నేనింకా తొంభై నాలుగులోనే ఉన్నా
ఇక్కడ్నుంచి శతకం చేరుకోవడం
మరీ మెల్లగా ఉంటుందని
మా తెలివైన పిల్లలకు
ఏమాత్రం అర్థం కాదు!
నా పుట్టినరోజు
సంబరాల్లో పాల్గొనాలని
ఎన్నారై మునిమనవలూ
మనవరాండ్లూ
ఐదారు నెలలకు ముందే
ప్లాన్ చేసుకోవాలని
తొందరపెడితే నేనెట్టా సచ్చేది!
ఏ రోజుకారోజునీడుస్తూ
వీలుచూసుకొని
ఎప్పుడో ఒకప్పుడు
తప్పకుండా వస్తానని
దేశాంతరాలెళ్లిన
పెద్దకొడుకిచ్చిన
మాట ఎండమావిలో
చెలమను తవ్వుకుంటూ
నిమిష నిమిషాన్నీ
నెట్టుకొస్తున్నా!
గొంతారిపోతోంది
ఈ దాహం తీరుస్తానని
మీరెవ్వరైనా హామీఇస్తే
తొంభైఐదేంటి
నూటొక్క పుట్టినరోజుకీ
ఇప్పుడే బుక్ చేసుకోండి!
—
Add comment