడు. ఊరేగింపు మొదలైందని తెలియగానే తమ చేతుల్లోని పనులను ఎక్కడివి అక్కడ వదిలిపెట్టి ఉన్న పళంగా ఊరేగింపుకు వెళ్లడాన్ని బట్టి ఆనాటి ప్రజల ఉద్యమ నిబద్దత తెలుస్తోంది. తమ జీవితాల్లో నిండిన చీకటిని పారద్రోలడానికి పడిన ఆరాటం, పోరాటం అంతా కనిపిస్తుంది. తమ స్వేచ్ఛా, స్వాతంత్ర్యాల కోసం అసువులుబాసిన కొమురయ్య మీది గౌరవం, ప్రేమ తెలుస్తోంది.

ఒక వాస్తవిక సంఘటనను అంతే వాస్తవికంగా కథీకరించడంలో కథకుడి ప్రతిభ దాగి ఉంది. కథకుడు ఎక్కడా జోక్యం కల్పించుకోకుండా కథ నడిపిస్తాడు. ఉత్తమ పురుషలో కథ సాగినా కథకుడి పాత్ర చాలా పరిమితంగా ఉంటుంది. కుల, మత, వయో భేదాలకు అతీతంగా ప్రజలే కాదు ప్రకృతి కూడా కొమురయ్యకు నివాళి సమర్పించాడాన్ని కథకుడు ఎంతో హృద్యంగా ప్రస్తావిస్తాడు. ఒక వీరుని మరణానికి తెలంగాణా గ్రామాలు ఎంతగా కదిలిపోతాయో ఈ కథలోని ప్రతి అక్షరం ఎంతో గొప్పగా చెప్తుంది.  కొమురయ్య అమరత్వం తెలంగాణ ప్రజల్లో కలిగించిన తిరుగుబాటుకు, చైతన్యానికి ఈ కథ ఒక నిదర్శనం. ఊళ్లకు ఊళ్లు భూస్వామ్యానికి, దొరలకు, నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా కదం తొక్కాయో ఈ కథ వివరిస్తుంది. పీడిత ప్రజల పక్షాన నిలబడిన ‘సంగం’ పిలుపునందుకొని ప్రజలు ఎలా ఉద్యమంలో భాగస్వాములయ్యారో రచయిత తాను చూసింది చూసినట్టు కథగా మలిచాడు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను, తెలంగాణా సామాజిక చరిత్రను చాల విశ్వసనీయంగా నిర్మించడానికి ఉపయోగపడే కథ. సాయుధ పోరాటంలో ప్రజల పాత్ర ఎలా ఉందో ఈ కథ నిరూపిస్తుంది.

సరళమైన శిల్పం, సరళమైన భాషలో, మంచి శైలిలో సాగి పోయే ఈ కథను రాసిన రచయిత ఆవుల పిచ్చయ్య. ఆవుల పిచ్చయ్య 1919లో నల్గొండ జిల్లా సూర్యాపేటలో జన్మించాడు. తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని 02 సంవత్సరాల పాటు (1947-1949) నల్గొండలో, మహారాష్ట్రలో జైలు శిక్ష అనుభవించాడు. పెద్దగా చదువుకున్నవాడు కాదు. ఆనాడు తెలంగాణలో  మొత్తం అక్షరాస్యత కేవలం నాలుగు  శాతం మాత్రమే. అలాంటి పరిస్థితిలో చదువు నేర్చుకొని కథకుడిగా ఎదిగాడు. ఆవుల పిచ్చయ్య మొత్తం అయిదు  కథలు రాశాడు. అవి. 1. ఈత గింజ ఇచ్చి తాటి గింజ లాగిన జమీందారు (అసంపూర్ణ కథ) 2. దౌరా 3. చపరాసి దిన చర్య 4. వెట్టి చాకలి దిన చర్య 5. ఊరేగింపులు. ఇవన్నీ అడవి బాపిరాజు సంపాదకత్వంలో వెలువడ్డ ‘మీజాన్’ పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఈ కథలన్నీ నిజాం పాలనలోని దోపిడీ చుట్టూ, రైతాంగ సాయుధ పోరాటం చుట్టూ తిరిగేవే. నిన్న మొన్నటి దాకా ఆవుల పిచ్చయ్య కేవలం రెండు కథలే రాశాడని అనుకునే వాళ్ళం. కాని అతడు రాసిన మొత్తం అయిదు కథల్ని సంపాదించి 2010లో సంగిసెట్టి శ్రీనివాస్, దేవులపల్లి కృష్ణమూర్తి, డా. ముదిగంటి సుజాతారెడ్డి, కాసుల ప్రతాప రెడ్డిల విలువైన ముందు మాటలతో ఒక బుక్ లెట్ గా ప్రచురించారు.  ఈ ‘ఊరేగింపులు’ కథ మొదట 11 ఆగష్టు 1948లో మీజాన్ దినపత్రికలో ప్రచురింపబడింది.

(తెలంగాణ రైతాంగ సాయిధ పోరాటానికి 75 ఏళ్ళు (4 జూలై 1946- 4 జూలై 2021)  

శ్రీధర్ వెల్దండి

తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.

7 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఆవుల పిచ్చయ్య రాసిన “ఊరేగింపులు” కథ ఉడుకెత్తిన నెత్తుటి పిడికిలికి సాక్ష్యం. ఒక ఉద్విజ్ఞత రచయితను ఉపేస్తుంది అనడానికి అక్షర సాక్ష్యం పిచ్చయ్యగారే. ఈనాటికీ కథను చదివినా పిడికిలి బిగించే చైతన్యాన్ని కల్గిస్తుంది. ఆనాడు ఈ కథ ప్రభావం ఎలాంటిదో ఊహించుకోవచ్చు. పిచ్చయ్య గారివి తక్కువ కథలైనా చరిత్రను రికార్డు చేసిన కథలు. వీరి కథలు తెలంగాణ రచయితల వైశిష్ట్యాన్ని సత్తా చాటే కథలు.

    వాస్తవికత ఉన్న ఈ కథలను పరిశోధించి అందించిన సంగిశెట్టి వారు అదేవిధంగా ఈ కథకు సమీక్ష అందించిన డా. వెల్డండి వారు మరియు సారంగ వేదిక నిర్వాహకులతో చరితార్థులు. పాఠకులైన మేము ధన్యులము

  • ఆవుల పిచ్చయ్య రాసిన “ఊరేగింపులు” కథ ఉడుకెత్తిన నెత్తుటి పిడికిలికి సాక్ష్యం. ఒక “ఉద్విజ్ఞత” రచయితను ఉపేస్తుంది అనడానికి అక్షర సాక్ష్యం పిచ్చయ్యగారే. ఈనాటికీ కథను చదివినా పిడికిలి బిగించే చైతన్యాన్ని కల్గిస్తుంది. ఆనాడు ఈ కథ ప్రభావం ఎలాంటిదో ఊహించుకోవచ్చు. పిచ్చయ్య గారివి తక్కువ కథలైనా చరిత్రను రికార్డు చేసిన కథలు. వీరి కథలు తెలంగాణ రచయితల వైశిష్ట్యాన్ని, సత్తా చాటే కథలు.

    వాస్తవికతపాళ్ళు ఎక్కువగా ఉన్న ఈ కథలను పరిశోధించి అందించిన సంగిశెట్టి వారు అదేవిధంగా ఈ కథకు సమీక్ష అందించిన డా. వెల్డండి వారు మరియు సారంగ వేదిక నిర్వాహకులు చరితార్థులు. పాఠకులైన మేము ధన్యులము

  • నాటి వాస్తవిక సంఘటనకు శ్రీ ఆవుల పిచ్చయ్య గారి అక్షర రూపం నేటి తరపు యువతకు స్ఫూర్తి దాయకం! సందర్భోచితంగా కథ ఎన్నుకొని కథానిక లోని వైశిష్ట్యాన్ని దర్శింప చేసిన డా. వెల్దండి శ్రీధర్ విశ్లేషణ అభినందనీయం!

  • ‘‘ఊరేగింపులు’’ కథ చదవటమే ఒక అనుభవం. దొడ్డి కొమురయ్య మరణం తర్వాత సాయుధ పోరాటం కీలక మలుపు తిరిగిందని చదువుకున్నాను. సరిగ్గా ఆ మజిలీ తాలూకు ప్రజా ఉద్యమం ఎలా ఉందో ఒక ప్రత్యక్ష సాక్షి రాసిన కథ ద్వారా దర్శించటం మరో అనుభవం.

    అసలైన ఊరేగింపును తెర మీదికి తీసుకురావటానికి ముందు పల్లెలోని వాతావరణాన్ని చిత్రించిన తీరు రచయిత నైపుణ్యానికి నిదర్శనం. అదే విషయాన్ని శ్రీధర్ వెల్దండిగారు ‘‘ఒక వాస్తవిక సంఘటనను అంతే వాస్తవికంగా కథీకరించడంలో కథకుడి ప్రతిభ దాగి ఉంది. కథకుడు ఎక్కడా జోక్యం కల్పించుకోకుండా కథ నడిపిస్తాడు. ఉత్తమ పురుషలో కథ సాగినా కథకుడి పాత్ర చాలా పరిమితంగా ఉంటుంది. కుల, మత, వయో భేదాలకు అతీతంగా ప్రజలే కాదు ప్రకృతి కూడా కొమురయ్యకు నివాళి సమర్పించాడాన్ని కథకుడు ఎంతో హృద్యంగా ప్రస్తావిస్తాడు. ఒక వీరుని మరణానికి తెలంగాణా గ్రామాలు ఎంతగా కదిలిపోతాయో ఈ కథలోని ప్రతి అక్షరం ఎంతో గొప్పగా చెప్తుంది’’ అంటూ ప్రతిభావంతంగా విశ్లేషించారు. అభినందనలు. మంచి కథ చదివే అవకాశం కల్పించిన సారంగకు ధన్యవాదాలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు