కిటికీ మీద
ఎగిరిపోయిన పిట్టల ఆనవాలు
గాలికి ఊగుతున్న పూలకొమ్మ మీద
తప్పిపోయిన పరిమళాల తడి
చూసే ప్రతి దృశ్యంలో
వెంటాడే నిన్నల నీడలు
ఇంద్రధనుస్సు ఇంకిపోయాక
మిగిలిన ఖాళీ ఆకాశం
ఒక వేదన
ఎవరో ఒకరు
నీలోంచి ఎగిరిపోయాక గానీ తెలీదు
నువ్వు శూన్యానివని
వెళ్ళిన వాళ్ళు
వాళ్ళ మానాన వాళ్ళు వెళ్లిపోకుండా
నీలో ఒక కన్నీటిదీపాన్ని వెలిగించి
వెళ్ళిపోతారు
నీ వాళ్ళెవరో మొదలుపెట్టి
అద్భుతంగా కొన్ని పాదాలు పూర్తిచేసి
మధ్యలో వదిలేసిన
దీర్ఘకవితకు
నువ్వు కొనసాగింపువవుతావు
ఉదయాలు కన్నెత్తి చూడవు
మధ్యాహ్నపు ఎండ
పొదల్లో దాక్కున్న పులిలా
మీద పడుతుంది
సాయంత్రాలు
కాళ్ళీడ్చుకుంటూ అడుగులేస్తాయి
అరచేతుల నిండా అల్లుకున్న చీకటి
గుప్పిట బిగుసుకున్నాక
చప్పుడు చేయకుండా జారిపోతుంది
పిడికిళ్ళు
నక్షత్రాలను కనే నెబ్యులాలు
పాటలు పాడి
నిన్ను నిద్రపుచ్చే ఏ పిట్టకు
ఏ శిక్షణా లేదు
పాట
తనలోంచి పుడుతుందంతే
శూన్యం పూర్ణమయ్యే దారిలో
నీకు నువ్వు ఎదురవుతావు
నీ వెనుక వాళ్ళ సంగతి సరే
ఎవరో ఒకరు
నీ ముందు నడుస్తుంటారు
అది కూడా నువ్వే!
*
నిజమే. మనలోంచి ఎవరో ఒకరు ఎగిరిపోయాకగానీ తెలియదు, మనం శూన్యమని.
‘‘మధ్యాహ్నపు ఎండ
పొదల్లో దాక్కున్న పులిలా
మీద పడుతుంది
సాయంత్రాలు
కాళ్ళీడ్చుకుంటూ అడుగులేస్తాయి’’
ప్రతిభావంతమైన అభివ్యక్తులతో ‘‘దారిలో’’ ఎదురైన మంచి కవిత.
సాంబమూర్తి గారికి అభినందనలు.
చాలా ధన్యవాదాలు సర్.