మాధవి దుఃఖంతో లుంగలు చుట్టుకుపోతూ ఉంది. మాధవిని ఆపడం ఎవరి తరమూ కావటం లేదు. వాకిలంతా మనుషుల ఆర్తనాదాలతో, వెక్కిళ్లతో అరుపులతో యుద్ధం ఆగిపోయాక శవాలను వెతుక్కుంటూ, దొరకబుచ్చుకుంటూ గుండెలు పగిలించుకుంటూ గొంతులు పగిలిపోయేలా ఏడుస్తూన్న భీభత్స దృశ్యంలా ఉంది. మాధవి, రవి తమ ముందు… తెల్లటి బాండేజీతో చుట్టబడి ఉన్న తమ పాప మూడేళ్ళ ”ఆద్య” దేహం నిర్జీవంగా పడి ఉండడాన్ని జీర్ణించుకోలేక వెర్రిచూపులు చూస్తున్నారు.
ఎవరూ ఏమైంది అని అడగడం లేదు, దుఃఖంతో ఉన్న మనుషులను ఆ ఇంటి ముందు నుంచి వెళుతూ… ఆగుతున్న కొత్త మనుషులు తప్ప. ”ఆద్యా… తల్లీ కళ్లు తెరువమ్మా… అమ్మను చూడూ నాన్న… పిలుస్తున్నాడు ఒక్కసారి. ఒక్కసారి లేచి సూడు అమ్మా” అంటూ మాధవి ఏడుస్తూన్నది. బిడ్డ శవాన్ని తన వొళ్ళోకి తీస్కుంటూ గుండెలకు హత్తుకుంటూ. ఆద్య తండ్రి రవి భార్యను ఓదార్చలేక తన దుఃఖాన్ని దాచలేక ఒణికిపోతున్నాడు.
మాధవి దుఃఖాన్ని ఆపలేకపోతున్నది అల్వీరా. ”నా మాటిను మధూ… ఇంత ఏడ్వబాకు కొన్ని నీళ్ళు తాగు” అని బలవంతంగా నీళ్ళు తాగించింది. మెల్లగా ఆమె ఒడిలో ఉన్న ఆద్య దేహాన్ని తీసి చాప మీద పడుకోబెట్టింది. ఎలా ఉండేది ఆద్య… చీకట్లోకి తొలుచుకొచ్చిన తొలి వెలుతురు కిరణంలా… ‘ఆద్య’ అంటే… దుర్గామాత అని మాధవి తల్లి, ఎవరూ ఏమీ చేయలేనిది అని మాధవి, తొట్టతొలి అయినది అనీ రవీ… ఏరి కోరి పెట్టుకున్న పేరది… తొలి కాన్పు… ఎంత ఆనందంతో పొంగిపోయిన్నారు?
హమల్ రాగానే ప్రెగ్నెన్సీ కిట్‌తో సహా ఇంట్లో వాలిపోయి ఖుషితో తనను ముద్దెట్టేసుకుంది. ”పాపే పుడుతుంది చూడూ అల్వీరా పాప పుడితే తన పేరు ఆద్య అనే పెట్టుకుంటాను. నీకు తెలుసు కదా, మా ఇంట్లో ఏడు తరాల నుంచి ఆడపిల్లే పుట్టలా. అందరూ మగపిల్లకాయలే… మా రవికి ఆడపిల్ల పుట్టాలని వాళ్ల తాతా – నానమ్మ, అత్త-మామ ఎంత మొక్కుకుంటున్నారనీ… రవి అప్పుడే చెప్పేసాడు. ఇంట్లో ఇంక మా అత్తయ్య ఫోన్ చేసి ఒకటే సంబరం తెలుసా?”… సంతోషం మాధవిలో ఎట్టా తెర్లాడిందనీ ఆ రోజు. తను కూడా ఎన్నిసార్లు దుఁవా చేసిందో నిఖా అయ్యి ఐదేళ్ళైనా పిల్లలు పుట్టని మాధవికి పిల్లలు పుట్టాలని… పుడితే బారా షాహీద్ దర్గాకి వచ్చి ఫాతెహా (మొక్కు) తీర్చుకుంటాననీ ముక్కెంగా రొట్టెల పండగకి, బలమంతాన సంతాన రొట్టె మార్చుకుంటానికి మాధవిని తీసుకొనిపోయింది. సిత్రంగా ఆ యాడాదే మాధవి గర్భవతి అయింది. ఆ రోజు తనకింకా మతికుంది… నెల్లూరు స్వర్ణాల చెరువులో బారా షహీద్ దర్గాలో సంతాన రొట్టెల దగ్గర ఎంత జనం… పోటెత్తి పోయినారు. అబ్బా ఇంత జనఁవా అని… మాధవి తెగాశ్చర్యపోయింది కాదూ? కొలువుల కోసం, విదేశాలకు ఎలబారటం కోసం, ఆరోగ్గెం కోసం, షాదీ కోసం, జనం ముక్కెం ఆడాల్లు చెరువు నీళ్ళలోకి నడుము లోతంటా దిగబడిపోయి రొట్టెలు నీళ్ళలో ఒదులుతూనే మిగతాయి వాయినం ఇచ్చుకుంటానే ఉన్నారు. తన కోరిక పోయినేడాది తీరింది. సంతానం కోసం మాధవి తన ముందు చేతులు చాపి నిలబడి ఉంది.
మైకులో సూఫీ పాట హోరెత్తి పోతా ఉన్నది.
అల్లాహూ… అల్లాహూ… వల్లాహూ..
ఏ జమీ జబ్ న థీ,
ఏ జఁహా జబ్ న థా…
చాంద్ సూరజ్ న థే ఆఁశమా
జబ్ న థా
తబ్ నధా కుచ్ యహాఁ
థా మగర్ తూఁ హితూఁ…
అల్లాహూఁఁ అల్లాహూఁ.. వల్లాహూఁ… హూ… హూ…
గుండెని భక్తి భావంతో చెదరగొడ్తూ గాలిలో తరంగాలు తరంగాలుగా సాగిపోతూ ఉంది సూఫీ పాట. మాధవి కళ్ళల్లో ధారగా నీళ్లు…
తను మౌనంగా మాధవి తలమీద చెరువు నీల్లు చల్లి
ఒక రొట్టె చెరువులో ఇడిసినాక తక్కిమా రొట్టెలు మాధవి
ఒడి నింపింది సంతానం కోసం…
మాధవి ఒడి నిండింది చిన్నారి ఆద్యతో…
మూడేళ్ల ఆద్య ఇప్పుడు శవమై పడి ఉంది.
”వాళ్ల చిన్నాయ్నేనంట. పాపాయిని చెరిచేసినాడంట…
పాపకి రక్తం కారతా ఉంటే బయపడి ఇంటెనక చెత్త కుప్పలో పడేసి పోయినాడంట. సందేళ దాకా ఎతికి ఎతికి ఏసారి పోయి పోలీసు కంప్లైంటు ఇచ్చినారంట… ఇంగ తెల్లారినాక చెత్తేరుకునే మనిషి వచ్చి పాపను చూసి గత్తరపడిపోయి అరుస్తా అందర్ని లేపేసినాడంట. అప్పటికి చానా రక్తం పోయినాదంట పాప తెలివిడిలో లేదంట. ఆస్పత్రిలో శానా ప్రయత్నం చేసినారంట… పాప చెప్పొద్దూ రెండుగా చీలిపోయినాదంటమాఁ. మూడేళ్ళ పసిది. బిడ్డ… ఆ పశువుకెట్టా దయ పుట్టలేదు?” పక్కనే కూసున్న ఎవరో ఒకామ ఇంకొకామెకు రహస్యం చెబుతున్నట్లుగా చెబుతున్నవి వినిపిస్తూనే ఉన్నాయి. అల్వీరా గుండెలు చెదిరిపోయాయి.
పోస్ట్‌మార్టంతో ఒళ్లంతా కోతలతో చుట్టిన తెల్లబట్టతో… ఆడ దేహం ఉన్నదిందుకేనా? అల్వీరా భయంతో గజగజలాడింది. వెంఠనే తన ఆరు నెలల పాప జోయా… కళ్ళముందు కదలాడింది. కళ్ళతో ఎతుక్కునింది దూరంగా తన భర్త అమన్ పాపను ఎత్తుకుని ఉన్నాడు. అమ్మయ్య అనుకుని నిమ్మలపడింది అల్వీరా…
అంత్యక్రియలు ముగిసాయి… ఆద్య బాబాయి ఇరవై ఏళ్ళ శ్రీనివాస్ అరెస్ట్ అయ్యాడు. వాడి ఫోన్ తీస్కుని చూసారు పోలీసులు దాన్నిండా బూతు సినిమాల వీడియోలే. మాధవితోని ఉన్నా, కళ్ళతో జోయా ఎక్కడుందో గాబరపడతా ఎతుకుతా… అగుపడితే అమ్మయాఁ అనుకుంటా ఉంది. అంత్యక్రియలకు ముందు ఒక తూరి పాప ఎంత ఎతికినా అగుపడలె… అల్వీరా మతిపోయినదాని తీరె దేవులాడింది ఏడస్తానే. చివరకు మాధవి పెద్ద తమ్ముడి రాజు చేతిలో చూసి ఉరకతా పోయి జప్పున గుంజేసుకుంది ”ఎందుకు తీసుకున్నావు మతుందా నీకు” అని అరుస్తా.
”అమన్ అన్న ఇచ్చినాడకా…” అన్నాడు రాజు బిత్తరగా. భర్త అమన్ కోసం దేవులాడితే దినాలకు వచ్చిన మాధవి అక్క కూతుళ్ళు మాట్లాడుకొంటాంటే ఫోన్‌లో ఆల్ల ఫోటోలు తీస్తన్నాడు. రక్తం మరిగిపోయింది అల్వీరాకు. ”ఏ కాఁ కర్రైఁ తుమ్… బచ్ఛీకో ఛోడ్ కోఁ ఏ షమ్‌షాన్ హైఁ, ఆద్యా కా లాశ్ అభీ నహీఁ ఉఠీ… లడ్‌కీయాఁకా పీఛేపడ్‌తే, షరమ్ నైఁ ఆతీ” (ఏం చేస్తున్నావు నువ్వు? పాపను వదిలేసి… ఇదింకా శ్మశానమే, ఆద్య శవం ఇంగా ఇక్కడ్నే పడి ఉంది నువ్వేమో అమ్మాయిలెంట పడతాన్నావు సిగ్గులేదా?) అని అరిచి ఫోన్ గుంజుకుని ఫోటోలు తీసేసింది ”వీడి ఆడపిచ్చి తగలెయ్యా” అని తిట్టుకుంటూ ”బచ్చీ కో కిస్ కో భీ నై దేనా…” అని జోయాను అమన్ కిచ్చింది కోపంతో ఎర్రబడ్డ అమన్‌ని పట్టించుకోలేదు.
”ఇంట్లో పెట్టుకుని చదివిస్తున్నందుకు నా బిడ్డనే బలి తీసుకున్నాడు” అని రవి ఏడుస్తావుంటే ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు.
మాధవిని ఆల్లమ్మా చెల్లెళ్ళు పంటకు కట్టిన దడిలా కాపాడుకున్నారు.
తన ఊరెల్లే రోజు ”అద్సరెగానీ నువ్వు తినాల… ఆద్యను మర్చిపోవాల… దైర్యంగుండాల… నే మళ్ళొస్తా” అల్వీరా మాధవి తల నిమురుతూ అంటుంటే… మాధవి అల్వీరాను ఎద మీద పడిపొయ్యి ఏడుస్తున్నది. కన్నీళ్ళతో అల్వీరా కొద్దిసేపు ఊరకే ఉంది. మాధవి ఒక్కసారి తలెత్తి అల్వీరా కళ్ళల్లోకి చూస్తా… ”బారా షహీద్ దర్గాకు తీస్కొని పో… రొట్టెల పండగ వస్తాన్నది కదా… సంతానం రొట్టెలు చేస్కొని పోదాం… నా కోసం మొక్కుకో… నీవు గిన నా ఒడి రొట్టెలతోని నింపితే నాకు మళ్ళా ఆద్య పుడతాది” అంది.
కన్నీళ్ళతో కళ్ళు మసకబారతా ఉంటే ”సరేలే… పోదాములే ఇంగ నువ్వు యాడవ బాకు”… మాధవిని ఎదకు హత్తుకుని ఓదార్చింది అల్వీరా. కన్నీళ్ళతో సాగనంపింది మాధవి తన చిన్ననాటి స్నేహితురాలు అల్‌వీరాను.
– – –
బస్సెక్కి కూర్చున్న అల్‌వీరా మనసు మనసులో లేదు. మాధవి… ఆద్య గుర్తొస్తా ఉన్నారు. మూడేళ్ళ చిన్న పాపని అట్టా చేయడానికి వాడసలు మనిషా… పశువా… వెన్ను జలదరిస్తా ఉంది. ఈ లోపల పాప జోయా ఏడుపు మొదలెట్టింది. ఆకలికి ఏడుస్తా ఉంది. ఎంత ఊర్కో పెట్టినా ఆపటం లేదు. బస్సులో పాలెట్టా ఇవ్వాలి. అల్‌వీరాకి పాప ఏడుపుకి ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు… లేడీస్ సీట్ వెనక సీట్లో కూసున్న అమాన్… కళ్ళతో గద్దించాడు పాలు తాపమని… ఇంక తప్పదని బిడ్డకు పాలు తాపసాగింది అల్‌వీరా… ఇంతలో బస్సులో ఒక ముప్పై ఏళ్ళ మగ మనిషి ఎక్కాడు. అల్‌వీరా పక్కనే నిలబడ్డాడు. కళ్ళప్పగించి అల్‌వీరాను చూడసాగాడు. జోయా పాలు తాగుతూనే మళ్ళీ రొమ్ము విడిసి కొంగు చేత్తో తీస్తా తల బయటపెట్టి మళ్ళీ తాగతా ఆటలాడుతున్నది. ఈ ఆటలో కొంగు పక్కకి పోటం రొమ్ము బయటకు కనపట్టం జరిగిపోతా ఉంది. అల్‌వీరాకి ఒకటే ఇబ్బందిగా ఉంది. పైకెల్లి ఈ పిల్లగాడు గుడ్లప్పచెప్పి చూస్తా ఉన్నాడు. వీడి కళ్ళలో కారంపడా అనుకుంటా అతనికి కనపడకుండా వీపు అతని వైపుకు తిప్పుతా అవస్థ పడుతున్నది. అల్‌వీరా అలా ముడుచుకునే కొద్దీ కళ్ళల్లో కారం పడాల్సిన వాడు మరింత ఆమె పక్కకి జరుగుతా ఉన్నాడు. ఏంది వీడిట్టా… వానమ్మ కాడ పాలెప్పుడూ తాగలా వాడు… అల్‌వీరా అమాన్‌కు వీడి పని పట్టమని చెబుదామని ఎనక్కు చూసింది. అమాన్ కూడా అక్కడ, లేడీస్ సీటు పక్కన నిలబడి రెడ్ డ్రెస్ వేస్కున్న తెల్లగా ఉన్న ఒక ఆడపిల్లని కళ్ళతో తాగేస్తున్నాడు. ఆమె నుంచి కన్ను పక్కకి తిప్పటం లేదు. ఎన్నిసార్లు చెప్పింది ”ఎందుకట్టా చూస్తావు ఆడోల్లను” అని. ”నీకు కుళ్ళు” అంటాడు ”నేనేం చూట్టంలా అమ్మీ నీకు కుళ్ళు, అనుమానం” అంటాడు. ”నువ్వు చేస్తాన్న కుళ్ళు పనికి బాధ కాదు, అసియ్యం. ఆడోల్లను అట్టా తినేసేలా చూసినావంటే కాపురం సెయ్యను” అని ఎన్నిసార్లు చెప్పినా మానితే కదా. ఇంకెక్కువ చేసాడు. అల్‌వీరా కోపంతో రగిలిపోయింది. ఇట్టా కాదని జోయాని బలవంతంగా రొమ్ము ఇడిపించి లేచి, ”అజీఁ సునో” అని పిలుస్తూ, అమాన్ దగ్గరికి వెళ్ళింది. అజీఁ… అని పిల్చింది. పలక లేదు. అమన్. ”అమాన్… సునో…” అని అర్చినంత పని చేస్తే ఉలిక్కిపడి ఇటుకేసి తిరిగాడు. ”సంభాలో బచ్చీకో” అంటూ అమాన్ చేతిలో జోయాను పెడ్తూ తిరస్కారంగా చూస్తూ మళ్ళీ తన సీటులోకి వచ్చి కూచుంది. కళ్ళలో కారం పడాల్సిన వాడి మొకాన నిరాశ కనపడ్డది. ”ఛీ చెత్తగాడు, ఈ అబ్బితో పాటు, తన మొగుడికి కూడా కళ్ళల్లో కారం పడాల్సిందే” ముందే పసిది ఆద్య గుర్తుకొస్తా ఉంది. దుఃఖం వుబికి వుబికి వస్తాంది. ఈల్లింతేనా ఈ మగాళ్లు? తన భర్త అమాన్ కూడా ఈ కారంగాడిలాంటి వాడే.
కొంచెం తెల్ల తోలున్న ఆడది కనపడినాదా చాలు సభ్యత లేకుండా చూస్తానే ఉంటాడు. తెల్లతోలు ఆడాల్లంతా ఐ కాండీలు వీడికి. అమాన్‌తో పెళ్ళిళ్ళు, ప్రయాణాలూ అంటే ఒక అసహ్యకరమైన అనుభవం తనకి… ఈ కళ్ళల్లో కారం పడాల్సిన వాడు తనతో ఏం చేస్తున్నాడో అదే అమాన్ ఇంకో ఆడదానితో చేస్తున్నాడు. అల్‌వీరా మనసు చేదెక్కిపోయింది. కళ్ళలో కారం పడాల్సిన వాడు అల్‌వీరాకు మరింత దగ్గరగా జరిగి ముందు వైపు నడుం కింది భాగాన్ని అల్‌వీరా ఎడమ భుజానికి తగిలిస్తున్నాడు. అల్‌వీరా మరింత ముడుచుకు పోతున్నది. ”జఁర సర్‌కో… దూర్ ఖడోఁ” అంటూ అర్చింది కోపంగా. వాడు కొద్దిగా దూరం జరిగాడు. పక్కనున్న ఇంకో ఆమ కూడా ”య్యోవ్ – అట్టా తగలబాక, మింద మింద పడతావేంటబ్బీ, పో అసుంట పో మగాల్లు సీట్ల కాడికి” అనింది మగాల్ల సీట్ల వైపు చేయి చూపిస్తా. వింటేనా వాడు? తన మొగుడు భర్త ఈ అరుపులకేమన్న వస్తాడేమో వీణ్ణి రెండు అంటిస్తాడేమో అని వెనక్కి చూసింది అల్‌వీరా… ఊహూ… అమన్ తనకు నచ్చిన స్త్రీని కళ్ళతో తాగేస్తున్నాడు. ఆ కళ్ళల్లో ఎంతాకలి? అతని ముఖం పెదాలు బుగ్గలు ఎర్రబడినాయి, తెల్లగా ఉంటాడేమో ఎర్రదనం కొట్టొచ్చినట్టు కనపడతా ఉంది. పగలబడి నవ్వినప్పుడో తనతో కలుస్తున్నప్పుడో కోరికతో అట్టా ఎర్రబడతాది. కళ్ళతో నవ్వుతున్నాడు ఆ రెెడ్ డ్రెస్ పిల్లని చూస్తా. బస్సులో తన భార్య తనలాంటి మరో మగాడితో ఎంత ఇబ్బంది పడుతుందో గమనించే స్థితిలో లేడు అమన్… అల్‌వీరాకు కడుపులో తిప్పింది అవమానంతో పెదాలు, గడ్డం వణికాయి. ఇంతలో ఆగిన బస్సులో ఒక్కసారి ఒక ఇరవై మంది ఎక్కారు. ఒత్తిడి ఎక్కువైంది. ”య్యోఁవ్ మింద మింద పడతావేందయ్యో… జరగవయ్యా… జరుగు ఆడాళ్ళ సీటులోంచి లెయ్యండి లెయ్యండి” అంటూ జనం ఒకరి మీద ఒకల్లు విసుక్కుంటున్నారు.
పన్లోపని కళ్ళల్లో కారం పడాల్సినవాడు అల్‌వీరాకి మరింత దగ్గరగా జరిగాడు. వాడి నడుం కింది భాగం ఆమెకి ఒత్తేయ సాగాడు. ”ఛీఛీ బేషరమ్” అంటూ కిటికీ వైపున్న ఆమె వైపు మరింత జరగసాగింది అల్‌వీరా… నిస్సహాయంగా ముందుకు పక్కల వైపు చూస్తూ ఒక్కసారి భర్త వైపు మెడ తిప్పి చూసింది. ఆమె హృదయం భగ్గుమంది. ముందే… ఈ దరిద్రుడు, తనతో ఇక్కడ కంపు పని చేస్తున్నాడు. ఇంతలో వాడు అల్‌వీరా భుజానికి తన గట్టిపడ్డ అంగాన్ని ఒత్తాడు. షాక్ కొట్టినట్లై అల్‌వీరా తలెత్తి అతన్ని చూసింది. వికారంగా నవ్వుతూన్నాడు వాడు. కారం పడకుండానే వాని కళ్ళు ఎర్రబడ్డాయి. కళ్ళెత్తి చూసిన అల్‌వీరాకు మళ్ళీ అమన్ కన్పించాడు. తనకు నచ్చిన గులాబ్ డ్రెస్ అమ్మాయి వైపు చూస్తూ ఎర్రబడ్డ కళ్ళతో పాప జోయా బుగ్గలుపై ముద్దులు పెడుతూ ఉన్నాడు. ముద్దు పెట్టి ఆపుతూ ఆమెను చూస్తూ మళ్ళీ జోయాకి ముద్దు పెడుతున్నాడు. జోయా చిరాగ్గా తన చిట్టి చేతులతో మాటి మాటికీ ముద్దులు పెడుతున్న తండ్రి మొకాన్ని తోస్తున్నది తన మొక్కాన్ని పక్కకి చేస్కుంటున్నది. గులాబీ డ్రెస్ అమ్మాయి చీదరగా నుదురు ముడుస్తా చూస్తూ కిటికీ వైపు ముఖాన్ని మరింత తిప్పుకుంటా ఉంది.
వీడిక్కడ తన అంగాన్ని తనకు తగిలించి తృప్తి పడతా ఉంటే, తన మొగుడు అక్కడ ఆయమ్మాయిని చూపులతో తినేస్తా, తన బిడ్డ అని కూడా సూడకుండా, ఆయమ్మాయికి ఇస్తున్నట్టే జోయాకు ముద్దులు ఇస్తూ మానసిక వ్యభిచారం చేసేస్తున్నాడు. అల్‌వీరా ఆసాంతం భగభగా మండిపోయింది. ఒళ్ళంతా వేడి సెగ ఎగిసింది. ఇదంతా అల్‌వీరా అరక్షణంలో చూసింది… లేచి వెంఠనే చెప్పు తీసుకుని కళ్ళలో కారం పడాల్సిన వాడిని ఎడాపెడా కుత్తా, సాలా, మరో అని అరుస్తా కొట్టింది. తన ఎడం చేత్తో వాడి చేతుల్ని పట్టి ఆపుతూ, కుడి చేత్తో వాడి నడుము కింది ఉబ్బెత్తుగా ఉన్న అంగాన్ని చెప్పుతో కొట్టింది. వాడు తట్టుకోలేక కింద పడి పోయాడు. అల్‌వీరా వాణ్ని కాలితో ఒక తన్ను తన్ని గబగబా మనుషుల్ని తప్పించుకుంటూ, అమన్ దగ్గరికి వెళ్లింది. అప్పటికే బస్ ఆగింది. అల్‌వీరాను సతాయించిన మగకుక్క లేచి బస్ దిగి పారిపోయింది. బస్సు ముందు భాగంలో జరుగుతున్న సంఘటన అమన్ గ్రహింపులో ఉంటే కదా?
అల్‌వీరా పాప జోయాను రెండు చేతులతో పాము నోట్లో పడబోతున్న చిన్ని కోడిపిల్లను అదాటున అందుకున్నట్లు ఒడిసి పట్టుకుని… ”క్యాఁ కర్రైఁ బేటీహైఁ తుమారీ… అబ్బీ మరేసో ఆద్యా కో దేఖ్ఖే ఆఁయే. ఉన్ కే సగీ చాచా ఖరాబ్ కరెతో మరీ హైఁ ఓ బచ్చీ. తూ బాప్ హోకో… ఓ ఔరత్‌కో గందా నజర్‌సే దేఖ్‌తే హుయే ఖుద్‌కీ బేటికో చుమ్మాఁ దేరైఁ థూ… మర్ జాఁవ్…” (ఏం చేస్తున్నావు నీ బిడ్డ ఇది. ఇప్పుడే కదా చచ్చిపోయిన ఆద్యను చూసొచ్చిందీ? ఆద్య సొంత చిన్నాయ్న పాడు చేస్తేనే కదా ఆ పాప చచ్చిపోయింది? నువు జోయా కన్న తండ్రివి అయ్యి కూడా, ఆ ఆడదాన్ని చెడ్డగా చూస్తూ కన్న బిడ్డకు ముద్దులు పెడుతన్నావు థూ నీ జన్మ సెడిపోనూ… పోయి చావరాదూ?) అంటూ అమన్ పైన థూ అని తుపుక్కున ఊసి చెంప పగలగొట్టింది. దేహమంతా కోపంతో ఒణికిపోతుంటే, గులాబీ డ్రెస్ అమ్మాయి వైపు తిరిగి ”వీడిట్టా ఖంపు పని చేస్తా ఉంటే చెంప పగలగొట్టక అట్టా బరిస్తావేంటమ్మాయ్” కోపంగా అంటూ జోయాను గుండెలకు హత్తుకుంటూ అల్‌వీరా బస్ దిగిపోయింది. అమన్‌ను బస్సులోనే ఇడ్సిపెట్టి.
అల్వీరా ఇంటికెళ్ళీ వెళ్ళగానే జోయాకు తలారా స్నానం చేయించింది. భర్త ముద్దుపెట్టిన జోయా బుగ్గలను సబ్బుతో… ధారగా కారుతున్న కన్నీళ్ళతో తోమి, తోమి రుద్దింది.
ఎందుకో ఆద్యకు చివరి స్నానం పోస్తున్న మాధవి మతికి వస్తుంటే అల్‌వీరాకు కళ్ళల్లో కన్నీళ్ళ మత్తడి తెగిపోయింది. ఏడుస్తున్న జోయాను పక్కనే కూర్చోబెట్టుకుని తన నెత్తిమీద బకెట్ల కొద్దీ నీళ్ళు గుమ్మరించుకోసాగింది. కారం పడకుండానే కళ్ళెర్రబర్చుకున్న వాడి మదమెక్కిన అంగం తన ఎడం చేతి బుజం కింద ఎట్టా తగిలించాడో తల్చు తల్చుకొనీ… అసియ్యంతో పీచుకి సబ్బు రాసి బుజం కింద అశుద్దాన్ని ఒదిలించుకోవాలన్నంత కసిగా రుద్దసాగింది. అలా ఐదు నిమిషాలు రుద్దుతానే ఉండింది. రక్తం కారి భగ్గున మండింది. కళ్ళ నీళ్ళు కారతా ఉంటే ‘అమ్మీఁ’ అని అరిచింది. ‘అల్లా మాఫ్ కరోఁ’ అనుకుంటూ వల వలా ఏడ్చింది.
ఈ సారి స్వర్ణాల చెరువులో సంతానం రొట్టెల వాయినం ఇస్తున్నపుడు మాధవికి ఆడపిల్ల ఒద్దు మగపిల్లోన్నే కోరాల అనుకుంది. దర్గా కళ్ళ ముందు కనపడ్డది.
మైకులో మౌలా పాడిన సూఫీ పాట గుర్తుకొచ్చింది.
ఏ జమీ జబ్ న థీ, ఏ జఁహా జబ్ న థా…
చాంద్ సూరజ్ న థే, ఆఁశ్‌మా జబ్ న థా
తబ్ న థా కుచ్ యహాఁ,
థా మగర్ తూఁహి తూఁ
అల్లాహూ… అల్లాహూ… వల్లాహూఁఁ
హూఁ… హూఁ… హూఁ…
కన్నీళ్ళు ధారగా కారుతా ఉంటే… అల్వీరా ‘యాఁ అల్లా’ అని రెండు చేతులూ పైకి లేపి మోర పై కెత్తి అల్లాని పిలిచింది. ఆ పిలుపులో గొంతు కోసేసాక నొప్పి భరించలేక పోయే ప్రాణం పట్టుకోటానికి పక్షి చేసిన చివరి పెనుకేక ఆ స్నానాల గదిలో ప్రతిధ్వనించింది. ”అవును యాఁ అల్లా… ఈ లోకంలో ఎవరూ ఉండక మునుపు… ఈ లోకం శూన్యంగా ఎట్టా ఉండేదో అట్టా.. మళ్ళీ చేసెయ్యి.. ఆడాల్ల పక్కన ఈ మగాల్లు లేకుండా చేసెయ్యి… ఎవరూ ఉండద్దు తన మొగుడు, ఆద్య చిన్నాయ్నా, బస్సులో కారం కళ్ళవాడూ… పసిపిలకాయల్ని, ఆడదాన్ని కళ్ళతో, చేతులతో ఖరాబు చేసే తమామ్ గలీజు మగాల్లు ఎవరూ లేకుండా సెయ్యి అల్లా ఈ తూరి ఈ కోరిక ఎత్తుకుని నీ దర్గాలో రొట్టె ఇడుస్తా” అల్‌వీరా మనసులో ఆవేశంగా అనుకొంటూ ఇరవయ్యో బక్కెట్టు నీళ్ళు నెత్తిమీద కుమ్మరించుకున్నది.
*
|
ఇప్పటి పరిస్థితిని తెలియచేస్తూ కదిలించేలా రాశారు గీతాంజలి గారు.
నిజమే “ఈ లోకం శూన్యంగా ఎట్టా ఉండేదో అట్టా.. మళ్ళీ చేసెయ్యి.. ఆడాల్ల పక్కన ఈ మగాల్లు లేకుండా చేసెయ్యి… ఎవరూ ఉండద్దు తన మొగుడు, ఆద్య చిన్నాయ్నా, బస్సులో కారం కళ్ళవాడూ… పసిపిలకాయల్ని, ఆడదాన్ని కళ్ళతో, చేతులతో ఖరాబు చేసే తమామ్ గలీజు మగాల్లు ఎవరూ లేకుండా సెయ్యి అల్లా ఈ తూరి ఈ కోరిక ఎత్తుకుని నీ దర్గాలో రొట్టె ఇడుస్తా” అల్‌వీరా మనసులో ఆవేశంగా అనుకొంటూ ఇరవయ్యో బక్కెట్టు నీళ్ళు నెత్తిమీద కుమ్మరించుకున్నది.”