ఇది యాకూబ్ రాసిన కవిత. ఈ సారి ఈ కవితలోని లోతుపాతుల గురించి మాట్లాడుకుందాం.
విరిగిపోతున్నాను
నాలో బీటలు వారుతున్న దేహం
కదులుతున్న మూలాలు, వేర్లు
పెళపెళలాడుతున్న మందిరాలు, మసీదులు, కమానులు-
రంగు, జాతి, తెగ, భాష
విరిగి, ఆపై కూలి, చీలిన దేశం
ఆ మండుతున్న మంటల్లోంచి
మీ కోసం నిప్పును తెచ్చాను
పరీక్షించండి
చేతనైతే చల్లార్చండి
1
భుజ్ వీధుల్లో మసీదులు ఊడ్చి
నమాజులు చేసుకొమ్మని ఆహ్వానించిన హిందూ వీధుల్లోకి
భూకంపం ఎంత ప్రేమను తెచ్చిందో!?
మనుషులంతా కలిసి బతికేందుకు, కలిసి నవ్వేందుకు
భూకంపాలే కావాలా! ఉప్పెనలే రావాలా!
2
పచ్చి అబద్ధాల్ని నిజాలుగా మనమే పదే పదే నమ్ముతున్నాం
అదే నిజమని వాదిస్తున్నాం
పేర్లలోనో, ఉండే వీథుల్లోనో, పుట్టిన ఇళ్ళలోనో
వేరు వేరు గీతలుగా మారిపోతున్నాం
ఎదురెదురైతే ప్రేమగా పలకరించుకున్నాం
ఒకే గాలిని పతంగాలమై పంచుకున్నాం
ఒకే నీటిని నల్లాల్లోంచి ఒంపుకున్నాం
దవాఖానాల్లో, స్టేషన్లలో, రోడ్లమీద
రోగులమై, ప్రయాణీకులమై
ఒకే జీవన సంక్షుభిత రహదారులమై సాగిపోయాం
పీడకలలు వచ్చినప్పుడల్లా ఒకేలా దుఃఖించాం
ఆకాశం తలనిమిరినప్పుడల్లా ఒకేలా తడిశాం
మీ నెత్తురు నా నరాల్లోకి ప్రాణమై ప్రవహించింది
నా గజల్ నీ సంగీతమై ఉప్పొంగింది
సరిగమలు,జానపదాలు ప్రతి గుండెమీంచి రాగాలై ఎగిశాయి
అల్లారఖాలు, బిస్మిల్లాఖాన్ లు, పండిత్ రవిశంకర్ లు, భీంసేన్ జోషిలు
ఒకే రాగపు బిడ్డల్లా కలిసిమెలిశారు
ఇప్పుడిదేమిటి!
నిల్చున్ననేలమీద నీదో రాగం, నాదో బాణీలా
నిప్పుల్ని దోసిళ్ళలోపట్టినట్టు
బాధను భరించలేక పోతున్నాం
జీవన రేఖలకటూ ఇటూ
నువ్వూ నేనూ తుపాకులమయ్యాం
3
నిజానికి, మాకేం అక్కర్లేదు ఈ మరణశాసనాల్తో
మాకేం అవసరంలేదు ఈ అగ్నిని రాజేసే ఆజ్యాల్తో!
చెట్టు పూలను ప్రేమించినట్టు
నీళ్ళు చేలని ప్రేమించినట్టు
నేనీ నేలని ప్రేమించాను
చెట్టుకొమ్మల మీద కూర్చుని మేలుకొలుపులు పాడేపక్షిలా
నేనెప్పుడూ దేశభక్తి గురించే మాట్లాడాను.
నా దేహాన్ని కోల్పోలేనట్లు నా దేశాన్ని ఎవరికోసమో కోల్పోలేను
ఉప్పలమ్మల్ని, బొడ్రాయిల్ని పూజించాను
తంగెడుపూల మండల్ని బాలింతగా మా అమ్మ
నా రాకకు గుర్తుగా దారినిండా మా ఊరిదాకా పరుచుకుంటూ వచ్చింది
నేను ఏ ఊరివాడినో ఈ పూలకి తెలుసు
పూలని ప్రేమించే ఈ గాలులకు తెలుసు
బందగీ పాడిన విముక్తిగీతాలు
షోయబుల్లాఖాన్, గులాంయాసీన్ రాసిన నల్లనినాదాలు
గాలిబ్ గానం చేసిన మనోహరాలు
మగ్దూం ఫైజ్ ల మాటల మంటలు
నేను వరించిన పదాలు
‘సారే జహాసే అచ్చా’ అని
ఈ నేలని పూజించిన వాడిలో
‘మా తుజే సలాం’ అని తలవంచి మొక్కినవాడిలో
కాశీ విశ్వేశ్వరుడి ముంగిట మైమరచి
షెహనాయి విన్పించిన వాడిలో
ఇంకా ఏ దేశభక్తిని వెలికితీయను
మెహదీ హసన్ గులాంఅలీల రాగాల
విశ్వజనీన సత్యాల ప్రేమల్లోంచి
ఇంకే ద్వేషం గురించి ఆరా తీయను
నే వేసుకునే బట్టలు, పెంచుకునే గడ్డాలు, మాట్లాడే భాషలు
నిలువెల్లా పరీక్షకు నిల్చునేటప్పుడు
నా కదలికలను కుట్రల జాడలుగా ముద్రలేస్తున్నప్పుడు
నేనేం హాయిగా శ్వాసించను
ఇంకెంతకాలం నిప్పుల మధ్య దహించుకు పోను
‘హమ్ బుల్ బులేహై ఇస్ కీ’ అని తెగిన రెక్కల్తో
ఇంకెలా స్వేచ్ఛగా విహరించను.
గురమ్మ తిర్నాలలో నేను పెట్టుకున్న దండాలేమైనయ్, కోటమైసమ్మ, భద్రాచలం రాముడు, ద్రాక్షారామం, శ్రీశైలం శివలింగాలు, జాన్ పాడు సైదులు దయగల దర్గాలు, నాగుల్ మీరాలు నాలో ఉన్న ప్రేమైక జీవన గీతాలు
4
ఈ భూమ్మీద చెట్లను తొలగించలేనట్లు
ప్రాణవాయువులాంటి నా దేశభక్తి నెవరూ తొలగించలేరు
దేశభక్తి ఎవడి దొడ్లోనో పెంచుకునే
పెరటి మొక్క కాదు
విధానాలు నిర్ణయించడానికి
నిజానికి, దేశభక్తి గురించి మాట్లాడినప్పుడల్లా
ద్వేషాన్ని ఎదురుగా నిలబెట్టారు
అందుకనే అందరూ మాట్లాడ్డం ఆపేసిన దగ్గర్నుండే
నేను మాట్లాడ్డం మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నాను.
26-2-2001, ప్రజాశక్తి
ప్రత్యేక సంచిక ‘ గమనం’
(యాకూబ్ గారి కవితా సంపుటి ” సరిహద్దురేఖ” నుంచి)
—————————— ——————–
అనాదిగా ఈ దేశంలో హిందూ ముస్లింలు కలిసిమెలిసి సఖ్యతతో ఉన్నారు. ఈ సఖ్యత వందలాది సంవత్సరాలుగా ఇక్కడి ప్రజల జీవనవిధానంలోనూ, సంస్కారంలోనూ ముఖ్యమైన భాగంగా కొనసాగింది. భారత రాజ్యాంగం లౌకికవాదస్ఫూర్తికి పట్టం కట్టింది. ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించింది శాంతియుత సహజీవనానికి బాటలు పరిచింది. అయితే గత కొన్ని దశాబ్దాలుగా హిందూ ముస్లింల మధ్య నెలకొన్న ఈ సఖ్యతకు గండికొట్టే విధంగా రాజకీయాలు కొనసాగుతూ ఉండడం గమనిస్తున్నాం. మతతత్వశక్తులు బలం పుంజుకున్నాక జరిగిన బాబ్రీ మసీదు విధ్వంసం, గుజరాత్ దారుణ మారణకాండ వంటి ఘటనలు ఈ దేశంలో మైనారిటీలైన ముస్లింలను అభద్రతా భావంలోకి నెట్టేశాయి. వారిని తీవ్ర ఆందోళనలకు గురిచేశాయి.
“దేశభక్తి కూర్చి, గురించి” అనే ఈ కవిత ఈ నేపథ్యంలోంచి వచ్చిన కవితగా భావించవచ్చు. ఈ కవితలోని నువ్వు – హిందువుకు, నేను – ముస్లింకు, మనం – ఇరువురికీ ప్రాతినిథ్యం వహిస్తున్నాయి. హిందూ ముస్లింల మధ్య నెలకొన్న సుహృద్భావాన్ని గుర్తుచేయడం, జరిగిన పరిణామాల పట్ల ఆందోళననూ ఆశ్చర్యాన్నీ వ్యక్తం చేయడం ఈ కవితలో ఒక ప్రధానమైన అంశం. కవి తన భావాల్ని ఇలా కవితాత్మకంగా వ్యక్తం చేస్తున్నారు:
“ఎదురెదురైతే ప్రేమగా పలకరించుకున్నాం
ఒకే గాలిని పతంగాలమై పంచుకున్నాం
ఒకే నీటిని నల్లాల్లోంచి ఒంపుకున్నాం…
పీడకలలు వచ్చినప్పుడల్లా ఒకేలా దుఃఖించాం
ఆకాశం తలనిమిరినప్పుడల్లా ఒకేలా తడిశాం
మీ నెత్తురు నా నరాల్లోకి ప్రాణమై ప్రవహించింది
నా గజల్ నీ సంగీతమై ఉప్పొంగింది
సరిగమలు, జానపదాలు ప్రతిగుండెమీంచి రాగాలై ఎగిశాయి
అల్లారఖాలు, బిస్మిల్లాఖాన్లు, పండిత్ రవిశంకర్ లు, భీంసేన్ జోషీలు
ఒకే రాగపు బిడ్డల్లా కలిసి మెలిశారు
ఇప్పడిదేమిటి!
నిల్చున్న నేలమీద నీదోరాగం, నాదోబాణీలా
నిప్పుల్ని దోసిళ్ళలో పట్టినట్టు
బాధను భరించలేక పోతున్నాం
జీవన రేఖల కటూఇటూ
నువ్వూ నేనూ తుపాకులమయ్యాం”
చరిత్రను వక్రీకరించడం, అసత్యాలను ప్రచారం చేయడం, తద్వారా ప్రజల మధ్య విభజనరేఖలను సృష్టించడం ఈ మతతత్వశక్తులు చేసిన పనులు. ఈ విషయాలను కవి ఇలా ప్రస్తావిస్తున్నారు:
“పచ్చి అబద్ధాల్ని నిజాలుగా మనమే పదే పదే నమ్ముతున్నాం
అదే నిజమని వాదిస్తున్నాం
పేరులోనో, ఉండే వీథుల్లోనో, పుట్టే ఇళ్ళలోనో
వేరువేరు గీతలుగా మారిపోతున్నాం”
మైనార్టీలను స్వదేశం పట్ల ప్రేమలేనివారిగా చిత్రీకరించడం వారికి తీవ్రదుఃఖాన్ని కలిగిస్తున్న విషయం. కవి, ఈ దేశభక్తి అంశాన్ని ప్రముఖంగా పేర్కొంటూ అసత్య ప్రచారకులకు ఇలా శక్తివంతంగా బదులు పలుకుతున్నారు:
‘సారే జహాసే అచ్చా’ అని
ఈ నేలని పూజించిన వాడిలో
‘మా తుజే సలాం’ అని తలవంచి మొక్కినవాడిలో
కాశీ విశ్వేశ్వరుడి ముంగిట మైమరిచి
షెహనాయి విన్పించిన వాడిలో
ఇంకా ఏ దేశభక్తిని వెలికితీయను.
ఇదే విషయమై ఈ కవి ఆగ్రహ స్వరంతో—
“ఈ భూమ్మీద చెట్లను తొలగించలేనట్లు
ప్రాణవాయువులాంటి నా దేశభక్తి నెవరూ తొలగించలేరు
దేశభక్తి ఎవడి దొడ్లోనూ పెంచుకునే
పెరటిమొక్క కాదు
విధానాలు నిర్ణయించడానికి
నిజానికి, దేశభక్తి గురించి మాట్లాడినప్పుడల్లా
ద్వేషాన్ని ఎదురుగా నిలబెట్టారు”..
పైన ఉటంకించిన కవితా పంక్తులతోపాటు,
— విరిగిపోతున్నాను/నాలో బీటలు వారుతున్న దేహం
— ఆ మండుతున్న మంటల్లోంచి మీ కోసం నిప్పులు తెచ్చాను/ పరీక్షించండి/ చేతనైతే చల్లార్చండి
— నా దేహాన్ని కోల్పోలేనట్లు నా దేశాన్ని ఎవరికోసమో కోల్పోలేను… వంటి శక్తివంతమైన వ్యక్తీకరణలు కవిత్వ పాఠకులను ఒకపట్టాన వదిలి పెట్టవు.
ఈ దేశంలో పుట్టి పెరిగిన ముస్లింల ఆలోచనలను మనోభావాలను ఆవేశాన్ని ఆగ్రహాన్ని ఈ కవిత తీవ్ర స్వరంతోనూ ధీర స్వరంతోనూ పలికింది… ఈ కవితకు నేటికీ ప్రాసంగికత ఉండటం విచారకరం.
*
అన్నింటినీ స్పృశించిన కవిత! అన్ని కోణాల్లో సంధించిన ప్రశ్నాస్త్రాలు