నా చిన్నపుడే నేను చాలా దెయ్యాలని చూశాను. మా ఇంటి ఎదరుగా చిన్న దర్గా ఉండేది. చాకలి చెంగన్నది ఆ దర్గా. బేస్తవారం మధ్యాహ్నం నుంచి పిలకాయల చూపంతా దర్గామీదే ఉండేది. వీధిబావి నుంచి బిందెలకు బిందెలు నీళ్లు చేదుకుని వచ్చి దర్గా అంతా ఆయన కడిగేవాడు. దర్గాముందు ఊడ్చి, పేడనీళ్లు చల్లి శుభ్రంగా ఉంచేవాడు. ఉతికిన ఆకుపచ్చని గుడ్డలు సమాధుల మీద పరిచేవాడు. తలకి పచ్చ గుడ్డ కట్టుకుని, వేపచెట్టులో దోపి ఉంచిన నెమలీకల కట్టను బయటకు తీసేవాడు. దర్గాలో కూర్చుని కళ్లు మూసుకుని ముందుకీ వెనక్కీ ఊగుతూ ఏదో మాట్లాడుతూ ఉండేవాడు. చీకటి పడే వేళకి ఎక్కడెక్కడి నుంచో తలలు విరబోసుకుని ఆడవాళ్లు పడుతూ లేస్తూ ఆడుతూ వచ్చేవాళ్లు. దర్గా ముందు నేలమీద పడి దొర్లుతూ అరుస్తూ ఉండేవాళ్లు. బలవంతంగా వాళ్లని పట్టుకుని చెంగన్నముందు కూర్చోబెట్టేవాళ్లు. నెమలీకల కట్టతో మొహం మీద జాడించి కొడుతూ ఉర్దూలో ఆయన వాళ్లతో మాట్లేడేవాడు. దర్గా గేటు చుట్టూ చేరి భయంగా ఆసక్తిగా ఈ తతంగం అంతా చూస్తూవుండేవాళ్లం. దెయ్యాలు పట్టినవాళ్లంతా సొమ్మసిల్లి పడిపోయాక మాత్రమే దర్గాలో పళ్లెంలో పెట్టిన బొరుగులు,శనగలు పిలకాయలకు పంచుతారు. మాలాడ నుంచి, మాదిగిళ్ల నుంచి, సాయిబుల మిట్ట నుంచి ఎక్కువగా దెయ్యాలు పట్టిన ఆడవాళ్లు వచ్చేవాళ్లు. భుములు బావులు, సేద్యాలుండే బలిజవీధి ఆడవాళ్లు దెయ్యాలు పట్టి దర్గా దగ్గరకు రావడం మాత్రం నేను ఎప్పుడూ చూడలేదు. అసలు మగవాళ్లకి దెయ్యాలు ఎందుకు పట్టవో అర్థమయ్యేది కాదు.
‘దేవుడమ్మ’ కథ చదివాక దెయ్యాలు మరింత బాగా అర్థమయ్యాయి నాకు.
పాపుదేశి ఝాన్సీ జర్నలిస్టుగా నాకు బాగా పరిచయం. జర్నలిజంలో అందునా రిపోర్టింగ్‌లో ఆడవాళ్లు పెద్దగా లేని రోజుల్లో తిరుపతిలో ఆమె పనిచేశారు. ఆమె చురుకుదనం, చొరవ, వేగం చూసి జర్నలిస్టుగా ఝాన్సీ ఎక్కడికో వెళ్తుందని అనుకునేవాడిని. అనుకున్నట్టే ఆమె తిరుపతి వదిలేసి బెంగళూరుకి చేరుకున్నారుగానీ జర్నలిస్టుగా మాత్రం కాదు. సాఫ్ట్‌వేర్ కంపెనీ నిర్వహణలో ఉన్నారని తెలిసి ‘అయ్యో’ అనుకున్నాను. ఆ తర్వాత ఫేస్‌బుక్ కామెంట్లలో కనిపించేవారు. నచ్చిన రచలను ప్రస్తావించేవారు. కొన్నేళ్ల కిందట ఒకసారి ‘చదవండి సార్’ అంటూ ఒక కథ పంపారు. వార్తలు రాసే ఝాన్సీ కథ రాసిందే అనే కుతూహలంతో చదివాను. ఝాన్సీ వార్తా కథనాల్లో పత్రికాభాష తప్ప మాండలికాన్ని ఎన్నడూ గమనించని నేను సంబరపడిపోయాను. అచ్చమైన అందమైన చిత్తూరు యాసలో ఆమె కథ నడిపిన తీరు నన్ను అబ్బురపరచింది. కథ పేరు నాకు గుర్తు లేదు. ఒక పనిమినిషి కథ. అర్బన్ ఆధునిక అమ్మాయిలా కనిపించే ఝాన్సీలో పల్లె ఇంత నాటుకుని ఉందా అని తొలిసారి ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత అడపాదడపా ఆమె రాతలు వస్తూనే వున్నా ఎనిమిదేళ్ల కిందట ఝాన్సీ రాసిన ‘దేవుడమ్మ’ కథ ఎలాగో నా నుంచి యింతకాలం తప్పించుకుంది.
చిత్తూరు ప్రాంతపు మాటల సౌందర్యం ‘ దేవుడమ్మ ’ కథలో కట్టిపడేస్తుంది. బెంగళూరు నగరం ఝాన్సీని మింగేయలేదని నమ్మకం కలిగిస్తుంది. ‘దేవుడమ్మ’ కథను చదువుతున్నపుడు నాకు మా చాకలి చెంగన్న దర్గాతో పాటూ మా బంధవుల అమ్మాయి ఒకరు గుర్తుకువచ్చారు. మంచి సంబంధం వచ్చిందని చదువు ఆపేసి పద్నాలుగేళ్లకే ఆమెకి పెళ్లి చేసేశారు. పెద్ద కుటుంబం.. చిన్నపిల్లకదా అని మురెపంగా చూసుకుంటారని నమ్మి కాపరానికి పంపారు. అత్తింట్లో ఎవరూ పక్కదిగకముందే ఆమెకి పని మొదలయ్యేది. అందరూ తిని నిద్రపోయాకే ఆమె నడుంవాల్చేది అని చెప్పుకుని బాధపడేవాళ్లు. పెళ్లయిన రెండు మూడేళ్లకే ఆమెకి దెయ్యం పట్టింది. మంత్రగాళ్ల చుట్టూ తిప్పేవాళ్లు. మంత్రించిన బియ్యం గింజలు ఆమె మీద విసురుతూవుంటే కూసు రాళ్లతో కొడుతున్నట్టుగా ఆమెకు దెబ్బలు తగిలేవంట. వేప మండ్లతో కొట్టేవాళ్లు. ఆ దెబ్బల బాధ భరించలేక ఆమె ఏడ్చి పెడబొబ్బలు పెట్టేది. మొత్తానికి ఆ దెబ్బలకి దెయ్యం దిగిపోయింది గానీ సంసారంలో ఆమె స్థానం మాత్రం మారలేదు. ‘ దేవుడమ్మ’ తెలివి ఆమెకి లేకపోయింది కదా అని నాకు ఈ కథ చదివినపుడు అనిపించింది. నిజానికి దేవుడమ్మకి కూడా మొదట్లో ఆ తెలివి లేదు. పరిస్థితులే ఆమెని తెలివిమంతురాలిని చేశాయి అని ‘దేవుడమ్మ’ మనకు చెప్పిన ఈ కథ ద్వారా అర్థం అవుతుంది.
‘’ దేముడ్ని నమ్మనోల్లు నన్ను దొగదేముడమ్మని ఎక్కిరిస్తారు. వోల్లు నన్నట్టా ఎక్కిరిస్తే నాకు బయింగా వుంటుంది. మాయత్త యినేస్తిందేమో అని” అంటూ దేముడమ్మ తన కథ చెప్పడం మొదలు పెడుతుంది. ఈమాటతోనే మనకు అర్థమైపోతుంది ఆమె దొంగ దేవుడమ్మ అని. ఆ దొంగ ఎత్తు ఎందుకు వేయాల్సి వచ్చిందన్నదే కథ. పల్లెల్లో కూలినాలి చేసుకునే ఇళ్లలోని ఆడవాళ్ల బతుకు ఎంత హీనంగా ఉంటుందో కళ్లముందు నిలబెట్టి చూపుతుంది ‘దేవుడమ్మ’. అమాయకపు పల్లెమాటలతో దేవుడమ్మ తన కథను చెబుతూ ఉన్నపుడు, ఒక్కోసారి కడుపులో దేవుతున్నట్టుగా అనిపిస్తుంది. సామాన్య రాసిన ‘మహిత’ కథను ఈ శైలి గుర్తు చేస్తుంది.
“తెల్లార్తో లేసి కళ్లాపి జల్లి ముగ్గేసి, బోకులు కడిగేసి, అంత సద్దాగేసి కూలికిబొయ్యి.. మాయిటాల వొచ్చి వుడుకుడుగ్గా రెణ్ణీల్లు బోసుకోని, కడుపుకింత తినేసి అరుగుమింద కుచ్చోని ఆరుట్లు కొడ్తా నిద్దరబొయ్యే” పిల్లకి పెళ్లి చూపులని చెబితే కుశాలపడింది. ‘కూట్నీల్లకి కరువుండని’ ఇంటికి పోతావుండానని సంబరపడింది. అత్తింట్లో టీవీ వుంది, రోజూ చూడచ్చని మురిసిపోయింది. మొగుడిపక్కలో మూడు నిద్దర్లూ చేయకముందే అర్థమైపోయింది తన బతుకు పెనం మీద నుంచి పొయ్యిలో పడిందని. పదేళ్ల పాటు ‘కూల్ది మాదిరి తెల్లారి లేస్తే నడిజాము దాకా పనిజేస్తానే’ సంసారం చేసింది. నలుగురు బిడ్డల్ని కన్న ఆడది కదా అలిసి ఎప్పుడన్నా కూర్చుంటే ‘పొరకతో గొట్తా..చాటతో గొట్తా..చెప్తో గొట్తా.. అంటా కుక్కమింద పిల్లి మింద సాకుబెట్టుకోని తిడ్తానే వుంటుంది’ అత్త. మొగుడు అమ్మకి తోకంటోడు. ఇద్దరూ కల్సి వొంగబెట్టి వీపుమీద గుద్ది గుద్ది నడుములు విరగొట్టేస్తారు. ‘ థూ.. ఈ బతుకు బతికేదానికంటే వడిశాకు మింగి సస్తేనే మేలు’ అని అనుకునేది. అటువంటి ఒక ఎండాకాలం.. ఊళ్లో జరిగిన సంఘటన దెబ్బల నుంచి తప్పించుకునే ఆలోచనకు పురుడుపోసింది.
ఊళ్లో కొన్ని ఇళ్లు అంటుకుని తగలబడ్డాయి. ఎవరో చేతబడి చేస్తేనే ఇట్లా ఇళ్లు తగలబడతాయని మిద్దింట్లో ఫ్యానుకింద పడుకుని అంటున్న అత్త మాటలు, చుట్టింట్లో పొయ్యి ముందు కూలబడివున్న కోడు వినింది. ‘మా ఇల్లు తగలబడలేదే’ అని బాధపడింది. గడసు ఆలోచన మనసుకి తట్టింది. అత్తకి కాఫీ పెట్టుకుని వస్తా వస్తా, మండే ఒక పుల్లని చుట్టింటి చూర్లో గుచ్చేసింది. తగలబడిపోతున్న చుట్టింటిని చూసి అత్త ఒణికిపోతూవుంటే, కోడలికి సంతోషంతో నవ్వు ఆగలేదు. పదేళ్లుగా మాయమైన నవ్వు అలలు అలలుగా తన్నుకుని వచ్చింది. ఆ నవ్వు చూసిన అత్త బిత్తరపోయింది. భయంతో బిగుసుకుపోయింది. అత్త ఒళ్లంతా కనిపించిన భయమే కోడలికి దెయ్యాన్ని ఆసరాగా ఇచ్చింది. ఇక అప్పటి నుంచీ అత్త కొట్టినపుడంతా కోడలి ఒంట్లోకి దెయ్యం వచ్చి వాలేది. కొన్నాళ్లపాటు కోడలి ఒంటిమీద చెయ్యిపడేది కాదు. అయితే దెయ్యాల్ని వదిలించే మంత్రగాళ్లుంటారు. అత్తకన్నా, మొగుడికన్నా మించి చావగొడతారు. ఆ బాధలు భరించలేక దెయ్యం పారిపోయింది. కోడలి బతుకు మళ్లీ మొదటికొచ్చింది. దెయ్యం పారిపోయాక అత్తకి పూజలు ఎక్కువయ్యాయి.
ఈసారి కోడలి ఒంటిమీదకి దెయ్యం బదులు దేవుడొచ్చి వాలింది. దెయ్యాన్నయితే కొట్టి తరిమేయవచ్చు గానీ దేవుళ్ల జోలికి పోకూడదు. అంకాలమ్మ పూనిన కోడలి ముందు అత్త మోకాళ్ల మీద కూర్చుని మొక్కడం మొదలు పెట్టింది. అత్త వెంకటలక్ష్మిని ‘సేయ్.. ఎంగటీ’ అని కోడలు గద్దించి పిలిచేకాడికి వచ్చింది. ‘కోడ్ని కోసి అమ్మోరికి వండి పెట్టు’ అని ఆదేశిస్తే, గంటలో కూరగిన్ని దేవుడమ్మ ముందు ఉండేది. ఒంటిమీదకి పట్టుకోక, మెళ్లోకి బంగారు బొందుతాడు వచ్చి చేరాయి. దెయ్యానికన్నా ఎక్కువగా అత్తని అంకాలమ్మ భయపెడుతోంది. భక్తో, భయమో తెలియని స్థితిలో అత్త దుర్బలగా మారిపోయింది. జారిపడి తుంటి ఎముక విరగ్గొట్టుకుంది. ఆ తర్వాత అత్త బొడ్డులోని బీగాల గుత్తి కోడలి తిత్తిలోకి మారింది. తిట్టేవాళ్లు లేరు. తన్నే మనిషిలేరు. కష్టం చేసుకుంటూ, కోరింది వండుకుని తింటూ మొగుడూ బిడ్డలతో సంతోషంగా ఉంది దేవుడమ్మ.
అసహాయంగా చచ్చిపోయే ఆడవాళ్లకు దేవుడమ్మ ఈ కథ ద్వారా సందేశం ఇస్తోంది.
.‘‘నేను గూడా యాడస్తా నా బతుకింగ ఇంతే అనుకొనింటే, ఆరోజుకి యెత్తేసి, నామొగుడికి ఇంగో పెళ్లాన్ని తెచ్చేసింటాది మాయత్త. ఏదోవొగ యాసమేసి దేముడిచ్చిన బతుకుని ముగిసిపొయ్యేదాకా ఈదల్ల”
ఈ కథ నలబై యేళ్లకి ముందు వచ్చుంటే, మా బంధువులమ్మాయి ఈ పొద్దుటికి ప్రాణాలతో మిగిలి ఉండేది కదా అనిపించింది.
*
ఒక్కో అక్షరం చదువుతుంటే..కళ్లముందు ఆ కథ కడలాడినట్టుగా ఉంది సార్..కానీ ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో.. దేవుడమ్మ లాంటి జీవితాలు అలాగే కొనసాగుతున్నాయి.!
దెయ్యం కథ చదువుతుంటే… సంతపేట లోని మా బందువుల అమ్మాయి గుర్తుకు వచ్చింది. సాంప్రదాయ ఉమ్మడి కుటుంబం లో కోడలిగా వెళ్ళి, వేరు కాపురం పేరుతో చిన్నా భిన్నం చేసుకొంది.
చాలా బావుంది