ది గర్ల్ ఆన్ ది ట్రైన్

‘ఏంట్రా ఈమధ్య ఎప్పుడు చూసినా ఎఫ్బీలోనే ఉంటున్నావ్, ఏంటి సంగతి? నువ్వు కూడా ఎఫ్బీకి ఎడిక్ట్ అయిపోయావా?’

‘అంత లేదు రా బాబు, జస్ట్ మామూలుగానే బ్రౌజ్ చేస్తున్నా’.

బయటికి ఫ్రెండ్‌గాడితో ఇలా అంటున్నాను గానీ నిజానికి ఎడిక్ట్ అయ్యింది ఎఫ్బీకి కాదు, ఆ అమ్మాయికి! ఇప్పుడు కూడా ఎఫ్బీ తెరిచింది తనకోసమే. రెండు వారాలు గడుస్తున్నాయి, ఇంకా తన నుండి ఫ్రెండ్ రిక్వెస్ట్ రాలేదు. ఆ అమ్మాయి నుండి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చిందేమోనని చూడటానికి ఈ రెండు వారాల్లో కనీసం ప్రతి పది నిమిషాలకోసారైనా ఎఫ్బీ ఓపెన్ చేసి ఉంటాను. రాలేదు. నేను అనుకున్నట్టు జరగలేదు. తనకి నా పేరు గుర్తుంటుందా అన్న ప్రశ్న మెదడు అడిగిన ప్రతిసారీ, మనసుని ఎవరో మెలిపెట్టినట్లు అనిపిస్తుంది. ఎవరి నోటి నుండైనా నా ట్రైన్ అన్న పదం విన్నా, సినిమాలో ట్రైన్ కనిపించినా తనే గుర్తుకొస్తోంది. నాలో సంతోషంతో కూడిన బాధ అలముకుంటుంది. ఆ రోజు రైల్లో ఆ అమ్మాయితో చేసిన ప్రయాణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను.

***

నాన్న పోస్ట్ ఆపరేటివ్ ట్రీట్మెంట్ కోసం విజయనగరం వెళ్ళాలి. హాస్పిటల్‌కి మమ్మల్ని తీసుకువెళ్ళే కార్ రావడం లేదని తెలిసింది. చేసేదేంలేక తెల్లారి ఆరున్నర గంటల ట్రైన్‌కి వెళ్దామని పార్వతీపురం టౌన్ స్టేషన్‌కి వచ్చాం. స్టేషన్‌ మొత్తం జనంతో కిక్కిరిసింది. ఆదివారం రద్దీగా ఉంటుందని తెలుసుగానీ, మరీ ఇంతలా ఉంటుందని ఊహించలేదు. ‘బస్సుకు వెళ్దాం, సీట్లుంటాయి. హాయిగా వెళ్లి రావొచ్చంది’ అంది అమ్మ ఆ జనాన్ని చూసి. ‘బస్సులో వెళ్తే హాస్పిటల్‌కి వెళ్ళి తిరిగి రావక్కర్లేదు, అక్కడే ఉండిపొవచ్చు, అలా ఉన్నాయి రోడ్లు’ అని నాన్న మాట. వీళ్లు మాట్లాడుకుంటుండగా నేనెళ్లి టిక్కెట్లు తీసుకొచ్చాను.

ట్రైన్ వచ్చింది. నాన్నకి సీట్ సంపాదించడం కోసం నానా తంటాలు పడి అందరికన్నా ముందు ట్రైన్ ఎక్కాను. తీరా చూస్తే అది జనరల్ బోగీ కాదు, చైర్ కార్. చూడటానికి బస్సులా ఉంది. రిజర్వేషన్ పెట్టె ఎక్కలేదు కదా? పక్కనున్న వ్యక్తికి అడిగితే, జనరల్ అని చెప్పాడు. ఒక్క సీటూ ఖాళీగా లేదు. ఈలోపు అమ్మ, నాన్న ట్రైన్ ఎక్కారు. నాన్నకి సీట్ దొరకడం దేవుడెరుగు, కనీసం నిలబడటానికీ చోటులేదు. జనంతో ట్రైన్ నిండిపోయింది.

‘అందరి కన్నా ముందు ఎక్కావు కదరా! సీటు దొరకలేదా?’ అంది అమ్మ. ‘ఎక్కేసరికి ఖాళీ లేవమ్మా! ఫర్లేదులే. నాన్న పేషంట్ అని చెబితే ఎవరో ఒకరు సీటు ఇస్తారు’ అని ధీమాగా సమాధానం చెప్పాను.

లగేజ్ బ్యాగ్ పైన పెట్టాను. ట్రైన్ కదిలింది. ఎవర్ని అడగాలా అని ఆలోచిస్తుంటే, పక్క సీటతను పెద్ద బొట్టెట్టుకుని కనపడ్డాడు. నలభై ఏళ్ళ పెద్దమనిషి. దైవభక్తి ఉన్నోడిలా ఉన్నాడు. అర్థం చేసుకుని సీట్ ఇస్తాడనిపించింది. సంగతి చెప్పాను.

‘నేను బొబ్బిలిలో దిగిపోతాను, అప్పటి వరకు వెయిట్ చెయ్యండి’ అన్నాడు. నాన్న పేషంట్ అని చెప్పింది సరిగ్గా వినపడలేదేమోనని మళ్ళీ చెప్పాను. ‘బొబ్బిలంటే ఎంతసేపు? ఇరవై నిమిషాలు ఓపిక పట్టండి’ అన్నాడు ఈసారి కొంచెం గొంతు పెంచి. మా నాన్న అంతసేపు నిలబడలేడనేగా సీట్ అడుగుతున్నది. అర్థం చేసుకోడేం?

‘ఇంత మంది ఉండగా నన్నే సీటెందుకు అడిగారు?’ అన్నాడు నన్ను చూస్తూ. కోపం వచ్చింది. ‘మీరు పెద్దబొట్టు పెట్టుకున్నారుగా’ అన్నాను వ్యంగ్యంగా. నేనన్నది అర్థం అయినట్లు లేదు. పక్కనున్న పెద్దాయనకి మాత్రం అర్థమైంది. ఆయన్ని కూడా సీటు అడుగుతానేమోనని కళ్ళు మూసుకుని నిద్ర పోతున్నట్టు నటించాడు. ఆయనా పెద్ద బొట్టు పెట్టుకున్నాడు మరి!

ఇంకోవైపు అమ్మ కూడా చుట్టూ ఉన్న వాళ్లని అడుగుతోంది. ఏమీ లాభం లేదు. మన వయసు వాడైతే అర్థం చేసుకుంటాడని చుట్టూ చూశాను. ముందువరుసలో ఒకతను ఫోన్ మాట్లాడుతూ కనపడ్డాడు. ఇరవై ఐదేళ్లు ఉండొచ్చు. చూడటానికి మంచోడిలా ఉన్నాడు. ఫోన్ మాట్లాడటం పూర్తయ్యాక అడుగుదామని ఆగాను. అతనేమో ఫోన్లో ఎవరితోనో ‘అన్నీ అనుకున్నట్టు కుదిరాయి. వైజాగ్ నుంచి తత్కాల్ బుక్ చేశాను. సీట్ కన్ఫర్మ్ అయ్యింది. దర్జాగా పడుకుని వెళ్లొచ్చు…’ అని ఏదేదో మాట్లాడుతున్నాడు. అదేదో మా బోగీలో ఉన్నవాళ్లందరికి అనౌన్స్‌మెంట్ ఇస్తున్నట్టు. కొంతసేపటికి ఫోన్ కట్ చేశాడు.

నేను వెళ్లి, ‘బ్రదర్! మా నాన్నకి రీసెంట్‌గా తొడ మీద చిన్న సర్జరీ అయింది. ఎక్కువసేపు నిలబడలేరు. ఒక పది నిమిషాలు నిలబడగలరా? ఆ బొట్టెట్టుకున్న అతను బొబ్బిలిలో దిగుతారంట, కొంచెం అర్థం చేసుకోండి’ అన్నాను. నన్ను పైనుండి కింద వరకు చూసి, ‘నాకు కాలు నొప్పెడుతున్నాయి. సీట్ ఇవ్వలేను. అయినా చదువుకున్నోడిలా ఉన్నావ్. పేషంట్ ఉన్నప్పుడు రిజర్వేషన్ చేసుకోవాలని తెలియదా? తత్కాల్ ఉంటుందిగా..’ అన్నాడు. ‘నీ బోడి సలహా ఎవడిక్కావాలి గానీ, సీట్ ఇస్తానంటే ఇస్తానని చెప్పు, లేదంటే లేదని చెప్పు, ఎదవ సలహాలివ్వకు’ అని మనసులో అనుకుని, బయటికి మాత్రం, ‘అందరికీ మీలా అన్నీ కుదరవు కదా సర్’ అన్నాను. మండినట్టుంది, మౌనంగా ఉండిపోయాడు.

అమ్మ వైపు చూశాను. అమ్మ నాన్నని దిగాలుగా చూస్తోంది. పక్కనున్న వాళ్ళని అడిగింది. వాళ్ళు కనీసం నోరు మెదపలేదు.

అమ్మకి కోపం వచ్చినట్టుంది. ‘ఇదేంటమ్మా ఇలా ఉన్నారు? పేషంటన్నా పట్టించుకోవట్లేదు’ అని తన కోపమంతా బయటపెట్టింది. ‘ఎవరినీ అడగక్కర్లేదు, నేను నిలబడగలను’ అన్నాడు నాన్న.  మేము చిన్నబుచ్చుకోకూడదని అలా అన్నాడని తెలుసు. తన ముఖం చూస్తే తెలుస్తోంది, కాళ్ళు నొప్పెడుతున్నాయని. ఇంకొకరిని అడగాలని చూస్తుంటే నాన్న వద్దన్నాడు. ఏమీ చెయ్యలేని పరిస్థితి. గంటన్నరసేపు ఈ ట్రైన్‌లో ఎలా గడపాలా అని చిరాకొచ్చింది. నిరాసక్తంగా చుట్టూ చూశాను. అప్పుడు కనిపించింది ఆ అమ్మాయి. చూడగానే నాకు ముందే పరిచయం ఉన్నట్టనిపించింది. తను నన్నే చూస్తోంది.

తను నేను తొమ్మిదో తరగతిలో ప్రేమించిన అమ్మాయా? అలా ఉండటం వల్ల ఇలా అనిపిస్తోందా? ఇద్దరివీ ఒకేలాంటి కళ్ళు. కాటుక కూడా పెట్టుకుంది. తనలాగే సన్నంగా, ఛామనచాయ రంగులో ముఖం కళకళలాడుతూ ఉంది. నల్లరంగు చుడీదార్ వేసుకుంది. అమ్మ వద్దని అంటున్నా నేనూ నల్లరంగు షర్టూ, ప్యాంటూ వేసుకున్నా. తను నన్ను చూడటానికి, ఇదీ ఒక కారణం అయ్యిండొచ్చు. డిగ్రీ స్టూడెంట్‌లా ఉంది. హాస్టల్‌కి వెళ్తున్నట్టు ఉంది. చూడగానే నచ్చింది.

సీతానగరం స్టేషన్‌లో ఎక్కినట్టున్నారు. పార్వతీపురం స్టేషన్‌లో ఎక్కి ఉంటే ఈపాటికే నేను చూసేవాణ్ని. తను ఎవరితో వచ్చిందా అని చూశాను. తెలుగు సినిమాల్లో విలన్‌లాగా ఉన్న ఒకాయన తన పక్కన కనిపించాడు. ఇంత లావు, ఎత్తుతో, పొడువాటి గడ్డంతో గంభీరంగా ఉన్నాడు. వాళ్ల నాన్నా? ఆ అమ్మాయి తమ్ముడు కూడా పక్కనే ఉన్నట్టున్నాడు.

ట్రైన్ బొబ్బిలి స్టేషన్ దగ్గర ఆగింది. బొట్టెట్టుకున్న పెద్దమనుషులిద్దరూ లేచారు. నేను థాంక్స్ చెప్పాను. అమ్మ,‌నాన్న ఇద్దరికీ సీట్లు దొరికాయి. ప్రశాంతంగా అనిపించింది. చిరాకు మాత్రం తగ్గలేదు.

ఆ అమ్మాయి నన్ను నిజంగానే చూస్తుందా? లేక అనుకోకుండా జరిగిందా? తననే చూస్తున్నా. తనకీ నేను నచ్చినట్టున్నాను. నన్నే చూస్తోంది. నేను చూస్తున్నానని తెలిసి తల తిప్పేసింది. నవ్వొచ్చింది. ట్రైన్‌లో సైట్ కొట్టడం మామూలే! కానీ అమ్మనాన్నల్ని పక్కన పెట్టుకుని ఇలాంటివి చేయడం కొత్తగా అనిపించింది. నాన్న పడుకున్నాడు. అమ్మకి నిద్ర రానట్టుంది, నన్నే చూస్తోంది. ఒకసారి చిన్నగా నవ్వి, ఇప్పుడెలారా బాబు అనుకుంటూ ఆ అమ్మాయిని అప్పుడప్పుడూ చూస్తున్నా.

నేను తనని చూస్తున్నప్పుడు తను ఎటో చూడటం, తను తిరిగి నన్ను చూసినప్పుడు నేను ఎటెటో చూడటం. మళ్ళీ నేను తనని చూడటం, తను తిరగటం.. ఇలా పొద్దుతిరుగుడు పువ్వు, సూర్యుడు దాగుడుమూతలాడుకుంటున్నట్టు ఎన్నిసార్లు చూసుకున్నామో లెక్కేలేదు. తను తిరిగినప్పుడు నేను తలతిప్పడాన్ని చూసి తను నవ్వే నవ్వు చూడటానికి ఎంత బాగుందో! ఆ నవ్వుని అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. వీలైతే ఆ అమ్మాయికి తెలియకుండా ఆ నవ్వుని ఫోటో తీసి పెద్ద ఫ్రేమ్ కట్టించి నా రూంలో పెట్టుకోవాలనిపించింది. కానీ వాళ్ళ నాన్నని చూశాక ఆ ఆలోచన విరమించుకున్నా. తన కూతురిని చూస్తున్నానని తెలిస్తేనే కొట్టేలా ఉన్నాడు. ఇంక ఫొటో తీశానని తెలిస్తే చంపేస్తాడేమో?

మేము చూపులతో మాట్లాడుకోవడం మానలేదు. ‘తత్కాల్ బుక్ చేసుకోవాలి కదా’ అని ఇందాక సలహా ఇచ్చిన అన్నయ్య ఇదంతా చూసి కుల్లుకోవడం భలే అనిపించింది. నన్ను చూసి అసూయతో కూడిన నవ్వు చిన్నగా నవ్వాడు. నేను వెంటనే, ‘అందరికీ మీలా అన్నీ కుదరవు కదా బ్రో’ అన్నా. వాడి ముఖం రంగు మారింది. నాకు నవ్వొచ్చింది.

ఆ అమ్మాయికి, వాళ్ళ నాన్నకి సీట్లు దొరికాయి. నా వెనుక వరుసలో అమ్మ నాన్న, ముందు వరుసలో ఆ అమ్మాయి, వాళ్ళ నాన్న. నేను మధ్య వరుస పక్కన నిలబడి ఉన్నాను. వాళ్ళ తమ్ముడు నా ముందు నిలబడి ఉన్నాడు. ఆ అమ్మాయి దగ్గర ఫోన్ లేనట్టుంది. వాళ్ళ నాన్న ఫోన్ తీసుకుంది.

నేను చూస్తున్నానా లేదని ఒకసారి వెనక్కి తిరిగి చూసింది. వాట్సప్ ఓపెన్ చేసింది. నంబర్ చూపిస్తాదేమోనని చూశాను. వాట్సప్ ప్రొఫైల్ ఓపెన్ చేసింది. నా గుండె వేగం పెరిగింది. నంబర్ కనపడింది. 947… మిగతా నంబర్స్ చూసేలోపే రెండు క్షణాల్లో వెనక్కి వచ్చేసింది. నన్ను చూసి మళ్ళీ ముందుకు తిరిగి చిన్నగా నవ్వుకుంది. ఆటపట్టిస్తోందని అర్థమైంది.

కొంతసేపు తనని చూడలేదు. తను మాత్రం మాటిమాటికీ వెనక్కి తిరిగి చూస్తోంది. నేను తనని గమనిస్తున్నా. తను ఫీలైయినట్టు అనిపించింది. మళ్ళీ చూడటం మొదలుపెట్టాను. తను ఫోన్ గ్యాలరీ తెరిచింది. ఒక్కో ఫోటో చూపిస్తుంది. నేను ఈ ఫోటో బాగుంది, ఇది బాలేదు అని మనసులో అనుకుంటూ మౌనంగా ఆ క్షణాలను ఆనందిస్తున్నా. కాల్ రావడంతో ఫోన్ వాళ్ళ నాన్న తీసేసుకున్నాడు. అమ్మ వైపు చూశా, నన్నే చూస్తోంది. ఇదంతా చూడలేదు కదా అనుకుంటూ, మళ్ళీ అటూ ఇటూ చూశా.

గజపతినగరం స్టేషన్ వచ్చింది. నా పక్కన మధ్య వరుసలో ఒక సీట్ ఖాళీ అయ్యింది. నాకు కూర్చోవడం ఇష్టం లేదు. కూర్చుంటే ఆ అమ్మాయి కనపడదు. మరెవరో అక్కడ కూర్చోడానికి ప్రయత్నిస్తే ఏం అనకుండా చూస్తూ ఉన్నాను. మా అమ్మ మాత్రం, ‘పార్వతీపురం నుండి మా అబ్బాయి ఆ సీట్ కోసం నిలబడి ఉంటే, మీరేమో ఇప్పుడొచ్చి ఎలా కూర్చుంటారు?’ అంది. ఇష్టం లేకపోయినా కూర్చోక తప్పలేదు.

ఇప్పుడా అమ్మాయి కనపడటం లేదు. చాలా సంవత్సరాల తరువాత ఒక కొత్త అనుభూతి. ఎలాగైనా తనని వదలకూడదనిపించింది. నా నంబర్ ఇద్దామని నిర్ణయించుకున్నా. వాళ్ల నాన్న, మా అమ్మానాన్న లేకపోతే నేరుగా మాట్లాడేవాణ్నే. ఇప్పుడు నా ఫోన్ నంబర్ పేపర్ మీద రాసి ఇచ్చాక, అది వాళ్ళ నాన్నకి దొరికితే నా పని అయిపోయినట్టే! మా నాన్ననీ హాస్పిటల్ తీసుకువెళ్ళడానికి వెళ్లి, నేను హాస్పిటల్‌లో చేరాల్సి వస్తుంది.

నేరుగా నంబర్ పేపర్ మీద రాసి ఇస్తే దొరికిపోతాను. నంబర్‌ని కోడ్‌లో రాస్తే దొరకనుగా! మెదడులో అంకెల్ని ఇంగ్లీష్ అక్షరాలుగా మార్చి కోడ్ రెడీ చేశాను. నా దగ్గర పెన్ లేదు. అప్పుడెప్పుడో మా తెలుగు మాస్టారు ‘ఎగ్జామ్‌కి పెన్ లేకుండా ఎలా వస్తావురా? మర్చిపోతే ఎలా? స్టూడెంట్ జేబులో ఎప్పుడూ పెన్ ఉండాలి!’ అని తిట్టిన తిట్లు ఇప్పుడు గుర్తుకొచ్చాయి.

పోనీలే ఇంత పెద్ద బోగీలో ఎవరో ఒకరు పెన్ తెచ్చి ఉండరా అని అటూఇటూ చూస్తే, ఎవరి దగ్గరా పెన్ కనపడలేదు. ఏం చెయ్యాలో తెలీదు. ఆ అమ్మాయిని చూసి పది నిమిషాలయ్యింది. ఏదో గూడ్స్ ట్రైన్ వస్తుందని మేం వెళ్తున్న రైలును గొట్లం దగ్గర ఆపారు. ట్రైన్ కదలడానికి ఇంకో పావుగంటైనా పడుతుందంట. ఆ అమ్మాయితో ఇంకో పావుగంట ప్రయాణించొచ్చన్న ఆనందం ఎక్కువైంది.

నంబర్ ఎలా ఇవ్వాలా అని ఆలోచించా. పోనీ ఫోన్‌లో ఎవరితోనైనా మాట్లాడుతున్నట్టు మాట్లాడి, నా నంబర్ ఆ అమ్మాయికి వినపడినట్టు చెబితే? సేవ్ చేసుకోవడానికి తన దగ్గర ఫోన్ లేదు. గుర్తుపెట్టుకోగలదన్న గ్యారంటీ లేదు. ఫేక్ ఫోన్ కాల్ మాట్లాడే శక్తి సామర్థ్యాలు మన దగ్గర లేవు.

ఎలా అనుకుంటూ అలా పైకి చూస్తుంటే నా లగేజ్ బ్యాగ్ కనిపించింది. సరిగ్గా అది ఆ అమ్మాయి ఉన్న వరుస పైన ఉంది. నాకో మంచి ఆలోచన వచ్చింది. ‘మేం విజయనగరంలో దిగినప్పుడు ఆ అమ్మాయికి నా ఫోన్ పట్టుకోమని ఇచ్చి లగేజ్ బాగ్ తీసుకుంటాను. అంతకు ముందే నా ఫోన్‌లో వాట్సప్ ప్రొఫైల్ ఓపెన్ చేసి ఉంచుతాను. ‘నా నంబర్‌ అలా ఇవ్వొచ్చు’ అన్నది ప్లాన్. ఇదంతా కుదరాలంటే వాళ్ళ నాన్నకి అనుమానం రాకుండా ఫోన్ పట్టుకోమని ఇవ్వాలి. వాళ్ళు దిగే స్టేషన్ విజయనగరం అవ్వకూడదు. ఈ రెండు జరగకూడదని మనసులో గట్టిగా అనుకున్నా.

అమ్మ దగ్గర ఉన్న నీళ్ల సీసా తీసుకుందామనే నెపంతో లేచాను. అమ్మాయి వెంటనే వెనక్కి తిరిగి చూసి అందంగా నవ్వింది. నేను చిన్నగా నవ్వి మళ్ళీ కూర్చున్నా. ట్రైన్ విజయనగరం స్టేషన్ దగ్గరకి వచ్చింది. ప్లాట్ఫారంలోకి రాగానే నిలబడ్డాను. నా లగేజ్ బ్యాగ్ తీసుకుబోతుండగా వాళ్ళు కూడా లేచారు. వాళ్ళు దిగే స్టేషన్ కూడా విజయనగరమే.

వాళ్ళ తమ్ముడు, నాన్న ఇద్దరూ ముందుకు నడుస్తున్నారు. ఈ అమ్మాయి వాళ్ళ వెంట వెళ్తోంది. జనం ఎక్కువగా ఉండటం వల్ల దిగటానికి కొంచెం టైమ్ పడుతుంది. ఈలోగా నేను ఆ అమ్మాయికి నా నంబర్ ఇవ్వాలి. కానీ ఆ పరిస్థితి లేదు.

వెంటనే ఆ అమ్మాయి వెనుక ఉన్న నా మొబైల్‌లో ఫేస్బుక్ ప్రొఫైల్ ఓపెన్ చేసి ఉంచాను. అమ్మ, నాన్న, ఆ అమ్మాయి వాళ్ళ నాన్న చూసినా సందేహం రాకూడదు. ఎంత ప్రయత్నించినా లగేజ్ బ్యాగ్ అందన్నట్టు నటించాను. ఆ అమ్మాయి భుజం మీద ఒకసారి చిన్నగా తట్టాను. ఆ అమ్మాయి ఆశ్చర్యపడుతూ నావైపు తిరిగింది. ‘నా మొబైల్ ఒకసారి పట్టుకుంటారా? నా బ్యాగ్ తీసుకుంటాను’ అన్నాను. తను నా ఫోన్ తీసుకుంది. ఈలోగా నా బ్యాగ్ తీసుకున్నాను. అమ్మని, నాన్నని లేవమని చెప్పాను. తర్వాత ఆ అమ్మాయి దగ్గర ఫోన్ తీసుకుని, తను చూస్తుండంగానే ఫోన్‌ని నా ప్యాంట్ జేబులోకి తోశాను. తను చిన్నగా నవ్వింది. నా ఆలోచన ఫలించిందని, తనకి నా పేరు గుర్తుందని అర్థమయ్యింది. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న, తమ్ముడు ఇద్దరూ రైలు దిగే ధ్యాసలో ఉన్నారు. మా అమ్మానాన్న మెల్లగా దిగడానికి రెడీ అవుతున్నారు.

ఆ అమ్మాయి వాళ్ళు స్టేషన్‌లో దిగి ముందుకు నడుస్తున్నారు. నేను కూడా దిగి వెనక్కి తిరిగి చూస్తుందని తననే చూస్తున్నా. తను నడుచుకుంటూ వెళ్ళిపోతోంది. తిరిగి చూడట్లేదని కొంచెం బాధగా అనిపించింది. పక్కకు తిరిగి నాన్న వాళ్ళు దిగారా, లేదా అని చూసాను. వాళ్ళు ఇంకా దిగలేదు. తన వైపు ఇంకోసారి చూశాను. నేను గుర్తే లేనట్టు వెళ్లిపోతోంది. ఎగ్జిట్ డోర్ టర్నింగ్ దగ్గరుంది. ఇక తను చూడదని అనుకుని నేను పక్కకి తిరుగుతున్నప్పుడు ఒక్కసారిగా వెనక్కి తిరిగి నవ్వింది. ఆ చూపు నా గుండెకు తగులుకుంది. నేను కూడా నవ్వుతూ చెయ్యి ఊపాను. వీడ్కోలు ఇంత కన్నా బాగా ఎవరూ చెప్పలేరనిపించింది.

ఈలోగా అమ్మ నాన్న రైలు దిగారు. స్టేషన్ బయటకి వచ్చాం. అమ్మాయి వాళ్ళు కనిపించలేదు. ఆటో ఎక్కాం. హాస్పిటల్ దగ్గరకి తొమ్మిది అయ్యేసరికి వెళ్ళాము. గంటన్నర ఎలా గడపాలా అని చిరాకు పడ్డ నాకు ఆ అమ్మాయి వల్ల టైమే తెలియకుండా రైలు ప్రయాణం గడిచిపోయింది. నాన్నకి ట్రీట్మెంట్ అయిపోయింది.

***

‘బయటకి అలా టీ తాగడానికి వెళ్దాం పద రా. ఐదు అయిపోయింది!’

‘ఫోన్ కి ఛార్జింగ్ పెడతాను ఆగు. వెళ్దాం’.

ఆ అమ్మాయి ఆలోచనలు నుండి బయటపడాలంటే, బయటికి వెళ్ళడమే మేలనిపించింది. ఫోన్‌కి ఛార్జింగ్ పెట్టి బయటికి వెళ్ళాం. విజయనగరం కోట రోడ్లో అలా తిరుగుతూ కొంతసేపు కబుర్లు చెప్పుకుని, టీ తాగి, ఒక అరగంట తర్వాత మా రూంకి వచ్చాము. రావడం రావడంతోనే ఫోన్ చూశాను. ఫోన్ నోటిఫికేషన్స్‌లో ఎవరో మధుమతి అనే అమ్మాయి నుండి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చినట్టు చూపిస్తుంది. రెండు మిస్డ్ కాల్స్ కూడా ఉన్నాయి, ఒకటి నాన్న నుండి.. ఇంకొకటి ఏదో కొత్త నంబర్ నుండి!

ఈ ఫ్రెండ్ రిక్వెస్ట్ ఆ రైలులో అమ్మాయిది అవ్వాలని మనసులో గట్టిగా అనుకున్నాను. వెంటనే ఎఫ్బీ ఓపెన్ చేశాను. చేతులు వణుకుతున్నాయి. గుండె దడ పెరిగింది. ఫ్రెండ్ రిక్వెస్ట్ ప్రొఫైల్ ఓపెన్ చేశాను. మధుమతి మధు అని ఉంది. ‘నైస్ నేమ్’ అనుకుంటూ తన ప్రొఫైల్ ఫొటోస్ ఒక్కొక్కటిగా చూస్తున్నా. అన్నీ కోటేషన్లే కనిపిస్తున్నాయి. చూస్తూ ఉంటే ఒక ఫోటో కనిపించింది. కానీ అది రైలులో అమ్మాయిది కాదు, వేరే ఎవరో! ఇలా అమ్మాయిల నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ రావడం, అది ఆ అమ్మాయిది కాకపోవడం.. ఇది ఆరోసారి. దిగాలుగా అనిపించింది.

నాన్నకి ఫోన్ చేశాను. ఏం చేస్తున్నావని అడిగాను. ఇప్పుడే పొలం దగ్గర నుండి ఇంటికొచ్చానన్నాడు. నాన్నతో ఫోన్ మాట్లాడుతున్నాను గానీ ధ్యాసంతా ఆ అమ్మాయి నుండి ఎప్పుడు ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తుందన్న ఆలోచన మీదే ఉంది. నాన్నతో కొంతసేపు మాట్లాడి ఫోన్ కట్ చేశాను.

చిరాకుగా ఉండటంతో మిస్డ్ కాల్ ఉన్న అన్నోన్ నంబర్‌కి తర్వాత కాల్ చెయ్యొచ్చులే అనుకుంటూ ఫోన్ చైర్ మీద పెట్టాను. మేఘాలతో ఉన్న ఆకాశాన్ని చూస్తూ డాబా మీద అటూఇటూ తిరుగుతూ ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాను.

‘ఆ అమ్మాయికి అసలు నేను గుర్తున్నానా? ఇప్పుడు నా గురించే ఆలోచిస్తుంటుందా? ఏం చేస్తుంటుంది? వాళ్ళ నాన్నకి భయపడి నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టట్లేదా? అసలే చూడటానికి రౌడీలా ఉంటాడు, నేనేంటి ఇలా తయారయ్యాను? సరిగ్గా గంటన్నర కూడా పరిచయం లేని, పేరు తెలియని అమ్మాయి గురించి ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నాను?

బి.టెక్ ఫైనల్ ఇయర్‌లో బ్రేకప్ అయ్యాక, మళ్ళీ రెండేళ్ల తర్వాత ఒక అమ్మాయి మీద ఇంతలా ఇష్టం కలిగింది. కానీ ఇదీ అందని ద్రాక్షలానే తయారయ్యింది. తన నవ్వును ఒక్కసారి గుర్తు తెచ్చుకోగానే నా ముఖంలో నవ్వు మొలిచింది.

అదే కొత్త నంబర్‌తో మళ్ళీ ఫోన్ వచ్చింది. మాట్లాడే ఇంటరెస్ట్ లేక కాల్ కట్ చేశాను. మళ్లీ కొంతసేపు అయ్యాక, ఏదైనా ముఖ్యమైన కాల్ అయ్యి ఉంటాదేమోనని అనిపించి రిటర్న్ కాల్ చేశాను. ఎవరో పెద్దాయన లిఫ్ట్ చేశాడు.

‘హలో.. ఎవరూ?’

‘హలో.. ఇందాక ఈ నంబర్ తో నాకు మిస్డ్ కాల్ వచ్చిందండీ!’

‘ఓ.. మా అమ్మాయి చేసి ఉంటుంది. ఇస్తాను ఆగండి!’ అని అవతల వ్యక్తి సౌమ్యమైన గొంతుతో అన్నాడు.

ఎవరై ఉంటారబ్బా అని అనుకుంటుంటే అవతల నుండి తీయగా ‘హలో!’ అని వినిపించింది.

‘అదే అండి మిస్డ్ కాల్ ఉంది, మీరు చేశారంటా!’

‘హా! బాగున్నారా?’

‘హ్మ్మ్. నేను బానే ఉన్నాను. మీరు ఎవరో చెబుతారా? నాకు గుర్తు రావట్లేదు’.

‘అప్పుడే మర్చిపోయారా? మర్చిపోతే ఎలా అండీ?’

‘మీ పేరు చెప్పగలరా?’

‘పేరు చెప్పను, కానీ మీరే చెప్పాలి నేనెవరో! అయినా అలా ఎలా అండీ మర్చిపోతారు? నేను అలిగాను. బుంగ మూతి పెట్టుకున్నాను’ చిలిపిగా మాట్లాడుతోంది.

ఎవరో నన్ను ఆటపట్టించడానికి కాల్ చేసినట్టనిపించింది.

‘ముందు మీరు ఎవరో చెప్పండి. అప్పుడు చెబుతాను, మిమ్మల్ని మర్చిపోయానో లేక మర్చిపోలేకపోతున్ననో’ అని కోపంగా అన్నాను.

‘ఎందుకు అంత కోపం? సరే! చెబుతాను’.

‘చెప్పండి!’

‘నేను ట్రైన్ లో అమ్మాయిని.. గుర్తుకొచ్చానా?’

నా నోట మాట రాలేదు. నా మనసు అమాంతం ఆనందసంద్రంలో మునిగిపోయింది.

‘హలో.. వినిపిస్తుందా?’

‘హా..విన్.. వినిపిస్తుందండీ!’

‘అదే! ఆ రోజు మీ నాన్నగారికి బాలేదని సీట్ కోసం చాలామందిని అడిగారు కదా! అప్పుడు మనం ఒకర్ని ఒకరు చూసుకున్నాం.. గుర్తుకొచ్చిందా.. ఆ అమ్మాయిని’.

‘సారీ సారీ! మీరు గుర్తు లేకపోవడం ఏంటి అండీ, అసలు మర్చిపోతేనే కదా!’

‘అలాగా!’ చిన్నగా నవ్వింది.

‘సారీ! మీరని తెలియక ఫోన్ కట్ చేసాను’.

‘ఫర్వాలేదు. ఇప్పుడు మీ నాన్నగారికి ఎలా ఉంది?’

‘బాగున్నారండీ! అవునూ మీకు నా నంబర్ ఎలా వచ్చింది?’

‘అదా? అంత కష్టపడి మీరు ఇచ్చిన ఫేస్బుక్ ప్రొఫైల్ ఐడీని ఎలా మర్చిపోగలను? మీ ఫేస్బుక్ అబౌట్ చూసాను. అందులో మీ నంబర్ ఉంది’

‘థాంక్యూ!’ అని చిన్నగా నవ్వాను.

ఆ రోజు ట్రైన్ జర్నీ అయిపోయాక ఒకవేళ ఈ అమ్మాయి నా ఫేస్బుక్ చూస్తే నంబర్ కనపడాలని పబ్లిక్‌లోకి అప్డేట్ చేశాను. అది ఇలా పని చేసింది.

‘అవునూ.. ఇందాక మాట్లాడింది ఎవరూ? మీ బాబాయి ఆ?’

‘కాదు మా డాడీ’

‘మీ డాడీనా?’

‘ఆ అవును. మా డాడీ. ఏం అలా అడిగారు?’

‘అంటే.. నాతో ఫోన్..?!’

‘మీకో విషయం చెప్పనా, మా డాడీకి మీరు ట్రైన్‌లో నన్ను చూసింది కూడా తెలుసు. ఆయనికి నా విషయాలన్నీ షేర్ చేస్తాను. అంతలా ఫ్రీడమ్ ఇచ్చారు మా డాడీ!’ అంది.

వాళ్ల నాన్న గురించి అలా చెప్పగానే నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆయన గురించి ఇందాకటి వరకు నేను అనుకున్నదానికి, నిజజీవితంలో ఉంటున్న దానికి పొంతన లేదు. మనిషిని బట్టి మనసును అంచనా వెయ్యికూడదని అర్థమైంది. మనసులో వాళ్ల నాన్నకి ఒకసారి సారీ చెప్పుకున్నా.

‘మీది కూడా విజయనగరమేననా?’ అని అడిగింది.

‘హా. కోట దగ్గరే మా రూం!’

‘అవునా. మా హౌస్ కూడా కోట దగ్గరే. అశోక్ నగర్ స్ట్రీట్. సారీ ఏం అనుకోవద్దు. తర్వాత కాల్ చెయ్యనా? నాకు మాట్లాడాలని వుంది కానీ కొంచెంలో పని ఉన్నాను. నేనే కాల్ చేస్తాను. ఒకే నా, బై!’ అని నవ్వుతూ చెప్పింది.

కాల్ కట్ చేసింది. అయ్యో, తన పేరు అడగటం మర్చిపోయానే! ఏ పేరు అయినా నాకు నచ్చుతుందిలే అనుకున్నాను. ఎప్పటి నుండో బ్యాక్‌లాగ్ లో ఉన్న పరీక్ష రిజల్ట్స్‌లో టాపర్ అయినంత ఆనందంగా ఉంది. నా ఆనందాన్ని చూసి ఆకాశం కూడా పరవశించినట్టుంది, వర్షం కురవడం మొదలయ్యింది.

*

కథ రాయడమంటే……..

* హాయ్ చంద్రశేఖర్! మీ గురించి చెప్పండి.

హాయ్! మాది విజయనగరం (ప్రస్తుతం పార్వతీపురం మన్యం) జిల్లా గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర గ్రామం. పదో తరగతి దాకా అక్కడే చదివాను. పార్వతీపురంలోని ఒక ప్రైవేట్ కాలేజిలో ఇంటర్ చదివాను. ఆ తర్వాత అనంతపురంలో శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేశాను.

* కథలు రాయాలన్న ఆలోచన ఎలా వచ్చింది?

మా నాన్న గారు ఒక మంచి నెరేటర్. చిన్నప్పుడు ప్రతీరోజు సాయంకాలం తన రోజూ వారీ అనుభవాలను నాతో, మా తమ్ముడితో పంచుకునేవాళ్లు. ఆయన ఎంత బాగా చెప్పేవారంటే, ఆరోజుల్లోనే నాకు ఆ కథల్ని ఒక పుస్తకంలా రాయాలని అనిపిస్తుండేది. పుస్తకాలు చదవకపోయినా స్కూల్లో ఉన్నప్పుడు ‘The Hound of the Baskervilles’, ‘Gulliver’s Travels’, మొక్కపాటి నరసింహశాస్త్రి గారి ‘బారిష్టర్ పార్వతీశం’, ఇంటర్మీడియేట్‌లో George Orwell రాసిన ‘Animal Farm’ బాగా చదివేవాడిని. ఆ తర్వాత పాలో కొయిలో రాసిన ‘పరుసవేది(The Alchemist)’ చదివాను. అవన్నీ నా మీద ప్రభావం చూపించాయి. సవి శర్మ రాసిన ‘Everyone has a Story’ చదివాక నేనూ రాయగలను అనే నమ్మకం వచ్చింది.

* తొలి కథ ఎప్పుడు రాశారు?

నేను కథ రాయడమనేది అనుకోకుండా జరిగిన విషయమనే చెప్పాలి. 2018లో నాకో కల వచ్చింది. అందులో నేను చనిపోయాను‌. ఆ కల నన్ను చాలా వెంటాడింది. ఆ తర్వాత మరికొన్ని గత అనుభవాలు దానికి తోడయ్యాయి. అవన్నీ ఒకదానికొకటి ముడిపడి నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. 2020 కరోనా లాక్‌డౌన్ సమయంలో ఒకరోజు రాత్రి ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టని స్థితికి తీసుకొచ్చాయి. కథ రాశాక గానీ నాకు ప్రశాంతంగా నిద్ర పట్టలేదు. ఆ తర్వాత రోజే దాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాను. దాని పేరు ‘నేను నా చావును చూశాను’. చదివిన చాలా మంది మెచ్చుకున్నారు. ఆ తర్వాత దాన్ని విహంగ వెబ్ పత్రికకు పంపితే అక్టోబర్ సంచికలో ప్రచురించారు. ఇప్పటికి రెండు కథలు రాశాను.

* కథారచన మొదలు పెట్టి రెండేళ్లు పూర్తయినా రెండు కథలే రాశారెందుకు?

నేను ప్రొఫెషనల్ కథకుణ్ని కాదు. కథ నన్ను వెంటాడి, వేధించి, నా చేత రాయించాలి. అప్పుడే రాయగలను. రాసినవి రెండు కథలే అయినా అవి నాలోని బరువును, బాధను తగ్గించాయి, పశ్చాత్తాపాన్ని పోగొట్టాయి.

* మీకు నచ్చిన రచయితలు? పుస్తకాలు?

నేను ఈ మధ్యే ఎక్కువగా చదువుతున్నాను. అలా చదివిన వాటిలో అబ్దుల్లా ఖాన్ గారు రాసిన ‘Patna Blues’ నవలకు అరిపిరాల సత్యప్రసాద్ గారు చేసిన తెలుగు అనువాదం ‘పాట్నా – ఒక ప్రేమ కథ’ బాగా నచ్చింది. భోజనం చెయ్యడం మానేసి మరీ ఒక్క రోజులో ఆ పుస్తకం పూర్తి చేశాను. దాంతోపాటు యండమూరి వీరేంద్రనాథ్, యద్దనపూడి సులోచనారాణి నవలలు కొన్ని చదివాను. వాటితోపాటు అసమర్థుని జీవయాత్ర, అతడు అడవిని జయించాడు, ఒక సెక్స్ వర్కర్ ఆత్మకథ, అంటరాని వసంతం.. ఈ పుస్తకాల్ని కూడా చదివాను. ఎవరైనా రాసింది నచ్చితే వాళ్లకి కాల్ చేసి మాట్లాడతాను. కుదరకపోతే కనీసం మెసేజ్ అయినా పెడతాను.

* ఇంకా ఎలాంటి కథలు రాయాలని ఉంది?

ప్రత్యేకించి ఇలాంటి కథలని ఏం లేదు. నా వరకూ కథ రాయడమంటే నాలోపలి బరువును దించుకోవడం, నన్ను కుదురుగా ఉండనివ్వని అనుభవాన్నీ అక్షీకరించి ప్రశాంతత పొందడం.. అంతే!

*

చంద్రశేఖర్ బోగాపురం

6 comments

Leave a Reply to పక్కి రవీంద్రనాథ్ Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అనుభవాలోంచి వచ్చే కథలు జీవితాల్లా అగుపిస్తాయి…
    ఈ కథ కధలా అనిపించ లేదు… కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్న దృశ్యం లా అనిపించింది… రచయితకు అభినందనలు 👌👌👌👌💐💐💐💐💐💐

  • రచయితతో పాటే పాఠకుడు కూడా రైలులో ప్రయాణం చేసి వెళ్ళిన అనుభూతిని కలిగించారు. కధనం బాగుంది. అభినందనలు.

  • Excellent thammudu. Really great. చాలా బాగుంది స్టోరీ.
    మనిద్దరం కూడా మాట్లాడుకున్నాం ఒకసారి. అభినందనలు మరియు శుభాకాంక్షలు తమ్ముడు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు