నేను ప్రొఫెషనల్ ఫ్రోటోగ్రాఫర్ ను కాను. అందులో డిగ్రీలు లేవు. అసలు డిగ్రీ నే లేదు. డిగ్రీ చదివే వయస్సు లో నాన్న సంసారాన్ని మోయవలసి వచ్చింది. ఎన్ని చక్రాల కింద జీవితం నలిగినా మనస్సు లో వుండే ఇష్టాలు అలాగే వున్నాయి.
పుస్తకాలతో బతికే వరం దేవుడు బాలాజీతో బతకడంతో తీరుతుంది. ఎక్కడైనా ప్రయాణం చేయాలంటే ముందు మంచి రెండు పుస్తకాలు సర్దుకొంటా పట్టకపోతే రెండు చీరలు తగ్గించి. బ్యాక్ పైన్ వలన వ్యానిటిబ్యాగ్ బరువుగా వుండకూడదంటే వాటర్ బాటిల్ తీసేసాను పుస్తకం తీయలేక పోయాను. ఇక ఫోటో విషయానికి వస్తే ఇంట్లో పడేసిన నోకియా ఫోన్1500 తో గడిపేదాన్ని చాలా కాలం. అనవసరమని. నాకెందుకు అని.
ఒకరోజు మా అమ్మాయి కు స్మార్ట్ ఫోన్ కొన్నారు. ఛార్జింగ్ లో వుంది అది. వాట్సప్ అట. డైన్ లోడ్ అవుతుంది. నాకు ఏమీ తెలీదు. ” దీంతో ఫోటోలు తీయచ్చా..” అన్నా చేతుల్లోకి తీసుకొంటూ. “అమ్మా కదిలించకు. డైన్ లోడ్ అవుతుంది” అంది. ఏంది అట్లంటే అన్నా. ” అమ్మా నీకేం తెలీదు..వూరుకో ” అంది. ఆ ఒక్క వాక్యం నన్ను చాలా కదిలించింది. ఆ మాట టైటిల్ తో కథకూడా రాసేసాను.
వెంటనే పదివేలు పట్టుకొని చిత్తూరు కు వెళ్లాను. పై డబ్బు నాకోసం నేను ఖర్చు పెట్టుకోనని తిరిగి వచ్చేస్తానని ఎదురుచూసారు. నేను స్యామ్ సంగ్ తో తిరిగి వచ్చాను. అంతే తెలుగు కీబోర్డ్ డైన్ లోడ్ చేసి ఫోన్ లోనే చకచక టైప్ చేయడం నేర్చుకొన్నా. చక్కగా ఫోస్ట్ లు పెట్టడం నేర్చుకొన్నా.ఫేస్ బుక్ వాట్స్ ప్ వోపన్ చేసాను. ఇక ఫోస్ట్ లు ఫోటోలు కవితలు కథల తో ప్రతి రోజూ మొదులు. మా అమ్మాయి నా దగ్గర కు వచ్చి” నా ఫ్రెండ్స్ అందరూ నీ ఫోస్ట్ లకు పడిపోయారే. ” అంది కళ్ళనిండా ‘అమ్మ గ్రేట్’ అన్న ఫీలింగ్. గ్రేట్ కాకపోయినా పర్వాలేదు.’ నీకేం తెలీదు’ నుంచి ‘నీకూ తెలుసు’ లోకి రావడం కాసింత సంతోషాన్ని ఇచ్చింది.
పరిసరాలను ఫోటోలు తీయడం నేర్చుకొన్నా. పరిస్థితులకు నలిగిపోని ఇష్టాలలో ఒకటి ఫోటోలు తీయడం. అది కూడా సెల్ ఫోన్ తోనే. చాలా మంది అడిగారు కెమరా డీటైల్స్. కొన్ని ఫోటో కాంపిటేషన్ లో పాల్గొన్న అక్కడ కెమెరా డీటైల్స్ చెప్పక పోవడంతో పక్కకు తప్పుకో వలసివచ్చింది. అసలు కొన్ని ఫోటోలు పల్లె వెలుగు రన్నింగ్ బస్ లో తీసినవి. అలా రాస్తే అతి అనుకొంటారని రాయలేదు. నన్ను నేను రోజు రోజుకు మెరుగు పెట్టుకొనే క్రమంలో ఫోటోగ్రఫీ సెక్షన్ పెట్టాను. ఇప్పటికి పదివేల పైన ఫోటోలు తీసాను. నిద్రలేవగానే కళ్ళు ఆకాశంలో మారే రంగులను తడుముకోవడం ఇష్టమైన పక్రియ.
ఇంతకంటే నాకేం కావాలి నాతో జీవించడానికి.
*
మీ ఫోటోగ్రఫీ లో మీ మనోనేత్రదర్శనం చేసే అభిమానిని నేను,వారిజ గారూ.శుభాకాంక్షలు.
👍🏼
బోలెడంత సంతోషం మీ స్పందన . 💖