జయశ్రీ మువ్వా ఖమ్మం నుండి ఎదిగి వస్తున్న మరో కవయిత్రి. పదాల వెనుక వున్న భావోద్వేగాలు తన కవిత్వ పటుత్వాన్ని తెలుపుతాయి. సున్నితమైన వస్తువు ఎంచుకునే సరళ వచనం ఉద్వేగాల్ని మోసుకొచ్చినపుడు గుండె భారాన్ని పెంచి ఉత్కంఠను కలిగిస్తుంది. శరీర భాష(body language)ను తదనుగుణంగా సమర్థవంతంగా కవిత్వంలో ప్రవేశపెట్టడం వలన ఉద్వేగ మన:స్థితిని పాఠకులు యథాతథంగా అనుభూతి చెందగలుగుతారు. సెల్ఫ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకునే సమయంలో ఆడ మనసు గురించి ‘two pink lines//’ కవిత ఏం చెబుతుందో సావధానంగా ఆలకించుదాం.
*
two pink lines
ఓయ్..
నాకేదో అనుమానంగా వుంది
ఇవాళ కాసేపు నాతో వుండరాదూ..!
చెప్పూ ఉంటావా.. ?
చూపుడు వేలితో భుజం మీద గుచ్చి
కళ్ళలో సందిగ్ధత అర్ధింపుగా చూస్తుంది
ఏంటిది ప్రతిసారీ.. కొత్తగా చెప్తావు ,
లైట్ తీస్కో నాకు బోలెడు పనుంది
టై బిగించుకున్న మాటలు మూలుగుతాయి
అసంకల్పితంగా ఆమె చేతి వేళ్ళు
పొత్తిళ్ళ మీద పసిగా నిమురుకుంటాయి
చేద్దామా.. వద్దా.. అనుకుంటుంటే
పేగులు ముడిపడుతున్న మెలికరింత లో
ఉలిక్కిపడుతుంది వొళ్ళు
ఏంటి .. బుజ్జీ.. అంటూ
అతను వచ్చి హత్తుకుంటే బావుండు అనుకుంటూ
రెండు మోకాళ్లు గుండెల మీదకి పొదువుకుంటుంది ఆమె
కొంగుతో వెన్ను నిమురుకుని
నడుము వంపులో దోపుకుంటుంది
నిన్నటికి నిన్న తెచ్చుకున్న
అరచేయంత ప్యాకెట్ గట్టిగా పట్టుకుని
మూసుకున్న కళ్ళలో ఏవో గీత లు అలలు అలలుగా
ఒక్క క్షణం,
వూపిరి కింద పంటి బిగువున నలిగిపోతుంది
అతను వుండొచ్చు గా .. నాకెంతో బావుండేది
ఎపుడూ ఇంతే… హుమ్మ్
బాత్రూమ్ డోర్ ముందు కాలివేళ్ళు మెట్టెలు
బిగుసుకున్నట్టు అనిపిస్తుంది ఏంటో..
…….
రెండు చుక్కలు నింపుకున్న 2*2cm కొలత
ఒక 5 నిమిషాలు
అందాకా..
ఆమె కళ్ళు ధ్యానం చేస్తుంటాయి
కాలి మునివేళ్ళపైన ప్రాణం నిలుపుకుంటూ
1, 2, 3, 4, 5..
చూడు చూడు అంటూ కళ్ళని మనసు నెడుతుంది
అపుడే పుట్టిన పాపాయి లాగా చూపు విచ్చుకుంటుంది
అమ్మా…నువ్వో సారి రావూ..!. పెద్దగానే అనేసింది ఆమె
చేతిలో గులాబీ లా నవ్వుతున్న
టూ పింక్ లైన్స్
*
మనం మాటల్లో చెప్పలేని భావాల్ని body language ద్వారా సమర్థవంతంగా వ్యక్తీకరించగలుగుతాం.
1. చూపుడు వేలితో భుజం మీద గుచ్చి కళ్ళలో సందిగ్ధత అర్ధింపుగా చూస్తుంది.
2. అసంకల్పితంగా ఆమె చేతి వేళ్ళు
పొత్తిళ్ళ మీద పసిగా నిమురుకుంటాయి.
3. అతను వచ్చి హత్తుకుంటే బావుండు అనుకుంటూ
రెండు మోకాళ్లు గుండెల మీదకి పొదువుకుంటుంది.
4. కొంగుతో వెన్ను నిమురుకుని
నడుము వంపులో దోపుకుంటుంది.
చూపుడు వేలితో భుజం మీద గుచ్చడంలో – భార్య తన భర్త నుంచి తాను ఆశించిన జవాబుకై ఎదురుచూడటం, పొత్తిళ్ళ మీద పసిగా నిమురుకోవడంలో – మాతృత్వం కోసం పడే ఆరాటం, రెండు మోకాళ్లు గుండెల మీదకి పొదువుకోవడంలో – ఆత్మన్యూనతా భావం, కొంగు నడుము వంపులో దోపుకోవడంలో – కార్యాచరణకు సిద్దమవడం దాగి ఉన్నాయని చెప్పొచ్చు. అశాబ్దిక సంజ్ఞలు(non verbal signs), అశాబ్దిక సందేశాలు, శరీరావయవాల కదలికలు, వివిధ భావోద్వేగాల్ని పలికించే ముఖకవళికలు, ఒక్కో మనిషికి ప్రత్యేకంగా ఉండే మ్యానరిజమ్స్ ఇలా ప్రతీది ఏదో ఒక సమాచారాన్ని తెలియజేస్తుంది.
‘The study of body language’ ని మనం ‘Kinesics’ అంటాం. Founder of Kinesics గా American Anthropologist Ray Birdwhistell పేర్కొంటారు. ఆయన ” Facial expressions, gestures, posture and gait, visible arm and body movements” గా నిర్వచించారు. Ray ప్రతిపాదనల ఆధారంగా Prof. Paul Ekman & Wallace V Friesen లు కలిసి Kinesics ని 5 కేటగిరీలు (Emblems, Illustrations, Affective displays, Regulators, Adaptors) గా వర్గీకరించడం జరిగింది. జయశ్రీ కవిత్వంలో Kinesics ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
*
“కవిత్వం మెటాఫర్ నుండి మెటానమీకి… ప్రయాణించాలి” (వేగుంట మోహన్ ప్రసాద్).
ఇక్కడ “టై బిగించుకున్న మాటలు మూలుగుతాయి” అనేది మెటానామికల్ అభివ్యక్తి గా పేర్కొనవచ్చును. కవితలో లైట్ తీస్కో..అనే భర్త మాటలు ఆ స్త్రీ మూర్తి తో పాటు పాఠకుల మనసును సుత కలుక్కుమనిపిస్తాయి. అలాగే పరీక్ష రాసే ముందు పిల్లలు పడే Test anxiety ( “ఆమె కళ్ళు ధ్యానం చేస్తుంటాయి/కాలి మునివేళ్ళ పైన ప్రాణం నిలుపుకుంటూ), ఫలితాలు చూసేటప్పుడు వుండే excitement ( చూడు చూడు అంటూ కళ్ళని మనసు నెడుతుంది) , ఫలితాలు వెలువడిన తర్వాత వుండే Relaxation mood ఈ కవితలో Affective displays(అపుడే పుట్టిన పాపాయి లాగా చూపు విచ్చుకుంటుంది) గా ఆవిష్కృతమవడం కనిపిస్తుంది.
*
కవిత్వ నిర్వహణ కవి సామర్ధ్యాన్ని తెలియజేస్తుంది. తెలుగు సాహిత్యంలో తనదైన ముద్రను సుస్థిరం చేసుకోగలదని విశ్వసిస్తూ కవి జయశ్రీ మువ్వా కు శుభాకాంక్షలు.
*
ఒక టిపికల్ పోయమ్ కి టిపికల్ ఎనలైటికల్ రివ్యూ..
Very good poem and similarly good analysis. Appreciation to both.
మంచి విశ్లేషణ రాజ్ కుమార్.బాగా రాశారు.అభివ్యక్తి మూలాలను విశ్లేషించడానికి కావాల్సిన పరికరాలను బాగా పట్టుకున్నారు.కవయిత్రిలోనూ మంచి అబివ్యక్తి కనిపిస్తుంది.అభివ్యక్తిగురించి బాగా ఆలోచిస్తున్నందుకు జయశ్రీ మువ్వాగారికి అభినందనలు.”ప్రేగా న్యూస్”పేరుతో గతంలో మెర్సీ ఒక కవిత రాశారు.స్త్రీలలో ఉండే సహజమైన కోరికలు ఆలంబనలు చాలా సెన్సిటివ్‌గా వ్యక్తం చేశారు.స్త్రీ హృదయాన్ని కవయిత్రి బాగా ఆవిష్కరించారు.నిఝంగానే.నిజంగా గొప్ప కవిత…