నాకు తెలియని నాపుట్టుక
పుట్టిన తరువాత తెలిసిన నా ఉనికి
నన్నో కట్టుగొయ్యకు కట్టి పడేశాయి
నిజానికి మట్టికదా నా ఉనికి
మట్టి మీద ఆంక్షలు
నా చుట్టూ కొన్ని గోడల్ని నిర్మించాయి
కొన్ని అక్షాంశ రేఖాంశాల
ముళ్లతీగలకి చిక్కుకున్న
చిగురు దేహాల రక్తపు చుక్కలు
ఇప్పుడూ నన్నూ నా ఉనికినీ ప్రశ్నిస్తున్నాయి
నిలువెత్తు లేచిన గోడలు
పాకటానికి పట్టు చిక్కని గోడలు
తుపాకుల పహారాలో
ముళ్ల కంచెలై పరుచుకొంటాయి
గొంతులోంచి మాట బయటకు రాకముందే
గొంతు చుట్టూ బిగుస్తున్న ఉరితాళ్లు
అనేక అణచివేతల మధ్య
ప్రశ్నపై వాడు ఆధిపత్యం చలాయిస్తున్నాడు
భక్తికీ కొన్ని తూకాలుంటాయి
గోవులో మరికొన్ని తులసిదళాలో
నాలోని నిజాయితీని
ఎప్పటికప్పుడూ కొలుస్తూవుంటాయి
నాలుగు గదుల మధ్యనో నాలుగు గోడల మధ్యనో
దేహం అశరీరమయ్యాక
ఒకానొక దాహార్తి నిలువునా ఆక్రమిస్తోంది
నిజం దగ్ధమయ్యాక
కనిపించే దృశ్యాల వెనుక రహస్యాలు
రహస్యంగానే మరుగున పడతాయి
అదృశ్య దృశ్యాల అన్వేషణలో
నేను నిరంతరం
యుద్ధశబ్దాల కింద నిశ్శబ్దమైపోతాను
మాటలూ అక్షరాలూ మాత్రమే కాని
కొన్ని ఆత్మలు సరిహద్దుల్లో తగలబడుతుంటాయి.
*** *** ***
నిజమే సార్
తగలబడుతుంటాయ్