దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో లేదు

జాతీయ విద్యావిధానం 1986, 1968, వాటి కింద పాలసీలు, ప్రోగ్రాములు ఎన్ని సత్ఫలితాలనిచ్చాయో చూస్తూ వస్తున్నం. ఇప్పుడు నూతన విద్యావిధానం(NEP-2020) ఎలా వుంటుందో చూడాలి? ఇప్పటివరకు 10+2+3 గా వున్న విద్యావిధానం 5+3+3+4 గా మారబోతుంది.

కరోనా(కోవిడ్-19) తాండవం చేస్తున్న విపత్కర పరిస్థితుల్లో తరగతి గది బోధనలో వచ్చిన మార్పులు, వాటి విపరీత పరిణామాల గురించి యువకవి “తండ హరీష్ గౌడ్” రాసిన ‘న్యూ టైం-టేబుల్’ అనే కవిత విశదీకరిస్తుంది. ఇప్పటికే కవి ‘నీటిదీపం’, ‘ఇన్ బాక్స్’అనే రెండు కవిత్వ సంపుటాలతో తెలుగు సాహిత్య ప్రపంచానికి సుపరిచితుడు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు కావడం, విద్యావ్యవస్థలోని లోతుపాతులు క్షుణ్ణంగా అధ్యయనం చేసి వుండడం వల్ల డిజిటల్ పాఠాలు వింటున్న విద్యార్ధులను, వారి ప్రగతిని పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో వాస్తవ పరిస్థితుల్ని ‘న్యూ టైం-టేబుల్ కవితగా మలిచి పాఠకలోకానికి అందిస్తున్నాడు.

*

న్యూ టైం టేబుల్

1.

చేతివేళ్ళ మధ్యలో

ఊపిరిపోసుకోవాల్సిన

సుద్దముక్కలు

మూసిపెట్టిన డబ్బాలకు

ఉరేసుకున్నాయి

తలరాతలను మార్చే

నల్లబల్ల

అక్షరాలకు బదులు

కన్నీళ్ళను తింటున్నది

పిల్లల చేతుల్లో

ప్రాణం పోసుకోవాల్సిన పుస్తకాలు

ఉల్లిగడ్డలై కళ్ళు మండిస్తున్నాయి

పిరియడ్ కు ఒకసారి

పలకరించే బడిగంట

పిల్లలను వెతుకుతూనే ఉంది

పరీక్షలు పట్టాలు తప్పాయి

పాఠాలు ఆండ్రాయిడ్ ఫోన్లయ్యాయి

2.

టైం టేబుల్

గాజుటద్దాల నడుమ

కళ్ళల్లో క్లాసులేసుకొని

శ్రద్ధగా కూర్చుంటుంది

ఉపాధ్యాయుడు

ఎండిన కనురెప్పలతో

పాఠాన్ని సంచీలో వేసుకొని

వీధులను వెలిగించాలని

బయలుదేరుతాడు

డిజిటల్ పాఠాలేమో తమపని

తాము చేసుకుంటూ వెళ్ళిపోతాయి

పిల్లవాడు

ఏ గోళీల ఆటల్లోనో,ఏ పబ్జీ ఆటల్లోనో,

ఏ ఫ్రీ ఫైర్ లోనో

ప్రపంచాన్ని వెతుక్కుంటాడు

3.

అర్థం కాని పాఠాల చుట్టూ

ప్రశ్నలు మూగుతాయి

పేపర్లు మాత్రం సిరాబుడ్లను

నమిలిమింగుతాయి

ఒకపక్క సెల్ఫోన్ లేని పేదరికం

చదువులను వెక్కిరిస్తుంది

పొద్దున్నే బయలుదేరే

T sat ఎక్స్ప్రెస్

ఓ పెగ్గు కరెంటేసుకొని

ఇళ్ళళ్ళకు

సక్రమంగా చేరుకోవడమే

పాఠమిప్పుడు

దేశభవిష్యత్తు

తరగతి గదుల్లో లేదు

ఇళ్ళల్లో వెలిగిపోతుంది

వేళ్ళమొనలాడించే

టచ్ స్క్రీన్ రోగమొచ్చి

ICU లో కొట్టుమిట్టాడుతుంది

*

 సుద్దముక్కలు, నల్లబల్ల, పుస్తకాలు, బడిగంట, టైం-టేబుల్, ఉపాధ్యాయుడు, పిల్లవాడు, ప్రశ్నలు, పేపర్లు మొ.న బోధనాభ్యసన సంబంధిత పదాలను మానవీకరణ చెందించి బడిలో పిల్లల్లేని దృశ్యాన్ని అభివ్యక్తికరించిన విధానం ఆకట్టుకుంటుంది. “సుద్దముక్కలు వురేసుకోవడం, నల్లబల్ల కన్నీళ్లను తినడం, పుస్తకాలే ఉల్లిగడ్డలై(మెటాఫర్) కళ్ళను మండించడం, బడిగంట పిల్లలను వెతకడం, పరీక్షలు పట్టాలు తప్పడం” మొ.నవి ఒక నిర్జీవ వాతావరణాన్ని దృశ్యీకరించడానికి కవి వాడిన అభివ్యక్తులు

విద్యార్థి, TSAT ఛానల్, డిజిటల్ పాఠాలు కనిపిస్తున్న తరుణంలో ఉపాధ్యాయుని పాత్ర ఎలాంటిదో, అతడు/ఆమె తయారుచేసుకున్న టైం-టేబుల్ పరిస్థితి ఎలా వుందో, తరగతి గదుల్లో/స్వేచ్ఛాయుత వాతావరణంలో  ప్రపంచాన్ని వీక్షించాల్సిన విద్యార్థి వేటికి బానిసవుతున్నాడో,అంతర్గతంగా కవి ఆవేదన ఏంటో అర్థం చేసుకోవచ్చు. అభ్యసన ప్రక్రియలో పాఠాలు విద్యార్థికి ఏమాత్రం అర్ధమయ్యాయో పక్కనబెడితే, మూల్యాంకనం విధిగా జరిగి ప్రభుత్వ లెక్కల్లో పాస్ మార్కులుగా ఎలా దర్శనమిస్తాయో పరోక్షంగా తెలిపిన విధానం విద్యావ్యవస్థలోని డొల్లతనాన్ని సూచిస్తుంది.

డిజిటల్ పాఠాలు ఎంతవరకు విజయవంతం అయ్యయో గమనిస్తే దేనితో నవ్వాలో అర్ధంకాని పరిస్థితి నెలకొన్న విధానాన్ని కవి నర్మగర్భంగా చెప్పిన తీరును గమనించవచ్చు. అందుకు కారణాలుగా అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో ఎప్పటికీ పరిష్కారం దొరకని పేదరికం, దానితో ముడిపడిన సర్వ దరిద్రాలను పేర్కొనవచ్చు. సెల్ ఫోన్ లేని పేదరికాన్ని పక్కనపెడితే, ఫోన్ వున్నా అది స్మార్ట్ ఫోన్ కాకపోవడం, ఒకవేళ వున్నప్పటికీ నెట్ బ్యాలన్స్ వేసే పరిస్థితి లేకపోవడం, ఇంట్లో టివీ లేకపోవడం, వున్నా డిష్ బిల్ కట్టకపోవడం, కట్టినా సమయానికి కరెంట్ లేకపోవడం, గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల తల్లిదండ్రులు వ్యవసాయ/కూలీ పనికి పోవడం వల్ల పిల్లలపై పర్యవేక్షణ ఉండకపోవడం, క్రమశిక్షణ లోపించడం,ఉపాధ్యాయుడు విద్యార్థి ఇంటికి చేరేలోపు పిల్లలు ఆటల్లో మునిగిపోవడం, ఇంటి దగ్గర దొరక్కపోవడం పైగా కరోనా భయం..ఇవన్నీ సక్సెస్ శాతాన్ని 30-40% కి పరిమితం చేశాయని చెప్పొచ్చు.

ఆమ్ ఆద్మీ ప్రభుత్వం డిల్లీలో అమలుచేస్తున్న విద్యావిధానం, కల్పిస్తున్న సౌకర్యాలు గానీ, ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వారి పర్యవేక్షణలో నడుస్తున్న సాంఘిక సంక్షేమశాఖ గురుకులాలు సాధిస్తున్న ప్రగతిని గానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యకు ఇస్తున్న ప్రాధాన్యత&సౌకర్యాలు గానీ గమనిస్తున్నప్పుడు వేళ్ళ మీద లెక్కపెట్టేవే ఉదాహరణలుగా ఎందుకు తీసుకుంటున్నం? దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని విద్యావ్యవస్థ పనితీరు అమల్లో ఎక్కడ లోపముంది? 75 సం.ల అమృతోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో వున్నాం. ఇక  అందరికీ నాణ్యమైన విద్య ఎప్పటికని అందుతుంది?

ప్రభుత్వ పాలన సరిగా లేకపోవడంతో పాటు  ప్రైవేట్ విద్యాసంస్థలు ఫీజులు వసూల్ చేసుకోవడం కోసం, ఎన్నికల్లో సీట్లు రాబట్టుకోవడం కోసం ప్రత్యక్ష తరగతులు కొనసాగించడం, వారి అవసరాలు తీరగానే తరగతులు రద్దుచేయడం, తిరిగి డిజిటల్ తరగతులు ప్రకటించడం లాంటి అసమర్ద పాలనా వ్యవహారాల వల్ల విద్యావ్యవస్థను భ్రష్టుపట్టించే దుర్మార్గమైన తీరును పరోక్షంగా కవి విమర్శించిన తీరును అభినందించవచ్చు. అందుకే దేశ భవిష్యత్హు తరగతి గదుల్లో కాక ఐ.సి.యు లో కొట్టుమిట్టాడుతుందని.. కవి ఆవేదనను ప్రకటిస్తాడు.

కరోనా తార్డ్ వేవ్ రాబోతుందనే వార్త పక్కనే జూలై 1 నుండి నూతన విద్యాసంవత్సర ప్రారంభం అనే స్క్రోలింగ్ చూడాల్సి రావడం దేన్ని సూచిస్తుంది?    

*

బండారి రాజ్ కుమార్

6 comments

Leave a Reply to Venugopal Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టబోతున్న నూతన విద్యావిధానంపై కవి మిత్రులు తండా హరీష్ గౌడ్ సర్ సునిశిత దృష్ఠితో తనదైన శైలిలో కవిత్వం చేయడం మీరు విశ్లేషించిన తీరు విధానం పాఠకుడిగా నాకు చాలా బాగా నచ్చింది..ఇద్దరికీ అభినందనలు సర్.

  • Congratulations sir.
    కవిత నేటి వాస్తవస్థితి అద్దం పడుతోంది. కవితను వివిధ లోతైన కోణాల్లో విశ్లేషించిన తీరు ఆకట్టుకుంటుంది.

  • కవిత బాగుంది.నిజంగా, స్టూడెంట్స్ భవిష్యత్తుఅగమ్యగోచరంగా ఉంది. వాస్తవాన్ని కవిత గా రాసినా కవి కి అభివందనలు..💐👍

  • తరగతి గదుల తలుపులు మూసుకుపోయాయి. ఆండ్రాయిడ్ల జాతరలో చిన్నారి విద్యార్థి తప్పిపోయాడు. చాలా బాగుంది కవిత.

  • మీరు రాసిన ఈ కవిత ఇప్పటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది.sir మీరు రచించిన కవితా శైలి విశ్లేషించిన తీరు పాఠకుడిగా నాకు బాగా నచ్చింది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు