ఇప్పుడే వస్తానని వెళ్లిన ఇంద్ర ఇప్పుడప్పుడే వచ్చేలా లేడు.
నా శ్రీమతి, ఆమె చెల్లి బస్‌స్టేషన్‌లోనే కూచొని ముచ్చట్లు చెప్పుకొంటున్నారు.
బస్సుల ప్రవేశద్వారానికి అవతల, మురికికాలువ పక్కనే చెప్పులు కుడుతున్న నడివయసు మహిళను ఇంటర్వ్యూ చేస్తున్నాడు మావయ్య.
గంటన్నర గడిచింది. నేను నిలబడే ఉన్నాను. కాళ్లు పీకుతున్నాయి.
నేను మావయ్య దాకా నడిచి, ‘టీ తాగుదాం వస్తారా’ అనడిగాను.
‘‘లేదబ్బాయ్, ఈమె కథ చాలా ఆసక్తికరంగా ఉంది. నువ్వెళ్లిరా’’ అన్నాడు.
రోడ్డు దాటి, చిన్న హోటల్లో టీ తాగి, మళ్లీ స్టేషన్‌లోకి నడిచాను. అప్పుడే ఇంద్ర దిగబడ్డాడు.
‘‘ఏంటి తమ్ముడూ, రెండు గదుల కోసం ఇంతసేపా?’’ అన్నాను.
‘‘నీకేం అన్నా, ఎంచక్కా ఇక్కడ కూచున్నావు. అక్కడ ఒక్కోడు నాలుగైదు సిఫారసు లేఖలతో తగలడ్డాడు. రెండు అద్డెగదులు సాధించేసరికి ఈ టైమయింది. ఇంతాజేసి వాడికి దక్షిణ తప్పలేదు…’’ అతడి వివరణను యథాలాపంగా వింటూ, బ్యాగులు తీసుకుని సిద్ధమయ్యారు అక్కచెల్లెళ్లు.
‘‘నాన్న గారెక్కడ?’’ మా ఆవిడ అడిగింది.
‘‘అదుగో, ఆ కార్మికురాలితో ముఖాముఖిలో మునిగిపోయాడు’’ చెప్పాను అటుగా వేలు చూపిస్తూ.
అటుకేసి చూసి, లిప్తపాటులో మొహం పక్కకు తిప్పేసుకుంది. ఆలోగా ఆమె కళ్లలో ఎన్నో భావాలు దొర్లిపోతూ కనిపించాయి నాకు. అలా.. వాటిని క్షణంలోనే కళ్లతో ప్రకటించగల ‘డెప్త్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్’ మా ఆవిడకు మాత్రమే సొంతమైన విద్య. ‘ఈ మనిషింతే’ అని విసుక్కోవడమూ వినిపించింది. మామయ్యని, ఇంటర్వ్యూ ఇస్తున్న ఆవిడనీ ప్రత్యేకించి చూశాను మళ్లీ.
కాయవాటంగా ఉంది. కసరత్తులు కాకుండా కష్టాన్ని నమ్ముకున్న తీరు వంటి బిగిలో తెలుస్తోంది. మరాఠా ఆడాళ్లలో ఉండే సహజమైన ముగ్ధత్వానికి తోడు పెదాలమీద నవ్వు, కళ్లలో కొంటెతనం కనిపిస్తున్నాయి.
‘అత్తయ్య పోయిందెప్పుడు..?’ ఎందుకో, అప్పుడు తలచుకున్నాను.
ఈలోగా ఇంద్ర రెండు ఆటోలు మాట్లాడుకొచ్చాడు.
‘‘నాన్నా, ఇక చాల్లే రండి’’ చిరాకంతా రంగరించి కేకేస్తూనే అక్కతోపాటు ఆటో ఎక్కింది మరదలు.
రెండో ఆటోలో నా షడ్డకుడు ఇంద్ర ఎక్కాడు. నేనూ ఎక్కబోతూ మావయ్య వైపు చూశాను. ఆయన… ఆమెకేదో ముట్టజెప్పి, గబగబా వచ్చి ఆటో ఎక్కాడు.
అతిథి గృహానికి వచ్చి, స్నానాలవీ కానిచ్చి, గుడికి బయల్దేరాం.
షిరిడీలో ఉన్నాం మేం. అత్తయ్య మరణించి ఆరోజుకు సరిగ్గా సంవత్సరం. ఆమె జ్ఞాపకార్థం ఆమెకు అత్యంత ఇష్టమైన రెండు పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటామని అక్కచెల్లెళ్లు సంయుక్తంగా మొక్కుకున్నారట. వాళ్ల నాన్నను కూడా రమ్మన్నారు. ఆయన ఓ నవ్వు నవ్వి రానన్నాడు.
మా ఆవిడకు చిర్రెత్తుకొచ్చింది.
‘‘ఇదుగో నాన్నా, దేవుడు లేడు దెయ్యం లేడని అదిరించి బెదిరిస్తే ఊరుకోడానికి… నేను అమ్మంత మంచిదాన్ని కాదు. నీకు ఇష్టమున్నా లేకున్నా మాతో రావాల్సిందే’’ అంది అమ్మవారి అవతారం దాల్చి.
కూతురు అంత ‘సున్నితం’గా హెచ్చరించాక కాదనగలడా!
‘‘ఈ ఒక్కసారికే వస్తా. ఇంకెప్పుడూ అడగొద్దు’’ అన్నాడు.
‘‘ఆ సంగతి తర్వాత చూద్దాంలే. ఇప్పుడైతే బయల్దేరు’’ అంది, ఆయన కోరికను మన్నించిందో లేదో అర్థం కాని నైపుణ్యం ప్రదర్శిస్తూ.
అదంతా గుర్తు చేసుకుంటున్నదేమో… ‘‘తీరా వచ్చి చేస్తున్న నిరవాకం ఇదీ’’ అంది నాతో.
కాయవాటు అందం మా ఆవిడ బుర్రలో తిష్ఠ వేసుకున్నట్లుంది.
*****
వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయవీధులు కిక్కిరిసి ఉన్నాయి.
‘‘దర్శనమయ్యేసరికి ఒంటిగంట కావచ్చు. టిఫిన్ చేస్తే పోలా…’’ ఇంద్ర ప్రతిపాదన.
‘‘అమ్మో, అంతసేపయితే నేనుండలేను. ఏదో ఒకటి తిందాం…’’ మరదలి మద్దతు.
దారిపక్కనే ఉన్న కాకా హోటల్లోకి నడిచాం. నిండా జనం. ఓ పక్క నిలబడ్డాం.
రోడ్డువారగా ఉన్న పొయ్యి దగ్గర వంటమాస్టరు చెమట్లు కక్కుతున్నాడు. వడ్డించేవాళ్లు యంత్రాల్లా తిరుగుతున్నారు. గల్లాపెట్టె దగ్గర యజమాని కళ్లల్లో సీసీ కెమెరాలతో పహారా కాస్తున్నాడు.
చోటు దొరికింది. ఇడ్లీ, దోసెలు చెప్పాం. చాలామంది తెలుగు మాట్లాడుతున్నారు.
ఓ కుర్రాడు పళ్లేలు తీసుకొచ్చి, మా ముందు ఉంచాడు.
చివరి ప్లేటు పెడుతుండగా… చెట్నీ తొణికి, కొద్దిగా ఇంద్రసేన చొక్కా మీద పడిరది.
‘‘రాస్కెల్. బుద్ధుందా? కళ్లు నెత్తికెక్కాయా?’’ నరసింహావతారం దాల్చాడు ఇంద్ర.
ఆ కుర్రాడికి ఇరవై ఉండొచ్చు. వణికిపోతున్నాడు.
వాడు సారీ మీద సారీ వడ్డించినా ఇంద్రుడు ఓ పట్టాన శాంతించలేదు.
గుడివైపు నడక మొదలుపెట్టాం. ఇంద్ర, అక్కచెల్లెళ్లు నాలుగడుగులు ముందు నడుస్తున్నారు.
కాస్త ఆలస్యంగా వచ్చిన మావయ్య, పెద్దపెద్ద అంగలతో నాతో జత కలిశాడు.
దూరపు చుట్టరికం ఉండటంతో నన్నాయన ‘అబ్బాయ్’ అంటాడు మొదట్నుంచీ. నా తోడల్లుణ్ని మాత్రం ‘ఇంద్రా’ అనే పిలుస్తాడు. నా కన్నా కాస్త పెద్ద చదువు, పెద్ద ఉద్యోగం ఉండటానేమో మావయ్య నాతో ఉన్నంత చనువుగా అతనితో ఉండడు.
చెప్పులు స్టాండులో విప్పి, ప్రధాన ఆలయం వైపు వెళుతుండగా మట్టితో చేసిన దేవుడి బొమ్మలు కొనమంటూ ఓ కుర్రాడు మా వెంటబడ్డాడు.
‘‘ఎవడ్రా నువ్వు? కొనకపోతే కొట్టేస్తావా? అవతలికి పో వెధవా’’ ఇంద్రకు పూనకం వచ్చింది.
ఆ కుర్రాడు బిత్తరచూపులు చూసి, మాకు దూరంగా వెళ్లిపోయాడు.
మావయ్య వాణ్నే చూస్తున్నాడు. ఆయన కిదంతా వినోదంగా ఉన్నట్లుంది!
‘‘ధర్మదర్శనం క్యూ చాలా పెద్దగా ఉంది. స్పెషల్ దర్శనం టిక్కెట్లు తెమ్మంటారా?’’ ఇంద్ర ప్రశ్న.
‘‘నేన్నుంచోలేను. అరికాళ్ల మంటలు…’’ స్పెషల్ తెచ్చెయ్యమని తెలివిగా చెప్పింది నా శ్రీమతి.
‘‘ఇక్కడే ఉండండి. అయిదు నిమిషాల్లో తెస్తాను’’ ఇంద్ర వెళ్లాడు.
గాజులు, పక్కపిన్నులు అమ్మే యువతి మాకు దగ్గరగా వచ్చింది. అక్కచెల్లెళ్లు ఆసక్తిగా ఆమె దగ్గరున్న ప్రతి వెరైటీనీ పరిశీలించడంలో మునిగిపోయారు. మావయ్య మాత్రం జాకెట్టూ లంగా వేసుకున్న ఆ అమ్మాయినే గమనిస్తున్నాడు. కూతుళ్లిద్దరూ ఉన్నారని మాట కలపట్లేదేమో?!
‘‘సిఫారసు లేఖలూ ప్రత్యేక దర్శనాలూ మొదలైనప్పుడే పరమాత్ముడు కూడా ప్రజాస్వామ్యంలో లీనమయ్యాడు’’ నవ్వుతూ అన్నాడు మావయ్య.
ఇంద్ర రాగానే ప్రత్యేక ద్వారాల గుండా లోపలికి ప్రవేశించాం.
గర్భగుడికి ఎదురుగా ఉన్న పెద్ద హాల్లో కుడి ఎడమలుగా క్యూల్లో నిలబడి ఉన్నారు భక్తులు. ఎడమపక్క నేను; నా ముందు అక్కచెల్లెళ్లు, ఇంద్ర. నా వెనక మావయ్య. రెండు క్యూల మధ్యలో ‘సిఫారసు భక్తులు’ నేలమీద తిష్ఠ వేశారు. చేతులు జోడిరచి, మనసులోని కోరికలు నివేదిస్తున్నారు.
కుడిపక్క క్యూలోనూ, మధ్యలో కూచున్న వారిలోనూ అందంగా ఉన్న మహిళల వంక ఇంద్ర కన్నార్పకుండా చూస్తున్నాడు. మావయ్య మాత్రం ఆ పక్కన గోడకు అమర్చిన పలకల మీద మరాఠీలో రాసి ఉన్న వివరాలను పక్కనున్న పెద్దాయన సాయంతో తెలుసుకుంటున్నాడు.
ధర్మదర్శనం క్యూలో వచ్చిన భక్తులు అల్లంత దూరం నుంచే బాబాను చూసి, వెనుదిరుగుతున్నారు.
గర్భగుడి దగ్గరయ్యే కొద్దీ మా క్యూలో తోపులాట మొదలైంది.
ఒకరినొకరు నెట్టుకుంటున్నారు. ఆడ, మగ తేడా లేకుండా ఒరుసుకుపోతున్నారు.
‘‘అబ్బాయ్… ఆ క్యూలో వాడు చూడు, రద్దీని అవకాశంగా తీసుకుని ఆ అమ్మాయిని ఎలా నలిపేస్తున్నాడో. చిత్తశుద్ధి లేని శివపూజలంటే ఇవే’’ నాకు మాత్రమే వినబడేలా అన్నాడు మావయ్య.
వాడు నలిపేస్తున్నది నిజమే. మావయ్యకేసి చూశాను.
వాడి స్థానంలో తాను లేనందుకు అసూయ పడుతున్నాడా?!
‘‘నాన్నా, మీ గుసగుసలు ఆపి, ఈ కాసేపు ప్రశాంతంగా దేవుడికి దండం పెట్టుకోండి’’ అంది మా ఆవిడ వెనుదిరిగి మా ఇద్దరివైపు మిర్రి చూస్తూ.
నేను చేతులు జోడిరచి దండం పెట్టి, బుద్ధిగా కదిలాను.
మూలవిరాట్టు ముందు నిలబడి ఓ పూజారి తీర్థమిస్తున్నాడు. మరొకాయన శఠగోపం పెడుతున్నాడు. మూడో పూజారి ఓ పళ్లెంలో ఉన్న కొబ్బరిచిప్పలు, అరటిపళ్లను తలా ఒకటి ఇస్తున్నాడు. మన చేతిని తాకితే మైల పడిపోతాడేమోనన్నట్లు పళ్లను భక్తుల చేతుల్లోకి దాదాపు విసిరికొడుతున్నాడు. అలా ఇంద్ర మీదికి విసిరిన అరటిపండు- అసలే తొక్క ఊడిపోయి ఉన్నది- అతని చేతుల్లోంచి జారి చొక్కామీదా ప్యాంటుమీదా మరకలు చేస్తూ కింద పడిరది. అదేమీ పట్టించుకోకుండా గభాల్న వంగి, పండును చేతుల్లోకి తీసుకుని, కళ్లకద్దుకుని ముందుకు సాగాడు ఇంద్ర.
మావయ్య తీర్థప్రసాదాలు తీసుకోలేదు. బాబాకు అలంకరించిన బంగారపు తొడుగుల్నీ, గర్భగుడిలో బిగించిన ఏసీనీ నిశితంగా చూస్తున్నాడు. కానుకలు సమర్పిస్తున్న భక్తుల హావభావాలను చదువుతున్నాడు.
బయటికొచ్చాం. చుట్టూ ఉన్న చిన్న దేవుళ్ల సందర్శనకు రానని మొరాయించాడు మావయ్య.
‘‘అయితే మీరిక్కడే ఉండండి, మేం దర్శించుకుని వస్తాం’’ అంది మా ఆవిడ.
నా మనసు గుడుల మీద లేదు. చిన్న గుడులు చుడుతూనే మావయ్యపై ఓ కన్నేశాను.
ఆయనలోని ‘అసలు మనిషి’పై నాకు అమితాసక్తి!
ఆయన ఆలయ ప్రాంగణంలోనే అన్నివైపులా తిరుగుతున్నాడు. అటెండర్లతో, పారిశుద్ధ్య కార్మికులతో, భక్తులతో మాట్లాడుతూ ఉన్నాడు.
నిత్యాన్నదానం వైపు నడక. దారి మధ్యలో ఉదయం కనిపించి, దేవుడి బొమ్మలు కొనమని కోరిన అబ్బాయే మళ్లీ వెంటపడ్డాడు… ఈసారి కూడా ఇంద్రసేనే లక్ష్యంగా!
కోపం తారస్థాయికి చేరి, ఇంద్ర ఆ పిల్లాడి మీద విరుచుకుపడ్డాడు. భయపడి, బెంబేలెత్తి, పరుగు లంకించుకున్నాడా కుర్రాడు. ఇంద్ర విజయదరహాసంతో ముందుకు సాగాడు. మావయ్య మాత్రం వెనకే నిలబడిపోయి, ఆ కుర్రాడు పరుగెత్తుతున్న వైపు చూస్తున్నాడు. నేనూ ఒక్క క్షణం నిలబడ్డాను.
కొంతదూరం పోయాక, షాపింగ్ కాంప్లెక్స్ మెట్లు ఎక్కబోతూ కాలుజారి, కింద పడిపోయాడా పిల్లాడు. అంత హడావుడిలోనూ చేతుల్లోని మట్టిబొమ్మల్ని కాపాడుకోడానికి విశ్వప్రయత్నం చేశాడు. అయినా, నాలుగు బొమ్మలు బద్దలయ్యాయి.
మావయ్య పరుగెత్తి, ఆ పిల్లాణ్ని లేపాడు. బొమ్మలన్నీ నేలమీద సర్దాడు. నేనూ అటువైపు అడుగులేశాను. నిక్కరుకు అంటిన దుమ్మును దులుపుకుంటూ ఆ అబ్బాయి ఏడుస్తున్నాడు.
‘‘ఒక్కో బొమ్మ అమ్మినందుకు మా ఓనర్ నాకు అయిదు రూపాయలిస్తాడు. ఇప్పుడీ బొమ్మలు పగలగొట్టినందుకు నన్ను చంపేస్తాడు…’’ తెలుగు బాగా మాట్లాడుతున్నాడు.
మావయ్య ఓదార్చాడు. ‘‘ఒక్కోటీ ఎంత?’’ అడిగాడు.
‘‘యాభై’’ చెప్పాడు.
‘‘ఇదిగో రెండొందలు. ఏడవకు’’ డబ్బులు జేబులో పెడుతూ సముదాయించాడు మావయ్య.
‘‘బడికెళ్లడం లేదా?’’ మళ్లీ మావయ్యే అడిగాడు.
‘‘ఎల్తన్నా. ఏడో తరగతి. ఈరోజు సెలవు. వారానికి రెండ్రోజులు బొమ్మలమ్మి, ఇంటి ఖర్చులకోసం అమ్మకు ఇస్తా’’ అన్నాడు, కొంత సేదదీరుతూ.
‘‘ఏడవకు. ధైర్యంగా ఉండాలి. యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలి’’ మావయ్య బోధ.
‘‘అట్టాగే సారూ’’ అంటూ ఆ కుర్రాడు ఉత్సాహంగా వెళ్లిపోయాడు.
మావయ్యలో ఈ కోణం నాకు కొత్తేగానీ, సీరియస్‌గా పట్టించుకోలేదు.
*****
అత్తయ్య కలగన్న క్షేత్రాటనం నాటకంలో రెండో అంకం మిగిలింది. మరుసటి నెలలో రెండురోజుల సెలవు చూసుకుని… ఓరోజు సాయంత్రం అయిదు గంటలకు బస్సులో మదురై బయల్దేరాం. నాకూ మావయ్యకూ వెనకసీట్లు దక్కాయి. ఆయనతో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఇప్పటిదాకా రాలేదు.
యథాలాపంగా కదిలిస్తే, ఎన్నో విషయాలు చెప్పాడు. భక్తి మూఢత్వంగా మారడం గురించి, చాదస్తాలు పెరగడం గురించి, దొంగబాబాల మాయల గురించి… లోతుగా మాట్లాడాడు.
‘‘ఇవ్వాళ ఏ పుణ్యక్షేత్రానికైనా వెళ్లు. ఆ పవిత్ర నేలమీద కాలు పెట్టింది మొదలు… అద్దెగదుల నుంచీ ప్రత్యేక దర్శనాల దాకా, తలనీలాల నుంచీ ప్రసాదాల దాకా… అన్నీ సిఫారసుల మతలబులే గదా! లేదంటే, దక్షిణ సమర్పణలు! మరి సామాన్యుడి సంగతేంటి?’’
ఆయన చెబుతున్నది ఏమైనా.. నాలో ‘ఆనాటి’ ఆసక్తి ఇంకా చావలేదు.
‘‘షిరిడీలో బస్‌స్టేషన్ బయట ఆమెతో మాట్లాడారు…’’ ‘ఏంటి సంగతి?’ అని ధ్వనిస్తూ అడిగాను.
‘‘బాగా గుర్తు చేశావబ్బాయ్. ఆమె భర్తను కోల్పోయింది. ఆవుమాంసం తిన్నాడన్న ఆరోపణతో ఛాందసులు కొందరు మూకుమ్మడిగా దాడి చేసి, అతన్ని హతమార్చారట. కొడుకు డిగ్రీ చదివాడు. సైన్యంలో చేరి, దేశానికి సేవ చేయాలన్నది అతడి ఆశయం. ఖర్చులకు కూడా డబ్బుల్లేవట. ఏదో నాకు తోచింది ఇచ్చాను…’’ చెబుతూనే ఆయన మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు.
ఆయన చెప్పిందేమీ అబద్ధం కాకపోవచ్చు. అలాగని నేను పూర్తిగా నమ్మనూ లేదు. ఇతరులకు చెప్పగల అవకాశమొస్తే ప్రతివాడూ బాబా అవతారమెత్తుతాడేమో అనిపించింది.
నేను కిటికీలోంచి చూస్తూ, బయటి ప్రపంచపు లోపలి ఖాళీల గురించి ఆలోచనలో పడ్డాను.
*****
మరుసటి రోజు ఉదయం. మదురైలోని మీనాక్షి అమ్మవారిని దర్శించుకోవడం పూర్తయింది.
మాటల మధ్యలో తెలిసిందేమంటే… ఆరోజు సాయంత్రం ప్రధానాలయం చుట్టూ అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగిస్తారట. సంవత్సరానికి ఒకే ఒక్కరోజు నిర్వహించే ఆ తంతుకు భక్తజనం పోటెత్తుతారట. ఆ వేడుక చూడాల్సిందేనని అక్కచెల్లెళ్లు పట్టుబట్టారు.
మధ్యాహ్నం మూడుగంటలకే ఆలయానికి చేరుకున్నాం. అప్పటికే జనం భారీగా పోగయ్యారు. మేమూ పోటీపడి ప్రధాన ద్వారం దాటి లోపలికి చేరుకున్నాం. ప్రధానాలయం చుట్టూ భక్తులు దడి కట్టారు.
మరో గంటలో ఊరేగింపు. ఎటుచూసినా జనం జనం.
దూరంగా ఆకాశమెత్తు గోపురం కనిపిస్తోంది.
మా ఆవిడ అటువైపే దీర్ఘంగా చూస్తూ ‘‘అమ్మవారి మహిమే లేకుంటే అంతెత్తు గోపురం సాధ్యమయ్యే పనేనా’’ అంది ఆశ్చర్యాన్ని కొసకంటా సాగదీస్తూ.
మేమెవ్వరం మాట్లాడలేదు. మావయ్య మాత్రం పెద్దగా నవ్వాడు.
‘‘అమ్మవారి మహిమ కాదు… పన్నెండో శతాబ్దిలో మూడు మైళ్ల దూరం నుంచి కొండలు పిండిచేసి జంతువుల చేత ఇక్కడిదాకా రాళ్లు మోపించారు. ఏటవాలు తలం సృష్టించి, దానిమీదగా పెద్దపెద్ద బండరాళ్లను గోపురపు అంతస్తుల మీదికి చేర్చే క్రమంలో వందల మంది కష్టజీవులు కన్నుమూశారు. చనిపోయిన గాడిదలు, గుర్రాలు, ఏనుగులకైతే లెక్కేలేదు. ఎంతో మారణహోమం జరిగితే గానీ.. ఒక గోపురం తయారవదు..’’ సంజాయిషీ ఇస్తున్నట్లుగా అన్నాడు మావైపు చూస్తూ.
‘‘అవున్నాన్నా! అప్పుడు నువ్వు దగ్గరుండి చూశావు కదూ! మన దేశ సంస్కృతి, సంప్రదాయాల గురించి తక్కువజేసి మాట్లాడ్డం పెద్ద ఫ్యాషనైపోయింది…’’ మా ఆవిడ దాడి.
‘‘సంస్కృతి వేరు, చరిత్ర వేరమ్మా. మన మౌలిక సంప్రదాయంపై నాకు గౌరవం ఉంది. కానీ మూలాల్ని కలుషితం చేస్తున్నారు. వ్యవస్థల మీద వ్యక్తుల ఆధిపత్యం పెరిగిపోయి…’’
‘‘నాన్నా, ఇక చాలు. ఇవ్వాళా రేపూ మీ సిద్ధాంతాలను పక్కనపెట్టి, అమ్మ ఆత్మశాంతి కోసం అమ్మవారిని ప్రార్థించండి’’ శ్రీమతి హుకుం.
మావయ్య మౌనం వహించాడు. నెమ్మదిగా మా వెనక ప్రాకారం పక్కనే ఉన్న బండల వద్దకెళ్లిపోయాడు. నొచ్చుకున్నాడేమో అనిపించింది. చూడబోతే అలాలేడు. తాపీగా బండల మీద కూచున్నాడు, ఆ సందడితో తనకేమీ సంబంధం లేనట్లు.
ముప్పావుగంట గడిచేసరికి కాళ్లు పీకాయి. నేనూ వెళ్లి మావయ్య పక్కనే కూచున్నాను.
‘‘హుఁ… పిచ్చి జనం…’’ అన్నాడాయన చిత్రంగా నవ్వుతూ.
‘‘అసలే మొరటు అరవ గుంపు’’ నేను జత కలిపాను.
‘‘మనమేం తక్కువా..?’’ మావయ్య మాట అర్థం కానట్టుగా చూశాను.
‘‘ఇంజినీరింగ్ చదువుతూ గతిలేక హోటల్లో పనిచేస్తున్న కుర్రాడి చేయి ఒలికి చట్నీ కాస్త మీదపడితే రంకెలేస్తాం మనం. అదే, గుడిపూజారి విసిరికొట్టే అరటిపండు ఒళ్లంతా మరకల్ని పామేసినా.. పావనమైపోయినట్లు, కిమ్మనం… పిచ్చికాక ఏంటిది?’’
హోటల్ పనికుర్రాడి చరిత్రను కూడా సేకరించుకు వచ్చాడా? ఆరోజు షిరిడీలో టిఫిను తర్వాత ఆయన ఆలస్యంగా వచ్చి మాతో కలిసింది అందుకేనా!
మావయ్యకేసి చూశాను. ఆయన నన్ను చూడ్డం లేదు. ఎటో చూస్తూ మాట్లాడుతున్నాడు.
ఆరోజు బాబాగుడిలో మేం చిన్న దేవుళ్లకు మొక్కుతుండగా పనోళ్ల ద్వారా తెలుసుకున్న సంగతులన్నీ చెబుతున్నాడు. నిత్యమూ దేవుడి సేవలోనే ఉండే కార్మికుల బతుకుల్లోని చీకట్ల గురించి చెబుతున్నాడు.
బొమ్మలు పగిలినందుకు ఏడ్చే కుర్రాడిని ఓదార్చిన వాడే ‘అసలు మావయ్య’. చెప్పులు కుట్టే అమ్మాయిని చూసినా, పిన్నీసులమ్మే పిల్లని పరికించినా, క్యూలైన్లో ఆడాళ్లని తడిమి ఆనందించే కుర్రాడిని చూసి అసూయపడినా.. అదంతా మావయ్య కాదేమో! నాలోని లోపలి మనిషిని మావయ్యలో చూసుకున్నానేమో అనిపించింది.
అసలు మావయ్యని నేను తెలుసుకున్నానా? తెలుసుకోగలనా? మీమాంసలోనే ఉన్నానింకా!
*****
మరో పావుగంట తర్వాత గర్భగుడి వైపు నుంచి బయల్దేరిన ‘ఊరేగింపు సేవ’ జనం మధ్యకు వచ్చింది. భక్తుల్లో వీరచైతన్యం ఉప్పొంగింది. ఎవరికి తోచిన నామాలతో వారు నినాదాలు చేస్తున్నారు.
ఎడమవైపు గుంపులుగా నిలబడిన భక్తుల ముందుగా పల్లకీని మోసుకుంటూ పోవడం లీలగా కనిపించింది నాకు. బండమీదే నిలబడి చూశాను. పల్లకీ మధ్యలో అమ్మవారి చిన్న విగ్రహం ఉంది. భక్తుల తోపులాట పెరిగినప్పుడల్లా బోయీలు తడబడుతున్నారు. అమ్మవారి విగ్రహం అటూ ఇటూ ఊగుతోంది.
మమ్మల్ని దాటిపోగానే, ఆ స్థానంలో నిలబడిన భక్తులందరూ ఊరేగింపును అనుసరించారు. మా వాళ్లు ముగ్గురూనూ. మా ముందు కాస్త ఖాళీ ఏర్పడిరది.
అసలు ఊరేగింపు అనే ప్రక్రియ ఎలా ప్రారంభమైందో చెబుతున్నాడు మావయ్య. ఈ ముచ్చట దేవుళ్లు కోరుకున్నది కాదనీ… దేవుళ్ల మీద పెత్తనం చలాయిస్తుండే మనుషులు తమ వైభవాన్ని ప్రదర్శించుకోడానికి చేసేది మాత్రమేననీ విశ్లేషిస్తున్నాడు.
మావయ్య పుస్తకాలు బాగా చదువుతాడు. ఏ విషయాన్నైనా అద్భుతంగా విశ్లేషిస్తాడు. నిర్మొహమాటంగా మాట్లాడతాడు. ఆ క్రమంలోనే చాలామంది శత్రువులను తయారు చేసుకుంటూ ఉంటాడు. మావయ్యకు ఆడవాసన ఎక్కువనే ఇల్యూజన్‌లోకి నన్ను నెట్టిన మా ఆవిడ కూడా అలాంటి శత్రువుల్లో ఒకరు. నేను ఆ ఆలోచనల్లో ఉండగానే…
ఓ మహిళ అక్కడికొచ్చింది, చక్రాల కుర్చీని తోసుకుంటూ. ఆ కుర్చీలో కొడుకున్నాడు. పోలియో బారిన పడిన ఆ బాబు రెండు కాళ్లూ తోటకూర కాడల్లా వేలాడుతున్నాయి.
‘‘గీడ కూసో బిడ్డా. తిరిగచ్చినంక అమ్మోర్ని సూపిస్త…’’ అందామె.
‘‘లేలే… నేను అమ్మోర్ని దగ్గర్నించీ సూడాల…’’ మారాం చేస్తున్నాడా అబ్బాయి.
తల్లీకొడుకుల మధ్య వాదన ముదిరింది.
‘‘గీ గుంపుల దూరినమంటె సస్తవ్ బిడ్డా. నా మాటిను. గీడనే ఉండు…’’
ఆ పిల్లాడు ఏడుపందుకున్నాడు.
‘‘ఈంతోని నా సావుకచ్చింది. ఏడిసినవంటే సంపుత కొడకా’’ గదిమిందామె.
మావయ్య దగ్గరగా వెళ్లాడు. నేను నిశ్శబ్దంగా గమనిస్తున్నాను.
‘‘ఏం పేరు?’’ అబ్బాయిని పలకరించాడు.
‘‘మల్లేశ్’’.
‘‘ఏం చదువుతున్నావు?’’
‘‘ఆరు’’.
‘‘అమ్మవారిని దగ్గర్నుంచే ఎందుకు చూడాలనుకుంటున్నావు?’’ మావయ్య.
‘‘అమ్మ ఇంటే లొల్లి పెడ్తది. ఇట్టా రా…’’ అన్నాడు మావయ్యనుద్దేశించి.
ఆయన ఆ బాలుడి చక్రాలకుర్చీ పక్కనే మోకాళ్లపై కూచొని, తన చెవిని పోరడి నోటి దగ్గర పెట్టాడు.
‘‘నాకు కాళ్లెందుకు ఇవ్వలేదో అడగాలె. పోన్లే, గప్పుడు యాది మరిసిందనుకుందం… గీ పొద్దయినా నా కాళ్లు నాకిమ్మని సెవిలో సెప్పాలె…’’ అంటున్నాడు.
మొట్ట మొదటిసారి చూశాను… మావయ్య కళ్లల్లో నీళ్లు తిరగడం!
‘‘నేను చూపిస్తా. దగ్గర దాకా తీసుకెళ్లి చూపిస్తా. సరేనా…’’ అడిగాడు మావయ్య.
‘‘ఓ… మస్తు సంతోషం…’’ ఆ అబ్బాయి మురిసిపోతున్నాడు.
ఇరవై నిమిషాలు గడిచాయి. అత్యంత నెమ్మదిగా కదులుతూ… ప్రధానాలయం చుట్టూ తిరిగి… కుడివైపు చేరుకుంది ఊరేగింపు. మరో అయిదు నిమిషాల్లో మళ్లీ గర్భగుడిలోకి వెళ్లిపోతుంది.
మావయ్య పంచెను పైకిగట్టాడు. పైపంచెను తలకు చుట్టాడు.
పిల్లాడి తల్లి వారిస్తున్నా వినకుండా, ఆ దివ్యాంగుడిని భుజాల మీదికెక్కించుకున్నాడు.
పల్లకీ మాకు పది గజాల దూరంలో ఉందనగా… అద్భుత శక్తులేవో పూనినట్లు… ఆయన జనాన్ని తోసుకుంటూ… ఊరేగింపునకు ఎదురెళ్లాడు. నేనూ మెల్లగా అనుసరించాను.
మావయ్య భాషలో ‘భక్తి ఒక ఉన్మాదం’!
అంతకు మించిన ఉన్మాదం ఆ క్షణం ఆయనలో కనిపిస్తోంది.
దేవుడికి పెత్తందారు తానేనన్నట్లు ముందువరసలో నడుస్తున్న ప్రధానార్చకుడి హెచ్చరికలు ఆయన చెవికి సోకడం లేదు… పక్కల్లో పొడుస్తున్న భక్తజనం మోచేతులు బాధించడంలేదు… వారిస్తున్న బోయీల అరుపులు ఆలకించడం లేదు… ఆయన చూపు అమ్మవారి ఉత్సవ విగ్రహం మీదనే ఉంది… భుజాల మీంచి ముందుకు వేసుకున్న పిల్లాడి అవిటికాళ్లను వడిసి పట్టుకుని ఉన్నాడు.. తాపుల్ని తాళుకుంటూ, జనాన్ని చీల్చుకుంటూ సాగుతున్నాడు. అలా ముందుకి ముందుకి సాగి… బాగా నేలమీదకు వంగి.. క్షణం అదృశ్యమై… మరుక్షణం అద్భుతమై… ముందు బోయీలకు వెనుక బోయీలకు మధ్యనున్న ఖాళీ జాగాలోకి చివాల్న ధ్వజస్తంభంలాగా లేచి నిల్చున్నాడు మావయ్య.
‘‘అదిగో అమ్మవారు! మల్లేశ్, చెప్పేయ్…’’ అరిచాడు మావయ్య.
మల్లేశ్ తను చెప్పదలచుకున్నదేదో చెప్పేశాడు. అడగదలచుకున్నదేదో అడిగేశాడు. అంతా రెప్పపాటులో జరిగిపోయింది.
అక్కణ్నుంచి మళ్లీ వెనక్కి రావడం కష్టమైంది. జనం. విపరీతమైన తోపులాట.
మావయ్య అతి కష్టం మీద పక్కకొచ్చి, మల్లేశ్‌ను నాకు అందించాడు. నేను ఎత్తుకుని గబగబా జనం నుంచి దూరంగా తీసుకెళ్లి వాళ్ల అమ్మకు అప్పగించాను.
మావయ్య అక్కడే చిక్కుబడిపోయాడు. ఆయన్ని కూడా బయటికి లాగాలన్న ఉద్దేశంతో మళ్లీ అతి కష్టంమీద గుంపులోకి చేరుకుని, మావయ్యకు దగ్గరగా వెళ్లాను.
భక్తులు అదుపు తప్పారు. ఓ పిల్లాడు అమ్మవారికి దగ్గరగా వెళ్లినప్పుడు తామెందుకు వెళ్లకూడదన్న భావావేశానికి లోనై, చుట్టూ సెక్యూరిటీ వాళ్లు పట్టుకున్న తాళ్లను ఛేదించుకుని ముందుకురికారు.
మావయ్య తంటాలు పడి పల్లకీ ముందుభాగానికి చేరుకున్నాడు.
ఊరేగింపు వెనక నడుస్తున్న సమూహంలో ఎవరో మరెవరినో నెట్టారు. అతను ఇంకొకర్ని. ఇంకొకరు మరొకరిని. భారీ అల సముద్రపు ఒడ్డును తాకినట్టు… ఆ జనప్రవాహం పల్లకీ మీదికి దూసుకొచ్చింది.
బోయీలు అదుపు తప్పారు. ఆ పెద్ద కుదుపునకు అమ్మవారి విగ్రహంతోపాటు పల్లకీ పక్కకు ఒరిగిపోయింది. క్షణంలో వందో వంతులో అమ్మవారి విగ్రహాన్ని ఒడిసి పట్టుకున్నాడు మావయ్య.
శిలల్లా నిలబడి, సంభ్రమాశ్చర్యాలతో చూస్తున్నారు భక్తులు.
తెల్లచొక్కా, తెల్లపంచె, తలగుడ్డలతో ఆకస్మికం వెలసిన విష్ణుమూర్తిలా కనిపించాడు మావయ్య.
ముందుగా తేరుకున్న వ్యక్తి ప్రధానార్చకులు. ఆయన నాలుగడుగులు వేసి, మావయ్య చేతిలోని విగ్రహానికి భక్తిపూర్వకంగా నమస్కరించి, తన చేతుల్లోకి తీసుకుని, గర్భగుడి వైపు నడిచాడు.
మిగతా అర్చకులు ఆయన్ని అనుసరించారు.
మావయ్య నిలువెత్తు విగ్రహంలా నిలబడి ఉన్నాడు.
ఓ యువతి ఆయనకు దగ్గరగా వచ్చి, ఆయన కాళ్లకు నమస్కరించింది.
మరో పెద్దావిడ వచ్చి, ‘‘అమ్మవారిని తాకిన ఈ చేతులు…’’ అంటూ మాట పూర్తి చేయలేని తమకంతో మావయ్య చేతిని ముద్దాడిరది. జనం క్యూ కట్టారు.
ముంచుకురాబోతున్న భక్త్యోపద్రవాన్ని పసిగట్టిన మావయ్య అక్కడినుంచి కాలిసత్తువ కొద్దీ పరుగు తీశాడు. పారవశ్యంతో పులకించిపోతున్న భక్తులు కొందరు ఆయన్ని వెంబడిరచారు.
నిమిషంలోపే ఆలయ ప్రాంగణం ఖాళీ అయింది.
నా శ్రీమతి, ఇంద్రసేన, అతని భార్య… అయోమయం నుంచి తేరుకుని, గుడి ప్రధాన ద్వారం వైపు కదిలారు.
నేనొక్కణ్నే మరో క్షణం అక్కడుండి… మోకాళ్లపై కూచొని మావయ్య నిలబడిన చోటును కళ్లకు అద్దుకున్నాను!
—0—
Excellent 👌 అనే మాట చిన్నది అవుతుందేమో సర్.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి అంశం మీద రాయడం నిజంగా సాహసమే…చాలా నచ్చింది
ధన్యవాదాలు కిరణ్ విభావరి గారూ.
adbhutaMgaa raasaaru. mUDha bhaktulaku vaatalaa .
మనఃపూర్వక ధన్యవాదాలు స్వాతీ శ్రీపాద గారూ.
చాలా చాలా బాగుంది .
మానవుడే మాధవుడయితే….🙏🙏🙏.
చాలా బాగుంది అద్భుతమైన కథ. మానవుడే మాదవుడయితే.,🙏🙏🙏.
మీ అభినందనలకు కృతజ్ఞతలు వాణిశ్రీ గారూ.
కాయవాటు అందం
షడ్డకుడు
బయట ప్రపంచపు లోపల ఖాళీ
మొదటి సారి విన్న పదాలు.
కొత్తగా ఉంది కథ.
అభినందనలు సర్
సార్
కథ చాలా బాగుంది. పవిత్రమైన దేవాలయాలలో దేవుడి పేర ముసుగులో జరిగే అరాచాకల్ని, డబ్బుతో పరపతితో వ్యవస్థని కలుషితం చేస్తూ ,సామాన్యుడికి గగన కుసుమం చేస్తున్న దైవ దర్శనం గురించి బాగా విశదీకరించారు. ఇంద్ర పాత్ర ద్వారా మనషుల చిన్న తప్పిదానికి, అదే ఆలయంలో జరిగితే సర్దుబాటు చేసుకునే తీరు మానసిక పరిపక్వత లేని వ్యక్తిగా, మనుషుల గురించి తెలుసుకుంటూ మానవత్వంతో ఆలోచించే వ్యక్తిగా దేవుడి మామయ్య పాత్ర సృష్టి బాగుంది.
మంచి కథ అందించిన శ్రీ రామిరెడ్డి గారికి అభినందనలు.
Thank you sir.
ఏ సమయానికి అలా నడతను కొనసాగించడం కూడా భక్తిలో ఓ భాగమే. ఒప్పుకోరుగాని అదీ దైవాఆరాధనే…దేవుడిమావయ్య అలాంటివారే.
చాలావరకూ రచయిత ప్రస్తుతమూఢభక్తి, అసందర్భ సంప్రదాయాలు, గూర్చి వివరించారు ..జరుగుతున్న చరిత్రఅది.
అయితే రచయిత కృతకుృత్యులు ఎక్కడైయారంటే… దేవుడు మానుషరూపేణా అనిపించేటట్టు మావయ్య కేరక్టరైజేషను.
మాధవసేవే మానవసేవ అని చెప్పకనే చెప్పటం. నెరేషను చక్కగవుందండి.
చిక్కటి సబ్బేక్టుతీసుకుని చక్కగ అభివర్ణించారు రచయిత. చే యి తిరిగినవారూగావున ఇంతగరాయగలిగారు.
ధన్యవాదాలు భరద్వాజ గారూ.
కథ చాలా బాగుంది. పవిత్రమైన దేవాలయాలలో దేవుడి ముసుగులో జరిగే అరాచాకల్ని, డబ్బుతో పరపతితో వ్యవస్థని కలుషితం చేస్తూ ,సామాన్యుడికి గగన కుసుమం చేస్తున్న దైవ దర్శనం గురించి బాగా విశదీకరించారు. మనుషుల చిన్న తప్పిదానికి ఆ మనిషి పై విరుచుకుపడి, అలాంటి తప్పే ఆలయంలో జరిగితే సర్దుబాటు చేసుకునే తీరు మానసిక పరిపక్వత లేని వ్యక్తిగా ఇంద్ర పాత్ర ద్వారా చెప్పించిన తీరు బాగుంది., మనుషుల బాధలు తెలుసుకుంటూ మానవత్వంతో ఆలోచించే వ్యక్తిగా దేవుడి మామయ్య పాత్ర సృష్టి బాగుంది.
మంచి కథ అందించిన శ్రీ రామిరెడ్డి గారికి అభినందనలు.
మీ విలువైన విశ్లేషణకు కృతజ్ఞతలు.
చాలా బాగుంది సార్ కథ..చాలా సామాన్యమైన అంశంగా కనిపించిన కథ చివరికి వామనావతారంలా మారి పెద్ద సందేశం ఇచ్చింది.భక్తి పేరిట మూఢాచారాలతో చరించేవారు , ఇంద్రలాంటి అవకాశవాద భక్తులు అడుగడుగునా మనకి కనబడుతూనే ఉన్నారు.దేముడు మావయ్యకు మతమే మానవత్వం..దేముడ్ని నిగ్గదీసి అడగమని ఆపిల్లాడిని భుజాలమీద మోసుకు వెళ్లడం అత్యధ్భుతం..అసలు ఈకథ గూర్చి ఎంత రాసినా తక్కవే!అభినందనలు సార్ ,మంచికథ మాకు అందించారు !💐💐💐👌👌👌👌
మీ ప్రోత్సాహక వచనాలకు ధన్యవాదాలు హైమావతి గారూ.
దేవుడి దర్శనం క్యూ లో నిలబడి ఆడవారిని చూసేవారిని నేను చూసాను. అలాగే గుడిలో ఉండే పుట్టలో అసలు పాములు ఉన్నాయా..అవి పాలు తాగుతాయా, అంత మంది పాలు పోస్తే వాటికి ఊపిరి ఆడుతుందా లేదా చూడకుండా మూఢభక్తి తో గుంపులు గుంపులుగా వెళ్లి పాలను కుమ్మరించేవాళ్ళు గుడి బైట బిచ్చగాళ్లను తిట్టడం చూసాను కానీ ఈ కథలోని మామయ్య లాంటి వాళ్ళు చాల అరుదుగా కనిపిస్తారు. మానవత్వం మీద అమితమైన ప్రేమ ఉన్నవారే ఇలాంటి కథను రాయగలరు. మామయ్య లాంటి మనసు ఉంటే అందరూ దేవుళ్ళు అవుతారు.సమాజంలోని పరిస్థితులను, మనుషుల ప్రవర్తనను నిశీతంగా పరిశీలించించి చక్కని అవగాహనతో కథను రాయడంలో అందెవేసిన చేయి కలవారు శ్రీ ఎం.వీ రామిరెడ్డి గారు. చక్కని కథని అందించిన వారికి, సారంగా బృందానికి అభినందనలు.
మా మావయ్య గారే ఈ కథకు స్ఫూర్తి. మీ పరిశీలన వాస్తవం. ధన్యవాదాలు రోహిణి గారూ.
అద్భుతమైన కథ.. ఇలాంటి ఇతివృత్తంతో నేపథ్యంతో.. ఈ మధ్య వచ్చిన కథలు చాలా అరుదు అసలైన భక్తి మరుగున పడిపోయి మూఢత్వం చాందసం విర్రవీగుతున్న రోజులివి..ఆధ్యాత్మిక వ్యవస్థను వాస్తవ దృష్టితో చూస్తూనే అడుగడుగున మానవీయ కోణాన్ని మహత్తరంగాఎత్తిచూపిన మావయ్య పాత్ర ఆదర్శనీయమైనది..అజరామరమైనది.. కథనం నల్లేరుమీద నడకలా హాయిగా సాగిపోయింది.. మానవత్వం మాధవతత్వం ఓకే వృత్తంలో ఉందన్న ముగింపు అనిర్వచనీయమైన అనుభూతిని కలిగించింది.. ఇంత మంచి కథ రాసిన ఎంవీ రామిరెడ్డి గారికి హార్దిక అభినందనలు!💐💐💐
శ్రీ కంఠ స్ఫూర్తి
అభిమానపూర్వకమైన మీ అభినందనలకు ధన్యవాదాలు శ్రీ కంఠస్ఫూర్తి గారూ.
రామిరెడ్డి గారి ఒక్కో కథ ఒకో కథా నిఘంటువు అని చెప్పవచ్చు.ప్రతి కథ చదివి కథాంశం ఎంచుకోవడమెలా అన్నది తెలుసుకోవచ్చు.కథనం ఎంత బిగిగా నడపవచ్చో తెలుసుకోవచ్చు.అనసరించాల్సిన శైలి తెలుసుకోవచ్చు.కథన శిల్పం ఉట్టీపడేలా రాయటం తెలుసుకోవచ్చు.కథలు రాయాలనుకునేవాళ్ళు ఆయన రాసిన కథలు పదేపదే చదివితే మనకు ఒక మార్గం గోచరిస్తుంది.
ఇక ఈ కథ విషయానికి వస్తే వ్యక్తుల మనస్తత్వాన్ని అత్యంత దగ్గరగా ఉండి విశ్లేషించినట్లుగా కనిపిస్తుంది. పాత్రల మధ్య సహజాతి సహజమైన సంభాషణలు పాఠకుడు సొంత చేసుకునేలా తన ఇంటిలోనో,పొరుగింటిలోనో జరిగిన విధంగా అనిపిస్తాయి.
‘‘నాన్నా, ఇక చాల్లే రండి’’ చిరాకంతా *రంగరించి*(ఎంత అందమైన భావన)
ఇదుగో నాన్నా, దేవుడు లేడు దెయ్యం లేడని అదిరించి బెదిరిస్తే ఊరుకోడానికి… నేను అమ్మంత మంచిదాన్ని కాదు. నీకు ఇష్టమున్నా లేకున్నా మాతో రావాల్సిందే’’ అంది *అమ్మవారి అవతారం దాల్చి*.
కూతురు అంత *సున్నితం’* గా హెచ్చరించాక కాదనగలడా!
‘‘ఆ సంగతి తర్వాత చూద్దాంలే. ఇప్పుడైతే బయల్దేరు’’ అంది, ఆయన కోరికను *మన్నించిందో లేదో అర్థం కాని నైపుణ్యం ప్రదర్శిస్తూ*.
బోల్డ్ లెటర్స్ లో పెట్టిన పదాలను చదివితే ఆ ముందు వాక్యం యొక్క ఇంటెన్సిటీ ఏమిటన్నది ఆర్థం అవుతుంది. ఇలా ప్రతి వాక్యానికి కొసమెరుపు కనిపిస్తుంది.ప్రతి వాక్యం గురించి మరిక్కడ ప్రస్తావించలేక మాత్రమే ఆపేస్తున్నాను.ఇక వ్యక్తుల స్వభావానికొస్తే
కథకునికేమో కాయవాటం మరాఠీ స్త్రీ తో అతని మావయ్య మాట్లాడటాన్ని అత్తగారు పోయి ఎంతకాలమయింది గుర్తు చేస్తే, కూతురుకేమో కాయవాటం స్త్రీ మనసులో తిష్ఠ వేసి “తీరా వచ్చి చేస్తున్న నిరవాకం ఇదీ” అనిపించేలా చేసింది.అని ఆ పాత్రలతో చెప్పించటంతో వాళ్ళ సంకుచిత మనస్తత్వాన్ని అర్థం చేసుకోవచ్చు.చివరికి కథకుడు,అతని మావయ్య ఎంత ఉన్నత వ్యక్తిత్వం కలవాడో అర్థం చేసుకోగలగడం ఆనందించదగిన విషయం.అలాగే ప్రస్తుతం దేవాలయాల్లో జరుగుతున్న దోపిడీ ని ఎండగట్టేసారు రచయిత. ఒక గొప్ప కట్టడం రూపుదిద్దుకోవాలంటే ఎంతమంది శ్రామికుల,జంతువుల(ఆ రోజుల్లో) బలిదానం,కావలసి వస్తుందో కథలో చూస్తాం.మూలాల్లోకి వెళ్ళి విశ్లేషించినపుడే ఇటువంటి వాస్తవాలు బయటపడే అవకాశం ఉంటుంది.అలాగే తోడల్లుని మనస్తత్వాన్ని ఉతికి ఆరేసేసారు కథలో. కథ చివరకచ్చేసరికి కథకుని మావయ్య మహోన్నత వ్యక్తిత్వం ఆవిష్కరింపబడి అతనిని హిమోన్నత స్థానంలో నిలబెడుతుంది. మానవసేవే మాధవసేవ అనే భావన అణువణువునా నింపుకుని అనుక్షణం అటువంటివారికోసమే తపిస్తూ నిలబడుతుంది మావయ్య పాత్ర.అతను నాస్తికుడు కాదు అలాగని ఆస్తికుడు కాదు,పదుగురికి సాయపడటమే అతని నైజం,ఇజం.
కథకుడి ఉద్ధేశం వ్యక్తుల మనస్తత్వాలు ఎలా ఉంటాయి? అలాగే ప్రస్తుత సమాజంలో ఆలయాలలో జరిగే దోపిడీ గురించి తెలియచేయాలి అని మదిలోని కోరికను బలవత్తరమైన పాత్రలను ఎంచుకుని,బలమైన సంఘటనలను చొప్పించి అంతకన్నా బలవత్తరమైన సంభాషణలు చొప్పించి అద్భుతంగా కథను రక్తికట్టించారు. ఒక అద్భుతమైన కథ చదివే అవకాశం కల్పించిన రామిరెడ్డి గారికి,ప్రచురించిన సారంగ వారికి అభినందనలు🙏💐
కొమ్ముల వెంకట సూర్యనారాయణ
కొమ్ముల వెంకట సూర్యనారాయణ గారూ,
మీ నిశిత పరిశీలనకూ, సుదీర్ఘ విశ్లేషణకూ హృదయపూర్వక నమస్సులు.
Chakkati kadha Sir🙏🙏 in every story you will explain nd express the social issues with readable Naretion.
Thanks a lot madam.
అభినందనలు రామిరెడ్డి గారూ,
కథలో ఏది ఎంత చెప్పాలో స్పష్టంగా తెలిసిన నైపుణ్యం మీది. వస్తువు అరవైల నుండి నలుగుతున్న దే. మీ శిల్పం గొప్పది.. శుభాకాంక్షలు…
మీ ప్రశంస నాకు ప్రత్యేకం సర్.
కథ బాగుంది సర్.మనుషుల అంతరంగంలోని భావాన్ని అర్థం చేసుకోవడలోనే అసలైన మానవత్వం అనిపించుకుంటుంది.
ధన్యవాదాలు.
రామిరెడ్డి గారి కథ చదువుతూంటే పాఠకుడిలో తెలియని ఒక ఉత్సుకత ఉంటుంది..ఈసారి ఏం కొత్త విషయం చెప్పబోతున్నారొనని..ఈ కథలో మామయ్యని కథకుడిలాగే పాఠకులు అపార్థం చేసుకుంటారు.మామయ్య చర్యలను పరిశీలిస్తున్న ఆల్లుడికి అతని చేష్టలు హర్షించదగ్గ ట్టుగా అనిపించవు. మదురై వెళ్లిన తర్వాత మామయ్య అర్థం అవడం మొదలు పెడతాడు. కథ మొత్తం మీద నాకు నచ్చిన వాక్యాలు.’ బొమ్మలు పగిలి నందుకు ఏడ్చే కుర్రాడిని ఓదార్చేవాడే అసలు మామయ్య..చెప్పులు కుట్టే అమ్మాయిని చూసినా, పిన్నీసులు అమ్మే పిల్లని పరికించినా, క్యూ లైన్ లో ఆడాళ్లని తడిమి ఆనందించే కుర్రాడిని చూసి అసూయ పడినా అదంతా మామయ్య కాదేమో. నాలోని లోపలి మనిషిని మమయ్యలో చూసుకున్నా నని పించింది.’..కథను చెప్పే అల్లుడు తనని తాను తడిమి చూసుకున్నాడు. అందరూ అలా రియలైజ్ కాగలిగితే మామయ్య ఒక్కడే దేవుడు కాదు..అందరూ దేవుల్లే..ఇది రామిరెడ్డి గారి మార్క్ కథ..అందరికీ మార్పు కోరే కథ. చదివేక అభినందనలు చెప్పకుండా ఉండలేం…మరిన్ని మంచి కథలు రామిరెడ్డి గారి కలం నుంచి ఆశిస్తున్నాను.
ధన్యవాదాలు విరించి గారూ.
ఈ కథలోని ఒకట్రెండు లోపాల గురించి మీరు నాకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి చెప్పటం మీ హృదయవైశాల్యానికి నిదర్శనం. ‘బాబా సమాధి’ని ‘మూలవిరాట్టు’ అనకూడదని తెలుసుకున్నాను. వర్ధమాన కథారచయితలకు మీరిలా నిరంతరం అద్భుతమైన సలహాలు ఇస్తుండటం అభినందనీయం.
సమాజం పట్ల ఎంతో భాధ్యత, పరిశీలన ఉంటే గానీ ఇంత లోతైన కథని రాయలేరు.
మనుషుల మీద ఎంతో ప్రేమ, దయ…మానవ సంబంధాల పై మరింత నమ్మకం ఉన్నవాళ్ళే ఇటువంటి కథను అందించగలరు.
ఎప్పుడూ ఒక కొత్త సమస్యని మన దృష్టికి తీసుకొచ్చి దానికి అంతే నేర్పుగా పరిష్కారం చూపించే రామిరెడ్డి గారు ఈసారి సమస్యని ఎత్తుకోలేదు. మనుషుల మనసుల్లోకి చొచ్చుకెళ్ళి, లోపల పేరుకుపోయిన మలినాలని పూర్తిగా తొలగించుకునేలా రాసిన రామిరెడ్డిగారికి అభినందనలు.
చాలా మంచి పరిశీలన సర్. ధన్యవాదాలు.
మువ్వా రామి రెడ్డి గారు కథను కళ్ళ ముందు ఆవిష్కరించారు.భక్తికి ,మూఢ భక్తికి గల తేడాను సున్నితంగా వివరించారు.గుడి నిర్మాణం యొక్క గొప్ప తనాన్నే చూస్తాం కానీ దాని వెనుక ..నలిగి పోయిన బడుగు జనుల ఈతి బాధల గురించి ఎవ్వరము ఆలోచించం.కష్ట పడి గుడి మెట్లు ఎక్కుతామే కానీ..ఆ మెట్లకు అటూ ఇటూ ఉన్న దౌర్భాగ్యుల ఆకలి కేకలను వినిపించుకోము. చుట్టూ దీన జనుల కళ్ళలోకి సూటిగా కన్నె త్తి కూడా చూడని మనం(జనం) గర్భగుడిలో దేవుణ్ణి చూడాలని కాళ్ళె త్తి మరీ పోటీ పడతాం…ఈ కథ తప్పు కాదను కుంటూనే తప్పులు చేసే స్తున్న వాళ్లకు కనువిప్పు కలిగించేలా ఉంది.గుడి కి అర్ధం,దేవుడికి పరమార్థం చక్కగా వర్ణించింది.మువ్వా రామిరెడ్డి గారి కధా శైలి,కథనం గురించి ఎంత చెప్పినా,చెప్పుకున్నా అది తక్కువే అవుతుంది…
ధన్యవాదాలు లక్ష్మణరావు గారూ.
అందరి మనసులో ఉన్న వాస్తవాన్ని వెలికితీసి సగటు మనిషి మనసులోతుల్ని అద్భుతంగా ఆవిష్కరించారు సర్. ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టే కథ హార్దిక శుభాకాంక్షలు సార్
మనిషిలో మంచితనాన్ని తట్టిలేపినకథ..❤️