దుర్గాపురం రోడ్ పై ఓ పాఠకుడి ప్రయాణం

కవిత్వమంతటిలో అంతర్లీనంగా ఉండేది ప్రేమే!

176 పేజీల రోడ్డు పై ఓ గమ్మత్తైన ప్రయాణం దుర్గాపురం రోడ్ . 77 మజిలీలల్లో ఆగుతూ, చదువుతూ, అవగతం చేసుకునే ప్రయత్నంలో దేశరాజు కొంత అర్ధమయ్యాడనే అమాయకత్వంలోనే పుస్తకం చదవటం పూర్తవుతుంది కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళకతప్పదు. మనిషెలా ఉంటాడో మాట తీరూ అంతే. నిటారుగా, నిక్కచ్చిగా నిర్మొహమాటంగా….దేశరాజు తనదైన నిఖార్శైన మాటల్ని కవిత్వంలోకి ఒంపుకున్నాడు. తన రోడ్డు పైకి మనల్ని లాక్కెళ్తున్నాడు. పుస్తకం పై సమీక్ష రాయమన్నప్పుడు విషయసూచికలోకి వెళ్ళాను. 77 శీర్షికలూ ప్రతీ కవితనీ చదివింపచేసేలా జాగ్రత్త తీసుకున్నాడు.

అతనొక యోగి. కవిత్వాన్ని ధ్యానిస్తూ రాసే కవి.

నిజానికి ఈ సంకలనం ఇప్పుడిప్పుడె రాస్తున్న యువకవులకి ఓ రెడీ రెకనర్. ఎలా రాయాలో ఎందుకు రాయాలో సునాయాసంగా చెప్పే ఈ పుస్తకం ప్రతీ కవీ ప్రతీ పాఠకుడు చదవాల్సిందె. భాష ఓ సమస్య కాదు, కవితా శిల్పం ఓ సమస్య కాదు, అలంకార ప్రయోగం ఓ సమస్య కాదు. మరెలా రాయాలి అనుకుంటే ఇదిగో ఇలా రాయాలి అని సోదాహరణంగా చెప్పినవాడు దేశరాజు.

ఉత్తరాంధ్ర నుంచి తెలంగాణా వరకూ జీవనప్రయాణంలో ఎన్నో తెలుగు మాండలీకాలతో పరిచయం ఉన్న అనుభవాన్నంతా తన కవితా శీర్షికల్లో ఉపయోగించాడు దేశరాజు.

“ఇజీనారం ఓ ససందర్భ ప్రేలాపన ” కవితలో గురజాడకీ, విజయనగరానికీ నీరాజనంగా ఇలా రాసుకున్నాడు “కళ్ళజోడు, పడక్కుర్చీ లాంటి అస్థిత్వాల మధ్య/ ఆశ్చర్యానుభూతిని కలిగించేలా/ చుట్టూ తిరుగుతున్న ఆత్మ స్పర్శ/ స్ఫురణ కలిగిందిక్కడే” అని రాస్తూ ” హైద్రాబాద్ కు లాక్కొచ్చిన ఆత్మీయ శివతాండవ విన్యాసం/లయాత్మక కొనసాగింపుకు ఆరంభమూ అక్కడే” అని గురజాడ శతవర్ధంతి సందర్భంగా విజయనగరానికి నివాళి కుడా ఇచ్చుకున్నాడు.

నిజానికి ఈ డెభ్భైఏడు కవితలూ డెభ్భైఏడు కథలుగా చెప్పుకోవచ్చు. ” అర్ధరాత్రికి అటువైపు ట్యాంక్‌బండ్ పై ఒకసారి” నాలుగుపేజీల సుదీర్ఘకవిత. చాల నింపాదిగా పాఠకుణ్ణి కవితా వస్తువుకి ప్రిపేర్ చెయ్యటం ఓ కొత్త ప్రక్రియ.

“కాలిన నేలకీ చల్లారిన ఆకాశానికీ కుదరని సంధి/ వేడీ తడీ కలిసిన ఒక ఆవిరి వాసన చిమ్ముతున్న చీకటి రాత్రి/ చచ్చిన కొండచిలువలా ట్యాంక్‌బండ్” అని మొదలుపెట్టి ” హోరుమంటూ వర్షం/నేలకీ నింగికీ ఓ అప్రకటిత యుధ్ధం” అని భావుకత్వాన్ని ఇముడుస్తూ ఇలా ముగించాడు ఆ కవితని దేశరాజు

” పోరాటమైనా, ప్రేమైనా అలవాటుపడిపోడంలోని హింస ఇదంతా”.

కవిత్వంలో రీడర్స్ రెస్పాన్శ్ సిధ్ధాంతం చాలా ప్రముఖమైనది. ఈ తరహా కవిత్వంలో పాఠకుణ్ణి కవితలో ఇన్వాల్వ్ చెయ్యటం ఉద్దేశ్యంగా కవితలో ఎక్కువ వాక్యాలు ప్రశ్న రూపంలో ఉంటాయి. ఈ సంకలనంలొ పదిహేనవ కవిత “ఫ్రాగ్నెన్సెస్ ఆఫ్ ఫ్రాగ్మెంట్స్” పూర్తిగా ప్రశ్నల పరంపరగానే ఉంటుంది. “రోడ్డు పక్కనే వెలుగుతాయా దీపాలు/చెక్కిళ్ళపై కూడా–/ఏం?/శరీరానికేనా, మనసుకొద్దూ వెలుతురు?” ఇలా కొనసాగుతుంది కవిత చివరిదాకా. ఇక్కడ ప్రశ్న అంటే ఏదో కనుక్కోవాలనే తపనతో రాసింది కాదు. పాఠకుణ్ణి ఆలోచింపచేసే ప్రశ్న రూపంలో ఉన్న ఓ స్టేట్‌మెంట్. ఈ సంకలనంలో దాదపు పదకొండు కవితలకి ఆంగ్ల శీర్షికలు ప్రధాన ఆకర్షణ. అలానే చాలా కవితల్లో ఆంగ్ల పదాల వాడుక పాఠకులతో కవి యధాలాపంగా మాట్లాడుతున్నట్లు సహజంగా ఉండటం మరో ఆకర్షణ. “కొంచెం రసజ్ఞత ఉంటే/సివిల్ లైన్‌లోని పొడవాటి చెట్ల చీకటి తీవెలపై/ ఆరెంజ్ రాగాను ఆలపించొచ్చు” (ఆరెంజ్ రాగా), “డిజిటల్ ఎక్స్‌పీరియెన్స్ శరీరానికి తప్ప/ మనసుకు ఏ అనుభవాన్నీ ఈయని వేళ (పచ్చివాసన)”, కాలూనుకుంటోందనీ, ఇంక్రిమెంట్ అందుతుందనీ/ ప్రమోషన్ గ్యారంటీ అని అనుకుంటావు నువ్వు/ఐర్లాడ్ కన్ను పడుతుంది (ఆఖరి సన్నివేశం)”, “కిందన లైవ్/ పైన అలైవ్/పవర్ కట్‌కు పోరాటమే షార్ట్‌కట్ (షార్ట్‌కట్)”. ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే.

ఇక ఉపమాన, ఉపమేయా ఉత్ర్పేక్ష అలంకారాలకు కొదవే లేదు దేశరాజు కవితల్లో. చాలా సహజంగ అవన్నీ అతని కవిత్వంలో ఒదిగిపోయాయి. కొన్ని కవితల్లోని వాక్యాలు వెంటాడే అనుభూతులు. ” రాత్రి గడ్డకట్టించే ఆలోచనల్లేని ఆకాశం కింద చలి ఉండదు/   అనురాగంతో కరిగిపోయే అధరాలు లేనప్పుడూ స్పర్శ తగలబడాల్సిందే”, బషిర్‌బాగ్ వాయుభ్ప గోళాల మంటల్ని/సన్నజాజులు కోసుకొచ్చిన ఆమె చేతుల్లో దాచుకోవాలని”, ప్రపంచాన్ని దద్దరిల్లజేస్తున్న వాన చినుకుల్ని/సాహసంగా నా కన్నుల్లో ఇముడ్చుకుంటూ చెప్పా ” భయం వెన్నాడుతూనే ఉంది/ మానీటర్ మీసాలు గుంజినట్టు”. ఇలా చాలానే కోట్ చెయ్యాల్సి ఉంటుంది.

ఇక దుర్గాపురం రోడ్డెక్కుదాం. ఈ సంకలనానికి ముందు మాట రాస్తూ నగ్నముని గారు ఈ కవితని ఓ అమూర్త కవిత అన్నారు . నిక్కచ్చిగా నిజమే. ఓ ప్రేమ కథని కవితగా చెప్పటం చాలా కవులే చెప్పారు. కాని ఇది ఓ భిన్నమైన కవితాంశం. తన అనుభవాన్ని పాఠకుడి అనుభూతిగా మలచి చెప్పటం దేశరాజు ప్రత్యేకత. “అతుక్కోవాలి, అతుకులు కనపడకుండా/అందుకెంత ప్రేమ కావాలి /అందుకె ఇప్పుడు దుర్గాపురం వెళ్లాలి”. కవితనంతా ఇక్కడ కోట్ చెయ్యదగ్గదే, ఇంకాస్త వివరంగా చెప్తె బావుండేదేమో అన్న ఓ చిన్న కంప్లైంట్ తప్ప.

ఈ పుస్తకం చదవటం పుర్తయ్యాక నాకున్న కొన్ని సందేహాలకి అతని మాటల్లోనే వివరణ కావాలనిపించి కవి దేశరాజుతో ఓ చిన్న సంభాషణ మీకోసం ఇక్కడ :

1.సంకలనానికి ఆ టైటిల్ ఎందుకనుకున్నారు?

సంకలనంలోని కవిత్వమంతటిలో అంతర్లీనంగా ఉండేది ప్రేమే. ఆ ప్రేమను పొందడానికీ, అందుకోవడానికే పార్వతి కోసం దేవదా తన చివరి క్షణాల్లో ‘దుర్గాపురం రోడ్’ వెళతాడు. నా అనుభవాన్ని ఆ నేపథ్యంలో రాసిన కవిత ‘దుర్గాపురం రోడ్’. ‘దక్కినా, దక్కకపోయినా.. ప్రేమ కోసం గాయపడాల్సిందే’ అనే సత్యావిష్కరణ దిశగా సాగుతుందా కవిత. అందుకే ఈ సంకలనానికి ఆ పేరు.

  1. అటు విజయనగరం నుంచి ఇటు హైద్రాబాద్ వరకు వివిధ మాండలీకాలతో పరిచయం ఉన్న మీకు ఏ తెలుగు తో ప్రత్యేక అనుబంధం?

సింపుల్‌గా చెప్పాలంటే పేపర్ తెలుగు లేదంటే పాపులర్ తెలుగు. వివిధ ప్రాంతాల్లో ఉంటూ వస్తూండటం వలన ఏ మాండలికంతోనూ ప్రత్యేక అనుబంధం ఏర్పడలేదు. నిజానికి స్వచ్ఛమైన యాసతో పలికితే, మాట్లాడితే ఏ మాండలికమైన ఎంతో అద్భుతంగా ఉంటుంది. కానీ, ఒక జర్నలిస్ట్ గా జనరల్‌గా అందరికీ తెలిసిన తెలుగుతోనే అనుబంధం.

  1. మిమ్మల్ని అధికంగా ప్రభావితం చేసిన కవి/ కవయిత్రి?

నిస్సందేహంగా శివారెడ్డిగారే. కవిత్వాన్ని ఒక దీక్షలా పట్టుదలగా జీవితాంతం కొనసాగించాల్సిన బాధ్యతగా స్వీకరించడం ఆయన నుంచే స్వీకరించా. 1992లో తొలిసారి శివారెడ్డిగారిని కలిసినప్పుడు ఆయన చూపిన ప్రభావం కారణంగానే కవిత్వం కోసమంటూ 1995లో రైలెక్కేసి హైదరాబాద్ వచ్చేసింది. అప్పటి నుంచీ కవిత్వంతోనూ, ఆయనతోనూ ఆ బంధం అలా కొనసాగుతూనే ఉంది.

  1. తెలుగు కవిత్వం లో ఆంగ్ల భాష విరివిగా వాడుతుండటంపై కొంతమందికి అభ్యంతరాలు న్నాయి. దీనిపై మీ అభిప్రాయం?

కవిత్వం అనేది ఒక అంతర్మథనం లోంచీ దూకే జలపాతం, భావావేశంలోంచి ఉబికే చెలమ. అప్పుడు ఆ సందర్బంలో అవ్యక్తంగా ఏదైతే ఆవిష్కృతమవుతుందో.. అది అలా ఉండటమే బాగుంటుంది. మన దైనందిన జీవితంలో, మాటల్లో ఆంగ్ల చోటుచేసుకుంటున్నప్పుడు కవిత్వంలో మాత్రం ఎందుకు వద్దు?

  1. మీకవితల్లో రిపీటడ్ గా విని/కనిపించే ఆ నావికుడెవ్వరు?

నేనే… మీరు కూడా. మనమంతా కూడా. సంసారాన్ని సాగరంతో పోలుస్తారు కదా. దాన్ని ఈదే వాళ్లంతా తమ జీవన నౌకలకు తామే సంరంగులు కదా. అందుకని అలా అన్నా.

*

వాసుదేవ్

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • రోడ్లు అనేకం. చూస్తున్నాం. సంతృప్తి అసంతృప్తులమధ్య వూగుతు ప్రయాణిస్తున్నాం. పరిచయం బాగుంది.దుర్గాపురం రోడ్ చూడాలనుంది

    .

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు