దేవిప్రియ కవితలు మూడు

నా పుట్టినరోజుదేముంది

ఒక కాడ్వెల్ తరువాత

ఒక శ్రీశ్రీ తరువాత

ఒక పాణిగ్రాహి తరువాత

ఒక చెరబండరాజు తరువాత

పుట్టినవాణ్ని నేను

అన్న ఈ కాలపు విశిష్టమైన కవి, ఈ యుగం వేదనల్ని అక్షరాలుగా చెక్కిన శిల్పి దేవిప్రియ. 1992లో “ఆధునికత- అత్యాధునికత” అనే నా వ్యాసాల సంపుటిలో దేవిప్రియ గారి గురించి ప్రత్యేక రచన వుంది. అందులో ఇవీ నా మాటలు: గొప్ప ఉద్వేగాన్ని కూడా నింపాదిగా చెప్పడం దేవిప్రియ లక్షణం. కార్యకారణ  సంబంధాలు తెలిసి వుండడం వల్ల ఈ కవిలో అకారణమైన ఆవేశం నుంచి పదచిత్రాలు అదేపనిగా రాలవు. ఆయన భావాన్ని ఒక పదచిత్రంతోనే చిత్రిక పడ్తాడు. తాత్విక సంకోచాలు లేనప్పుడు మాత్రమే కవిలో ఈ స్పష్టత సాధ్యపడుతుంది.

దేవిప్రియ గారి కవితలు అందించడం “సారంగ” గర్వంగా భావిస్తోంది. చదవండి. మీ అభిప్రాయాలు రాయండి!

-అఫ్సర్

1

గమనించావా?

~

మనించావా,
వలలో పడి ఒడ్డున గిలగిలలాడేది చేపలే,
ఏరు అలా పారుతూనే ఉంటుంది
జాలరి కోసం కొత్త కొత్త చేపలని ప్రసవిస్తూ.

అలా మెరిసి ఇలా మాయమయ్యేది చుక్కలే,
లెక్కచేయని ఆకాశం అలా
వ్యాపిస్తూనే ఉంటుంది కొత్త తారల్ని పొదువుకుంటూ

గొంతెత్తి పాడిన తరువాత
గాలిలో కలిసి తరలిపోయేది పాటలే,
కంఠం అక్కడే అలాగే వుంటుంది
అవిరళ రాగ మాలికల కోసం అజనిత సుమాలను ఏరుకుంటూ

సాగిపోయేది నౌకలే, సముద్రాలు కాదు.
ఎగిరిపోయేది పక్షులే, వృక్ష సముదాయాలు కాదు.
నడిచిపోయేది పాదాలే, లోపలిపొరలలో రోదించే రోడ్లు కాదు.

గమనించావా,
అంతర్థానమౌతున్నది మూర్తి మాత్రమే,
అంతా తానే అయివున్న మూలం కాదు.

 

2

లిపి

~

రయ్యిన వీచే గాలిలో
వినిపిస్తొందొక రమ్యవాద సమ్మేళనం.

రపరపలాడుతూ పైఫ్యాను గాలికి
తెరుచుకుంటున్న పేజీలలోంచి
ఎగిరి పడతాయి యెవరో
అక్షరాలుగా మార్చి దాచిపెట్టుకున్న ఆలోచనలు.

అన్నట్టు, అక్షరాలు లేని పుస్తకాలు కూడా
ఉంటాయన్నాడట ఒక చైనావాడు.

నిజమేనేమో నేనిప్పుడు రోజూ
చదువుతున్నది అలాంటి అలిఖిత
ఊహాగ్రంథాలనేనేమో.

నేనిప్పుడు రాస్తున్నది, ఏమో, రేపటి
లిపి లేని ప్రళయానంతర నవ మానవ
భాషలోనేనేమో…. ఏమో!

 

3

చిన్మయ ఏకాంతం

మహోదధిలో ఒక
బిందువు ఒంటరితనం వంటిదే
నా ఈ ఏకాంతం.

యోజనాల పర్యంతం ఎక్కడా
ఏ నౌక మీద ఎగిరే ఏ పతాకమూ
కనిపించని నిర్జనదీవి వంటిదే
నా ఈ ఏకాంతం.

తీగలు తెగి గోడకి వేలాడుతున్న
వయొలిన్ లాంటిదే
నా ఈ ఏకాంతం.
నా ఒక్కడికి మాత్రమే వినిపించే
ఆమె సమాధి నుంచి వెలువడే
సిల్కుదారపు సనసన్నని మృదులరాగమే
నా ఈ ఏకాంతం.

ఇన్ని పుస్తకాల దొంతరల మధ్య
ఒంటరిగా పరిమళించే ఒక మహా కావ్యమే
నా ఈ ఏకాంతం.

మృతికి ముందే
స్మృతిగా మారిన ఒక లోకాతీత అనుభవమే
నా ఈ చిన్మయ ఏకాంతం.

*

దేవిప్రియ

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • బాగున్నా యి
    దేవీప్రియ గారి కవితలు.
    రన్నింగ్ కామెంట్రీ లు చదివిన
    అనుభవం ఉన్నది నాకు.
    కవిగారికి
    శుభాకాంక్షలు.
    ____డా కె.ఎల్.వి.ప్రసాద్
    హనంకొండ

  • నేను దేవీప్రియ గారి కవితలు చదవడం ఇప్పుడే. కొత్త కోణం లోంచి విచ్చుకున్న సరళ రేఖల్లా. క్లిష్టమైన ఆలోచనలకు ‘చక్కనైన’ అభివ్యక్తి – నీటి గంటలను గుండెలో దాచుకుని సునాయాసంగా పారుతున్న కొండవాగులా. ఇంకా ఇంకా చదవాలి వీరి కవితల్ని.

  • దేవీప్రియ గారి కవితలు బాగున్నాయి

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు