నీ చెయ్యి తాకీ తాకంగనే
బొగ్గునాల బొగుడలు
రక్కీస రాళ్ళ దిబ్బలు
తొండలు గుడ్లు వెట్టని జాగలు
నిండార్గ తలపెయ్యికి వోసుకుంటయి
నున్నగ నెత్తిదూసి బొట్టు వెట్టుకొని
చిలుక పచ్చ చీరను సుట్టుకుంటయి
నీ చేతివేళ్ళ గోటి మొనలు
కొచ్చెటి నాగటి కర్రులు కాంగనే
ఖుష్కి నిలువెల్లా కుంకుమ పొడైతది
తరి తనువెల్లా అంబలంబలైతది
నీ పుట్టువడి యిగురంల
మడికట్టుల జమ్ము రొప్పినా
తోటకు తౌటం బెట్టినా
పెరటికి బోజలు గొట్టినా
పత్తికి అచ్చు కట్టినా
కొలబద్ద వట్టి గీతలు కొట్టిందానికంటే
బొత్తిగ సక్కదనాల బొమ్మకడుతది
ఇవుతలి కొసకెల్లి బాణమిడిత్తే
అవుతలి కొసకు తాకుద్ది సూటిగ
నువ్వంగి నడుమెత్తనప్పుడు
నీ పెయ్యి పెయ్యంతా
కారు మబ్బయి వరద గూడేత్తది
న్యాలతల్లి తనువు తనువంతా
గుర్రం మూతులయి
మండుతున్న ఎండ పుండ్లకు
సల్లటి ఎన్నీలయి మలామద్దుతది
పిడుస గట్టుక పోయిన నాల్కెలకైతే
పిడాత పాణం లేచస్తది
నీ చేతి గుణమో
నీ చేయి చలువనో తెల్వదు గానీ
నీ నీడ సోకీ సోకంగనే
మన్ను అన్నమయి అరుసుకుంటది
సబ్బండ జీవరాసిని సకులం సవరిత్తది
గిట్టుబాటు గొట్టెకాయైన తావుల్ల
కనీస మద్దతుకు దస్త్రం దస్కతుండదు
పుట్లకు పుట్లు పండిన దినుసు
దిగులు మొగులయి
దుక్కపు రాగమెత్తుకుంటది
పాత పుండ్ల సలపరింతల నడుమ
మూడు కొత్త రాచపుండ్ల మంట రాజుకుంటది
ఇగనన్నా!
లడాయి రావమెత్తుకుందామా?
ఢిల్లీ పానాదుల్లా డిల్లెం కల్లెం ఆడుదాం
సత్తే మట్టికి ఎరువైదాం
బతికితే సేనుకు సత్తువైదాం.
(అమర రైతులకు జోహార్లతో…)
*
Thank you Afsar sir
ముగింపు బాగుంది అన్నా
Thank you Anna