నగ్న శరీరాలు ఊచకోతలూ
శీలాల రథయాత్రలు
హార్మోన్ల ధిక్కరింపులు
నాల్కలు సాచి పోచమ్మ ఆడినా
కాళ్లు పడుతూ వీణలు మోగించమా
జోగిని, మాతంగి, రఖేల్, చుడేల్!
చొరబడినప్పుడు అందరూ ఒకటే
దిక్కులు పిక్కటిల్లే నిశ్శబ్దం.
దేవతలే అమ్మలందరూ
దేవిడిలో ఆట వస్తువులు!
సిగ్గులేని రహస్యం
మానవ జీవన పరిణామం.
పిట్ట చనిపోయినా
ఏనుగు ఘీంకరించినా
పులులు ఏడ్చినా
తోడేళ్లు నవ్వినా
రక్తం తొడల మధ్య కారినా…
వంటగదిని, గర్భదానాల గదులనీ
పురిటిండ్లనీ పాలిండ్లనీ
తాళిబొట్టునీ, కాలిమెట్టలనీ
ఊరేగించుకుందాం.
పుస్తకాలను విసిరెయ్యండి
పుస్తెలను ముడివెయ్యండి
మెదడును పూడ్చిపెట్టండి
ఆలోచనను కాల్చివేయండి
ఇప్పుడంతా ఒకే ఉన్మాదపు
రక్తఝరిలో తలలు పగలగొట్టుకు
మున్ముందుకు సాగిపోయి
గావుకేకల లోయలోకి
నాగరికతను తోసేద్దాం
రెండు వేలయేళ్లగా
పట్టి పీడిస్తున్న చీడ ఇది
ఒక్కసారి భూమిని దులుపుకోనిద్దాం.
*
చిత్రం: రాజశేఖర్ చంద్రం
ఉలిక్కిపడి వీపు చరుచుకున్నా…It is not a poetic piece… a STATEMENT … a stone thrown on the pondering honeycomb of the mind of a reader….
అద్భుతం