దిక్కు తెలీని పక్షులు

“ఇంకేం దయ మామ్మా..రేపట్నుంచి షాపు గవర్నమెంటు తీసేసుకుంటది కదా..” అన్నా నేను

ఎంకటమ్మ చెప్పిన ఎత :

” ఏయ్యా..వచ్చా..మాయ్యే..నిన్ను ఇబ్బంది పెట్టినట్టున్నా..ఏం చేయనయ్యా చెప్పు..నిన్నట్నుండి ఆయాసం..రొప్పు..ఊపిరి తిరగడం లేదు..అడుగు పడడంలేదు..కూచుంటే లెగలేకపోతన్నా..లెగిస్తే కూచోలేకపోతున్నా..యాడ..ఇదివరకట్లా చలాగ్గా చెయ్యలేకపోతన్నా..ఆఁ..కనకయ్య గుడ్ల డబ్బులిచ్చాడా..డబ్బులియ్యడానికి ఏందో మనసొప్పదు మడిసికి..అబ్బో..ఇయ్యాలెవడో చచ్చాడే.. సరిగ్గానే ఇచ్చాడు..ఎప్పడుజూసినా గుడ్లు విరిగిపోయాయని డబ్బులు దిగ్గోసేవోడు..అమ్మినందుకు మూడ్నాలుగు గుడ్లు మింగేసేవోడు..ఇచిత్రమే.. రాసిపెట్టుకోవాలీ రోజు..గుబుల్దిరినరోజు బాగానే వుంటాడ్లే గానీ..ఆడి గుణవే..గుడిసేటిది..ఆ..అయినా మన బంగారం మంచిదయితే ఒకళ్లని అనుకునేదేముంది..అదిగో నీకు తెలుసుగా నా కూతురు..ఈడ పుల్ల ఆడ బెట్టదు..పంచలో పడుండే ముసల్దాన్తో అస్తమానం వంతులు..అదేవంటే ఉద్యోగం సద్యోగం లేనోడికిచ్చి నా గొంతు కోసిందో అని ఎక్కిన గడపకాడల్లా నా మీద పడి ఏడవటం..పెళ్లి చేసి అత్తారింటికి పంపిన తర్వాత మంచయినా చెడయినా ఆడనే వుండాల కదా..ఏదొకటి చేసుకొని కుటుంబరాన్ని ఎళ్లదీసుకోవాల కదా..అబ్బే..ఏది చిన్నది జరిగినా పీసిన పిత్తల్లే ఈడకి పరిగెత్తుకొచ్చి నా ఎదానబడితే ఎట్టా.. ఒక్కదాన్నీ ఎట్ట చచ్చేది..ఇంటో ఖాళీగా కూచోని గుడ్లు పెట్టకపోతే.. ఆ గుడ్లు తీస్కెళ్లి బ్రాందీషాపుకాడ ఇచ్చొస్తే ఏం..ఈ మహారాణి గారి తలమీద కిరీటం నేలరాలిపోద్దా ఏంది.. అహ..నువ్వు చావు..బతుకు..ఏ గంగలో నన్నా దూకు.. గంగా ఎళ్లనంటే ఎళ్లనని మొండికేసిద్ది.. అమ్మగారి పరువు పొయ్యిద్దంట..నలుగుర్లో నగుబాటంట..ఇసుమంత పనీపాట లేకుండా దాని మొగుడు ఇల్లరికం అల్లుడ్లాగా పడి తింటావుంటే యాడబోయిందో దీని పనికిమాలిన పరువు..మళ్లా ఇద్దరికీ ముప్పైమూడూ ముడ్డికాడకి తెచ్చి పెట్టాలి.. ఎప్పుడైనా తప్పుజారి పుసుక్కున ఒక మాటన్నావా..ఇక జూస్కో నాయనా సోమీ..ఆర్రోజులు అలిగి కూచోని..ఇంక ఇరిగినేలు మీద ఉచ్ఛ కూడా పొయ్యదు..ఏద్దప్పినా మనకి తప్పదు గదా..ఒక్కదాన్ని జేస్తే నలుగురు తినాల..ఏదో నాలుగైదు బస్తాల వడ్లుండబట్టి..తులశమ్మ బ్రాందీ షాపులో గుడ్లేయబట్టి.. నాలుగేల్లు అట్టా నోట్టోకెళ్తున్నాయి..ఉరిమి ఉరిమి మంగళం మీద బడిందని ఉన్నట్టుండి ఆ తులశమ్మకి కన్ను నా గుడ్ల మీద పడింది..నువ్వే చెప్పయ్యా..ఆ తులశమ్మ కేమి..షాపు అద్దె వస్తందయ్యే.. కొడుకుకి అందులో డూటీ అయ్యే..కోడలికి ఉద్దోగమాయే..ఇంకేంది గాడు..అసలికి నాకు ఇల్లు గడవటం లేదే ..షాపులో గుడ్లు పెట్టుకుంటానే అని అంటే తులశమ్మేగా నన్ను పెట్టుకోమంది..నాలుగు నెలలు అట్టా అయినియో లేదో..నా గుడ్ల యాపారం చూసి ఏం ఎర్ర బుట్టిందో ఏందో గానీ..నేన్గూడా పెట్టుకుంటా అని అడ్డంగా కూచుందయ్యా తులశమ్మ ఓ రోజు.అట్టజేసి ఇట్టజేసి చెరో పదేను రోజులనుకున్నాం.. అనుకున్నామా..ఒక్క రెణ్ణెళ్లు గూడా గడవలా..ఈసారి షాపులో గుమస్తా కనకయ్య.. ఆడికేం రంది బుట్టిందో గాని ఆడు కూడా వున్నట్టుండి ‘ఠాఠ్..పొద్దున్నుంచి రేత్రి దాక కష్టపడి అమ్మేది నేను..మూట కట్టుకునేది మీరా..కుదర్దు..నేనూ అమ్ముకుంటా’ అని పితలాటకం పెట్టడయ్యా.. ఎంతమంది ఎంత చెప్పినా కుదర్దని మంకుపట్టు మీద కూచున్నాడు.గుడ్లు అమ్మాలంటే కనకయ్య లేందే పని జరగదయ్యే.ఇంకేం చేస్తాం..ముగ్గురం తలో పది రోజులు ఏసుకున్నాం..అవిడియా నాదయినా రోజులు నాయి కాదయ్యా..ఏం చేస్తాం..మంచం వున్నంత వరకు ముడుక్కోవడమే..అయినా ఇదంతా నీకు తెల్సిన కతే అనుకో..ఎవరో ఒకరికి చెప్పుకుంటే కడుపులో బాద తీరిద్దని ఇట్టా నీకు నా సొద చెప్పుకుంటన్నా.. ఇయిగో.. గుడ్లు.. కారంజల్లి బాగా ఏయించా..పొద్దపొద్దాక ఏం వస్తావులే అని మొత్తం ఇస్తన్నా..లెక్కేసుకో..ఒక్క గుడ్డూ చితకలా..జాగ్రత్త..”

గుడ్లున్న స్టీలు టిపినీ చేతిలోకి తీసుకున్నా.

విషయం చెప్పాలా..వద్దా..

చెప్పకపోతే ఎట్టా..?

ఒక్క నిమిషం కొట్టుకులాడా.

ఎంకటాం పిన్ని వంక చూసా.

ఇదివరకు కల్లు వున్నప్పుడు..సారా వున్నప్పుడు.. మడిసి దీమాగా ఎట్టుండేది.. ఇప్పుడు మొగుడూ పోయి..కల్లూ పోయి..సారా పోయి.. ఆ రోజులు పోయి ఎట్టయిపోయింది..ఒక్కత్తీ కాపరాన్ని మోసి మోసి డస్సి మడిసి వంగిపొయ్యింది..పొయ్యి దగ్గర వుండీ వుండీ ఎండుపుల్లయిపోయింది. బాదలపొగలు కళ్లల్లో జీవమార్పేస్తే.. బాధ్యతలు మొకంలో కళని కమ్మేసినియి. ఎండుకట్టెకు చీర చుట్టినట్టు వుందీ అంటే వుందంతే..

షాపు కాడ విషయాలు..ఊర్లో విషయాలు ఎంకటాం పిన్నికి తెలవదు కదా..అసలుకే ఒంటో బాలేని ఆయాసం మడిసి.. పదిరోజుల మించి నేనేగా గుడ్లు తీసుకెళ్తన్నా.

“పిన్నీ..ఇంక ఇదే లాస్టు గుడ్లు తీసుకెళ్లేది.”

“అవున్లేయ్యా..నా వంతు ఈరోజుతో అయిపోయిద్ది.”

“అది కాదు పిన్నీ..ఈ రోజుతో బ్రాందీ షాపు కొత్త గవర్నమెంటు తీసేసుకుంటంది..ఇంక మనందరి పని అయిపోయినట్టే.”

“అదేంది..అట్టెట్టయ్యా..మరి మా గతేంది?”బేజారెత్తినట్టు ఎంకటాం పిన్ని అంది.

“అంతే పిన్నీ..షాపంతా ఇంక గవర్నమెంటోళ్లే నడుపుతా వుంటారంట..మనల్నింక రానీరంట..అంతా వాళ్లేనంట..”

ఇంక నా నోట మాట పెగల్లేదు. ఎంకటాం పిన్నాం బతుకు భయం బీటలిచ్చిన మొకంలోకి చూసే ధైయిర్నమూ రాలేదు.

అంతే.. గుండె నీరయిపోతంటే ఆడ వుండలేక..గబగబా ఎనక్కి తిరిగి వచ్చేసా.

**           **

తులసమ్మ తప్పు లేదు

“అంటారంటారు..ఏవుందీ..నోరేగా..ఎట్ట తిరిగితే అట్టంటారు..ఇంటో జరిగేదంతా సొయంగా కళ్లతో చూసినట్టే భలే మాట్టాడతారు..కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుద్దని..ఇంటో జరిగేయన్నీ ఊరక బయటేసుకుంటావా..నువు జెప్పయ్యా..నాకంత వైబోగంగా ఈడ జరగతా వుంటే..ఏరేగా వొండుకోవాల్సిన గతేంది చెప్పు నాకు..నేను తినే గుప్పెడు బియ్యానికి ఇన్ని ఆపసోపాలు అవసరమాయ్యా నాకు..పైకి చూత్తే కొడుకూ కోడలు ఇద్దరూ రెండు చేతులా సంపాయిస్తున్నారు..తులశమ్మకేంది..తడిగుడ్డేసుకు పొణుకుంటది అనుకుంటారందరూ..అంత నా అత్తరికమే సాగితే..ఆ బ్రాందీషాపులో గుడ్లమ్ముకోవాల్సిన కర్మ నాకేంది..అహ..నాకేందంట..కొడుకు వున్నాడన్న మాటే గానీ ఏం లాభం..తల్లి అల్లం..పెళ్లాం బెల్లం అయిపోయింది.. ఆ పెళ్లాం లేంది చూసి అమ్మా ఎట్టున్నా అంటాడు ఎప్పుడైనా.. అంతే..ఖర్చులేని యవారం గదా..అమ్మా ఎట్టున్నావు.. ఏళకింత తింటన్నావా లేదా..ఒంటో బాగుంటుందా లేదా..అని మంచీసెబ్బర చూసేదేవన్నా వుందా అంటే అది లేదు..ఎప్పుడైనా నోరు తెరిచి మందూమాకు తెచ్చుకుంటా డబ్బులివ్వరా అంటే చూద్దాంలే అంటాడు..ఏంది చూసేది..చింతకాయ తొక్కు..పెళ్లానికి తెలిసిందంటే పచ్చడి కింద తొక్కొద్ది.. అదీ అసలు సంగతి..మొగుడు లేకపోయినా చిన్నప్పటి నుంచి అష్టకష్టాలు పడి ఒకళ్లకాడ చెయ్యి చాచకుండా కొడుకుని పెంచుకొచ్చానే..అయినకాడకి చదివించానే.. ఇంటిని నిలబెట్టానే అని లేదు..అయినా అయ్యన్నీ ఇప్పుడెవరిక్కావాలి.. ఎవరి రంది ఆళ్లది..ఇంటో ఒక పెద్దంతరం లేదు..చిన్నంతరం లేదు..దీనికి ఉద్దోగం రాకముందే ఒక రకంగా వుండేది..ఒకటి కాకపోయినా ఒక మాటయినా వినేది..ఉద్దోగం వచ్చింది..ఇగ జూస్కో.. ఇంటి పెత్తనం అంతా కొంగుక్కట్టి..మొగుడ్నక్కడ కూచోబెట్టింది.ఎచ్చాల అల్మారాకి తాళాం ఏసుకెళ్తే..ఏం బెట్టుకొని తింటాం చెప్పయ్యా..అదేమని అడిగితే ఇష్టమైతే వుండండి…కష్టమైతే మీది మీరు వొండుకోండని ఇదిలిచ్చిందయ్యా నన్ను..నేనేవన్నా తప్పన్నానా..కాలే కడుపుకి పట్టెడన్నమేగా అడిగాను..నా కొడుకేవన్నా మాట్టాడతాడేమోనని చూసా గానీ..బెల్లం కొట్టిన రాయిలా మిడిగుడ్లేసుకొని చూత్తాడే తప్ప..అదేంది అమ్మనట్టా అంటావని ఒక్క మాటాపలుకూ లేదు. కొడుకుకి కూడా అంత కానిదాన్నయ్యానా..అంత ఎక్కువయిపోయానా.. మొగుడూ మొద్దూ లేకపోయినా..ఏనాడూ ఒకరి పంచలకెళ్లి దేహీ అనలా నేను..అంత రోషం చచ్చి వుండలా నేను..ఈళ్లకాడ చెయ్యి చాచకుండా నా బతుకు నేను బతకలేనా ఏందీ..అందుకే నా కుండాసట్టీ నేను విడిగా తెచ్చి వొండుకుంటన్నా..అందుకే ఇష్టం లేకపోయినా పంతం కోసం మనసు చంపుకొని ఎంకటమ్మ గుడ్లు అమ్మకంలో వంతుకెళ్లా.నన్ను చూసి కనకయ్యగాడికీ ఏం మాయరోగం పుట్టిందో..నాక్కూడా ఒక వంతని ఎదురుమళ్లుకున్నాడు.అందరూ తెలివిగల్లోల్లే..ఇంకేం చేత్తాం..ముగ్గురికీ మూడు బాగాలయింది.. నువ్వు అడ్డం రాడంవల్లే ఈ పెంటంతా అని ఎంకటమ్మ నన్ను చానాళ్లు సాదించింది..సర్లే..ఏ బియ్యపు గింజ మీద ఎవడి పేరు రాసుందో ఏందో..దక్కినంతవరకే దక్కుదల..ఇంక ఆ పైయోడి దయ..”

“ఇంకేం దయ మామ్మా..రేపట్నుంచి షాపు గవర్నమెంటు తీసేసుకుంటది కదా..” అన్నా నేను

“మరి మన గుడ్లు..?”

“గుడ్లుల్లేవు..లడ్లులేవు..అంతా గవర్నమెంటోళ్లే నడుపుతారంటా..పాతోళ్లని ఎవర్నీ వుంచరంటా..అంతా వాళ్లోల్లే..కొత్తోళ్లు..”

“అయ్యో..మరెట్టా..నా కొడుక్కయినా వుండదా డూటీ.. అయ్యో..ఇప్పుడెట్టా..?” ఇట్టాంటప్పుడు కూడా నా సంగతెట్టా అనుకోని తులశమ్మ మామ్మతో ఇంక మరి నేనేం మాట్టాడలా..

మామ్మ మొకంలో తారట్లాడుతున్న దిగుల్లో దిగబడిపోయా.

తులశమ్మ మామ్మకి కీళ్లనొప్పులు..అంతకు మించి కొడుకూకోడలితో తలనొప్పులు..ఈ మధ్య సరిగా నాలుగడుగులు ఎయ్యాలన్నా మడిసి సాయం లేకపోతే కనాకష్టం అయిపోతంది.డాక్టరు ఆపరేషను చెయ్యాలన్నాడు. కొడుకు కాలయాపన చేస్తన్నాడు.

ఎంత కాదనుకున్నా..అమ్మలంతా అంతేనేమో..

పిల్లల మొకాల్లో తళుకు కోసం అమాస చందమామలయే అమ్మలు..

**           **

కనకయ్యదీ ఒక కత

“అవును మరి..కష్టపడేవోడి సట్టిలో మట్టి కొడతారా ఏంది..? పొద్దున డూటీ ఎక్కినకాడ్నుంచి ఆ గుడ్లు ఒక పక్క అమ్ముతావుండాల..గబుక్కున ఎవడన్నా మన కళ్లు గప్పి గుడ్డు గుటుక్కున మింగకుండా చూసుకోవాలా..ఇంకో పక్క వచ్చినోళ్లకి మందు పోసి అందిస్తా వుండాలా..రేత్రి షాపు కట్టేసేటప్పుడు గుడ్ల లెక్క తగ్గిందనుకో..ఎవడు కట్టాల..చచ్చినట్టు నేనే కట్టాల..అప్పు తీసుకున్నోడు ఎగదెంగాడనుకో..ఎవడు కట్టాల..అదీ చచ్చినట్టు నేనేగా..ఇంత కష్టపడి చేసి తీసుకెళ్లక తీసుకెళ్లక రెండు గుడ్లు ఇంటికి పొట్లం తీసుకెళ్లామనుకో..ఆ ఎంకటమ్మా తులశమ్మా.. ఒంటికాలి మీద రావందాడి జేస్తారు..అమ్మో.. ఆళ్ల నోట్టో నోరు పెట్టి బతక్కగలమా..అరే..వీడు పాపం పిల్లాజెల్లా వున్నోడే..రెక్కలుముక్కలు చేసుకుంటన్నాడే.. ఏం తింటన్నాడో..ఎక్కడ వుంటన్నాడో అని ఒక్కళ్లకి వుందాయ్యా బాబు..ఎవడి స్వార్థం వాడిది..ఎవడి సంపాదన వాడిది..పదేళ్ల బట్టి షాపుల్లో గుమస్తా చేస్తన్నా…నా కళ్ల ముందు గుమస్తాలుగా వచ్చిన పిల్లలు..బచ్చాలు..చూస్తండగానే డూటీలెక్కిరి.రేత్రుళ్లు సీసా మూతలు లేపుతుంటిరి.సరుకు మారుస్తుంటిరి. రోజుకి వెయ్యో..రెండో జేబిలో ఏసుకుంటుంటిరి.పన్జేసే మాబోటోళ్లకి మాత్రం అడుగూబొడుగూ ఇదిలిస్తంటరి. ఏం న్యాయం చెప్పు..ఇక్కడేదో ఇరగబడి సంపాయిచ్చుకుంటన్నాం అని ఆ ఇచ్చే జీతంకి సరిగ్గా ఇంటోకి ఎచ్చాలు కూడా రావు..మరేం చెయ్యమంటా.. ఇంటో పెళ్లికొచ్చిన కూతురుంది..చదువుకుంటంది..దాన్ని చదివిపియ్యాల..పెళ్లి చెయ్యాల..ఈ టయాన మా ఇంటాడది కూడా లేదు..టైపార్టీ జొరమొచ్చి చచ్చిపోయింది.. పోనీ అదున్నా బాగుణ్ణు..పిల్లదాని మంచీసెబ్బర చూసుకునేది..నాక్కూడా పాణం బాగుంటంలా..సుగరొచ్చింది..కాలుకి పుండయ్యి సంవత్సరం..మందులు వాడతన్నా ఈ మందు దెబ్బకి తగ్గడంలా.. కాలు ఒకటే తీపి..ఎందుకయినా మంచిది నేనున్నప్పుడే పిల్లదానికి దాని మేనమామనిచ్చి పెళ్లి చేద్దామనుకున్నాం.. ఆ రోజు పెట్టుపోతలు పెద్దగా ఏం మాట్టాడుకోలేదు గానీ.. ఇప్పుడో చిక్కొచ్చి పడింది.. మునుపంటే మా అల్లుడు ఖాళీగ వుండేవోడు.. ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంటులో అదేదో వాలంటీరు ఉద్దోగం వొచ్చిందంట..ఇప్పుడు ఆడి ఇంటో వాళ్లు సన్నగా గొణుగుతున్నారంట..పిల్లోడికి ఏదన్నా ఇయ్యకపోతే ఎట్టా అని.. వాళ్లడిగింది మనం ఇయ్యకపోయినా బాబు.. మనకు చేతనయిందనా ఇవ్వాలి గదా .. ఇయ్యాలంటే ఏదొకటి చెయ్యాలిగా బాబు..”

“ఇంకేం చేస్తావు బాబాయ్..రేపటి నుండి షాపు గవర్నమెంటుకి ఎళిపోతంటే..”తెలుసన్నట్టు

కాసేపు కనకయ్య ఏం మాట్టడకుండా మౌనంగా అయిపోయాడు..

” చూసావా బాబు..ఇచిత్రం..”

“ఏంది బాబాయ్..”అన్నా

” అంతకు ముందు నా అల్లుడ్ని ఏ ఉద్దోగం లేదని లోకువగా మాట్టాడాం.ఇప్పుడు వాడికొచ్చింది.నాకు పోయ్యిద్ది..అప్పుడు ఆళ్ల ముందు మన మొకం చెల్లొద్దూ..”

” ఏంది బాబాయ్..ఇది కాకపోతే ఇంకోటి..కష్టం చేసుకునే వాళ్లకి యాడైతే ఏంది?”

” ఈ పని కాకపోతే నాకు ఇంకో పని రాదు బాబు.. ఇదలవాటయిపోయింది..ఇప్పటికిప్పుడు ఇంకో పనంటే…ఈ వయసులో నా వల్లవ్వుద్దా”చేతులు నలుపుకంటా చూపు ఎక్కడో నిలిపేసిన కనకయ్య మాటల్లో శూన్యం వినిపించింది.

ఇద్దరి మధ్య ఆడ నెమ్మదిగా నిశబ్దం నిండింది.

ఆ నిశబ్దం…భరించలేని నిశబ్దం…

**           **

అయినోళ్లెవరు…

నా పేరు సూరిబాబు..నాకు తెలిసి అయినోళ్లంటూ నాకు ఎవరూ లేరు.గవర్నమెంటు హాస్టల్లో పది దాకా చదివి..ఇంక చదవ బుద్ధి గాక వదిలేసి..ఏదోక పని చేత్తా..ఎక్కడెక్కడో తిరిగి తిరిగి చివరికి చీరాలొచ్చి..ఈడ ఒక బార్లో బాయ్ గా కుదురుకున్నా..

మల్లేశ్వర్రావు సారు నాకు ఈడే పరిచయం..బార్లో మందు.. అదే.. సరుకు వ్యాన్లో సప్లై చేస్తా వుండేవోడు. నన్ను చూసి పలకరింపుగా నవ్వతా వుండేవోడు. అప్పుడప్పుడు నేను కూడా సరుకు వచ్చినప్పుడు లోడు దించి లోపల పెడతా వుండేవోణ్ణి..నాకు చదువొచ్చని తెలుసుకొని.. సరుకు షీటు చెకింగ్ చెయ్యడం..లోడింగ్.. అన్లోడింగ్ నేర్పించాడు సారు..షీటు చూట్టం అలవాటయింది.. సరిగానే చేస్తున్నాడు అనుకున్నాక.. సరుకు షీటు నాకిచ్చి చూడమని.. కులాసాగ సిగరెట్ తాగతా కూచుని చూసేవోడు మల్లేశ్వర్రావు సారు.

నాకు డ్రైవింగంటే మా చెడ్డ ఇష్టం..కాబట్టి అట్టట్ట మెల్లగా వ్యాన్ డ్రైవార్లని బతిమిలాడుకొని డ్రైవింగు నేర్చుకున్నా. సరుకు వ్యాను వచ్చినప్పుడు రివర్సు చేసి పెడతా..తోలి తోలి డ్రైవర్లు విసుగుతో వున్నప్పుడు లోకలు షాపుల్లో సరుకు దింపడానికి మల్లేశ్వర్రావు సారుకి వ్యాను తోలిపెడతా వుండేవోణ్ణి.

మల్లేశ్వర్రావు సారు నెమ్మది మీద ఇంకో వ్యాను తీస్కొని..డ్రైవరుగా వస్తావా అని నన్ను పిలిచాడు.ఎగిరి గంతేసి వస్తానన్నా..సరేనని డ్రైవింగ్ లైసెన్సు కూడా ఇప్పించి డ్రైవరుని చేసి..అప్పట్నుంచి సొంత మడిసిలా చూసుకున్నాడు.

అదిగో అట్టా తులశమ్మ మామ్మ ఇంటో వుండే బ్రాందీ షాపుకి సరుకు దించుతా వున్నప్పుడు ఆడ పరిచయం అయినోళ్లే తులసమ్మ మామ్మ..ఎంకటాం పిన్నాం..కనకయ్య బాబాయినూ..ఏం పని లేనప్పుడు ముసిలోళ్లిద్దరికీ బజార్నుండి కోడిగుడ్లు..నూనె..కారం తెచ్చిస్తా ఉడత సాయం చేస్తుండేవాణ్ణి..వోళ్లకీ వాళ్ల మంచీసెబ్బర చెప్పుకోవడానికి ఒక మడిసి కావాల్సి వచ్చినప్పుడు .. వాటంగా చెప్పుకోవడానికి నేనున్నాను కాబట్టి నాతో చెప్పేవారు.

ఏ మనిషికయినా మనసులో మాట చెప్పుకోడానికి ఒక మనిషంటూ వుండాలి. ఎతలో కతలో..విని కన్నీళ్లు తుడిచి.. భుజం తట్టి ఓదార్చే ఒక మాట చెప్పేవాళ్లుండాలి.మడిసిని బట్టి..మడిసున్న పరిస్థితిని బట్టి ఆళ్లకి సయించేట్టు మాట్టాడుతుండాలి.

ఎప్పుడైనా అట్టా మల్లేశ్వర్రావు సారు కాడ అట్టా మాట్టడానేవో..సారు కూడా ఎప్పుడైనా మంచి మందుమీదున్నప్పుడు తన బాదల చిట్టా విప్పేటోడు.

అంతలో రాష్ట్రంలో పాత గవర్నమెంటు పోయి కొత్త గవర్నమెంటు వచ్చింది.లిక్కరు పాలసీ మారింది.పాత షాపులు కొన్ని గవర్నమెంటు నడిపే షాపులుగా మారాయి.అంతేనా.. కొందరి నుదుటి రాతలు కూడా ఆటోమేటిగ్గా మారిపోయాయి..

కొత్త గవర్నమెంటు పాత షాపుల్తో వున్న ఒప్పందాలన్నీ రద్దు చెయ్యడంతో మల్లేశ్వర్రావు సారు సరుకు వ్యాన్లు పని లేక ఆగిపోయాయి.మిగతా షాపులకన్నా సరుకు ఏద్దామంటే..బార్ల పాలసీ ఏందో అర్థం కాక ఓనర్లంతా అయోమయం పరిస్థితి.

ఏం ఆగినా వ్యాన్ల కిస్తీలు ఆగేది లేదు.ఇప్పుడల్లా పరిస్థితి బాగుపడేట్టు లేదు. రెండు నెలలు చూసి..ఇక లాభం లేదని..ఒక వ్యాను అమ్మేసి బ్యాంకు అప్పులు .. బయట అప్పులు తీర్చేసాడు మల్లేశ్వర్రావు సారు.. వున్నా ఇంకో వ్యాను ఫైనాన్సు వాడు బాకీ కింద లాక్కెల్లాడు.ఆ తర్వాత ఎందుకో మల్లేశ్వర్రావు సారు ఊర్లో అవుపడలా.

కొన్నాళ్లు చూసి చూసి యాడా అవుపడకపోతే ఇంక సారు ఇంటికాడకెళ్లా.. ఆడా ఎవరూ లేరు.. కనపడిన చోటల్లా వెతికాను..తెలిసిన వాళ్లందర్నీ అడిగాను.. ఉహు.. ఏమయ్యాడో సారు..

ఒకరోజు తెలిసినోడొకడు అవుపడి..గుంటూర్లో కొత్తపేటలో పలానా ఆస్పత్రిలో మల్లేశ్వర్రావు సారుని చూసానని..ఆయనికి ఒంటో బాగాపోతే ఆయన బంధువులెవరో ఆస్పత్రిలో చేర్చారని చెప్పాడు.

ఇన్నాళ్లు మనకి తిండి పెట్టి ఆదరించినవాడు ఇప్పుడా పరిస్థితిలో వుంటే చూసి రావాలని గుండె కొట్టుకులాడింది.

ఎనకాముందు చూడకుండా గుంటూరు బయల్దేరా..

ఆస్పత్రిలో విచారిస్తే..ఇంతకు ముందురోజే ఎళ్లిపోయారంట.. ప్రాణం ఉస్సూరుమనుకుంటా… కాళ్లీడ్చుకుంటా బయటకొచ్చా..

బస్టాండుకొత్తే ఆ రేత్రి ఒక్క బస్సు లేదు.ఏందా అంటే అదేందో కరోనా అంట..భయంకరమైన అంటుజబ్బంట.. ప్రపంచమంతా దేశదేశాలు అంటుకుంటుందంట..దాని బారిన పడి మడుసులు పిట్టలు రాలినట్టు రాలిపోతున్నారంట.. అందుకే ఎవరూ బయటకి రాకూడదని ఇండియా అంతా ఉన్నట్టుండి బందుపెట్టిందట గవర్నమెంటు..రైళ్లు లేవు… విమానాల్లేవు..లారీల్లేవు..పనుల్లేవు..ఏవీ లేవు.. ఎక్కడుండేవాళ్లు అక్కడ్నే..ఇళ్లల్లో వుండిపోవాలంట.. బయట తిరక్కూడదంట..మరి నా బోటోళ్లు..?గుండె గతుక్కుమంది..భలే ఇరక్కపోయానే…అయ్యా..ఎటూ కదల్తానికి లేదే..

వాళ్లూ..వీళ్లూ ఉదారంగా తెచ్చిచ్చేయి తింటా ఆడే బస్టాండు కాడే చానా రోజులు గడిపా..బయట పోలీసు వ్యాన్లు.. సైరన్లు.. మైకుల్లో హెచ్చరికలు..రోడ్లుకి యాడికాడ అడ్లుపెట్టి పోలీసులు ఎవర్నీ యాడకి పోనీయడంలా .. రోడ్లు.. బజార్లన్నీ ఖాళీఖాళీగా అయిపోయి.. ఎక్కడికక్కడ అంతా ఆగిపోయి..లోకం వింతగా ఎప్పడూ చూడనంత ఇచిత్రంగా వుంది.

ఎన్నిరోజులు గడిచినియ్యో అజ లేదు..మళ్లా బందు..లాక్ డౌన్ పొడిగించారంట..రోడ్ల మీద అన్నం అందించేవాళ్లు తగ్గారు..అందుకునేవాళ్లు పెరిగారు.. అందరిదీ ఒకటే కత..ఆకలి..నీళ్లు..భయం.. రోగం అంటుకుంటదేమోనని అనుమానం..

కూలీలు..అడుక్కునేవాళ్లు..నాలాగ ఎరక్కపోయి..దిక్కుతోచక ఇరుక్కుపోయినవాళ్లు.. ఆళ్లూ..ఈళ్లూ..రకరకలవాళ్లు..రకరకాల కతలు.. పలకరించే వాళ్లు లేరు..పరిచయం వున్నవాళ్లు లేరు..రోగమొస్తే ఇక దిక్కూమొక్కూ లేదు..మెల్లగా కూలి జనానికి ఇళ్ల మీద గాలి తిరగతా వుంది.

తెచ్చుకున్న డబ్బులయిపోయినియి..గుడ్డలు మాసిపోయినియి..కరోనా పుకార్లు వింటే గుండెలవిసిపోతన్నియి..ఆకలికి పేగులు మలమల మాడిపోతా వున్నయ్యి..రేత్రిళ్లు నిద్రపట్టక కళ్లు మండతా వున్నయ్యి..ఏందో తెలీని భయంతో ప్రాణాలు గుంజకపోతావున్నయ్యి..ఊరి మీద మనేది ఊపిరి తీసుకోనియ్యడంలా..ఒక చోట కాలు నిలవనియ్యడంలా…

మూడ్రోజుల నుంచి సావాసంగా వున్న విజయనగరం కూలీలు ఇంక బయల్దేరతన్నట్టు బట్టలన్నీ సర్దుతా వున్నారు.ఒక్కొకళ్లే అట్టా బయల్దేరి ఎళ్లిపోతావుంటే.. గుండెల్లో ఏదో సన్నని నరం తెగినట్టు చెప్పలేని బాధ..వీళ్లంతా ఇళ్లకు చేరతారా..? ఏ అడ్డంకులు లేకుండా అయినవాళ్లని కలుసుకుంటారా..?

నాకింక ఈడ ఉండ బుద్ధి గావడం లేదు..ఎళ్లినోళ్లు ఇళ్లు చేరుంటారు..పస్తుండినా..ఎండకు ఎండినా అయినోళ్లు తోడుంటారు..ఆ భరోసా వేరు..ఈడ ఏది జరిగినా ఎవ్వరూ రారు..అన్నీ వున్న అనాథలం..

ఫ్రెండ్సు కళ్లల్లో మెదులుతున్నారు..చీరాల చేతులు చాచి రారమ్మని నిద్దట్లో పిలుస్తా వుంది..ఎంత వుందామన్నా వుండ బుద్ధి గావడం లేదు..మనసు నిలవడం లేదు..అందరూ నడిచి ఎళ్లిపోతన్నారు..వందలు..వేల మైళ్లు.. చీరాల ఎంత దూరం.. డెబ్బై కిలోమీటర్లు వుంటదా.. పొద్దున బయల్దేరినామంటే మజ్జేనానికి చేరుకోవచ్చు.. పోదామా..పోదామా..పోదామా..పోదాం. పోవాల..చీరాల దారి తీయాల..

సెల్ లో మాట్టడతా బార్లో ఒకడు చెప్పాడు..రోడ్ల మీదయితే పోలీసులుంటారు..రైలుకట్ట ఎంబడి పడి వస్తే తేలిగ్గా వచ్చేయొచ్చని..అవునుకదా..ఇదేదో బానే వుంది..

పొద్దున్నే ఎట్టోకట్ట రైలుకట్ట చేరుకున్నా..తెలీని ఉత్సహమూ..ఏదో భయమూ కలగలిపి గుండెల ఎగదోస్తుంటే చీరాల వేపు నడుస్తున్నా..నడుస్తున్నా.. నడుస్తున్నా..తడబడతా దడదడా నడుస్తున్నా…

ఎండ పైకెక్కింది..చుర్రుమంటంది..లోపల చెమటలు కారతా వున్నయ్యి..దాహమవుతా వుంది..నీళ్లేడా దరిదాపుల్లో లేవు..గొంతెండిపోతా వుంది.. నడూ..నడూ..ఏదొక స్టేషనొచ్చేదాక నడూ…నడూ..

ఏదో రోడ్డొచ్చింది..గేటు పడుంది.దూరంగా నీళ్లపంపు అవుపడతా వుంది.అబ్బ..ప్రాణం లేచొచ్చింది..గబగబా వెళ్లా..పంపు కొట్టబోతున్నానో లేదో..డుగుడుగుమని మోటర్ సైకిల్ మీద ఇద్దరు పోలీసులొచ్చారు..

ఎవ్వరు నువ్వన్నారు..

ఎక్కడి కెళ్తన్నావన్నారు..

చెప్పబోతున్నా..ఫట్ మని వీపు మీద లాఠీ దెబ్బ..

దెబ్బకి కళ్లు బైర్లు కమ్మినాయ్..

ఎంత చెబుతున్నా వినరేంట్రా నా కొడకల్లారా..మీవల్ల కదూ…పోలీసుల అరుపులు..బూతులు..

మళ్లీ దెబ్బ..

భుజం విరిగినంత నొప్పి..

భుజం పట్టుకొని అబ్బా అని గావుకేక పెట్టా..

మళ్లీ దెబ్బ..మళ్లీ దెబ్బ..

కళ్లు తిరిగిపోయినియి..ఒళ్లు సోదీనం తప్పింది..

నాకేమయిందో తెలీదు..

కళ్లు తెరిచేసరికి ఏదో ఆస్పత్రి వరండాలో ఎముకల కుప్పలా పడున్నా..

చెయ్యంతా కట్టుకట్టి వుంది.. కదలనిస్తలేదు..నెప్పి..సలుపుతా వుంది..

ఆడెవడూ నన్ను కనీసం కన్నెత్తి కూడా చూట్టంలా..

ఆడ నేను లేనట్టే అటూఇటూ తిరుగుతున్నారు..

నెప్పి ఎక్కువయింది…ఒకటే నరాల సలుపుడు బాద..

భుజం లోంచి గుండెలకి దిగుతూ బాద..

సయించలేని సలుపుడు..

లేచి కూచోబోయా..వల్లకాలా..

నొప్పి లావాలా ఎగజిమ్మింది..భుజం విరిగిందా..

కళ్లల్లో నీళ్లు సుడులు తిరిగినియి..

ఎందుకో నా కన్నీళ్ళలోకి నా అయినోళ్లనుకునేవోళ్లు..

మల్లేశ్వర్రావు సారొచ్చారు..

తులశమ్మ మామ్మ వచ్చింది..

ఎంకటాం పిన్నాం వచ్చింది..

కనకయ్య వొచ్చాడు..

బార్లో స్నేహితులొచ్చారు..

ఈ కరోనా కల్లోల కలవరంలో..కట్టడిలో..

కూసాలు కదిలి..బతుకు నిట్టాడులిరిగి..

చిలపెంకుల్లాగ ఎవరెవరు ఎటు చెదిరిపోయారో..

కడుపాత్రంలో ఎవరికెవరు మిగిలేరో…

పిల్లా..జెల్లా..కొడుకూ కూతురూ..

అందర్నీ కూడదీసుకున్నారో లేదో..

అందరూ కళ్లల్లోనే కలదిరుగుతున్నారు..

దిక్కులు తెలీనట్టు..

రెక్కలు కొట్టుకుంటూ..

**           **

 

 

శ్రీనివాస్ గౌడ్

ఇప్పటివరకు సంపాదించినవి 5 కవిత్వ పుస్తకాలు..కొంతమంది మిత్రుల ప్రేమపూర్వక ప్రశంశలు..నిర్మాణాత్మక విమర్శలు- వృత్తి.. నిర్మాణ రంగం
ప్రవృత్తి..సాహిత్య నిర్మాణ రంగం--అనేకానేక సంక్షోభ సమయాలలో సాహిత్యం ఊతమిచ్చింది.

సాహిత్యం మనిషిలోని మాలిన్యాలను కడిగేస్తుందని నా నమ్మిక.

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కష్ట జీవుల కడగండ్లను సమకాలీనతతో కధగా మలచిన తీరు చాలా బాగుంది. కధలోని పాత్రలన్నీ మన చుట్టూ ఉన్నవి, ఏ ప్రభుత్వాలూ వాటి పాలసీల వలన పేదలకు మేలు జరగాలనో వాటివల్లనే వారి మనుగడ ప్రశ్నార్థకమౌతోన్న తీరును హృద్యంగా వివరించారు. ఇలా వారి తీవ్రమైన సమస్యలను గురించి అందరికీ తెలియజేయాల్సిన బాధ్యతను రచనగా తీసుకున్నందుకు శ్రీనివాస్ గౌడ్ గారికి, ప్రచురించిన సారంగకు అభినందనలు.

  • దిక్కు తెలీని పక్షులు కథానికలో ఆయా పాత్రల చిత్రీకరణ వాస్తవికతకు దర్పణం పడుతున్నాయి. కులవృత్తుల్లో సాధకబాధకాలను విస్పష్టంగా… హృదయాన్ని తాకేలా అక్షరీకరణ చేసిన రచయిత శ్రీనివాస్ గౌడ్ అభినందనీయులు. సామాజిక ఇతివృత్తాల్లో సమకాలీనతను జోడించి వర్ణించిన తీరు బాగుంది. బంధాలను, అనుబంధాలను సృశిస్తూ కథనం ఆసక్తికరంగా సాగింది. ప్రచురించిన సారంగకు, రచయిత, కవి శ్రీనివాస్ గౌడ్ కు ధన్యవాదాలు.
    -అవ్వారు శ్రీనివాస్, జర్నలిస్టు, మంగళగిరి

  • కథ బాగా రాశారు శ్రీనివాస్ గౌడ్ గారు. నిరుపేదల జీవితాల గురించి, వారి కష్టాల గురించి మీరు రాసిన తీరు అభినందనీయం. సారంగకు ధన్యవాదాలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు